రాజేశ్వరీదేవి: అసలు సంగతి

వంటిల్లూ అవసరమే మసిగుడ్డా అవసరమే
ఎవరి సొంత వంటిల్లు వారికి కావల్సిందే
సామూహిక వంటశాల కల కూలినపుడు
ఒక దశాబ్దానికి ఒదిగిన
ఒకానొక కాల్పనిక సిద్ధాంతపు క్రేజ్‌లో
వాస్తవం స్వప్నమవుతుంది

ఆ కాపురంలో ఆవకాయపచ్చడి
కలుపుతున్నవాళ్ళ వేళ్ళు
కళాత్మకంగా కలివిడిగా
మనోహరంగా కనిపిస్తున్నాయి
అలా చేతకానుందుకీ వేళ సిగ్గుపడి చస్తున్నాను
ఎవరైనా ఏ సిద్ధాంతమైనా
అనూచానంగా వస్తున్న చేదుమాత్రని
ఆ ఫళాన మింగుతుంటే
దాన్ని sugar coated pill గా చూపించటమెందుకు
ఆ వైశాఖ వసంత మధ్యాహ్నవేళా
కోయిల పాడటం మానేసింది
ఏమో మరి
ఎందుకో గానీ ఏదో bitterness ఎదలోతుల్లో
కన్నీరై ప్రవహిస్తూ ఉండి ఉంటుంది
ఎక్కడో మౌనంగా కూచొని
Discover your winter frame of mind
అనే అన్వేషణలో ఉన్నదేమో
ఏదీ లేకపోతే ఈ మధ్యాహ్నవేళా
ఒక్కసారైనా స్వరం సవరించుకుంటుంది
వసంతం మాట ఎత్తకు
మళ్ళీ కోకిలనై రాలేను అనుకుంటుందేమో
ఏదో నిర్వేదాన్ని మోస్తూ

వంటింటి నుంచే జీవితం ప్రారంభమైనప్పుడు
వంటింటినెలా వదిలేస్తాం
మనోద్వారాలను గెలిచే మార్గాలు
అక్కడినించే ఉన్నాయన్న
పెద్దలమాట ఉండనే ఉంది కదా
అదీ స్త్రీత్వపు మాయతెరగా కనిపించినా
అదే వాస్తవం

మిట్టమధ్యాహ్నపు తలుపులు వెయ్యలేదు
హోరున వేడిగాలి ఊపిరాడటం లేదు
తలుపులన్నీ వేసినా ఊపిరాడదు
ఎటు నుండి ఎటు తిరిగినా ఊపిరాడదు
స్వేచ్ఛ కావాలి ప్రేమ కావాలి
రెండూ కళాత్మక స్వప్నాలు
వాటివెంట పడటమంటే
ఎండమావులవెంట పడటమే
పెనుగాలికి బయటా ఊపిరాడదు
ఉక్కపోతకి లోపలా ఊపిరాడదు
రక్షణ ఒక్కటే need of the hour

‘ఏ నమూనాలోనూ లేనపుడు
ఏదో ఒక నమూనాలోకి
వెళ్ళాలనుకోవడం దేనికి కొత్తగా’

ఈ మాటల్లో ఏదో తాత్వికత కాక
వ్యంగ్యమే కనపడుతోంది
ఏదో రాచకొండ పాత్ర పరిభాషలో
మావాడు
“నీఇష్టం కృష్ణాపురం” అంటాదేవిఁటో
అలా అనిపిస్తోంది

ఇవాళ నాకంటూ సొంత వంటిల్లు
లేకపోవడం అవమానకరమే
అందుకే
మొన్నొకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది

నేను కవిత్వాన్ని చదివి
కరుడుకట్టాను కనుక బతికి ఉన్నాను.