నవంబర్ 2000

ఇది “ఈమాట” ద్వితీయ జన్మ దిన సంచిక! ఇందుకు కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు అభివందనచందనాలు, దివ్యదీపావళి శుభాకాంక్షలు!

“ఈమాట”కు రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక సారి వెనక్కు తిరిగి దీన్ని ఏ ఆశయాల్తో ప్రారంభించామో గుర్తుకు తెచ్చుకుని ఇప్పటికీ అవి అర్థవంతంగానే ఉన్నాయా లేక ప్రయాణదిశని మార్చాలా అని ఆలోచించాల్సిన అవసరం ఉందనుకుంటాను. అప్పుడు “ఈమాట” ఆశయాలు మూడు

మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించటం.
రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.

ఈ రెండేళ్ళ లోనూ ఈ ఆశయాల సాధనలో చాలావరకు కృతకృత్యులమయ్యామనే అనిపిస్తోంది. ఈ విషయంలో మీరు కూడ మీ అభిప్రాయాల్ని పంచుకుంటే బాగుంటుంది కాని “మౌనం మన సహజభూషణం” అని పూర్తిగా అర్థమయాక ఇది అభిలషణీయమే కాని ఆచరణీయం కాదని తేల్చుకున్నాం.

మార్పులూ చేర్పుల విషయానికి వస్తే, పత్రిక స్వరూపంలో చెయ్యవలసిన మార్పులు చాలా కనిపిస్తున్నయ్‌. అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటే చెయ్యాలని మా ప్రయత్నం.
ఉదాహరణకు, ఇప్పటి వరకు “ఈమాట”లో వచ్చిన కథలన్నిటిని నేరుగా చూడటానికి వీలుగా ఒక master directory ఈ సంచికలో ఇస్తున్నాం. వచ్చే సంచిక నుంచి అన్ని అంశాలకు, ఒక్కో రచయిత(త్రి) రచనలకు నేరుగా ఇదే సదుపాయం కలిగించబోతున్నాం.

పత్రిక స్వభావం, వస్తువైవిధ్యం, విషయగుణం మొదలైన రంగాల్లోనూ మార్పుల అవసరం ఉన్నది. ఐతే ఔత్సాహిక రచయిత్రు(త)ల సహకారాన్ని కోరటం తప్ప ఈ విషయంలో సంపాదక వర్గం అశక్తతని వ్యక్తం చెయ్యక తప్పటం లేదు. కొత్త శీర్షికలని నిర్వహించటానికి గాని, కొత్త ప్రక్రియలని చేపట్టటానికి గాని ఎవరైనా ఉత్సాహం చూపిస్తే వారిని ప్రోత్సహించటానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం.

మా ఈ ప్రయత్నం మీద నమ్మకం ఉంచి తమ రచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న రచయిత(త్రు)లకు మా కృతజ్ఞతలు. ఇంకా రచయితలు, రచయిత్రులు రావలసి ఉంది, రాయవలసి ఉంది. త్వరలోనే వస్తారని, రాస్తారని మా ఆకాంక్ష.

“ఈమాట” సంపాదకుల్లో ఒకరైన శ్రీ ద్వా. నా. శాస్త్రి గారి “విమర్శప్రస్థానం” రచనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే “ఏటుకూరి వెంకటనరసయ్య స్మారక పురస్కారా”న్ని ప్రకటించారు. శ్రీ శాస్త్రి గారికి మా అభినందనలు. ఈ పుస్తకం కావాలనుకున్న వారు శ్రీ శాస్త్రి గారికి పది డాలర్లు పంపితే వారు నేరుగా ఒక కాపీ పంపగలరు. వారి అడ్రస్‌ ఇది Dr. D. N. Sastry, Reader in Telugu, S.K.B.R. College, Amalapuram – 533 201, A.P.

కె. వి. ఎస్‌. రామారావు