బడి పిల్లల అయోమయం

నామిని బడిపిల్లల కోసం ఒక పుస్తకం రాశారు. ఇందులో రచయిత సదుద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్పాలనే రచయిత తాపత్రయం. పొలాల్లో కష్టపడి పని చేయడం, తల్లితో కలిసి పనిచేయడం, వగైరా మంచి విషయాలన్నీ పిల్లలకి చెప్పాలనుకోవడం చాలా చాలా మంచి వుద్దేశ్యం. కానీ ఎంత మంచి వుద్దేశ్యం వున్నా, రచయితకి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపొతే, ఆ చెప్పే విషయాలు పొరపాటుగా వుంటాయి. పిల్లలకి నేర్పించే ముందర రచయిత కూడా నేర్చుకోవాలి కొన్ని మంచి విషయాలు.నామిని రాసిన బడిపిల్లల పుస్తకం, “మా అమ్మ చెప్పిన కతలు” (మొదటి ముద్రణ, ఏప్రిల్ 2002). ముందు మాటలో “ధైర్యంగా” ఈ పుస్తకం “బడిపిల్లల కోసం” అని చెప్పుకున్నారు రచయిత. అంటే ఎలిమెంటరీ స్కూలు పిల్లల కోసం అని అనుకోవచ్చు. ఒకటి నించీ అయిదో క్లాసు వరకూ చదివే పిల్లల కోసం. ఈ పుస్తకంలో రచయిత బడిపిల్లలకి చెప్పిన విషయాలు ఏమిటి?

  1. దేవుళ్ళూ, వాళ్ళ మహిమలూ
  2. చావులూ, చంపడాలూ
  3. బండతనం, లాజిక్ లేకపోవడం
  4. పిల్లలకి చెప్పకూడని విషయాలు చెప్పడం
  5. కొన్ని మంచి విషయాలు

ఈ పరిశీలన అంతా బడిపిల్లలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేశాను.

పిల్లలకి కష్టపడి జీవించాలని చెబుతూ, ఆ జీనవంలో వున్న ఆనందాన్ని వారికి తెలియచేసే కథలు చెబుతున్నపుడు, ఆ కథల్లో దేవుళ్ళ మహిమల గురించి చెప్పచ్చా? అలా చెప్తే “పుట్టపర్తి సాయిబాబా” మహిమల పుస్తకాలకీ, ఇటువంటి మంచి పుస్తకాలకీ తేడా ఏముంటుంది?”కాకమ్మ-చీమమ్మ” అనే కథలో చీమమ్మ కష్టజీవి. కాకమ్మ అన్యాయం చేస్తే, దేవుళ్ళొచ్చి చీమమ్మకి వరాల రూపంలో బోలెడు డబ్బిచ్చి, కాకమ్మని శిక్షిస్తారు. చీమమ్మ జాలితో కాకమ్మని చేరదీసి, ఇంత తిండి పెడుతుంది.ఒక బళ్ళో రకరకాల మతాలకి చెందిన పిల్లలుంటారు. వారికి పార్వతీ, పరమేశ్వరుల మహిమ గురించి కథలో చెప్పడం అంటే ఏదో ఒక మతం గురించి మాత్రమే మాట్లాడ్డం అన్నమాట. “చీమ ఏమి, కంటికి కడవడు నీళ్ళు కార్చడం ఏమి’ తెలుసుకుందామని ఆకాశమార్గాన పోతున్న పార్వతీ పరమేశ్వరులు రథాన్ని కిందికి దించినారు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 7).

“కాకమ్మ-చీమమ్మ” అన్న కథలో కాకమ్మ చీమమ్మకి అన్యాయం చేస్తే, “పార్వతమ్మ” వచ్చి వరాలిచ్చేస్తుంది.కాబట్టి పిల్లలూ, ఇకనించి మీ పక్క పిల్లో, పిల్లాడో మీకు అన్యాయం చేస్తే టీచరు దగ్గరకి న్యాయానికి పోకండేం! ఎంచక్కా ఆకాశమార్గాన దేవుళ్ళ కోసం ఎదురు చూడండి. వాళ్ళొచ్చి మీకు వరాలిచ్చేస్తారు.ఈ విధమైన దేవుళ్ళ మహిమలోనూ చూపించిందేమిటి? కష్టపడకుండా బోలెడు డబ్బు సంపాదించేయడం! అదీ వరాల రూపంలో! ఇంక పిల్లలకి కష్టపడటం అంటే ఇష్టం ఏం కలుగుతుందీ?ఇలా కాకుండా, చీమమ్మ ఎవరో పెద్ద మనిషికి కష్టం చెప్పుకున్నట్టూ, ఆ పెద్దమనిషి కాకమ్మని శిక్షించి, చీమమ్మకి న్యాయం చేసినట్టూ చూపిస్తే, పిల్లలకి ఎంతో నేర్పించినట్టుంటుంది.లేకపోతే కష్టపడ్డ వాళ్ళకి మనుషులు ఏమీ న్యాయం చేయలేరూ, దేవుళ్ళే (అదీ ఒక మతానికి మాత్రమే చెందిన దేవుళ్ళే) న్యాయం చేస్తారూ అని చెప్పినట్టవుతుంది. ఈ దేవుళ్ళ న్యాయం కూడా కష్టం కన్నా ఎన్నో రెట్లు డబ్బివ్వడం ద్వారా చెప్పడం లెండి.

“అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో ఒక “బాపన” బిక్షువు కొడుక్కి ఒకాయన అన్నం పెట్టి, పడుకోవడానికి చోటిచ్చి, జంతువు వాత పడి చనిపోయి, రాజు కొడుకుగా పుడ్తే, ఆ ఒకాయన భార్య ఏమీ సాయం చేయకుండా పంది పిల్లగా పుడుతుంది. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 10 నించి 13 వరకూ)మళ్ళీ మహిమలు! ఈ మహిమ కూడా ఎప్పుడు? జంతువు వాత పడి ఘోరంగా చచ్చిపోయేక! ఆ గొప్ప మహిమ కూడా ఏమిటి? రాజు కొడుకుగా పుట్టడం. రాజు కొడుకుగా పుట్టడం గొప్ప మహిమ అని పిల్లలెందుకు అనుకుంటారు? ఇలాంటి కథలన్నీ పిల్లలకి, “రాజు కొడుకుగా పుడితే పనులేం చేయక్కరలేదూ, బోలెడుమంది సేవకులుంటారూ” అని ఎప్పటి నించో నేర్పిస్తూ వుంటాయి.అన్నదానం చేసి, పడుకోవడానికి తన చోటిచ్చినందుకు ఆ మనిషికి ముందరగా దొరికిందేమిటి? ఘోరమైన చావు జంతువు వల్ల. ఇదీ పిల్లలు ఈ కథలో నేర్చుకోవలసిన మహిమ!నిజానికి “రాజుకొడుకు” కన్నా “పందిపిల్ల”కే సమాజంలో ఎంతో వుపయోగం!మళ్ళీ ఈ కథలో ఒక మతానికి చెందిన “బ్రహ్మదేముడు” కూడా వుంటాడు.

ఇంక “పాపిష్టి పిల్లి” అనే కథ చూడండి. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 41 నించి 44 వరకూ)ఈ కథలో, ఒక పిల్లి వాన వచ్చి, తన పిడకిల్లు కొట్టుకుపోతే, కొంగమ్మ ఇంట్లో చేరి, కొంగమ్మ గుడ్లు తినేస్తే, కొంగమ్మ మంత్రి దగ్గరకి న్యాయానికి వెళితే, ఆ మంత్రి పిల్లి చేత దేముడి మీద ప్రమాణాలు చేయించి, నీళ్ళలో దింపితే, ఆ దేముడి మహిమ వల్ల పిల్లి నీళ్ళలో మునిగి చచ్చిపోతుంది.”పాపిష్టి పిల్లి” అని కాకుండా “చెడ్డ పిల్లి” అని పేరు పెడితే కొంచెం బాగుండేది. పిల్లలకి పాపాలూ, పుణ్యాలూ, మహిమలూ నేర్పడం, వాటిమీద నమ్మకాలు పెంచడం ఈ కథలో విషయాలు.కొంగమ్మ తెలివిగా మనిషి న్యాయం చేస్తాడని మంత్రి దగ్గరకి వెడితే, ఆ మంత్రి మాత్రం మన రచయితలాగా, దేముడి సాయం తీసుకుని పిల్లిని శిక్షిస్తాడు.ఒక మతానికి చెందిన “గంగమ్మ” కూడా వచ్చేస్తుంది ఈ కథలో. “తేలించు గంగమ్మ తేలించు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 43)”దేముడంటే నాకెందుకు భయమూ, భక్తీ లేవు? నిద్ర పడక లేవగానే మొహాన బొట్టు పెట్టుకోందే నేను గడపే దిగను.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 42)ఒక మతానికి చెందిన బొట్టూ, ఆ నమ్మకాలూ!

“అవ్వ-పొటేలు” అన్న కథలో కూడా కష్టంలో వున్న పొటేలుకి, “దేముడా! నన్ను బద్రంగా మా అవ్వ దగ్గరకి చేర్చు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 47) అని ప్రార్థిస్తేనే గానీ ఒక వుపాయం దొరకలేదు.ఇంట్లో దేముడు, బళ్ళో దేముడు, వీధిలో దేముడు, కథల్లో దేముడు అంటే ఇదే మరి!ఇంక కష్ట పడటం గురించి ఎవరు వింటారు?అసలు బళ్ళో ఏ మతం గురించీ నేర్పించకూడదు.దేముడి విషయం గురించే మాట్లాడకూడదు.అవన్నీ ఇళ్ళలో పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి.బళ్ళో ఆస్తికుల పిల్లలే కాదు, నాస్తికుల పిల్లలు కూడా వుంటారు.కష్ట జీవనం గురించి పిల్లలకి నేర్పించే కథల్లో దేవుళ్ళూ, వాళ్ళ మహిమలూ వుండకూడదు.కష్ట జీవనం అనేది అన్ని మతాల పిల్లలకీ, నాస్తికుల పిల్లలకీ కూడా మంచిది.అలా వుండచ్చు అనుకుంటే, పాత చందమామలు తిరగేస్తే చాలు, ఇలాంటి కథలు ఎన్నో!ఇలాంటి కథలు పిల్లలకి చెప్పడానికి నామిని లాంటి మంచి రచయిత ఎందుకు?

చిన్న పిల్లలకి మంచి విషయాలు నేర్పించే కథల్లో చావులూ, చంపడాలూ వుండకూడదు. ఎంతో అవసరం అయినప్పుడు మాత్రం ఒక చావు గురించి ప్రస్తావించ వచ్చునేమో గానీ చంపడం గురించి మాత్రం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది మామూలు ఇంగితం.ఈ బడిపిల్లల కథల్లో ఎన్నెన్ని చావులో, ఎన్నెన్ని చంపడాలో!సినిమాల్లో హింస ఎక్కువైపోతోందని ఎన్నో కేకలేస్తాం గానీ, ఇలాంటి చిన్న పిల్లల పుస్తకాల్లో ఎంత హింసని తెలివి తక్కువగా చూపిస్తున్నామో అర్థం చేసుకోము.”అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో ఒక మంచి మనిషి ఒకబ్బాయికి అన్నం పెట్టి, పడుకోవడానికి చోటిచ్చి, జంతువు వాత పడి ఘోరంగా మరణిస్తాడు. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 12)

ఇంక “లొట్టిగాడు” అన్న కథ చూడండి. ఇది చదువుతున్నప్పుడు ఎంత దడుచుకున్నానో నేను.ఈ కథ గురించి మాట్లాడే ముందర ఒక సంగతి చెప్పాలి.అమెరికా వాళ్ళ టీవీలో “అమెరికాస్ ఫన్నీయెస్ట్ వీడియోస్”్ (అమెరికా వాళ్ళ సరదా పుట్టించే వీడియోలు) అనే ప్రోగ్రామ్ వస్తుంది. మామూలు మనుషులు వాళ్ళ పరగణాలో జరిగిన విషయాలు అనుకోకుండా వీడియో కెక్కించినపుడు, వాటిని టీవీ వాళ్ళకి పంపుతారు. ఆ వీడియోల నిండా మనుషులు జారి పడిపోవడాలూ, జంతువులు దెబ్బలు తగిలించుకోవడాలూ! అవతల వాడు కాలు జారి పడితే ఫక్కున నవ్వే మనస్తత్వం గల మనుషులే చుట్టూ. “అయ్యో” అనే వాళ్ళు తక్కువే. ఈ వీడియోలు చూసి, జనాలు “ఫన్నీగా వున్నాయంటూ” పకపకా నవ్వేస్తూ వుంటారు. ఇలా వుంటుంది వెకిలి హాస్యం.అలాగే కథల్లో కూడా సరదాగా మనుషులని చంపేయడం.”లొట్టిగాడు” కథలో “లొట్టిగాడు” అని అన్నందుకు లొట్టిగాడు ఇద్దరు పెళ్ళాల్నీ, ఒక ఎనుమునీ, ఒక కుక్కనీ చంపేసి, చివరకి నీళ్ళలోకి దూకి చచ్చిపోతాడు. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 21 నించి 24 వరకూ)

ఈ కథలో ఏం నీతి వుందో రాసిన వాళ్ళకే తెలియాలి.హింస అయితే విపరీతంగా వుంది.”లొట్టిగాడు కోపానికి పోయి చిన్న పెళ్ళాన్ని నరికేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 21)అంతేనా! ఒక్క నరుకుడేనా!?”లొట్టిగాడు కోపానికి పోయి పెద్ద పెళ్ళాన్ని కూడా నరికేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 22)అమ్మయ్య! రెండు నరుకుళ్ళయ్యాయి. కథ పాకాన పడింది.వుత్తినే నరికేసి, వదిలేస్తే ఏం బావుంటుందీ?”ఇద్దరి పెళ్ళాల్నీ నరికేసి పూడ్చి పెట్టినాడు గదా.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 22)ఇంచక్కా నరికేసాక ఏం చెయ్యాలో కూడా పిల్లలకి నేర్పించేశాం!ఇక్కడ “ఇద్దరి పెళ్ళాల్నీ” అని రాయడం నా అచ్చు తప్పు కాదు. అది రచయిత అచ్చు తప్పు. కోట్ చేస్తున్నానని ఎలా వున్నది అలాగే వుండనిచ్చాను.”ఎనుముకు గూడా మనం అలుసై పోయామా, అని చెప్పి ఎనుమును నరికేసి…….” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీ – 22)మనుషుల్నే వదల్లేదు, జంతువుల్ని వదులుతామా?”కుక్కకు కూడా మనం అలుసై పోయామా అని చెప్పి, ఆ కుక్కను పట్టుకుని పోయి బావిలో వేసేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 23)కొంచెం సంతోషం! కుక్కని నరకలేదు.చివరికి లొట్టిగాడు, “మునిగి పోయి చచ్చిపోయినాడూ.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 24)ఈ కథను బడిపిల్లలు ఎగురుకుంటూ చదువుకోవాలి.ఇన్ని నరకడాలున్న కథని పిల్లలకి కానుకగా ఇస్తున్నందుకు ఎంత సంతోషించాలో బాబూ!!

“డాం డాం డాం” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 29 నించి 32 వరకూ) అన్న కథ చూడండి. ఈ కథ సరదాగా మొదలవుతుంది. చిన్నప్పుడు విన్న కోతీ-ముల్లూ కథ ఇది. నవ్వుతూ చదువుతూ వుంటే, “దొమ్మరోళ్ళు ఆ పిల్లకు గెడెక్కేది నేర్పిస్తూ వుంటే కింద పడి చచ్చిపోతుంది.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 31).ప్రాణం వుసూరు మంటుంది చదవగానే.ఈ కథలో ఆ పిల్ల చచ్చిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అదీగాక చిన్నప్పుడు మేం నేర్చుకున్న కోతీ-ముల్లూ కథలో ఈ చావు లేదు.నామినికి చావులు అంటే చాలా మామూలు విషయం అయిపోయింది.చిన్న పిల్లల కథలో కావాలా, అక్కరలేదా అన్న ఆలోచన లేకుండా చావులు గుప్పించెయ్యడం!”పాపిష్టి పిల్లి” కథలో గూడా చెడ్డ పిల్లి చచ్చిపోతుంది లెండి.మంచి జంతువులకీ, మంచి మనుషులకే దిక్కు లేదు. ఇంక చెడ్డ జంతువులూ, చెడ్డ మనుషులూ చచ్చిపోతే ఏ పిల్లలు పట్టించుకుంటారు లెండి.

“అవ్వ-పొటేలు” కథలో పొటేలు అవ్వకి, “అప్పుడు నువ్వు నన్ను అమ్ముకుంటే దండిగా రూపాయలొస్తాయి. కోసుకుంటే దండిగా కూరవుతుంది.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 45) అని చెబుతుంది. అంతే గానీ, నేను ఎక్కువ బలం తెచ్చుకుని నీ పనుల్లో సాయంగా వుంటాను అని మాత్రం చెప్పదు. పిల్లల కథల్లో మాట్లాడే జంతువులని కోసుకుని కూరొండుకోవడం గురించి చెప్పకూడదని కూడా తెలియదు. మాట్లాడే పొటేలు పని చేస్తే తప్పా? అలా చెప్తే, “కోసుకోవడం” గురించి చెప్పలేము గదా! పిల్లలకి “కోసుకోవడాలూ”, “నరకడాలూ” నేర్పద్దూ మరి!కానీ ఈ చావులూ, చంపడాలూ పిల్లల కథల్లో వున్నాయన్న విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.అమెరికాలో రెండు, మూడు స్కూళ్ళలో జరిగిన సంఘటన ఇది. ఎలిమెంటరీ స్కూలు పిల్లలు తమ ఇళ్ళలోంచి తుపాకులు స్కూళ్ళకి తీసుకువచ్చి, తమని కించపరుస్తున తోటి పిల్లలనీ, అడ్డం వచ్చిన టీచర్లనీ కాల్చి చంపేశారు. ఈ సంఘటనలు జరిగినప్పటినించీ ఏ పిల్లాడన్నా కోపంగా “చంపేస్తాను” అని పక్క పిల్లాడినంటే చాలు, స్కూలు వాళ్ళు పోలీసుల్ని పిలిచేయడం, పెద్దాళ్ళని పిలిచేయడం, ఇళ్ళని తుపాకుల కోసం వెదకడం జరిగాయి కొన్నాళ్ళు.పిల్లలు హింస నేర్చుకుంటారంటే నేర్చుకోరూ ఇలా బండతనంగా!

పిల్లలకి కథలు చెప్పేటప్పుడు అవి చక్కగా, సాఫీగా సాగి పోయేటట్టు చెప్పాలి. ఆ కథల్లో చక్కటి తర్కం వుండాలి. కొన్ని, కొన్ని విషయాలు ఎగర కొట్టేయ కూడదు. కథలు పిల్లలకి సున్నితత్వం నేర్పాలి గానీ, బండతనం కాదు. కొన్ని పరిస్థితుల్లో ఒక కథలో ఒక పాత్ర సరిగా ప్రవర్తించకపోతే, దాన్ని ప్రశ్నించాలి పిల్లలు. ఏది ముఖ్యమో, ఏది కాదో అర్థం అయిపోతూ వుండాలి పిల్లలకి. మళ్ళీ ఇవన్నీ చిన్న, చిన్న విషయాల్లోనే. ఇటువంటి పద్ధతులు పాటించకపోతే, పిల్లలు ఆ కథలు చదివి బండతనం మాత్రమే నేర్చుకుంటారు. తర్కమనేదే వుండదు.

“అన్నదానంలో వున్న మహిమ” అనే కథ చూడండి. ఈ కథలో ఒక చిన్నవాడు అడవిలో పోతూ, ఒకాయన ఇంటికి వెళ్తాడు. ఆయన చిన్నవాడికి తిండి పెట్టి, మంచె మీద పడుకోవడానికి చోటిచ్చి, ఆ రాత్రి మంచె మీదనించి కింద పడి, జంతువు వాత పడి చచ్చిపోతాడు.అప్పుడు, “చిన్నవాడు నిద్ర లేచి, మంచె దిగి, మళ్ళీ అడవి మార్గం పట్టి పోయినాడు పోయినాడు పోయినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 12)ఎంత బండతనం! తనకి తిండి పెట్టి, పడుకోవడానికి తన చోటిచ్చినాయన చచ్చిపోతే, ఆ చిన్నవాడు మామూలుగా వెళ్ళిపోతాడా!ఈ కథ చెబితే, మూడో క్లాసు చదివే పిల్లలు, “అమ్మయ్య! ఆ మంచాయన పోతే పోయాడు గానీ మన చిన్నవాడు “బ్రహ్మదేముడి”ని పట్టుకుంటాడా, లేదా” అని తపించిపోతారు కదూ?కథలో చిన్నవాడు, ఆ మంచి మనిషి చచ్చిపోయినందుకు కొంతసేపు ఏడిచి, ముందుకు సాగిపోయాడు అని రాస్తే ఎంత చక్కగా వుంటుంది!ఒక పక్క చావులు. ఇంకో పక్క వాటిని చాలా మామూలుగా తీసేసుకుని ముందుకి సాగిపోవడం. ఎంత బాగా కర్తవ్య పాలన గురించి నేర్పిస్తుందో ఈ కథ.

“లొట్టిగాడు” అన్న కథ చూడండి. ఈ కథలో లొట్టిగాడు పొద్దున్న చద్దికూడు తీసుకు వచ్చిన చిన్న పెళ్ళాన్ని నరికేస్తే, ఏమీ జరగనట్లు పెద్ద పెళ్ళాం మధ్యాహ్నం సంగటి ఎత్తుకుపోతుంది. ఈ పెద్ద పెళ్ళానికి ఏమీ పట్టదు తన చెల్లెలి చావు గురించి.ఏమన్నా అంటే, ఇది చిన్న పిల్లల కథ కాబట్టి ఇందులో అన్ని వివరాలూ ఇవ్వం అంటారేమో!చావుల మీద చావులకి బాధ పడకపోవడం బండతనమైతే, ఆ చావులు గురించి మిగిలిన వాళ్ళు అడగలేదేమని అడగకపోవడం లాజిక్ లేకపోవడం.”పాపిష్టి పిల్లి” కథ చూడండి. పిల్లి పిడకలిల్లు వానకు కొట్టుకుని పోతే, కొంగ ఇంటికి వెళ్ళి, కొంగ గుడ్లు “పటక్ పటక్”్ మని కొరుక్కుతింటే, కొంగ ఏం తింటున్నావని అడుగుతుంది.”మా అత్తగారు నిన్ననే మురుకులు కాల్చి పంపించినారు. ఈ చలికి వాటిని నాలుగు తెచ్చుకుని కొరుక్కుతింటున్నాను కొంగమ్మా” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 41) అంటుంది పిల్లి.వానకి పొట్టుకుపోయిన ఇంట్లోంచి కరకలాడే మురుకులు తెచ్చుకుంది పిల్లి. ఆ విషయం కొంగమ్మ నమ్మేస్తుంది.ఈ కథ చదివిన పిల్లలు కూడా ఆ విషయం నమ్మేస్తారు అప్పటికి.పొలాల్లో పని చేస్తూ, పల్లెటూళ్ళలో వుండే లొట్టిగాడు నీళ్ళలో మునిగి చనిపోవడం ఏమిటీ, వాడికి ఈత రాదూ అన్న ప్రశ్న లాజికల్గా పిల్లలకి కలగకూడదు. మీరు పిల్లలు గదా! మేం చెప్పే కథలు నోరు మూసుకుని, సంతోషంగా వినాలంతే మరి! లాజికల్ ప్రశ్నలు అడగ్గూడదు.

కథలు చెప్పేటప్పుడు చిన్న పిల్లలకి కొన్ని విషయాలు చెప్పకూడదు. కొన్ని విషయాలు కొన్ని పద్ధతుల్లో చెప్పకూడదు. ఎంతసేపూ పిల్లలకి కథలు చెబుతున్నామన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.”తిండిగింజలు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 14)లో, “అమ్మ అలిగి పస్తు పడుకుంటే నాకు దుఃఖం వస్తుంది.” అని రచయిత నేర్పిస్తారు.అమ్మ అలగడం, పస్తు పడుకోవడం!ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పచ్చా?అలిగి తిండి మానేసేది తల్లైనా సరే, తండ్రైనా సరే, ఎవరూ జాలి చూపించకూడదు.అలిగి తిండి మానేయడం అనే బండ విషయం పిల్లలకి చెప్పకూడదు.ఇదే పేజీలో, “చక్కెర వ్యాధికి సంగటి ఎంతో మంచిది.” అని రచయిత చెప్తారు.అయిదో క్లాసు లోపల పిల్లలకి చక్కెర వ్యాధి గురించి చెప్పడం ఎందుకు? వాళ్ళకేం అర్థం అవుతుంది?

“అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో “ఒకూళ్ళో ఒక బాపనాయన.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 10) అంటూ కథ మొదలు పెడతారు రచయిత. ఆ తర్వాత ఈ కథలో “బాపనాయన” అన్న పదం ఇంకో నాలుగు సార్లు వాడతారు రచయిత. ఎందుకు ఈ కులాలకి సంబంధించిన పేర్లు పిల్లలకి చెప్పడం?”లొట్టిగాడు” అనే కథలో, “ఒకూళ్ళో ఒక లొట్టిగాడు. వాడికిద్దరు పెళ్ళాలు.” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీ – 21) అంటూ కథ మొదలవుతుంది.ఇద్దరు పెళ్ళాలూ, ముగ్గురు మొగుళ్ళూ లాంటి కథలు పిల్లలకి చెప్పచ్చా?”ఎవరు బలశాలి” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీలు – 33 నించి 36 వరకూ) కథలో ఒకావిడ, “ఆయన ముందే కోపగల్లోడు, నేను వేళకి ఆయనకి చద్దికూడు పెట్టాలి….” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 34) అంటుంది.ఎందుకంటే ఆ మొగుడు ఈవిడని కొడుతూ వుంటాడు. ఈ విషయం కూడా ఒక తప్పు విషయం గురించి చెప్పినట్లు చెప్పరు రచయిత. మరీ మామూలు విషయం, అంటే మొగుళ్ళనే వాళ్ళు పెళ్ళాలని కొడుతూ వుంటారనే విషయం, చాలా సీదా, సాదాగా చెప్తారు.”నిన్న రెండు దెబ్బలు కొట్టాం కదా, ఆ కోపంతో మన పెళ్ళాం మన మీదికి కొట్లాటకు వస్తా వుంది గదరా స్వామీ” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ 34) అని ఆవిడ మొగుడు అనుకుంటాడు.పిల్లలు ఈ విషయం చదివి ఏమనుకుంటారు?మొగుడు పెళ్ళాన్ని కొట్టడం మామూలు విషయమే అనుకుంటారు. అప్పుడప్పుడు పక్కింట్లో మొగుడు తన పెళ్ళాన్ని కొడుతూ వుంటాడు గదా! మగ పిల్లలయితే కొట్టడానికీ, ఆడపిల్లలయితే దెబ్బలు తినడానికీ చిన్నప్పడినించే తయారయి పోతూ వుంటారు ఇటువంటి కథల్తో.

“ఆలీ-మొగుడు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 37 నించి 39 వరకూ) కథలో పాడె గురించీ, స్మశానం గురించీ పిల్లలకి చెపుతారు రచయిత. ఎంత ముఖ్యమైన సహజ విజ్ణ్జానమో!”వూళ్ళో వాళ్ళు పాడె కట్టీనారు. ఆ ఆలీ మొగుణ్ణీ చెరొక పాడెమీద పెట్టి స్మశానానికి చేర్చినారు. రెండు గుంతలు తవ్వినారు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 38) అని రచయిత ఎంతో వివరంగా విజ్ణ్జానాన్ని పిల్లలకి సవినయంగా అందచేస్తారు.అంతా చేస్తే, ఈ కథలో ఏముందో పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా అర్థం కాదు. మొగుడూ, పెళ్ళాం రొట్టె కోసం కొట్టుకుంటూ వుంటారు కథంతా.పిల్లల కథల్లో చెడు ఎప్పుడూ ఓడిపోతూ వుండాలి.మంచి ఎప్పుడూ గెలుస్తూ వుండాలి.చెడ్డవాళ్ళు బుద్ది తెచ్చుకుని మంచిగా అయిపోతూ వుండాలి.ఇవీ పిల్లల కథల్లో వుండాల్సిన కనీస విషయాలు.”అమ్మకి జే జే” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 40) లో, “అప్పుడు మీ అమ్మ భలేగా నవ్వి మీ తలకాయి చుట్టూ చేతులు తిప్పి దిష్టి తగలకుండా మెటికలు విరుస్తుంది.” అని రచయిత పిల్లలకి తెలియజేస్తారు.ఎలిమెంటరీ స్కూలు పిల్లలకి దిష్టి గురించి చెప్పాలి!హైస్కూలు పిల్లలకి చేతబడి గురించి చెప్పాలి!కాలేజీ పిల్లలకి కాష్మోరా గురించి చెప్పాలి!విజ్ణ్జానం అనేది ఇలా అంచెలంచెలుగా సాగిపోతూ వుండాలి!

ఇంత విమర్శించాం గదా అని ఈ పుస్తకం చెత్త పుస్తకం అనుకోకూడదు.”గువ్వ చాతుర్యం” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు 15 నించి 19 వరకూ) చాలా అంటే చాలా బాగుండే కథ.”అబ్బోడు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 25 నించి 27 వరకూ) కథ చక్కగా వుంది.”పిల్ల చచ్చిపోవడం” అన్న సంగతి మార్చేస్తే, “డాం, డాం, డాం” కథ కూడా సరదాగా వుంది.”పార్వతీ పరమేశ్వరులూ”, “వరాలూ” అన్న విషయాలు మార్చేస్తే, “కాకమ్మ-చీమమ్మ” కూడా చక్కటి కథ.”మొగుడు పెళ్ళాన్ని కొట్టడం” అన్న విషయం మార్చేస్తే, “ఎవరు బలశాలి” అన్న కథ కూడా బాగుంటుంది.”కోసుకోవడం” అనే ముక్కని వదిలేస్తే “అవ్వ-పొటేలు” కథ కూడా బాగుంటుంది.ఈ కథలన్నింటినీ కొంచెమంటే కొంచెం మార్చి రాయచ్చు కూడా!కథలే కాకుండా, కథ చివరలో రచయిత ఎన్నో మంచి విషయాలు చెబుతారు పిల్లలకి. ఈ విషయాలు చదువుతూ వుంటే పిల్లలకే కాదు, పెద్దాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. ఈ విషయాలు పెద్దవాళ్ళు పిల్లలకి చక్కగా నేర్పించవచ్చును.బడి పిల్లల కోసం నామిని రాసిన మొదటి పుస్తకం ఇది. తప్పులుండటం సహజం. అవి దిద్దుకుంటే, పిల్లల కోసం ఇంకా అద్భుతమైన పుస్తకాలు రాయవచ్చు. లేకపోతే ఇది కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది.