ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది కవయిత్రి జయప్రభ.

శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం.

పుస్తకం కొనుగోలు, పఠనానుభవం – బాగున్నాయి. పైగా, లీగల్ గా కొంటున్నాం కనుక, ఆత్మసంతృప్తి కూడానూ! బయటి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే. అయితే, ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం.

ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.

పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. – ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.

ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు.

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత.

నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.

రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.

ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.

ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.

ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.

నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.