తిక్కనగారి భారతంలో ఒక పద్యం

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసన్ బట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబె మ్మెయిం కీచకా.

ఇది విరాటపర్వంలో, రెండోఆశ్వాసంలో యాభై అయిదో పద్యం. ఈ పద్యం కీచకుడి వెర్రివేషాలకి సమాధానంగా ద్రౌపది (సైరంధ్రి) ధిక్కరించి చెప్పిన మాటలు. ద్రౌపది ఇచ్చిన వార్నింగన్న మాట. కీచకుడు ద్రౌపదిని చూసి, ఆమెని మోహించి రమించకోరాడు. విరటుని భార్య సుధేష్ణకు సైరంధ్రి అంతఃపురపరిచారికగా వస్తుంది. ఒక ఏడాది పాటు, పంచపాండవులు, ద్రౌపదితో సహా అజ్ఞాతవాసం చేయవలసి వచ్చి, విరటుని కొలువులో పనికి కుదురుతారు. ధర్మజుడు, కంకు భట్టు గా, భీముడు వలలుడనే పేరుతో వంటవాడిగా, అర్జునుడు పేడి రూపాన బృహన్నల పేరుతో నాట్యాచార్యుడిగా, నకులుడు దామగ్రంథి పేరుతో అశ్వపాలకునిగా, సహదేవుడు తంత్రీపాలుడనే పేరుతో గోపాలకుడిగా తలదాచుకుంటున్న సమయం. సింహబలుడనే కీచకుడు సుదేష్ణ తమ్ముడు. విరటుని బావమరిది. మహాబలసంపన్నుడు. తగు పొగరుబోతు. విరటుడు వానిని కాదనలేడు. భయం. విరటునిభార్య, తమ్మునికి నీతి బోధ చేయగలదు. వాడికి ఎదురు చెప్పగల ధైర్యశాలి కాదు.

ఈ పద్యంగురించి రెండువిశేషాలు. మొదటిది, సైరంధ్రి తన భర్తలు ఎంత పరాక్రవంతులో హెచ్చరించడానికి ఎలామొదలుపెట్టిందో చూడండి. ‘దుర్వార ఉద్యమ బాహు విక్రమ రసా స్తోక ప్రతాప స్ఫుర గర్వాంధ’ ప్రతి వీరులని అవలీలగా ఎదిరించి ‘పచ్చడి’ చేయగల విద్యనేర్చిన ఐదుగురు రహస్య రూపాలలో వున్న గంధర్వులు, మహాపరాక్రమవంతులు, నా భర్తలు. నీకు మానభంగమేకాక, ప్రాణభంగముకూడా తప్పక కలుగుతాయిసుమా అని పరుష వాక్యాలు పలుకుతుంది, ద్రౌపది. దుష్టవిరోధుల బలాన్ని బోలెడు విశేషణాలతో ‘పొగిడి’, అంత ఘటికులనికూడా పిండి పిండి చెయ్యగల సమర్థులు నా భర్తలు. ఓరీ కీచకుడా అని సంబోధించి హెచ్చరించి ద్రౌపదిచేత ఈ మాటలు చెప్పించాడు తిక్కన గారు. అది మొదటి విశేషం.

సుదేష్ణ ఆజ్ఞ కాదనలేక ద్రౌపది కీచకుని భవంతికి కల్లు తీసికొనిపోవడం, వాడు ఆమెను బలాత్కరించపూనడం, తదుపరి తన భంగపాటు విరటుని కొలువులో ద్రౌపది చెప్పుకోవడం, కంకుభట్టు ఆమెను ‘ఇది ఉచితము’ కాదని వారించడం జరుగుతాయి. ద్రౌపది భీమసేనునితో తనకు కీచకునుని వలన జరిగిన పరాభవం చెప్పుకోవడానికి పోతుంది.

తను కీచకుడితో అన్నమాటలు భీమునితో తు చ తప్పకుండా, పైపద్యమే మళ్ళీ వల్లిస్తుంది, ‘దుర్వారోద్యమ … కీచకా’ అని. విరాట పర్వం లో ద్వితీయాశ్వాసంలో నూట డెబ్భై రెండవ పద్యం. ఇది విశేషంగా ఒప్పుకోకపోయినా, వింతగానే వున్నదని ఒప్ప్పుకోవాలి. సరిగ్గ అదే పద్యం తిక్కన గారు ఎందుకు తిరిగి రాశారు? ఉదాహరణకి, ఎవరైనా తన అనుభవమో పరాభవమో తిరిగి ఇంకొకరికి చెప్పవలసి వస్తే అలా అప్పచెప్ప గలుగుతామా? మాటలలోను, చెప్పే పద్ధతిలోనూ కాస్తన్నా మార్పు వుండటం సహజం. మరి తిక్కన గారికి ఇది తట్టలేదా? లేకపోతే ఆభాగం భారతం శిధిలమైతే మరో జక్కనగారు పూర్తిచేశారా? అలా అని సర్దుకోవడానికి ఎక్కడా ఆధారాలు లేవని పిస్తున్నది.

పోతే భీముడి బుద్ధిబలం తక్కువ, భుజబలం జాస్తి కదా! ఆ విషయం ద్రౌపదికి తెలుసు. అందుకని, ద్రౌపది చేత తిక్కన గారు అదే పద్యం వల్లింపజేశాడా? ఈ వ్యాఖ్యానం కొంచెం సబబు గానే కనిపిస్తున్నది.

జరిగిన విషయం తిరిగి చెప్పినచోట్లు చాలా ఉన్నాయి, భారతంలో. ఒక ఉదాహరణకి, శకుంతలోపాఖ్యానం చూడండి. అయితే మక్కీకి మక్కీ గా అప్ప చెప్పలేదు. ఏది ఏమయితేనేం? నాకు తెలిసినంతలో, భారతంలో ఇల్లా మక్కీకి మక్కీ రిపీట్ అయిన పద్యం లేదనే అనుకుంటున్నా. ఇది పరిశోధించవలసిన విషయమే. ఇదే ఏ హోమర్ లోనో, బియోవుల్ఫ్ లోనో, ఎలియట్లోనో వుంటే, ఈ పాటికి పా శ్చాత్య సాహిత్యంలో ఎంత గొడవ జరిగి ఉండేదో, ఎన్ని విమర్శా వ్యాసాలు వచ్చివుండేవో.