గాడ్ ఆన్ ది హిల్ – టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు

ప్రపంచంలో ఏ కళా రూపాలు చూసినా అవి తన పురుడు పోసిన జాతినీ, నిలదొక్కుకున్న ప్రదేశాన్నీ, ఆనాటి సమాజాన్నీ, ఆలంబిత సంస్కృతినీ దాటి వేరొక పరిధిలోకి ప్రవేశించవు. ఒకవేళ ప్రదేశం మారి రూపాంతరం చెందినా అంతర్లీనంగా మూల సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కళలకున్న అంతర్గత సూత్ర స్వరూపం ఇది. ప్రతీ కళా రూపమూ తమ చుట్టూ ఉన్న సమాజంతో సంభాషణ జరుపుతుంది. అదే స్పందనకి దారితీస్తుంది. సాహిత్యం దీనికి మినహాయింపు కాదు.


గాడ్ ఆన్ ది హిల్: టెంపుల్ పోయెమ్స్(2004)
వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్

ప్రదర్శనాయోగ్యమైన కళలకి ప్రదర్శనే ఒక ప్రత్యేకమైన సంభాషణ. కానీ ఆ యోగ్యత లేని కళారూపాలకు భాషే ప్రధాన వాహకం. అంటే ఒక సంస్కృతిలోని కళారూపాన్ని మరొక సంస్కృతికి చేరవేసేటప్పుడు రెండవ సంస్కృతి భాషలో చెబితేనే అర్థమవుతుంది. సంగీతం తీసుకుంటే ధ్వనే దాని భాష. నాటకం లేదా నృత్యం తీసుకుంటే అభినయమే దాని భాష. ఇలా ప్రతీ కళకీ ఒక సొంత భాష లేదా గొంతుకుంటుంది. కానీ భాష చుట్టూ అల్లుకోబడ్డ కల్పన అనబడే కళారూపానికి మాత్రం వేరే భాషే ప్రధాన వాహకం అవుతుంది. అంటే ఒక కళారూపం తాను ధరించిన భాషావస్త్రాన్ని వదిలేసి రెండవ దాని భాషావస్త్రాలు ధరించి వారికి పరిచయమవుతుంది. పరిచయమున్న అలంకరణ చేయి పట్టుకొని మొదటి కళారూపం హృదయాన్ని వెతుక్కోవడానికి రెండోది ప్రయత్నిస్తుంది. సాహిత్యానువాదంలో భాష అలంకరణ అయితే, సాహిత్య మూలం దాని ఆత్మ. ఒక సంస్కృతిలోని సాహిత్యాన్ని వేరొక సంస్కృతికి అవగాహనయ్యేలా రూపాంతరం చేసి ఆవల చేరవేస్తాయి. అందుకే – అనువాదాలు వివిధ సంస్కృతులకి వారధులు. అనువాదం అనేది చాలా విస్తృతమైన కళ. కరపత్రమయినా, నినాదమయినా, ప్రభుత్వ పత్రాలయినా, సాహిత్యమయినా దేనికదే ప్రత్యేకమైనది. అన్నిటికంటే భిన్నమైనది సాహిత్యానువాదం. మూల రచయిత ఊహాశక్తీ, మేధాశక్తీ, అంతర్లీన భావనా, ఇవన్నీ ప్రతిబింబించినప్పుడే అనువాదం తన ఆశయం నెరవేర్చుకుంటుంది.

వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్‌ల God on the hill – temple poems from Tirupati పుస్తకం ఈ రకంగా అన్నమయ్య అక్షరాన్ని ఆవలి సాహిత్య తీరానికి చేరవేసిన పుస్తకం. ఇంతకుముందు వీరిద్దరూ చాటు పద్యాల మీద చేసిన అనువాదం, ఎ పోయమ్ ఎట్ ది రైట్ మూమెంట్, చదివాక ఈ పుస్తకం మీద మరింత ఆసక్తి కలిగింది నాకు. అన్నమయ్య కీర్తనలు అనువాదానికి లొంగవన్న అభిప్రాయం పాతుకుపోయిన వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. తీరా పుస్తకం తెప్పించుకొని చదివాక నా అభిప్రాయం పటాపంచలయ్యింది. నాకు బాగా తెలుసున్న కీర్తన వెతుక్కొని ఆ పద్యం ఇంగ్లీషు అనువాదం ఒకటికి రెండుసార్లు చదివాను.

Life day after day is a game
To find what you cannot see
is truth

Coming is real. Going is real.
What happens in between is a game.
Right in front of you
Lies the endless world.
At the very end
is truth.

ఇది చదివాక అన్నమయ్య కీర్తనలతో ఏపాటి పరిచయం ఉన్న వారికయినా ఇది ఏ కీర్తనో అర్థమయ్యే ఉంటుంది. ‘నానాటి బ్రతుకూ, నాటకమూ – కానక కన్నది కైవల్యమూ,’ కీర్తన అనువాదం ఇది. Life day after day is a game, అన్న వాక్యం చూడండి. మనకి, అంటే తెలుగు లేదా భారతీయ సాహిత్యంలో, జీవితాన్ని నాటకంతో పోల్చడం పరిపాటి. కానీ పాశ్చాత్య దేశస్థులు జీవితాన్ని ఆటతో పోల్చుకుంటారు. జీవితం ఒక ఆట అన్నది వారి జనస్రవంతిలో నానుడి. ప్రజల వాడుక భాషతో (ఇక్కడ ఇంగ్లీషు) పరిచయం లేకుండా, కేవలం భాషా పరమయిన పదజాలంతో పరిచయమున్న ఎవరైనా, Life day after day is a play (or drama)” అని అనువాదం చేసే ఆస్కారం ఉంది. ఇక్కడే అనువాదకుల గొప్పదనం కనిపించింది. ‘పుట్టుటయు నిజము పోవుటయు నిజము; నట్టనడిమి పని నాటకము – యెట్ట నెదుట గలదీ ప్రపంచము; కట్ట గడపటిది కైవల్యము.’ అన్న చరణానికి అనువాదం చూడండి. ఆటలో ప్రవేశమూ, నిష్క్రమణే ఉంటాయి. మధ్యలో ఉన్నదే నిజమైన ఆట. అది జరిగేది అంతులేని ప్రేక్షకుల ముందు. అంటే ప్రపంచం ముందు. ఆట చివర ముగింపే నిజమైనది.

మొత్తం పుస్తకంలో నాకు బాగా నచ్చిన అనువాదాలలో ఇది ఒకటి. తెలుగు వారు ఆస్వాదించ గలిగిన అన్నమయ్య భాష వాడుకలో ఉండే ప్రత్యేకతలూ, అందమూ ఇతర భాషల వారికి సహజంగా అర్థం కావు. ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం అన్నమయ్య కీర్తనల్లో ఉన్న కవితా మాధుర్యాన్నీ, భావనా పటిమనీ ఇతర భాషల వారికి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి, పరిచయం చెయ్యడమే కాదు, అన్నమయ్య ఎంత ఆధునికమైన కవో చూపించడం కూడా. ఈ మొత్తం పుస్తకం చదివాక అనువాదకుల లక్ష్యం పూర్తిగా నెరవేరిందనిపించింది.

సాధారణంగా పాటల్లో, పల్లవి ఇతివృత్త మూలాన్ని సూచిస్తే, అనుపల్లవి దాని గమనాన్ని నిర్దేశిస్తుంది. మిగతా చరణాల్లో అది విశదీకరించబడి, తిరిగి ఇతివృత్తాన్ని అంటే పల్లవిలో సారాంశాన్ని నొక్కి చెబుతుంది. పల్లవీ, చరణాలు ఒక గొలుసు కట్టులా ఇమిడుంటాయి. చరణాంతాలతో పల్లవి కలిసిపోతుంది. అనాదిగా ఇదే పద్ధతిని పాటలకి అనుసరిస్తూ వచ్చారు. ఈ పద్ధతే మనకి త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తుంది. పల్లవి లేదా ఎత్తుగడ ప్రాధాన్యత పాటల్లో చాలా ముఖ్యమైనది. ఇవే పాటల్ని లేదా కీర్తనలని వేరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా ఈ గొలుసుకట్టు ఇతివృత్తాన్ని అమలుపరచడం. ఈ సమస్యని వెల్చేరు, షూల్మన్లు చాలా చాకచక్యంగా ఈ అన్నమయ్య కీర్తనల అనువాదంలో పరిష్కరించారు. అంటే రెండు మూడు పాదాలున్న కీర్తనల్లో గొలుసుకట్టు పద్ధతిని సున్నితంగా, భావయుక్తంగా చూపించారు. పల్లవిలో ముఖ్యమైన అంశాన్నే తీసుకున్నారు తప్ప, దాని చుట్టూ అల్లబడిన నేపథ్యాన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా త్యజించారు.

ఉదాహరణకి –

These marks of black musk
on her lips, red as buds,
what are they but letters of love
sent by our friend to her lover?

Her eyes the eyes of a cakora bird,
why are they red in the corners?

Think it over, my friends:
what is it but the blood
still staining the long glances
that pierced her beloved
after she drew them from his body
back to her eyes?

What are they but letters of love?

ఇది, ‘ఏముకో చిగురు టధరమున – ఎడనెడ కస్తూరి నిండెను – భామిని విభునకు రాసిన – పత్రిక కాదు కదా?’ కీర్తన అనువాదం. ఇక్కడ భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా? (What are they but letters of love?) అన్నదాన్నే మకుటంగా వాడుకున్నారు. అది చరణాంతాలతో చక్కగా కలిసిందనిపించింది. చదువుతూంటే ఒక ఇంగ్లీషు పద్య కవిత్వం చదువుతున్నట్లుగా అనిపించింది తప్ప వేరొక భాషలోని కీర్తన అనబడే ప్రక్రియని చూపిస్తున్నట్లుగా అనిపించలేదు. అలాగే అనువాదంలో ఎంచుకున్న సరళమైన పదాలూ, క్లుప్తత మరింత భావగర్భితంగా అమిరాయి.

దాదాపు అన్ని కీర్తనలకీ ఇదే పద్ధతి అనుసరించారు. కానీ కొన్ని కీర్తనల అనువాదంలో ఈ గొలుసు కట్టు అమరిక లేదు. ‘పలుకు తేనెల తల్లి పవళించెను’ కీర్తనలో ఇది కనిపించదు.

Mother, who speaks so sweetly,
has gone to sleep.
She made love to her husband
with all her feminine art.

Now our friend is sleeping
long into the day,
hair scattered on her radiant face.

ముందు పీఠికలో చెప్పినట్లుగా కేవలం అన్నమయ్య కవిత్వంలోని భావానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, భాషా సౌందర్యానికి కాదన్న విషయం ఈ అనువాదాలలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ పుస్తకంలో సుమారు 90కి పైగా కీర్తనలు అనువాదం చేశారు. వారే ముందుమాటలో చెప్పుకున్నట్లు అనువాదానికి అనువుగా ఉండేవీ, కవిత్వ వైవిధ్యమున్నవీ ఎన్నుకున్నారు. అలాగే అనువాదం చేసేటప్పుడు లక్ష్య పాఠకులని దృష్టిలో ఉంచుకునే చేసినప్పటికీ మూలం లోని భావానికి, అర్థానికీ అతి దగ్గరగా ఉంటూనే వచ్చారు. దీనికి ఉదాహరణగా – ‘ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన అంత మాత్రమే నీవు – అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు’ కీర్తన అనువాదం. పిండికొద్దీ అట్టు అన్నది అనువాదంలో ఎలా మారిందో ఇది చూస్తే తెలుస్తుంది.

You’re just about as much as one imagines you to be
As they say, the more dough, the more bread.

ఈ కీర్తనల్లో మొదటి చరణాంతాన్ని, You are as one imagines అని, రెండో దాన్ని, You are as deep as one imagines అని, చివరి చరణాంతం, You are as real as I imagineతో ముగించడం మూలంలోని సందర్భానికి సరిపోవడమే కాకుండా అనువాదానికి కొత్త అందాన్నిచ్చింది.

అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక లేదా అంతర్ముఖ వేదాంత చర్చలే కాకుండా కొన్ని సామాజిక పరమయిన అంశాలు కూడా స్పృశిస్తూ కీర్తనలు రచించాడు. కులాల గురించీ, రాజ్యకాంక్షల గురించీ, నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని హతమార్చడం గురించీ చాలా కీర్తనలు రచించాడు. ఈ పుస్తకంలో కేవలం కొన్ని వేదాంత లేదా ఆధ్యాత్మిక పరమయిన కీర్తనలే అనువాదంలో కనిపించాయి. ప్రసిద్ధి చెందిన బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే, ఏ కులజుడైన నేమి?, విజాతులన్నీ వృధా — అనువాదంలో లేకపోవడం నాకు కొంచెం నిరాశ కలిగించింది. ఆలాగే, ఈ పుస్తకాన్ని ద్విభాషా పుస్తకంగా, అంటే అనువాదంతో పాటు తెలుగు మూలం కూడా ఇస్తే బాగుండేది.

అన్నమయ్య పద సంపద ఆధ్యాత్మిక, శృంగార కీర్తనలుగా విభజింపబడి మనకు రాగి రేకుల్లో దొరికాయని మనకి తెలుసు. అన్నమయ్య పదాల్లో ఈ రెండు వైఖర్లూ స్పష్టంగా కనిపిస్తాయి; ఒక పక్క శృంగార పద ధ్వని. మరొక పక్క ఆధ్యాత్మిక కంఠం. ఈ రెండు గొంతుకలూ ఎంత స్పష్టంగా వినిపిస్తాయంటే ఈ రెండూ ఒకే గొంతులో ఎలా ఇమిడియా అన్నంత ఆశ్చర్యంగా. పదమనే ప్రక్రియనే రెండూ వాడుకున్నా, భాష విషయంలోనూ, శైలి పరంగానూ వేటికవే ప్రత్యేకమైనవి. అయితే, అన్నమయ్యలోని అధ్యాత్మికత తనలో తాను విచారించుకునేది; ఒక్కోసారి వేదన చెందుతుంది; మరొకసారి సంఘర్షణకి గురవుతుంది; వేరొకసారి నిరాశ చెందుతుంది; అపరాధ భావంలోకి నెట్టబడుతుంది; ఇంకోసారి వైరాగ్యం చెందుతుంది. ఇవన్నీ గేయ కవిత్వంలో అందంగా మలచబడ్డాయి.

కడలుడిపి నీరాడగా దలచువారలకు
కడలేని మనసునకు కడమ యెక్కడిది?

You say you want to bathe
when the waves subside.
Is there an end
to the endless mind?

దాహమణగిన వెనక తత్త్వమెరి గెదనన్న
దాహమే లణగు తా తత్త్వమేమెరుగు?

You say, “Let me quench my thirst,
and then Iill find the truth.”
Why should thirst be quenched?
How can you know the truth?

Is there an end?

దేహంబుగల యన్ని దినములకును పదార్థ
మోహమే లుడుగు దా ముదమేల కలుగు

All the days you have a body,
why should longing cease?
How can you find joy?

Is there an end?

ముందరెరిగిన వెనుకమొదలు మరచెదనన్న
ముందరే మెరుగు దా మొదలేల మరచు

You say, “After I know what lies ahead,
I’ll forget what was before.”
Can you know what lies ahead?
How can you forget what was before?

Is there an end?

అందముగ దిరువేంకటాద్రీశు మన్ననల
కందు వెరిగిన మేలు కలనైన లేదు.

That goodness that comes of knowing
how to reach god —
you won’t find it
in your wildest dreams.

Is there an end?

ఈ పదంలో అన్నమయ్య పట్టువిడవకుండా ప్రశ్నిస్తున్నాడు. తన మనసుతో బేరసారాలాడుతూ శల్య పరీక్ష చేస్తున్నాడు. భిన్నమైన గొంతుకలతో చర్చిస్తున్నాడు. మొదటి దశలో మానసిక రక్షణ కరువైన గొంతుక పెట్టి ప్రపంచంతో, ముందు రాబోయేది మంచిదని మాటిస్తే ప్రస్తుతమున్నది వదులుకుంటాను, అంటూ షరతులు పెట్టి మరీ అడుగుతున్నాడు. వెంటనే వేరొక గొంతుతో దానినే మరలా ఖండిస్తున్నాడు. బేరసారాలకి వాస్తవమే పెద్ద నిరోధకం. అన్నమయ్యకి ఈ నిజం తెలుసు. కానీ మనసుని ఆపలేడు. అందుకే భగవంతుణ్ణి చేరుకుందామనుకున్న కోరిక మానసిక వ్యాజం ఉన్నంతవరకూ కలలో కూడా తీరదని వాపోతాడు. తన మనసులో నిరంతరమూ నలుగుతున్న సంభాషణలని చిన్న చిన్న ప్రశ్నలుగా మార్చి, వాటికి ఉత్ప్రేక్షలు చేర్చి మరీ అడుగుతాడు. అందులో కడలి కూడా, మనసు లాగే ఎప్పటికీ ఉపశమించదన్న పద చిత్రాన్ని అందంగా చూపిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ పునరావృత్తమయే ఈ సంభాషణని చిక్కటి తెలుగు పదాలలో చక్కగా చూపిస్తాడు. ఇదీ అన్నమయ్య కవిత్వంలో మనకి కనిపించే గొప్పదనం.

ఈ పుస్తకంలో సున్నితమైన శృంగార కీర్తనలని love poemsగా అభివర్ణించారు. సాధారణంగా స్త్రీ గొంతుతో ఉండే ఈ పాదాలనుంచి ఒక అద్భుతమైన కీర్తన, అంతకంటే అద్భుతమైన అనువాదం గురించి ప్రస్తావిస్తాను. ముందు అన్నమయ్య వ్రాసిన పాదం చదవండి. వెంటనే తొందర పడి అనువాదం చదవకుండా, ఈ పాదం గురించి ఆలోచించండి. ఆ తరువాత అనువాదం చూడండి.

యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను
కఱకఱిసేసితేను గయ్యాళి యందురు

మలసి తన కెదురు మాట లాడుటకంటే
చెలిచే మనవి చెప్పించేదే మేలు
పలుమారు దన్ను జూచి పచ్చారుకంటేను
తలవంచుక తనముందర నుండుటే మేలు

తడివి మందెమేళాన దనతో నవ్వుటకంటే
వొడికమై సిగ్గుతోడ నుండుటే మేలు
సడిబెట్టి సారె సారె సరస మాడుటకంటే
వుడివోని బత్తితోడ నుమ్మగిలుటే మేలు

ఆనుకొని తన్ను రతి నలయించుటకంటే
పానుపుపై దండ నిట్టే పండుటే మేలు
నే నలమేలుమంగను తాను శ్రీవేంకటేశుడు
మేనంటి తా నన్ను గూడి మెఱయుటే మేలు

ఈ కీర్తన చదివితే ఏమనిపిస్తోంది? అలమేలుమంగ తన ప్రవర్తన ఎలా ఉంటే సంసారానికి మంచిదో తనకు తెలుసు. ఆ సంగతి పోయి ఆ పెద్దమనిషికి చెప్పండే అని చెలులకు చెప్పుకుంటున్నట్లుగా లేదూ? అయితే ఈ విషయాన్ని భర్తకు చెప్పిరమ్మనటం ఎందుకు? పైగా, ఆ చివరి వాక్యం సంగతేమిటి? పోనీ అది కాదా దాని అర్థం? నేనెలా ఉంటే ఆయనకు నచ్చుతుందో నాకు తెలుసు అని అంటూ తనకు ఒప్పని ప్రవర్తననే చెప్పుకుంటున్నదా? ఎంతైనా ఆయన కూడా ఒక మగవాడే కదా అని వ్యంగ్యంగా ఎత్తి చూపుతున్నదా?

ఈ పదాన్ని నిజంగా ఎలా అర్థం చేసుకోవాలో దాని అనువాదంలో చూడండి.

You tell him about subtlety
If I insist, they will say I am too demanding.

Instead of talking back to me,
he would do better to send a messenger.
Why stare at me over and over?
He might bend his head, a little shy.

Tell him about subtlety.

Better than laughing so loudly,
he could be a little quiet.
Instead of pestering me to play,
let him simmer with some affection.

Tell him about subtlety.

Rather than tiring me by making love,
let him lie quietly by my side.
I’m Alamelumanga. He is the god on the hill.
A loving touch would make all the difference.

Tell him about subtlety.

ఈ కీర్తనలో వేంకటేశ్వరుని భార్య, అలిమేలు మంగ, తన ఇష్ట సఖులతో తన దేవుడి గురించి ఫిర్యాదు చేస్తోంది. సున్నితత్వం కొరవడిన అతని ప్రవర్తన చూసి ఆగ్రహం చూబెడుతోంది. అతను గట్టిగా నవ్వుతాడనీ, బిగ్గరగా మాట్లాడుతాడనీ ఒక స్త్రీ ఏమీ కోరుకుంటుందో తెలుసుకోలేని వాడనీ వాపోతుంది. ఇంత కోపంలోనూ అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమపూరితమైన స్పర్శతో సంతృప్తి పడుతానని చెబుతుంది. చిన్న మౌన సందేశం చాలని మొరపెట్టుకుంటుంది. ఒక స్త్రీ యొక్క ప్రేమా, కోరికా వంటివి ఇంత విస్తృతమైన పరిధిలో ప్రస్ఫుటంగా చెప్పడమే అన్నమయ్య కీర్తనలకున్న ప్రత్యేకత. చదివేటప్పుడు ఇది ఒక పురుష రచన అన్న సంగతే మనం మర్చిపోతామని అంటారు వెల్చేరు, షూల్మన్లు.

మనం అనుకున్నట్టు ఈ పాదం అలమేలుమంగ తను ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం గురించి కాదు. తన పెనిమిటి ఎలా ఉంటే తనకి బాగుంటుందో చెప్పడం ఇది. చూశారా, ఇది ఎంత నాజూకైన తేడా! ఎంతో సూక్ష్మంగా ఈ పాదాన్ని చదివి అర్థం చేసుకుంటే గానీ అంతు చిక్కని అంతరార్థం! ఈ ఒక్క ఉదాహరణ చాలు, వెల్చేరు ఎప్పుడూ “First read the Text!” అని అనడంలో అర్థమేమిటో మనకు తెలియడానికి.

వెల్చేరు నారాయణ రావు (షూల్మన్‌తో కలిసి) అన్నమయ్య పదాలని కేవలం అనువాదం మాత్రమే చేశాడు అని అనుకుంటే మీరు పొరబడ్డారు. ఆయన ఇతర అనువాదాలలో లాగా ఈ పుస్తకంలో కూడా అతి ముఖ్యమైన మలిపలుకు ఉంది. అన్నమయ్య గురించి, తిరుమల గురించి, అన్నమయ్య జీవిత చరిత్ర, ఆయన పద కవితాకోశం గురించి ఇందులో వివరిస్తారు. తిరుపతి చరిత్రను, తాళ్ళపాక వంశస్థులకు ఆ దేవాలయంతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తారు. కానీ అక్కడితో ఆగరు. అంతకంటే ముఖ్యంగా, అన్నమయ్య పద కవిత్వం ఎందుకు గొప్పదో, ఆ కవిత్వాన్ని ఎలా చదవాలో, ఎలా ‘వినాలో’ మనకు చెప్తారు. అన్నమయ్య కాలానికీ, కవిత్వానికీ, ఆ కవిత్వ ధ్వనికీ ఉన్న ప్రత్యేకతను వివరిస్తారు. అన్నమయ్య కవితా భావంలో ఆధునికత చూపిస్తారు. ఈ రకంగా వీరి అన్ని పుస్తకాల లాగానే ఈ పుస్తకం కూడా కేవలం అనువాదం కాదు. భారతీయ సాహిత్యాన్ని సందర్భోచితంగా ప్రపంచానికి ప్రదర్శించి, తెలుగు భాష గొప్పతనాన్ని పదిమందికి తెలియబరిచే గొప్ప ప్రయత్నం ఇది.