కవులు వాళ్ళ తృప్తి కోసం కవిత్వం రాసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు. అదేమో కాని, మంచి కవులు అనుకోకండా చదువరికి కూడా తృప్తినిస్తారు. కారణం: జీవితంలో బోలెడు సందిగ్ధాలు. తేలిగ్గా విశదపరచలేని సందిగ్ధాలు. ఈ సందిగ్ధాలే కవిత్వానికి ప్రేరణ. కవి తన పరిభాషలో ఈ సందిగ్ధాలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే, కవి చెప్పే ఏ సమాధానమూ కవికి, చదివేవాడికీ పూర్తి తృప్తి నివ్వదు. అందుకనే ఎప్పటికప్పుడు కవి కొత్తకొత్త మాటలు, కొత్తకొత్త ప్రతీకలూ తయారుచేసుకుంటాడు, కవిత్వం కోసం. ఎన్నెన్నో ఉపమానాలు, ఉత్ప్రేక్షలూ, పెల్లుబుకి పైకొచ్చినా, కవికి అసంతృప్తే మిగులుతుంది. ఎందుచేత? తన కల్పనకీ, తను కవితలో ఉద్దేశించినదానికీ మధ్య గండి పెరిగిపోతోందనే భావన వస్తుండటంచేత. నిజం చెప్పాలంటే, నిజమైన కవి సర్వదా చీకటిలో తడుముకుంటూనే ఉంటాడు. అఫ్సర్ ఈ కోవకి చెందిన మంచి కవి.
ఊరి చివర – అఫ్సర్
పాలపిట్ట ప్రచురణలు
2009, రూ.60.00, $5.00
డిసెంబర్ 2000 లో ప్రచురించిన ‘వలస’ కవితాసంకలనం చివర ‘నాస్థలకాలాల్లోకి…’ అన్న స్వగతంలో అఫ్సర్ ఇలా రాసుకున్నాడు:
“కవిత్వం వొక గమ్యం కాదు. అదెప్పుడూ ఒక మజిలీ మాత్రమే. అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. …ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం.” ఇందులో కవితలన్నీ 1990-2000లలో రాసినవి. పదేళ్ళ తరువాత ప్రచురించిన ‘ఊరి చివర’ (డిసెంబర్ 2009) కవితాసంకలనాన్ని సమీక్షించడానికి ‘వలస’ని ప్రస్తావించ వలసిన అవసరం ఉన్నదనిపించింది నాకు. ఎందుకు అన్న ప్రశ్నకి ఈ సమీక్షే సంజాయిషీ చెప్పుతుందనుకుంటాను.
పాత సంకలనం ‘వలస’ నుంచి, 9 జులై 1993లో రాసిన నాలుగు మాటలు అన్న పద్యం చూడండి.
ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి
చిత్తుపదాలమధ్య
వొకానొక భావావశేషం
మంచుపర్వతంలా –
ఎప్పటికీపగలని మంచులో
కూరుకుపోయిన పదసమూహాన్ని నేను.
తలుపులు
మూతపడి వున్నాయి పెదవుల్లా.
సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు
వేళ్ళు తెగిపోయాయి
తలుపుతట్టలేను
శవపేటికకు ప్రాణం పోయాలా?
అదృష్టవంతులు కొందరు,
మాటలమీదే మళ్ళీమళ్ళీ బతుకుతుంటారు
మాటలకే రక్తాన్ని అద్దుతుంటారు
రక్తాన్ని నమ్ముకున్నవాణ్ణి
వొట్టీదేహాన్నిమాత్రం అమ్ముకోలేను. …
కొత్త సంకలనం ‘ఊరి చివర’లో రాసిన రెండంటే రెండు మాటలు (2004) అన్న కవిత చూడండి:
…వుండచుట్టి పారేసిన కాయితాలు
కొన్ని ఆలోచనల భ్రూణ హత్యల మరకలు
చిత్తుపదాల శిధిలాలమధ్య
వొకానొక భావశేషం
ఎంతలెక్కపెట్టినా
శూన్యమే శేషం.
…తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా
పదం సమాధిలోకి వెళ్ళింది
పునర్జన్మ వుందో లేదొ?
…అదృష్టవంతులు కొందరు
వాళ్ళమాటలు
బతికి బయట పడ్దాయి
నామాట
దేహం విడిచిన వస్త్రం.
నాదో
ప్రాణాంతక జనన యుద్ధం.
వాయిదా వెయ్యలేను
ఇలాగేలే అని వుండలేను.
ఈ రెండు కవితలలో ముఖ్యంగా మొదటి చరణాలలో వాడిన మాటలే మళ్ళీ వాడినట్లుగా కనిపించినా, రెండవ కవితలో ‘భ్రూణ హత్యల మరకలు’ (blood stains from fetal killing) అన్న ప్రతీకతో భావతీవ్రత హెచ్చింది. అయినా, తను చెప్పదలచుకున్నది ఇంకా తృప్తికరంగా చెప్పలేకపోయినందుకు కవికి కసి పెరిగింది. సమాధిలోకి వెళ్ళిన పదానికి పునర్జన్మ లేదు; నైరాశ్యం. రెండవ కవితలో పదం ఆపలేని నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది. రెండు కవితల్లోనూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, కవి నిర్దిష్టమైన సమాధానం కోసం చీకటిలో తడుములాడుకుంటున్నాడు. మంచికవికి ఇది అనివార్య పరిస్థితి. కొత్తగా వచనకవిత్వం రాస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రతీకల త్రాణ గుర్తించడం మంచిది.
‘ఊరిచివర’లో ‘వొకానొక అసందర్భం’ (2009?) కవిత చూడండి:
చిత్రిక పట్టని
ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా
శవానికి సైతం
కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.
అలంకారాలన్నీ వొలుచుకున్న
మాటకోసం చూస్తున్నాను
నిఘంటువుల్ని కప్పుకొని
గాఢ నిద్రిస్తున్న భాషలో.
‘చిత్రికపట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం, అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం’ కవి అన్వేషిస్తున్నాడు. తమాషా ఏమిటంటే మాటలని అతి జాగ్రత్తగా చిత్రికపడుతూ, అలంకారాలు వాడుతూనే ‘మాటకోసం’ వెతుకుతున్నాడు. ఈ చిత్రికతోటే సంగీతానికి వేదనతో కూర్చిన రంగురంగు మాటల బొమ్మలు వేస్తాడు అఫ్సర్. ఈ పని చెయ్యి తిరిగిన కవులే చెయ్యగలరు. 1987లో సైగల్ పాట మీద కవిత ఇప్పటికీ నాకు నచ్చే కవితే.
…కిటికీతెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట
చిగురాకు కొనపై
మంచు బిందువు మరణ వేదన…
అతనే వినిపించక పోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లగా కదిలి
తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకంలా
నడుస్తున్న నిన్ను వెంటాడి వేధిస్తుంది
రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా!
సైగల్ పాటల్లో విషాదం, వేదనా వినిపిస్తాయి. సైగల్ పాట దిగులుగా కిటికీ తెరకుచ్చుల్ని పట్టుకు జీరాడుతుంది అనే మాటల బొమ్మ విషాదాన్ని చిత్రిస్తుంది. సైగల్ లేడు; అతని పాట ఉంది. అతని పాట విన్న తర్వాత, అది తుఫానులా జ్ఞాపకం వస్తుంది; రాత్రివచ్చిన కలలా వేధిస్తుంది. సైగల్ పాటలో వేదన అంతా అఫ్సర్ మాటలల్లో చూపించాడు; తెరమీద బొమ్మలాగా!
ఊరి చివర – అఫ్సర్
పాలపిట్ట ప్రచురణలు
2009, రూ.60.00, $5.00
ఊరి చివర సంకలనంలో వాయులీనమవుతూ… (2004) అన్న కవితలో ఈ క్రింది భాగం చూడండి! కవిత చివర ఇచ్చిన ఫుట్‌నోట్‌లో వివరాలు విపులంగా లేకపోవడం ఈ కవితకి జరిగిన అన్యాయం. ఈ పొరపాటు జరగటానికి సంపాదకుల అశ్రద్ధే కారణం! (ఫుట్‌నోట్‌లో ఉన్న వాక్యం: రెండు సింఫనీల అనుభవం తర్వాత, వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్ కాలంలో వసంత మేఘాలమీదుగా తిరుగుబాటుని ఆలపించిన వయొలిన్). అయినప్పటికీ, స్టాలిన్ కాలంలో రష్యాలో జరిగిన హత్యాకాండ, అణిచివేతలూ చదివినవాళ్ళకి కవితలో ప్రతీకలు స్పష్టంగానే ప్రతిధ్వనిస్తాయి. వయొలినిస్టు ఎవరో తెలిస్తే సహృదయుడైన పాఠకుడికి సానుభూతి పెరుగుతుంది.
…ఊపిరి పీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుళ్ళు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనప మాటలే వినిపించాలి.
అప్పుడింక
వయిలిన్ లోపలి ధ్యానానికి
తుఫాను భాష నేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమాను లోంచి
కార్చిచ్చు.
ఎంత చిత్రం! వయొలిన్ నినాదమవుతుంది, వసంతం గర్జిస్తుంది, అంటూ ముగుస్తుంది కవిత. ఒకరొట్టె ముక్కా, ఒక దేశమూ, వొక షెహనాయీ… ( 2009?) అన్న కవితలో,
ఆమె కడుపులో (ఫాతిమా) ఏమూలనో దాచేసుకున్న శోకాన్ని
నువ్వు షెహనాయీ లోకి వొంపినప్పుడు అనుకున్నానా,
నాచరిత్ర అంతా వొకానొక కలత కల అని!…
ఇది చిక్కని కవిత. ఈ కవితలో మహ్మద్ ప్రవక్త, ఫాతిమా కల, కర్బలా కథని బిస్మిల్లాఖాన్ షెహనాయీలోకి అనువదించడం ఫుట్ నోట్లుగా సూచించారు. కాని వీటి పూర్వకథలు, కవితలో వాడిన ప్రతీకల ప్రత్యేకత తెలిస్తే ఈ కవితని అనుభవించడం సులువు. సంకలన సంపాదకుడు ఈ పని చెయ్యకపోవడం మరొక పెద్ద లోపం!
ఇక, తెలంగాణా 2002 అన్న కవిత గురించి. ఇది ఒక విచిత్రమైన కథనం. తెలంగాణా/ఆత్మ కథనం. సంకలనంలో ఏకైక బృహత్కవిత. పదహారు ఖండికలలో అసంతృప్తుల రాజకీయం, మైనారిటీ పేదల ఆవేదన, ‘అణచబడ్డ’ వర్గాల ఆర్తనాదం, పోరాటం, తిరుగుబాటు వగైరా… అంతాకలిపి మొత్తం పదకొండు పేజీలు. ఇంతకుముందు ఈ సంకలనాన్ని సమీక్షించిన వాళ్ళు, విమర్శలు రాసిన వాళ్ళూ అంతగా ఈ కవిత ప్రస్తావన తెచ్చినట్టు లేదు. ‘ఇది రాజకీయ కవిత, మనకెందుకులే’, అన్న ధోరణిలో కప్పదాటు వేశారేమో!
ఈ కవిత గురించి నాలుగు మాటలు చెప్పకుండా నేను ఉండలేను.
…కదులుతున్న ఉరికంబం నా వూరు
సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది
నా చుట్టూ వీచే గాలి
అధికారం విసిరిన ఉచ్చు…
మదరసాల పిట్టగోడలు
సిగ్గుపడ్డాయి నేను పుట్టినప్పుడు
యే భాషలో యేడ్వాలో నవ్వాలో తెలియక
కళ్ళకింద నవ్వుని పాతుకుంది అమ్మ.
ఇలా సాగిపోతుంది ఈ బృహత్కవిత. పోలిక సమంజసం కాకపోయినా, ఎందుకో ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ (1991) గుర్తుకొస్తుంది. ఆ కవితలో ఇంతకన్నా సూటిగా తన పుట్టుక గురించి చెప్పుకున్నాడు: ‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది… / నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నాపేరు…’ అంటూ!
…అన్నీ నానోటిదాకా వచ్చి వెళ్ళిపోయినవే మరి!
చివరికి స్వాతంత్ర్యం కూడా!
…నా పంద్రాగస్టు
ఓ పెద్ద వెక్కిరింత కాదూ!
అందరూ మూడురంగుల జెండాలు ఎగరేస్తున్నప్పుడు
నా శరీరం ఒకేఒక్క నెత్తుటిరంగులో తలకిందులుగా
ఏ చెట్టుకొమ్మకో వేలాడుతోంది
ఆగస్టు 15ని, స్వాతంత్ర్యదినోత్సవాలని, జాతీయ జెండానీ వామపక్షీయులు – ముఖ్యంగా అతివాద వర్గం వాళ్ళు, ఒకానొకప్పుడు దిగంబర కవులూ ఇంతకన్నా ఎక్కువగా హేళన చేస్తూ రాసారు. ఇది అతివాద రాజకీయ కవులని ప్రేతంలా వెంటాడుతున్న ఒక పాత ఫేషన్. అఫ్సర్ లాంటి తాత్విక కవుల కలం నుంచి ఇలా రావటం చిరాకేస్తుంది. సరిగ్గా ఇదే ధోరణిలో వలస సంకలనం లో ‘అగర్ జిందో మె హై,’ (25 అగస్టు 1998) అన్న కవిత. నిస్సహాయధోరణిలో మొదలై, మధ్యలో అఫ్సర్ – బ్రాండ్ ప్రతీకలతో ఉత్తేజపరిచి, చివరికి స్వాతంత్ర్యదినం, జాతీయజెండా, జాతీయగీతాలంటూ విషాద పరిహాసంతో ముగుస్తుంది. చూడండి:
ఏ చరిత్రాలేని నాకు
చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం;
…నాచరిత్ర పాఠాలు
నేను మరిచిపోలేని పాత పద్యాలు…
…గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాలమీద
ఎప్పుడూ మోగే బెత్తానికి నాచరిత్ర తెలుసు
నాకాలం తెలుసు
నేను తెలుసు
ఈ పద్యంలో
చివరిపాదం వొట్టి కొయ్యకాలేనని తెలుసు
వందేమాతరంలో నాతరం లేదు
జణగణమణలో నా జనం లేరు
కంఠనాళాలు తెగిపోయాయి
నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు
నా ఆగస్టు పదిహేనులన్నీ
స్మశాన వాటికలోనే…
ఆఖరి చరణంలో మొదటి రెండు లైనులతో పద్యం అంతం అయితే ఎంత అందంగా ఉండేదో ఆలోచించండి. ‘వందేమాతరం’ లో తన తరం లేకపోవడం, ‘జనగణమణ’లో తన జనం లేకపోవడం; ఇటువంటి వాక్యాలు చదవడానికి – అమెరికన్ భాషలో చెప్పాలంటే – ‘క్యూట్’ గా ఉంటాయి, అంతే! పుస్తకాలమ్ముకునేవాడు వెనక అట్టమీద బ్లర్బ్ లో వేసుకోడానికి పనికి రావచ్చు.
మరొక్క విషయం. వియత్నాం యుద్ధం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారంచేసిన పాటకురాలు జోన్ బాయెజ్ (Joan Baez) అమెరికన్ జెండాని నిరసిస్తూ (అంటే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకత స్ఫురింప జేస్తూ) ఒకసారి “ఏ జాతీయ జెండా కూడా ఆ జాతి ప్రజల ఆశయాలన్నింటికీ, అభిలాషలన్నింటికీ అద్దంపట్టదు”, అని అన్నది! How True! ఇంతకన్నా క్లుప్తంగా బల్లేల్లా పొడిచే మాటలు ఏ నిరసన వాదుల రాతల్లోనూ నాకు కనిపించలేదు.
యెప్పుడూ ఓ నల్లబూటు కాలు నా శరీరాన్ని
కసిదీరా నలుపుతూ వుంటుంది
…అణిగిపోయిన దేహాలకు
నలిగిపోయిన కంఠాలకు
పోరాటం సిద్ధాంతంకాదు, బతుకు పాఠం!
…నేనే నిషిద్ధమయ్యాను
నా అడుగులకింద గూఢచారి నేత్రాలు మొలిచాయి.
మళ్ళీ మరొకసారి ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ‘పుట్టుమచ్చ’ కవిత గుర్తుకొస్తుంది. ఇదే వరసలో సాగిన ఈ కవిత చివరకి, హైటెక్, డాలర్లు… అణిచివేయబడటం (?) ఇంకా… ఇంకా… ఆక్రోశం. ఇంతకీ ఇక్కడ ఎవరు ఎవర్ని అణిచేసారు? ఈ అణిచివేయబడడం ఒక్క మైనారిటీలకే పరిమితమయ్యిందా? పేదరికానికి, మైనారిటీ మెజారిటీ మతాల ఊసుంటుందా? ఇలాంటి ‘అసంబద్ధపు’ ప్రశ్నలు వెయ్యటం బహుశా అమాయకత్వం కింద జమ కట్టబడవచ్చు. చివరకి కవి ఎదురుతిరిగి నిలబడి,
నువ్వు చూపిస్తున్న దృశ్యంలో
బొమ్మని కాను
నువ్వు ఆడిస్తున్న మాటల్లో
మాటని కాను
నేను మాట్లాడిస్తానింక
నేను ఆడిస్తానింక
నీ కాగితాల మీటలకింద నిక్కీ
నీలిగి కూర్చుండను…
అని హామీ/శపథం చేస్తాడు. ఎవరికి ఎదురుతిరిగి నిలబడడం? ‘ఎప్పుడో పుట్టిన ప్రశ్నకి సానబడుతున్నా, కొడవలికిలా’ అని ముగుస్తుంది కవిత.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది పెద్ద గందరగోళం కవిత. వచన కవిత్వాన్ని చదివించేవి, చదువరిని కదిలించేవి, కవితకి ప్రాణం పోసి బతికించేవీ మెటఫర్లు. మోటుబడ్డ కవితావస్తువు మంచి మంచి మెటఫర్లనన్నింటినీ అణగదొక్కేస్తుంది. ఇది నిజం. సరిగ్గా అదే జరిగింది, ఈ కవితలో!
ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలో కొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులని హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది. ‘అణిచివేయబడ్డ వర్గాల’ ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు, రష్యన్ కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ‘రెక్వీమ్’ (requiem) అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే, రాజకీయ కవితలు, ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం ఉండదనిపించక మానదు.
వీరుడి శిరస్సు (2007) అనే కవిత: ఇది యుద్ధవ్యతిరేక కవిత. ఫుట్ నోట్‌లో అంకిత వాక్యం ఆధారంగా ఈ కవిత బహుశా ఇరాక్ తో అమెరికా చేస్తున్న అన్యాయపు/అధర్మపు యుద్ధానికి నిరసనగా రాసిందై ఉండాలి. ఇది కేవలం నినాద కవిత. నినాదాలకి ప్రాధాన్యం ఇచ్చే కవితల్లో మాటలు చెప్పే బొమ్మలు నినాదాలకింద మరుగునపడిపోతాయి. కేకలు మాత్రమే మిగులుతాయి. (ఈ మధ్యకాలంలో కేకలు, నినాదాలూ లేని యుద్ధవ్యతిరేక కవిత, ఒకేఒక్క కవిత – నా దృష్టిలోకి వచ్చిన వచన కవిత – జి. యస్. రామ్మోహన్ రాసిన ‘యుద్ధప్రభుస్తోత్రము’ ఈ కవిత మీద వ్యాఖ్య ఈమాట, సెప్టెంబర్ 2005 లో మూడు ప్రార్థన పద్యాలు అన్న వ్యాసంలో చూడవచ్చు.)
తెలిసిందికదా, ఇప్పుడు
వొక ధిక్కారం తలతెగనరకడానికి
ఎన్నెన్ని వ్యూహాలు కావాలి!
తెగిపడిన ప్రతితలా సలసల మరిగే నెత్తుటి నగరం!
…ఎన్ని వందల అబద్ధాల కట్టుకథల కళేబరాలు!
ఎన్ని అబద్ధాలు కలిస్తే వొక చరిత్ర!
…యిక యీ క్షణం
వొట్టి మొండేలు కూడా
వీరవిహారం చేస్తాయి నెత్తుటి కడవలై!
‘అయం స రశనోత్కర్షీ…’ తో మొదలై, ‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ వరకూ, ఎటువంటి పోరాటాలయితేనేం? పోరాటాల్లో ఆహుతైన వాళ్ళ చేతులు, తలలూ, కళేబరాలూ మానవ చరిత్ర కథనం చెబుతూనే ఉన్నాయి. నినాదాలు యుద్ధాలు ఆపవని చరిత్ర పదేపదే ఘోషిస్తోంది.
సరే, ఇక్కడ నా ఘోష ఆపి, అఫ్సర్ కవితల్లోకి చూద్దాం. సగమే గుర్తు (2004) అన్న కవిత చూడండి; ఈ కవిత కాస్త romanticగా మొదలై, అనుభూతి కవితగా నడిచి ఆఖరికొచ్చేసరికి ఆవేదన చురుక్కుమనిపిస్తుంది.
వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా,
దేహం పిచ్చుక సందేహ స్నానాలకింద తడుస్తూ.
…ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతీ వానా అదేదో కొత్త వాసనేస్తుంది.
…వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్న రొట్టె కాలుతోంది
వొంటి సెగలమీద.
పై కవితని ‘కురిసీ కురవని’ (1997) అనే పాత కవితతో పోల్చి చూడండి:
ఎప్పటిదో తెలీదు
ఎక్కడిదో తెలీదు
తడపటం వొక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏకధారగా.
ఆ
మధ్యాన్నపు వానా ఇలాగే
కురిసీ కురవని నీ లాగే
గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘ మౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.
ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత. ‘మూడో యామం’ (2001) కవిత ఒక మంచి ఉదాహరణ.
…చరిత్రకారుడి చేతివేళ్ళని తెగనరికి
కొత్త గతాన్ని తిరగరాస్తాయి ఫత్వాలు
ఫత్వాలకు రంగుతేడాల్లేవు
కూల్చే చేతులకు సరిహద్దులూ లేవు
అనంత కాలాల పగలకు
వొక్కక్షణికోద్రేకమే సమాధానం.
…అన్ని మరణాలూ
మట్టిలో కరిగే దేహాలు కావు
నిప్పులో లీనమయ్యే క్షణికాలు కావు
రాలిన రక్తమాంసాల్ని కలిపి కుట్టుకొని
మళ్ళీ సిద్ధమవుతాడు సూర్యుడు
కొత్తదినచర్యకి.
అలాగే, ‘శ్రీనగర్ లో మొహర్రం’ (2009?) లో,
బక్కపలచటి బ్యురాక్రాట్లా
మైదానంలోంచి ఎగురుకుంటూ వస్తాడు యముడు
వీడెప్పుడూ వన్ వే పాసింజెర్ కదా…
తొలకరివాన
కొండల్ని తలబాదుకుని ఏడుస్తుంది
వితంతువులు
చేతులారా గాజులు పగలగొట్టుకుంటున్నట్టు. (మూలం: ఆగా షాహిద్ ఆలీ).
మూలం చెప్పకపోయినా పరవాలేదు. ఈ ఒక్క చరణం కవిత్వం. ఎవరికైనా, ప్రేమతోనే! అన్న మరొక కవితలో,
నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయనినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందులే,
అని అంటూనే అఫ్సర్ నినాద కవితలు రాసాడు. బహుశా అతని నిరంతర ప్రయాణంలో ఒక మజిలీ కావచ్చు. కవితా ప్రవాహంలో ఒక మలుపు కావచ్చు.
దుఃఖ బహిష్కృతుడికి
ఏ దిగులూ లేదు
దేహాన్ని విస్తరించుకోవడం తప్ప!
నువ్వేమిటో
నీపద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
నల్ల పలకతో వుమ్మితో కాదు
అన్నీ తుడుచుకో నెత్తుటితో!
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకునువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆట్లో కాసింత ఆనందపు తునకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!
దీనికి తోడుగా, ‘వలస’ లోంచి మరొక కవిత చెప్పకండా ఉండలేను. ఆకుపచ్చని ఆకాశం (27 అక్టోబర్ 2000) అన్న కవితలో,
ఒక రెక్క అలా తెరిచివుంచు
నీలోకీ నిశ్శబ్దంలోకీ.
ఒక దుఃఖాన్ని అలాతెరిచే వుంచు
రెప్పలకింద పచ్చగా.
… అప్పుడప్పుడు కాసింత గోరువెచ్చగా
నీ చీకటిగదిలోకి ప్రవహించే గాలిని
కాసేపు వుండివెళ్ళమని చెప్పు.
…యుద్ధసేన తరుముకొస్తున్నప్పుడు
ఏదో ఒక మూల రవంత నిశ్శబ్దాన్ని కురవనీ
అన్ని విషాదాల్ని అన్ని చీకట్లనీ తుడిచి
దూదిపింజలా ఎగుర్తున్న మబ్బు వెంట నడవనీ
రెప్పలకింద ఆకాశం ఎలా వుంటుందో
ఇప్పుడైనా తెలిసిందా?
అఫ్సర్ నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా? అదేమో కాని, అఫ్సర్ కవి. లేబుళ్ళు అనవసరం. ఈ సంకలనంలో అందమైన కవితలు చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించీ ప్రస్తావించడానికి వీలు పడదు. వాటిలో కొన్ని: యిక్కడేదో వొక జాంచెట్టు.., అవునా మైక్?, సరిగంగ స్నానం, డెజావూ, ఒక సూఫి సాయంత్రం, వగైరా.
వలస సంకలనం చివర్న రాసుకున్న స్వగతంలో అఫ్సర్ తనగురించి ఇలా చెప్పుకున్నాడు: “…నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొకమూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట అంతరంగాన్ని. …నేను ఏకవచనం కాదు. అనేక వచనం.”
ఆఖరిగా నా మాట. అఫ్సర్ కవితా సంకలనం ‘ఊరిచివర’, తెప్పించుకొని చదవండి. 119 పేజీల్లో 48 కవితలున్నాయి. మంచి కవిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుంది. సంపాదకుడు గుడిపాటి ఒక పరిచయం, యన్. వేణుగోపాల్ మరో పరిచయం – వెరసి పదిహేను పేజీల పరిచయవ్యాసాలు రాసారు.
అఫ్సర్ కవితలని ఆస్వాదించడానికి ఈ రెండు పరిచయ వ్యాసాలూ అనవసరం.
(ఊరి చివర, అఫ్సర్ కవితా సంకలనం – డిసెంబర్ 2009. సంపాదకుడు: గుడిపాటి. పాలపిట్ట ప్రచురణలు. Rs. 60/- . $5.00. దొరికేచోటు: Palapitta Books, #16-11-20/6/1/1, 403 Vijayasai residency, Saleemnagar, Malakpet, Hyderabad – 500 036.)