పదచిత్రాలు

జోరుగా వర్షం పడుతుంటే
గొడుగున్న వాడి
ధైర్యం

చలికాలపు ఉదయం
ఒంటిమీద
చన్నీళ్ళు పడ్డప్పటి
ఉలికిపాటు

జారుడుబల్ల
కిందనుంచి పైకెక్కే
పసికాళ్ళలోని
పట్టుదల

పల్లెటూరిలో ట్రాక్టర్ వెనక
అలుపెరుగక పరుగెత్తే
చిరిగిన నిక్కర్ల
అమాయక ఆనందం

ఒక్కొక్కరికే ప్రశ్నాపత్రాలు
అందిపోతుంటే
ఆఖరి బెంచీలో పెరిగే
ఆతృత

ఎక్స్ ప్రెస్ రైలు
ఆగకుండా వెళ్ళిపోతే
మారుమూల ప్లాట్ ఫాం
నిర్లిప్తత

దురదేసినా గోక్కోలేని
గోరింటాకు చేతుల
నిస్సహాయత

గాయం మానాక
పొరలు పొరలుగా చిగురించే
కొత్త చర్మంలాంటి
ఆశ

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...