ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి”

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు 1952లో ప్రచురించిన ఖండకావ్య సంపుటిలో కుంతీకుమారి ఒక ఎనిమిది పేజీల ఖండిక. అదే పుస్తకంలో శాస్త్రిగారు ఊర్మిళాదేవి, అనసూయాదేవి వంటి పౌరాణిక పాత్రల గురించీ, కరుణామయి, కరుణమూర్తి మొదలైన ఊహాజనిత పాత్రల గురించీ అనేక పద్యాలు రాశారు. సాహిత్యరచనగా అది ఆ రోజుల్లో ఎంత గుర్తింపు పొందిందో తెలియదుగాని ఘంటసాల ద్వారా కుంతీకుమారికి ఎంతో పేరు వచ్చిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే దీన్నీ, పుష్పవిలాపం పద్యాలనీ ఘంటసాల స్వరపరిచి పాడారు. మూడూ మూడున్నర నిమిషాలు సాగే రెండు 78 ఆర్ .పి.ఎం. రికార్డ్ల్ లు గా కుంతీకుమారి 1953లో విడుదల అయింది. దీన్ని గురించి సంగీతరావుగారు కొన్ని విషయాలు తెలియజేశారు. శాస్త్రీయ సంగీత కచేరీల్లో పద్యాలు పాడడం ఆయన తండ్రిగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారే మొదలుపెట్టారట. కుంతీకుమారి పద్యాలను మొదట పాడినవారు మహావాది వెంకటప్పయ్యగారట. శాస్త్రిగారి శిష్యుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు ఆ పద్యాలను పాడబూనుకోవడంలో ఆశ్చర్యం లేదు. వాటికి సంగీతం సమకూర్చి తన శైలిలో అద్భుతంగా పాడారాయన.

సినీగాయకుడుగా ఖ్యాతి పొందిన ఘంటసాల ఇందులో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, ప్రయోక్తగా, నటుడిగా, శ్రవ్యకావ్యాన్ని దశ్యరూపకంలా మనకు వినిపించగల మేధావిగా అనిపిస్తాడు. సినిమాలకు సంబంధించని రికార్డ్ లఅమ్మకం అప్పటికి తగ్గుముఖం పట్టిందేమో తెలియదుకాని ఈ పాటలు మాత్రం ఎంతో జనాదరణ పొందాయి. కవి రాసిన పద్యాలను ఎడిట్ చేసి, రెండు రికార్డ్లలో పట్టేంత ప్రమాణానికి కుదించడం, తీసేసిన పద్యాల స్థానంలో భావం ఉట్టిపడేట్టు వ్యాఖ్యానం సమకూర్చడం వగైరా అంశాలు సంగీతానికి సంబంధించనివి. పాఠకులకు తెలియాలనే ఉదేశ్దంతో పాడని పద్యాలను కూడా ఈ వ్యాసంలో ఉదహరించాను. ఈ పద్యాల్లోని మంచి లక్షణాలన్నీ కళాకారుడుగా ఘంటసాల సంపూర్ణమైన సంస్కారానికీ, ఆయనకు అందివచ్చిన ఆధునిక సంప్రదాయానికీ తార్కాణాలు.

పద్యాలు పాడడంలో ఘంటసాల మొదలుపెట్టిన వినూత్న శైలిని గురించి చాలామంది రాశారు. తెలుగు స్టేజి నాటకాల్లో పార్సీ, ధార్వాడ నాటక కంపెనీల ప్రేరణతో మొదట్లో పాటలే ఉండేవట. పద్యాల నాటకాలు తరవాత వచ్చాయి. ఆ నాటకాల్లో పాత పద్ధతిలో నటనావేశం ప్రధానంగా పద్యాలు పాడే సంప్రదాయం ఉండేది. గొప్ప నటుడికి అంతో ఇంతో పాడడం వచ్చినా, మంచి గాయకుడికి కాస్తో కూస్తో నటన వచ్చినా సరిపోయిదేమో. బళ్ళారి రాఘవాచారిగారు నటనే ముఖ్యంగా పెద్దగా రాగం తియ్యకుండా పద్యాలు పాడేవారట. ఘంటసాల కేవలం గాయకుడు కనక సంగీతపరంగా సాహిత్యభావం ఉట్టిపడేట్టుగా పాడే పద్ధతి చేపట్టారు. ఇది సీతారామశాస్త్రిగారు నేర్పిన పద్ధతే. దీనికి తోడుగా శాస్త్రీయ రాగాలతో ఘంటసాలకు ఉండిన గాఢమైన పరిచయం, వాటిని సాహిత్యానికి ఎలా ప్రతిభావంతంగా వాడుకోవాలో తెలియడం, కొత్త రాగాలను ప్రవేశపెట్టి అవసరమైనప్పుడు వాటిచేత (శ్రీశ్రీ చెప్పినట్టు) “అందంగా చాకిరీ చేయించుకోవడం” ఆయనకు బాగా తెలుసు.

ఈ రికార్డుల్లో ఎక్కువగా వినబడేది హవాయియన్ గిటార్. ఇది వాయించినది శ్రీ సుబ్రహ్మణ్యరాజు. ఈ సందర్భంలో ఈయన గురించి కొంత చెప్పాలి. (ఈ వ్యాస రచయిత చాలా ఏళ్ళ క్రితం ఎస్.రాజేశ్వరరావుగారి దర్శకత్వంలో ఒక సినిమాపాట రికార్డింగ్ కు సితార్ వాయించినప్పుడు అందులో వీణ వాయించినది రాజుగారే). ఈయన గురించి సంగీతరావుగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాజు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనికి వీణ, హవాయియన్ గిటార్, సితార్, మేండొలిన్, మృదంగం వగైరా వాయిద్యాలన్నీ వచ్చు. ఆలత్తూర్ సోదరులవంటి కర్ణాటక విద్వాంసులకు ఈయన మృదంగ సహకారం అందించాడట. టంగుటూరు సూర్యకుమారి తదితరుల పాటలకు వీణ వాయించారు. విప్రనారాయణ సినిమా పూర్తి కాబోయే లోపలేతనకూ భానుమతికీ అభిప్రాయభేదా లొచ్చాయనీ, తను మానేసి వెళ్ళిపోయాక సుబ్రహ్మణ్య రాజే రీరికార్డింగ్ పని పూర్తి చేశాడనీ రాజేశ్వరరావుగారు నాతో అన్నారు. (సా విరహే తవదీనా పాట మొదటినుంచీ అతని హవాయియన్ గిటా. మనని అలరిస్తుంది). కుంతీకుమారి పద్యాలన్నిటిలోనూ రాజు వాద్య నైపుణ్యం వినిపిస్తూనే ఉంటుంది.

కుంతీకుమారిలో మొదటి పద్యం ఖమాస్ రాగంలోనిది. తక్కిన పద్యాలన్నిటిలోలాగే రాగం, మాటలూ చెట్టాపట్టాలేసుకుని నడుస్తాయి.

అది రమణీయ పుష్పవన – మా వనమందొక మేడ మేడపై నదియొక
మారుమూల గది – ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక – పోలిక రాచపిల్ల – జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్.

ఈ పద్యాన్ని ఘంటసాల “అదియొక రమణీయ” అనే ఎత్తుగడతో పాడారు. దానివల్ల చంపకమాలకు ఛందోభంగం జరిగింది కాని భావమే ప్రధానం కనక దానికి కవిగారు అంగీకరించారట. అలాగే చివరకు “మెట్లమీదుగా” అని ముగించారు. ఎందుకంటే దీర్ఘాక్షరం మీద ఆలాపన అందంగా ఉంటుంది. దీని తరవాత కవి రాయని వచనం చేర్చారు (“ఆ అమ్మాయి ఇటువైపే వస్తున్నది…ఆమె కీ నదివద్ద ఏం పనో?”).

దీని తరవాతిది మాండ్ రాగం ఛాయలతో (అప్పుడప్పుడూ ప్రతిమధ్యమం తగులుతూ) నడుస్తుంది. రాగాల విషయంలో ఘంటసాల మరీ చాదస్తాలకు పోలేదు.

కన్నియలాగె వాలకము కంపడుచున్నది -కాదుకాదు- ఆ
చిన్నిగులాబి లేత అరచేతులలో పసిబిడ్డ డున్నయ
ట్లున్నది . ఏమి కావలయునోగద ఆమెకు- అచ్చుగ్రుద్ది న
ట్లున్నవి రూపురేఖ- లెవరో యనరా దత డామె బిడ్డయె.

శ్రోతలకు తోడ్పడేందుకూ, నాటకీయతకూ అవసరం అనిపించినప్పుడల్లా పాడబోయి పద్యానికి రెఫర్ చేస్తూ చేర్పులు చేశారు (“ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా?”). తరవాతి పద్యం ఘంటసాల మార్కు హిందోళంలో సాగుతుంది. ఈ రాగంలో ఎప్పుడు కంపోజ్ చేసినా ఆయన పంచమం వాడకుండా విడిచిపెట్టలేదు (హిందోళం స్వరాలు సగమధనిస, సనిధమగస). రామకథను వినరయ్యా, అందమె ఆనందం, కలనైనా – ఇలా ఏ పాటలో విన్నా పంచమం వినబడుతుంది.

దొరలు నానంద బాష్పాలో – పొరలు దుఃఖ బాష్పములొగాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద.

దీని తరవాతి ఈ పద్యం పాడలేదు.

పొత్తులలోని బిడ్డనికి పుట్టియుపుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుంగవచకుండలముల్ గయిసేసినారు! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యేచ్చటి కేగుచున్నదో.

అది పుట్టినవాడు కర్ణుడని తెలుపుతోంది. కథ ప్రకారం అది ప్రస్తావించడం సబబేకాని ఘంటసాల వెర్షన్లో ముఖ్యపాత్ర కుంతీకుమారి. పుట్టినవాడు ఎటువంటివాడవబోతాడో తల్లిగా ఆమెకు అప్పటికి తెలియదు, అనవసరం కూడా. మొత్తం మీద ఇది మహాభారతంలోని ఒక ఘట్టంగా కాకుండా బిడ్డకు దూరమౌతున్న ఒక తల్లి పడిన ఆవేదనగా మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ బాలిక ఎవరా అని మనం చూస్తున్నాం. ఘంటసా. సూత్రధారిగా చేసిన చిన్న కామెంట్ “ఓహో తెలిసింది”. బిలహరిలో పద్యం.

గాలితాకున జలతారు మేలిముసుగు జారె నొక్కింత – అదిగో చిన్నారిమోము!
పోల్చుకున్నాములే! కుంతిభోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీకుమారి.

మొదటి రికార్డు మొదటి పక్క ఇక్కడితో పూర్తవుతుంది. ఘంటసాల పాడని మరొక పద్యం దీని తరవాత కనబడుతుంది.

కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ ఆ తోట వెం
బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా . అల్లదే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంగూడా ని
యేన్యిడ. వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్.

1948 ప్రాంతాలలో ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ మద్రాసులో చేసిన గానకచేరిల ద్వారా ఘంటసాలకు అనేక హిందూస్తానీ రాగాలతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడిందంటారు. వాటిలో ఒకటి రాగేశ్రీ. కర్ణాటకంలోని నాటకురంజిలో పంచమం వదిలేస్తే రాగేశ్రీ అవుతుంది. అందమైన ఈ రాగంలో ఘంటసాల ఎంత ఘాటు ప్రేమయో, ఇది నా చెలి, అన్నానా భామిని మొదలైన పాటలు చేశారు. ఈ కింది పద్యంలో రాగం ఎక్కడా చెడకుండా మాటలను బట్టి ఆగుతూ, ముందుకు నడుస్తూ తన పూర్తి స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. ఇలా స్వరరచన చెయ్యడం సామాన్యులవల్ల అయిపనికాదు. మొదటి రికార్డు రెండో భాగంలోని మొదటి పద్యం ఇది.

“ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేం? కోరితినిబో ఆతండు రానేల? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచగ ననున్ జేపట్టగా నేల? ప
ట్టెనుబో పట్టి నొసంగనేల? అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్”.

ఈ తరవాతి పద్యాన్ని ఘంటసాల పాడలేదు.

“ఏ యె డ దాచుకొందు నిపు డీ పసిగందును? కన్నతండ్రి ” చీ
చీ” యనకుండునే? పరిహసింపరె బంధువు. లాత్మగౌరవ
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె. దైవయోగమున్
ద్రోయగరాదు . ఈ శిశువుతో నొడిగట్టితి లోకనిందకున్”.

దానికి బదులుగా “అయ్యో భగవానుడా!” అన్న ఒక్క ముక్క వినిపిస్తుంది. ఆ తరవాత మాయామాళవగౌళలోని ఈ పద్యం వింటాం.

“ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత కాల మీ మేను మోతు? గంగాభవాని
కలుషహారిణి – ఈ తల్లి కడుపులోన కలిసిపోయెద నా కన్నకడుపుతోడ”.

ఆ తరవాతి అయిదారు పద్యాలు ఈ విధంగా ఉన్నాయి. సమయాభావంవల్ల అవి పాడలేదు.

అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు కుంతి దిగినది నదిలోన- అంతలోన
పెట్టె గాబోలు పవన కంపిత తరంగ మాలికా డోలికల తేలితేలివచ్చు!
మందసము రాక గనెనేమొ – ముందు కిడిన యడుగు వెనుకకుబెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెరయ ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ.
దూరదూరాల ప్రాణబంధువు విధాన అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును తన ముద్దు పట్టి పొడవు చూచి తలయూచు మదినేమి తోచినదియొ.
“ఆత్మహత్యయు శిశుహత్య యనక గంగ పాలుగానున్న యీ దీనురాలిమీద
భువనబంధువునకే జాలి పుట్టెనేమొ పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు”.
“ఇట్టులున్నది కాబోలు నీశ్వరేచ్ఛ” యనుచు విభ్రాంతయై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె దరికి జని మెల్లమెల్లగా దరికి తెచ్చి –
ఒత్తుగా పూలగుత్తుల నెత్తుపెట్టి పైచెరగు చింపి మెత్తగా ప్రక్కపరచి –
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి – ఒత్తు కొనకుండ చేతితో నొత్తిచూచి –
ఎట్టకేలకు దడదడ కొట్టుకొనెడి గుండె బిగబట్టుకొని కళ్ళనిండజూచి –

ఇన్ని పద్యాలకు బదులుగా ఘంటసాల క్లుప్తంగా, భావస్ఫోరకంగా ఈ కింది వచనం చదివారు.
ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుముకొంటూ కుంతీకుమారి నదిలోకి దిగిపోతున్నది – ఇంతలో – నదీ తరంగాల్లో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకొని వచ్చింది. కుంతీకుమారి కన్నుల్లో ఆశాకణాలు మెరిశాయి. “ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్న”దని గుర్తించింది. ఆమె ఆత్మహత్యనుంచి విరమించుకొంది. పెట్టెనిండా ఒత్తుగా పూలగుత్తులు, చిగురుటాకులు పేర్చింది. మెత్తగా పక్క దిద్దితీర్చింది. ఒత్తుకోకుండా చేత్తో ఒత్తిచూచింది. ఎలాగో గుండెలు బిగబట్టుకొని, ఎలాగో గుండెలు బిగబట్టుకొని,

బాష్పముల సాము దడిసిన ప్రక్కమీద చిట్టిబాబును బజ్జుండబెట్టె తల్లి, బజ్జుండబెట్టె తల్లి.

దీనికి ముందు పద్యం మాయామాళవగౌళలో మధ్యమం మీద ఆగుతుంది. ఆ తరవాత లయ మొదలై హవాయియన్ గిటార్ మీద సంగీతం వినిపించి ఆగుతుంది. ఈ చివరి పంక్తులు కవి రాసినవే. ఎటొచ్చీ పాటలో “చిట్టిబాబును” అనకుండా “చిట్టితండ్రిని” అన్నారు. ఇక్కడితో మొదటి రికార్డు రెండో వైపు పూర్తయింది. తరవాతి ఈ రెండు పద్యాలూ పాటలో చోటుచేసుకోలేదు.

చిన్ని పెదవుల ముత్యాలు చింది పడగ కలకలమటంచు నవ్వునేగాని, కన్న
యమ్మ కష్టము తన యదష్టమ్ము కూడ నెరుగ డింతయు నా యమాయకపు బిడ్డ.
చెదరు హృదయము రాయి చేసికొని పెట్టె నలలలో త్రోయబోవును – వలపు నిలుప
లేక చెయిరాక – సుతు కౌగిలించి వెక్కివెక్కి యిడ్చును – కన్నీరు గ్రుక్కుకొనుచు –

రెండో రికార్డు మొదటి భాగం ఈ పద్యంతో మొదలౌతుంది. అంతకుముందు సినీ, లలిత సంగీతాల్లో అమృతవర్షిణి రాగాన్ని ఎంతమంది వాడారో తెలియదు. నాజూకుగా నడిచే ఈ పద్యం విన్నాక ఈ మధ్య వచ్చిన “ఆనతినీయరా” వంటి పాటలు కాస్త కర్కశంగా, మొరటుగా అనిపిస్తాయి.

“భోగభాగ్యాలతో తులదూగుచున్న కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు ఒక పట్టెడన్నమైన పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన”.

దీని తరవాతిది రికార్డులో లేదు.

న న్నతి పేర్మిమై గనెడి నా తల్లిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది – నేడు – బిడ్డ నిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి – యేమి సేతు కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్నివిధాల – కన్న కడుపన్నది కాంతల కింత తీపియే!

దీనికి బదులుగా ఘంటసాల “నా చిట్టిబాబూ” అని ఊరుకున్నారు. ఆ తరవాత శుభపంతువరాళి (హిందూస్తానీ తోడి) రాగంలో ఎత్తుకున్నారు.

పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి. యిక నీకును నాకు ఋణంబు తీరె. మీ
దెట్టులనున్నదో మన యదృష్టము. ఘోరము చేసినాను
నా పుట్టుక మాసిపోను. నినుబోలిన రత్నము నాకు దక్కునే!

దీని తరవాత ఘంటసాల “అయ్యో తండ్రీ” అని చేర్చారు. తరవాతి పద్యం 58వ మేళకర్త హేమావతి రాగంలోనిది. దీని అందం విని ఆస్వాదించడానికి రాగం పేరు తెలియనవసరం లేదుగాని ఘంటసాల “రేంజ్” ఎంతటిదో మనకు తెలుస్తుంది.

పున్నమ చందమామ సరిపోయె డి నీ వరహాల మోము నే
నెన్నటికైన చూతునె. మరే! దురదష్టము గప్పికొన్న నా
కన్నులకంత భాగ్యము కలుగునె? ఏ యమయైన ఇంత నీ
కన్నము పెట్టి ఆయువిడి నప్పటి మాటగదోయి నాయనా!

ఇక్కడ మరో రెండు పద్యాలు వదిలేశారు.

పాలబుగ్గల చిక్కదనాల తండ్రి! వాలుగన్నుల చక్కదనాల తండ్రి!
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి! కాలు చెయి రాని తండ్రి నా కన్నతండ్రి!
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి – చిన్ని నాన్నకు కన్నులు చేరెడేసి –
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి – చిట్టిబాబు మై నిగనిగల్ పెట్టెడేసి –

వీటికి బదులు ఘంటసాల తరవాతి పద్యానికి సంబోధనగా “తల్లీ గంగాభవానీ!” అన్నారు. తరవాత పిలూ రాగంలో గంభీరంగా మొదలై “సీం లెస్”గా సింధుభైరవిలోకి మారిన అద్భుతమైన పద్యం వింటాం.

బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచుచుంటి గంగాభవాని!
వీని నే తల్లి చేతిలోనైన బెట్టి మాట మన్నింపుమమ్మ! నమస్సులమ్మా! నమస్సులమ్మా.

దీనితో రెండో రికార్డు సగం పూర్తి అయి చివరివైపు మొదలౌతుంది. మొదటి పద్యానికి ప్రేరణ గుణ్ కలీ అనే హిందూస్తానీ రాగం. ఇది నిస్సందేహంగా గులాం అలీగారి చలవే. (ఇందులో పంచమం వదిలేస్తే ఈ మధ్య శ్రీ బాలమురళి సష్టించిన లవంగి రాగం అవుతుంది).

మరులు రేకెత్త బిడ్డను మరల మరల నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి, జోకొట్టె తల్లి.

ఇక్కడ ఘంటసాల కామెంట్ వింటాం. “ఆమె మాతృహదయం తటతట కొట్టుకుంటున్నది పాపం”.
ఇక్కడినుంచి చివరిదాకా పద్యాలన్నీ లలిత్ రాగంలో సాగుతాయి.

ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర మొండు బంగారు తండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు మూతిపై కట్టకడపటి ముద్దు నునిచి –
“నన్ను విడిపోవుచుండె మా నాన్న” యనుచు కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తముల తోడ కాంక్షలల్లాడు కనులు మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.

“నదీ తరంగాల్లో పెట్టె కొట్టుకొని పోతున్నది” అంటూ ఘంటసాల మనకు దశ్యాన్ని వర్ణిస్తారు.

ఏటి కెరటాలలో పెట్టె యిగుచుండ గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ములతో కుంతి చూచుచుండె.

ఇది ఆఖరు పద్యం. దీని తరవాత ఆర్కెస్ట్రా మోగుతూండగా ఘంటసాల “బాబూ, బాబూ, మా నాన్నా, నాన్నా” అంటూ వెక్కి ఏడవడం వినిపిస్తుంది. హవాయియన్ గిటార్, తక్కిన వాయిద్యాలూ అన్నీ క్రమంగా హెచ్చు మోతాదులో డ్రామా సష్టిస్తాయి. లయకూడా నది అలల్లాగే మనను ఊగిస్తుంది. అద్భుతమైన ఈ క్లైమాక్స్ కవి వర్ణించిన ఘట్టానికి తగిన ముగింపుగా అనిపిస్తుంది.

ఇటువంటి ఆడియో ప్రయోగాలు ఆ తరవాత ఘంటసాలే కాదు, మరెవరూ కూడా చెయ్యకపోవడానికి కారణం సినిమాల కమర్షియల్ ఒత్తిడే అయి ఉండాలి. ఇవి వింటూ “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న ధోరణిలో వాపోకుండా మనకున్న ఇలాంటి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నాలు చెయ్యాలి. ఘంటసాలవంటి ప్రతిభావంతులు శతాబ్దాని కొకరు పుట్టినా ఆశ్చర్యమే. ఎటొచ్చీ ఆర్థిక లాభాలతో సంబంధంలేని రూపకాలూ, స్టేజి ప్రోగ్రాములూ నిర్వహించేందుకు ఔత్సాహికులకు అవకాశాలున్నాయి. సినిమాపిచ్చి కాస్త మానుకుని వాటిని ప్రోత్సహించేందుకు ప్రయోక్తలు ముందుకు రావాలి.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...