తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు

మేము స్కూల్లో చదువుకొనే రోజుల్లో, రేడియోలో వచ్చే సినిమా పాటలు వినటం ఒక పెద్ద వ్యాపకంగా ఉండేది. అప్పట్లో మేముండే పిఠాపురంలో వివిధ భారతి కార్యక్రమాలు వినబడవు కాబట్టి, రెగ్యులర్‌కేంద్రాల్లో నియమిత సమయాల్లో వచ్చే పాటలే గతి. చిత్రసీమ, చిత్ర మాధురి, మధురిమ, మధుమంజరి,చిత్ర సుధ ఇటువంటి చిత్ర విచిత్ర నామాలతో ప్రసారమయ్యే ఈ పాటల కార్యక్రమాలకోసం ఎదురుచూసి వినటం గొప్ప ఎంజాయిమెంటుగా ఉండేది. వీటిలో ఒక సౌకర్యం కూడా ఉంది. ఈ కార్యక్రమాల్లో మధ్యన ఎక్కడా వాణిజ్యప్రకటనల వంటి అప్రస్తుతాంశాలు చోటు చేసుకొనేవి కావు. అందువల్ల, ఏకాగ్రత చెడకుండా పాటలు వినే అవకాశం ఉండేది.

ఇక ప్రతిరోజూ మధ్యాహ్నం గంట పాటు సిలోను రేడియోలో మీనాక్షీ పొన్నుదొరై వినిపించే పాటలొక బోనస్‌. ఇదికాకుండా, అప్పట్లో మా ఊళ్ళో ఉండే సినిమా టాకీసులవాళ్ళు, ప్రతి ఆటకి ముందర కాస్సేపు లౌడుస్పీకర్ల ద్వారా పాటలు వినిపించే సత్‌సాంప్రదాయం ఒకటి అమలులో ఉండేది. “నమో వెంకటేశా, నమొ నమో తిరుమలేశా” అనే ఘంటసాల వారి ప్రార్థనా గీతంతో మొదలయ్యే ఈ కార్యక్రమం ఒక అరగంటసేపు నిరాఘాటంగా కొనసాగేది. వీటిలో విన్నపాటలే మళ్ళీ మళ్ళీ వినటంవల్ల, అవన్నీ “మరపురాని గీతాలు ” గా మనసులో హత్తుకుపోయాయి.

పాటలు వినేటప్పుడు, అందులో రచనను ఫాలో కావటం, రాసిన వారి పేర్లు గుర్తుంచుకోవటం మా యింట్లో అందరికీ ఒక అలవాటు. ఈ అలవాటు కారణంగా కొన్నిపాటల్లో నేను గమనించిన విశేషాలను ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. ఇందులో క్లాసిక్సునే కాకుండా, అన్ని రకాల పాటల్నీ తీసుకుంటాను. దీని ఉద్దేశ్యం, కొన్ని రచనా వైచిత్రుల్ని గుర్తించటమే గాని, ఉత్తమ రచనల్ని ఎన్నిక చెయ్యాలని కాదు. అందువల్ల కొన్ని మంచి రచనల గురించి చెప్తూనే, ఇతరత్రా విషయాల గురించి కూడా కొంత ముచ్చటిస్తాను.

ఇతర ప్రక్రియల కంటే, సినిమా పాటలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ద్వారా ఒక సన్నివేశాన్ని ఒప్పించే అవకాశం ఉంది.మాటల రచయత డైలాగ్సుతో ఎలాగైతే ఒక సన్నివేశాన్ని రక్తి కట్టిస్తాడో అదే పనిని పాటద్వారా కవి ఎయ్యగలుగుతాడు.ఈ పనిని అత్యద్భుతంగా నిర్వహిన్చిన ఒక పాట మూగమనసులు సినిమాలో “ముద్దబంతి పూవులో”పాట .”పూల దండ లో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా” ” అని ప్రశ్నించే ఈ పాటలో వ్యక్త మైన దానికంటే, అవ్యక్తంగా ఉన్నదే ఎక్కువ. ఆ పాత్ర తాలూకు మూగ ప్రేమ, డిసప్పాయింటుమెంటు, అమాయకత అన్నీ ఈ పాటలో నిండి ఉన్నాయి. అయితే, సన్నివేశం నాయిక పెళ్ళి చేసుకొని వెళుతుండటం కావటం వల్ల, అందులో శుభ కామనలే చెప్పబడాలి.

“ముక్కోటి దేవుళ్ళు మురిపి చూస్తుంటారు
ముందు జనమ బందాలు ముడివేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు
మూగమనసు బాసలు మీకిద్దరికీ సేసలు”

ఇంత నిరాడంబరమైన చిన్న మాటల్లో, ఒక పాత్ర స్వభావాన్ని, మానసిక స్థితిని మొత్తంగా తీసుకురావటం వల్ల, యిది గొప్ప పాటగా నిలిచిపోతుంది. ఆత్రేయ రాసిన ఈ పాట తెలుగు సినిమా పాటల్లో రచనా పరంగా అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నేను భావిస్తాను.

ఒక సన్నివేశంతో లేదా కధతో ముడిపడి ఉండకుండా, పూర్తిగా జనరలైజ్‌చెయ్యబడ్డ కొన్ని గీతాలు కూడా నాకు నచ్చుతాయి. అందులోనూ, ముఖ్యంగా, ఒక రకమైన మెలాంకలీని కలిగి ఉండే పాటలు. “రాము ” సినిమాలో దాశరథి రాసిన “మంటలు రేపే నెలరాజా” అటువంటి పాట.

“ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతేది?
మేఘములోనా మెరుపుంది నా జీవితమందున వెలుగేది ?”

“మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు
సుఖము, శాంతి,ఆనందం నా నుదుటను రాయుట మరిచాడు”

ఇందులో సున్నితమైన బాధ ధ్వనిస్తుందే కాని, తీవ్ర స్థాయి దుఖం లేదు. ఆ బాధ కూడా, ఓటమి వల్లనా, విరిహం వల్లనా లేదా మరే కారణంవల్లనా అనేది, పాటలో ఎక్కడా ప్రస్తావింప బడలేదు. ఇది ఒక pure and unadulterated melancholy. ఎటువంటి వాళ్ళైనా, మనసు బాగోలేనప్పుడు హాయిగా పాడుకోవచ్చు. ఇటువంటి పాటలు అరుదుగా ఉంటాయి.

ఒకే పాటను కాకుండా , రెండు వేరు వేరు పాటల్ని సరిపోల్చి చూడటం కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇది రక రకాలుగా చెయ్యవచ్చు. వీటిలో అన్నిటికంటే సుళువైనది ఒకే సినిమాలో ఉన్న రెండు పాటల్ని తీసుకోవటం. కొంతకాలం సినిమాల్లో ఒక పద్ధతి పాటించేవారు. ఒకే పాట రెండు సందర్భాలలో వస్తుంది. అంటే, ఒకటి పరిస్థితులు బాగుండి సంతోషంగా ఉన్నప్పుడు, మరొకటి పరిస్థితులు క్షీణించి విచారంగా ఉన్నప్పుడు. ఈ రెండు పాటలు ఒకేలా మొదలై, తరువాత క్షీణించి విచారంగా ఉన్నప్పుడు. ఈ రెండు పాటలు ఒకేలా మొదలై, తరువాత పల్లవి లోనో, చరణాల దగ్గరో విడిపోతాయి. ( వీటిని వేరు వేరుగా గుర్తించటానికి, గ్రామ ఫోను రికార్డులమీద ఒకదానికి “నవ్వుతూ” అని , రెండో దానికి “ఏడుస్తూ” అని రాసేవారని గుర్తు) .”చేతిలో చెయ్యేసి చెప్పు బావ” (“దసరా బుల్లోడు “) , “బాబూ వినరా” (“పండంటి కాపురం “), “గున్న మామిడి కొమ్మమీద” (“బాల మిత్రుల కధ “) , “ముద్దుల నా బాబు నిద్దరోతున్నాడు” (“జీవన జ్యోతి “), “ఒసే వయ్యారీ రంగీ” (“పల్లెటూరి బావ “) మొదలైన పాటలు ఈ రకం ఫార్ములా మీద ఆధారపడి వచ్చినవి.ఇటువంటి పాటల్లో కొన్నిసార్లు ఒక పాటలో వచ్చిన వాక్యాన్ని రెండవదానిలో రిఫర్‌ చెయ్యటం ఉంటుంది. ఒక దానిలో “పాడుకొన్న పాటలుపాతబడిపోవని” అంటే రెండోదానిలో “పాడుకొన్నపాటలు పాతవనిమరిచిపో “అనటం వంటివి. అయితే, యిటువంటి సందర్భాలు చాలా తక్కువ. దాదాపు ఇటువంటి పాటలన్నింటిలోనూ రెండు పాటల్నీ ఒకరే రాసి ఉంటారనుకొంటాను. దీనికేమన్నా మినహాయింపు లున్నాయేమో ఎవరైనా సూచిస్తే బాగుంటుంది.

రెండు పాటల ఫార్ములాని సంతోషంవిచారం తెలియజెయ్యటానికే కాకుండా, కాలంలో జరిగిన మార్పును సూచించటానికో, లేదా పాత జ్ఞాపకాలను రేపటానికో ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవదాసు సినిమాలో “ఓ! దేవదా!”, డాక్టర్‌చక్రవర్తి చిత్రంలో “పాడమని ” వంటివి ఈ కోవకు చెందుతాయి. డాక్టర్‌చక్రవర్తిలో రెండు పాటల్నీ వేరు వేరు పాత్రలు పాడతాయి. ఇటీవల వచ్చిన “రాజా” సినిమాలో చాలా కాలం తరువాత ఈ రకం పాటల్ని చూసాను. ఇందులో సీతారామ శాస్త్రి రాసిన “ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ” అనే రెండు పాటలూ చాలా చక్కగా రాయబడ్డాయి.

ఇవి కాకుండా,ఒకే కవి వేరు వేరు సినిమాల్లో,ఒకే థీం మీద రాసిన పాటల్ని సరిపోల్చి చూడటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకి, ఆరుద్ర “సాక్షి ” సినిమాకోసం రాసిన “అమ్మకడుపుచల్లగా” పాటని ఆయనే “పెళ్ళిపుస్తకం” సినిమా కోసం రాసిన “శ్రీరస్తు శుభమస్తు” అనే పాటని తీసుకోవచ్చు. రెండింటిలోనూ పెళ్ళి తంతు వర్ణించబడుతుంది. కాని, రెండింటికీ సిట్యుయేషన్‌లో చాలా తేడా ఉందనుకోండి. మొదటిది అత్యంత బరువైన సన్నివేశం ,రెండోది పూర్తిగా ఆనందకరం ఐనది. ఐతే, ఈ రెండు పాటల్లోనూ, తెలుగు పెళ్ళితంతులో ఉండే వివిధ అంశాలు,వాటి క్రమం మీద ఆయనకున్న పట్టు తెలుస్తుంది. “సాక్షి ” పాటలో “చల్లని అలివేణికిమొక్కరా సన్నికల్లు మీద కాలు తొక్కరా” అని రాసారు. ఇటువంటి వాక్యం బహుశ ఆరుద్ర మాత్రమే రాయగలరనుకొంటాను.

ఆరుద్ర చీరల మీద రాసిన రెండు పాటలు”తూర్పుకు వెళ్ళే రైలు” లో “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ” అన్న పాట, మళ్ళీ పెళ్ళి పుస్తకంలోదే “సరికొత్త చీర ఊహించినాను ” అనే పాట కూడా ఈ రకంఐన కంపారిజన్‌కి సరిపోతాయి. మొదటి పాటలో నాయకుడు కవి అందుకే, “నే కట్టే పాటను చుట్టి” అని పాడతాడు. పాటంతా రకరకాల చీరల్లో ఆమె సొగసుల్ని పొయెటిక్‌గా వర్ణించటంతో సరిపోతుంది. రెండో పాటలో నాయకుడు డిజైనర్‌ “ఇది యెన్నో కలల కలనేత ” అని పాడతాడు. పాటలో ఎక్కువగా చీర నిర్మాణం గురించి, ఆమె స్వభావం గురించి ఉంటుంది. ఈ రెండూ మంచి పాటలే.

సినారె తూర్పుపడమర” చిత్రానికిరాసిన “శివరంజని! నవరాగిణి ” అనేపాట అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. తరువాత మళ్ళీ ఆయనే శివరంజని నుద్దేశిస్తూ “అభినవ తారవో నా అభిమానతారవో” అనే పాట రాసారు. ఇది కూడా మంచి పాట. ఇందులోవాడిన “సుమశర శింజినీ శివరంజనీ! ” అనేప్రయోగం చాలా బాగుంటుంది. ఒక పాట పాపులర్‌ అయ్యాక,మళ్ళీ అదే థీం మీద మరొక మంచి పాట రాయగలగటం గొప్ప విషయం.ఈ జోడుపాటల కేటగిరిలో చివరగా, వేరు వేరుకవులు, వేరు వేరు సినిమాల్లో రాసిన రెండు పాటల మధ్య ఉన్న అనులోమ, విలోమ సంబంధాల గురించి చర్చించవచ్చు.ఇటువంటి సంబంధం గమనించటం కొంచం కష్టం. ఇది కొంతవరకు సబ్జెక్టివ్‌కూడా కావచ్చు. ఉదాహరణకి, “దసరా బుల్లోడు ” సినిమాలో ఆత్రేయ రాసిన “నల్ల వాడే, అమ్మమ్మా అల్లరి పిల్ల వాడే” అన్నపాట ఉంది. ఇది ఇద్దరు నాయికల మధ్య వివాదం “చిన్న వాడే ఓ యమ్మా రాధకే చిక్కినాడే ” అని ఒకామె అంటే, రెండో ఆమె ” లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె” అంటుంది. వెరసి, నాయకుడు “నీ వాడంటే నీ వాడ” ని అనుకోవటం దీని సారాంశం. “కలెక్టర్‌జానకి ” సినిమాలో “నీ వన్నది నీవను కొన్నది నే నన్నది ఇలలో ఉన్నది” అనే పాట ఉంది. ఇందులో వివాదం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. “శ్రీనివాసుని ఎదపై నిలిచేది పద్మావతియే కాదా” అని ఒకామె అంటే, “అలివేలుమంగా దూరాన ఉన్నా, ఆతని సతియే కాదా” అని మరొకామె అంటుంది. వారిద్దరూ, నాయకునిపై తమకున్న హక్కుని సమర్ధించుకోవటం దీనిలో అంశం. ఇదొక విలోమ సంధం. రెండు వాదనలకీ పౌరాణిక ఆధారాలుంటాయి.ఈ రెండూ బొమ్మల కొలువు పేరంటం పాటలే కావటం కూడా ఒక విశేషం.

అలాగే “ఆనంద నిలయం” చిత్రంలో ఆరుద్ర రాసిన “పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే” అనే పాట many to one అనే సంబంధం మీద అధారపడినదైతే, “తూర్పూ పడమర ” చిత్రంలో సినారే రాసిన “స్వరములు ఏడైనా రాగాలెన్నో” అనే పాట one to many లేదా some to many అనే సంబంధాన్ని గురించి ఉంటుంది. ఇది కూడా ఒక విలోమ సంబంధం.

మరొక ఉదాహరణ “కృష్ణవేణి ” చిత్రంలో సినారే రాసిన “కృష్ణవేణీ! తెలుగింటి విరిబోణీ!” అనే పాటలో ఒక మంచి థీం ఉంటుంది. నాయిక నది గురించి పాడుతోంటే, నాయకుడు నాయికనుద్దేశించి పాడతాడు. ఇద్దరి మాటలలోనూ, పొందికైన సారూప్యం ఉంటుంది. “శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింప జేసేవు” అని ఆమె అంటే , “లావణ్య లతవై నను చేరు వేళ శత కోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణీ ” అని అతనంటాడు. ఇందులో నాయికకీ, నదికీ పోలిక చెప్పబడింది. అదే సమయంలో వారి మధ్య భేదం కూడా పాటించ బడింది. ఒక నది తాలూకు భౌగోళిక వివరాల ప్రస్తావన కూడా ఈ పాటలో ఉంది.

ఐతే, నాయికకూ, నదికీ అభేదం పాటిస్తూ, ఆత్రేయ ఒక పాటలో రాసారు. “చక్రవాకం” సినిమాలో “ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ” అనే పాటలో ఈ వాక్యాలుంటాయి “అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినది అడుగడుగునా సొగసు పోగుచేసు కొన్నది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది ఏ మనిషికీ మచ్చికకూ రానన్నదీ ” . ఇందులో నదీ, నాయికా ఒకటే. వారి మధ్య పాటించిన పోలిక నిగూఢంగా ఉండి, పాటకు అందాన్నిచ్చింది. ఐతే, ప్రేక్షకుల సౌకర్యార్థం పాటలోని “అడవి పిల్ల ” నాయికేనని ఆ చరణంలో ఆమెకు వాడిన కాస్య్టూముల ద్వారా సూచిస్తారనుకోండి.ఇటువంటి అభేదాన్నే పాటిస్తూ ఆత్రేయ రాసినమరొక పాట “ప్రేమనగర్‌” చిత్రంలో “ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి” అనే పాట. ఈ పాట పైకి వీణ గురించి పాడుతున్నట్టుగా ఉన్నా, దీనిలో భావం నాయకునికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఆసాంతమూ ఉద్వేగంతో సాగే ఈ పాట చాలా చక్కగా రాయబడింది. వైద్య శాస్త్రంలో good cholestrol అని వ్యవహరించినట్టు, ఇటువంటి పాటల్ని “మంచి రెండర్థాల పాటలు” గా చెప్పుకోవచ్చు.

జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా తల్లి తన పాపాయికోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి. సినిమా పాటల్లో కూడా ఎన్నో మంచి జోల పాటలున్నాయి. “రామా లాలీ మేఘ శ్యామా లాలీ ” దగ్గర్నించి, “వటపత్ర శాయికీ వరహాల లాలీ ” వరకు అనేక పాటల గురించి చెప్పుకోవచ్చు. అయితే, సినిమాల్లో కధను బట్టి వివిధ సందర్భాలేర్పడుతూ ఉంటాయి గనుక, వాటిలో తల్లి తన పిల్లలకోసమే కాకుండా, ఎవరు ఎవరికోసమైనా జోల పాటలు పాడే అవకాశం ఉంది. తండ్రి పాడే జోలపాటలకి “ధర్మ దాత ” సినిమా కోసం సముద్రాల రాసిన “జో లాలీ జో లాలీ ” ఒక చక్కటి ఉదాహరణ. “చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు, మున్నీరు గా చూడ లేను ” అని సాగే ఈ పాటలో కేవలం ట్యూను వల్లనే కాకుండా, పదాల కూర్పు ద్వారా ఏర్పడిన ఒక లయ ఉంది. ఈ లయ ఒక ఊయల ఊపును సూచించే విధంగా ఉంటుంది.

“సంతానం ” సినిమాకోసం లతా మంగేష్కర్‌పాడిన ఏకైక(?) తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా ” అక్క తన తమ్మునికోసం పాడే జోల పాట. అనిసెట్టి రాసిన ఈ పాటలో “కలలు పండే కాలమంతా కనుల ముందే కదలి పోయె లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయె ” అనే వాక్యాలు యెంతో కదిలిస్తాయి. “తోడు నీడ ” సినిమాలో “అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా ” అనే ఆత్రేయ గారి గీతం కూడా యితరులు పాడే జోల పాటల క్రిందికి వస్తుంది. ఈ పాటలో “అమ్మలు కన్నుల్లు తమ్మి పువ్వుల్లు ” అనే ప్రయోగం యెంతో హృద్యంగా ఉంటుంది. దేవులపల్లి వారు “కాలం మారింది ” సినిమా కోసం రాసిన “ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల ” అనే పాట ఎవరూలేని అనాధ కోసం పాడే జోల పాట.

ఇకపోతే, పసిపిల్లల గురించి కాకుండా, పెద్దవాళ్ళ గురించి పాడే జోల పాటలు , బహుశ సినిమాలలో మాత్రమే కనిపించే విశేషం. “ముద్దమందారం ” సినిమా కోసం వేటూరి రాసిన “నీలాలు కారేన కాలాలు మారేన నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూచే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా ” అనేది నాయకుడు నాయికకోసం పాడే చక్కటి జోల పాట. వేటూరిదే మరొక రచన , “గీతాంజలి ” సినిమాలో “ఓ పాపా లాలీ జన్మ కేళి లాలీ ” అనే పాట కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ పాటలో “చిరు చేపల కనుపాపలకిది నా మనవి ” అనే అద్భుతమైన ప్రయోగం ఉంది. “సూత్రధారులు ” సినిమాలో సినారే రాసిన పాట “జోలా జోలమ్మ జోలా ఏలేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లె పూల జోల ” అనే పాట నాయిక నాయకునికోసం పాడే జోల పాటకి ఉదాహరణ. కృష్ణశాస్త్రి గారి క్లాసిక్స్‌లో ఒకటి, “రాజమకుటం ” సినిమాలో “సడిచేయకో గాలి సడిచేయబోకె బడలి ఒడిలో రాజు పవ్వళించేనె ” అనే పాటను కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చునేమో. కాకపోతే, ఇది నిద్ర పోయిన తరువాత పాడుతున్నటుగా ధ్వనిస్తోంది కాబట్టి, దీనిని జోల పాటగా పరిగణించ వచ్చునా, లేదా అనే టెక్నికల్‌సమస్య రావచ్చును.

సాంప్రదాయ జానపద సాహిత్యంలో యిలా తల్లి కాకుండా, యితరులు పాడే జోల పాటల గురించి ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది (ఇప్పటికే యెవరైనా చేసారా ?) . బాల అకాడమీ వారు సంకలనం చేసిన లాలి పాటలు జోల పాటల ఆడియో క్యాసెట్లో “ఊడిగ చెట్లకు ఉయ్యాల కాట్టి ఊపమని మీ అమ్మ ఊరు వెళ్ళింది ” అనే పాట ఉంది. ఇటువంటివి మరికొన్ని కూడా ఉండి ఉండవచ్చు.

పసిపిల్లలు నిద్రపోవటం ఎంత ముఖ్యమో, పెద్దవాళ్ళు అందునా అధికారంలో ఉన్నవాళ్ళు నిద్ర మేల్కొనటం కూడా అంతే ముఖ్యం. అందువల్లనో యేమో, పెద్దవాళ్ళకు సంబంధించి నంతవరకు, మేల్కొలుపు పాటలు ప్రముఖంగా కనిపిస్తాయి. అన్నమా చార్యులవారి దగ్గర్నించి, “విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య ” అని పాడారు కదా. సినిమా పాటల్లో కూడా మంచి మేల్కొలుపు గీతాలున్నాయి. “శ్రీ రామాంజనేయ యుద్ధం “సినిమాలో బాల మురళి, లీల పాడిన “మేలుకో శ్రీ రామా మేలుకో రఘురామ ” ఒక ఉదాహరణ (ఈ పాటలో రామారావు గారు కళ్ళు విప్పటం ఒక కమనీయదృశ్యం) . భగవంతుని పరంగానే కాకుండా, భర్తల్ని భార్యలు, భార్యల్నిభర్తలు, ఊరివారిని వైతాళికులు మేలుకొలిపి కార్యోన్ముఖుల్ని చేసే పాటలనేకం కనిపిస్తాయి. అయితే, పిల్లల్ని నిద్ర లెమ్మని పాడే పాటలు చాలా తక్కువ.మల్లాది వారు రాసిన “తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా ” అనే పాట ఒక్కటే నాకు తెలిసింది. దీనిలో యశోద కృష్ణునితో “నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా ” అంటుంది. ఈ పాట నాకు గుర్తుండటానికి కారణం, దీనిని మా అమ్మగారు తన పూజలో భాగంగా అతి మధురంగా పాడేవారు. ఈ పాటలో అందమంతా “మళ్ళీ పరుండేవు లేరా ” అనటంలో ఉంది. తల్లి మనసు తెలిసిన కవికి మాత్రమే యీ మాట రాయటం సాధ్యపడుతుంది.

నిర్మాణపరంగా కూడా కొన్ని పాటల్లో విశేషాలు గమనించవచ్చు. మల్లాది వారి గిరిజా కళ్యాణం ( “రహస్యం ” ) , శ్రీ శ్రీ సీతా స్వయంవరం (“వాగ్దానం “) , వేటూరి రాసిన అర్జునుడి పాశుపతాస్త్రం కధ (“భక్త కన్నప్ప “) ఇటువంటివి కధతో కూడిన గీత మాలికలు. వీటిని ఒకే పాటగా తీసుకోలేము. ఇవి ఒదిలిపెట్టి, ఒకే పాటగా ఎంచదగిన కొన్ని పాటల్లో నిర్మాణ వైచిత్రిని పరిశీలిద్దాం. సాధారణంగా ఒక చరణంలో నాలుగు వాక్యాలు లైనులు ఉండటంకద్దు. “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” పాటలో ఆత్రేయ కేవలం రెండే వాక్యాలున్నచరణాలు రాసారు. “మాట తప్పి పోయినా మనిషి మిగిలితే చాలు మన మమతచంపుకున్నా ఒక మంచి మిగిలితే చాలు ” . నిజానికీ పాటలో చరణాలు పల్లవి కంటే చిన్నవిగా ఉంటాయి. “పంతులమ్మ ” సినిమాలో వేటూరి రాసిన “యెడారిలో కోయిలా, తెల్లారనీ రేయిలా ” అనే పాటలో చాలా పెద్ద చరణాలుంటాయి. మామూలుగా చరణాలు పాడేటప్పుడు, కొన్ని వాక్యాల్ని రిపీట్‌చేస్తారు. కాని, ఈ పాటలో అటువంటి సందర్భానికి కూడా కొత్త వాక్యాలు రాయబడ్డాయి. ఈ పాట ఒక చరణంలో దాదాపు మూడు చరణాలకు సరిపోయే సామగ్రి ఉంటుంది. అయితే, చరణాల నిడివిని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ పాట గురించి తప్పక చెప్పుకోవాలి.

కృష్ణశాస్త్రి గారు “సంపూర్ణ రామాయణం ” సినిమా కోసం రాసిన క్లాసిక్‌ శబరి పాట. ఈ పాట కవిత్వపరంగానే కాకుండా, నిర్మాణ పరంగా కూడా విశేషమైనది. ఎందుకంటే, ఈ పాటకు పల్లవి లేదు. ఇందులో చరణాలు, పాటలోఉండే లయ అన్నీ ఉంటాయిగాని, ఎక్కడా పల్లవిగా రిపీట్‌చెయ్యబడ్డ వాక్యాలు కనిపించవు. ఇది చాలా అరుదైన విషయం. ఇక, అసలు పాట రూపం కూడా యివ్వబడని పాట “ఏకవీర ” సినిమాలో సినారె రాసిన “ఏ పారిజాతంబు లీయగలనో ” . ఇది ఒక కవితను చదువుతున్నట్టుగా ఉంటుంది. (కాని, ఇందులో ఉన్న “చుక్కలతో ఒక్క సారి సూచింతును ” అనే వాక్యంతో మొదలయ్యే పల్లవి తో ఆకాశవాణివారు కట్టిన పాట ఒకటుంది.) ఈ సినిమాలో సినారె రాసిన “తోటలో నా రాజు తొంగి చూసెను నాడు ” అనే పాట కూడా, పాటకుండే లక్షణాలన్నీ ఉన్నా కూడా, ఒక కవితలాగా సాగుతుంది.

సినిమా పాటల్లో కూడా కొంతమంది కవులకి, వారు మాత్రమే వాడే కొన్ని పేటెంటు ప్రయోగాలుండటం కద్దు. ఉదాహరణకి, కృష్ణశాస్త్రి గారు “మతిమాలి ” అనే మాటవాడతారు. “ఏ లాగె మతిమాలి ఏడే నీ వనమాలీ ” (“నీల మోహనా రారా!”), “మరచిపోకుమా తోట మాలి పొరపడియైనా మతిమాలి “(“చీకటి వెలుకుల కౌగిటిలో “) . ఈ మాట వేరెవారెవరూ వాడగా చూడాలేదు.అలాగే, ఆత్రేయ ప్రయోగం ఒకటుంది. అది, గుండె గొంతులకు సంబంధించినది. “గుండె గొంతుకలోన కొట్లాడుతుంటాది” అని నండూరి వారు వాడారు గాని, అందులో యీ రెండిటికీ కాంట్రాస్టు చెప్పబడలేదు. వీటికి కాంట్రాస్టు పాటిస్తూ ఆత్రేయ అనేక చోట్ల రాసారు. “గుండెకు గొంతుకు ఎంతదూరం ఆశ నిరాశకు అంతే దూరం ” (“పాడితే శిలలైన కరగాలి “) , “గుండెలోనా, గొంతులోన ఎక్కడున్నది ఆవేదన “(“వీణలోన, తీగెలోన”), “కులము,మతము,జాతెదైనా గుండెలు,గొంతులు ఒకటంటాడు” (“బూచాడమ్మా బూచాడు”) ఇటువంటివి. ప్రయత్నిస్తే, బహుశ మిగతా కవులలో కూడా ప్రత్యేకమైన ప్రయోగాలు కనుక్కోవచ్చు.

చివరగా, సరదాగా ఉండే ఒక విశేషం ప్రస్తావిస్తాను. మన సినిమాల్లో హాస్య పాత్రలకోసం హాస్యప్రధానంగా ఉండే పాటలు పెట్టే ఆచారం ఒకటి ఉంది. ఆరుద్ర నుంచి అప్పలాచార్య దాకా, అనేకమంది ఈ రకమైన పాటలు రాసారు. వీటిలో కొన్ని తమాషా యైన వాక్యాలుంటాయి “నీ జడ పిన్ను నా తల రాతకు పెన్ను “, “నీ చిలిపి బిడియం అమృతంలో కూరిన వడియం ” ( “ఆ కాశం నుంచి నా కోసం వచ్చావా ” ఆరుద్ర)., “నువ్వు బతికి ఉండగానె, మరో తాజమహల్‌ కట్టిస్తా (“ఆగు జర జర నర్సమ్మా ” సినారె). హాస్య పాత్రలకిటువంటి హాస్యాస్పదమైన వాక్యాలు రాయటంలో విచిత్రం లేదు. కాని, sense of humor ఎక్కువగా ఉన్న కొందరు కవులు, ప్రధాన పాత్రల కోసం రాసిన పాటల్లో కూడ యిటువంటి వాక్యాలు దొర్లించిన సందర్భాలున్నయి. ఇవి ఎక్కువ నవ్వు తెప్పిస్తాయి. ఉదాహరణకి “ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా ” వంటివి. ముఖ్యంగా,వేటూరి ఇటువంటి మరపురాని ప్రయోగాలు కొన్ని చేసారు. “రాక్షసుడు ” సినిమా కోసం ఆయన “అచ్చా, అచ్చా, వచ్చా, వచ్చా ” అనే పాట రాసారు. ఆద్యంతమూ ద్విత్వ చకారం మీద అనుప్రాసతో సాగే ఈ పాట అడ్డూ అదుపూ లేకుండా సాగుతుంది. ఒకచోట అతను “మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా ” ప్రకటిస్తే, వేరొకచోట ఆంఎ ” నీకు ప్రేమంటే తెలుసా బచ్చా? ” అని ప్రశ్నిస్తుంది. ఇది ఆయన sense of humorకొక మచ్చు తునక. గత సంవత్సరం వచ్చిన “చూడాలని ఉంది ” అనే సినిమాలో ఆయనే,”మనస్సా ఎక్కడున్నావ్‌ యిదేనా రావటం? ” అనే మరొక పాట రాసారు. ఇందులో “ఇది అందమైన వింత ఆత్మకధ” అనే ప్రయోగం ఉంది. సరే,దీనికేదో ఒక అర్థం చెప్పుకొని సరిపెట్టుకోవచ్చు ననుకోండి. కాని, పాట చివర్లో, “బహుశ యిదేమొ భ్రామ ప్రెస్సు కధ ” అని రాసారు! ఈ భ్రామ ప్రెస్సు గురించి ఏడవ తరగతిలోనో, ఎనిమిదవ తరగతిలోనో, సామాన్య వాచకంలో చదివినట్టు గుర్తు. అయితే, ఒక యుగళగీతంలో దీని ప్రస్త్తావన ఎందుకొచ్చిందో మన కర్థం కాదు. ఇటువంటి ప్రయోగాలు చెయ్యటానికి, కేవలం sense of humor మాత్రమే కాకుండా, కొంత సాహసం కూడా కావాలి.

సినిమా పాటల్లో కూడా కొంత మంచి లేకపోలేదు. కాని, ఎందువల్లనో, వీటికి తగిన సాహిత్య గౌరవం దక్కలేదు. తెలుగువారి జీవనక్రమంలో సినిమా పాటలకొక ప్రత్యేక స్థానం ఉందన్న విషయం మనం మరచిపోకూడదు. ఎవరైనా ఈ శతాబ్దంలో వచ్చిన వంద మంచి పాటల్ని ఎంచే ప్రయత్నంచేసినా తప్పు లేదు. ఆ రకంగా వాటి ప్రాధాన్యతను గుర్తించినట్టుగా కూడా ఉంటుంది.

(ఈ వ్యాస రచనలో నాకు సహకరించిన నా సోదరి రామ లక్ష్మి, నా సతీమణి శ్రీకళ లకు నా కృతజ్ఞతలు)