[Reference to the original essay: The politics of Telugu Ramayanas: Colonialism, print culture, and literary movements, by Velcheru Narayana Rao in “Questioning Ramayanas, A South Asian Tradition” (pp. 159-185), Edited by Paula Richman, University of California Press, 2001]
1920లో “శంబుక వధ” నాటక ప్రచురణ ఎంతో అలజడి రేపింది[1]. దీని మూలకథ రామాయణంలో ఉన్నదే. ఐతే అప్పటివరకూ రాముడి గురించి భక్తిపూర్వకమైన కథలే చదివిన పాఠకులు ఇక్కడ ఆ కథని చెప్పిన తీరుకు విభ్రాంతులయ్యారు. ఈ నాటకకర్త త్రిపురనేని రామస్వామి చౌదరి (1887 1943). ఆయన్ను గురించి తర్వాత విపులంగా వివరిస్తాను. ఆయన చిత్రణ ప్రకారం శంబుకవధ అంటే ఆర్యులైన బ్రాహ్మణుల ప్రేరేపణతో రాముడు ద్రావిడుడైన శంబుకుణ్ణి హత్య చెయ్యటం. రామాయణకథ ఎరిగిన వారందరికీ శంబుకుడు పరిచితుడే. ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకే పరిమితమైనది తపశ్చర్య. అతను శూద్రుడై వుండీ వర్ణక్రమాన్ని అతిక్రమించి తపస్సు చేస్తాడు. ఈ అతిక్రమణకు పర్యవసానంగా ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతాడు. ఆ శవాన్ని రాముడి ముందుంచి ఆ బాలుని తండ్రి అతన్ని సంజాయిషీ అడుగుతాడు. రాజు కర్తవ్యం ధర్మరక్షణ. అతనా బాధ్యత సక్రమంగా నెరవేరిస్తే అతని రాజ్యంలో ఎవరికీ ఈతిబాధలుండవు. ఎవరికీ అకాలమృత్యువు రాదు ముఖ్యంగా బ్రాహ్మణులకి.
పొరపాటు తనదేనని ఒప్పుకుని రాముడు తన రాజ్యంలో ఎక్కడ ధర్మహాని జరిగిందో వెదకబోతాడు. బ్రాహ్మణధర్మం పాటిస్తున్న శంబుకుణ్ణి చూస్తాడు. శిక్షగా అతన్ని వధిస్తాడు. అలా ధర్మరక్షణ జరగటంతో బ్రాహ్మణ బాలుడు పునరుజ్జీవితుడౌతాడు.
కాని రామస్వామి చౌదరి గారి ప్రకారం శంబుకుడు తన ప్రాంతంలో మతకర్మలు నిర్వహించుకునే ద్రావిడుడు. సంఘంలో తమ ఉన్నతస్థానాన్ని పదిలంగా కాపాడుకునే వశిష్ఠాది ఆర్య,బ్రాహ్మణ మంత్రులకు అది కంటకంగా తయారై ధర్మచ్యుతి మిషతో అతన్ని చంపటానికి రాముణ్ణి ప్రేరేపిస్తారు. అతను చేస్తున్నది దేవతలకూ, విశ్వభ్రమణానికీ హానికరంగా చిత్రించటానికి అశ్వినీదేవతల్తో కుమ్మక్కై బ్రాహ్మణ బాలుడికి తాత్కాలిక మరణం కలిగిస్తారు. రాముడికి ఆ అమాయక శూద్రుణ్ణి చంపటం తప్ప వేరే దారి లేకుండా చేస్తారు.
సంప్రదాయ రామాయణ వాదుల్ని ఈ “విపరీత వ్యాఖ్యానం” ఎంతో కలవరపెట్టింది. ఉత్తర రామాయణంలోని ఈ ఉదంతం రామాయణ భక్తులకి ఎప్పుడూ కొరుకుడు పడలేదు[2]. ఎలాగోలా దాన్ని చూసీ చూడనట్లుగా దాటెయ్యటమే వాళ్ళ అభిమతం. ఒకవేళ తప్పనిసరిగా ఆ విషయం మాట్లాడవలసి వస్తే, అంగీకార యోగ్యాలైన ఎన్నో సమర్థనలు అందుబాటులో వున్నాయి కూడ. ఉదాహరణకు కాళిదాసు తన రఘువంశ కథనంలో ఈ ఉదంతానికి రాజార్హమైన ఉత్తమపురుష స్ఫూర్తి (హెరోయిక్ ఎలిగెన్స్) కల్పిస్తాడు ఈ కథనంలో కూడ రాముడు శంబుకుణ్ణి వధిస్తాడు; ఐతే రాజు చేతిలో మరణించాడు కనుక, తపోమార్గం కన్నా తేలిగ్గా అతనికి స్వర్లోకప్రాప్తి కలిగి అప్పటికప్పుడే స్వర్గానికి వెళ్తాడు[3]! ఎనిమిదో శతాబ్దపు అద్భుత నాటకకర్త భవభూతి కూడ తన ఉత్తర రామచరితమ్ లో ఈ విషయం ప్రస్తావిస్తాడు. రాముడి క్షమాగుణాన్ని, ధర్మగ్లాని చేసినా శంబుకుణ్ణి తీవ్రంగా శిక్షించటానికి అతను వెనకాడటాన్ని చిత్రిస్తాడీ నాటకకర్త. రాజధర్మం ముందు వ్యక్తిగత భావాలు, క్షమాగుణం బలికావలసి వచ్చే రాచరికం లోని దైన్యాన్ని చూపిస్తాడతను. భవభూతి కథనం ప్రకారం ఆ శూద్రుడికి అమృతత్వం సిద్ధిస్తుంది. తన కోసం అంత దూరం తరలివచ్చిన రాముడికి కృతజ్ఞతలు చెప్పి, అతనికి మిత్రుడౌతాడతను[4].
ఐతే, చౌదరి గారి దృష్టిలో శంబుక హత్యకు బ్రాహ్మణుల కుట్రే ఏకైక కారణం. ఆర్యుల అధికారం మీద తిరుగుబాటు వస్తుందని భయపడి ఆ ద్రావిడఋషిని చంపమని బ్రాహ్మణులు రాముడికి సలహా ఇస్తారు. ఎంతో కౌశలంతో తయారుచేసిన చౌదరి గారి కథనంలో శంబుకుడు ఒక సాంఘిక కార్యకర్త. ద్రావిడ జాతికి వేదమార్గానుగుణంగా మతకార్యాలు నిర్వహించుకునే హక్కు కోసం పోరాడతాడు. దోషాదోషాలు నిర్ధారణ కాకుండా ఆ తాపసిని శిక్షించటానికి రాముడు మొదట విముఖత చూపుతాడు. రాజపురోహితుడైన వశిష్టుడికి అది నచ్చదు. వెంటనే అతని శిరఃఖండన చెయ్యాలని పట్టుపడతాడు. రాముడు బ్రాహ్మణ పురోహితుల్తో వాదానికి శంబుకుణ్ణి ఆహ్వానిస్తాడు. ఐతే ఆ వాదం అపౌరుషేయాలైన వేదాల ఆధారంగా ఉండాలని, బ్రాహ్మణ ఋషులు రాసిన స్మృతుల మీద కాదని, అందుకు ఒప్పుకోని పక్షంలో తను వాదానికి రాలేనని తిరస్కరిస్తాడు శంబుకుడు. రాముడు శంబుకుణ్ణి దర్శించి అతని భావాలకు అనుకూలంగా స్పందిస్తాడు. శంబుకుడికి శుభం కలగాలని కోరుకుని తన రాజధానికి తిరిగివస్తాడు. కాని రాముని బలహీనతలు సామ్రాజ్య నాశనానికి దారితీస్తాయని తీవ్రంగా హెచ్చరిస్తాడు వశిష్టుడు. బ్రాహ్మణ క్షత్రియుల మధ్య వున్న అవినాభావ సంబంధమే యుగయుగాలుగా రాజ్యాల్ని నిలబెట్టిందని అతనికి తెలివిగా వివరిస్తాడు. ద్రావిడులు ఈ బ్రాహ్మణక్షత్రియ బంధాన్ని అస్థిరం చేసి భవిష్యత్తులో ఇద్దర్నీ నాశనం చేస్తారు కనుక రాజ్యక్షేమం కోసం రాముడు శంబుకుణ్ణి సంహరించాల్సిందేనని రాముణ్ణి నిష్కర్షగా హెచ్చరిస్తాడు వశిష్టుడు! రాముడు అంగీకరిస్తాడు కాని ఆ అమాయక ద్రావిడుణ్ణి చంపటానికి బాధపడతాడు. విషాద నిశ్చయంతో రాజధర్మంలో వ్యక్తిగత భావాలకు తావు లేదని, అందువల్లనే ఆ మధ్యనే తను నిర్దయతో అగ్నిపునీత సీతని కూడ కారడవుల్లోకి బహిష్కరించానని గుర్తు తెచ్చుకుంటాడు. దుఃఖంతోనే శంబుకుడి శిరచ్ఛేదం చేస్తాడు. శంబుకుడు జ్యోతిరూపంలో స్వర్గారోహణం చేస్తాడు.
రామాయణ కథనంలో తెలుగు ప్రజలు పెంచుకున్న నమ్మకానికి వ్యతిరేకంగా సాగింది చౌదరి గారి చిత్రణం. ఈ కథలో ఆర్య ద్రావిడ వర్గకలహాలు చూడబోవటం బ్రాహ్మణ పాఠకులకి వెగటుగా తోచింది. కట్టుకథని ప్రచారం చేస్తున్నాడని సంప్రదాయ పండితులు చౌదరి గారిని ఖండించారు. ఈ అసంప్రదాయ కథనం ఒక దశాబ్దం పాటు ఎంతో ప్రతిఘటనని ఎదుర్కొంది. కాని చౌదరి గారు వదిలిపెట్టలేదు. ఊరూరా తిరిగి తన వాదాన్ని ప్రచారం చేశాడు. క్రమంగా చౌదరి గారి మార్గానికి గుర్తింపు దొరికింది. ముఖ్యంగా విద్యాధికులైన అబ్రాహ్మణ పాఠకులు, బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తున్న అధునాతనులు అందుకు అనుకూలంగా స్పందించారు.
రచ్చబండల దగ్గర్నుంచి క్లబ్బులు, హోటళ్ళు, కోర్టుల బార్ గదులు, పత్రికలు, ఇంకా ముఖ్యంగా సాహితీ సమావేశాలు దీని గురించిన చర్చలకు తావులయ్యాయి. రామరాజ్యం వట్టి పేరేనా లేక రాముడు నిజంగానే ప్రజానుకూల పాలన చేశాడా? అతను చేసిన పనులన్నీ బ్రాహ్మణ తృప్తి కోసమేనా? తన ముక్తి కోసం శంబుకుడు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే అందులో తప్పేమిటి? అలాటి వ్యాపకాలు బ్రాహ్మణులకే సొంతంగా ఎందుకు రక్షింపబడాలి? రామాయణం అనేది పాఠకులందరికీ ముక్తినిచ్చే పవిత్ర గ్రంథమా లేకపోతే తక్కువ కులాల మీద తమ ఆధిపత్యం కొనసాగటానికి బ్రాహ్మణులు దాన్ని వక్రీకరించారా? రామాయణ కర్తృత్వాన్ని గురించి అన్నీ క్లిష్టమైన ప్రశ్నలే! విద్యావంతులు రెండు వర్గాలయారు సంప్రదాయ రామాయణార్థాన్ని సమర్థించే వారు, హేతువాద దృష్టితో చూడాలనే వారు.
ఆ తర్వాత యాభై ఏళ్ళ పాటు తెలుగు సాహితీకారులు సంప్రదాయ రామాయణ మార్గాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో రామాయణ వృత్తాంతాల్ని తిరగరాశారు. నాటకాలు, కవితలు, వ్యాసాలు, కావ్యాలు, కనీసం రెండు పూర్తి రామాయణాలు వచ్చాయి. వీటన్నిటినీ కలిపి “వ్యతిరేక రామాయణ” ధోరణి అనొచ్చు. ఈ ధోరణిలో రెండు ముఖ్యమైన అంతర్వాహినులున్నాయి. కొందరు ఏకైక మూలరామాయణం ఉన్నదని, అది వాల్మీకి కృతమని, బ్రాహ్మణ్యాన్ని సమర్థించటం దాని లక్ష్యమని, దాన్నే ప్రాంతీయ భాషా రచయితలు అనుసరించారని భావిస్తారు. ఇంకొందరు వాల్మీకి రామాయణంలోకి బ్రాహ్మణులు వాళ్ళకు అనుకూలమైన భాగాల్ని చొప్పించారని భావిస్తారు. మార్గాలేవైనా, ఈ రెండింటిలోను రామాయణ వ్యతిరేకత అంటే బ్రాహ్మణ్య వ్యతిరేకతే!
ఈ వ్యాసంలో ఈ బ్రాహ్మణ వ్యతిరేక ధోరణి గురించి వివరిస్తాను. రామాయణ కథలోని సత్యదార్శనికతని (క్లెయిమ్ టు ట్రూత్)పూర్వపక్షం చేయటానికి వీరు ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఒకటి, వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా ఒప్పుకోకపోవటం, రెండోది దానిలోని బ్రాహ్మణానుకూలతని సరిదిద్దటానికి ఆ కథను తిరగరాయటం. కాని ముందుగా ఇలాటి ఆలోచనా ప్రవాహానికి దారితీసిన చారిత్రక, సాంఘిక పరిస్థితుల్ని టూకీగా చూపుతాను.