సైంటిస్టులకీ జ్యోతిష్కులకీ మధ్య పరస్పర అపనమ్మకాలు
సైంటిస్టులూ, భౌతికవాదులూ చాలామంది జ్యోతిష్కులు మోసగాళ్ళనీ, లేదా భ్రమల్లో జీవించే మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కులు కూడా సైంటిస్టుల్ని కళ్ళముందు కనపడుతున్న సత్యాన్ని చూడలేని గుడ్డివాళ్ళనీ, ఉద్దేశ్యపూర్వకంగా నిజాల్ని వక్రీకరిస్తారనీ, జ్యోతిషం లాంటి ఖచ్చితమైన శాస్త్రాన్ని కూడా అవగాహన చేసుకోలేని మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కుల్లో అత్యధికులు భౌతికవాదాన్ని నిరాకరిస్తారు. అధిభౌతికమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉంటారు – అంటే పునర్జన్మ, కర్మ మొదలైన విషయాల్ని నమ్ముతారు. భౌతికం కాని ఏదో ఒకానొక శక్తి ద్వారా గ్రహాలు జీవుల్ని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతారు. సహజంగానే భౌతికవాదులు ఈ విధమైన నమ్మకాల్ని నిరాకరిస్తారు. అందుచేత వీళ్ళ ఘర్షణ చాలా మటుకు రెండు విభిన్న దృక్పథాల మధ్య సంఘర్షణగా కనిపిస్తూ ఉంటుంది.
జ్యోతిషం ఖచ్చితంగా పనిచేస్తుంది అని అమాయకంగా నమ్మే రోజుల్లో నాకు ఒక సంగతి అర్థమయ్యేది కాదు. ‘దృక్పథం ఏదైనా కానీ. జ్యోతిషం ఎలా పనిచేస్తుందో మనకి ప్రస్తుతానికి తెలియకపోతే నష్టమేమిటి? అది ఖచ్చితంగా పని చేస్తుంది కదా. అసలంటూ అది పని చేస్తుంది అని సైంటిస్టులకి జ్యోతిష్కులు నిరూపించేస్తే చాలు కదా. ఎలా పనిచేస్తుందో వాళ్ళే కనుక్కుంటారు కదా.’ అనుకునేవాణ్ణి. అయితే అనేక మంది జ్యోతిష్కులతో చర్చించినమీదట నాకు క్రమంగా బోధపడిన విషయమేమిటంటే, జ్యోతిష్కులు జ్యోతిషం ఖచ్చితంగా పనిచేస్తుంది అని వాదిస్తారు గానీ, నిజంగా అలా పనిచేస్తుంది అని తామే నమ్మరు అని. జ్యోతిష్కుల్లో కూడా సైన్సుని నమ్మేవాళ్ళు, పచ్చి భౌతికవాదులు ఉంటారు. వాళ్ళు కూడా జ్యోతిషం నిర్ణయాత్మకం (Deterministic)గా పనిచేస్తుంది అని భావించరు. జ్యోతిషం పనిచేస్తుంది గానీ, అది నిర్ణయాత్మకం కాదు అంటారు. అది అంతా నాకు చాలా గందరగోళాన్ని కలిగించింది. అసలు జ్యోతిషం ఖచ్చితమే కాకపోతే ఇంక జ్యోతిష్కులు సైంటిస్టులకి నిరూపించగలిగేది ఏముంది? ఈ గందరగోళం గురించి కొంత వివరంగా తెలుసుకోవాలంటే కొన్నేళ్ళ క్రితం నాకు పరిచయమైన ఒక స్నేహితుడి గురించి చెప్పాలి.
ఒక కెనడియన్ జ్యోతిష్కుడి కథ
సుమారు ఏడు సంవత్సరాల క్రితం నాకొక కెనడియన్ జ్యోతిష్కుడు పరిచయమయ్యాడు. అతని పేరు మార్టిన్ బెర్జిన్స్. అతను జ్యోతిషం నిజమని నిరూపించడానికి ఒక ప్రయోగం చేశాడు. ఒక 42 మంది వ్యక్తుల్ని ఎన్నుకొని వాళ్ళ జన్మ వివరాలు తీసుకున్నాడు. అందులో ఒక్కొక్క వ్యక్తికీ రెండు జాతకాలు తయారు చేశాడు. ఒకటి సరైనది. ఇంకోటి తప్పుది. తొమ్మిదిమంది జ్యోతిష్కుల్ని కూడా ఎన్నుకుని ప్రతీ జ్యోతిష్కుడికీ కొంతమంది వ్యక్తుల జాతకాలు ఇచ్చాడు. జ్యోతిష్కులు జాతకులతో మాట్లాడవచ్చు. వ్యక్తుల జీవిత విశేషాల్నిబట్టి ఏ జాతకం సరైనదో జ్యోతిష్కులు నిర్ణయించాలి. అందులో 29 మంది వ్యక్తులకి సరైన జాతకాలు ఏవో జ్యోతిష్కులు కనుక్కోగలిగారు. 13 మందికి మాత్రం తప్పు జాతకాన్ని ఎంపిక చేశారు. అంటే డెబ్భై శాతం సందర్భాల్లో వాళ్ళు విజయవంతమయ్యారు అన్నమాట. రాండమ్ చాన్సు ప్రకారం అలా జరిగే అవకాశం (random probability) 0.00౦7 మాత్రమే.
తన ప్రయోగం యొక్క డేటాను మార్టిన్ అనేక సంవత్సరాలపాటు విశ్లేషించాడు. ప్రతీ జాతకానికీ అతను భూఅయస్కాంత క్షేత్ర విలువని జోడించి పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా అతను కనిపెట్టినదేమిటంటే, జ్యోతిష్కులు విజయవంతంగా ఎన్నుకోగలిగిన జాతకాలకి జన్మ సమయంలో భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత (Geomagnetic activity) ఎక్కువగా ఉన్నదనీ, వాళ్ళు సరిగ్గా ఎన్నుకోలేకపోయిన జాతకాలకి తక్కువగా ఉన్నదనీ! దాన్నిబట్టి ఒక శిశువు పుట్టడానికి సుమారుగా పదిహేను రోజుల ముందు ఉండే భూఅయస్కాంత క్షేత్ర తీవ్రత శిశువు మెదడుని ప్రభావితం చేస్తూ ఉండి ఉండవచ్చు అనీ, దానివల్లనే జాతకాలు ఎంతవరకు పనిచేస్తాయో నిర్ణయమవుతున్నాయి అనీ అతను స్టాటిస్టిక్సు ప్రకారం పరిశోధించి ప్రతిపాదించాడు.
తన పరిశోధన ఫలితాల్ని అనేకమంది జ్యోతిష్కులకీ, సైంటిస్టులకీ అతను పంపించాడు. సెమినార్లలో పాల్గొని తన ప్రయోగాన్ని వివరించాడు. తన ప్రయోగం కేవలం ఒక చిన్న ప్రయత్నమనీ (pilot experiment), దీన్ని చాలా చోట్ల, చాలా ఎక్కువమందితో మళ్ళీ చేయవలసి ఉన్నదనీ (replication), దానివల్ల చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చుననీ అతను వాళ్ళని అభ్యర్ధించాడు. అయితే ఆశ్చర్యకరంగా సైంటిస్టులూ, జ్యోతిష్కులూ కూడా అతని ఫలితాల్ని ఉపేక్షించారు. కనీసం అదే స్థాయిలో మరొక చిన్న ప్రయోగాన్ని చెయ్యడానికి కూడా ఎవరూ ఉత్సాహం చూపలేదు. అంతే కాక అతనికి తన ప్రయోగానికి కావలసిన సమాచారాన్ని సేకరిస్తున్న సమయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ గారిని భూఅయస్కాంత క్షేత్ర వివరాల కోసం కలిసినప్పుడు, ఆయన దయతో మార్టిన్ కి ఇలా సెలవిచ్చాడట –‘నీలాంటి వ్యక్తుల్ని ఈ భూప్రపంచం నుంచి తుడిచిపెట్టాలి అని నేను భావిస్తాను’ అని. జ్యోతిషం పట్ల ఆయనకున్న వ్యతిరేకత అంత గాఢమైనది.
జ్యోతిషం నిర్ణయాత్మకంగా (Deterministic) పని చేస్తుందా?
సైంటిస్టులకీ జ్యోతిష్కులకీ మధ్య జరిగిన ఒక చర్చలో మార్టిన్ ప్రయోగం చర్చకి వచ్చింది. సైంటిస్టులు ఏమన్నారంటే, ‘అతని ప్రయోగంలో సమాచారం లీకవడానికి చాలా అవకాశం ఉన్నది కాబట్టి, అసలా ప్రయోగమే తప్పు. ఎవరికైనా చేతనైతే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని తయారు చెయ్యాలి. ఆ ప్రోగ్రామ్ కి రెండు జాతకాలు, జీవిత విశేషాలు ఇచ్చి, ఏది సరైన జాతకమో నిర్ణయించమనాలి. అది ఎక్కువ సందర్భాలలో సరైన జాతకాల్ని ఎన్నుకుంటే జ్యోతిషం నిజమని నిరూపితమైనట్టే’ అని. అది నిజంగా జరగాలి అంటే, జ్యోతిష సూత్రాలు కంప్యూటరైజ్ చెయ్యడానికి అనుగుణంగా గణితంలాగా నిర్ణయాత్మకం (Deterministic) అవ్వాలి.
ఆ చర్చ గురించి మార్టిన్ అభిప్రాయమేమిటని అడిగాను. జ్యోతిషం నిర్ణయాత్మకం కాదని అతని అభిప్రాయం. మార్టిన్ ఒక వృత్తినిపుణుడైన జ్యోతిష్కుడు. అనేక వేల గంటలు అతను జాతకాలు చెప్పడంలో గడిపాడు. అయినా అతని అభిప్రాయం ప్రకారం జ్యోతిషం ఖచ్చితమైన గణిత నియమాల్లాంటి నియమాలు కలిగిన శాస్త్రం లాంటిది కాదు. ఒక జాతకం చెప్పడానికి ఇద్దరు వ్యక్తులు సంభాషించవలసిందే అని అతని అభిప్రాయం.
భాష నేర్చుకోవడం, ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవడం మొదలైన ప్రక్రియలు మెదడు యొక్క సంక్లిష్టమైన కార్యాలపైన ఆధారపడతాయి. అందులో తెలియకుండానే ఎంతో సమాచార మార్పిడి జరుగుతుంది. జ్యోతిషం కూడా అటువంటి ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని మార్టిన్ అభిప్రాయం. ఒక జ్యోతిష్కుడు, జాతకుడు సంభాషించుకునేటప్పుడు ఇద్దరికీ తెలియకుండానే సమాచార మార్పిడి జరిగి, ఇద్దరికీ అంతకు ముందు తెలియని క్రొత్త విశేషాలు బయటపడతాయి అనీ, అది మెదడు చేసే ఒకానొక సంక్లిష్ట ప్రక్రియ (cognitive process) అనీ వివరిస్తూ, క్వాంటమ్ ఫిజిక్సులోని కొన్ని విశేషాల్ని ఉపమానాలుగా వినియోగించి అతను రాసిన ఒక వ్యాసాన్ని నాకు పంపించాడు.
మార్టిన్ అభిప్రాయాలతో నేను అంగీకరించలేకపోయాను. సాంప్రదాయవాదులైన జ్యోతిష్కులు జాతకాలు చెప్పడానికి అంత: ప్రబోధమూ, ఆత్మ పరిశుద్ధి, దైవోపాసనా కావాలంటారు. అవి లేకపోతే జ్యోతిషం ఖచ్చితమైన శాస్త్రం కాదంటారు. మార్టిన్ భౌతికవాది కాబట్టి అంత: ప్రబోధం (intuition) లాంటి ఆధ్యాత్మిక భావనలకి బదులుగా క్వాంటమ్ ఫిజిక్సు లాంటి భావాలని తనకి తెలియకుండానే వాడుతున్నాడని నాకు అనిపించింది. చాలామంది ఖచ్చితమని భావించే ఏవో కొన్ని జ్యోతిష సూత్రాల్ని ఎన్నుకుని, వాటితో ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ని రాసి, అవి తప్పో, ఒప్పో నిరూపించవచ్చు కదా, అలా ప్రయత్నించాలని నాకు అనిపిస్తున్నది, అని అతనితో అన్నాను. నీ జీవితకాలమంతా ప్రయత్నించినా నువ్వు సఫలం కాలేవని అతను అన్నాడు.
తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ని ప్రేమించి, ఆమె మోసం చేసిందని తెలిసినప్పుడు చూపించే అంత: సంఘర్షణని నేను అనుభవించాను. ‘నువ్వు (జ్యోతిషం) నిర్ణయాత్మకం అనుకుని నిన్ను ప్రేమించాను. అసలు నువ్వు నిర్ణయాత్మకమే కాకపోతే – నిన్ను ఏం చూసి ప్రేమించానో, అదే అసత్యమని తేలితే – ఇంక నా ప్రేమకి, నమ్మకానికి ఆధారమే లేదు’ అని భావించాను. నేనే కాదు, జ్యోతిషం పట్ల గట్టిగా ఆకర్షితులైనవాళ్ళు ఎవరైనా సరే, జ్యోతిషం నిర్ణయాత్మకం కాదు అని నిరూపితమైతే అదే విధమైన సంఘర్షణకి గురి అవుతారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, చాలామంది ఎవరి నమ్మకాల్ని వాళ్ళు గట్టిగా పట్టుకుని, వాటికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాసరే, ఆ నమ్మకాలు దెబ్బతినకూడదని, కళ్ళు మూసుకుని కూర్చోడానికే ఇష్టపడతారు కానీ, నిజాయితీగా తమ నమ్మకాల్ని ప్రశ్నించుకోడానికి ఇష్టపడరు.