రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా

[‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘అపు సంసార్’ పేర్లతో అదే వరసలో బెంగాలీలో ‘అపు చిత్రత్రయం’ గా తీసిన సత్యజిత్ రాయ్ సినిమాలలో మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ ని ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఈ మూడు సినిమాలకి మూలం, బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల.]

మొట్టమొదటి సినిమాతోనే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న “పథేర్ పాంచాలి” సినిమాతో, దర్శకుడిగా సినిమారంగేట్రం చేసాడు రాయ్. 1955 సంవత్సరంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిర్మాతగా నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా కొచ్చిన ప్రశంసల జాబితా వల్ల, మొదటి సినిమాతోనే ప్రపంచంలో సంచలనం రేపిన అరుదైన దర్శకుల జాబితాలో రాయ్ పేరు చోటు చేసుకుంది.

ఏమిటి ఈ సినిమా గొప్పతనం?

రెండు మాటల్లో చెప్పాలంటే, “కళా ప్రదర్శన”. అంటే, సినిమా అన్న మాధ్యమం ఉపయోగిస్తూ అత్యంత కళాత్మకంగా తీసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమాని పేర్కొనవచ్చు. అప్పటి వరకు, భారతీయ గ్రామీణ జీవితాన్ని కాని, లేదా పట్టణ జీవితాన్ని కాని సంగ్రహంగా చూపించే సినిమాలు బహుశా రాలేదని అనుకోవాలి! అసలు ఈ సినిమా కథను ఎంచుకోటంలోనే రాయ్ గొప్పతనం కనపడుతుంది. ఈ సినిమా కథను, ఒక కథగా చూస్తే, అతి చప్పగా, అద్భుతంగా ఉండే ఎటువంటి సంఘటనా లేనటువంటి కథ ఇది. బిభూతిభూషన్ బందోపాధ్యయ్ రాసిన ఈ కథ (తరవాత ధారావాహికంగా) 1928 సంవత్సరంలో ఒక షరతు మీద సీరియల్‌గా ప్రచురించటానికి ఒప్పుకున్నారు. ఒక వేళ ఈ కథకు ప్రజాదరణ లేకపోతే, సీరియల్‌ని ఆపేయాలని ప్రచురణ కర్తల ఉద్దేశ్యం. ఈ కథ లోని అపు, దుర్గ అన్న చిన్న పిల్లల పాత్రలను అప్పటి బెంగాల్ పాఠకలోకం ఎంతగానో ఆదరించి, ఇచ్చిన అనూహ్యమైన స్పందనతో సీరియల్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోపే పుస్తకంగా అచ్చయింది. రచయిత రాసిన ఏభై పుస్తకాల్లో, పథేర్ పాంచాలికి అతి గొప్ప పేరు వచ్చింది.

వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది. ఈ సినిమాలో ఉన్న నిరాడంబరత్వం, అంకితాభావంతో చేపట్టిన నిర్మాణం వల్ల ఇది గొప్ప సినిమా. ఈ సినిమాని ఒక దృశ్యకావ్యంలా తీసాడు రాయ్. పద్ధెనిమిది సంవత్సరాలు రాయ్ తో పని చేసిన అనీల్ చౌదరి పథేర్ పాంచాలి సినిమా పై తన పరిశీలనని ఇలా చెప్పాడు. “ఈ సినిమా కోసం మేం అంతా చిత్తశుద్ధిగా పని చేసాం. రాయ్ పర్యవేక్షణలో మా అందరి శక్తులు కలిసి ఒకే శక్తిగా లీనం అయ్యాయి.”

బెంగాలీ నవలకు తెలుగు అనువాదం – మద్దిపట్ల సూరి

1928-29 సంవత్సరాల్లో బెంగాలీ పత్రిక “విచిత్ర” లో సీరియల్‌గా వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల “పథేర్ పాంచాలి” ను మద్దిపట్ల సూరి దాదాపు నలభై ఏళ్ళ క్రితం తెలుగులోకి అనువదించారు. ఈ తెలుగు అనువాదం పుస్తకం చాలాకాలం తరవాత ఈ మధ్యే ప్రచురణకు మళ్ళీ నోచుకుంది. ఇందులో ముందుమాటలో ఉన్న కొన్ని విషయాలు, సత్యజిత్ రాయ్ స్వయంగా రాసిన “మన సినిమాలు, వాళ్ళ సినిమాలు” అన్న పుస్తకంలోని మరికొన్ని విషయాలు కలగలిపి, ఇక్కడ పొందు పరుస్తున్నాను.


దుర్గ, తల్లితండ్రులు

బెంగాల్‌లో ఒక పల్లెటూళ్ళో నివసిస్తున్న ఒక మధ్య తరగతి కుటుంబంలోని దంపతులు (సర్బజయ, హరిహర రాయ్) వాళ్ళ పిల్లలు అక్క దుర్గ, చిన్న తమ్ముడు అపు ల జీవిత కథే “పథేర్ పాంచాలి”. పూజారి వృత్తిగా బతుకుతున్న హరిహర రాయ్ దూరపు బంధువు, వరసకు అక్కగారైన ముసలి విధవ ఇందిర్ ఠాకూర్న్ కూడా ఈ కుటుంబం తోనే కలిసి ఉంటుంది. మొత్తం కథ అంతా ఈ పాత్రల జీవితాల్లో రోజులు గడపటంలో వచ్చే సవాళ్ళు చుట్టూ తిరుగుతుంది. కథ మొదలైన కొద్ది కాలానికే ముసలి పాత్ర “ఇందిర్ ఠాకూర్న్” చనిపోటం, మరి కొద్ది కాలానికే యుక్త వయస్సులో ఉన్న దుర్గ చనిపోటం, వాళ్ళు ఉంటున్న ఇల్లు పాడుపట్టంతో, చేసేది లేక హరిహర్ పెళ్ళాన్ని, కొడుకు అపుని తీసుకొని బ్రతుకు తెరువు కోసం బెనారస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఎదురయ్యే జీవితాన్ని సత్యజిత్ రాయ్, “అపరాజితో” అన్న సినిమాలో చూపిస్తాడు.

1940 దశాబ్దంలో శాంతినికేతన్‌లో లలిత కళలు, గ్రాఫిక్ డిజైనింగ్ అభ్యసించి బయటకు వచ్చిన రాయ్ ని సినిమాలు ఎంతో ఆకర్షించాయి. కానీ, భారతీయ సినిమాల్లో ఎంతసేపూ తీపి వలపుల ప్రేమ పాటలు, మార్మిక పురాణగాథలు రాజ్యమేలటం రాయ్‌ను చికాకు పెట్టాయి. “సినిమాకు జీవితమే ముడిసరుకు కావాలి. సినిమా వంటి జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలల్లో ఉండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన మన దేశం, చిత్ర దర్శకుల్ని కదిలించలేకపోటం విడ్డూరం. వాళ్ళు తమ కళ్ళూ, చెవులూ తెరుచుకుంటే చాలు!” ఈ వేదనే సత్యజిత్ రాయ్ ను సినిమాల వైపు ధృఢ సంకల్పంతో నడిపించింది.

చక్కని గ్రామీణ జీవితపు అనుభవాలతో అలరారే బిభూతి భూషణుడి రచనలను చదవటమంటే ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అతి సన్నిహితంగా దర్శించడమే! వీటిలో మనకు తారస పడే పిల్లలూ, పెద్దలూ, వాళ్ళ జీవితాలూ, తత్వాలూ సజీవమైనవి. అతి వాస్తవికంగా కపడుతుండే ఈ జీవితాల్లోనే ఊహాతీతమైనవేవో విస్మయాలు, విభ్రమాలు మనల్ని కట్టిపడేస్తుంటాయ్. పథేర్ పాంచాలిలో కథ చాలా స్వల్పం. నిశ్చిందపురం అన్న కుగ్రామంలో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణుడి కుటుంబం, ఇల్లు, పిల్లలు, జీవిక కోసం వాళ్ళు చేసే పనులు, వారి దైనందిన అనుభవాలు … అంతే! ఈ చిన్న కథాంశాన్నే బిభూతి భూషణుడు ఇద్దరు పిల్లల కళ్ళతో, వారి పసి మనసుల్లోంచి పొరలు పొరలుగా దర్శింపజేస్తూ మనల్ని ఒక జీవిత కాలపు అనుభూతికి లోను చేస్తాడు. నిశ్చిందపురంలోని చెట్లూ, చేమలూ, తోటలూ, కాయలూ, పళ్ళూ ఎంత వాస్తవమైనవో “దుర్గ”, “అపు” కూడా మన కళ్ళ ముందు అంతే వాస్తవంగా తిరుగుతుంటారు. తమ చిన్న ప్రపంచాన్ని క్షణం తీరిక లేకుండా బాల్య సహజమైన కుతూహలంతో సాహసోపేతంగా కూడా శోధిస్తుంటారు. వాళ్ళ అపురూపమైన ఆశలు, చిన్న చిన్న కోర్కెలు, ఎవేవో గుసగుసల రహస్యాలు, కవ్వింపులు, కుళ్ళుమోత్తనాలు … మనం ముచ్చట పడకుండా ఉండలేం! నిస్సహాయంగా వాళ్ళ స్నేహితులం అయిపోతాం. వాళ్ళే లోకంగా, వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళతోనే తిరుగుతాం. అందుకే దుర్గ మరణాన్ని మనం తట్టుకోలేం. కానీ ఆ విషాదాన్ని ఆ కుటుంబం తట్టుకుంటుంది. ఆ ఒక్క విషాదాన్నే కాదు, ఎన్నో విషాదాల్ని, పేదరికాన్ని, ఈసడింపుల్ని, ఈర్ష్యా అసూయల్ని, ఎన్నో బెంగల్ని, జీవనమరణాల్ని నిభాయించుకుంటుంది. జీవిత పథం ఆశావహంగా, మరింత ముందుకే సాగుతుంటుంది.

అక్క దుర్గ – చిన్న తమ్ముడు అపు

ఈ ఇద్దరు పిల్లల పాత్రలు ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలు. పట్నంలో పెరిగినవారైనా లేక పల్లెటూళ్ళో పెరిగినవారైనా, ఈ సినిమా చూస్తున్నంత సేపు, ప్రేక్షకులకి, వారి బాల్యపు అనుభూతులు తప్పకుండా గుర్తొస్తాయి. అక్క, తమ్ముడు ఒకరిపై ఒకరు చూపుకొనే ప్రేమ, అంతలోనే ఒకరినొకరు కవ్వించుకుంటూ చూపుకొనే కోపతాపాలు, ఊళ్ళోకి వచ్చిన నాటకం చూట్టం, తరవాత ఆ నాటకంలోని పాత్రలను అనుకరిస్తూ అపు చేసుకొనే వేషధారణ – ఇలా ఎన్నో విషయాలు ప్రతి వ్యక్తిలోని బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి.

భారతీయ గ్రామీణ జీవితాన్ని ప్రపంచానికి మొదటసారిగా చూపించిన సినిమా బహుశా “పథేర్ పాంచాలి” అనుకుంటా! విచిత్రమైన విషయం ఏమిటంటే, రాయ్ పుట్టింది, పెరిగింది కలకత్తాలో. అందువల్ల, రాయ్‌కి, “పథేర్ పాంచాలి” సినిమాకి ముందు, పల్లెటూర్లతో పరిచయం తక్కువ. అయినప్పటికీ, పల్లెటూరి వాతావరణం సృష్టించడంలో అమోఘమైన విజయాన్ని రాయ్ ఈ సినిమాలో సాధించాడు. అంటే, పల్లెటూరి జీవితం ఎప్పుడూ అనుభవించని రాయ్ ఇంత బాగా గ్రామీణ జీవితాన్ని చూపగలిగాడు అంటే, ఈ విషయంలో ఎంత పరిశోధన చేసాడో మనం ఊహించొచ్చు!


సర్బజయ, దుర్గ, అపు

పథేర్ పాంచాలి సినిమాలో “అక్క-తమ్ముళ్ళ ప్రేమ” అంటే ఇలా ఉండాలి అనిపించేట్టు ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలిద్దరు కొట్టుకున్నా (అది సహజమే కదా), మొత్తం మీద అక్కగా దుర్గ తన తమ్ముడుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాగే అపుకి కూడా అక్క అంటే ఎంతో ప్రేమ. దుర్గ తన స్నేహితురాలి నెక్లెస్ పై మోజు పడి అది దొంగిలిస్తుంది. ఈ విషయమై ఆ స్నేహితురాలి తల్లి, దుర్గ తల్లితో దెబ్బలాడటానికి వస్తుంది. దుర్గ మాత్రం తాను ఆ నెక్లెస్ దొంగిలించలేదని బుకాయిస్తుంది. ఇదంతా అపు చూస్తాడు. నిజంగానే తన అక్క దొంగతనం చెయ్యలేదనే అపు కూడా అనుకుంటాడు. దుర్గ చనిపొయిన తరవాత, హరిహరన్ కుటుంబం అంతా ఆ పల్లెటూరు వదలి బెనారస్‌కి వెళ్ళిపోతూ సామానులు సర్దుకుంటారు. అప్పుడు పై అరలో ఏదో వెదుకుతూ ఉంటే, కిటికీలో ఉన్న ఒక కొబ్బరిచిప్ప కిందపడి ఆ నెక్లెస్ అపు కంట పడుతుంది. ఎవ్వరూ చూడకుండా ఆ నెక్లెస్ తీసుకొని, తన అక్క ఎప్పటికీ దొంగగా ముద్ర పడకూడదని, ఊరి చెరువులోకి విసిరేస్తాడు.


అపు

తన జీవితమంతా అక్క ద్వారానే ప్రపంచం చూస్తాడు అపు. అక్క చనిపోయిన తరవాత ఒంటరిగా ఉన్న అపుని రెండు, మూడు సార్లు చూపిస్తాడు రాయ్. డైలాగులు ఏమి లేని ఈ సీన్లలో దిగులుగా, జాలిగా కనిపించే అపు మొహం చూస్తే ఎవరికైనా అపు మీద జాలి కలగకుండా ఉండదు.

వినతగునా ఎవ్వరు చెప్పిన?

పథేర్ పాంచాలి సినిమా తీస్తున్నప్పుడు జరిగిన కొన్ని అనుభవాలను రాయ్ ఇలా వివరించాడు. “సినిమా తీసే దర్శకులు ఎందుకు సినిమా తీయటంలో ఉండే సాధక బాధకాలు గురించి ఎక్కువగా రాయరు? సినిమా తీస్తున్నప్పుడు ఒక్క రోజులో జరిగే పని రాయాలన్నా కూడా కష్టమే! ఈ సినిమా తీసే ప్రక్రియ అతి సంక్లిష్టమైనది. సినిమా తీసేవాడికి, తీస్తున్న యంత్రాలు (అంటే కేమేరా), తీయబడుతున్న వస్తువులు (అంటే నటీనటులు, ప్రకృతి సంబంధమైన దృశ్యాలు) మధ్య ఉండే త్రికోణ సంబంధం అర్ధం చేసుకోటం కష్టం. ఎంతటి ప్రతిభాశాలి అయిన దర్శకుడైనా, అతని మసులో మెదిలే భావాలు స్పష్టంగా కాగితం మీద పెట్టటానికి భాష చాలదు. పథేర్ పంచాలి సినిమా తీస్తున్న మొదటి రోజే, కొన్ని పాఠాలు నేర్చుకున్నా. ఉదాహరణకి, దుర్గ తన తమ్ముడు అపుకి తెలియకుండా అపుని చూసే దృశ్యం తియ్యాలి. నేను మీడియం క్లోజప్ ఉండేట్లు ఒక మామూలు లెన్సు కెమేరాకు వాడదామనుకున్నా. ఈ దృశ్యంలో, దుర్గను నడుం నుంచి పైభాగం అంతా చూపిస్తూ తియ్యాలనుకొన్నా. ఆ రోజు షూటింగ్‌లో ఫొటోగ్రఫీ వృత్తిగా ఉన్న ఒక స్నేహితుడు షూటింగ్ లొకేషన్‌లో ఉన్నాడు. ఆ సీన్‌లో దుర్గ ఏం చెయ్యాలో నేను చెపుతున్నప్పుడు, ఆ స్నేహితుడు నా కెమేరాను సవరించడం చూసా. అతను నేను పెట్టిన మీడియం క్లోజప్ లెన్సు తీసేసి లాంగ్ క్లోజప్ లెన్సు పెట్టి, నన్ను కెమేరా నుంచి దుర్గను చూడమన్నాడు. నాకు అంతకు ముందు స్టిల్ కెమేరాతో చాలా అనుభవం ఉన్నా, ఎప్పుడూ లాంగ్ ఫోకల్ లెంగ్తు ఉన్న లెన్సుతో పని చెయ్యలా. నిజమే! ఈ లెన్సు వల్ల దుర్గ మొహం నిండుగా కనపడింది. మొత్తం మీద ఆ దృశ్యం అలాగే లాంగ్ క్లోజప్ లెన్సుతో పూర్తి చేసాం. దాంతో దుర్గ మొహం అంతా అతి స్పష్టంగా కనపడుతూ, సూర్య కిరణాలు మొహం పై పడటం వల్ల, వింత వెలుగులతో దుర్గ మొహం ప్రేక్షకులకు కనపడుతుంది. ఈ దృశ్యం చూసిన వాళ్ళెవరైనా, ఆ పనితనాన్ని మెచ్చుకు తీరాలి. ఈ సమయానుకూలమైన సలహాకి నా స్నేహితుడ్ని అభినందించి ఆ రోజు కార్యక్రమం పూర్తి చేసాం.

కొన్ని రోజుల తరవాత, ఫిలింని కత్తిరిస్తూ ఎడిట్ చెయ్యబోతూ, ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకు పోయా! ఆ చిన్న షాట్ బాగానే వచ్చింది కాని, మిగిలిన షాట్లతో సరిగ్గా ఇమడలా. కొట్టొచ్చినట్టు చాలా తేడాగా ఉంది. ఇది ఎందుకూ పనికి రాదు అన్న విషయం నాకు బోధపడింది.. దీన్నుంచి రెండు విషయాలు నేను నేర్చుకున్నా. మొదటిది – ఒక దృశ్యం, సందర్భానికి తగినట్టు ఎంత అందంగా ఉండాలో అంతే అందంగా తియ్యాలి. ఎక్కువా పనికి రాదు. తక్కువా పనికి రాదు. రెండవది – ఏ వ్యక్తి దగ్గర నుంచి అయినా సరే, తియ్యబోతున్న సినిమాపై సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప సలహా తీసుకోకు. దర్శకుడికి సినిమా తియ్యటంలోని అన్ని విషయాలపై ఉన్నంత లోతైన అవగాహన, మరొకరికి ఉండే అవకాశం తక్కువ.”

నటీనటులను వెతకటంలో రాయ్ కష్టాలు

పథేర్ పాంచాలి సినిమాలోని ముఖ్యపాత్రలైన “దుర్గ”, “అపు” లను వెతకటంలో రాయ్ కష్టాలు మరో దశకు చేరుకున్నాయి. (ఈ నవలని సినిమాగా తియ్యటానికి నిర్మాతలు దొరక్క పోటంతో రాయ్ కష్టాలు మొదలయ్యాయి.) ఈ చిన్న పిల్లల పాత్రలు వేసే వాళ్ళ కోసం కలకత్తా లోని స్కూళ్ళన్నీ వెదికారు. కానీ, “అపు” పాత్రధారి మాత్రం దొరకలా! దిన, వార పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలవల్ల కూడా ఫలితం లేక పోయింది. రాయ్ తన మనస్సులో “అపు” పాత్రధారి ఎలా ఉండాలని అనుకున్నాడో అటువంటి కుర్రాడు దొరకలా.


అపు

సరిగ్గా తన మనసులో ఉన్న విషయాన్ని రాయ్ తన భార్య “బిజయ” కు చెప్పాడు. అనుకోకుండా ఒక రోజు బిజయకు పక్కింటి డాబా మీద ఆడుకుంటున్న కుర్రాళ్ళు కనపడ్డారు. అక్కడ కనపడ్డాడు “సుబిర్ బెనర్జి” అన్న కుర్రాడు. చూడగానే అతనే అపు అని అనిపించింది. వెంటనే రాయ్‌ని పిలిచి, “నాకు అపు దొరికాడు” అని చెప్పింది. రాయ్ కలకత్తా అంతా “అపు” కోసం గాలిస్తుంటే, “అపు” పక్కింట్లో దొరకటం యాదృఛ్చికం. అప్పటికే “దుర్గ” పాత్రకు “ఉమా దాస్ గుప్తా” ని తీసుకోటం జరిగింది.

ఈ పిల్లల తల్లిగా ” కరుణా బెనర్జీ” ని అనుకున్నారు. కరుణకు కొంత నాటకానుభవం ఉంది. కానీ, నాటకాల్లో అంత రాణింపు లేదు కరుణకి. కరుణ నాటకాల్లో కన్నా, సినిమాల్లో బాగా రాణిస్తుందని గమనించినవాడు ముందుగా రాయ్. అప్పటికే, రాయ్‌కి రంగస్థలానికి సరిపోయే నటన, సినిమాలకి కావలసిన నటనలో ఉన్న తేడాలను స్పష్టంగా గమనించినవాడు. సినిమా అన్న మాధ్యమాన్ని ఇంత తొందరగా గుర్తించడంలో రాయ్ జీనియస్ స్పష్టంగా కనపడుతుంది. ఈ సినిమాలో చెప్పుకోతగ్గ మరో పాత్ర హరిహరన్ పాత్రకు దూరపు చుట్టమైన విధవ ముసలి అక్క “ఇందిర్”. రాయ్ ఊహల ప్రకారం ఈ పాత్రకి చిల్లర దొంగతనాలు చేసే స్వభావం ఉండాలి. మళ్ళీ, మేనత్త వరసైన ఈమె, “దుర్గ”, “అపు” లకి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా అయిఉండాలి. రాయ్ స్క్రీన్ ప్లే ప్రకారం పిల్లల తల్లి “సర్బోజయ” కి “ఇందిర్” కి ఎప్పుడూ పడదు. రాయ్ ముందు “ఇందిర్” పాత్రకు ఒక పల్లెటూరు ముసలి ఆమెను ఎన్నుకుందామనుకున్నాడు. చాలా మందే ఆ పాత్రకు సరిపోతారని తోచినా, వాళ్ళంతా కెమేరా ముందు నటించగలరా అన్న అనుమానం రాయ్‌కి వచ్చింది. పథేర్ పాంచాలి సినిమాకి అందరూ నటన వృత్తిగా లేనివారిని తీసుకోవాలని అనుకున్నా, “ఇందిర్” పాత్రకు నటనానుభవం ఉన్న వ్యక్తి ఎలా ఉంటుంది?


ఇందిర్, దుర్గ

రాయ్‌కి వచ్చిన ఈ ఆలోచనల ఫలితంగా ఎనభై ఏళ్ళ వయస్సున్న “చునిబాలా దేవి”ని తీసుకోటం జరిగింది. పాత్రకు తగ్గట్టు, జుట్టుని బాగా కత్తిరించుకొని, దాదాపు బోడిగుండు వేషంలో “ఇందిర్” పాత్రలో “చునిబాలా దేవి” జీవించింది.

హరిహరన్‌గా “కాను బెనర్జీ” అన్న రంగస్థల నటుడ్ని ఎన్నుకున్నాడు రాయ్. మొదటి రోజు షూటింగ్‌కి చక్కని క్రాఫుతో వచ్చిన “కాను”ని చూసి రాయ్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజుకి షూటింగ్ రద్దు చేసి, కాను జుట్టు తను ముందు చూసినప్పుడు ఎంత పొడవుందో అంత పెంచుకున్న తరవాతే షూటింగ్ మొదలని రాయ్ తీర్మానించాడు (ఈ సినిమాలోని పాత్రలన్నీ ఎటువంటి మేకప్ లేకుండా నటించారన్న విషయం, ఈ సినిమా పరిచయం ఉన్న వారికి తెలిసిందే కదా!). ముందు కొంచెం బాధ పడ్డా, కాను ఆ విషయాన్ని కలకత్తాలో తనకి తెలిసిన వారందరికి, “ఇన్నాళ్ళకి ఒక గొప్ప దర్శకుడ్ని చూసాను” అని చెప్పుకున్నాట్ట!

మరపురాని దృశ్యాలు

ఈ సినిమాలో మరపురాని దృశ్యాలున్నాయి. కొన్ని మచ్చుకి:

అది 1952 సంవత్సరం. గత రెండేళ్ళగా నిర్మాతల కోసం వెతికిన రాయ్ చివరకు కొంత సినిమా షూట్ చేసి ఇతరులకు చూపిస్తే తప్ప నిర్మాతలు దొరకరని, తన ఇన్స్యూరెన్సు కంపెనీ నుంచి కొంత డబ్బు అప్పుగా తెచ్చి మరి కొంత స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తెచ్చి సినిమా తియ్యటం మొదలు పెట్టాడు. మొదటి సీన్‌లో పిల్లలు దుర్గ, అపు తాము మొదటి సారిగా రైలు చూసే సంబరం చిత్రీకరించాలి. దుర్గ, అపు ఒకరినొకరు ఏదో విషయంలో దెబ్బలాడుకొని ఊరి చివరనున్న పొలాల కేసి పరిగెడుతూ తలవని తలంపుగా, దూరంగా రైలు వస్తున్న శబ్దం వింటారు. తరవాత, నల్లని పొగలు చిమ్ముతూ తమ వైపే వస్తున్న రైలుని చూస్తారు. ఈ రైలు ఘట్టాన్ని రాయ్ చాలా కళాత్మకంగా తీసాడు. అయితే, మొదటి రోజు షూటింగ్‌లో ఎనిమిది సీన్లు పూర్తి చేసుకొని ఆ రోజుకి షూటింగ్ పూర్తి చేసారు. పొలాల్లో షూటింగ్ పెట్టాటానికి కారణం, అక్కడున్న పొలాల్లో ప్రత్యేకంగా కనిపించే రెల్లుపూల గడ్డి (Kaash Flowers). వీచే గాలికి అవి కదులుతుంటే తీసిన దృశ్యం చాలా అందంగా ఉంటుంది (దాదాపు నాలుగు నిమషాలు ఉండే ఈ దృశ్యాన్ని వీడియోలో ఇక్కడ చూడచ్చు). రాయ్‌కి మాత్రం సంతృప్తి కలగలా. తరువాతి ఆదివారం మరికొన్ని సీన్లు తియ్యటానికి అదే లొకేషన్‌కి వెళ్ళారు. అన్నీ బాగున్నాయి కాని, రెల్లుపూలు మాత్రం మాయం. రెల్లుపూవు వర్షాకాలం తరవాత వచ్చే రుతువుకి సంబంధించిన పువ్వని తెలుసు కానీ మరీ రెండు, మూడు రోజుల్లో మాయమయ్యే పువ్వా అని ఆశ్చర్యపోయారు.

Train
రైలు రాక

అసలు జరిగింది ఏమిటో అక్కడి రైతులు చెప్పే వరకు రాయ్‌కి అతని బృందానికి తెలియలా. మొదటి రోజు షూటింగ్ అయిన తరవాత, పొలాల్లో మేస్తున్న పశువులు వచ్చి ఆ రెల్లు పువ్వుల్ని, పొదల్ని తిని పారేసాయి. అక్షరాలా రాయ్ ఊహించుకున్న సీనరీని పశువులు నమిలి పారేసాయి. ఇంకో చోట ఇదే సీన్ మళ్ళీ తీద్దామంటే, మంచి రెల్లు పువ్వులున్న పొలాలు దగ్గర్లో లేవు. రెండేళ్ళ తరవాత, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతగా మళ్ళీ అదే లొకేషన్‌లో, అదే నటీనటులు, సాంకేతిక వర్గంతో షూటింగ్ పూర్తి చేసారు.

అతి ఉత్సాహంతో ఈ సినిమాను చూసిన విమర్శకులు కూడా ఈ సినిమాలో కెమేరా పనితనం పూర్తిగా గమనించలేదు. అర్లీన్ క్రోస్ ఫిలం కల్చర్‌లో రాస్తూ – “రాయ్ కెమేరా ద్వారా చూపించిన భావ ప్రకటన అద్భుతమైనది. ఉదాహరణకు చనిపొబోతున్న దుర్గను సాకుతున్న తల్లి ఆ తుఫాను రాత్రి చీకట్లో చూపించిన దృశ్యాలు అతి తక్కువ లైటులో నెమ్మదిగా కదిలే కెమేరాతో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించాడు. అలాంటి దృశ్యాలు తీయటం సామాన్యమైన విషయం కాదు!”

మరొక దృశ్యం, వర్షం చిత్రీకరణ గురించి. భారత దేశంలో వర్షాకాలం గొప్ప అనుభూతుల్ని ఇవ్వగలదు. అప్పటిదాకా మాడ్చిన ఎండల తరవాత వచ్చే వర్షాలు అందరికీ ఉపశమనాన్ని ఇస్తాయి. రాయ్ ఈ సినిమాలో వర్షాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తాడు. నెమ్మదిగా గాలిలా మొదలై, ఆ గాలికి చెరువులోని అలలు నెమ్మదిగా కదలటం, చెరువులోని తామరాకులు గాలికి పైకి లేచి ఊగటం, ఆ తరవాత నెమ్మదిగా ఒక్కొక్క చినుకులా ప్రారంభమైన వర్షం, చెరువు గట్టున కూర్చున్న ఒక వ్యక్తి బట్టతలపై వర్షపు చినుకు పడటం, బోడిగుండును తడుముకొని వర్షం పడబోతోందని ఆ వ్యక్తి నిర్ధారించుకోటం, దట్టమైన నల్లని కారు మబ్బులు కమ్ముకోటం – ఇలా వర్షం వచ్చేముందు సూచనలన్నీ అద్భుతమైన దృశ్యంగా, ఎటువంటి వ్యక్తులు, సంభాషణల ప్రమేయం లేకుండా చిత్రీకరించాడు రాయ్. వర్షం పెద్దదిగా మారిన తరవాత నేల మీద పడ్డ చినుకులు అన్నీ కలిసి అది ఒక చిన్న ప్రవాహమై, రానురాను ఒక పెద్ద ప్రవాహంగా మారటం, అంత వర్షంలో పెద్ద పెద్ద చెట్లు గాలికి అటూ, ఇటూ ఊగటం – మనమే వర్షంలో ఉన్నామా అన్న భ్రాంతి కలుగుతుంది. ఇంత వర్షంలో దుర్గ పొందే పరవశత్వం చూసి తీరవలసిందే!

సంగీతం

తనకున్న బిజీ స్కెడ్యూలు వల్ల సంగీత దర్శకుడిగా పండిట్ రవిశంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని మొత్తం పదకొడు గంటల్లో పూర్తి చేసాడు. ఒక రోజు సాయంత్రం మెదలు పెట్టి, మరునాడు ఉదయం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు పూర్తి చేసాడు. అప్పటికి పూర్తి అయిన కాస్త సినిమాని చూసి రవిశంకర్ చాలా మెచ్చుకున్నాడుట. ఈ సినిమాలో రవిశంకర్ సితార్ పై రెండు ట్యూన్‌లు కట్టాడు. ఒకటి దేష్ రాగంలో. ఇది వర్షాన్ని చూపించే సందర్భంలో ఉపయోగించారు. రెండవది తోడి రాగంలో. తుఫాను రోజు రాత్రి దుర్గ చనిపోయిన విషాదంలో తోడిని ఉపయోగించారు.

పథేర్ పాంచాలి సినిమా మొదలవుతూ వేణువు మీద ఒక చిన్న సిగ్నేచర్ ట్యూన్‌లా సంగీతం వినపడుతుంది. సినిమా అంతా అప్పుడప్పుడు ఇలా ఈ ట్యూన్ వినపడుతూ ఉంటుంది. పైన ఉదహరించిన అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు బాక్ గ్రౌండులో వినపడే సంగీతం కూడా చూస్తున్న దృశ్యంతో కలిసిపోతుంది.

మానవతా దృక్పథం

ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ కటిక పేదరికం అనుభవిస్తూ ఉంటాయి. అంత పేదరికంలో కూడా జీవితంలోని చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఆనందం పడటం మనం చూస్తాం. నిజ జీవితంలో అటువంటి కుటుంబాలని ప్రత్యక్షంగా చూసినవారికి, జీవితంలో డబ్బు లేకపోయినా తీర్చుకో కలిగే సుఖాలున్నాయని తెలుస్తుంది. చిన్నతనంలో జామకాయలు దొంగతనం చెయ్యటం, కొంచెం పెద్దయ్యాక నెక్‌లెస్ దొంగిలించటం లాంటి పనులు దుర్గ చేసినా, అవి చిన్నప్పడు చేసిన చిలిపి పనుల కిందా లేకపోతే పేదరికం వల్ల ఏర్పడిన చర్యలగా భావించవచ్చు! ఈ విషయాలన్నిటివల్ల, పొరుగువాళ్ళతో సర్బజయ దెబ్బలాటలకి దిగిన సందర్భాలున్నాయి. కానీ, దుర్గ చనిపోయినపుడు (హరిహరన్ డబ్బుసంపాదనకై కొన్ని మాసాలు అప్పటికే ఇల్లు విడిచి ఉంటాడు), ఎవ్వరూ తోడులేని సర్బజయ, అపులకు ఆ పక్కవారే తోడవుతారు. కష్టాల్లో పేదవారికి, పేదవారే తోడు. నిస్సందేహంగా, పథేర్ పాంచాలి ఇలాంటి వివరాల వల్లే మానవతా దృక్పధం ఉన్న సినిమా అయ్యింది.

ప్రశంసలు

రాష్ట్రపతి బంగారు, వెండి పతకాలు, 1955. ఉత్తమ మానవతా డాక్యుమెంటరి, కాన్ 1956. ఉత్తమ డిప్లొమా, ఎడిన్‌బర్గ్ 1956. వాటికన్ ఎవార్డ్, రోమ్ 1956. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, శాన్‌ఫ్రాన్సిస్కో 1957. సెల్జ్‌నిక్ గోల్డెన్ లారెల్, బెర్లిన్ 1957. ఉత్తమ చిత్రం, వాంకోవర్ 1958. విమర్శకుల బహుమతి, శ్ట్రాట్‌ఫోర్డ్, కెనడా 1958. ఉత్తమ విదేశీ చిత్రం, న్యూయార్క్ 1959. ఉత్తమ విదేశీ చిత్రం, టోక్యో, 1966.


ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి.

  1. పథేర్ పాంచాలి సినిమా డీవీడీ. సత్యజిత్ రే బాక్స్ సెట్ నుంచి.
  2. The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
  3. “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
  4. Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
  5. “పథేర్ పంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం – మదిపట్ల సూరి, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, జులై 2008.
  6. ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్‌రే.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.