గ్రేట్‌ రేమాన్‌ సర్కస్‌

బారకాస్‌ లో సర్కస్‌ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం బొట్టు పెట్టుకుని ఆఫీసుకెళిపోయేరు.కూరల సంచీ నాలుగు మడతలు చుట్టి జేబులో పడీసుకుని, ఆప్కో రుమాలు నెత్తి మీద వేసుకుని.వేసంగి శెలవులయిపోతునాయి పిల్లడ్ని సర్కస్‌ కి తీసుకెళ్ళరా? అని చిలక్కి చెప్పినట్టు చెపితేను.ఇంక సర్కస్‌ ఎత్తెస్తారనగా శనివారం నాడు వేగం ఆఫీసునుండొచ్చీసి  ఏఁవో..! మాం పెట్టీవో… ‘ అని హవాల్‌ చేస్తునారు.అమ్మ సినిమాకనుకున్నాది.గబ గబా పచ్చడి రుబ్బీసి అన్నాలు పెట్టీసింది. సినిమాకిటండీ? అంటే వక్క పొడి నములుకుంటూ ” ఓ..పావురమా…ఒహ్హోఁ…ఓ పావురమా…. ” అని పాడుకుంటూ వినపడ్నట్టు. ” ఇంట్లో రామయ్యా వీధిలో క్రిష్ణయ్యకా? ” అంటే వెరపేలే ఓ పావురమా ‘ అని ముక్కుతోటి. ” భవానీ పున్నఁవ నాగు టిక్కట్లు పంపించేడా… ” అంటే “తరుణ యవ్వనము పొంగి పొరలునా…ఓ.. ఒహ్హొఁ హ్హొఁ హొహ్హో… ” అని. అమ్మ ముక్కుతోటి  ‘ఓ’ మని పాడి వెక్కిరిస్తే టీవీయెస్‌ ఫిఫ్టీ మీద ఆ కాలటూ ఈ కాలిటూ మెట్టుమీద వేసి పచ్చ టిక్కట్లు ఊపుకుంటూ ‘వలపు కౌగిలిని ఓలలాడ రావే ఒహ్హొ హ్హోఁ….. ‘అని.

సర్కస్‌ టిక్కట్లూ….ఒహ్హొహ్హొ హ్హొహ్హో..
కరెంటాఫీసు వాళ్ళకీ… అహ్హ హహ్హం హా….
ముష్టి వెధవలు ఫ్రీ పేసులిచ్చేరో…ఓఁహో..పాఁసులోఁ….వోఁ….

అని పాడుతున్నారు.అమ్మకీ నాన్నకీ మధ్యన కూచుందాఁవనుకుంటే నువ్వు వెనక్కూచోరా అన్నారు.అమ్మ నాన్న భుజం మీద చెయ్యి వేసి కూచున్నాది.నేను అమ్మ మీదికి వాలిపోయి కరుచుక్కూచుంటే కాలేజీ డౌను దిగి ఆంజనేయస్వాం గుడి దాటుతునాఁవనగా చీకటి మూసీసి ఫెళ్ళుమని మెరుస్తునాది.అమ్మ జుట్టు నా మొహం మీదకి ఎగిరిపడుతూ వుంటే ‘ బావుందమ్మా ఈయన గారి పేసులు బావున్నాయి గాలీ వానా బావున్నాది ‘అని మురుసుకుపోయి పొంగిపోతునాది.

వెళ్ళీసరికి రాటల తోటి కట్టిన జాగాలన్నీ స్కూటర్లూ సైకిళ్ళూ పెట్టీసున్నాయి.ఉచ్చల గోడల చివార జాగా దొరికింది.పరిగెట్టి పరిగెట్టి లోపటికెళ్తే గేలరీ చివార్న సీట్లు దొరికేయి.గెడ సాని గులాబి రంగు చిన్న పొట్టి గౌనూ, నల్ల బాడీ, వెండి జుత్తులూవేసుకునొచ్చి ఈ రింగు ఆ చేతులోకీ ఆ రింగు ఈ చేతిలోకీ విసురుకుంటూ ఒంటి కాలిమీద తాడు మీద నిలబడితే మా నాన్న ఆప్కో రుమాలు నెత్తిమీంచి తీసి జేబులో పడీసుకుని రెండు చేతులా రెండు వేళ్ళూ నోట్లో పెట్టుకుని ‘కఁయ్యి ‘మని విజిల్స్‌ వేస్తునారు.మా అమ్మ చట్టమీద చెళ్ళు మని కొడితే పట్టించుకోకుండాను.ఒంటి చక్రం సైకిలు మీద మరుగుజ్జు వాడొచ్చి చెటాళ్‌ పటాల్‌ మని పెద్ద చప్పుళ్ళు అయ్యీలాగ గెడ సానిని కొడుతూ వుంటే బయట గాలికి గుడారాలు ఊగిపోతున్నాయి.మేం కూచున్న చోట బెంచీకి చివార రాటలు ఊగుతూ టెంటు కన్నాల్లోంచి రొజ్జ గాలి రయ్యి రయ్యిమని కొడుతూవుంటే ఇంకా సింహాల బోన్లేనా తేకుండానే గాలీ వానా పట్టుకున్నాది.” అటు తుంపర పడిపోతునాది నాన్నా అలాక్కాదు ఇలాగొచ్చీరా “అని అమ్మ తనకీ నాన్నకీ మధ్యన కూచోబెట్టుకున్నాది.తాడుయ్యాల మీద గెడసాన్లు ఊగడాలు మొదలుపెట్టేరు.అవతల సైడు టెంటు గోడ సగానికి ఊడిపోయి వాన్నీళ్ళు బొళ్ళుమని లోపలికొచ్చీసేయి.టెంటు స్థంభాలు ఊగిపోయి బార్లయిట్లు ఆరీ వెలిగీ ఆరిపోతూవుంటే ఎర్ర సూటు వేసుకున్నవాడొచ్చి ‘ఇవాళటికి సర్కస్సు కేన్సిల్‌ మళ్ళీ వొస్తే ఫ్రీగా చూపిస్తాఁవు ఇళ్ళకి వెళిపో ‘మన్నాడు.

సిరీస్‌ సెట్లు ఆరుకుంటూ వెలుక్కుంటూ ఊగిపోతున్నాయి. అంతమందీ తోసుకుంటూ బయిటికొచ్చెస్తూ వుంటే టెంటు అవతల వేపు సగం పడిపోయింది.నాన్న ఇవతలివేపుకి పరిగెడితే అమ్మ ” ఇంత గాలీ వాన లోనూ ఈ గుడ్డ గుడారం కింద మంచిది కాదండీ నాకుభయం వేస్తునాది “అన్నాది.”కరంటు తివ్వ మీద పడిపోయిందంటే పాలంకి వాళ్ళ పెళ్ళిలోలాగ…అయ్యొ చచ్చేం.. ” అని.” మొగుడు కరంటాఫీసూ! నీకు కరంటు తివ్వలంటేనూ!! వెరపేలే….ఒహ్హోఁ…ఓ పావురమా…? “అని మా అమ్మ చెయ్యి పట్టుకుని మా నాన్నా వెనకాల నేనూ ఆప్కో రుమాళ్ళు నెత్తిమీద వేసుకుని బళ్ళ దెగ్గిరికి పరిగెట్టేఁవు.అక్కడ మా టీవీయెస్‌ ఫిఫ్టీ చుట్టూ పెట్టిన స్కూటర్ల వాళ్ళు ఎవరూ లేరు.’బండి తియ్యడానికి లేదు దవ్వ ముక్కలాగ ధార తడిసిపోతాం లోపటికే పదవే ‘అని మళ్ళీ వెనక్కి పరిగెట్టేఁవు.టెంటు జీబూతంలాగ ఊగిపోతూ వుంటే అమ్మకి మళ్ళీ లోపటికెళ్ళడానికి ధైర్యం చాల్లేదు.” తడిసిందేదో తడిసేం బుర్రుమని ఓ నాలుగడుగుల్లాగెస్తే ఇల్లొచ్చెస్తుంది పదండీ.. “అన్నాది.’రారా ముగ్గరం తలో చెయ్యీ..ఉమ్మ్‌… ‘అని ఇటూ అటూ స్కూటర్లు పక్కకి తోసీసి మా బండికి జాగా చేసుకున్నాఁవు.షిర్డీ సాయీ స్టిక్కరు పెట్టిన బజాజ్‌ చేతక్‌ కింద పడిపోతే మళ్ళీ లేపీ వరుకూ ఒప్పుకున్నాది కాదు.బురదలో బండి లేపలేవు పడిపోతాఁవే అంటే ‘అపచారం… ‘అని.నాన్న స్కూటరు హేండిల్‌ పట్టుకుని సత్తువ కొద్దీ మీదకి లేపబోతే ఆయన్నెత్తిమీది ఆప్కో రుమాలు గాల్లోకి ఎగిరిపోయింది.కాలు జారిపోయి కింద పడిపోబోతే అమ్మ వెనకనుండి ‘అమ్మో నెమ్మది…జాగర్త… ‘అని జబ్బ పట్టుకుని లాగి నిలబెట్టింది.నేను పరిగేట్టి వెళ్ళి రుమాలు తెచ్చిస్తే ఆ తడి బురద రుమాలే నెత్తి మీద వేసుకుని గడ్డం కింద ముడి పెట్టుకున్నారు.

ముగ్గరం పితక్కా తడిసిపోయేఁవు.బారకాస్‌ ముందర డ్రైనేజీ స్లాబుల మీద బండి నిలబెట్టి మా నాన్న ఎక్సలేటరు రైజ్‌ చేస్తూవుంటే నేను కసితీరా కిక్కొడుతూ వుంటే ఎన్ని కిక్కులు కొట్టినా బండి స్టార్టు కాలేదు.ఒక సైకిలు వాడు బెల్లు కొట్టుకుంటూ వెనక్కి చూసుకుంటూ వెళ్తే ” కూచో చెప్తాను! నువ్వు కూచోవే చెప్తాను “అని కసిరేరు.అమ్మవెనక సీట్లోన కూర్చుని కుంకం ముక్కు పుడక మీంచి పాయలు పాయలుగా కారిపోతూవుంటే ” కార్బలేటరు మార్పించమన్నాడు భవానీ మార్పించలేదా..? “అంటే ” నువ్వు కూచోవే ఓ పావురమా! ” అని పాట ఆపకుండా కీ తిప్పి ఎక్సలేటరు రైజ్‌ చేస్తునారు.ఎన్ని కిక్కులు కొట్టినా స్టార్టవకపోతే ” చస్తున్న ఎలకలాగ కీసు కీసు మంటునాదే… “అని కీ తిప్పడం ఆపీసి ఉన్నట్టుండి పగలబడి నవ్వటాలకి దిగేరు.అమ్మ బొట్టంతా కారిపోయి జుట్టు పాయలు పాయలుగా భుజాలమీదికి అంటుకుపోయి నవ్వు మొహం పెట్టుకునే చలికివణికిపోతునాది.నాన్న ” బారకాసు గోడ నీడ నిండా ములిగితిమే ఇక నీకీ చలి ఏలే ఒహ్హో…. ఓ….పావురమా… “అని పాడుతూ వుంటే ” సర్కస్‌ లో బఫూను వెధవ నయం ఎప్పుడు నవ్వాలో ఎప్పుడేడవాలో తెలుసును… “అని వీప్మీద చెళ్ళుమని కొట్టి పక్కలు పుళ్ళయిపోయీలాగ నవ్వుతునాది.ఇట్నుంచోమాటూ అట్నుంచోమాటూ జల్లులు కొడుతూవుంటే నా బుర్ర దాని వొళ్ళోకి లాక్కుని చెంగు చుట్టూ కప్పీసి పక్కలు కదిలిపోయీలాగ నవ్వు పట్టుకోలేకుండా ” అమ్హ….హమ్మ….తడిసిపోతునాఁవండీ….మీ నవుతాలు మండిపోనూ మీ సర్కస్‌ మండా!ఏదీ….? తుప్పల్లో కూకున్నాడే గోంగూరకీ? “అంటే మానాన్న మెడ కోళ్ళు ఎగరేసుకుంటూ ” ఎహ్హెహ్హెహ్హే… “అని విరగబడి నవ్వుకుంటూ ‘తనికెళ్ళా సత్యమూ గోంగూరకి!వోడు తుప్పల్లో కూకున్నాడే గోంగూరకీ!! ‘అని లైటు చిప్పమీద డప్పులాగ కొట్టుకుంటూ వాన తగ్గీ వరుకూ పాడేరు.

మేం పెద్దవాళ్ళం అయిపోయేక పిటాపురం శేషు బావ పెళ్ళిలోన భోజనాలయిపోయేక మళ్ళీ గాలీ వానా వొచ్చి పందిళ్ళు ఊగిపోతూ ఉంటే అమ్మా నేనూ ‘ఏదీ ఓ పావురమా?! ‘అని ఎంత బతిమాలినా ” ఏమో ఏఁవి సర్కస్సు?నాకు జ్ఞాపకం లేదు! “అని మురిపించుకున్నారు గాని పాడేరుకాదు.