సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం. తన సాహిత్యకళావారసత్వ సంపదను నిరర్థకమని, అప్రస్తుతమని విసర్జించే సమాజం కేవలం ఒక నిలువనీటి మురికిగుంట. ఈ పోలిక ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజానికి నప్పినంతగా ఇంకే సమాజానికీ నప్పదు. కళాకారులకు, సృజనశీలులకు కులం, మతం, వాదం వంటి బురదను అంటగట్టే సంప్రదాయాన్ని తెలుగువారు ఇప్పటికీ బలంగా నిలుపుకుంటున్నారు. ఇప్పుడు సాహిత్యకారులు కూడా నిర్లజ్జగా ఆ సమూహాల్లో చేరి ముందు నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు పాఠకులు, సాహితీవేత్తలు ఇంకా గతకాలపు రచయితలనే పట్టుకు వేలాడుతున్నారు, వారి రచనలనే ప్రస్తావిస్తున్నారు తప్ప తమవంటి సమకాలీన రచయితలను గుర్తించటం లేదు, చదవటం లేదు అన్న ఆక్రోశం ఒకటి ఇటీవల కొంత తరచుగా వినిపిస్తున్నది. ఈ రచయితల ఆక్రోశం వెనుక ఉన్నది కేవలం అజ్ఞానం, అసమర్థత. వీరిని బావిలో కప్పలుగా పోల్చటం అసమంజసం. కప్పలకు అవి ఉండే బావి గురించి కొంతయినా అవగాహన ఉంటుంది. నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు. ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినబడుతుండడానికి కారణం తెలుగు పాఠకులలో ఉత్తమసాహిత్యాభిరుచి ఎంతో కొంత ఇంకా మిగిలే ఉండడం; ఆ రచనల్లోని వస్తుపరమైన సార్వజనీనత, రచనాపరంగా వారు చేసిన ప్రయోగాలు, తెచ్చిన విప్లవాలు, ఆయా రచనల ద్వారా వారు నేర్పిన పాఠాల సార్వకాలీనత… ఇలా, ఈ కాలం రచయితలు తమ రచనల నుండి తీసి చూపించలేని ఎన్నో గొప్ప లక్షణాలు ఆ రచయితల రచనల్లో ఉన్నాయి. సమకాలీన రచయితలలో పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల రచయితలు బహుకొద్ది మంది. ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు నాసిరకం పాఠకులను, వారు కొట్టే తాలు చప్పట్లను కోరుకుంటారు. మంచి రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ, మంచి పాఠకులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వారిలో ఆలోచననూ రేకెత్తించగలుగుతారు. తమను గుర్తించటం లేదని ఆక్రోశించే రచయితలది ఏ కోవో చెప్పనక్కర్లేదు. తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు. బ్రాహ్మణులనో, హిందువులనో కేరికేచర్ విలన్లుగా చూపుతూ సైక్లోస్టయిలు కథలు వరుసగా అచ్చోసినంత మాత్రాన అవి అస్తిత్వవాద సాహిత్యపు ఆణిముత్యాలయిపోవు. ఈ ధోరణులు తెలుగు సాహిత్యానికి పట్టిన పుళ్ళు! గాజుముక్కలను చూసి రత్నాలనుకునేంత అవివేకులు కారు తెలుగు పాఠకులు. ఏది మంచి సాహిత్యమో ఏది కాదో, ఏది నిలుపుకోవాలో ఏది పారవేయాలో వారికి బాగా తెలుసు. ఇక, ఇలా ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినపడుతుండడానికి కారణం మైనారిటీ రచయితలను తొక్కివేయడం కోసం అగ్రవర్ణాలు పన్నిన వ్యూహం అని ధ్వనింపచేయబూనడం తెలుగు రచయిత అందుకున్న కొత్త లోతు. తమ రచనాపటిమతో కాక రాజకీయంతో సమాజపు గుర్తింపు కోసం చేస్తున్న యాచన ఇది! తెలుగు సాహిత్యకారులు ఇంతకంటే దిగజారలేరు అనుకున్న వారికి ఇదొక కనువిప్పు. ఇటువంటి వారిని నిగ్గతీసి నిజస్వరూపం చూపి వారిని వెలివేయలేని సాహిత్యసమాజాన్ని సభ్యతతో పరామర్శించవలసిన అవసరం కనపడదు.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
అక్టోబర్ 2024 సంచికలో ...
- Tree Toons
- అక్టోబర్ 2024
- అజ్ఞాతవాసి
- అతని రాక
- అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం
- అలనాటి యువ కథ: స్వామీజీ
- ఆల్బమ్
- ఎందరిని…
- కథకుడి అంతర్మథనం
- కాలుష్యాష్టకం
- దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8
- నా అనే నేను లేక
- పాత్రదానం
- పెద్దమ్మ మాటలు
- మాతృకాంక్ష
- యూట్యూబ్లో ఈమాట: సెప్టెంబరు 2024
- వాసన
- సంగ్రహము
- సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’
- సంపాదకునికి ఉత్తరం
- సాక…