కళావరు రింగుగారు ఎంత సహృదయురాలో విజయనగరం లోనే కాదు దేశం లోనే ఎవరు ఎరగనిది! బీద విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వటమే కాదు, ఆర్థిక సాయం చెయ్యటం, అనాధలను ఆదుకోవడం కూడా. వీణ గొప్పగా వాయించే నాయుడుగారి అభిమాన శిష్యుడయిన అనంతరావు అంటే ఆ గానకళాకోవిద అభిమానించి ఆదుకోదా!
శీర్షికలు సంచికలు
ధర్మంతో కూడి ఉన్న ప్రతీ ప్రేమా గొప్పదే. ప్రియురాలిపై లేదా ప్రియునిపై ప్రేమ; పశుపక్ష్యాదులపై ప్రేమ; తల్లిదండ్రులపై ప్రేమ; పిల్లలపై ప్రేమ; వ్యక్తిత్వంపై ప్రేమ; ఏ ప్రేమనూ తక్కువ చేసేందుకు అవకాశమే లేదు. ఈ సంగతులన్నీ ముందువెనుకలు చెప్పకుండా మీతో మనవి చేస్తున్న కారణం, ఈ సారి నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్న పై పద్యం ఒక కొడుకుకు ఉన్న తండ్రి ప్రేమను వర్ణించే కవిత.
పర్వత శిఖరాలు… కాలంతో వాటికి పనేముంది? కాలాతీతమైన స్థితి వాటిది. సిక్కులు ప్రార్థించేటప్పుడు, ‘సత్ శ్రీ అకాల్’ అంటారు. అ-కాలం. కాలంతో పని లేనిది. ఎంత గొప్ప మాట. కాలాతీత అవస్థలో ఎవరి కాలానికైనా అంతం ఎలా వస్తుంది? కాలా! ఓ మృత్యుదేవతా! నా దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యొద్దు! నిన్నెత్తి విసిరేస్తాను! ఎందుకని… కొంచెం కూడా బాధ అనేదే లేదు? బాధ అనేదే జీవితం. అది జీవితం మీద ఎప్పుడూ కదలాడే, మృత్యువు నీడ.
ఒళ్ళోని పిల్లాడి నిద్ర చూసి
వాడులేని లోకమంతా
గొంతులోకి పొంగుకొచ్చి…
పాట ఓ క్షణకాలం ఆగింది.
ఎక్కడి నుంచో చిరుగాలి వీచింది
పిల్లాడి ముంగురులును కదిలిస్తూ…
ఆమెకు ఈ తంతు అంతా అయోమయంగా అనిపించేది. ఉజిరెలో హాస్టల్లో అమ్మాయిలు పెళ్ళి గురించి, భర్త గురించి గుసగుసలాడుతూ కిసుక్కున నవ్వుకుంటున్నవారు ఆమెను చూడగానే మాటలాపి మౌనం వహించేవారు. ఎందుకంటే ఆమెకి భర్త గురించి, పెళ్ళి గురించి, తర్వాతి సంగతుల గురించి మాటలు వింటే యాక్ అనిపించేది. అందుకే ఆమె వచ్చాక హాస్టలు అమ్మాయిల ఆటపట్టింపులు ఆగిపోయేవి.
చప్పుడు చేస్తూ
మట్టతో పాటు
పడిన కొబ్బరికాయలా
ఉరుమొకటి
ఇంక జల్లుపడుతుందని
ఎక్కడ్నించో ఎగిరి వచ్చింది
తూనీగ
కొండల మధ్యలో మొత్తం ఐదు వందల చెట్లున్న తోట. పదిహేను రోజుల్లో కాయలు కోసి మాగపెట్టి ఎప్పటికప్పుడు పార్శిల్ చేసి టవునుకు పంపాలి. ఇంకొక్కర్ని ఎవరైనా కలుపుకుంటే కూలి తగ్గిపోతుందని ఇద్దరే ఒప్పుకుని ఇంత దూరం వచ్చారు. వచ్చి కూడా పది రోజులు దాటిపోయింది. ఇంటి మొకం చూడకుండా తోటలోనే ఉండి కారం, సంకటి వండుకుని తింటూ పనిలో రోజులు మరిచిపోయారు. కానీ నాలుక నీసు కోసం అల్లాడుతోంది.
ప్రేమ బరువును
గుండెల మీంచి భుజాల మీదికి
భుజాల మీంచి చేతుల్లోకి
చేతుల్లోంచి కనురెప్పల మీదికి
మార్చుకున్నాక
తిరుగుదారి పట్టాను.
నిస్పృహకి గురిచేసిన ఈ పెళ్ళి విషయంలో, ఎప్పటిలాగే, ఆమెను తను ఎందుకు, ఎలా పోగొట్టుకున్నాడన్న దానికి కారణాలు అన్ని రకాలుగానూ ఊహించడానికి ప్రయత్నించాడు. రాజీపడలేని ఈ నిజం అతన్ని ఆమూలాగ్రం ఒక కుదుపు కుదిపి, అప్పటి వరకు అతను ఎదుర్కొని ఉండని సత్యాన్ని అకస్మాత్తుగా అతని కళ్ళముందుంచింది: అది ఏ తొడుగులూ లేకుండా, అంతరాంతరాల్లో అశాంతితో, శుష్కమై నిలిచిన అతని సిసలైన వ్యక్తిత్వం.
అహం దెబ్బతిన్న పెద్దదేశం,
చిన్నదేశాన్ని కాలరాసింది.
శవాలన్నీ మట్టిలో కలిసినా
శిథిలాలు చరిత్ర సాక్ష్యాలుగా
మిగిల్చిన యుద్ధమక్కడ.
అహం తొడుకున్న మతం
గుడుల్నే కాదు, చరిత్రనీ చెరిపేసింది.
మొగ్గ ముడుచుకుని
మొహమాటపడింది
రవికిరణపు ధైర్యంతో
చక్కగా విరిసింది
కొమ్మను కోల్పోయి చెట్టు దుఃఖపడింది
రెక్క విరిగిన పిట్ట భుజం తట్టింది
నా ముఖాన్ని నేను నమ్మనట్లుగా నిన్ను
తోడుగా లోపలంతా కలియతిరిగితే
అద్దం అవసరం లేని అండ
నీడతో పోటి పడి ఆసరా
నీలో దగ్గరిలో దగ్గరగా చూసి పొంగిన
అమాయకత్వానికి ఇప్పుడే తెలిసింది.
పాఠకుణ్ని కథల్లోకి లాక్కెళ్ళటానికి ప్రతి రచయితకూ తనదైన ఓ మంత్రదండం ఉండాలి. దేశరాజు సొంతం చేసుకున్న ఆ మంత్రదండం: శైలి. ఉపోద్ఘాతం లేకుండా సరళసుందరమైన వాక్యాలతో నేరుగా కథను ప్రారంభిస్తాడు. సంపుటిలో మొదటి కథ ‘కమ్యూనిస్టు భార్య’లోని మొదటి వాక్యంలోనే ఆ విద్యను ప్రదర్శించాడు.
అడ్డం నీట సంచరించే ప్రాణి మధ్యలో అక్షరం మార్చుకుంటే కంపము (5) సమాధానం: జలదరము ఉత్తరాంధ్ర యాస మధ్యలో వాయిద్యవిశేషం (3) సమాధానం: మద్దెల […]
క్రితం సంచికలోని గడినుడి-77కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవైరెండు మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-77 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
ప్రతీ ప్రాంతీయ సమాజమూ తమ భాష, కళలు, సంస్కృతుల మనుగడ, కొనసాగింపుల కోసం తపన పడుతుంది. ప్రత్యేకించి ఒక కళ కనుమరుగవుతోందన్న భయం ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నమూ కనిపిస్తుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగులో సాహిత్యానికి ఆదరణ తక్కువవుతోందన్న ఆందోళన ఒకటి నేటి వాతావరణంలో ఉంది. కానీ గమనిస్తే ఇలా ఆందోళన పడిన ప్రతీ తరం వెనక కొత్త తరం రచయితలు, కవులు పుడుతున్నారు, సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగు భాషకి మరికొన్ని తరాల దాకా, కనీసం ఇప్పటికి బతికున్న తరంలో పుట్టిన ఆఖరు మనిషి చనిపోయేదాకా, ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. తెలుగులో సాహిత్యానికి కొత్తగా రాబోయే లోటూ లేదు. కాని, సాహిత్యాదరణ, సాహిత్యాభిరుచి ముందుతరాలలో మరింతగా పెరగాలి అనుకుంటే – వారికి వ్రాతలో మనం ఏం మిగుల్చుతున్నాం? ఎటువంటి సాహిత్య లోకంలోకి వారిని ఆహ్వానిస్తున్నాం? బహుముఖీనమైన మన సాహిత్యంలో ఎన్ని ముఖాలను మన తరువాతి తరాలకు కనపడేలా, మరీ ముఖ్యంగా కనపడకుండా ఉండేలా చేస్తున్నాం? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు. మనకే ప్రత్యేకమో కాదో తెలియదు కాని, తెలుగులో సీరియస్ సాహిత్యం, సీరియస్ రచయితలు అనే ఒక ప్రత్యేక ప్రథ ఉంది. పాప్యులర్ సాహిత్యంగా పరిగణించబడే ఇతర సాహిత్యప్రక్రియల పట్ల కేవలం – హాస్యరచనలని, క్షుద్ర రచనలని, వంటింటి ఊసులని, కలల కబుర్లని – చిన్నచూపు ఉండటం మనకు చిరపరిచితం. ఈ చూపు, విచిత్రంగా పాఠకులకు ఏనాడూ పట్టలేదు – పుస్తకాదరణను పరిగణనలోకి తీసుకుంటే, వాళ్ళు తమ తమ అభిరుచులకు అనుగుణంగా అన్నిరకాల సాహిత్యాలనూ ఆదరిస్తూనే వస్తున్నారన్నది స్పష్టం. ఈ ధోరణి కేవలం సాహిత్యాన్ని, దాని ప్రయోజనాన్ని నిర్వచించి నియంత్రించబూనిన రచయితల సంఘాలది. పాఠకులు ఏది చదవాలో నిర్దేశించాలన్న దౌర్జన్యం అది. కళాకారులుగా ప్రతి ఒక్కరికీ తమదైన ఆశయం, రాజకీయ దృక్పథం, భావజాలం ఉండవచ్చు. వారు వాటికి అనుగుణంగా రచనలూ చేయవచ్చు. తప్పు లేదు. కాని, అది మాత్రమే అసలైన సాహిత్య ప్రయోజనమని, అలా కాని రచనలను, ఆయా రచయితలను ఉపేక్షించడం లేదా కువిమర్శకు గురి చేయడం సాహిత్యానికి, సదరు ఆశయానికీ కూడా హానికరమే. ఇందువల్లనే నిర్బంధసమాజాల్లో సప్తవర్ణ సమ్మిళితమైన సాహిత్యం అన్ని రంగులూ హంగులూ కోల్పోయి వర్ణవిహీనమైన ప్రాపగాండా సాహిత్యంగా మాత్రమే మిగిలేది. ఎల్లలు లేని సాహిత్యం నిజాలు చూపిస్తుంది, కలలూ కననిస్తుంది; ప్రశ్నిస్తుంది, సమాధానాలూ చూపుతుంది; ఆశయాలకు ఆలోచనలకూ స్పష్టత నిస్తుంది, మేధోమథనానికి దారి తీస్తుంది, కాసేపు ఆదమరిచి నవ్వుకునేలానూ చేస్తుంది. ఏ రకమైన సాహిత్యప్రక్రియ అయినా ఇంకొకదానికంటే గొప్ప కాదు, తక్కువా కాదు. రచయిత ఆశయం వల్ల సాహిత్యానికి విలువ పెరగదు, తరగదు కూడా. సమాజంలో దేని స్థానం దానికుంటుంది. అన్ని రకాల సాహిత్యప్రక్రియలూ సమానమైన ఆదరానికి నోచుకోగల స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మాత్రమే ఔత్సాహిక రచయితలు విభిన్నమైన సాహిత్యప్రయోగాలతో ముందుకు వస్తారు. ఆ విభిన్నతతో పాటు పాఠకులూ పెరుగుతారు. భాష మనుగడ మరింత పెరుగుతుంది. రచనా విమర్శలో భావజాలపు చీటీలను తీసేసి, రచనను చర్చించడం ఒక అవసరమని సాహిత్యకారులు గమనించడం, ప్రస్తుత వాతావరణంలో మార్పు తీసుకురావడానికి దోహదపడే ఒకానొక ముఖ్యమైన అంశం. సృజన అన్ని నియమాలనూ త్రోసిరాజని బతుకుతుంది. ఇక్కడ చెల్లుబాటయ్యే నియమం ఏదైనా ఉందీ అంటే, అది ఏ నియమమూ ఉండకూడదన్నదే.
గొప్ప పాట! గొప్ప భావన! సీతమ్మ శోకం లోకానికంతటికీ తెలిసేది, జలధితరంగాల లాగా. రామయ్య బాధ లోకానికి తెలిసేది కాదు. ఆ శోకం ఆయన మదిలో భద్రం. ఇది అర్థానికి ఒక పొర. ఈ తెర తొలగిస్తే మరో గాఢార్థం. కనుకట్టులో కనువిప్పును దాచిన మహాకవి వేటూరి! కనుకట్టు: సీతారాముల వియోగం; కనువిప్పు: సముద్రము తరంగము, రెంటికీ వియోగమా?
తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్. విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’
మతాబా గొట్టాలెన్నయ్యాయి? లెక్కపెట్టేరా? అవి చాలవు. ఇంకా అంటించాలి. సన్నపాటి పెన్సిలుతో కొన్ని చెయ్యాలి. పంచడానికి వాటిని ఇద్దాం. చచ్చటి కణికికి, చాకలి నారాయణకి, ముత్తెమ్మ వాళ్ళ గూడెం పిల్లలకీ ఇవ్వాలిగా! ఇంకా నయం, రూళ్ళకర్రకి చుట్టి గొట్టాలు చెయ్యలేదు! ఎంత మతాబు మందూ వీటికే చాలదు. ఇంక చిచ్చుబుడ్లలో ఏం కూరతాం?