ఇరవైయవ శతాబ్దపు మొదటి రెండు దశకాలు సంధి కాలం వంటివి. ఆ కాలంలో ఎందరో మహానుభావులు భారతదేశంలో, ఆంధ్రదేశంలో పుట్టారు. వారికందరికీ ఈ దశకంలో శతజయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాము. అలాంటి ముగ్గురు ప్రముఖుల శతజయంతి సమారంభాలను డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (డీ. టీ. ఎల్. సీ) సెప్టెంబరు 26, 27 తేదులలో నిర్వహించింది. ఆ ముగ్గురిలో శ్రీశ్రీ కవి, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు) నవల, కథ, సినీ, సాహిత్య వ్యాస రచయిత. గోపీచంద్ నవలారచయిత, తాత్వికవేత్త, సినీ రచయిత కూడా. ఆ శతజయంతి సభల గురించి విపులంగా నేను రాసిన సమీక్షను మీముందు ఉంచుతున్నాను.
మొదటి సదస్సు: పరిచయాలు
సభారంభంలో డి.టి. ఎల్. సీ అధ్యక్షుడు మద్దిపాటి కృష్ణారావు సభికులను ఆహ్వానిస్తూ స్వాగత వాక్యాలు పలికారు. మొదటి సదస్సులో కుటుంబరావు కుమారుడు రోహిణీప్రసాద్, గోపీచంద్ కుమారుడు సాయిచంద్, వెల్చేరు నారాయణరావు మాట్లాడారు. అవాంతర కారణాల వలన శ్రీశ్రీ కుటుంబ సభ్యులెవ్వరూ ఈ సదస్సుకు రాలేకపోయారని తెలిసింది. ఈ సదస్సుకు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి అధ్యక్షత వహించారు.
రోహిణీప్రసాద్ తన తండ్రిని గురించి మొట్టమొదట మాట్లాడుతూ వారి కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో వివరాలు చెప్పారు. కొడవటిగంటి అనే ఇంటి పేరు కుటుంబరావుగారి తండ్రి దత్తత స్వీకారమువల్ల వచ్చిందని, వారి ముందటి ఇంటి పేరు శ్రీధర అని చెప్పారు. కుటుంబరావు ఐదేళ్ళప్పుడు తండ్రిని, పదకొండు సంవత్సరాల వయస్సులో తల్లిని కోల్పోయారు. వారి నాన్నమ్మ పెద్దక్కయ్య ఇంటిలో పెరిగారు. పదహారేళ్ళకు 1925లో పెళ్ళి చేసికొన్నారు. 1929లో డిప్రెషన్ కారణంగా పరీక్షకు రుసుము చెల్లించడానికి డబ్బులు లేక బెనారసు నుండి తిరిగి వచ్చారట. తండ్రి లేని కారణంవల్ల చిన్నప్పటినుండి స్వతంత్రంగా ఆలోచించే అవకాశం కలిగింది. కొకు అన్నగారు వేంకటసుబ్బయ్య సాహితీసమితి సభ్యులట. కొకు అన్నగారు ఆంతరంగిక కారణాలవల్ల గృహత్యాగం చేయగా తమ్ముడి, చెల్లెలి సంరక్షణాభారాన్ని కొకు అంత చిన్నవయస్సు లోనే తనపై వేసికొన్నారు. చిన్నప్పటినుండి గ్రామఫోను, ఫోటొగ్రఫీ, పుస్తకాలు, సాహిత్యం ఇత్యాదులపైన ఆసక్తి ఎక్కువ. బాలగంధర్వ, దీనానాథ్ మంగేష్కర్ పాడిన ఎన్నో పాటలను తరచు వినేవారట. నాటక సినీ రంగాలతో ఎంతో పరిచయము వారికి. సమాజానికీ వీటికి గల పరస్పర సంబంధాన్ని బాగుగా అర్థం చేసికొన్నారు. గిడుగు రామమూర్తి పైన వీరు రాసిన మొదటి వ్యాసం కృష్ణాపత్రికలో అచ్చయింది.
కుటుంబరావు చిన్నప్పుడు అభ్యాసము కోసం ఎన్నో వ్యాసాలను కథలను రాసి చింపివేసేవారట. వెల్స్, కానన్ డాయిల్ వంటి వారి రచనలను అప్పట్లో తెనాలిలో చదివారట. పాతతరం వారిది వెనుక చూపు, కొత్త తరం వారిది ముందు చూపని వారి భావన. మూఢ నమ్మకాలు, ఛాందసుల వర్తన కొకుకు అసహ్యం వేసేవి. అన్ని విషయాలలో శాస్త్రీయ పరిజ్ఞానము, దృష్టి ఎక్కువ. భావావేశం తక్కువ. పాటలలో అనవసరంగా స్వరాలను లాగడం, ఆడంగి ధోరణులు పట్టవు. రచనలో నిరంకుశుడైనా వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యమూర్తి. నా కథలను ఎంత తొందరగా చదివి అంత తొందరగా అవతల పారేస్తే మంచిది అనేవారట కొకు. ఎస్పెరాంటోను, రష్యన్ భాషలను నేర్చుకొన్నారట కొకు. అభిమానులతో చక్కగా మాట్లాడేవారట కొకు. తన సాహిత్యపు విలువలు తన జీవితంలో ప్రతిఫలించేటట్టుగా నడుచుకున్న మనిషి మా తండ్రి కుటుంబరావు అంటూ రోహిణీప్రసాదు తన ప్రసంగం ముగించారు.
శ్రీశ్రీ పుస్తకాలు అచ్చు కాక మునుపు ఆయన రాసిన రచనలను జేబులో పెట్టుకొని వాటిని పదే పదే చదువుకునే వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి అంటూ నారాయణరావు గర్వంగా చెప్పుకొన్నారు. మహాప్రస్థానంలోని పద్యాలు పుస్తకం అచ్చయ్యేటప్పటికి చాలామందికి కంఠతా వచ్చుననీ, అప్పటికే ఎంతో ప్రఖ్యాతి వున్న కవియైనా పది మంది ముందు చాల తక్కువగా శ్రీశ్రీ మాట్లాడేవారనీ అన్నారు. ‘ఏలూరులో జరిగిన అభ్యుదయవాదుల సభలో మొట్టమొదట శ్రీశ్రీని కలిశాను. శ్రీశ్రీ ఆడంబరాలు లేని మనిషి. వ్యక్తిగతంగా అతని జీవితం చాల నిబద్ధమైనది. సమావేశాలకు వేళకు తప్పకుండా వెళ్ళేవారు. పాత కవులపైన పండితులపైన చాలా గౌరవము ఉండేది శ్రీశ్రీకి, ముఖ్యంగా గిడుగు రామమూర్తిపైన’ అని చెపుతూ తానా మహాసభలకు శ్రీశ్రీని ఆహ్వానించడములో తన పాత్రను తెలిపారు. అలా అమెరికా వచ్చినపుడు శ్రీశ్రీ షికాగో, విస్కాన్సిన్, మిషిగన్ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశ్రీ పాటలూ పద్యాలూ అపుడు నేషనల్ పబ్లిక్ రేడియోలో కూడా ప్రసారం చేశారు. తన భాషను తన మాటను అర్థం చేసికోలేనివారిని కూడా శ్రీశ్రీ ప్రభావితం చేశారు. వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఒక పసి పిల్లవాడిలా అమాయకుడు. షష్ఠిపూర్తి సన్మాన సభలో విశాఖపట్టణములో 5వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు. శ్రీశ్రీ అంత గొప్ప వక్త కాకపోయినా ఆయన ఉపన్యాసాలు అచ్చులో ఎంతో అద్భుతముగా ఉండేవి. శ్రీశ్రీని యథాతథంగా చిత్రించే ఒక జీవిత చరిత్ర ప్రచురించబడాలని, తనవంటివారిని ఎందరినో ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీశ్రీ అని వెల్చేరు ప్రసంగాన్ని ముగించారు.
త్రిపురనేని సాయిచంద్ తరువాతి వ్యక్త. కాకతీయవంశములో శంభుకుడు అనే ఒక సేనాని త్రిపురాలకు అధికారి కాబట్టి త్రిపురనేని అనే ఇంటి పేరు వచ్చిందట. గోపీచంద్ నాన్నగారు త్రిపురనేని రామస్వామి చౌదరి. వారు ఐదుగురు అన్నదమ్ములు, అందరూ కవులే. గోపీచంద్ 1910లో వినాయకచవితి రోజు పుట్టారట. తన తల్లి చనిపోయిన తరువాత నాన్నమ్మ దగ్గర పెరిగారట. వారి సవితి తల్లి చాలా ఉత్తమురాలట. చీకటిగదులు అనే నవలలో ఆమె పాత్రను ఉదాత్తంగా తీర్చి దిద్దారు గోపీచంద్. గుంటూరులో విద్యాభ్యాసము చేసేటప్పుడే రచనావ్యాసంగాన్ని ప్రారంబించారు. 1928లో ‘శంభుకవధ’ వ్యాసం అతని ప్రథమ రచన. 1933లో రాసిన ‘ఒలింపియస్’ మొదటి కథ. ఆస్తికులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, నాస్తికులైన రామస్వామి చౌదరి పరమ మిత్రులు. రామస్వామిగారి ప్రభావం ప్రారంభదశలో గోపీచంద్‌పైన ఎక్కువగా ఉండేది. ఎం. ఎన్. రాయ్ రాడికల్ హ్యూమనిజంచే ప్రభావితమయ్యారు.
గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ప్రజామిత్ర’లో రాస్తూ వారు తీసిన ‘రైతు బిడ్డ’లో అసోసిఏట్‌గా పని చేశారు. తరువాతి చిత్రం మాయాలోకం. ‘పల్నాటివీర చరిత్ర’ తీయలేకపోయినా దానికై చేసిన పరిశోధన ఫలితాలను ప్రజామిత్రలో వ్యాసరూపంగా ప్రచురించారు. గోపీచంద్ పనిచేసిన ‘గృహప్రవేశం’ వాడుక భాషలో తీయబడిన మొదటి తెలుగు చిత్రం. ‘లక్ష్మమ్మ’ ఘన విజయం సాధించినా ‘ప్రియురాలు’, ‘పేరంటాలు’ అంతగా రాణించలేదు. దీనితో సినిమారంగంనుండి నిష్క్రమించి రచనారంగంలో దిగారు. గృహప్రవేశం చిత్రం తరువాత అసమర్థుని జీవితయాత్ర రాశారు. ఈ రచనతో తన తండ్రి రామస్వామిగారి ప్రభావంనుండి బయటపడ్డారని కొందరు అంటారు. కర్నూలులో ఇన్ఫర్మేషన్ డైరెక్టరుగా ప్రకాశం ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు పని చేశారు. సాయిచంద్ పుట్టినప్పుడు అరవిందుల జ్ఞానయోగంనుండి సాయిబాబా భక్తియోగానికి వచ్చారు. హైదరాబాదు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే కాలంలో చీకటి గదులు నవల రాశారు. తత్త్వవేత్తలపై వ్యాసాలు రాసేవారు. సాయిచంద్‌కి ఆరేళ్ళప్పుడు గోపీచంద్ 1962లో చనిపోయరు. వారి జ్ఞాపకాలు చాలా తక్కువ. నాన్నగారి ప్రభావం తను చేసే ప్రతి పనిలో సాంఘిక సేవ ఒక భాగంగా ఉండాలనేదే అని సాయిచంద్ చెప్పారు.
రెండవ సదస్సు: కొ.కు. సాహిత్యం
కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యంపైన చర్చలు మధ్యాహ్నం ఆరంభమయినాయి. ఈ సదస్సుకు సమన్వయకర్త శ్రీమతి గోపరాజు లక్ష్మి తమ ఉపోద్ఘాతములో కొకు సుమారు 10 నుండి 12 వేల పుటలు తన జీవితకాలంలో రాశారనీ, వారు సుమారు 500 కథలు, 1500 వ్యాసాలు రాశారనీ అన్నారు. సాహిత్యంలో కొకు ముఖ్యోద్దేశము సామాజిక ప్రయోజనమనీ, జీవితమే తన ప్రమాణమనీ అన్నారు. జీవితంలోని కుళ్ళును కడగడానికి కళలకు కూడా బాధ్యత ఉన్నదన్నారు. ఎక్కువగా మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలపై రాసినా నిమ్నవర్గాలపై సానుభూతి ఉన్న రచయిత కొకు అని అంటూ తెలుగు సామాజిక చరిత్రను బోధించిన బడులలో కొకు సాహిత్యాన్ని కూడా బోధించాలి అని అభిప్రాయపడ్డారు.
ఆస్టిన్ వాస్తవ్యులు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న “కొకు సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?” అనే విషయంపైన మాట్లాడారు. కొకు రచనలలో ముఖ్యంగా కనిపించేది అభ్యుదయ దృక్పథం, 50 ఏళ్ళ తరువాత ఇప్పటికీ దాని రిలవెన్స్ అంతరించిపోలేదు. ఆయన లేకపోతే చందమామ పత్రిక లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చందమామలో ఒక వైణికుని కథను గురించి వివరిస్తూ స్వయంకృషితో సాధించినందువలన లభించే తృప్తి, ఆనందం ఎంతో గొప్పది అనే సందేశం 12 ఏళ్ళ కుఱ్ఱవాడైన తనపైన ఎంతో ప్రభావం కలిగించింది అన్నారు. 1954లో కొ.కు రాసిన ‘దేవుడింకా ఉన్నాడు’ కథలో ముక్యంగా నిరానందం, నిర్విచారం ఎలా నిర్లిప్తతకు దారి తీస్తాయో చూపిస్తూ లక్ష్మన్న అమెరికాలో ఎలా నమ్మకానికి మూఢ నమ్మకానికి మధ్య అంతరం మారుతుందో అనే విషయాన్ని సభ ముందు ఉంచారు. తరువాత చదువు, వారసత్వం నవలలనూ, నిజ సంఘటనలపైన ఆధారపడిన కొత్తజీవితం కథల ఆధారంగా కొకు రచనలు ప్రస్తుత సమాజానికి కూడా ఎలా పనికొస్తాయో వివరించారు.
తరువాత గోపరాజు లక్ష్మి “కొకు రచనల్లో స్త్రీల సాధికారత” అనే అంశాన్ని గురించి ప్రసంగించారు. కొకు సాహిత్యం వ్యక్తి సంస్కారం, కుటుంబ సంస్కారం, సామాజిక సంస్కారం పెరగడానికి దారి తీస్తుంది. వ్యక్తుల నిజాయితీ చాలా ముఖ్యం అంటారు కొకు. భూస్వామ్య వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో స్త్రీల పాత్రను ఇప్పటి ఫెమినిస్ట్ ఉద్యమాలకు ముందే కొకు గుర్తించారు. అతని భావాలు బాల్య వివాహాలు, బాల వితంతువులనుండి స్త్రీ విద్య, పునర్వివాహాలు, భర్తను ఎదిరించి పిల్లలను విద్యావంతులు చేయడం వరకు ఎదిగాయి. సరోజ, చంద్రావతి, పంచకల్యాణి, సీత మొదలైన పాత్రలను లక్ష్మి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈనాడు పురుషస్వామ్యం అమలులో ఉన్నది, ఈ సమాజంలో స్త్రీకి పురుషునితో సమానత్వం అసాధ్యం అన్న కొకు వాక్యాలను గుర్తుకు తెప్పించి సంఘంలో మార్పులు వస్తే గాని స్త్రీల స్థితి మారదు అన్న కొకు సిద్ధాంతాన్ని తెలిపారు. ఆడజన్మ, సవితి తల్లి కథలు శరీర రాజకీయాలకు సంబంధించినది. చిన్నతనపు పెళ్ళి, పచ్చకాయితం, సాహసి కథలలో గోచరించే లైంగిక సమస్యలను గురించి లక్ష్మి తన ప్రసంగంలో విశ్లేషించారు.
షికాగోకు చెందిన కందాళ రమానాథ్ తరువాతి వక్త. కొకు రచనల్లో హాస్య వ్యంగ్యాల మేళవింపును గురించి వీరు మాట్లాడారు, ఒక మాటలో చెప్పాలంటే కొకు ఒక అసాధ్యుడు అన్నారు. జీవితాన్ని విమర్శించడం, అనుకరించడం సాహిత్యపు ముఖ్యోద్దేశము అని కొకు చెప్పారు. మనసు చివుక్కుమన్నా నిజాన్ని ఎత్తి చూపడమే వ్యంగ్యపు గురి. హోరీదాదాబాబా అనే కాల్పనిక సాధువును గురించిన వ్యాసాన్ని రమానాథ్ ప్రస్తావించారు. ‘ఔపదేశికంగా…’ అనే వ్యాసం కూడా హాస్య వ్యంగ్యాలతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రతి విషయంలో దేవుడిని ఇరికించవచ్చును అని చెబుతారు కొకు. గౌరవం లోపించిన ప్రేమ దాంపత్యములో మంచిది కాదు అంటారు. సన్నిహితులు, అమ్మాయి పెళ్ళి అనే కథలను ఇక్కడ ఉదహరించారు. సినిమాలో మనం చూచేది చచ్చు కళ. వాస్తవిక సమస్యలకు అవాస్తవిక కల్పన చేస్తారు సినిమాలో. ప్రగతిశీలమైన మార్పు వ్యక్తిలో వ్యవస్థలో రావాలి, మార్పుకి ఆలోచన పునాదిరాయి అని భావించే రచయిత కొకు అని ముగించారు.
శాన్ హోసే వాస్తవ్యులు చుక్కా శ్రీనివాస్ “కొకు సాహిత్యం – శాస్త్రీయ దృక్పథం” అనే విషయంపైన మాట్లాడారు. ఒక సమస్యను వ్యక్తిగతంగా చూడవచ్చు, సామాజికపరంగా పరిశీలించవచ్చు. చదువు నవల చదివి తాను వ్యక్తికి సంఘానికి గల సంబంధాన్ని నేర్చుకొన్నాననీ, తన ప్రతిబింబాన్ని కొకు సాహిత్యంలో చూడగలిగాననీ అన్నారు. అలాటి అవకాశాలు ఈ కాలంలో లేవని వాపోయారు. కొకు సాహిత్యంలో కనబడే హేతువాదం, తార్కిక పద్ధతి ఒక కొత్త దృక్పథాన్ని కలిగించాయి అన్నారు. సమాజం మారుతున్న కాలంలో తన సాహిత్యానికి అవసరం ఉంది, ఆ అవసరం తీరిన తరువాత దానికి ఆవశ్యకత లేదు అని కొకు భావించారు. ఈ నాటి మార్క్సిస్టులలో ఇలాటి లక్షణాలు తక్కువ. సాహిత్య రచన కొకుకు హాబీ కాదు, జీవనోపాధి కాదు, అది ఒక సామాజిక బాధ్యత, దాని ప్రయోజనం ఒక కొలమానం. ఆ నాటి మధ్య తరగతి కంటె ఈ నాటి మధ్య తరగతి విస్తృతమైనా కూడా, ఈ నాటి మధ్య తరగతి నిమ్న కులాలపైన నిరసన చూపుతున్నది అని శ్రీనివాస్ అన్నారు. కొకు ఆశయం విఫలమైనదా అని ప్రశ్నించారు.
సియాటిలుకు చెందిన కొడవళ్ళ హనుమంతరావు గారు “ఐశ్వర్యం – ఆదర్శం: ఐశ్వర్యం నవలపై ఓ పరిశీలన” అనే అంశాన్ని ఎన్నుకొని మాట్లాడారు. సమాజంలో మార్పులు రాలేదని కొకు నిరుత్సాహపడి ఉంటారని కొడవళ్ళ అన్నారు. ఐశ్వర్యం నవలలోని పాత్రలు ఒక డాక్టరు, అతని తండ్రి క్రిమినల్ లాయరు, డాక్టరు కూతురు, డాక్టరు వద్దకు వచ్చే ఒక రోగి సూర్యం. అతను చివరకు డాక్టరు కూతురిని పెండ్లి చేసికొంటాడు. డాక్టరు నిక్కచ్చి మనిషి. ఆయనకు సాహిత్య వ్యసనం ఉంటుంది. తన మొదటి రోగి చనిపోగా అతని భార్యను మళ్ళీ పెళ్ళి చేసికోవడం తండ్రికి పట్టదు. సాహిత్యాన్ని అభిమానించేవాడు నిజ జీవితంలో కూడా ఆసక్తిని చూపిస్తాడు అంటాడు డాక్టరు. భాసుడు అంటే కొకుకు ఇష్టం అని ఈ నవల వలన తెలుస్తుంది అని చెప్తూ ఆ నవలను వివరంగా కొడవళ్ళ చర్చించారు.
కొకు పైన ప్రసంగించినవారిలో చివరివారు తిరుపతికి చెందిన మంగాపురం విష్ణుప్రియ. ఈమె సాంఘికసేవలో మహిళా ఉద్యమాలలొ ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నారు. మహిళామార్గ్, స్త్రీగర్జన వంటి పత్రికలకు సంపాదకులు. “వివాహ వ్యవస్థకు కొకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చేశారా?” అనే ప్రశ్నకు జవాబును అన్వేషిస్తూ మాట్లాడారు. తనతో పని చేసేవారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను ఈ విషయాలపై మాట్లాడడానికి ప్రోత్సహం ఇచ్చాయి. ఉదాహరణగా – పెళ్ళైన ఒక నెలలోపల విడాకులు తీసికొని ఐదేళ్ళు ఒంటరిగా ఉండి మళ్ళీ పెళ్ళి చేసికొని మళ్ళీ బాధ పడుతున్న వనిత ఒకామె. పెళ్ళైన రెండేళ్ళ తరువాత భర్త ఒక సహోద్యోగినితో చనువు పెంచుకోవడం వల్ల ఇల్లు వదలి హాస్టల్ చేరి తన భర్త సాహచర్యాన్ని పొందిన అమ్మాయితో స్నేహాన్ని పెంచుకొన్న ఇంకొక మహిళ. భర్తయొక్క మితిమీరిన ప్రేమతో ఉక్కిరిబిక్కిరియై బయటి ప్రపంచంతో మళ్ళీ సంబంధం పెంచుకోవాలనుకొనే మూడో స్త్రీ – ముగ్గురు స్త్రీలను ప్రస్తావించారు.
స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువైతే వివాహ వ్యవస్థలో మార్పు రావచ్చునని కొకు భావించినట్లుందని అంటూ విష్ణుప్రియ కొకు రాసిన మూడు కథలను దీనికై ఎన్నుకొన్నారు. అవి- స్వార్థబుద్ధి (1945), పెళ్ళి వ్యవహారం (1960), చెడిపోయినమనిషి (1968). పెళ్ళి లేకుండా పిల్లలు ఎందుకు ఉండరాదు? చెయ్యవలసింది చేయడం, కావలసింది తీసికోవడం ఎందుకు తప్పు? ఆర్థిక భద్రత, పిల్లలకు మంచి పెంపకము ఉంటే పెళ్ళి చేసికోవచ్చు, విడిపోవచ్చు కూడా. పెళ్ళానికి డబ్బు ఇవ్వలేనివాడు, పోషించలేనివాడు, భరించలేనివాడు ఎందుకు పెళ్ళి చేసికోవాలి? స్త్రీల ఇంటి చాకిరికి, శ్రమకు, పిల్లల పెంపకాలకు కూడా విలువ కట్టారు ఈ కథలలో కొకు. మూడవ కథలో స్త్రీపురుషులు స్వేచ్ఛగా కలిసి ఉండడంలో తప్పు లేదంటారు కొకు. పెళ్ళి లేకుండా సహజీవనం ఉండవచ్చు. కుటుంబం లేకుండా సహజీవనం ఉండవచ్చు. పెళ్ళి ఉంటుంది, అందులో స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ కథలలో వచ్చే కొత్త అంశాలని వక్త చూపించారు.
మూడవ సదస్సు: శ్రీశ్రీ సాహిత్యం
శ్రీశ్రీపై సదస్సుకు వెంకటయోగి నారాయణస్వామి సమన్వయకర్తగా వ్యవహరించారు. ముందుమాటలో నారాయణస్వామి తనకు 1982లో శ్రీశ్రీ కవితతో పరిచయము ఎలా జరిగిందో వివరించారు. మొట్టమొదట చదివినప్పుడు పదాలు అర్థం కాకపోయినా కవిత్వంలోని శబ్దసౌందర్యం, నడక, గతి ఆకర్షించాయి అన్నారు. వ్యక్తిగతంగా తను బడిలో పడిన అగచాట్లకు సమాధానాన్ని శ్రీశ్రీలో వెదుక్కొన్నాను అన్నారు. శ్రీశ్రీని వ్యక్తిగతంగా కలుసుకొందామని అనుకొన్న సమయంలో ఆ కవి మరణాన్ని విని తన ఆత్మీయుల నొకరిని కోల్పోయినట్లు భావించారట. శ్రీశ్రీగురించి వచ్చిన ఒక కవితను వినిపించారు.
మొట్టమొదటి వక్తగా నేను శ్రీశ్రీ కవిత్వంలోని ఛందస్సును గురించి మాట్లాడాను. శ్రీశ్రీ ఛందస్సును గూర్చి చెప్పిన పలుకులను జ్ఞప్తికి తెచ్చాను. “ఛందస్సు గుఱ్ఱంవంటిది. గుఱ్ఱం ఎటు తీసుకుపోతే అటల్లా వెళ్ళిపోయేవాడు ఆశ్వికుడు కానట్లే ఛందస్సు లాగుకుపోయినట్లు వ్రాసేవాడు సంవిధానజ్ఞుడు కాడు! మరి ఆ ఛందస్సును లొంగించుకొని దానిచేత చిత్రవిచిత్ర రీతులలో కదను త్రొక్కించినవారినే ప్రశంసిస్తాము. ఒక విధంగా చూస్తే నేను వాడిన ఛందస్సులన్నీ శ్రీశ్రీయాలే. “సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు” అన్న శ్రీశ్రీ వాక్యం ఆయన ఛందఃపటిమను తెల్పుతుంది. వాక్యం రసాత్మకం కావ్యం అని ఎలా అంటారో, అలాగే వాక్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చు. శ్రీశ్రీ మొట్టమొదట వాడిన సాంప్రదాయిక ఛందస్సులకు ఉదాహరణలను చూపినాను. తరువాత గణ ఛందస్సువలెనే మాత్రాఛందస్సులో కూడా గణాలు ఉంటాయని, గురజాడ ముత్యాలసరాలు పుట్టిన సంవత్సరమే జన్మించిన శ్రీశ్రీ ఈ ఛందస్సుకు పెట్టిన మెరుగులను వివరించాను. శంకరాచార్యులు రాసిన చతుర్మాత్రాగణాల స్తోత్రాలు, మిశ్రగతి స్తోత్రాలు కూడా శ్రీశ్రీని ప్రభావితం చేసినవని ఉదాహరణలను ఇచ్చాను. తరువాత శ్రీశ్రీ కవితలను కొన్నిటిని తీసికొని అందులోని గతులను, మాత్రాగణాలను విడమరచి చెప్పాను. శ్రీశ్రీపై జయదేవుని అష్టపదుల ప్రభావం కూడా ఉన్నదని ఒక రెండు ఉదాహరణలను చూపాను. శ్రీశ్రీ చెప్పిన “నేను ఈ శతాబ్దానికి పర్యాయపదం, కవితాసృష్టికి పరిశోధన కేంద్రం” అనే వాక్యాలతో నా ప్రసంగాన్ని ముగించాను.
తమ్మినేని యదుకులభూషణ్ వీడియో ద్వారా “శ్రీశ్రీ మహాప్రస్థానం – కదనం, కథనం” అనే విషయంపై మాట్లాడారు. కవిత్వం అర్థప్రధానం, సంగీతం నాదప్రధానం అని మొదలు పెట్టారు. కవిత్వంలో అల్పాక్షరాలలో అనంతార్థం ఉండాలి. కవిత్వం భావకవిత్వం (1927-1933), ప్రభావ కవిత్వం (1933 తరువాత) అని రెండు విధాలు అన్నారు. ఆంగ్ల కవులైన Swinburne, Poe, Gibson, Mayfield, ఫ్రెంచి కవి Bolero శ్రీశ్రీని చాలా ప్రభావితం చేశారు. స్విన్‌బర్న్ శ్రీశ్రీల మధ్య చాలా సన్నిహితత్వం ఉంది అన్నారు. ఇద్దరికీ ఛందస్సుపైన అపారమైన అధికారం, శబ్దాలపై మమకారం. శ్రీశ్రీ ఒక రాత్రి కవితలో పో ప్రభావం కనబడుతుంది. కదనాన్ని కవిత్వంలో ఒప్పించిన తీరు “కవితా, ఓ కవితా”, “ఆకాశదీపం” లాటి కవితలలో గమనించవచ్చు. పో కవిత్వంలో సౌందర్యం ప్రధానమైతే శ్రీశ్రీ కవితలో శ్రామిక వర్గం ప్రధానం. ఈ వైరుద్ధ్యం తరువాతి కాలంలో శ్రీశ్రీని స్విన్‌బర్న్, మేఫీల్డ్‌ల వైపు ఆకర్షించింది. కానీ ఆ పిదప కాలంలో మంచి కవిత్వాన్ని శ్రీశ్రీ రాయలేక పోయారు అని అభిప్రాయపడ్డారు. నారాయణస్వామి భూషణ్ భావాలతో ఏకీభవించలేకపోయారు.
విన్నకోట రవిశంకర్ “శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు” అనే విషయంపైన మాట్లాడారు. జీవితంలో మృత్యువు అనివార్యమైనది. ఆదికవినుండీ ఆధునిక కవి వరకు మృత్యువు ఒక కవితావస్తువు. మృత్యువును సామాన్యముగా ఒక అమూర్త భావనగా కవులు వాడారు. శ్రీశ్రీ సుప్తాస్తికలు అనే ఖండికలో ఇది కనిపిస్తుంది. మిగిలిన కవితలలో శ్రీశ్రీ మృత్యువును ఒక మరణముగా మాత్రమే చిత్రిస్తారు. బాటసారి కవితలోని మరణాన్ని స్పష్టముగా తెలియజేసే చివరి పంక్తులకు గురజాడ పూర్ణమ్మ కవితలో సందిగ్ధముగా పూర్ణమ్మ చావును చిత్రించే ఆఖరి వాక్యాల మధ్య భేదాన్ని ఎత్తి చూపారు. శ్రీశ్రీ ఎప్పుడూ మానవుడు మరణాన్ని జయిస్తాడనే విశ్వాసం కలిగినవారు. ఆశ నిరాశలను ప్రస్తావిస్తూ శ్రీశ్రీ చేదు పాట, కేక, దేనికొరకు వంటి కవితలను రాశారు. ఒంటరితనాన్ని భయాన్ని ఎత్తి చూపే కవిత నిద్ర. నిస్సహాయత, నిరాశలను ప్రతిఫలిస్తూ రాసిన కవిత ఒక రాత్రి. నిరాశ మాత్రమే కాదు, ఉద్యమాలపైని కవితలలో ఆశ, విశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీశ్రీ అనువాద కవిత్వంలో, చిత్ర గీతాలలో వైవిధ్యము ఉన్నది. ఛందస్సులో ఎన్నో ప్రయోగాలు- ముఖ్యంగా కంద పద్యాలలో- చేశారు శ్రీశ్రీ. అతడు గొప్ప ప్రయోగశాలి. శ్రీశ్రీ కవిత్వాన్ని నిష్పాక్షికముగా లోతుగా బహుముఖంగా విమర్శించాలి అని రవిశంకర్‌గారు తన ఆశను వ్యక్తీకరించారు. ఆ తరువాత నారాయణస్వామి “కవితా ఓ కవితా”ను ఆవేశముతో భావపూర్ణంగా చదివారు.
హెచ్చార్కే “ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం ఉంటుంది, శ్రీశ్రీ వుంటారు” అనే విషయంపైన రాసిన ప్రసంగాన్ని వారి తరఫున శ్రీనివాస్ చదివారు. శ్రీశ్రీ కవిత్వంలోని సంగీతం తనను ఆకర్షించిందని ఆరంభించారు. కేవలం ఉద్యమాలు అనే కిటికీ గుండా కవిత్వాన్ని చూడరాదు. ఇస్మాయిల్‌గారి ‘చెట్టు’ను చదివాక కవిత్వంలో ఉద్యమానికన్న అతీతమైనది ఏదో ఉంది అని తోచింది. ఉద్యమాలలో ఎక్కువ ఆసక్తి ఉన్నా అది మాత్రమే శ్రీశ్రీ కవిత్వం కాదు. తాను శ్రామిక వర్గానికి దోహదుడు మాత్రమే కానీ అనుచరుడు కాదు. దానితో చేతులు కలుపుకొన్న కవి మాత్రమే. ఎవరిని గురించి రాసినారో వాళ్ళకు ఆ సందేశం అందినది. 1990ల పిదప చాల మంది ఉద్యమకారులు తమ ఉనికిని విరసం, స్త్రీవాద, దళిత ఉద్యమాలతో ముడి పెట్టుకొన్నారు. చాలా మంది కవులు కూడా మూగపోయారు. శ్రీశ్రీలో ఉద్యమేతర కవి కూడా ఉన్నాడు. ఉద్యమంతో ఒక విధమైన detachmentను అవలంబించగల శక్తి శ్రీశ్రీకి ఉండినది. ఉద్యమస్పర్శ లేని ‘ఒక రాత్రి, ‘ఆకాశదీపం’ లాటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఏ అర్థంలో వేమనను ప్రజాకవి అంటారో అలాగే శ్రీశ్రీని కూడా ప్రజాకవి అని పిలువవచ్చు. శ్రీశ్రీని ఉద్యమకవిగా కాక ఒక గొప్ప తెలుగు కవిగా అందరూ పరిగణిస్తే బాగుంటుందని ముగించారు. సమాజపు దైనందిన జీవితంలో భాగస్వామియైన శ్రీశ్రీలాటి కవి తప్పక మహాకవియే అన్నారు నారాయణస్వామి.
వెల్చేరు నారాయణరావు “దూరంనించి శ్రీశ్రీ” అనే విషయంపై మాట్లాడారు. శ్రీశ్రీలాటివారు చేసిన కార్యాలవల్ల కలిగిన మంచిని, ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. శ్రీశ్రీ తాను రాసిన కవిత ఇక్కడ అమెరికాలో ఉండే మనలను ఉద్దేశించి కాదు, అతడు ప్రభావితం చేయాలనుకొన్న వర్గం వేరు. మధ్యతరగతి పుట్టడానికి ఈ రచయితలు కారణం. వాళ్ళు బోధించిన వాటిలో కొన్ని మనకు కావాలి, కొన్ని మనకు అక్కర్లేదు. మహాకవి అంటే ఎవరు అని ప్రశ్నించారు. ఒక వచనములో ఒకే అర్థం ఉన్నా, ఒక పద్యంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇది కవిత్వపు విశిష్ఠత. శబ్దానికి అర్థానికి గల సంయోగము చాల ముఖ్యమైనది. శ్రీశ్రీ ఎన్ని రకాల కవిత్వం రాశారు అనే ప్రశ్నను ముందు పెట్టారు. తెలుగు కవిత్వంలో 20వ శతాబ్దములో రెండు మార్పులు వచ్చాయి, ఒకటి ఆధునికత, మరొకటి సామ్యవాదము. ఆధునికతలో వ్యక్తిత్వం ప్రధానాంశం, సామ్యవాదంలో ఆ వ్యక్తిత్వం వర్గంలో మిళితమయి పోతుంది. కాని శ్రీశ్రీ ఆధునిక కవితను, సామ్యవాద కవితను రెంటినీ వ్రాశారు. అది ఆ కవిలోని గొప్ప విశేషం. తెలుగులో ఆధునిక కవులు మార్క్సిస్టులుగా ఉండి ఉండక పోతే ఇంకా గొప్ప కవులు అయివుండేవారని వెల్చేరు ప్రతిపాదించారు. ఆలోచింపజేసే కవిత్వం చాలా కాలం బతుకుతుంది. వేగంతో ఉద్యమాన్ని ప్రోత్సాహం చేసే కవిత్వం అలా చాలా కాలం నిలువదు. ప్రశ్నోత్తరాల సమయంలో వీరు మరొకటి చెప్పారు- రచయిత పద్యాలవల్ల, కథలవలన సంఘములో మార్పులు రావు. కానీ వ్యాసాలవలన ఇది సాధ్యమవుతుంది. రచయితలు సమాజములో మార్పులు తేలేరు, కాని వారు పాత్రలను సృష్టించి ఒక అద్దంగా సంఘం ముందు ఉంచగలరు అన్నారు.
చివరి వక్త సమన్వయకర్త నారాయణస్వామి. వారు “శ్రీశ్రీ- సమకాలీన ప్రాసంగికత” అనే విషయంపైన మాట్లాడారు. ప్రపంచ సంఘటనలవల్ల ప్రభావితమై తాను కవిత్వం రాశానని శ్రీశ్రీ చెప్పుకొన్నారు. ప్రజాకవిత్వానికై గురజాడ చూపిన మార్గాన్ని వెడల్పు చేసినారు శ్రీశ్రీ. కవితా వస్తువులో పతితులను, భ్రష్టులను ప్రవేశ పెట్టారు శ్రీశ్రీ. ఇది ఒక పెద్ద మార్పు, గొప్ప మార్పు. సమాజపుటంచులలో నివసించే ప్రజలను ఈ రాజ్యం మీరేలమని ప్రబోధించారు శ్రీశ్రీ. కొత్త ఆలోచనలను కవిత్వంలో ప్రవేశ పెట్టారు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్నారు శ్రీశ్రీ. వీరి దృక్పథము స్థానికము మాత్రమే కాదు, అంతర్జాతీయం కూడా. మహాకవులు discoveries చేస్తారు. దేశమంటే మట్టి కాదోయ్ అని గురజాడ ఒక discovery చేస్తే, ‘మహాప్రస్థానం’లో ఎన్నో పద్యాలలో శ్రీశ్రీ discoveries మనకు కనబడతాయి. ‘ఖడ్గసృష్టి’లో భాషా సరళత ఎక్కువ. యువకులు, ఉద్రేకాలతో ఉన్నవారు యువకుడైన శ్రీశ్రీతో మాత్రమే కాదు, వృద్ధుడైన శ్రీశ్రీతో కూడా నడిచారు. శ్రీశ్రీ కవితలను మాత్రమే కాదు వ్యాసాలను కూడా రాశారు. వేమన, గురజాడ, తిక్కనలను తెలుగు దేశంలో మహాకవులుగా పేర్కొన్నారు. అన్ని కవితాయుగాలలో పోరాడే ప్రజల పక్కనే ఉన్నారు శ్రీశ్రీ. భవిష్యత్తుకు తన కవిత్వాన్ని ఒక సంపత్తిగా అర్పించారు. కవిత్వాన్ని democratize చేసిన కవి అతడు అని పొగిడారు. ఎన్నో శ్రీశ్రీ కవితలను నారాయణస్వామి తమ ప్రసంగంలో పాడారు.
నాలుగవ సదస్సు: గోపీచంద్ సాహిత్యం
గోపీచంద్ రచనల పైని సదస్సుకు శ్రీమతి ఆవుల మంజులత సమన్వయకర్త. ఆమె రచయిత నవలలపై పరిశోధనలు చేశారు. గోపీచంద్ ఒక మూలతత్త్వాన్వేషి అని అన్నారు. గోపీచంద్‌పైన అతని తండ్రి రామస్వామి చౌదరి ప్రభావము చాలా ఉందని చెప్పారు. ఆచంట జానకిరాం వారికి మిత్రుడు. అతనితో అరవిందుల ఆశ్రమాన్ని దర్శించి వారి రచనలచే ప్రభావితులయ్యారు. గోపిచందుకు జీవితము సాహిత్యము వేరు కాదు. అతని కథలలో ఒక ప్రత్యేకమైన శిల్ప వైచిత్రి కనబడుతుంది. వారి బ్రదుకు ఒక తాత్త్విక ప్రయాణము అని చెప్పవచ్చును అన్నారు మంజులత.
ప్రథమ వక్త ఏపూరి భక్తవత్సల “త్రిపురనేని గోపీచంద్- తాత్త్విక దృష్టి” అనే విషయంపై మాట్లాడారు. తండ్రిలా నాస్తికత్వముతో ప్రారంభించినా, తరువాత స్వాధ్యయనము వల్ల గోపీచందు తన భావాలను మార్చుకొన్నారు. వారి రచనలలో వివిధ తత్త్వవేత్తలను గురించిన సమాచారాలున్నాయి, ఉదాహరణకు మెరుపుల మరకలులో జాన్‌పాల్ సార్త్ర్, పరమేశ్వరుని వీలునామాలో వైట్‌హెడ్, పోస్టు చెయ్యని ఉత్తరములో రస్సెల్, అరవిందులను గురించి, చీకటి గదులలో మార్క్సిస్టులను గురించిన విషయాలు ఉన్నాయి. వీరు పెరిగింది జస్టిస్ పార్టీ వాతావరణంలో. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఇది, బ్రిటిష్‌వారికి అనుకూలమైన ఈ పార్టీకి ఆంధ్రలో రామస్వామి చౌదరి ఒక ముఖ్య నాయకుడు. గోపిచందు మొదటి వ్యాసం తన నాన్నగారు రాసిన ‘శంభుకవధ’ను గురించినది. దీని పేరు కూడా శంభుకవధయే. పెరిగేటప్పుడు అతనిపైన కూడా మార్క్సిస్టుల ప్రభావం పడింది. ఈ పరిణామాలను వీరి ఆత్మకథను పోలిన చీకటిగదులు అనే నవలలో మనము చదువుతాము. అందుకే దోనేపూడి రాజారావు మార్క్సు, M. N. Roy, John Dewyలను చదివిన గోపీచందు భావవాదాన్ని, భౌతికవాదాన్ని సమన్వయ పరచారని చెప్పారు (ఉదా. పోస్టు చెయ్యని ఉత్తరాలు). గోపీచందు అన్ని రచనలలో మూలతత్త్వ అన్వేషణ జరుగుతుందని, గోపీచంద్ భావకవిత్వాన్ని నిష్క్రియాకవిత్వముగా తలచారని కూడా మంజులత అన్నారు.
శ్రీమతి కొత్త ఝాన్సీలక్ష్మి “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా ప్రత్యేకత-తాత్త్వికత” అనే విషయంపైన మాట్లాడారు. గోపీచందు నిరంతరాన్వేషి, నిశిత పరిశీలకులు అన్నారు. సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన నవల ఇది. సుజాత పరమేశ్వరుని పెంపుడు కూతురు. ఉన్నత భావాలు కలిగిన ఒక రచయితయైన కేశవమూర్తిని ప్రేమించి పెళ్ళి చేసికొని పెంపుడు తండ్రికి దూరమవుతుంది. భర్తపై అనుమానంతో బెంగళూరు వెళ్ళడం, శ్రీమంతం బుకాయి మాటలను నమ్మడం, మోసపోయానని విచారించడం సుజాత కథ. కేశవమూర్తి ఇంటికి వచ్చి చూస్తే భార్య ఇంటిలో లేకపోవడం, తన రచనలంటే అభిమానం ఉన్న సుభాషిణి తన బంధువైన శ్రీమంతం రాసిన ఆకాశరామన్న ఉత్తరం చూడడం, కేశవమూర్తి బెంగళూరు వెళ్ళడం, సుజాత పశ్చాత్తాపముతో మూర్తిని క్షమాపణ అడగడం ఇలా కథ సాగుతుంది. పరమేశ్వరశాస్త్రి ఛాందసుడు, గ్రాంథిక భాషాభిమాని. సుజాత అబ్రాహ్మణుడైన కేశవమూర్తిని పెళ్ళాడడం ఇతనికి ఇష్టముండదు. శాస్త్రికి జబ్బు చేసినప్పుడు కేశవమూర్తి అంటే గిట్టనివారు సంస్కృత పాఠశాలకు తన ఆస్తిపాస్తులు సంక్రమించేటట్లు శాస్త్రిచే వీలునామా వ్రాయిస్తారు. శాస్త్రి శుశ్రూషలకై సుజాత తాతగారి పేరు పెట్టిన తన ఐదేళ్ళ కొడుకుతో శాస్త్రి ఇంటికి వస్తుంది. మూర్తి నిజాయితీని అర్థం చేసికొన్న శాస్త్రి పాత వీలునామాను చింపి కేశవమూర్తి పేర మరో వీలునామా రాసి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఒకప్పుడు బలహీనమైన తరుణంలో శాస్త్రిగారు సుందరమ్మ అనే ఆవిడతో కలవడం, దాని ఫలితంగా పుట్టిన బిడ్డయే సుజాత అంటూ శాస్త్రి రాసిన మరో ఉత్తరాన్ని లాయరు చదివి వినిపించడంతో సుజాత జన్మవృత్తాంతం తేటతెల్లమవుతుంది. ఈ నవలలో ఆధ్యాత్మిక స్పృహ ప్రతిఫలిస్తుంది. మానసిక శక్తికి అతీతమై ఉండే శక్తి ఉందనే భావమే ఈ ఆధ్యాత్మిక స్పృహ అని కేశవమూర్తి ద్వారా రచయిత పలుకుతారు ఈ నవలలో. అరవిందుల ప్రసక్తి, ఆధ్యాత్మిక ఘట్టాలు కూడా ఉన్నాయి ఈ నవలలో అని ఝాన్సీలక్ష్మి అన్నారు.
తరువాత ఆరి సీతారామయ్య కూడా పరమేశ్వర శాస్త్రి వీలునామా పైననే మాట్లాడారు. తాను జీవపరిణామ శాస్త్రములో అధ్యాపకుడినని, ఆ విషయం నవలలో ఉంది కాబట్టి దానిని గురించి మాట్లాడారు. ఇందులోని పాత్రలు చాలా మంచివి లేక చాలా చెడ్డవి, సామాన్య పాత్రలు లేవు ఈ నవలలో అన్నారు. శాస్త్రజ్ఞానంలో లోపాలున్నాయి, అందువలన ఆధ్యాత్మికత అవసరం అంటారు గోపీచందు. కానీ ఆ లోపాలు ఏవో విడమర్చి చెప్పడంలో రచయిత సఫలీకృతుడవలేక పోయారు. ఆధ్యాత్మిక విషయాలపైన పుస్తకంలో చర్చ లేకుంటే నవలకు గొప్ప నష్టమేమీ లేదని పేర్కొన్నారు. వీరు చెప్పిన అతీత మానవుని గురించిన ఆధ్యాత్మిక లక్షణాలకు, డార్విన్ ఎవొల్యూషన్ థీరీకి భేదం ఎక్కువగా లేదు. కొన్ని శాస్త్రీయ విషయాలను సరిగా అర్థం చేసికోలేక పోయారు. గోపిచందు వేసిన కోతులన్నీ మానవు లయ్యాయా అనే ప్రశ్న శాస్త్రీయంగా సబబు కాదు, ఎందుకంటే ఒక కోతీ మానవుడు కాలేదు. తొందరపాటు వివరణలు ఇవ్వడం అంత మంచిది కాదని రోహిణీప్రసాద్ ప్రతిపాదించారు. రావూరి భరద్వాజ పరమేశ్వరశాస్త్రి వీలునామ ఒక సమర్థుని జీవన యాత్ర అని చెప్పినట్లు సాయిచంద్ అన్నారు.
పిదప వేములపల్లి రాఘవేంద్ర చౌదరి “చీకటి గదులు – ఒక సమీక్ష” అనే విషయంపై ప్రసంగం చేశారు. ఇది ఒక అసంపూర్ణ రచన. దీనిని గోపీచందు ఆత్మకథ అంటారు. యౌవనంతో ఆగిపోతుంది. రామస్వామి పేరు ఇందులో కృష్ణస్వామి, గోపీచందు పేరు గోపాలం, తల్లి చనిపోగా తండ్రి రెండో పెళ్ళి చేసికొంటాడు. సవతి తల్లి బాగా చూడదనుకొని, నాన్నమ్మ గోపాలాన్ని, గోపాలం చెల్లెలు కమలను పల్లెటూరికి తీసికొని వెళ్ళుతుంది. గోపాలం రాంబాబు స్నేహితులు. రాంబాబు మరొకడితో స్నేహం చేయడం గోపాలం సహించలేడు. రాంబాబుపై భరించలేని ప్రేమ ఉంటుంది గోపాలానికి. రాంబాబుకు తన స్నేహాన్ని నిరాకరించవద్దని ఉత్తరం రాస్తాడు గోపాలం. కాని రాంబాబు దానికి జవాబివ్వడు. ఒక రోజు రాంబాబు ఎవ్వరికీ చెప్పకుండా మాయమవుతాడు. ఇంకా శశికళ, గాంధీధామయ్య, హాస్టల్ జీవితం, ఒక గురుకులంలో దుర్గ అనే అమ్మాయిని చూడడం, ఇవి ఇందులో కొన్ని కథాంశాలు. సవతి తల్లి దమయంతి పాత్రను ఎంతో చక్కగా తీర్చి దిద్దారు గోపీచందు ఈ నవలలో. గాంధీవాదానికి మార్కిజానికి మధ్య ఉన్న వైరుద్ధ్యాన్ని కూడా చిత్రిస్తారు ఇందులో. జీవితంతో రాజీపడి అందరూ ఆనందంగా జీవించాలి అనే భావాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవలలో కృత్రిమత లేదు. దీనిని సినిమా తీయాలనే ఉద్దేశము తనకుందని సాయిచంద్ ప్రకటించారు.
తరువాత వేలూరి వేంకటేశ్వరరావు “అనగనగా… గోపీచంద్ అనుభూతి కథలు” అనే విషయంపై రాసిన పత్రాన్ని వారు లేకపోయినందువలన వారికి బదులు ఆవుల మంజులత చదివారు. పాశ్చాత్య లాక్షణిక పరిధిని అధిగమించి కథలను రాసి, చదివి అలవాటు చేసికొనడం మంచిది. గోపిచందు సుమారు 300 కథలు మూడు దశాబ్దాల కాలంలో రాశారు. కానీ వీరి నవలలకు, నాటికలకు వచ్చిన ఖ్యాతి వీరి కథలకు ఎందుకు రాలేదో? ‘పతితులు’, ‘ధర్మవడ్డి’ పేర్లతో వీరి కథాసంకలనాలు లభిస్తాయి. గోపిచంద్‌గారు ఒక రేడియో ప్రసంగంలో కథలలో తాను ఆవేశానికి, భావాలకు ప్రాధాన్యత ఇస్తానని, శిల్పానికి కాదని చెప్పిన వాక్యాలను మళ్ళీ మనకు జ్ఞప్తి చేశారు. తనకు తెలిసిన మనుషులు, వారి జీవితాలు, తాను చదివిన పుస్తకాలు ఇత్యాదులు తన కథాపాత్రలని గోపిచంద్ చెప్పింది ఒక విధంగా తాను చెప్పిన recovered memories theoryని బలపరుస్తుంది అన్నారు వేలూరి. చలంచే ప్రభావితుడై కొన్ని కథలు గోపీచంద్ రాశారు. చిత్రం అనే కథను ఉదహరించారు. తన్ను కలుసుకోమని చెప్పిన ఒక అమ్మాయిని తక్షణమే కలుసుకోలేకపోయి తరువాత వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఊండదు. ఇది ఒక ట్రాజీకామెడీ. చలం ఛాయలు ఇందులో ఉన్నా అతని వ్యంగ్యం లేదు ఈ కథలో. ఓ.హెన్రీ ప్రభావం కూడా ఉంది ఈ రచయితలో. ఆస్కర్ వైల్డు కథకు అనుకరణ ఐన ముత్యాలు కథను చదివితే అందులో గోపిచంద్ అనుభూతులు, నిశిత పరిశీలన బాగా కనబడతాయి. సామాన్య పాఠకుని తరఫున వారి కథల విమర్శలు ఇంకా రాలేదు అని వేలూరి అభిప్రాయపడ్డారు.
తరువాతి ప్రసంగం “అసమర్థుని జీవయాత్రేనా?” ముందుగా మాచవరం మాధవ్ వీడియో ద్వారా మాట్లాడారు. అసమర్థుడు అంటే ఒక మనిషి మన లౌకిక పరిధిలో ఉండి, ఆ లౌకిక ప్రపంచములోని విలువలను అందుకోలేకపోయినవాడు. ఈ విలువలను తెలిసికోలేనివాడు అసమర్థుడు కాదు. ‘అసమర్థుని జీవయాత్ర’లో సీతారామారావు అసమర్థుడు కాదు. అసమర్థుడుగా ప్రారంభమైనా తరువాత ఒక ఉన్మాదిగా రచయిత చిత్రించారని అభియోగం చేశారు. సాహిత్యంలో రావిశాస్త్రి సుబ్బయ్య, తిలక్ కథలోని గంగాధరం నిజంగా అసమర్థులు. నిజమైన అసమర్థతలో ఉన్మాదిగా మారే లక్షణాలు ఉండవు. తన తాత్త్విక చింతనకై ఈ పాత్రను రచయిత ఒక పావుగా వాడుకొన్నట్లుంది. మాధవ్ మాచవరం అభిప్రాయాలకి విరుద్ధంగా మద్దిపాటి కృష్ణారావు తమ అభిప్రాయాలని వెలిబుచ్చారు. సీతారామారావు నిజంగా అసమర్థుడే, జీవితం వడ్డించిన విస్తరి ఐనప్పుడు ఆకలికి సరిగా తినలేనివాడు అసమర్థుడా, పిచ్చివాడా అన్నదే ప్రశ్న అని ఆయన అన్నారు. సీతారామారావును నిర్వచించడం కష్టం. మన వంశం పేరు నిలబెట్టు అని తండ్రి చెబుతాడు. దేవుడి పెళ్ళికి పీటలమీద కూర్చునే హక్కును తనదిగా చేసికోవడానికి 30వేల రూపాయల ఖర్చుకు కూడా వెనుకాడని వంశం వారిది. కుటుంబ ఆర్థిక స్థితి పడిపోయిన తరువాత ఆ స్థితిని పూర్తిగా అవగాహన చేసికోలేకపోయాడు సీతారామారావు. వాస్తవాలను ఎదురుకోలేని బలహీనత అతనిని అసమర్థునిగా చేసింది. ఆచారాలకు వాస్తవికతకు పొంతన కుదరని ఒక కారణం అసమర్థునిగా చేసింది. కొందరు ఈ నవలలోని పాత్రలు తమలాటివి అని అనుకోవడం ఈ నవల సార్వజనీనతకు తార్కాణం, నవలలో సాంకేతికపరంగా లోపాలున్నాయని చెప్పారు కృష్ణారావు.
అసమర్థత మానసికరోగానికి దారితీయగలదు, కాని ఆ అసమర్థత సీతారామారావు అసమర్థతవలె ఉంటుందా అన్నదే సందేహమని మానసిక శాస్త్రంలో నిపుణులైన జంపాల చౌదరి అన్నారు. అతని ఉన్మాదానికి అసమర్థత కారణం కాదు అని కూడా చెప్పారు. తన భూతకాలపు జీవితాన్ని సింబాలిక్‌గా నిర్మూలించాలనే గోపీచందు ప్రయత్నమని సుదర్శన్ అనే రచయిత తెలిపారని ఒకరు అంటే, నవల పేరును ఆచంట జానకిరాం పెట్టినట్లు కృష్ణారావు చెప్పారు. సృజనాత్మక రచయితలు ఒక శాస్త్రజ్ఞునివలె, మానసికశాస్త్ర నిపుణునివలె వ్యవహరించరు, వారు అంత సాంకేతికముగా ఉండరు అని మంజులత వివరించారు. మాధవ్ ఆ పుస్తకము పేరుతో విభేదించారా అని కూడా ఒకరు ప్రశ్నించారు.
ఐదవ సదస్సు: చర్చా వేదిక
చర్చావేదికకు సమన్వయకర్త గుళ్ళపల్లి రవి. ముఖ్య అతిథులు జంపాల చౌదరి, వెల్చేరు నారాయణరావు, మంగాపురం విష్ణుప్రియ, వెంకటయోగి నారాయణస్వామి. చర్చకు ఎన్నుకొన్నవిషయం “రచయితలు (కొకు, శ్రీశ్రీ, గోపీచంద్), సాహిత్యం, సమాజం – పరస్పర ప్రభావం.” చౌదరి శ్రీశ్రీ ప్రభావం సమాజంపైన ఉంది, కాని మిగిలినవారి ప్రభావం అంత స్పష్టంగా లేదని అన్నారు. వెల్చేరు సమాజం అంటే ఏమిటి, ప్రభావం అంటే ఏమిటి, సాహిత్యం ఎన్ని రకాలు అనే కొన్ని మౌలిక ప్రశ్నలను శ్రోతలముందు పెట్టారు. సామాన్యంగా సాహిత్యంగా చలామణి అయ్యేదాన్ని చాలా తక్కువమంది మాత్రమే చదువుతున్నారు.
దీనికి బహిర్గతంగా ఒక పెద్ద సాహిత్యం ఉన్నది. పందొమ్మిదవ శతాబ్దములో ఒక కొత్త మధ్య తరగతి పుట్టింది. వారు ఒక కొత్త సాహిత్యాన్ని పుట్టించారు, పోషించారు అని అన్నారు. సాహిత్యాన్ని సాహిత్యంగా చదవండి. వాస్తవం (reality) వేరు, వాస్తకవిత (realism) వేరు అని వివరించారు. నారాయణస్వామి దాశరథి రంగాచార్య కథ ఆధారంగా నిర్మించబడిన చిల్లర దేవుళ్ళు చిత్రంలో జీవితానుభవాన్ని చిత్రించే ‘ఏటికేతం కట్టి ఎయి పుట్లు పండించి’ పాటను పేర్కొన్నారు. శ్రీశ్రీ, కొకు, గోపీచంద్‌లాటి వారి సాహిత్యముతో బాటు ఇట్టి సాహిత్యాన్ని కూడా మనం మరువరాదు అని చెప్పారు. ఏ సాహిత్యం కానీ, అది నిజాయితీగా ప్రతిబింబించబడాలి. విష్ణుప్రియ సాహిత్యం ఎలా సమజాన్ని ప్రభావితం చేయగలదో అనే విషయానిపై తన కొన్ని అనుభవాలను పంచుకొన్నారు.
చర్చలో వెలువడిన కొన్ని విషయాలు-
- ఎన్నో రకాల సాహిత్యాలుంటాయి. కష్టజీవుల బాధలను ఎత్తి చూపి సమస్యలను బయటికి తెచ్చేవి మాత్రమే సాహిత్యం కాదు. సాహిత్యం ఎన్నో రకాలుగా ఉన్నా, అందులో కొన్ని మాత్రమే ఆలోచనలను రేకెత్తిస్తాయి.
- మార్క్సిస్టు సాహిత్యం అంటే పేదల పక్షాన సానుభూతిని చూపించే సాహిత్యం. సాహిత్యాన్ని ప్రజాచైతన్యానికి ఒక సాధనంగా విరివిగా ఉపయోగపరుస్తారు. తెలియని జీవిత పార్శ్వాన్ని చూపించి భావాలను ప్రేరేపించజేసేది ఉత్తమ సాహిత్యమే. ప్రజలకు కనీస హక్కులు, జీవితానికి హామీలు ప్రసాదించడానికి సాహిత్యాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకోవాలి.
- కథల, నవలల ప్రభావాన్ని controlled experiments ద్వారా కొలవడానికి వీలవుతుందా?
- వ్యక్తికి ఆనందాన్నిచ్చే కవిత్వం కూడా కావాలి.
- గత అరవై సంవత్సరాలలో ఆంధ్రదేశంలో సాహిత్యంవల్ల వచ్చిన మార్పులు చాలా తక్కువ.
పుస్తకావిష్కరణలు, ముగింపు
గోపీచంద్ రచనాసర్వస్వం, వెల్చేరు నారాయణరావు కవితా విప్లవాల స్వరూపం ఈ సభలో ఆవిష్కరించబడ్డాయి. అలానే, బండ్ల హనుమయ్య, ఆవుల మంజులతలకు వారి విశిష్టసేవకు గాను డీటీఎల్సీ తరపున జ్ఞాపికలతో సన్మానం చేశారు. రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనిని డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. వారి సాహితీ పిపాసకు వచ్చిన అతిథులందరూ కృతజ్ఞతలు తెలిపారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది. రెండు రోజులు ఆనందంగా గడిచిపోయాయి.
పూటకు తప్పకుండ రుచిపూరముగా బలు విందు బోనముల్
మాటల నాడ స్నేహితులు, మాట వినంగను వక్త లెందఱో
మేటిగ బల్కు వారు, కొన మేలిమి పుస్తకముల్ లభించెగా,
పాటన సాహితీసభయు పండుగ రీతిగ నొప్పె నిక్కమై