ప్రతి మరణం

ప్రతి రోజుకీ
నావి రెండు ఊహలు
ఇదే ఆఖరి రోజు అనే ఊహ ఒకటి
ఇదే మొదటిరోజు అన్న ఊహ ఇంకొకటి
మొదటి ఊహ
నా లోపలి మైదానంలో ఆడుకునే
పసిపాప
రెండో ఊహ
నా నడకలకు ఊపిరిపోసే కాళ్ళ జత

చివరి బిందువుల్లేని చలనంగా స్థిరపడ్డాక
నేను నదికి చెందుతానా లేక
తీరానికా అన్న మీమాంసకు కాలం చెల్లిపోయింది

నేను చెట్టుని
ప్రతి తుఫాను తర్వాతా
నా మరణం
వాయిదా పడుతుంటుంది

నిజానికి నన్ను
శిథిలంకాని వాక్యాన్ని చేసేది నువ్వే
నువ్వు పేజీని మడత పెట్టే ప్రతిసారీ
నేను కొత్తగా పుడుతుంటాను

నన్నీ నీలిగ్రహం మీద వదిలిపెట్టిన ఉల్కకు
నా మృత్యురహస్యం తెలుసు
కానీ అదిప్పుడు
నన్ను గర్భాన మోస్తున్న నేల

నేను శైశవాన్ని
ప్రతి మరణం నాకో నిద్ర
ఒక్క స్వప్నపు వెలుగుధూళి పడ్డా
చప్పున మేలుకుంటాను

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...