జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2

జ్యోతిషంలో గందరగోళం

జ్యోతిషం – సంకేతాల శాస్త్రం అన్న అంశంలో జాతకం చెప్పడం ఎలా జరుగుతుందో ఉదాహరణ ఇచ్చాను. అది చదివిన వారికి ఓస్, జాతకం చెప్పడం అంటే ఇంతేనా అనిపిస్తే అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు. ఎందుకంటే జాతకాలు చెప్పడం అంత సులభమేమీ కాదు. జ్యోతిషంలో కొన్ని వందల సూత్రాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఏదీ స్పష్టంగా సూటిగా ఉండదు. ఆ సూత్రాల్లో చాలా పరస్పరం విరుద్ధమైనవి కూడా ఉంటాయి.

నా కుర్రతనంలో మరొక జ్యోతిష్కునితో పరిచయం అయింది. ఆయన డెబ్భై సంవత్సరాల వయసు దాటిన పెద్దవారు. జ్యోతిషంలో కనీసం ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్నది. ఆయన సమక్షంలో ఒక జాతకం చూసి పంచమంలో గురుడున్నాడండీ, చాలా చక్కటి సంతానం ఉండి ఉండాలి ఈ జాతకునికి అన్నాను. (పంచమ భావం లేదా అయిదవ ఇల్లు సంతానాన్ని సూచిస్తుంది). ఆయన నన్ను అజ్ఞానిలా చూసి, గాఠిగా నవ్వి, పంచమంలో గురుడుంటే సత్సంతానమని ఏ ప్రమాణ గ్రంథంలో రాసి ఉన్నదో చూపించు అన్నాడు. నేను తెల్లబోయాను. కారకో భావ నాశాయ అన్న సూత్రం చెప్పి అసలీ జాతకుడికి సంతానమే లేదు అని చెప్పాడాయన. (ఆ జాతకుడు ఆయనకి స్నేహితుడు లెండి). ఆ సూత్రానికి అర్ధమేమిటంటే, ఏ గ్రహం దేనికి కారకుడౌతుందో, అదే కారకత్వం కలిగిన భావంలో ఆ గ్రహం ఉంటే ఆ భావం నాశనమై దాని ఫలితాలు రావు అని. గురుడు సంతాన కారకుడు కాబట్టి పంచమంలో గురుడుంటే సంతానం కలగదుట.

మరింకేం, ఖచ్చితమైన సూత్రం దొరికిందిగా అని సంబరపడిపోకండి. శుక్రుడు సప్తమంలో ఉంటే పెళ్ళికాదుటగా, గురుడు పంచమంలో ఉంటే సంతానం కలగదటగా అని వేరే ఎవరైనా జ్యోతిష్కులదగ్గర మాత్రం అనకండేం. వాళ్ళు మిమ్మల్ని అపహాస్యం చేసే ప్రమాదం ఉంటుంది. అలా ఏ ఒక్క సూత్రంతోనూ ఏ ఒక్క ఫలితాన్నీ నిర్ణయించకూడదని జ్యోతిష్కుల ఇంటిమీద కాకి కూడా చెప్తుంది. ఒక్కో ఫలితాన్ని నిర్ణయించడానికి కనీసం ఒక పదో, ఇరవయ్యో అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వాటి బలాబలాలనీ, శుభాశుభాలనీ బేరీజువేసి కొంత మేధోశక్తితోనూ, కొంత ఉపాసనా బలంతోనూ, కొంత వాక్శుద్ధితోనూ, కొంత దైవానుగ్రహంతోనూ ఫలితాలు చెప్పాలిట. జ్యోతిషం ఖచ్చితమైన శాస్త్రమైతే ఇవి అన్నీ ఎందుకని కొందరు సందేహవాదుల బాధ.

జ్యోతిషం నేర్చుకునేవాళ్ళెవరికైనా మొదట్లో ఏ కారకత్వాన్ని ఎక్కడ అన్వయించాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటినీ పరిమితమైన (ముప్ఫై, నలభైకి మించని) జ్యోతిష సంకేతాల్లో ఇరికించాలి. వాటిని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలియదు. ఉదాహరణ – ఒకాయన జాతకంలో పదో ఇల్లు ధనూరాశి అయింది అనుకోండి. ధనూరాశి కారకత్వాలు చూస్తే – మత సంబంధమైన విషయాలు, గుళ్ళూ గోపురాలు, ధర్మం, గురుత్వం, దూర, విదేశీ ప్రయాణాలు, ఆటలు మొదలైనవి ఎన్నో ఉంటాయి. వీటినిబట్టి చూస్తే వచ్చిన జాతకుడు వీటిల్లో ఎవరైనా కావచ్చు- పూజారి, ఉపాధ్యాయుడు, లాయరు, ఆటగాడు, గుళ్ళు కట్టించేవాడు, మతబోధకుడు, చారిటీ వర్కు చేసేవాడు, మత గ్రంధాలు రాసేవాడు, ట్రావెల్ ఏజెంటు, గుర్రప్పందాలు ఆడేవాడు – ఇలా ఈ జాబితాకి అంతులేదు.

పోనీ అలా ఒకే అంశం మీద ఆధారపడి ఏమీ నిర్ణయించకూడదు, మిగతా అంశాలు కూడా చూడాలి, అన్నీ కలిపి చూస్తేగానీ ఒక ఫలితం రాదు అనుకుందాం. మరి ప్రతీ అంశానికీ కారకత్వాలు అనంతమేగా. ఒక్కో అంశానికీ కనీసం ఒక పది కారకత్వాలు తీసుకుంటే, నాలుగు అంశాల ద్వారా ఫలితం వస్తుంది అనుకుంటే, ఆ నాలుగు అంశాల కారకత్వాలూ ఎలా కలపాలో, ఎలా తీసెయ్యాలో, చివరికి వాటి ద్వారా ఒకే ఫలితాన్ని ఎలా రప్పించాలో ఎక్కడా నియమాలూ, సూత్రాలూ ఉండవు. అనుభవం ద్వారా వస్తుంది అని కొందరంటారు. అనుభవం గలవాళ్ళు ఎన్నో గ్రంథాలు రాసినా, ఖచ్చితమైన ఫలితాలకోసం ఖచ్చితమైన నియమాలు ఇంతవరకూ పుట్టలేదు.

ఇలా వాదించేవాళ్ళని జ్యోతిష్కులు కోప్పడతారు. కామన్ సెన్సు ఉపయోగించడం ద్వారానూ, ఒకానొక అంతః ప్రబోధం (intuition) వల్లా, దైవబలం వల్లా మాత్రమే ఫలితాలు చెప్పడం వస్తుందట. కేవలం శాస్త్రం చదివితే రాదుట. అంతఃప్రబోధం, దైవబలం వలన ఫలితాలు తెలిస్తే, అసలీ జ్యోతిష నియమాలూ, సూత్రాలూ ఎందుకు అని నాకు మొదటినుంచీ ఒక సందేహం. కళ్ళు మూసుకుని ఫలితాలు చెప్తే సరిపోతుందిగా. లేదు, ఇక్కడో విచిత్రం ఉంది. జ్యోతిష్కుడిగా రాణించడానికి తప్పకుండా కామన్ సెన్సూ, దైవబలమూ కావాలనుకోండి. అవి ఉన్నప్పటికీ, ఫలితాలు చెప్పడానికి ఈ నియమాలన్నీ కావాలి – అవి నిజమైనా కాకపోయినా సరే. వాటి అవసరం ఏమిటో, అవి లేకుండా పని ఎందుకు జరగదో ముందు ముందు వివరిస్తాను. (జ్యోతిషం ఎందుకు పనిచేస్తున్నట్టనిపిస్తుంది అన్న అంశంలో).
ఈ అనేక అంశాల సమన్వయం, అంతఃప్రబోధం మొదలైన గందరగోళాల్ని పక్కనపెట్టి జ్యోతిషంలోని కొన్ని అత్యంత ప్రాధమికమైన వైరుధ్యాలు కొన్నిటిని పరిశీలిద్దాము.

సాయన, నిరయణ సిద్ధాంతాలు

రాశిచక్రం గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఈ రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు (Vernal Equinox) అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది (Precession of the Equinoxes).

jyothishampart2image

Precession of the Equinoxes

దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు.

అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిరబిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు రాశిచక్రాలు అనుకోవచ్చు.

సాయన రాశిచక్రం ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషానికి చెందినది. ఒకే వ్యక్తి యొక్క జాతకచక్రాన్ని ఈ రెండు రాశిచక్రాల ప్రకారం గుణిస్తే అసలు ఒకదానికీ మరొకదానికీ సామ్యమే ఉండదు. ఒక జాతకం ప్రకారం మేషంలో సూర్యుడుంటే, మరొక జాతకం ప్రకారం మీనంలో ఉంటాడు (భారతీయ, పాశ్చాత్య రాశిచక్రాల మధ్య 23 డిగ్రీల భేదం ఉంది కాబట్టి). అదే విధంగా భారతీయ జ్యోతిషంలో కూడా అయనాంశ భేదాల ప్రకారం అంత కాకపోయినా కొద్ది భేదంతో (ఒక డిగ్రీ సుమారు) రాశిచక్రాలు మారతాయి. వీటన్నిటిలోనూ ఏదో ఒకటే సరైనదై ఉండాలి తప్ప అన్నీ సరైనవే అని ఎవరూ అనలేరు. ఒక సాంప్రదాయానికి చెందిన జ్యోతిష్కులు తమ సాంప్రదాయమే ఒప్పనీ మిగతావన్నీ తప్పనీ అనడం జరుగుతూనే ఉంటుంది. కృష్ణమూర్తి పద్ధతివాళ్ళు రామన్ పద్ధతిని నిందించడం, లేదా మొత్తంగా నిరయణ సాంప్రదాయంవాళ్ళు సాయన జ్యోతిషం తప్పనీ, ఎందుకూ పనికిరానిదనీ అనడం వింటూనే ఉంటాము.

కొంతమంది భారతీయులు సాయన రాశిచక్రమే సరైనదని అంటారు. వాళ్ళ సంఖ్య స్వల్పం. కానీ వాళ్ళు చెప్పేదేమంటే, అసలు సాయన జ్యోతిషమే భారతీయులదనీ, నిరయణం తప్పు కావడమే కాకుండా అసలు భారతీయుల సిద్ధాంతమే కాదనీ. ఎందుకంటే నిరయణ సిద్ధాంతం ప్రకారం విషువములూ, అయనములూ (Equinoxes and Solstices) ఋతువులని అనుసరించి రావు. భాగవత ప్రమాణం ఇలా ఉంటుంది – మేష తులలయందు మిహిరుండహో రాత్రు లందు తిరుగు సమ విహారములను. (పంచమ స్కంధం, ద్వితీయాశ్వాసం, 21వ అధ్యయం, 79వ పద్యం.) అంటే మేష, తులా సంక్రమణాల సమయంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి అని. సాయన సిద్ధాంతం ప్రకారం మేష తులా సంక్రమణాలు వరుసగా మార్చి 21, సెప్టెంబరు 22న వస్తాయి. ఆ దినాల్లో భూమధ్యరేఖ పైన రాత్రీ, పగలూ సమానంగా ఉంటాయి. కానీ నిరయణమతం ప్రకారం మేష తులా సంక్రమణాలు ఏప్రిల్ 14, అక్టోబర్ 14 న వస్తాయి. ఆ రోజుల్లో పగలూ రాత్రీ సమానంగా ఉండవు. కాబట్టి భాగవతంలో చెప్పింది సాయనమే అని ఒక వాదన. ఇక నిరయణ మతస్తులకి వాళ్ళ సబబులు వాళ్ళకి ఉంటాయి. ఏది తప్పో, ఏది ఒప్పో ఎవరూ ఇంతవరకూ నిర్ణయించలేదు. ఎవరి మతం వాళ్ళకి ఒప్పు.

భిన్న జ్యోతిష సాంప్రదాయాలు

ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష సాంప్రదాయాల్లో ఒకదానికొకటి పోలికే ఉండదు. రాశి చక్రం వేరు. పాశ్చాత్యులకి నక్షత్రాల విభాగమే లేదు. గ్రహదృష్టుల నిర్వచనమే మారిపోతుంది. పాశ్చాత్య జ్యోతిషంలో రాహు కేతువులకి ప్రాధాన్యం చాల తక్కువ. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలను వాళ్ళు గ్రహాలుగా పరిగణనలోకి తీసుకుంటే, చాలామటుకు భారతీయ సాంప్రదాయాలు వాటిని లెక్కలోకి తీసుకోవు. అంటే ఒక సాంప్రదాయంలో రాహు, కేతువుల కారకత్వాలు మరొక సాంప్రదాయంలో మాయమైనట్టే. అలాగే ఒక సాంప్రదాయంలో యురేనస్ మొదలైన గ్రహాల కారకత్వాలు మరొక సాంప్రదాయంలో పాత గ్రహాలతో సర్దుకుపోవలసిందే. అలాగే వాళ్ళ దశా పద్ధతులు వేరు, వీళ్ళ దశా పద్ధతులు వేరు. ఒకదాని ఫలితాలకీ, మరొకదాని ఫలితాలకీ పొంతనే ఉండదు. మరి ఈ రెండు సాంప్రదాయాల్లో ఎవరికి వారిదే సత్యమని దృఢమైన నమ్మిక.

ఇంకా భారతీయ జ్యోతిషంలో కూడా చాలా సాంప్రదాయాలున్నాయి. ఉదాహరణకి కృష్ణమూర్తి పద్ధతికీ మిగతా సాంప్రదాయాలకీ చాలా తేడా ఉంటుంది. జైమినీయ సూత్రాల్ని ఉపయోగించేవారి పద్ధతులు మిగతా పద్ధతులకన్నా భిన్నంగా ఉంటాయి. ఇవి కాక చాలా రకాల దశాపద్ధతులు ఉన్నాయి. వీటన్నిటివల్లా ఒకటే ఫలితాలు వస్తాయి అంటే నమ్మడం చాలా కష్టం.

అలాగే భావాల్ని గణించడానికి ఇంచుమించు పధ్నాలుగు పద్ధతులు ఉన్నాయి (ప్లాసిడస్, కోచ్, కాంపనస్, మెరిడియన్, రెజియొమొంటానస్ మొదలైనవి). ఒక పధ్ధతికీ మరొక పద్ధతికీ భావాల బిందువులు మారిపోతాయి. భారతీయ జ్యోతిషంలో అయితే చాలామంది లగ్న బిందువుని తప్ప మిగతా భావాల డిగ్రీలని పట్టించుకోరు. లగ్న రాశి నుంచి లెక్కపెట్టి ఒక్కో రాశినీ ఒక్కో భావంగా పరిగణించేస్తారు.
మరి ఇన్ని గందరగోళాలుండగా అసలు కొందరికైనా జ్యోతిషం పని చేస్తున్నట్టుగా ఎందుకనిపిస్తుంది?

జ్యోతిషం పనిచేస్తున్నట్టెందుకనిపిస్తుంది?

జాఫ్రీ డీన్ వంటి శాస్త్రజ్ఞులూ, హేతువాదులూ చెప్పేదేమిటంటే, జ్యోతిషం పనిచెయ్యడం అన్నది కేవలం ఒక ఆభాస లేదా భ్రమ (ఈ విషయమై డీన్ చేసిన పరిశోధన గురించి తరవాత వివరిస్తాను). జ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఉదాహరణకి ఈ రోజు అనుకోకుండా బయటకి వెళ్ళాను. ఒకాయన పరిచయమయ్యాడు. చాలా పండితుడు, దైవభక్తిగలవాడు. ఓహో, ఈ రోజు గురుడు నా జాతకంలో ఈ పరిచయాన్ని కలగజేశాడన్నమాట. లేదా, ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట. మా పక్కింటివాడికి ఎప్పుడూ అందరితోనూ గొడవలే. వాడి లగ్నంలో కుజుడు ఉన్నాడు, అదీ కారణం. ఇలా జ్యోతిష్కులు ప్రతీ విషయాన్నీ, ప్రతీ సన్నివేశాన్నీ జ్యోతిష సంకేతాల రూపంలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టికోణం మొత్తం జ్యోతిషమయమై ఉంటుంది.

జ్యోతిష సూత్రాలతో జిమ్నాస్టిక్సు

అయితే జ్యోతిషంలో ఖచ్చితమైన సూత్రాలు లేనందువల్లా, అలాగే ఏ సంకేతాన్నైనా దేనికైనా అన్వయించగల వెసులుబాటు చాలా ఎక్కువగా ఉండడంవల్లా జ్యోతిష సూత్రాలు జిమ్నాస్టిక్స్ చేసే వీరుల్లాగా ఎటైనా వంగగలుగుతాయి, ఏమైనా చెయ్యగలుగుతాయి. ఉదాహరణ- కొంతమంది జ్యోతిష్కులు గురు, శుక్రుల సమాగమం (రెండూ శుభగ్రహాలు) చాలా అదృష్టంగా భావిస్తారు. కానీ ఒకాయన సిద్ధాంతం చూడండి. గురుడు దేవతలకి గురువు. శుక్రుడు రాక్షసులకి గురువు. ఈ ఇద్దరికీ బద్ధ వైరం. కాబట్టి గురు,శుక్రుల సమాగమం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ ఆయనకి ఈ సమాగమం ఎలా పనిచేసిందో చూడండి.
ఆయనకి కన్యా లగ్నంలో ఈ గురు,శుక్రుల సమాగమం ఏర్పడిందట. శుక్రుడికి కన్య నీచస్థానం, గురుడికి శతృస్థానం. అయినప్పటికీ ఆ నీచత్వం భంగమై, రాజయోగం పట్టిందట. రాజయోగం పట్టడం మూలాన ఆయన విదేశాలు వెళ్ళి, డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవించాడట. శుక్రుడు నీచ కాబట్టి ఈ భోగాలు కొంచం ఎక్కువగానే అనుభవించాడట. అయితే ఎంతైనా గురుడు గురుడే కదా. భక్తి కూడా కలిగిందిట. సిగరెట్టు కాలుస్తూనే విష్ణుసహస్రనామం చదివేవాడట. ఆయన కబుర్లు వింటుంటే నాకు నవ్వాపుకోవడం చాలా కష్టంగా ఉండేది.

పోనీ ఆయన పెద్ద పేరున్న జ్యోతిష్కుడు కాడు, ఏదో చిన్నవాడే అనుకోండి (జ్యోతిషంలో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ). గొప్ప జ్యోతిష్కులు ఇష్టం వచ్చినట్టు జ్యోతిష సూత్రాల్ని వంగదియ్యరు అనుకోడానికి లేదు. ఒక వ్యక్తి గురించి ముందే తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి (అంటే కామన్ సెన్సు ని ఉపయోగించి) జ్యోతిష సూత్రాల్ని తదనుగుణంగా సమన్వయించడాన్ని మనం జ్యోతిష పత్రికల్లోనూ, గ్రంథాల్లోనూ మన ఓపిక కొద్దీ తవ్వుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ మాత్రం ఇస్తాను. బృహత్ పరాశర హోరా శాస్త్రంలోని ఈ సూత్రాల్ని చూడండి –
(అధ్యాయం 24, భావేశ ఫలాధ్యాయం. ఇక్కడ లాభం అంటే పదకొండవ ఇల్లు. వ్యయంఅంటే పన్నెండవ ఇల్లు.)

శ్లో. 132. లాభేశే వ్యయభావస్థే సత్కార్యేషు వ్యయః సదా,
     కాముకో బహుపత్నీకో మ్లేచ్ఛసంసర్గకారకః ||

లాభాధిపతి వ్యయ భావంలో ఉంటే, జాతకుడెప్పుడూ మంచి పనులకోసం విపరీతంగా ఖర్చుపెడతాడు. కాముకుడూ, చాలామంది భార్యలు కలిగినవాడూ అవుతాడు. మ్లేచ్ఛులతో స్నేహం చేస్తాడు.

శ్లో. 133. వ్యయేశే లగ్నగే జాతో వ్యయశీలో జతో భవేత్,
     దుర్బలః కఫరోగీ చ ధనవిద్యావివర్జితః ||

వ్యయాధిపతి లగ్నంలో ఉంటే, విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవాడౌతాడు. బలహీనంగా ఉంటాడు. శ్లేష్మదోషాలతో బాధపడతాడు. వాడికి విద్యగానీ, సంపదగానీ ఉండవు.

ఒక ప్రసిద్ధుడైన వ్యక్తికి పైన చెప్పిన గ్రహస్థితులు ఉన్నాయి. ఆధునిక వరాహమిహిరుడని పేరుగాంచిన ప్రముఖ జ్యోతిష్కుడొకాయన ఆ జాతకుడి గురించి ఇలా అన్నాడు: “ఆత్మకారకుడైన సూర్యుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఇతను చాలా ఆధ్యాత్మికుడౌతాడు. లగ్నంలో బుధుడున్నాడు కాబట్టి బుధ్ధిసూక్ష్మత హెచ్చు.” (Notable Horoscopes, p. 227). అయితే ఆయన వదిలేసిన విషయం ఏమిటంటే లగ్నంలో ఉన్న బుధుడు వ్యయాధిపతి; వ్యయంలో ఉన్న సూర్యుడు లాభాధిపతి. వాటికి పైన చెప్పిన సూత్రాల్నీ, దోషాలనీ ఆయన అన్వయించలేదు. ఎందుకంటే అది గాంధీగారి జాతకం కాబట్టి. (కామన్ సెన్సు నియమం అంటే ఇదే కాబోలు.)

ఈవిధంగా జ్యోతిష్కులు ప్రముఖుల జాతకాల గురించి రాసిన వ్యాసాల్ని తీసుకుని ఇలాంటి అసంబద్ధతలని ఎన్నైనా చూపించవచ్చు. జ్యోతిష్కులకున్న ఈ కామన్ సెన్సు సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా ఒక జాతకం చెప్పడం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

జాతకం చెప్పడం – యుగళ గీతం (Duet)

ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి జాతకం చెప్పమని కోరినప్పుడు ఆ జ్యోతిష్కుడి మనస్సు పూర్తిగా జ్యోతిష సంకేతాల దృష్టికోణంలోకి వెళ్ళిపోతుంది. అయితే వచ్చిన వ్యక్తి ఊరకే ఉండడు కదా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే జ్యోతిష్కుడు కూడా ఊరకే ఉండడు. ఏదో చెప్పడం మొదలుపెడతాడు. మీరు చాలా సంపన్నుల కుటుంబంలో పుట్టి ఉండాలి. మీ నాన్నగారు ప్రభుత్వోద్యోగి అయ్యి ఉండాలి. మీ అమ్మగారికి అనారోగ్యం అయి ఉండాలి. ఇలా మొదలుపెడతాడు. వచ్చినవాడు కూడా వెంటనే సమాధానలివ్వడం మొదలుపెడతాడు. మేము పెద్ద సంపన్నులం కాదనుకోండి, కానీ మా బంధువులందరికన్నా మెరుగే. అవునండీ, నాన్నగారు రెవెన్యూ డిపార్టుమెంటులో పని చేస్తారు. మా అమ్మగారికి మూర్ఛ రోగం ఉందండీ. ఇలా నడుస్తూ ఉంటుంది. తనకి తెలియకుండానే జాతకుడు తన గురించి మొత్తం సమాచారం ఇచ్చేస్తూ ఉంటాడు. జ్యోతిష్కుడు తనకి తెలియకుండానే ఆ సమాచారాన్ని గ్రహించి తన జ్యోతిష సంకేతాల పరిభాషలో అర్ధం చేసుకుని కథ నడిపిస్తుంటాడు.

జ్యోతిష్కుడు ఒక క్లూ లేక హింటు ఇస్తాడు. జాతకుడు దాన్ని పూర్తి చేస్తాడు. ఆ పూర్తి చెయ్యడంలో తాను జ్యోతిష్కుడికి ఎంతో సమాచారం తిరిగి ఇస్తాడు. తనగురించి తానే చెప్పుకుని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నల్లోనే చాలా సమాచారం ఉంటుంది. వివాహానికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అని జ్యోతిష్కుడంటే, వెంటనే పెళ్ళైన దగ్గరనుంచీ మొత్తం కథ అంతా చెప్పుకొచ్చేస్తాడు. చివరికి మా అవిడకి విడాకులిమ్మంటారా అని అడుగుతాడు. అతడు చెప్పే సమాచారమంతా తనకు తెలియకుండానే జ్యోతిష్కుడు గ్రహిస్తాడు. ఓహో, సప్తమాధిపతి నీచ రాశిలో పడి కుజ సమాగమం చెందాడు. ప్రస్తుతం వాడి దశ నడుస్తోంద’ అనుకుని, ప్రస్తుతం బాగుండదయ్యా, ఒక్క ఏడాది ఓపికపట్టి చూడు అంటాడు. లేదా కుజ జపమో ఏదో చేయించుకోమంటాడు. అలా కాక మొదట ఇచ్చిన హింటుకి, అబ్బే లేదండీ, నా భార్యతో ఏమీ ఇబ్బందులు లేవు, మామగారితోనే అని జాతకుడన్నాడనుకోండి. జ్యోతిష్కుడు ఫలితాలు చెప్పే దిశ మారుతుంది. ఓహో, సప్తమాధిపతి కుజ సమాగమంలో ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు మామగారు అని మనసు చెప్తుంది నిశ్శబ్దంగా. వీళ్ళ ఆవిడమీద మామగారి ప్రభావం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. కొంతకాలం మీ ఆవిడని వాళ్ళ పుట్టింటికి దూరంగా ఉండేలా చూసుకో, ఈ కుజ దశ అయ్యేవరకూ అని సలహా ఇస్తాడు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్యోతిష్కుడిచ్చే హింట్లు చాలా విస్తృతంగా ఏదో రాయి వేసినట్టు ఉంటాయే తప్ప ఖచ్చితంగా సమాచారం ఇవ్వవు. మీ నాన్నగారికి ప్రభుత్వోద్యోగం అంటే అది చాలా విస్తృతమైన పరిధిలో చెప్పిన విషయం. అంతేగానీ మీ నాన్నగారికి రెవెన్యూ బోర్డులో ఉద్యోగమనో, పంచాయితీ ఆఫీసులో క్లర్కు అనో చెప్పడు, చెప్పలేడు. అయితే జాతకం చెప్పించుకునేవాడు చాలా ఆతృతతో ఉంటాడు కాబట్టి ఆమాత్రం హింటుకే ఉత్సాహపడి తన సమాచారం ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలా జాతకం చెప్పడం ఒక యుగళ గీతం లాగా సాగుతూ ఉంటుంది.

ఆఖరిగా జ్యోతిష్కుడు సమస్యల బాధ తగ్గడానికి ఏవో నివారణోపాయాలు సూచిస్తాడు. పూజలు, జపాలు చేయించడమో, ప్రత్యేకమైన రాళ్ళూ, రత్నాలూ ధరించడమో చెయ్యమంటాడు. అలాగే భవిష్యత్తు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాడు. రాబోయే ఫలానా దశలో బాగుండదు. ఇప్పటినుంచీ రెమెడీస్ పాటించు. ఇంట్లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం బాగుండదు. ఈ రెమెడీస్ పాటిస్తే గట్టెక్కుతావు. ఇలా ఏదో చెప్తాడు. ఈ భవిష్యత్తు గురించి చెప్పినవి కూడా చాలా విస్తృతమైన పరిధిలో ఉంటాయి తప్ప, ఖచ్చితంగా ఉండవు. సమస్యలు అంటే ఏమైనా కావచ్చు. ఆరోగ్యం బాగుండదు అంటే జలుబు చెయ్యడం దగ్గరనుంచీ, హార్ట్ ఎటాక్ వరకూ ఏమైనా కావచ్చు. వచ్చే నవంబరులో నీకు కాలు విరుగుతుంది అని చెప్పగలిగే జ్యోతిష్కుడు నాకు తెలిసినంతవరకు ఎవరూ ఉండరు.

దీన్నిబట్టి మనకి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. జాతకం చెప్పేవాడికి జాతకం చెప్పించుకునేవాడి సహకారం చాలా అవసరం. జ్యోతిష్కుణ్ణి పరీక్షించడానికి జాతకుడు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తే జ్యోతిష్కుడు సరైన ఫలితాలు చెప్పలేడు. నేను చాలామంది జ్యోతిష్కులకి ఒక వ్యక్తి జాతకం ఇచ్చి ఈ జాతకుడికి ఉద్యోగం లేదు, స్థిరపడలేదు, మీరేమైనా భవిష్యత్తు చెప్పగలరా అని అడిగాను. అలా అడిగిన జ్యోతిష్కుల్లో ఒకతను చాలా ప్రతిభావంతుడు, పేరు గలవాడు. ఒక గంట జాతకం చెప్పడానికి వంద యూరోలు పుచ్చుకుంటాడు. అతనితో సహా అందరూ ఉద్యోగం రాకపోవడానికి ఫలానా గ్రహం కారణమనీ, ఫలానా రెమిడీస్ పాటించాలి అని మాత్రమే చెప్పారు. వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయిన సంగతి ఏమిటంటే ఆ జాతకుడు పుట్టుకతోటే వికలాంగుడు. అతనికి ఉద్యోగం లేకపోవడం నిజమేగానీ, అసలు సమస్య అది కాదు. నేను వాళ్ళని తప్పుదోవ పట్టించకుండా అసలు సమస్య ఏమిటో చెప్తే, ఆ జాతకంలో వాళ్ళకి ఆ సమస్య వెంటనే కనపడి ఉండేది. నేను చెప్పలేదు కాబట్టి కనపడలేదు. ఏ సమస్య ఉందని చెప్పానో అదే కనపడింది.

అదే విధంగా జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళినప్పుడు జాతకుడు మాట్లాడకుండా కూర్చుంటే జ్యోతిష్కుడు సరైన ఫలితాలు చెప్పలేడు. అసలు జ్యోతిష్కుణ్ణి వ్యక్తిగతంగా కలవకుండా, జాతకం మాత్రం ఇచ్చి ఫలితాలు రాసి ఇమ్మన్నాకూడా జ్యోతిష్కులు సరైన ఫలితాలు చెప్పలేరు.

ఇక్కడ గమనించవలసిన మరొక సూక్ష్మాంశం ఏమిటంటే, జ్యోతిష్కులు తమ ఎరుకతో సంబంధంలేకుండా (unconscious) ఈ యుగళగీతం పాడడానికి జ్యోతిష సంకేతాల సహాయం అవసరం అవుతుంది. జ్యోతిష సిద్ధాంతాలూ, సంకేతాలూ అవగాహన చేసుకోకుండా, వాటిని మానవ జీవితానికి అన్వయించడం అభ్యాసం చేయకుండా ఈ యుగళగీతం పాడడం సాధ్యం కాదని నా అభిప్రాయం. జ్యోతిషాన్ని నమ్మి, జ్యోతిష సంకేతాలు జీర్ణించుకొని, ఆరకమైన ప్రాపంచిక దృష్టిని అలవరచుకోవడం వల్ల జ్యోతిష్కులకి శాస్త్రం పైన ఒక సహజమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఆ కళ్ళజోడులోంచి చూసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలోని పరిస్థితులు గ్రహసంకేతాలరూపంలో కనిపించి, జ్యోతిషం సత్యమే అన్న దృఢమైన భావనని కలుగజేస్తాయి. ఒకసారి అటువంటి నమ్మకం స్థిరపడ్డాకా, ఒక జాతకుడితో కలిసి యుగళగీతం పాడడానికి కావలసిన సామర్ధ్యం వచ్చేస్తుంది. అయితే తాము జ్యోతిష్కులుగా సఫలమౌతున్నది జాతకం చెప్పించుకునేవాళ్ళు సహకరించడం వల్లనే అన్న సంగతి జ్యోతిష్కులకి తెలియదు. జాతకాలు చెప్పించుకునేవాళ్ళకీ తెలియదు. అయినప్పటికీ ఒక్కో జాతకం చెప్పేకొద్దీ జ్యోతిష్కుడికి శాస్త్రం మీద నమ్మకం దృఢమవ్వడం, విశ్వాసం పెరగడం జరుగుతుంది. అలాగే జాతకుడికి ఒక జ్యోతిష్కుడితో మాట్లాడాకా ఆయన అంతా నిజమే చెప్పాడనీ, ఒక దారి చూపించాడనీ తృప్తి కలుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో తెలిసి మోసం చెయ్యవలసిన అవసరం లేకుండానే పని జరిగిపోవడం. అందుకే హేతువాదులు జ్యోతిషం తప్పంటే జ్యోతిష్కులకి అంత కోపం వస్తుంది. మా అనుభవంలో జ్యోతిషం నిజంగానే పనిచేస్తుంది అని వాళ్ళు వాదించడానికి కారణం కూడా ఇదే.

మరి ఈ రకంగా పాట పాడడానికి ఏవో కొన్ని సంకేతాలూ, తత్సంబంధమైన ప్రాపంచిక దృక్పథమూ కావాలే తప్ప అవి అన్నీ నిజంగా తప్పా, ఒప్పా అన్నది అనవసరం. అందుకనే జ్యోతిషంలో అనేకమైన సాంప్రదాయాలూ, విచిత్రమైన సిద్ధాంతాలూ, పరస్పర విరుద్ధమైన సూత్రాలూ పుట్టి, పెరిగి, పాతుకుపోవడం సాధ్యమౌతోంది – అవి నిజమైనా కాకపోయినా సరే. హోరాశాస్త్రం నుంచి, చిలకజోస్యందాకా వందల ఏళ్ళుగా జ్యోతిషం నిలబడిపోవడానికి ఇదే కారణం కావచ్చు.

విచిత్రవ్యక్తి విశేషాలు మరికొన్ని

ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి విచిత్రవ్యక్తి విశేషాలు మరికొన్ని మనవి చేస్తాను. పైన చెప్పిన యుగళగీతానికి ఉదాహరణలుగా ఇవి పనికొస్తాయి. తనకు అస్సలు పరిచయం లేని వాళ్ళకు కూడా విచిత్ర వ్యక్తి కొన్ని ఫలితాలు చెప్పగా నిజమవ్వడం నేను చూశాను. అప్పట్లో ఆశ్చర్యమనిపించినా, తరవాత తెలిసిందేమిటంటే ఆయన కేవలం ఒక రాయి విసిరాడని.

ఒకాయన విచిత్రవ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆయన జాతకం చూడకుండానే గురువుగారు ఇలా అన్నారు – మీ తండ్రిగారు బాధ్యతలు తీరకుండానే మరణించారు కదూ?. అది విని వచ్చినాయన చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన చిన్నతనంలోనే తండ్రి పోయి చాలా కష్టపడ్డాడుట. అయితే గురువుగారు చాలా విస్తృత పరిధిలో రాయి విసిరాడని ఆయన గ్రహించలేదు. మా నాన్నగారు ఎన్నవ యేట చనిపోయారో చెప్పగలరా? అని ఆయన తిరిగి ప్రశ్న వేసి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది.

జ్యోతిష్కులు చెప్పేది తప్పైనా జాతకులు చాలా తేలిగ్గా క్షమించేస్తారు. జ్యోతిష్కుడితో సహకరించడానికి వాళ్ళు ఎంత ఉత్సుకతతో ఉంటారో చెప్పడానికి ఇంకో ఉదాహరణ. మరొకాయన విచిత్రవ్యక్తి దగ్గరకి వచ్చాడు. ఇందాకట్లాగే విచిత్రవ్యక్తి నాలుగు రాళ్ళు విసిరాడు. దురదృష్టవశాత్తూ నాలుగూ తప్పయ్యాయి. అప్పుడు విచిత్రవ్యక్తి ఏమన్నాడంటే, నా లగ్నమూ, మీ లగ్నమూ ఒకటే, కాబట్టి నేను మీకు చెప్పే ఫలితాలు అన్నీ తప్పైపోతాయి అని. ఆ వచ్చినాయన చాలా ఆనందపడిపోయాడు. ఇంతటి గొప్ప జ్యోతిష్కుడు నాకు ఫలితాలు చెప్పలేకపోయాడు, కారణం ఇదీ అని ఆయన కొంతమందితో గొప్పగా చెప్పుకోవడం నేను ఎరుగుదును. చెప్పింది తప్పైనా తెలివిగా తప్పించుకోడానికీ, దాన్ని మళ్ళీ తనకే గౌరవంగా మలచుకోడానికీ అసాధారణమైన తెలివితేటలు కావాలి.

మరో సంగతి. విచిత్రవ్యక్తి అద్భుతమైన మాటకారి. అస్పష్టంగా, ఏదో ఒకానొక గొప్ప శాస్త్ర విషయం చెప్తున్నట్టుగా గాలి పోగేసి మాట్లాడడంలో ఆయనని మించినవారు లేరు. ఆయన ఫలితాలు చెప్తున్నప్పుడు మాటల్లో చాలా గందరగోళం కావాలనే చొప్పించేవాడు. జాతకులు ఒకానొక విభ్రాంతికి గురయ్యేలాగా మాట్లాడడం, ఎవర్నో ఉద్దేశించి కఠినంగా తిట్టడం, మధ్య మధ్యలో ఏవో ఫలితాలు చెప్తూనే అనేక విషయాలు దొర్లించడం – ఇదీ ఆయన జాతకం చెప్పే తీరు. ఒక జాతకం చూసి ఈ జాతకాన్ని ఏమంటామంటే, మంచి ఎండ కాస్తున్నప్పుడు బురదలోంచి వచ్చి ఇసుకలో పాము పొర్లాడుతుంది. అటువంటి జాతకమిది అని మొదలు పెట్టేవాడు. ఇలా అస్పష్టమైన చిత్రాలేవో కళ్ళకు కట్టిస్తూ, ఆయన ఏమి చెపుతున్నాడో అర్ధమయ్యీ అవని ఒకానొక గందరగోళంలోనే ఫలితాలు దొర్లించేవాడు. ఉత్సాహం అధికంగా గల జాతకులు ఎన్ని అర్ధాలైనా తీసుకునేవారు. అన్నీ నిజమే అనేవారు.

విచిత్రవ్యక్తి ఉచితంగా జాతకాలు చెప్పడం అన్నది ఒక ప్రచారాయుధం మాత్రమే. ప్రతీ జాతకుడికీ ఏవో కొన్ని నివారణోపాయాల పేరుతో ఆయన దగ్గర ఉండే చవక రకం రాళ్ళు మంచి ధరకి దొరికేవి. మరి ఆయనకి తన బండారం బయటపడుతుందేమో అన్న భయం లేదా అని నేను చాలా ఆలోచించాను. లేదు, ఎందుకంటే ఆయన పాతుకుపోయిన సాంప్రదాయాల రక్షణలో ఉన్నాడు కాబట్టి. ఆయన తన చుట్టూ ఉన్న సమాజం ఏమి నమ్ముతుందో ఆ నమ్మకాల ముసుగులోనే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సమాజం నమ్మకాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఒక నమ్మకాల సమాహారాన్ని (Belief System) ఎంత విమర్శించినా ఆ నమ్మకాలు బలంగా ఉన్నంతకాలం వాటి వెనక ఉన్నవాళ్ళకి రక్షణ ఉండనే ఉంటుంది. అయితే నా అనుభవంలో అందరు జ్యోతిష్కులూ ఆయనలాగే మోసగాళ్ళు కారని మాత్రం మరొక్కసారి మనవి చేస్తున్నాను.

జ్యోతిషం — శాస్త్ర పరిశోధనలు

జ్యోతిషం నిజం కానక్కరలేదనీ, అది పనిచెయ్యడం కేవలం ఆభాస అనీ రుజువు చెయ్యడానికి జాఫ్రీ డీన్ 1987 లో (The Skeptical Inquirer, Vol 11, No. 2, 3. 1986-87) ఒక ప్రయోగం చేశాడు. జ్యోతిషం మీద నమ్మకం కలిగిన 22 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళకి తమ జాతక చక్రమూ, ఆ చక్రంలో ఉన్న బలమైన గ్రహ దృష్టుల ఫలితాలూ రాసి ఇచ్చాడు. ఆ ఫలితాలు సూటిగా, స్పష్టంగా ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నాడు. గ్రహదృష్టులని ఎందుకు తీసుకున్నాడంటే, పాశ్చాత్య జ్యోతిషంలో అవి చాలా ప్రధానమైనవి కాబట్టి. అయితే వాళ్ళలో సగంమందికి మాత్రమే వాళ్ళ జన్మ సమయం ప్రకారం వేసిన సరైన జాతకచక్రాన్ని ఇచ్చాడు. మిగతా సగం మందికీ వాళ్ళ అసలు జాతకచక్రానికి పూర్తి విరుద్ధమైన గ్రహస్థితులుగల చక్రాలువేసి వాటి ప్రకారమే ఫలితాలు రాసి ఇచ్చాడు. వాళ్ళను తమకు చెప్పిన ఫలితాలు ఎంతవరకూ సరిపోతున్నాయో నిర్ణయించమన్నాడు.

సరైన జాతకచక్రాల వాళ్ళు తమకు చెప్పిన 261 ఫలితాల్లో 250 ఫలితాలు సరైనవే అన్నారు. మరి తప్పు జాతకచక్రాలు ఇచ్చినవాళ్ళు కూడా తమకు చెప్పిన 214 ఫలితాల్లో 207 ఫలితాలు సరైనవే అన్నారు. అంటే జాతకచక్రం తప్పైనా ఒప్పైనా వాళ్ళకి చెప్పిన ఫలితాలు సరిపోయాయి. ఇదేరకంగా అంతకుముందు 1977 లో మరొక ప్రయోగం చేశాడు. అందులో వ్యక్తులతో ముఖాముఖీగా కాకుండా ఉత్తరాల ద్వారా ఇదేరకంగా 44 మందికి జాతక ఫలితాలు చెప్పి ఎంతవరకు సరిపోతున్నాయో నిర్ణయించమన్నాడు. అందులోకూడా జాతక చక్రం తప్పొప్పులతో సంబంధం లేకుండా 95 శాతం ఫలితాలు సరిపోయాయి.

దీన్నిబట్టి తేలేదేమిటంటే, పరీక్షింపబడినవాళ్ళు జ్యోతిషం మీద నమ్మకం కలిగినవాళ్ళు కాబట్టి వాళ్ళు తమకు తెలియకుండానే తమ నమ్మకాలకి అనుగుణంగా ఆలోచించి ఫలితాలు నిజమనే భావించారు. (దీన్నే డీన్ తమకు తెలియకుండానే Cognitive Dissonance ని తగ్గించుకోవడం అన్న భావనగా వివరించాడు.) కాబట్టి జ్యోతిషం పనిచెయ్యడానికి కారణం ప్రజల్లో ఉన్న నమ్మకమేననీ, జ్యోతిషం పని చేసినట్టు అనిపిస్తుంది మాత్రమేగానీ అది అసలు నిజం కానక్కరలేదు అనీ డీన్ అంటాడు.

నమ్మకాలు – సైన్సు – జ్యోతిషం

ఈ విధంగా జ్యోతిషమంటే యుగళగీతమే అని శాస్త్రీయంగా రుజువు చేసినప్పటికీ చాలామంది జ్యోతిష్కులు అంగీకరించరు. భారతీయ జ్యోతిష్కులని ఎవర్నైనా అడిగితే జాఫ్రీ డీన్ పరీక్షించిన అంశం చాలా హాస్యాస్పదమైనదని అంటారు. ఎందుకంటే పాశ్చాత్య పద్ధతి ప్రకారం గ్రహదృష్టులు లెక్కపెట్టడం భారతీయ సాంప్రదాయంలో లేదు. అలాగే ఆయా గ్రహదృష్టులకి కేవలం వ్యక్తిత్వ లక్షణాల్ని (Personality Traits) మాత్రం ఆపాదించి అవి నిజమో కాదో పరిక్షించడం అసంబద్ధమైనది అని వాళ్ళ అభిప్రాయం. డీన్ పరిక్షించిన ఫలితాలకి ఒక ఉదాహరణ చూడండి:

కుజుడు, యురేనస్ ల సమాగమం: జాతకుడికి అసహనం, స్వతంత్ర బుద్ధీ ఉంటాయి. అన్నింటినీ చెడగొట్టడానికి ముందుంటాడు. ఇటువంటి ఫలితాలని డీన్ చాలా ప్రసిద్ధమైన పాశ్చాత్య జ్యోతిష గ్రంథాల్లోంచి తీసుకున్నప్పటికీ, వాటిని జ్యోతిష్కులెవరూ యథాతథంగా స్వీకరించరు – పాశ్చాత్య జ్యోతిష్కులతో సహా. పుస్తకాలని కేవలం సూచికలు (Guidelines) గా స్వీకరించి ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు గ్రహదృష్టులకి ఫలితాలు అన్వయించుకుంటారు. ఇటువంటి వ్యక్తిత్వ లక్షణాల్ని జాతకం ద్వారా నిర్ణయించడం కష్టం. అందులోనూ కేవలం ఒక్క గ్రహదృష్టిని బట్టి నిర్ణయించడం అంటే అది జరిగేపనికాదు. కాబట్టి అసలు జాఫ్రీ డీన్ పరిశోధించింది నిజమైన జ్యోతిషమే కాదు పొమ్మంటారు.

చాలామంది జ్యోతిష్కుల అభిప్రాయాలు ఎలా ఉంటాయి అంటే – జ్యోతిషం పనిచెయ్యకపోవడానికి కారణం చేతకాని జ్యోతిష్కులేగానీ జ్యోతిషం కాదు. జ్యోతిష్కుల్ని కాకుండా జ్యోతిష సూత్రాల్ని శాస్త్రీయంగా పరిశీలిస్తే జ్యోతిషం నిలబడుతుంది. అంతేగాక సైంటిస్టులు జ్యోతిషం పట్ల దురభిప్రాయం కలవారు. వాళ్ళు చేసే పరిశీలనలు పక్షపాతంతో కూడుకుని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎన్ని రుజువులు చూపించినా వాటిల్లో నిజం తక్కువ. మా అనుభవమే మాకు సత్యం. ఇలా భావించే జ్యోతిష్కులే ఎక్కువ. సైన్సు చేసే పరిశోధనల్ని నిజాయితీగా అంగీకరించే జ్యోతిష్కులు ఉంటారని నేను అనుకోను. ఎందుకని? జ్యోతిష్కులే కాదు, మత విషయాల్ని నమ్మేవాళ్ళు కూడా సైంటిస్టులు దేముడు లేడు అనో, లేక మరో మత విశ్వాసం తప్పు అనో చెప్తే వినరు. ఎన్ని రుజువులు చూపించినా తమ నమ్మకాలు తమవి అంటారు. దీన్నిబట్టి మనకి తెలిసేదేమిటంటే జ్యోతిషంకూడా ఒక మతనమ్మకంలాంటిదేనని. అందులో చిక్కుకున్నవాళ్ళు బయటపడడం కష్టం.

జ్యోతిషాన్ని కేవలం ఒక నమ్మకం గానే భావించి వదిలివేయవచ్చు కదా, నమ్మకాలని శాస్త్ర పరిశీలనకి గురి చెయ్యడం ఎందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మిగతా నమ్మకాల్లా కాకుండా జ్యోతిషానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో చూద్దాం.

తరువాయి సంచికలో రాబోయే అంశాలు:

  • నమ్మకాలు – విశేషాలు
  • తప్పని నిరూపించగలిగేవే పనికొచ్చే సిద్ధాంతాలు
  • జ్యోతిషం నిజంగా పని చేస్తుందని తేలితే సైన్సు అయిపోతుందా?
  • జ్యోతిషం పైన జరిగిన కొన్ని పరిశీలనలూ, పరిశోధనలూ
  • మైకేల్ గేక్వలిన్ పరిశోధనలు
  • Journal of Scientific Exploration (2002, Volume 16, No.1) లో Dr. Frank McGillion పీనియల్ గ్లాండ్ గురించి రాసిన అంశాల గురించిన స్థూలమైన వివరణ.
  • జ్యోతిషానికి సంబంధించిన కొన్ని సూక్ష్మాంశాలు
  • జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు.