ఆగస్ట్ 2024

గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన తెలుగు సాహిత్య సమావేశాలన్నింటిదీ ఇంచుమించు ఒకే మూస పద్ధతి. వీటికి సమావేశం ముఖ్యం, సాహిత్యం ఒక సాకు. అప్పుడప్పుడూ కొందరు సాహిత్య ప్రయోజనం కోసం కొంత ప్రయత్నించిన దాఖలాలున్నా, అధికశాతం సమావేశాల లక్ష్యం వేరు: సెల్ఫ్ ప్రమోషన్ కొన్నిటికి, కోటరీలు మరికొన్నిటికి; రచయితల ఎదుగుదల వేటిలోనూ భాగం కాదు. సాహిత్య బాంధవ్యాలు కేవలం సాహిత్యేతర అవసరాలకే అని కనిపిస్తూనే ఉంటుంది. ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని నిర్వహిస్తున్నారన్నది వారికి మాత్రమే తెలిసిన చిదంబర రహస్యం. నిర్వాహకులు సాహిత్యాభివృద్ధి కోసం జరుపుతున్నాం అని చెప్పుకొనే ఈ సభలు సాహిత్యం వాటివల్ల బాగుపడదు అని నిరూపిస్తూ ఉండడం ఒక వింత. ఏడాదికొకసారి ఉత్సవాలుగాను, వారం వారం ఉద్యమం చేసినట్లుగానూ సాహిత్య సమావేశాలు నిర్వహించేవాళ్ళు ఇప్పుడు తెలుగు సాహిత్య సమాజంలో వద్దన్నా కనపడతారు. ‘విభిన్నంగా’, ‘సౌహార్ద్ర వాతావరణంలో’ జరిపే ఈ సభలన్నిటిలోనూ వేదికను అలంకరించడానికి సాహిత్యపెద్దలు, విశిష్ట అతిథులు ఎలానూ ఉంటారు. ఈ కురువృద్ధులలో కొందరికి కనపడదు. కొందరికి వినపడదు. కొందరు చూడలేరు, వినలేరు. కొందరికి చూడాలని, వినాలనీ ఉండదు. మరికొందరు వక్తలు తాము మాట్లాడవలసిన పుస్తకాన్ని మొదటిసారి ఆ సభలోనే తిరగేస్తారు. ప్రధాన వక్తలు సైతం, మాటకీ మాటకీ పొంతన లేకుండా రచనను వదిలేసి రచయిత గురించి మాట్లాడతారు. అసందర్భంగా వాళ్ళ అనుభవాలను వల్లె వేస్తారు. కలిసి తిరిగిన తిరుగుళ్ళు, కలిసి పోయిన హోటళ్ళు, కలిసి తిన్న తిళ్ళు, పంచుకున్న టీ సిగరెట్‌లు – ఈ సోది లేని సాహిత్య సభలు తెలుగునాట అరుదు. స్నేహాల ప్రదర్శన, మాట్లాడవలసిన అంశం మీద స్పష్టత లేకపోవడం, రచన కన్నా రచయిత మీద దృష్టి పెట్టడం, సమయపాలన లేకపోవడం – స్థూలంగా ఇవీ ఈనాటి తెలుగు సాహిత్యసభల పోకడలు. సాహిత్య సభల్లో స్నేహం ఉండకూడదా? అంటే, కేవలం స్నేహం కోసమేనా సభ? అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఈ సాహితీస్నేహాలు, ఈ సౌహర్ద్రత రచయితలకు నిజంగా అవసరమా? అందుకే, సమావేశం ముఖ్యం సాహిత్యం ఒక సాకు అనడం. ఇవేవీ లేకుండా రచయితలు ఒకచోట కూర్చొని నిక్కచ్చిగా సాహిత్యం గురించే మాట్లాడుకోలేరా? విమర్శను ఇచ్చిపుచ్చుకోలేరా? ఆమాత్రం చేతకాకపోతే రచయితలమని ఎందుకూ చెప్పుకోవడం? అందుకే, సాహిత్య సభలు ఎందుకు? అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు నిజాయితీగా జవాబులు వెతకడం మొదలైతే, ఆ జవాబుల్లో నుండి – సాహిత్య స్నేహాల పరస్పర పొగడ్తల ప్రహసనాన్ని పక్కన పెడితే – నిజంగా సాహిత్యానికి ఉపకరించేవాటిని గమనించుకోవచ్చు. వాటిని మెరుగు పరుచుకునే ఆలోచన చెయ్యవచ్చు. మాట్లాడదలచిన అంశం మీద వక్తలు ముందుగానే ఒక వ్యాసం సిద్ధం చేసుకుని రావాలని, దానికి పత్రికలలో ప్రచురణార్హత ఉండాలని ఒక నియమం పెడితే, వేదికనెక్కడానికి ఉరికి వచ్చే ఉసియన్ బోల్టులందరూ వీల్‌ఛెయిర్ కోసం లైను కడతారు. తెలుగు నాట రచన అంటే ఏ రకమైన పరిశ్రమా అక్కర్లేని కళ అన్న అపోహ రచయితల్లో బలంగా ఉంది. ఇది వక్తలలోనూ ఉంది. ఇప్పుడు జూమ్, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా పుణ్యమా అని, సభావేదిక మీద నట్టుతూ నక్కుతూ పదాలకోసం తడబడుతూ ఈ వక్తలు చేసే అప్రస్తుత అప్రసంగాలు ప్రపంచమంతా పాకి తెలుగు సాహిత్యం వ్రాతలోనే కాదు ప్రసంగంలోనూ నేలబారు స్థాయికి పడిపోయిందని చాటి చెప్తున్నాయి. రచయితల రచనాకౌశలం మెరుగు పడటానికి ఉపయోగపడని ఏ సభ, సమావేశం అయినా వారికి హాని చేసేదే అని రూఢి చేస్తున్నాయి.