అనగనగా ఒక జైలు…

“నీకు బుద్ధి లేదురా సీతారావుడూ! జైలుకెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే తిరిగొచ్చావ్‌ గదరా.” పాపారాయుడి కళ్ళలో నామీద అంతులేని జాలి.

ఆ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు డాక్టర్‌ శర్మ. ఎడంచేత్తో కళ్ళజోడు సర్దుకొని, నా వైపు సానుభూతిగా చూస్తూ అడిగాడు “నీ వయసెంత సీతారామారావ్‌?”

అతని ముందున్న ఎర్రఫైలులో నా వయస్సే కాదు, నా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం ఉండివుంటాయన్న నిజం నాకు తెలుసు. “నలభై ఆరేళ్ళు సార్‌.” నమ్రతగా జవాబిచ్చాను.

“ఛీ ఛీ! నీకసలు జ్ఞానం లేదురా… ఎర్రిబాగుల ఎదవ!” కటువుగా అన్నాడు జైలు అధికారి పాపారాయుడు మళ్ళీ. అతడి వైపు నిశ్చలంగా ఒక క్షణంపాటు చూసి తలదించుకున్నాను.
“అది వెర్రికాదు రాయుడుగారు ” కల్పించుకుంటూ అన్నాడు శర్మ. దయచేసి మధ్యలో జోక్యం చేసుకోవద్దు అన్న అభ్యర్ధన అతని గొంతులో లీలగా ధ్వనించింది. నావైపు చూస్తూ “బయిటి ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతకడం, నీకు ఎలా అనిపించింది?” మృదువుగా ప్రశ్నించాడు.

ఈ సైకాలజీ ప్రశ్నలంటే నాకు పరమచిరాకు. హాయిగా వెళ్ళి నా సెల్లో కూర్చుందామనీ, నా ప్రక్క సెల్‌ లోని సైదులుని, ఎదుటి సెల్లోని చెంద్రయ్యగాడినీ పలకరించాలని ఉంది. కానీ ఈ తతంగం మొత్తం పూర్తయ్యే దాకా ఆ అవకాశం లేదు.

“బాగానే వుంది సార్‌” అన్నాను అతని ప్రశ్నకు సమాధానంగా.
“అదికాదు. ఆ మనుషులూ ఆ హడావిడీ ఆ ట్రాఫిక్కూ అదీ, భయంగా అనిపించలేదూ?”
“ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా కొంచెం భయంగానే అనిపించింది సార్‌!”

శర్మ సంతృప్తిగా కళ్ళజోడు సర్దుకున్నాడు. “నువ్‌ జైల్లో మొత్తం మీద పన్నెండేళ్ళకు పైనే గడిపావ్‌ కదూ?” అన్నాడు ఈసారి తన ఎర్రఫైల్లోంచి చదువుతూ.

బోర్స్టల్‌ స్కూల్లో నాలుగేళ్ళు, చిల్లరమల్లర కేసుల్లో మరో నాలుగేళ్ళు, చివరిగా ఈ ఏడేళ్ళు “అవును సార్‌..”.
“ఎదవ! ఆడి జీవితంలో సగం జైల్లోనే గడిపాడు. ఆడి రైటింగు ఎప్పుడైనా చూసారా? ముత్యాల్లాటి అచ్చరాలు. కాస్తో కూస్తో టైపింగు కూడ చేతవును ఎదవకి. పోన్లేరా రావుడూ. మళ్ళీ హేపీగా నా పనులు చేసి పెడుదూ గాని.” అన్నాడు పాపారాయుడు మరింత జాలిగా చూస్తూ.
“అలాగే సార్‌!” అంటూ గొంతు సవరించుకొని, “నన్ను ఆ కార్పెంటరీ సెక్షన్‌ లో వెయ్యరుగదా సార్‌?” కాస్త భయంగానే అడిగాను.
నాకు రంపపు పొట్టు పడదు. ఆయాసం.

శర్మ మా సంభాషణను జాగ్రత్తగా వింటున్నాడు. మధ్య మధ్య చిరునవ్వుతో నా కేసి చూస్తున్నాడు. నా ప్రశ్న విన్న రాయుడు సాలోచనగా చుట్ట వెలిగించుకున్నాడు. కిటికీ లోంచి ఎండ ఏటవాలుగా అతనిపై పడుతోంది. ముఖానికి ఒకేవైపు పడుతోన్న ఆ వెలుతురు దట్టంగా ఒకదానినొకటి ఆనుకొని పెరిగిన కనుబొమలు గుబురు మీసాలు తీక్షణంగా నన్నే చూస్తున్న ఎర్రబడ్డ కళ్ళు ఏదో బ్లాక్‌ అండ్‌ వైటు హారర్‌ సినిమాలో విలన్‌ లా వుందతని ముఖం.చల్లటి భయం నా వెన్నెముక చివర్న మొదలై మెల్లగా పాములా పైకి పాకింది. ఒక్కసారిగా నా వళ్ళు జలదరించింది.

పాపారాయుడికి చాలా హై లెవెల్‌ లో పలుకుబడి ఉందని అందరూ చెప్పుకుంటూవుంటారు. అతని పై అధికారులు కూడా అతని విషయంలో చూసీ చూడనట్లు పోతారనీ, ఒక వేళ తెలియక ఎవరైనా జోక్యం చేసుకుంటే సదరు ఆఫీసర్‌ నక్సలైటు ఏరియాకు ట్రాన్స్‌ ఫర్‌ కాబడతాడనీ వదంతి. అతనికి నచ్చని ఖైదీల పరిస్థితి ఏమైందో నేను ప్రత్యక్షంగా చూసాను. రేపో మాపో అతనికి ఎం.పీ. సీటు కూడా వస్తుందన్న వార్త ప్రబలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పాపారాయుడితో శతృత్వం మహాప్రమాదం!

“నిన్ను చెక్కపనిలో పెట్టనులే భయపడబోక.” అన్నాడు రాయుడు నిదానంగా. “కొన్ని ఆఫీసు పనుల్లో నీ అవసరం పడొచ్చు. నిన్ను ఎప్పటిలానే పెర్సనల్‌ హెల్పర్‌ కింద ఏసుకుంటాలే.” అంటూ ప్రక్కనే ఉన్న చెత్తబుట్టలోకి ఖాండ్రించి ఉమ్మేసాడు. మీసాలు తుడుచుకొని, చుట్ట నోట్లో ఉంచి ఓ దీర్ఘమైన దమ్ములాగి ఆ పొగను నెమ్మదిగా గాల్లోకి ఊదాడు. అతని ముఖం ప్రసన్నంగా మారింది.

శర్మ చిరునవ్వుతూ నావైపు చూసి కళ్ళజోడు సర్దుకున్నాడు.
“అదిగాదు డాట్టరు గారూ, ఈ జైలుసిచ్చలు ఈళ్ళనేదో బాగు సేత్తాయంటారే. ఇట్టాటి ఎదవల్ని ఎన్నాళ్ళుంచినా బాగుపడరు. చూసారుగా మూడంటే మూడ్రోజులు. మళ్ళా తయారు. ఎదవ!”

శర్మ మళ్ళీ కళ్ళజోడు సర్దుకున్నాడు.  ఆయనకదో అలవాటులా వుంది! మాటిమాటికీ కళ్ళజోడు సర్దుకునే ఈ అలవాటుకి సైకాలజీ పరంగా అర్ధం ఏమిటో? కళ్ళజోడు సర్దుకునే కార్యక్రమం పూర్తయ్యాక రొటీన్‌ గా ఓ చిరునవ్వు నవ్వి “మీరు చెప్పింది నిజమే రాయుడుగారు ” అన్నాడు.ఈ సైకియాట్రిస్టులతో ఇదే తంటా. వీళ్ళు ఎప్పుడూ, ఎవరికీ, కోపం కలిగేలా మాట్లాడరు. అవతలివాడు చెప్పేది అమ్మనాబూతైనా సరే చిరునవ్వుతో “ఊఁ” కొడతారు. అలా అంటూనే తమ సోది తాము చెప్పుకుంటూపోతారు.

“మీరు చెప్పింది నిజమే రాయుడుగారు. కానీ మన సీతారామారావ్‌ విషయంలో కొన్ని కాంప్లెక్సిటీస్‌ వున్నాయ్‌.” అంటూ నావైపు చూసాడు శర్మ. అప్పుడు గమనించానతని కళ్ళని!ఆ కళ్ళలో ఏదో తపన, ఏదో జిజ్ఞాస, చూపుల్తోనే నన్ను చదివెయ్యాలనీ, నా ముఖం చూసి నా మనసులో ఏముందో పట్టెయ్యాలని ఏదో కసి!

వృత్తి పట్ల అతనికున్న సిన్సియారిటీ చూసి నాకతడి మీద గౌరవం కలిగింది. కొంచెం జాలి కూడా వేసింది.అలా శ్రద్ధగా నా ముఖం లోకే చూస్తూ నెమ్మదిగా పదం పదం విడదీసి పలుకుతూ అడిగాడు, “విడుదలై బైటికి వెళ్ళినప్పుడు నువ్‌ జైలుని మిస్సయ్యావా సీతారామారావ్‌” అని.
“ఆఁ..?” నాకతడి ప్రశ్న అర్ధం కానట్లు చూసాను.
“అంటే నీ తోటి ఖైదీలు, ఈ క్రమశిక్షణతో కూడిన డైలీ రొటీన్‌ ఈ వాతావరణం అదీ…?”
“మిస్‌ అవడం అంటే, మిస్‌ అవడం ఏమీ లేదు కానీ మళ్ళీ వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తానో కదా అని అనిపించింది.”

లాటరీలో వందకోట్లు తగిలినంతగా ఆనందపడ్డాడు శర్మ నా జవాబుకి. తన ముఖానికున్న కళ్ళజోడు తీసి దానిని సుతారంగా తుడుస్తూ
“చూసారా రాయుడుగారు! నా అనుమానం నిజమే. ఇటీజె రేర్‌ కేస్‌. ఇతనిదొక డిఫరెంట్‌ సైకలాజికల్‌ ప్రొఫైల్‌.” అంటూ ఉత్సాహంగా పాపారాయుడికి వివరించసాగాడు.

ఆ సైంటిఫిక్‌ సోది రాయుడికి ఎంతమాత్రం అర్ధం అవుతోందో నాకు తెలియదుగానీ నేను మాత్రం దానిని వినదలచుకోలేదు. నాకు హాయిగా వెళ్ళి నా సెల్లో పడుకుందామని ఉంది. నేనేదో బయిట బ్రతకలేక తిరిగి జైలుకొచ్చానని ఆ శర్మ తీర్మానం కాబోలు. అది నిజం కాదు.

నిజానికి ఆరు సుదీ… ర్ఘమైన సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వేచ్చ లభించిన క్షణాన ఈ జైలు లోకి తిరిగి అడుగుపెట్టాలన్న కోరిక నాలో అణుమాత్రం కూడా లేదు. కానీ అనుకున్నది జరగకపోవడమే జీవితం!

ఆ రోజు నన్ను పెరోల్‌ మీద విడుదల చేసిన రోజు.
జైలు నుంచి నిర్వికారంగా బయటికొచ్చాను. నన్ను ఆహ్వానించడానికీ నాకు స్వాగతం చెప్పడానికీ ఎవరూ రాలేదు. రారనీ నాకు తెలుసు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం నేరం జరిగిన మర్నాడే నేను పోలీసులకు దొరికిపోవడానికి కారణం… నా భార్య! నేను ఈ దోపిడీలు హత్యలూ మానుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నన్ను ఒప్పించి నేను పోలీసులకు లొంగిపొయ్యేలా చేసింది నాభార్య జానకి.

ఊహ తెలిసిన నాటినుంచీ నా అనే వాళ్ళు లేకుండా పెరిగిన నాకు జానకి అంటే ఆరో ప్రాణం. నా ఇరవైరెండేళ్ళ ఒంతరితనాన్ని తన తొలి నవ్వుతో అదృశ్యం చేసిన దేవత ఆమె. ఇంకాసేపట్లో ఆమెను చూడబోతున్నానని తల్చుకుంటేనే గుండెల్లో చాలా ఉద్వేగంగా ఉంది.నేను జైలుకి వెళ్ళిన నాటినుంచీ ప్రతి పదిహేనురోజులకూ నన్ను కలవడానికొచ్చే జానకి ఎందుకో మరి గత రెండు నెలలుగా రావడం మానేసింది. నాకై నేను పోలీసులకు లొంగిపోవడంతో పాత స్నేహితులు కూడా ముఖం చాటేసారు. దాంతో ఆమె ఎలా ఉందో వాకబు చేసే అవకాశం కూడా లేకపోయింది.

చొక్కా జేబులోంచి కాగితం ముక్కనొకదాన్ని బయటకు తీసాను.
చివరిసారి నన్ను కలవడానికి వచ్చినప్పుడు జానకి ఇచ్చిన మా ఇంటి అడ్రసు. ఇంటద్దె మళ్ళీ పెరగడంతో మా పాత ఇంటికి దగ్గరలోనే మరో చిన్నగదిలోకి మారుతున్నానని చెప్పింది ఆమె.అంబర్‌ పేట్‌ ఇక్కడికి కనీసం ఇరవై కిలోమీటర్లు. నాకెందుకో ఆటో కానీ, బస్‌ కానీ ఎక్కాలని అనిపించకపోవడంతో మెల్లగా నడవటం ప్రారంభించాను. పైగా ఎండ కూడా పెద్దగా లేదు.నేరస్తుల్ని జైలులో ఎందుకు ఉంచుతారో ఇప్పుడు అర్ధమవుతోంది నాకు. ప్రపంచానికి దూరంగా నాలుగ్గోడల మధ్య ఏ మార్పూ లేకుండా ఒంటరిగా క్షణం క్షణం లెఖ్కపెట్టుకుంటూ తాను విడుదలయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ చాలా బాధాకరమైన స్థితి!

మెల్లగా నడుస్తూ మారిన ఊరిని గమనించసాగాను. మనుషులూ వారి వేషవ్యవహారాలు బాగా మారిపోయాయి. ఎక్కడ చూసినా జనం, గుంపులు గుంపులుగా. అందరి ముఖాల్లో ఏదో ఆందోళన, ఏదో వేగం. అంతా కొత్తగానూ అయోమయంగాను అనిపిస్తోంది నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆరేళ్ళపాటు కోమాలో ఉండి అప్పుడే కళ్ళు తెరిచిన వాడి పరిస్థితీ నా స్థితీ ఒకటే!

అలాగే కలలో ఉన్నవాడిలా నడుస్తూ మూడు గంటల తరువాత ఇల్లు చేరాను. తలుపు తోసిన అలికిడికి లోపలినుంచి బయటికొచ్చిన జానకి నన్ను చూసి అక్కడే నిలబడిపోయింది జరుగుతున్నది కలో వాస్తవమో అర్ధం కాని దానిలా.
“జానకీ..!” అన్నాను కంపిస్తున్న కంఠంతో.
అంతే! ఒక్క ఊపున నా దగ్గరికొచ్చి నా చేతుల్లో ఒదిగిపోయింది. ఆమె కన్నీరు నా భుజం మీద వెచ్చగా సోకింది. సన్నగా వణుకుతున్న ఆమె శరీరాన్ని మరింతగా పొదివి పట్టుకున్నాను. నీటిపొర కమ్మిన నా కళ్ళకు ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. ఆనందంతో వచ్చిన దుఃఖంతో నా గొంతు పూడుకుపోయింది.
అప్పుడే… జానకి స్పృహతప్పి పడిపోయింది!

“అసలేం జరిగింది సీతారామారావ్‌?” అన్నాడు శర్మ.
“ఏం జరిగిందా. తాగుబోతు ఎదవ! పీకల్దాకా పూటుగా తాగేసి షాపు మొత్తం బద్దలు కొట్టేసాడు.” రాయుడు కోపంగా అన్నాడు.
“ఆ.. అవును సార్‌ అదే జరిగింది ” అన్నాను నేను వాస్తవంలోకి వస్తూ.

శర్మ నా కళ్ళలోకి సూటిగా చూసాడు. ఏదో గొప్ప విషయాన్ని బయటపెట్టబోతున్న ఉద్విగ్నత ఆ చూపులో ప్రస్ఫుటిస్తోంది. “బ్రాందీ షాపు అద్దాలు పగలగొట్టిన నువ్వు వెంటనే పారిపోకుండా పోలీసులు వచ్చేదాకా అంటే దాదాపు ఒక అరగంట పాటు అక్కడే ఎందుకు ఉండిపోయావ్‌?”
“అదీ… అంటే బాగా తాగేశానుగద సార్‌. ఏం జరుగుతోందో తెలియక అక్కడే కూర్చుండిపోయాను” చెబుతుంటేనే తెలిసిపోతోంది ఎంత సిల్లీ జవాబో.

పాపారాయుడు విసుగ్గా మూల్గాడు. చివరికంతా కాలిన చుట్టని కిటికీలోంచి అవతలికి విసిరేస్తూ “నువ్‌ జేసిన ఎదవ పని వల్ల నీ సిచ్చ మరో రెండేళ్ళు పెరిగింది తెలుసా?” అన్నాడు.
“పదహారు నెలలు సార్‌” అన్నాను నేను వినయంగా.
పెరోల్‌ నిబంధనలు నాకూ తెలుసు.
“సీతారామారావ్‌, నీ భార్య పేరు జానకి కదూ?” అన్నాడు శర్మ ఈసారి.
“అఁ.. అవును సార్‌!” మాట వణుకుతోంది! కంట్రోల్‌… కంట్రోల్‌!
“ప్రతినెలా నిన్ను చూడటానికి వచ్చే ఆమె గత రెండు మూడు మాసాలుగా రావడం మానేసింది కదూ?”
“అవును సార్‌!” స్థిరంగా జవాబిచ్చాను.
“కారణం?”
“ఆమె నన్ను వదిలేసింది సార్‌.” చెబుతుంటే గొంతులో ఏదో బరువుగా ఇబ్బందిగా ఉన్న భావన.

నా జవాబు విన్న రాయుడు వికటాట్టహాసం చేసాడు. శర్మ మాత్రం మౌనంగా తల పంకించాడు. చల్లటి చెమటచుక్క ఒకటి నా మెడ పైనుంచి వీపు మీదుగా క్రిందికి జారుతోంది, చాలా ఇబ్బంది కలిగిస్తూ. నేను కదల్లేదు. శర్మ మీది నుంచి నా చూపులు తప్పించలేదు. అతడూ నన్నే జాగ్రత్తగా గమనిస్తూ ప్రశ్నించసాగాడు
“నీకు బయిట వేరే స్నేహితులెవరూ లేరు కదూ?”
“ఊహూ.. లేరు సార్‌.”
“బంధువులు, దగ్గరివాళ్ళూ కూడా ఎవరూ లేరు. ఔనా?”
“ఔను సార్‌.”
“కాని ఈ జైలు లోపల మాత్రం నీకు చాలా మంది ఫ్రెండ్స్‌
అయ్యారు. ఏం?”
“కొంత మంది. అవును సార్‌.”
” జైలుకొచ్చిన కొత్తల్లో నువ్వేదో గొడవలో ఇరుక్కున్నావ్‌ కదూ ఒకసారి? ఏదో కత్తి అదీ.”
“ఏమో సార్‌, గుర్తుకు రావడంలేదు.”

రాయుడు బిగ్గరగా నవ్వాడు.
“నేను చెప్తా డాట్టరుగారు. నాలుగేళ్ళ మునుపటి మాట. ఓ రోజు సడెన్‌ ఇనిస్పెచ్చన్‌ జేసా. ఈ సీతారావుడి కాడ ఇంతపెద్ద కత్తోటి దొరికింది. ఎంటనే ఓ పదిరోజులపాటు ఈడిని సాలిటరీ సెల్లో ఏసి కుళ్ళబొడిసా.” అంటూ నావైపు నవ్వుతూ చూసి “ఇంతకీ ఆ కత్తితోటి ఏంజేద్దావనుకున్నావురా?” అని అడిగాడు.

ఆ కత్తితో హుసేనుగాడిని చంపాలనుకున్నాను. జానకిని గురించి వాడు చేసిన కామెంట్‌ నేను అంత సులభంగా క్షమించలేను. కానీ నేను సాలిటరీలో ఉన్నప్పుడు ఎవరో హుసేన్ని పైలోకానికి పంపి నా కష్టం తగ్గించారు.
“తెలీదు సార్‌, ఊరికే, ఆత్మరక్షణకోసం అనుకుంటా ఉంచుకున్నాను.” అన్నాను రాయుడితో.
శర్మ కళ్ళజోడు సర్దుకుంటూ రాయుడితో చెప్పసాగాడు “సీతారామారావ్‌ తిరిగి జైలుకి రావడం వెనుక వున్న కారణం,” అంటూ ఒక్క క్షణం జనాంతికంగా ఆపి మళ్ళీ కొనసాగించాడు.
“.. మీరు భావించినట్లుగా అతని నిర్లక్ష్యమో లేక అవివేకమో కాదు. ఈ జైలులోకి తిరిగి ప్రవేశించాలని అతను బలంగా కోరుకున్నాడు. ఆ బలమైన కోరికవల్లే తాగాడు, గొడవ చేసాడు, పోలీసులు వస్తారని తెలిసి తెలిసీ ఆ గొడవ చేసిన స్థలంలోనే ఉండిపోయాడు వాళ్ళు వచ్చే దాకా!”

పాపారాయుడు జవాబుగా నవ్వాడు.
“నిజం రాయుడుగారు! ఈ ఖైదీల విషయంలో ఇది అత్యంత సహజం. జీవితంలో ఎక్కువ కాలం ఈ జైలుగోడలమధ్యే గడపడం వల్ల జైలుతో వీళ్ళకొకలాంటి అనుబంధం ఏర్పడిపోతుంది. జైలంటే వీళ్ళకి కోపమే! కానీ బాహ్యప్రపంచంలోని కష్టాలను భరించలేక ఆ స్వేచ్ఛకన్నా జైలుజీవితమే హాయి అనే దశకు చేరుకుంటారు. అదొకలాంటి లవ్‌హేట్‌ రిలేషన్‌ షిప్‌. సైంటిఫిక్‌ పరిభాషలో దాన్ని “ఇన్‌స్టిస్య్టూషనలైజేషన్‌ ” అంటారు. అంటే బందీ మనస్తత్వానికి క్రమేణా అలవాటు పడి దానితో రాజీ పడిపోవడం అన్నమాట.”
“ఈ హరికతలు జెప్పమాకండి,” వ్యంగ్యంగా అన్నాడు రాయుడు. ” .. ఏ మనిసికయినా సరే, సొతంత్రతే ఇష్టం. ఇలా వుండు, ఇలా వుండమాక, ఇది తిను, ఇత్తినమాక, ఫలాన టైఁవుకల్లా పడుకోవాల, ఫలాని టైఁవుకల్లా లెగిసిపోవాల ఇట్టా ప్రెతీదానికీ రూల్సు పెడితే ఎవడికి మాత్రం నచ్చుద్ది? ఏరా సీతారావుడూ?”ఖైదీల మనస్తత్వాన్ని బాగానే అర్ధం చేసుకున్నాడు పాపారాయుడు. ఆ మాటకొస్తే బయట మాత్రం చాలా జీవితాలు అంతేగా. తమకు తామే బిగించుకున్న సంకెళ్ళతో జీవితాలు జైలుశిక్షల్లా వెళ్ళదీస్తున్న మూర్ఖులు ఎందరో!
“నిజమే సార్‌.” అన్నాను భక్తిగా.

శర్మకు పాపారాయుడి మాటలు నచ్చలేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. కానీ చాలా ఓర్మితో మాట్లాడుతున్నాడు. “స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అంటే అందరికీ ఇష్టమే రాయుడుగారు. కానీ, దానితో పాటు సంక్రమించే బాధ్యతల్నీ బాధల్నీ భరించే శక్తి అందరికీ వుండదు. ప్రత్యేకించి, ఒక క్రమబద్ధమైన బాధ్యతారాహిత్యానికి అలవాటుపడే ఈ ఖైదీలకు! జైలు జీవితం వాళ్ళని నిర్వీర్యం చేస్తుంది.”
“నిజమే సార్‌. ఈ ప్రపంచమే ఓ పెద్ద జైలు!” అన్నాను నేను ముక్తాయింపుగా.
“నేను మాట్లాడుతున్నది ఈ జైలు గురించి ” మొదటిసారిగా శర్మ గొంతులో విసుగు ధ్వనించింది.
“ఛా ఊరుకోండి శర్మగారు, ఖైదీలకు జేలు నచ్చడవేంది?” అన్నాడు రాయుడు వెకిలిగా. తన సిద్ధాంతాన్ని రాయుడు అలా అవహేళణ చేయడం శర్మకు ఎంతమాత్రం నచ్చలేదు.
“నేను చెప్పేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.” చాలా అసహనంగా అన్నాడు. “.. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. అన్ని వివరాలూ జాగ్రత్తగా విశ్లేషించిన తరువాతే నేనీ నిర్ధారణకు రావడం జరిగింది. ఇలాంటి వాటిమీద మేము చాలా ట్రైనింగు తీసుకుంటాం. పైగా, ఇలాటి కేసుల్లో నాకు చాలా అనుభవం వుంది.”
“అంటే? మాకేనా ఏ ట్రేనింగూ ఏ అనుభవవూఁ  లేంది?” పాపారాయుడి నవ్వు చెక్కుచెదరలేదు.

శర్మ మౌనం వహించాడు.
“అయినా ఖైదీలతో వ్యవహారం జెయ్యడానికి కావాల్సింది, ట్రేనింగు కాదు గుండె ధైర్యం. అంతెందుకు, పదేళ్ళబట్టీ ఈ జేల్లో పని జేస్తున్నా. ఇన్ని అధికారాలు ఇంత సొతంత్రతా వున్న నాకే ఈ జేలంటే విరక్తిగా వుంటే మరి ఖైదీలకెలాగుంటది?” సూటిగా అడిగాడు రాయుడు.
“నా పాయింటు మీకింకా అర్ధం కాలేదు ” నిరాశగా అన్నాడు శర్మ.

మొదలు విరిగిన పూలకొమ్మలా బలహీనంగా నా చేతుల్లో వాలిపోయిన జానకిని చూడగానే నాకు ఏడుపొచ్చింది. ఈ రెండు నెలల్లోనే బాగా తగ్గిపోయింది ఆమె. పచ్చగా ఆరోగ్యంగా ఉండే ఆమె శరీరం ఎముకలగూడులా తయారయ్యింది.

ఇదంతా నావల్లే… అని అనుకోగానే నా నోరంతా చేదుగా అయ్యింది. కళ్ళలోంచి బయటకురాలేని దుఃఖం గొంతుకు అడ్డంగా ఘనీభవించిపోయింది. అటూ ఇటూ కలియజూశాను. ఓ మూలగా కనిపించింది నీళ్ళబిందె. చేతిలోకి కాసిన్ని నీళ్ళు తీసుకొని ఆమె ముఖం మీద చిలుకరించాను. మెల్లగా కళ్ళు తెరిచింది జానకి. ఏడుపు బిగబట్టి వున్న నా ముఖం చూడగానే నవ్వే ప్రయత్నం చేస్తూ ” ఏం లేదండీ. మిమ్మల్ని చూసిన ఆనందంలో ” సంజాయిషీగా సర్దిచెప్పబోయింది.అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్న ఆ అశక్తురాలిని చూసినప్పుడు… అప్పుడు బయటకొచ్చింది నా దుఃఖం!
“నీకు అబద్ధం చెప్పడం చేతకాదు జానకీ ” అన్నాను కన్నీళ్ళ మధ్య.

ఆ మధ్యాహ్నమే ఆమెను హాస్పిటల్‌ కి తీసుకెళ్ళాను. ఆస్పత్రికి రావడం ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. కానీ నా బలవంతం మీద ఒప్పుకుంది.

జైల్లో నా ఆరేళ్ళ కష్టంలో అడపాదడపా జానకి చేతికి ఇవ్వగా మిగిలిన పైకం, నాలుగువేల రెండు వందల తొమ్మిది రూపాయలు. ఆ డబ్బే ఆ క్షణాన మమ్మల్ని ఆదుకుంది. జానక్కి జరిగిన పరీక్షల తాలూకు మెడికల్‌ రిపోర్టులు తీసుకుని ఆ సాయంత్రం డాక్టర్ని కలిసాను.

ఆత్మీయుల నిర్జీవదేహం చితిమంటల్లో కాలి భస్మమవుతుంటే దూరంగా, మౌనంగా నిలుచున్న నిస్సహాయుల మనసులో ప్రతిధ్వనించే నిశ్శబ్ద పర్జన్య ఘోషే… స్మశాన వైరాగ్యం. ఆ డాక్టర్తో మాట్లాడాక నా మనసులో సరిగ్గా అలాంటి నిశ్శబ్దమే పేరుకుంది.అప్పుడే నేను శీనుని కలిసాను.

ఆరేళ్ళక్రితం నేను జైలుకెళ్ళిన కేసు ఒక బ్యాంకు దోపిడీకి సంబంధించింది. దోచిన డబ్బు మొత్తం నా ఆధీనంలోనే ఉండటం వల్ల మొత్తం ప్లాను నా ఒక్కడిదే అన్న నా వాదనను కోర్టు నమ్మింది. అలా నాతో పాటు ఆ రాబరీలో పాల్గొన్న మరో నలుగురు తప్పించుకున్నారు. ఆ నలుగురిలో ఒకడు మా గ్యాంగులో ముఖ్యుడు శీను!

“చాలా మారిపోయావ్‌.” అన్నాను శీనుతో. బాగా లావు అయ్యాడు. జుత్తు మొత్తం ఊడిపోయి బట్టతలగా తయారయ్యింది.
“నువ్వూ మారావ్‌. కానీ బాగున్నావ్‌” అన్నాడు ఓ గ్లాసులో స్కాచ్‌ పోసి నా ముందుకు తోస్తూ.
“వ్యాయామం!” అన్నాను. జైల్లో రోజూ ఎక్సర్‌సైజ్‌ కంపల్సరీ.
“తీసుకో” చనువుగా అన్నాడు గ్లాసు చేతికి అందిస్తూ.
“ఊహూఁ వద్దు. అలవాటు పోయింది.” అన్నాను గ్లాసు అందుకుని టేబుల్‌ పై వుంచుతూ.
ఖాళీ అయిన తన గ్లాసులోకి నా గ్లాసులోని మందు పోసుకొని నింపాదిగా సిప్‌ చేస్తూ నా వైపు సూటిగా చూసాడు.
అతనేం చెప్పబోతున్నాడో నాకు తెలుసు.

“డబ్బంతా తీసుకొని నువ్వొక్కడివే పోలీసులదగ్గరికి వెళ్ళిపోవడం మాకెవ్వరికీ నచ్చలేదు “నేను మౌనంగా వున్నాను.
“మా గురించి చెప్పేస్తావేమో అని భయపడ్డాం. మన రాజుగాడు అయితే నిన్నసలు కోర్టు బయటే లేపేద్దాం అనుకున్నాడు.”
మా అందరిలో రాజుకు కొంచెం ఆవేశం ఎక్కువ. నాకు హాని చెయ్యకుండా అతను ఆగిపోవడం విచిత్రమే.
“నేనే ఆపాను. అది సరే, ఏమిటి ఇలా వచ్చావ్‌?” ప్రశ్నార్ధకంగా చూసాడు.
“నాకు ఏదన్న పని కావాలి.”
“ఎంత కావాలి?” అన్నాడు క్లుప్తంగా.
“డబ్బును బట్టి పని వెదుకుతా. ఎంత కావాలి నీకు?”
“రెండు లక్షలు”
“అలాగే! చూద్దాం” అన్నాడు ఆలోచిస్తూ.
నేను లేచాను.
“మరి నేను వెళ్ళొస్తా.”
“ఊఁ!” అన్నాడు నోట్లో సిగిరెట్‌ ఉంచుకుంటూ.

“మనుషులు ఒక రకమైన జీవితానికి అలవాటుపడ్డాక సడెన్‌ గా వాళ్ళ రొటీన్‌ మారిపోతే చాలా ఆందోళనకు లోనవుతారు.” అన్నాడు శర్మ.
“అవును సార్‌. అందుకే చాలా మంది మేష్టార్లు రిటైరయినా ఊరుకోక ట్యూషన్లూ అవీ చెబుతూ వుంటారు.” అన్నాను నేను.
“నేను చెప్పేది అది కాదు “. కళ్ళుమూసుకొని తన కణతల దగ్గర సున్నితంగా నొక్కుకుంటూ అడిగాడు, “ఇంతకూ నువ్‌ జైలుకు ఏ నేరం మీద వచ్చావ్‌?”
“బ్యాంకు రాబరీ సార్‌.”
“నీకై నువ్వే స్వచ్ఛందంగా లొంగిపోయావ్‌ కదూ?” కళ్ళు మూసుకునే అడిగాడు.
“అవును సార్‌.”

కళ్ళు తెరిచి టేబుల్‌ పై ఉన్న కళ్ళజోడు పెట్టుకుని, తను వ్రాసుకున్న నోట్సు, నా ఎర్ర ఫైలు, అన్నీ తన బ్రీఫ్‌కేసులో సర్దుకుంటూ రాయుడితో చెప్పసాగాడు. “కాన్‌షియస్‌ గానో, అన్‌కాన్‌షియస్‌ గానో సీతారామారావుకి ఈ జైలుతో బాగా దగ్గరితనం ఏర్పడింది. కొత్తల్లో ఆత్మరక్షణ కోసం కత్తులూ అవీ దాచుకుని తిరిగిన ఇతడు, తరువాత్తరువాత జైలు జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు. తన వాళ్ళు అంటూ ఇతడికి ఎవరూ లేరు. ఉన్నదల్లా ఒక్క భార్య మాత్రమే. ఆమె కూడా ఇతడ్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇతడికి మిగిలింది ఈ జైల్లో పెంచుకున్న పరిచయాలు మాత్రమే. బయటి ప్రపంచం దృష్టిలో ఇతడో మాజీ ఖైదీ. కానీ ఇక్కడ, నలుగురిలో ఒకడు! ఆ ఎఫినిటీయే ఇతడ్ని మళ్ళీ ఇక్కడికి రప్పించింది. ఇక్కడ హాయిగా స్నేహితులూ, భోజనం, వసతి, వ్యాయామం, వైద్య సౌకర్యం ఏ బాధ్యతలు లేవు. ఏ బాదరబందీ లేదు. అందుకే ఇతడు మళ్ళీ జైలుకొచ్చాడు. నా రిపోర్టులో కూడా నేను అదే వ్రాయబోతున్నాను.”

శర్మ వెళ్ళిపోయాక నా వైపు చూసాడు రాయుడు. “నువ్వీడకు రావడానికి కారణం ఏందో తెలుసా? నీ తాగుబోతు బుద్ధి, నీ తెలివిలేనితనం. అదీ సంగతి .” అన్నాడు రూఢీగా.

ఎవరో పిలిచిన అలికిడికి మెలకువొచ్చింది.
ఇంటో ఒక్కడ్నే ఉన్నాను. జానకి నిన్నటి నుంచీ హాస్పిటల్‌ లోనే వుంది.
ఆమె గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. నిద్ర పట్టేసింది నాకు తెలియకుండానే.
“రేయ్‌ రామూ ” తలుపుకు అవతల నిలబడి వున్నాడు శీను.
“ఆఁ..” కళ్ళు నులుముకుంటూ చూసాను.
“లే. వెళదాం” అన్నాడు లోపలికొస్తూ.
“ఎక్కడికి?” అన్నాను చాప మీద నుంచి లేస్తూ.
“పని కావాలన్నావుగా. దొరికింది. పద.”

ముఖం కడుక్కుని వెళ్ళి అతని స్కూటర్‌ ఎక్కి కూర్చున్నాను.
అరగంట తరువాత పబ్లిక్‌ గార్డెన్స్‌ దగ్గరలోని ఒక భవంతి ముందు ఆపాడు శీను స్కూటర్ని. అతను నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడో అర్ధం కాగానే ఆశ్చర్యం భయం ఒకే సారి కలిగాయి.
“ఏమైంది పద పద” దాదాపుగా తోసుకుంటూ నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. లోపలున్న సెక్యూరిటీ గార్డ్‌ శీనుని గుర్తుపట్టినట్లుగా నవ్వాడు. అతని వైపు పలకరింపుగా నవ్వి ఆ పక్కనే ఉన్న ఒక గదిలోకి నన్ను తీసుకు వెళ్ళాడు శీను.

అది ఒక ఆఫీసు చేంబర్‌. విశాలమయిన ఆ గదిలో, అతి పెద్దదయిన ఒక టేబుల్‌ కి అటు వైపున కూర్చుని వున్న మనిషి మమ్మల్ని చూసి తలపంకించాడు.
“ఇతనేనా?” అన్నాడా వ్యక్తి నన్ను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తూ.
“అవును సార్‌!” నమ్రతగా జవాబిచ్చాడు శీను.
తలుపు దగ్గరిగా వెయ్యమని సైగ చేసాడా వ్యక్తి.
“పని గురించి చెప్పావా?”
“లేదు సార్‌. మీరే చెబితే బాగుంటుందని..” డోర్‌ మూస్తున్న శీను గొణిగాడు.
“ఊఁ! కూర్చోండి.” సూటిగా నా కళ్ళలోకి చూసాడు ఆ వ్యక్తి.అతని చూపులు చాలా తీక్షణంగా వున్నాయి. ఇంటరాగేషన్‌ సమయంలో పోలీసులు చూసే చూపులు అచ్చం అలాగే ఉంటాయి, నిర్దోషులను సైతం భయపెట్టేలా.

నేనూ, శీను, కూర్చున్న తరువాత, మెల్లగా చెప్పడం ప్రారంభించాడు ఆ వ్యక్తి.
అతను చెప్పేది వింటూ వుంటే నాకు కాళ్ళలో సన్నగా వణుకు ప్రారంభమయ్యింది. నాలుక పిడచగట్టుకు పోసాగింది. ఏదో తెలియని భయం చల్లగా మంచులా నరాల్లో వళ్ళంతా!

అతను చెప్పడం పూర్తయ్యాక చాలా సేపు ఎవ్వరం మాట్లాడలేదు.
గోడకు బిగించిన ఎయిర్‌ కండిషనర్‌ లోంచి వస్తున్న “హమ్‌” అన్న శబ్దం తప్ప
గదంతా నిశ్శబ్దం. చాలా ఇబ్బందికరమైన నిశ్శబ్దం.
“అర్ధమయ్యిందా?” అన్నాడతను నా వంక చూస్తూ.
“అర్ధమయ్యింది సార్‌” భయం వల్ల చెమటపట్టిన అరచేతుల్ని ప్యాంట్‌ కేసి తుడుస్తూ బదులిచ్చాను.
“గుడ్‌!” అంటూ తలపంకించి, “చూడ్డానికి చాలా సహజంగా వుండాలి. ఎవరో పగబట్టి చేసారన్న అనుమానం రాకుండా, అసలు బయటివాళ్ళ హ్యాండ్‌ వున్నదని తెలియకుండా, చాలా కేర్‌ ఫుల్‌ గా చెయ్యాలి.” అన్నాడు.
“కత్తి తిప్పడంలో మా రామూని మించిన వాళ్ళు లేరు సార్‌. ఇది మన ప్లాన్‌ అనే విషయం అసలు బయిటికి రాదు. నేను హామీ!” అన్నాడు శీను.నా సమాధానం కోసం చూసాడా వ్యక్తి.

నిజమే! నేను కత్తితో చాలా చాలా చేయగలను. హత్య చేసి అది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్‌ అని నమ్మించగలను. లేకపోతే అది ఒక ఆత్మహత్య అని పోలీసులు కూడా భ్రమ పడేలా ఋజువులు వదల గలను. కత్తి నా స్పెషాలిటీ!

“మన పేర్లు బయిటికి రావు సార్‌.” నమ్మకంగా అన్నాను.
“గుడ్‌! అన్నం పెట్టిన చేతినే కాటేసిన దుర్మార్గుడు వాడు. ఇన్నాళ్ళూ మా పార్టీ ఉప్పు తిని ఇప్పుడు ప్రతిపక్షాలకు హెల్ప్‌ చేస్తున్నాడు. ఎమ్‌.పీ. అవుతాడట ఎంపీ..” ఆవేశంగా మాట్లాడసాగాడతను.

“నీకు ఎలాంటి హానీ కలక్కుండా చూస్తాను. నీ భార్య ఆపరేషన్‌ కి కావలసిన డబ్బు రెండు లక్షలట కదా. మూడు లక్షలు ఇప్పుడే ఇస్తాను. అది కాక, నువ్‌ జైలు నుంచి విడుదలయ్యాక నీకో మంచి ఉద్యోగమో లేదా వ్యాపారం పెట్టుకోవడానికి మరికొంత డబ్బో ఇస్తాను. నీ గురించి శీను నాకు అంతా చెప్పాడు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఏ సాక్ష్యమూ లేకుండా ఆ పాపారాయడ్ని పైలోకానికి పంపడం నీ పని!”
“ఆ విషయం నాకు వదిలెయ్యండి సార్‌” అన్నాను, హోం మినిస్టర్‌ తన స్వహస్తాలతో అందిస్తున్న మూడు లక్షలు తీసుకుంటూ.

మినిస్టర్‌ ఇంటి నుంచి బయిటికొచ్చే సరికి బాగా చీకటి పడింది. డబ్బులు శీనుకిచ్చి ఏం చేయాలో చెప్పాను.
“అదేంటి, హాస్పిటల్‌ కి వెళ్ళడం లేదా?” అడిగాడు శీను, డబ్బుల బ్రీఫ్‌ కేస్‌ స్కూటర్‌ డిక్కీలో పెడుతూ.
“కాదు. దార్లో ఏదన్నా బ్రాందీ షాప్‌ దగ్గర డ్రాప్‌ చేసి నువ్‌ వెళ్ళు.”
చెబుతున్న నా వంక ఆశ్చర్యంగా చూసాడు.

ఒక బ్రాందీ షాపు దగ్గర దిగి షాపులో ఒక ఫుల్‌ బాటిల్‌ కొనుక్కొని తాగాను. కౌంటర్‌ దగ్గర కూర్చున్న పెద్దమనిషితో కావాలని గొడవపెట్టుకుని షాపంతా బద్దలు కొట్టాను. మందు అలవాటు పోవడంతో బాగా కిక్కెక్కేసింది. అయినా అసలు సంగతి మాత్రం మర్చిపోలేదు నేను. పోలీసుల కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నాను.

నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి మరి!
………………………

మంగళ వాక్యం
ఓ.హెన్రీ వ్రాసిన   Cop and the Anthem కథలో, కథానాయకుడు సోపీ డిసెంబరు చలికి ఓర్చుకోలేక తిరిగి జైలుకెళ్ళిపోదామని పడే తాపత్రయం నాకు ఇప్పటికీ గుర్తే. ఒక విధంగా ఆ సోపీయే నా సీతారామారావ్‌ కి ప్రేరణ. సందేశాలూ, సామాజిక స్పృహా వగైరాలు ఈ కథలో మీకు దొరకవ్‌. ఇదేదో సరదాగా చదివి మర్చిపోవాల్సిన కథ. మన ఎలీట్‌ మిత్రుల భాషలో… ఇది కేవలం టెక్నిక్‌ మీద ఆధారపడ్డ ఫక్తు కమర్షియల్‌ కథ. ఎంజాయ్‌!