తెలుగునాట సాహితీప్రియులు అందరూ ఎదురు చూసేది డిసెంబరు జనవరి నెలలలో జరిగే పుస్తక ప్రదర్శనల కోసం. ఇవి కేవలం రచయితలకు, పాఠకులకూ మాత్రమే కాదు, ప్రచురణకర్తలకు, పుస్తక విక్రేతలకూ కూడా ముఖ్యమైన వేదికలు. ఈసారి పుస్తక ప్రదర్శన తెలుగునాట మునుపు ఎన్నడూ చూడనన్ని కొత్త పుస్తకాలతో, కొత్త ఉత్సాహంతో ముందుకొస్తోందని తెలుస్తోంది. సోషల్ మీడియా ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎందరో యువ, ఔత్సాహిక రచయితలు తమ తమ పుస్తకాలను ప్రచురిస్తున్నారు. కొత్త ప్రచురణ సంస్థలు తమ పుస్తకాలతో కొత్తగా ముందుకు వస్తున్నాయి. తమ ప్రచురణల ద్వారా ఉత్తమ సాహిత్యానికి పట్టం కట్టాలన్న వారి అభిలాషకు తగినట్లుగానే అనల్ప విభిన్నమైన సాహిత్యాన్ని ప్రచురిస్తూ వస్తోంది. అలాగే, ఒరవడి, రేగి అచ్చులు, ఝాన్సి, ఎలమి వంటి ప్రచురణ సంస్థలు ఈ ఏడు తమ కొత్త పుస్తకాలతో ముందుకు వచ్చాయి. ఛాయ, ఆన్వీక్షికి ప్రచురణ సంస్థలు కొత్త తరాన్ని ఆకర్షించేందుకు వాళ్ళకు పోటీలను, తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం, ఆంగ్లానువాదాలపై వర్క్‌షాప్‍లనూ నిర్వహిస్తున్నాయి. అజు పబ్లికేషన్స్ ఒక నవలను లక్ష కాపీలు ప్రచురించి, అమ్మి ఈ కాలానికి ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఈ బుక్ ఎక్జిబిషన్ ఒక లక్ష్యంగా ఔత్సాహిక రచయితలు ఎంతో మంది తమ రచనలను సమీక్షించుకుని పుస్తక ప్రచురణకు సిద్ధపడుతున్నారంటే, ఈ ప్రదర్శనల స్థాయిని, ఇది అందిస్తున్న ఉత్సాహాన్ని ఊహించవచ్చు. పుస్తకాలు విరివిగా వస్తున్నకొద్దీ పాఠకులు పెరుగుతారు. పాఠకులు పెరిగితే నాణ్యత గురించి చర్చలు పెరిగి మంచి సాహిత్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పుస్తక ప్రదర్శనలు విపులమైన సాహిత్య చర్చలకు వేదికగా కూడా ఉండాలి. ప్రతి ఏడాది, ఆ ఏడాదిలో వచ్చిన పుస్తకాలను పరిచయం చెయ్యాలి, వాటి మీద విరివిగా చర్చలు జరగాలి. న్యూ యార్క్ టైమ్స్ వంటి పత్రికలు ప్రతి ఏడాది చదవవలసిన పుస్తకాల జాబితాలను రచయితల సిఫారసులతో ప్రచురిస్తుంటుంది. తెలుగు ప్రచురణ సంస్థలు, రచయితలు కూడా, ఈ నెలంతా అలాంటి మంచి పుస్తకాల జాబితాలను ప్రచురిస్తూ ఉంటే బాగుంటుంది. ఆ జాబితాల్లో, ఈ ఏడాది ఉత్తమ పుస్తకాలు, తప్పక చదవవలసిన కవిత్వం, కథలు వంటివి ఉండాలి. వార్షిక సంకలనాలు, ఉత్తమకథల సంకలనాలు ఇప్పుడు వెలువడటం లేదని కాదు, కాని వీటిని పాఠకుల నుండి కూడా ఆహ్వానించాలి. కొత్తవాళ్ళు, పాతవాళ్ళు, రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు ఇలా విభిన్న సమూహాల నుండి ఈ జాబితాలు వెలువడితే మనకు సాహిత్యం ఎలా స్వీకరించబడుతోంది అన్న దాని మీద కూడా అవగాహన పెరుగుతుంది. సాహిత్యానికి సంబంధించి మనం చెయ్యబోయే ఏ పనికైనా అది అదనపు బలమవుతుంది. ఈ ప్రదర్శనోత్సవాల వల్ల సాహిత్యాభిమానులలో కలిగే ఉత్సాహాన్ని కొంతకాలం నిలుపుకోవాలంటే సాహిత్యచర్చలు విరివిగా జరగడం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వాటినుండే మనకు కొత్త పుస్తకాల గురించి తెలుస్తుంది. కొత్త పాఠకులు దొరుకుతారు. ఒక్క కొత్త సాహిత్యతరం మొలకెత్తుతుంది. [వీటన్నిటికన్నా ముఖ్యంగా ముందు చేయవలసింది – ఇతర రాష్ట్ర భాషాసాహిత్య పుస్తక ప్రదర్శనలకు లేనిది, తెలుగువారికి మాత్రమే ఉన్నదీ – పచ్చళ్ళు, పిండివంటలు, ఫలహారాలు తదితర అసాహిత్యసరంజామా అమ్మే స్టాల్స్‌ను ఈ పుస్తక ప్రదర్శనస్థలాలకి కనీసం అరమైలు దూరంలోనో, ప్రదర్శన మైదానం సరిహద్దుల వెలుపలో ఉండేటట్టు చూడటం. ఇది ఎందరు తెలుగు సాహితీప్రియులు ఎంతగా హర్షిస్తారూ అన్నది మనకనవసరం.]