పాఠాలూపీఠాలూ

“అమెరికా తెలుగు వాడి చదువుల గుడి మనబడి ,
ప్రవాసంలో చిన్నారుల భవిష్యత్తుకి అదే జీవనాడి..
అటువంటి సత్ప్రయత్నాలను సమర్ధించి చేయూత నివ్వండి,
మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టండి..

సాహితీ పీఠమూ, సరస్వతీ కటాక్షమూ కావాలంటే,
సదరు తెలుగు సంఘాలన్నీ ముందుగా సంఘటితం
కావాలండి..”

“అమెరికాలో తెలుగు భాషకు భవిష్యత్తు ఉందా” అన్న ప్రశ్నపై అనేకానేకతర్జన భర్జనలు జరగడం, అట్లాంటాలో నిర్వహించిన తొలి “అమెరికా తెలుగు సాహితీ సదస్సు” లో, “అమెరికాలో తెలుగు సాహిత్యపీఠ స్థాపన” విషయం ప్రతిపాదించ బడడం దాదాపుగా ఒకే కాలం లో జరిగాయి. పై రెండు విషయాలను విశ్లేషించడంఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

మొదటి ప్రశ్నకు సమాధానంగా ప్రతి తెలుగు వాడిలో, తెలుగు భాషంటేప్రేమ, అభిమానం, తెలుగు సంస్కృతిని పది కాలాల పాటు పరిరక్షించు కోవాలన్న తాపత్రయం ఉన్నంత కాలం, అమెరికా అయినా,అమలాపురం అయినా, “భవిష్యత్తు” భేషుగ్గానే ఉంటుందని చెప్ప వచ్చు. నేటి మన చర్యలు, మన ఆశలను నిలబెడతాయి,మన ఆశయాలను ప్రతిబింబిస్తాయి, రేపటి మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి కూడా.

ప్రవాసంలో అయినా, స్వవాసం లో అయినా, స్వంత పిల్లలతో మాటలాడడానికీ,కుటుంబ సభ్యులతో గడపడానికీ సమయం వెచ్చించలేని నాడు, అది తెలుగు భాష అయినా, తెలుగు సంస్కృతి అయినాఎంత కాలం నిలుస్తుంది ? మన తెలుగు భాష అంటే మనలో కొందరికి వున్న తక్కువ భావం పోవాలి, ఇద్దరు తెలుగు వారు కలిసినప్పుడుగౌరవ ప్రదంగా తెలుగులో మాట్లాడుకొనే చక్కని సంప్రదాయం మరచి పోకూడదు. పిల్లలతో వీలైనంత సమయాన్ని గడిపితే,మన విలువలనూ, మన ఉన్నత ఆశయాలనూ వారికి అందించే అవకాశం ఉంటుంది. మనం తెలుగులో ఎందుకు, ఎలా మాట్లాడాలో, మనభాషనూ, సంస్కృతినీ ఎందుకు, ఎలా పరిరక్షించుకోవాలో మనవారికి సూటిగా చెప్ప గలగాలి.

భాషా భేదం వలన, ఆచార వ్యవహారాల లో తేడాల వలన మన “రెండవతరం” పిల్లలు వారికి ఎదురవుతున్న “అనూహ్య పరిస్థితులకు” తట్టుకొనే గుండె ధైర్యాన్ని, తల్లి దండ్రులుగా, మంచి స్నేహితులుగా, మంచి భవిష్యత్తును కోరే శ్రేయోభిలాషులుగా మనం వారికి ఇవ్వ గలగాలి.వారికి బాసటగా నిలవ గలగాలి. మన ఆదర్శాలుపది కాలాల పాటు, పది తరాల పాటు నిలవాలంటే ముందుగా మన విలువలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనవంతుకృషి మనం చేసి తీరాలి.

అమెరికాలో చాలా ప్రదేశాలలో, కొందరు బాధ్యతగా పిల్లలకు తెలుగు నేర్పడంకోసం “మన బడి” వంటివి నడుపుతున్నారు. వారి కృషి ఎంతైనా అభినందనీయం. అయితే, పెద్దలు కూడా సిగ్గు, భేషజం లేకుండాతెలుగు ధారాళంగా, స్వఛ్ఛంగా మాట్లాడడం, వ్రాయడం నేర్చుకోవడానికి, ఒకరికొకరు నేర్పడానికీ ముందుకు రావాలి. “మన బడి”మన పిల్లలకే కాదు, మనకోసం కూడానన్న విషయాన్ని గ్రహించాలి. అవసరమైతే ముందు మనం నేర్చుకొని తదుపరి మన పిల్లలకునేర్పగలగాలి.

ఇటు వ్యక్తి స్థాయిలోనూ, కుటుంబ స్థాయి లోనూ విస్మరించ బడుతున్న ప్రాథమికకర్తవ్యాన్ని, ఏ స్థాయిలో ఎన్ని పీఠాలు స్థాపించినా అవి అణుమాత్రమయినా నెరవేర్చ లేవు. మన భాషను, మన సంస్కృతినీ పదికాలాల బాటు నిలుపుకోవాలంటే మౌలిక స్థాయిలో గట్టి నమ్మకం, గొప్ప కృషి అవసరం. అది ప్రతి వ్యక్తి నుండీ, ప్రతి ఇంటి నుండీ రావాలి.అది ప్రతి ఒక్కరి బాధ్యత.

ఇక సాహిత్య పీఠ స్థాపన విషయానికి వస్తే, ఆ ఆలోచన కొంత వరకూమంచిదే కానీ, తెలుగు వాళ్ళ గుండెల్లో పైన చెప్పిన తాపత్రయం లేనంత కాలం, ఎన్ని మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఎన్ని పీఠాలుస్థాపించినా తెలుగు తల్లికి మెరుగుల కంకణాలు, రవ్వల వడ్డాణాలూ తొడిగినట్లు కాదు కదా. అమెరికాలోనే కాదు, ప్రవాసం లోని ప్రతితెలుగు వారూ తమ పిల్లలకు తెలుగు నేర్పే ఉద్దేశ్యంలో దీక్షగా ఉంటే, వారే మొదటి గురువులు కాగలరు. వారి స్వంత గృహాలే సరస్వతీపీఠాలూ కాగలవు.

అంతే కాక, తెలుగు పీఠాల వంటివి, మనం ఔనన్నా, కాదన్నా, ముందుగా తెలుగువారి సమిష్టి సంఘీభావాన్ని ప్రతిబింబింప జేస్తాయి. అసలా విషయానికొస్తే, ఇప్పటికే అమెరికాలోని తెలుగు వారు జాతీయ,ప్రాంతీయ స్థాయిల్లో చాలా సంఘాలు స్థాపించారు. పలు విషయాలపై పెక్కు సంఘాలు ఒక్క తాటిపై సంఘటితం కాకుండా ఉన్నవిషయం జగద్విదితమే. మనలో మన మాట, ప్రవాసంలో తెలుగు వారి సంఖ్యా బలం అంతకంతకూ పెరుగుతూ వస్తోందికదా, భవిష్యత్తులో ఇక్కడి అవకాశాలను తీరికగా పంచుకోవడానికి గానీ, మన గుర్తింపును పెంపొందించుకోవడానికి గానీ,అసలు మన ఉనికిని గర్వంగా, సమిష్టిగా నిర్వచించడానికి గానీ మనమంతా కలిసి కట్టుగా ఏకాభిప్రాయంతో ఒక్క సంఘంగా ముందుకురాగలమన్న ఆశ మనకు ఉన్నదా ??

ముందుగా, మనం “ఇరువురు” కలిసిన చోట “మూడు” సంఘాలు పెట్టుకొనే సంస్కృతినుండి బయట పడితే, అసలు పని మొదలు పెట్టకుండానే అభిప్రాయ భేదాలు చెలరేగకుండా చూసుకొంటే, “సమస్య” రాజకీయంఅయ్యే ప్రమాదం ఉండదు. అప్పుడు, సున్నితమైన సమాధానం ప్రత్యక్షం కాగలదు. లేకపోతే, రేపు ఏ కొందరి కృషి వల్లనోసదరు సాహితీ పీఠానికి వలసిన వనరులు చేకూరినా, దానిని కొనసాగించడానికి వంద సంఘాలు ముందుకు వస్తాయి. లేక మరో”సరి క్రొత్త” సంఘం వెలుస్తుంది. చేసిన కృషి అంతా మన బలాబలాల ప్రదర్శన గానూ, బయటి వారికి నవ్వులాట గానూమిగిలి పోతుంది. మన ఉనికిని మనం సంఘటితంగా నిర్వచించుకోలేనంత కాలం, ఎన్ని సంఘాలైనా, పీఠాలైనా విజ్ఞత లేనివీరంగాలుగానే నిలిచి పోతాయి. అలా కాకూడదని మీలాగే, నేనూ ఆశ పడుతున్నాను.