చాటుపద్య రూపకం

(ఈ రూపకాన్ని కె. వి. ఎస్‌. రామారావు, కొంపెల్ల భాస్కర్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న ఆటా2002 సందర్భంలో ప్రదర్శించారు. శ్రోతలకు ఎంతో నచ్చిన ఈ రూపకం “ఈమాట” పాఠకులకు కూడ వినోదాన్నిస్తుందని ఆశిస్తున్నాం)

(ముగ్గురు వ్యక్తులు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ వుంటారు.)

1ఆ వెళ్ళేది కేశవరావు కదూ! పాపం, ఎలాటివాడు ఎలా అయ్యాడు. ఏడాదిక్రితం వరకు ఎంత దర్జాగా ఉండేవాడు!

2అదేకదా మరి! కలనాటి ధనము లక్కర కలనాటికి దాచకమలగర్భుని వశమా?

1,2, 3నెలనడిమినాటి వెన్నెల, అలవడునే గాదెబోయ అమవసనిశికిన్‌

1ఏం చెప్పాడండీ మహాను భావుడు పెద్దన్నగారు!

2కానీ ఆ పద్యం నడక చూశారూ మొదటి సగమూ పంచకల్యాణి గుర్రంలాపరిగెత్తింది కాస్తా అక్కడనుంచి కుంటి నడకనడుస్తూ, పద్యం చివర అమవసనిశి వచ్చేసరికి నత్తనడకలోకి దిగిపోయింది!

3అందుకేగా మన రామలింగడు వెంటనే అన్నది ఎమితిని సెపితివి కపితము అని

1ఆ పద్యం ఎమితిని సెపితివి కపితము, బ్రమపడి వెరి పుచ్చకాయ

వడితిని సెపితో, ఉమెతః పువుదిని సెపితో, అమవసనిశి అన్నమాట అలసని

పెదనా అని కదూ!

2కానీ ఆ రెండు పద్యాల నడకలో తేడా గమనించారూ రామలింగడిపద్యం ఎక్కడా ఊపు తగ్గకుండా చివరిదాకా అదే జోరులో వెడుతుంది అమవసనిశిఅనేమాట దాన్లో కూడా ఉన్నా!

3ఇదొకటే కాదు శరసంధాన పద్యం సందర్భంలో కూడా ఇదే చూస్తాం

మనం!

1అలానా? ఆ విషయం నేను గమనించలేదు. పెద్దనగారి పద్యం

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులం గల్గి దు

ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌

నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీ సాటిగా

నరసింహక్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా !

అని కదా!

2అవును. ఐతే చివరిదాకా ఎలాగో బిగబట్టి అర్జునుడు, సింహం, భూమి,శివుడు వీళ్ళకున్న మంచి గుణాలనీ అవగుణాలనీ సరిగ్గా వరసలో వచ్చేట్టు చూసుకుని చెప్పేసరికి హమ్మయ్య ఎలాగోలా వొడ్డెక్కాననుకొని చివర్లో రాజకంఠీరవా అని ఓ పడికట్టు పదం పడేశాడు. దాంతో పప్పులో కాలూ వేశాడు.

3అదెలాగా?

1అప్పటిదాకా సింహంలో బిలప్రవేశం అనే అవగుణం వుందనీ దాన్ని దిద్దుకుంటేనే తప్ప అది రాయలవారికి సమానం కాదనీ చెప్పిన వాడు ఆయన్ని రాజకంఠీరవా అని సంబోధిిస్తే అదంతా ఉత్తుత్తినే అన్నట్టు కదా!

2అదేమాట అన్నాడు రామలింగడూను. దాంతో రాయలవారు ముచ్చటపడిపోయి రామలింగడిని కూడా ఒక పద్యం చెప్పమన్నాడు.అప్పుడు అతను చెప్పింది

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం

డల భేదంబొనరించి ఏగునెడ, తన్మధ్యంబునన్‌, హార కుం

డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో

గలగం బారుచునేగె, నీవయను శంకన్‌ కృష్ణరాయాధిపా!

3నిజం! నిజం! రెండు పద్యాలనీ పక్క పక్కనబెట్టి చూస్తే చక్కగా తెలుస్తుంది రెండో దాన్లో ఉన్న విశృంఖలత, నిర్భయత్వమూ మొదటిదాన్లో జంకు,తడబాటు.

1ఐతే ఒక మాట చెప్పుకోవాలి. పెద్దన గారి పద్యంలాటివి తరవాత చాలా వచ్చాయి. ఈ పద్యం మీరు వినే ఉంటారు! (అడిదం సూరకవి)

రాజు కళంక మూర్తి, రతిరాజు శరీరవిహీను, డంబికా

రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతర సీమవర్తి, వి

భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాలుడు రాజుకాని, ఈ

రాజుల్‌ రాజులే, పెనుతరాజులుకాక, ధరాతలంబునన్‌ !

2నిర్భయత్వం, విశృంఖలత వీటిగురించి మాట్లాడితే మాత్రం ముందుగా వేములవాడ భీమకవిని చెప్పుకోవాలి.

3ఆ మాట నేను ఒప్పుకోను. మిగిలినవాళ్ళెవరైనా గాని, శ్రీనాధుడి తరవాతనే. కాకపోతే ఎవరివల్లవుతుంది కాలాంతః స్ఫుర చ్చండికా పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌ అనటానికి?

1ఏదీ ఆ పద్యం? ఎప్పుడూ విన్నట్టు లేదే!

3అదేనండీ మంచి కవిత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తూ అంటాడు

హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫుర చ్చండికా

పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,

సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌

చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌అని!

1ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!

2బహుశః మనకున్న నిజమైన ఆశుకవి శ్రీనాధుడేనేమో! ఆయన పద్యాలు ముందుగా తయారుచేసుకొని చెప్పినట్లు గాక నేరుగా ఆయన మనసునుంచి భాషలోకి తర్జుమా ఐనట్లు కనిపి స్తాయి. ప్రౌఢదేవరాయలు దగ్గరకు వెళ్ళినప్పుడు, సరస్వతీ దేవిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన పద్యం విన్నారుకదా

జోటీ భారతి! ఆర్భటిన్‌ మెరయుమీ! చోద్యంబుగా నేను క

ర్ణాటాధీశ్వరు ప్రౌఢదేవ నృపతిన్‌ నాసీర ధాటీ చమూ

కోటీ ఘోటక ధట్టికాఖురపుటీ కుట్టాక సంఘట్టన

స్ఫోటీ ధూత ధరారజశ్చుళికితాంభోధిన్‌ ప్రశంసించెదన్‌

అని

3ఇప్పుడు భీమకవి గారి పద్యాలు చూడండి. వీటి ముందు ఎలా వెల వెలబోతాయో!

1అదీ నిజమే. ఉదాహరణకి ఆయన తన గురించి చెప్పుకున్న పద్యం

ఘనుడన్‌ వేములవాడ వంశజుడ దక్షారామ భీమేశ నం

దనుడన్‌ దివ్యవిషామృత ప్రకట నానాకావ్యధుర్యుండ భీ

మన నాపేరు వినంగ చెప్పితి తెలుంగాధీశ కస్తూరికా

ఘనసారాది సుగంధ వస్తువుల వేగందెచ్చి లాలింపురా

ఈ పద్యానికీ శ్రీనాధుడి జోటీ భారతీ పద్యానికీ ఎంత తేడా ఉందో గమనించండి!

2సరే! ఆ విషయం వదిలేద్దాం! శ్రీనాధుడి తరవాత మళ్ళీ అంత దృఢంగా, ఆకాశమంత ఆత్మ విశ్వాసంతో పద్యం చెప్పిన వాళ్ళలో రాయలవారే మేరుశృంగంలా కనిపిస్తారు నాకు. ఆముక్తమాల్యదలో ఆయన తనని గురించి చెప్పుకున్న ఒక్క పద్యం చాలు!

ఇది కర్ణాట ధరా ధృతిస్థిర భుజాహేవాక లభ్ధేభరా

డుదయోర్వీధర తత్పితృవ్య కృత నవ్యోపాయనోష్ణీష ర

త్న దృగంచత్పద కృష్ణరాయ వసుధాధ్యక్షోదితాముక్త మా

ల్యదనాశ్వాసము హృద్య పద్యముల నాద్యంబై మహిన్‌ పొల్పగున్‌

ఆ పదాలు చూడండి, వాటి వెనుకనున్న అకుంఠితమైన ఆత్మస్థైర్యం వినండి!

3బాగుంది. ఇక లేద్దాం!