రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి

(ఈ వ్యాసంలో ఒక రాగం కాకుండా, మూడు రాగాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.ఈ మూడు రాగాలకి దగ్గర సంబంధం ఉంది. “ఈమాట” పాత సంచికల్లో వచ్చిన వ్యాసాల్లో, ఒక్కొక్క వ్యాసంలోనూ ఒక్కొక్క రాగం మాత్రమే పరిచయం చెయ్యటం జరిగింది. ఐతే, ఇక ముందు పరిచయం చెయ్యబోయే రాగాల్లో మరీ ఎక్కువ సినిమా పాటలు కనపడకపోవటం వల్ల, ఈ వ్యాసానికి చక్రవాకం, మలయమారుతం, కళావతి రాగాలను ఎన్నుకున్నాను. “ఈమాట” పాఠకులకు ఈ మూడు రాగాల మధ్యనున్న సంబంధ విశేషాలు, ఆసక్తి కరంగా ఉంటాయని తలుస్తాను.)

చక్రవాకం, మలయమారుతం, కళావతి రాగాల ఆధారంగా ఉన్న కొన్ని పాటలు

చక్రవాకం

1. ఏడు కొండలవాడ వెంకటా రమణా… (పెళ్ళిచేసి చూడు)
2. విధివంచితులై విభవము వీడి… (పాండవ వనవాసం)
3. చీకటిలో కారుచీకటిలో… (మనుషులు మారాలి)
4. రాధకు నీవేర ప్రాణం… (తులాభారం)
5. వీణలోనా తీగలోనా… (చక్రవాకం)
6. జగమే రామమయం… (కధానాయకి మొల్ల)
7. నీ కొండకు నీవే రప్పించుకో… (ఘంటసాల ప్రైవేట్‌ రికార్డ్‌)
8. పిబరే రామరసం… (బాలమురళి ప్రవేట్‌ రికార్డ్‌)
9. పిలిచే వారుంటే … (కల్యాణ మండపం)
10. స్వరములు ఏడైన… (రాగమాలికలోని ఒకచరణం)
11. పూఛొన కైసె మైనె రైన్‌బితాయె… (మేరీ సూరత్‌ తేరీ ఆంఖే)

మలయమారుతం

12. ఓ మలయ పవనమా… (మానవతి)
13. కొండగాలి తిరిగింది… (ఉయ్యాల జంపాల)
14. మనసా ఎటులోర్తునే… (త్యాగరాజ కృతి)
15. మేలుకో శ్రీరంగా… (విప్రనారాయణ రాగమాలికలోని ఒక చరణం)

కళావతి

16. కరుణామయా దేవా… (భక్త తుకారాం)
17. మా ఇలవేలుపు నీవేనయ్యా… (మా వదిన)
18. తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా… (బుద్ధిమంతుడు)
19. వెన్నెల రేయి ఎంతో చలీ చలీ… (ప్రేమించిచూడు)
20. వసంతగాలికి… (కర్ణ?)

రాగం “చక్రవాకం”, కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళకర్త. హిందూస్తానీ సంగీతంలో “చక్రవాకం”రాగానికి దగ్గర రాగం “అహిర్‌ భైరవి”. కరుణ, భక్తి రసాలను ఈ రాగాలు బాగా పోషిస్తాయి. ముఖ్యంగా, పైన చెప్పిన సినిమా పాటలు పరిచయం ఉన్న వారికి ఈ విషయం అనుభవమే! “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల స్వర స్థానాల గురించి, “మలయ మారుతం”, “కళావతి” రాగాల స్వరస్థానాలు చర్చించినపుడు తెలుసుకుందాం!

“మలయ మారుతం” కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళ కర్త అయిన “చక్రవాకం” రాగం యొక్క జన్యం. హిందుస్తానీ పద్ధతిలో “మలయ మారుతం” అన్న పేరుగల రాగం కానీ, “మలయ మారుతం” రాగాన్ని పోలిన రాగం కానీ లేవు. ఐతే, ముఖ్యంగా వాయిద్యకారులు గత 50, 60 సంవత్సరాలుగా, “మలయ మారుతం” రాగాన్ని యధాతధంగా హిందూస్తానీ పద్ధతిలోకి ప్రవేశపెట్టారు. “మలయ మారుతం” ఉదయాన్నే పాడుకొనే ఆహ్లాదకరమైన రాగం. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని “మనసా ఎటులోర్తునే..” అన్న చాలా ప్రసిద్ధ త్యాగరాజ కృతి, స్వరపరచబడింది “మలయ మారుతం” రాగంలోనే!కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించే “మలయ మారుతం” రాగం మనో ధర్మ సంగీత అంశాలైన రాగాలాపన, స్వరకల్పన లకు ప్రసిద్ధమైంది.

“కళావతి” రాగం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించింది. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కళావతి” అన్న రాగం ఉన్నా, ఈ రెంటికీ పోలికలు లేవు. పైన చెప్పుకున్న 16వ మేళకర్త “చక్రవాకం” యొక్క జన్య రాగం అయిన “వలజి” అన్న రాగం హిందూస్తానీ సంగీతంలోని “కళావతి”ని కొంతవరకు పోలి ఉంటుంది. ఈ రెంటికీ స్వరస్థానాలు ఒకటే. అయితే, ఈ రెండు రాగాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెప్పలేము. “కళావతి” రాగాన్ని అర్ధరాత్రికి ముందు సమయంలో పాడతారు. పైన ఇచ్చిన కొన్ని సినిమా పాటలలో, ఈ రాగాన్ని అందుకనే వాడారు. ఉదాహరణకు, “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ…”, “వసంత గాలికి వలపులు రేగ…” వంటి పాటల్లో, సాహిత్యానికి తగ్గట్టే “కళావతి” రాగం వాడారు.

స్వరస్థానాలు పరిచయం

“చక్రవాకం” సంపూర్ణ రాగం. ఆరోహణలోనూ అవరోహణలోనూ ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. కీబోర్డ్‌ మీద పలికిస్తే, స్వర స్థానాలు ఈ విధంగా ఉంటాయి.

స రి1 X X గ2 మ1 X ప X ద2 ని1 X స

ఆరోహణ సరిగమపదనిసా
అవరోహణ సానిదపమగరిస

X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.

హిందూస్తానీ సంగీతంలోని “అహిర్‌ భైరవి” రాగం, మన “చక్రవాకం” రాగాన్ని పోలి ఉంటుంది. అరోహణ అవరోహణ స్వరాలు కూడా “చక్రవాకం” రాగం లాగే ఉంటాయి. ఐతే, రాగం యొక్క ఆలాపనలోనూ, రాగానికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ లోనూ కర్ణాటక హిందూస్తానీ సంగీతాల్లో ఉన్న తేడా ఎలా ఉంటుందో, “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల్లో స్పష్టంగా కనపడుతుంది.

“మలయ మారుతం” షౌడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఆరు స్వరాలు మాత్రమే ఉంటాయి. “చక్రవాకం” రాగంలోని మధ్యమ స్వరాన్ని (“మ”) పూర్తిగా వదిలేస్తే, అది “మలయ మారుతం” అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.

స రి1 X X గ2 X X ప X ద2 ని1 X స

ఆరోహణ సరిగపదనిసా
అవరోహణ సానిదపగరిస

X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.

“గ, ని” స్వరాలను “ఛాయా స్వరాలు” అంటారు. రాగ లక్షణాన్ని చూపిస్తున్నప్పుడు, “ధ” స్వరం మీద ఎక్కువగా ఆపుతూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “మలయ మారుతం” రాగాన్ని పోలిన హిందూస్తానీ రాగం లేదు.

“కళావతి” ఔడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. “మలయ మారుతం” రాగంలోని రిషభం స్వరాన్ని (“రి”) పూర్తిగా వదిలేస్తే, అది “కళావతి” రాగం అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.

స X X X గ2 X X ప X ద2 ని1 X స

ఆరోహణ సగపదనిసా
అవరోహణ సానిదపగస

X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.

“మలయ మారుతం” రాగంలోని రిషభాన్ని తియ్యటం వల్ల ఐదు స్వరాలే ఉన్నా, ఈ రాగానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. లలిత సంగీతంలో “కళావతి” రాగాన్ని వాడటం గత 50, 60 సంవత్సరాలుగా జరుగుతోంది.

సినిమా పాటల్లోకి దూకే ముందు, ఈ మూడు రాగాలకి ఉన్న సంబంధాలని చూద్దాం! స్వరస్థానాల దృష్య్టా చెప్పాలంటే, “మలయమారుతం” రాగం “చక్రవాకం” రాగంలో ఒక భాగం. అలాగే, “కళావతి” రాగం “మలయ మారుతం” రాగంలో ఒక భాగం అనుకోవచ్చు. అక్కడితో ఈ పోలికలు, సంబంధాలు పూర్తి అయినట్లే! రాగ లక్షణం దృష్య్టా, ఈ మూడు రాగాలకి దేని గొప్పతనం, ప్రత్యేకత దానికే ఉన్నాయి.

సినిమా పాటలు

“చక్రవాకం” రాగానికి సినిమా పాటల్లో ఒక మంచి ఉదాహరణ “పెళ్ళిచేసి చూడు” సినిమాలోని “ఏడుకొండలవాడ వెంకటా రమణా..” అన్న పాట. జంపె తాళంలో నడిచే ఈ పాట కంపోజ్‌ చెయ్యటంలో ఘంటసాల, పాడటం లో శ్రీమతి లీల చూపించిన విద్వత్తు వాళ్ళు సినీ సంగీతంలో ఎలా ఉన్నత స్థానాల్ని సంపాదించుకున్నారో నిరూపిస్తాయి. పైన చెప్పిన ఇతర సినిమా పాటల్లో ఎక్కువగా”అహిర్‌ భైరవి” రాగం ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకి, “రాధకు నీవేర ప్రాణం…” అన్న పాప్యులర్‌ పాటలో, శ్రీమతి సుశీల పాట ముందు ఆలాపన ద్వారా “అహిర్‌ భైరవి” ఛాయలు మనకి చూపించారు. అలాగే “తేరీ సూరత్‌ మేరీ ఆంఖే” అన్న హిందీ సినిమాలో “పూఛోన కైసే మైనే…” అన్న పాట సినిమాలో రెండు, మూడు చోట్ల కరుణ రసాన్ని పోషిస్తూ వినిపిస్తుంది. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఈ సినిమా మళ్ళీ చూసినపుడు, మన్నాడే పాడిన ఆలాపన, స్వరోచ్ఛారణ బాగా గుర్తు పెట్టుకో తగ్గవి.

ఇంకో ఉదాహరణ. “స్వరములు ఏడైనా రాగాలెన్నో….” అన్న శ్రీమతి సుశీల పాడిన రాగమాలిక (పంతువరాళి, చక్రవాకం, హిందోళం, సింధుభైరవి) లో, “జననంలోనా కలదు వేదనా, మరణంలోనా కలదు వేదనా” అని మొదలయ్యే చరణంలోని సాహిత్యానికి, సంగీతం ఇచ్చింది “చక్రవాకం” రాగంలోనే!

“లలిత సంగీతంలో కూడా మలయమారుతం వంటి రాగాలను వాడచ్చు” అని ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (“రజని”), “ఓ మలయ పవనమా…” అన్న పాట ద్వారా “మానవతి” అన్న పాత సినిమాలో నిరూపిస్తే, “ఉయ్యాల జంపాల” సినిమా ద్వారా, “కొండగాలి తిరిగింది…” అన్న పాటని “మలయ మారుతం” రాగంలో కంపోజ్‌ చేసి, ప్రతి తెలుగు వ్యక్తి నాలుకపైన పలికేట్లు చేసిన నేర్పు, గొప్పతనం, స్వర్గీయ పెండ్యాల నాగేశ్వరరావు గారివి. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణల్లో, సాహిత్య పరంగా “మలయ పవనము”, “కొండగాలి” వంటి పదాలతో మొదలయ్యే పాటలకి “మలయ మారుతం” రాగాన్ని వాడటం ఎంత సహజంగా ఉందో మీరు గమనించే ఉంటారు. పైన లిస్ట్‌ చూస్తే, “మలయ మారుతం” రాగం, తెలుగు సినిమా పాటల్లో తక్కువే అనిపిస్తుంది అడపా, తడపా రాగమాలికల్లో ఈ రాగాన్ని వాడుకున్నా!

మాష్టర్‌ వేణు కంపోజ్‌చెయ్యగా, ప్రముఖ సినీ గాయకుడు శ్రీ పి. బి. శ్రీనివాస్‌ , సుశీలతో కలిసి పాడిన యుగళ గీతం “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ..” పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పాటలో “కళావతి” రాగంలో వాడకూడని “తీవ్ర రిషభం” వాడటం జరిగింది. సినిమా పాటల్లో ఇది మామూలే! ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సింది పి. బి. శ్రీనివాస్‌ “చూపులతోనే మురిపించేవూ… మాటలతోనే మరపించేవూ…” అన్నప్పుడు ఈ పదాల చివర వచ్చే గమకాలు అద్భుతంగా పాడటం. లలిత సంగీతంలో వచ్చే ఒకచిక్కు ఏమిటంటే, శాస్త్రీయ సంగీతంలో అన్నట్టుగానే స్వరాలన్నీ పలకాలి, అంతే కాకుండా ఆ స్వరాలన్నిటిని లలితంగా కూడా పాడాలి! శ్రీ శ్రీనివాస్‌ ఈ పాటలో అది స్పష్టంగా వినిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, శ్రీ కె.వి. మహాదేవన్‌ ట్యూన్‌ చేసిన “తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా..” అన్న “బుద్ధిమంతుడు” సినిమాలోని పాట కూడా “కళావతి” రాగంలో బాణీ కట్టిందే! కానీ, ఈ పాటలో “కోమల మధ్యమం”, “తీవ్ర రిషభం” కూడా వాడారు. అందువల్ల పాటకు ఏమీ నష్టం కలగలా! ఒక రకంగా చూస్తే ఈ పాటలో వాడిన రాగాన్ని “మిశ్ర కళావతి” అనొచ్చు.

ప్రతి వ్యాసం చివర, ఆ వ్యాసంలో పరిచయం చెయ్యబడ్డ రాగంకి సంబంధించిన సినిమా పాటల పూర్తి స్వరాలు ఇస్తున్నట్టే, ఈ వ్యాసంలో కూడా ఇస్తున్నాను. “చక్రవాకం” కోసం “ఏడుకొండలవాడ వెంకటా రమణా…”, “మలయ మారుతం” కోసం “కొండగాలి తిరిగింది…”, “కళావతి” కోసం “వసంతగాలికి” అన్న పాటల స్వరాలు ఇస్తున్నాను. స్వరాలను అర్ధం చేసుకోటానికి కొత్తగా ప్రయత్నించే వారు, ఈ పాటలు ఒరిజినల్‌ రికార్డ్‌ మళ్ళీ వింటే, ఈ స్వరాలు కొంచెం తేలికగా అర్ధమవుతాయి.

“ఏడుకొండలవాడ …” స్వరాలు

Opening సా, రిగమ, సా, నిదని, సా, రిగమ, పా, దనిస, దా,
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా

ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుసేయక నీవు నిదురపోవయ్యా

గమపా, రిగమారి, సా, రిగపమా

మొదటి చరణం

పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపుగా
కనులనొలికే వలపు పన్నీటి జల్లుగా
అన్ని అమరించె నీ అలిమేలుమంగా… “ఏడు కొండలవాడ”

గమపా, రిగమారి, సా, రిగమ, పా, దనిస, దా
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా

రెండవ చరణం

నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య… “ఏడు కొండలవాడ”

“కొండగాలి తిరిగింది …” స్వరాలు

కొండగాలి తిరిగిందీ…. సాని ద పదపదసా
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ … పదగరిసా ..
సారిగపా..

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా

పట్టపగలు సిరివెన్నెల భరత నాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది… “కొండగాలి తిరిగింది”

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ….
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా

పడుచుదనం అందానికి తాంబూల మిచ్చిందీ…..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది… “కొండగాలి తిరిగింది”

“వసంత గాలికి …” స్వరాలు

Opening ఆలాపన …
Flute: పసా.. నిసనిసనిసద దనిదనిదనిదప పదపదపదపగ
నిసదపగరిస
Guitar: గా.. పా.. దా..

వసంతగాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగితూగి ఒక మైకం కలిగేనులే… ఈ మహిమ నీదేనులే
ప్రేమతీరు ఇంతేనులే, ఈ మహిమ నీదేనులే

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

రవంత సోకిన చల్లని గాలికి (పదపగరిస) మరింత సోలిన
వసంతుడనగా
తనువు మనసు, ఊగి తూగి ఈ లోకం మారేనులే… ఈ మహిమ నీదేనులే
ఆహా.. భలే హాయిలే… ఈ మహిమ నీదేనులే “వసంత గాలికి”

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

విలాస మాధురి, వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనిపించెలే
ఈ మహిమ నీదేనులే.. ప్రేమ తీరు ఇంతేనులే .. ఈ మహిమ నీదేనులే
“వసంత గాలికి”