కడవ

చాలా దూరం నడిచి వెళ్ళాక గాని తెలియలేదు
నన్ను తప్ప అన్నిటినీ మోసుకెళ్తున్నానని

చాలా చాలా దాహంగా వుంది
పుట్టి పెరిగిన వూరి పక్క వాగు నీళ్ళలా
ఏవో గలగలలు వినిపిస్తున్నాయి
ఇక్కడెక్కడో ఒక వాగు వున్నట్టుంది,
నాకు వెళ్ళాలని లేదు

ఎండా కాలం మా మద్దులేటి వాగు పక్కన
చిన్ని చేతులతో ఇసుక తవ్వి
తీసిన చెలిమ లోంచి కడవ లోనికి
లోటా లోటా తోడుకున్న చల్లని నీళ్ళలో
ఒకే ఒక్క లోటా చాలు
మరి అరవయ్యేళ్ళు బతికేస్తాను జీవనదినై

ఇంకేముంటాయి
ఇప్పుడు చెప్పుకోడానికి
ఇక్కడివి ఇప్పటివి
మరెవరో చెబుతారు
బహుశా ఇంతకన్న ఎక్కువ ఆర్తితో

నీళ్ళు ఎక్కడైనా నీళ్ళే గాని
మా వాగులో నా చిన్న కడవ వుండిపోయింది
అందులో నేను వుండిపోయాను