అన్నమయ్య పద పరిచయం
జయప్రభ, 2006.
తేనెలపై తేట తిన్నని చెఱకు –
పానకముల నేరు పఱచిన మేలు
చక్కెరలో తీపు చల్లదెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు
కల యమృతంబు మీగడమీది చవులు
చిలుకుచు గవులెల్ల జేయెత్తి మ్రొక్క –
ఇది చిన్నన్న తన తాతగారైన అన్నమయ్య పదాల గురించి చేసిన వ్యాఖ్యానం. చిన్నన్న ఒక్కరే కాదు; ఈ తీపులకు కవులందరూ వారసులే!నని తాళ్ళపాక చిన్నన్న గురించి చెబుతూ ఆరుద్ర వ్యాఖ్యానించారు.
అన్నమయ్య పదాలతో పరిచయమున్న ఎవరికైనా పైన చెప్పినవన్నీ ప్రతీ అక్షరానికి పొల్లుపోకుండా నప్పుతాయని తెలుసు. ముప్పైవేల పైచిలుకు పదాలు రాసిన అన్నమయ్య పదకవిత్వంలో ఇమడని వస్తువు లేదు. అందని భావం లేదు. లొంగని సందర్భం లేదు.
లాలిపాటలు మొదలుకొని, శృంగార పదాలమీదుగా, విప్లవ పదాలతో కలుపుకొని వేదాంత, ఆధ్యాత్మిక పదాల వరకూ అన్నీ సృజించాడు. ఎందుకనో – లాలిపాటలూ, ఆధ్యాత్మిక పదాలూ ఆస్వాదించి అక్కున చేర్చుకున్నంత సులభంగా తెలుగువారు శృంగార పదాలని ఆస్వాదించలేదు. అక్కడక్కడ ఒకటీ అరా శృంగార కీర్తనల ప్రస్తావన వున్నా, ఆసాంతమూ స్వీకరించలేదు. కాస్త దూరంగానే ఉంచారు. ఆధ్యాత్మిక కీర్తనల మీద ఎన్నో వ్యాఖ్యాన సహిత వివరణలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. శృంగార పదాలపై వ్యాఖ్యానించడానికి ఎవరూ సాహసించలేదు. కొంతమంది కవులు వాటిని ఆస్వాదించినా, తమ వేరే రచనలపై వీటి ప్రభావం పాఠకుల్లో కనిపిస్తుందని భావించారో ఏమో ఎక్కడ రాసినట్లు కనిపించదు.
అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో ప్రచురించడం మెచ్చుకోదగ్గ విషయం. పైగా ఇది ఒక కవయిత్రి చెయ్యడం మరింత సాహసం. ఆ పుస్తకం – “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది జయప్రభ. తెలుగు పాఠకులకి, ముఖ్యంగా ఆధునిక కవిత్వంతో పరిచయమున్న వారికి జయప్రభ పేరు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తెలుగు సాహిత్యం తీసుకుంటే ఇంతవరకూ కేవలం మగవాళ్ళే (ఒక్క ముద్దుపళని రాధికా స్వాతనం మినహాయింపు) శృంగార రచనలు చేశారు. వ్యాఖ్యానించిన వారి సంఖ్యలో కూడా వీరిదే పై చేయి. అటువంటిది స్త్రీవాద రచయిత్రిగా పేరుపొందిన జయప్రభ, అన్నమయ్య శృంగార కీర్తనలపై వ్యాఖ్యాన సహిత పరిచయం చెయ్యడం మెచ్చుకోదగ్గ విషయం. తను నమ్మిన సిద్ధాంతాలనీ, అనుసరించే వాదాలనీ పక్కన బెట్టి, కేవలం కవిత్వాన్ని కవిత్వంగా అంగీకరిస్తూ, ఆస్వాదిస్తూ రాసిన రచన ఇది. ఈ పుస్తకం ఏ తిరుమల తిరుపతి దేవస్థానం వారో ప్రచురించారని అనుకుంటే పొరపాటే! ఆవిడ సొంతంగా చైత్యన-తేజ పబ్లికేషన్స్ పేరున అచ్చు వేసారు.
చిన్నప్పుడు ఊహ తెలిశాక ‘కొలని దోపరికి గొబ్బిళ్ళో – యదుకుల స్వామికి గొబ్బిళ్ళో’తో ప్రారంభమయిన అన్నమయ్య పరిచయం, అడపా దడపా ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘చందమామ రావే జాబిల్లి రావే!’ వంటి లాలిపాటలూ, ‘అదిగో అల్లదిగో శ్రీహరివాసము’ వంటి భక్తి పాటలు వినడం వరకే ఉన్న జయప్రభ, అన్నమయ్య కీర్తనలన్నీ సహేతుకంగా చదివాక ఆయన అక్షర వ్యామోహంలో పడ్డాననీ ‘పులకల మొలకల పున్నమి’ శీర్షికతో ముందుమాటగా చెప్పుకొచ్చారు. అన్నమయ్య పదం ఆవిణ్ణి చేరడానికీ లేదా అన్నమయ్య పదం వెతుక్కోవడానికీ చాలా కాలమే పట్టిందనీ, తానెందుకు ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించారో చెప్పే సందర్భంలో – “తొలితరం పండితులు అప్పటికే వయో వృద్ధులవటం వలన అన్నమయ్య సాహిత్యాన్ని పరిష్కరించే పని తోనే సరిపోయింది వారికి. వాటిని విశ్లేషించి వాటిలోని కవితా గంధాలని వెలికి తీసే పనికి వారెవ్వరూ పూనుకోలేదు. బహుశా ఇబ్బంది లేనందున కాబోలు, అన్నమయ్య రాసిన భక్తి-వేదాంత సంకీర్తనల గురించే హెచ్చు మాట్లాడారు గానీ వీరంతగా తమ చూపుని శృంగార కీర్తనల వైపు తిప్ప లేదు… అన్నమయ్య రాసిన వాటిలోంచి ఎంపిక చేసుకుంటూ భక్తి ప్రాధాన్యం ఉన్నవీ, వైరాగ్య భావనలతో ఉన్నవీ ఎక్కువగా పాడుతున్నారు తప్పితే ఆయన రాసిన అద్భుత శృంగార సంకీర్తనలని ఇంకా విస్తృతంగా పాడటమే లేదు!” – అని అన్నారు. ఇది మాత్రం అక్షర సత్యం.
ఇలా తెలుగువారి తీరుని తూర్పార బట్టడమే కాకుండా, పద్య సాహిత్యానికి పెద్ద పీట వేసిన పండిత వర్గం పద సాహిత్యాన్ని చాలా కాలంగా ఎందుకు పట్టించుకోలేదని తమ ముందుమాటలో ప్రశ్నించారు. ఇంతకాలం కవులందరూ అన్నమయ్య సాహిత్యాన్ని భక్తి సాహిత్యంగానో, ఆధ్యాత్మిక సాహిత్యంగానో పరిగణించారే తప్ప అందులోని కవితా ధారనీ, పద సౌందర్య ఝరినీ, భావనా పటిమనీ ఎందుకు విశ్లేషించడం లేదంటూ వాపోయారు.
“హిందూ నాగరికతలో శృంగార రసమెప్పుడూ శిఖరాయమానంగానే సాహిత్య, శిల్ప కళల్లో ప్రతిఫలించింది. ఐతే శృంగారానికీ, బూతుకీ తేడా తెలియనివారు శృంగార వ్యక్తీకరణని కూడా బూతుగానే చూడగలరు. అది దృక్పథంలో ఉన్న తేడా! దృష్టి మారినప్పుడే దృశ్యమూ మారుతుంది!” అన్న జయప్రభ వ్యాఖ్యానం చూసి ఈ పుస్తకాన్ని చదివితే అన్నమయ్య శృంగారపదాల్లో ఇమిడిన కవిత్వాన్నీ, భావ వ్యక్తీకరణనీ, తన్మయత్వ ప్రేమనీ చూస్తామే తప్ప ఎక్కడా బూతు అన్న భావన కూడా స్ఫురణకి రాదు. ఇది ఈ పుస్తకంలో మెచ్చుకోదగ్గ విషయం. మొత్తం శృంగార కీర్తనలన్నీ విశ్లేషించడం సాధ్యం కాదని తెలుసుననీ, అందుకే తనకి నచ్చిన, తను మెచ్చిన కొన్ని సంకీర్తనలని మాత్రమే ఎన్నుకున్నానని వివరణ ఇచ్చారు.
“ప్రేమ, మోహం, రతి అన్నవి జీవితంలో చాలామందికి చాలా ముఖ్యమయిన అంశాలు. వీటితో జీవితాన్ని నింపుకున్న వారికీ, నింపుకోని వారికీ కూడా! శృంగారాన్ని కాదనడం … తల్లి తండ్రుల ప్రేమని కాదనటమే! ప్రేమ, మోహం, రతి – వీటిని సాహిత్యంలో ఎన్ని రకాలుగా వ్యక్తీకరించారన్నది ఆసక్తికరమయిన విషయం కాగలగాలి. అలాంటి ఆసక్తి ఉన్న వారికి అన్నమయ్య పదం తరగని గని లాంటిది,” అంటారు జయప్రభ.
“ఏమిటి అన్నమయ్య శృంగారపద రచనలోని విశిష్టత? కామము అన్నది సమస్త ప్రాణి కోటికీ ప్రాణాధారమైనంత ముఖ్యమైన విషయం… మిగతా ప్రాణికోటికి కామమే ఉంది. శృంగారం లేదు. కోప ప్రకటనే ఉంది. వాటిలో పాపభీతి లేదు… సంస్కారయుతమైన రాసలీల అందుకనే మానవకోటి అనుభవించడానికి సాధ్యం అవుతుంది. మనిషి సంస్కారయుతుడైనప్పుడే ఉత్తమమైన శృంగార భావనలని అనుభవించగలడు. ఆవిష్కరించగలడు. వారిలోని శృంగారభావన ఉత్తమ స్థాయిలో లేనప్పుడు వారి శృంగార ప్రకటన కూడా ఉత్తమ స్థాయిలో ఉండదు. అది బూతు అవుతుంది! అలాంటి బూతు దృక్పథం గల్గిన మనుషులే శృంగారం పేరుతో అరాచకాలనీ, లైంగిక అత్యాచారాలనీ జీవితంలో ఆచరించడానికీ వెనుకాడరు. దీనిని ఎదుర్కోవడానికి తప్పని సరిగా – ఉన్నతమైన శృంగారాన్నీ, ప్రేమనీ ఆదర్శంగా చూపించాలి!” వంటి ప్రతిపాదనలతో కూడిన ఈ పుస్తకంలో అన్నమయ్య శృంగార కీర్తనల మీద సవివరణే కాదు, సహేతుక విశ్లేషణలు కూడా ఉన్నాయి.
అలాగే అన్నమయ్య పదాలలోని ఆకర్షణ ఎంత భావ వ్యామోహానికి దారి తీసిందో చెబుతూ – “ఆయన వర్ణించిన శృంగార వ్యవస్థ మీద ఎలాంటి నమ్మకమూ నాలో లేకుండానే అన్నమయ్య శృంగార కీర్తనలని చాలా గాఢంగా నచ్చుకున్నాను… ఆయన నాయికలలో ఎక్కడో వెతుక్కున్నానని అన్నా బహుశా అసహజమేమీ లేదనుకుంటాను. అలాగనీ నేనిష్టపడటంలో భక్తీ లేదు. నమ్మకమూ లేదు. గాఢమైన ఒక ఇష్టం వుంది.” అంటూ బహుభార్యాత్వం మీదా, వేశ్యా వృత్తి మీదా, కేవలం పురుషుని పరంగానే చెప్పిన శృంగారం మీదా తనకున్న అభ్యంతరాలని చెబుతూ తనదైన స్త్రీవాదాన్ని చూపించారు. అలాగే తాను రాసిన ప్రేమకవిత్వంలో కొన్ని భావనలు అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తే అబ్బురపడిన విషయాలు కూడా వివరించారు.
అన్నమయ్య భావ వ్యక్తీ కరణలో పదాల ఎంపికనీ, సొగసునీ, నడకనీ, కవిత్వ శైలీ ప్రయోగాలనీ వివరించే ఈ కీర్తన చూడండి:
శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా
మూటల్ మాటల్ మూరల్ బారల్
బాటల్ సదివే బాపలు తా
వేటల్ వీపుల్ వేలువు గుడుపుల్
తేటలు మరిగిన దేవుని తా
వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్గిటి సుద్దుల్ తా
పోకులు లోకుల్ పొగడగ మనిపెడి
కేకి గరుల తల కిష్టుని తా
ఇది చదివితే మనం ఎక్కడో ఇలాంటిది చదివినట్లూ, విన్నట్లూ అనిపించడం లేదా? గుర్తు తెచ్చుకోండి.
అన్నమయ్య పద పరిచయం
238 పేజీలు. రూ. 450/- ($13.50)
పోనీ, పోనీ పోతే పోనీ
సతుల్, సుతుల్, హితుల్ పోనీ – పోతే పోనీ
రానీ, రానీ!
కష్టాల్, నష్టాల్
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవితకీ పైన చెప్పిన దానికీ పోలికలు కనిపించాయా? ఇలాంటి విశేషాలు అన్నమయ్య కవిత్వంలో గాఢత గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో చెప్పారు. అలాగే, అన్నమయ్య వాడిన కొన్ని పద ప్రయోగాలని గురించి సోదాహరణంగా చెప్పారు జయప్రభ. వలపుల విడిది, పులకల పోగు, నవ్వుల పండుగ, సిగ్గులకొండ, చెమటల చెలమ – వంటి పదాలతో నాయకీనాయకుల మధ్య శృంగారాన్ని అతి చక్కనైన భావ ప్రకరణకి సరిపడా పదాలను ఎంతో తెలివిగా, చమత్కారంగా ఎంపిక చేసుకోవడం ఒక్క అన్నమయ్యకే చెల్లు అంటారు జయప్రభ.
ఈ పుస్తకంలో అన్నమయ్య సాహిత్యంలో ఇబ్బంది పెట్టే సందర్భాల గురించీ ఉంది. అన్నమయ్యలో ఉండే బలహీనతలు అన్నమయ్యకీ ఉంటాయని చెబుతూ – ఈ క్రింది కీర్తన ఉదహరించారు.
రావే కోడల – రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా – పొందులు నీతో చాలును
ఇది లక్ష్మీ, సరస్వతుల సంవాదంతో నిండిన శృంగార కీర్తన. ఇద్దరు స్త్రీలు నువ్వేం తక్కువంటే, నువ్వేం తక్కువ అన్న ధోరణిలో ఎకసక్కాలు చేసుకుంటారు. ఊరూ వాడల్లో ఉండే కొంతమంది పండితుల ఇళ్ళల్లో బడి నువ్వు కులుకుతున్నావు కదటే, – అని సరస్వతిని దెప్పిపొడుస్తూ లక్ష్మి అంటే – నువ్వు వాడకో పదిమంది ఎంచుకొని వారిచేత వలపించుకోని తిరగడం లేదా, అని సరస్వతి ఎగతాళి చేస్తుంది. ఈ కీర్తనలో లక్ష్మి, సరస్వతులని అల్పబుద్ధులుగానూ, రంకు చేసే వారిగానూ చిత్రీకరించాడు అన్నమయ్య. అదే శివుణ్ణీ, విష్ణువునీ ఎందుకు ఇలా తక్కువ చేస్తూ పదరచన చెయ్యలేదన్న ప్రశ్న కూడా మన ముందు రచయిత్రి వుంచుతారు.
మోవి తేనె బోనాలు, మోసునవ్వు మోనాలు, ఈసుజెమట పన్నీరు, చిమ్ముగోరి మేడేలు, భావరతి చప్పరాలు, పలుకుల కప్పురాలు, మందుల కొండ, చెంగుల ధార – వంటి అన్నమయ్య పద ప్రయోగాలు ఆయన ఊహకీ, కల్పనకీ మచ్చుతునకలుగా అభివర్ణించారు. చప్పరము అంటే భవనము లేదా మేడ. నాయిక ఊహనే మేడ చేసి అక్కడే భావరతి జరిపించాడు అన్నమయ్య. ఇవి 22వ సంపుటంలో 53 కీర్తన అయిన ‘ఆనతియ్య గదవయ్య ఆకడ ఈకడ నీకు’ కీర్తన లోనిది. అలాగే స్త్రీలపై అత్యాచారాలు చేసిన తురుష్కుల ఘాతుకాలు చెప్పే సందర్భంలో మానభంగం పదానికి ప్రత్యామ్నాయంగా అంగభంగం అనే పద ప్రయోగం చేసి స్త్రీల ఎడల గౌరవాన్ని చాటి చెప్పాడని అన్నమయ్యని కొనియాడారు జయప్రభ.
ఇలాంటి విశ్లేషణలూ, సందర్భోచిత వివరణలూ, కవి సమయాలూ చాలా ఉన్నాయి. అలాగే ఉమ్మిని నోటి కడవలోని నీరు అనడం , చంద్రుణ్ణి వెన్నెల వేసంగి మొగ్గ అనడం వంటి పదప్రయోగాలు అన్నమయ్య కీర్తనల్లో ఉన్నాయని చెబుతూ కవులందరూ ఈ కీర్తనలని అధ్యయనం చేయాల్సిన విషయాలుగా చెప్పారు. తి.తే.దే వారి అన్నమయ్య పుస్తక ప్రచురణల్లో అక్షర దోషాలు చాలా వున్నాయని బాధపడ్డారు. అలాగే అన్నమయ్య కీర్తనలు గానం చేసేవారు సంగీతానికిచ్చిన ప్రాముఖ్యత సాహిత్యానికివ్వడం లేదన్న నిర్లక్ష్య ధోరణిని దుయ్యబట్టారు.
పలుకుదేనియలనుపారమియ్యవే అని కలిపి పాడటానికి బదులు – ‘పలుకుదేనియలను పారమియ్యవే’ అంటూ విడగొట్టి మరీ పాడుతున్నారు. ఉపారం అంటే ప్రసాదం. పారము అంటే అర్థం లేదు. దౌర్భాగ్యం ఏవిటంటే సంగీతం కట్టే వారికి ఎవరిదయినా కావచ్చు, సాహిత్యం అంటే నిర్లక్ష్యం. ఎలా చేసినా చెల్లుతుందన్న నిస్సిగ్గు.
ఇలా రాసుకుంటూ పోతే చాలా విశేషాలు వున్నాయి. అన్నమయ్య సాహిత్యంపైనా, అలాగే అన్నమయ్య భార్య తిమ్మక్క రాసిన సుభద్రా కళ్యాణం రచన గురించి సవివరంగా రాశారు. పుస్తకం చదివితే మీకే తెలుస్తుంది. భక్తి, శృంగారమూ, ఆధ్యాత్మికమే కాకుండా భావ కవిత్వం కూడా అన్నమయ పదాల్లో కనిపిస్తుందన్న ఈ కీర్తన గురించి చెప్పి ఆపేస్తాను.
వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోని పలుమారు వెదకేవే గాలి
పండు వెన్నెలలకును బ్రాణమగు గాలి
నిండుగొలకులలోన నెలకొన్న గాలి
బొండు మల్లెల తావి బొడవైన గాలి
యెండమావుల బోలితేలయ్య గాలి
కొమ్మానిచవికెలో గొలువుండు గాలి
తమ్మికుడుకుల దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేడి గురిసేవే గాలి
తిరువేంకటాద్రిపై దిరమైన గాలి
సురకాంతముల జనుల జొక్కించు గాలి
తొరలి పయ్యదలలో దూరేటి గాలి
విరహాతురులనింత వేచకువె గాలి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయట నుండి లోపలికీ, లోపలినుండి బయటకీ వెలిలోనూ పలుమార్లు వెదికే గాలిని వర్ణిస్తున్నాడు అన్నమయ్య. పండు వెన్నెలకి ప్రాణం ఈ గాలి అంటున్నాడు. బొండు మల్లెల సువాసన ఎంత దూరం వ్యాపిస్తోందో అంతవరకూ మనం ఈ గాలి కొలవాలట. మామిడి చెట్ల కొమ్మలనే మేడల్లో కొలువుండే ఈ గాలి, తామర పూల పై తేనె తాగుతూ తిరిగేటి ఈ గాలి, అప్పుడప్పుడు వేడిగాలి కుమ్మరిస్తుందట. తిరుమల కొండలపై తిరిగే ఈ గాలి జనులను చల్లగా తాకుతుందట. ఆడవాళ్ళ పయిటలో దూరే ఈగాలి విరహాతరులను వేధిస్తుందట. ఎంత చక్కటి ఉపమ? ఎంత గొప్ప భావన? కవిత్వం రాసే వారూ, ఆస్వాదించే వారూ ఇటువంటి కీర్తనల జోలికి పోక పోవడం బాధాకరం.
ఇలా ప్రతి కీర్తననీ తనదైన శైలిలో చక్కగా వివరించారు జయప్రభ. స్వతహాగా కవయిత్రి కావడంతో తాను ప్రతి కవి సమయాన్నీ అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ వివరించడంతో పాఠకులకి ఆసక్తి కలుగుతుంది. మాధుర్యం తెలుస్తుంది.
ఈ పుస్తకంలో నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, నచ్చనివీ వున్నాయి.
మొట్ట మొదటిదీ, నన్ను చాలా నిరాశ పరిచినదీ ఒకటుంది. అన్నమయ్య కీర్తనల పుస్తకం పక్కన లేకుండా ఈ పుస్తకం చదివడం చాలా కష్టం. ఎందుకంటే కీర్తనలను విశ్లేషిస్తూ కేవలం పల్లవులనూ, లేదా ఒక చరణాన్ని మాత్రమే ప్రస్తావించి, మిగతా కీర్తన గురించి చెప్పడం పాఠకుడిగా నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ప్రతీ పేజీకీ అన్నమయ్య కీర్తన ఎక్కడ వెతికేది?
కీర్తనలను విశ్లేషిస్తూ పూర్తిగా ప్రచురించకపోవడం మింగుడు పడదు. దాదాపు వందకు పైగా కీర్తనలు విశ్లేషించారు. కాదనను. కానీ పూర్తి పాఠం ఇస్తే పఠనానికి అడ్డు తగలదు. సజావుగా సాగుతుంది. ఏం చెబుతున్నారో సూటిగా అర్థమవుతుంది. ఇప్పటికీ రెండు వందల ఏభై పేజీలయ్యింది. కీర్తనలనీ వేయడం మొదలెడితే వెయ్యి పేజీల అవుతుందని అనచ్చు. ప్రచురణ కష్టం కావచ్చు. కానీ ఇలాంటి మంచి పుస్తకాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ పుస్తకం రాయడం ప్రధానోద్దేశం పాఠకులకి అన్నమయ్య శృంగారకీర్తనల్లో కవిత్వాన్నీ, భావ సౌందర్యాన్నీ చెప్పడం. అసలు కీర్తనలే చాలామందికి తెలియవు. అటువంటప్పుడు ఈ పుస్తకం చదివితే వచ్చే ప్రయోజనం ఏవిటో అర్థం కాలేదు. పూర్తి కీర్తన ప్రచురించి వుంటే బావుండేది.
అంతెందుకు? పైన చెప్పిన, వెలినుండి లోనుండి వెలితిగాకుండి – వెలి లోని పలుమారు వెదకేవే గాలి అనే కీర్తన పూర్తి పాఠాన్ని నేను ఇక్కడ ఇచ్చాను కానీ, అసలు పుస్తకంలో కేవలం పల్లవి మాత్రమే ఇచ్చారు. మిగతా చరణాలని మాత్రం అద్భుతంగా విశ్లేషించారు. పూర్తి పాఠం ఇవ్వడం వలన పాఠకులకి సులభంగా అర్థమయ్యుండేది. చెబుతూన్న కవిత్వ ఊహకి అన్నమయ్య మూలమూ కనిపించేది.
రెండవది: పుస్తకంలో అధ్యాయాలు లేకపోవడం. వివిధ రకరకాల కీర్తనలు విశ్లేషించినప్పుడు వాటిని ఒక గుంపుగా చేసి అధ్యాయాలుగా చేస్తే బావుండేది. చదవడానికి హాయిగా ఉండేది. మొత్తం ఒకే అధ్యాయంగా వేయడం వలన కాస్త కలగాపులగంగా అనిపించింది.
మూడవది: ఈ పుస్తకాన్ని పరిష్కర్తల లోపం పట్టి పీడించింది. ఎవరూ ఎడిట్ చెయ్యకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు రాసినది వారికి నచ్చుతుంది. నచ్చకపోతే రాయరు కూడా. కానీ ఎక్కడైనా పునరుక్తి దోషాలూ, చెప్పిన విషయాలే పునరావృత్తి కావడాలూ, వాక్య నిర్మాణాలూ – అంటే పేరాగ్రాఫులుగా విడగొట్టడం, కామాలు సవరించడం, వాక్యాలు మార్చడం చేసుంటే బావుండేదనిపించింది. అలాని ఈ పుస్తకం నిండా తప్పులున్నాయని కాదు. ఇవి చేస్తే మరింత గొప్ప పుస్తకంగా తయారయ్యుండేది. ఈమాట పత్రికలో ఉన్న సంపాదకుల్లాంటివారు ఈ పుస్తకానికి పనిచేస్తే చక్కగా ఉండేది.
నాలుగోది: ఈ మొత్తం పుస్తకంలో నన్ను ఇబ్బంది పెట్టినది వాక్యాల మధ్యన ‘…’ వంటి ప్రయోగం. నాకు తెలిసీ ఈ మూడు చుక్కలని సంభాషణల్లో జాప్యాన్నీ లేదా విరామాన్నీ సూచించడానికే వాడుతారు. ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు చదివాను. మన ఒక్క తెలుగులోనే ఈ మూడు చుక్కల ప్రయోగం విరివిగా కనిపిస్తుంది.
ఉదాహరణకి – ఈ పుస్తకంలో రాసిన ఈ వాక్యం చూడండి.
“శరీరాన్ని కలిగి ఉన్న వాళ్ళు … ఈ శరీరాన్ని గురించి మాట్లాడడాన్ని సహించలేకపోవటమూ …”ఛ ఛ ఛ” అని అనటమూ … వట్టి ద్వంద్వ ప్రమాణమే అవుతుంది! వికారాన్ని ఎంత సౌందర్యం చెయ్యడం ఎంత తప్పో … సౌందర్యాన్ని వికారంగా చూడడం అంతే తప్పు!”
కామా లేదా హైఫన్ వాడాల్సిన చోట మూడు చుక్కలు పెట్టడం సరికాదేమో. ఈ మూడు చుక్కల ప్రయోగం కనీసం పేజీకి రెండు సార్లయినా కనిపించింది. మూడు కంటే ఎక్కువున్న పేజీలూ లేకపోలేదు. అలానే రెండూ, నాలుగూ చుక్కలాదాకా కూడా లేకపోలేదు.
అయిదవది: పైన చెప్పినవి కాకుండా, ఇంకొక పెద్ద సమస్య ఈ పుస్తక పఠనంలో వుంది. ముందుమాటలో తానెందుకు అన్నమయ్య పదాలకి ఆకర్షితులయ్యారో చెప్పిన విషయాలు చాలా చోట్ల పునరావృత్తమయ్యాయి. మక్కీకి మక్కీ అవే వాక్యాలు కాకపోయినా అవే భావాలు కనిపించాయి. ఇది కాకుండా – ఇంకొక పెద్ద లోపం రచన రచనంతా ఉత్తమ పురుష లో ఉండటం. అంటే – నా, నేను, నాకు అన్నవి చాలా భావాలకి కర్తలయి కూర్చున్నాయి. ప్రతీ విశ్లేషణకీ తన భావాలు, అనుభవాలూ ముడివేయడంతో ఒక స్వీయోపన్యాసంలా అనిపించాయి. ఈ పుస్తకమే జయప్రభ ఆలోకనం, ఆలోచనా రసధార కాబట్టి మరలా మరలా ప్రత్యేకించి చెప్పనవసరం లేదని అనిపించింది. ఈ లోపం అధిగమించి ఉంటే ఇది అన్నమయ్య శృంగార కీర్తనల మీద వచ్చిన మొట్టమొదటి అద్భుత రచనగా నిలబడేది. ఇప్పటికీ ఇది ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా అన్నమయ్య అక్షరాన్ని ప్రేమించే వారందరూ చదవాల్సిన కవన వ్యాఖ్యానం.
ఇహ చివరదీ, చిన్నదీ: అచ్చు తప్పులు అంతగా లేకున్నా, బాగానే ఉన్నాయి. మనకి తెలియని పదాలకి అచ్చుతప్పులు గుర్తించ లేమేమో కానీ, సంతోషం వంటి పదాలు సులభంగానే పసిగట్టగలం. మరోసారి ఈ పుస్తకానికి ఎడిటర్ల ఆవశ్యకత కనిపించింది. ఈ పుస్తకం రాయడం దగ్గర్నుండి, ప్రచురించడం వరకూ ఒక్క జయప్రభ గారే నడుం కట్టుకున్నారని తెలుసు. ఇంతటి గొప్ప రచనని ఆవిష్కరించడం వెనుక ఆవిడ ఒక్కరి కృషే ఉందని అర్థమవుతూనే వుంది.
సిఫార్సులతో ప్రచురణార్హత కాని పుస్తకాలనెన్నో ప్రచురించే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ పుస్తక ప్రచురణకి ముందుకు రాకపోవడం బాధాకరం. కనీసం వారు ప్రచురిస్తే పేజీల సమస్య ఉండేది కాదు. పైగా అన్నమయ్య తి.తి.దే వారి ఆస్థాన, అభిమాన, మానస పుత్రుడు కూడాను. ఇంకా అనేకమంది భక్తులకీ ఈ పుస్తకం సులభంగా చేరేది.
అన్నమయ్య అక్షరాన్ని ప్రేమించి, మోహించే వారందరూ చదవవలసిన పుస్తకం. ఇలాంటి పుస్తకం రాయడానికి పూనుకున్నందుకు జయప్రభ అభినందనీయరాలు. మెచ్చుకు తీరాలి. ఈ సంకీర్తనల మీదే రెండవ పుస్తకం కూడా వచ్చింది. ఇది చదివాక రెండో పుస్తకం మీరే కొని చదువుతారు.
చివరగా-
చక్కెరై చవిచూపీ జులై తావి చల్లీ
నక్కజపు మాతు వజ్రాలై మెఱశీని
నిక్కుటద్దములై మా నిలువు నీడలు చూపీ
నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు
పన్నీరై పైబూసీ గప్రంబై చలువరేచీ
మిన్నగల ముత్యములై మెయినిండీని
వెన్ను బలములై మా వెంటవెంట దిరిగీని
అన్నిట తాళ్ళపాక అన్నమయ్య పదములు.
సురలకు నరులకు సౌరిది విన విన
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు
అన్నమ్మయ్య కీర్తన ఎలా వుంటుందో ఆయన మనవడు చిన్నన్న చెప్పిన సంకీర్తన పదం. అన్నమయ్య అక్షర వ్యామోహానికి గురయిన వారు ఆయన కీర్తనల్లో మమేకం అవుతారు. అది లాలిపాట కావచ్చు. భక్తి కావచ్చు. శృంగారం కావచ్చు. తత్వం కావచ్చు. అన్నమయ్యది అక్షరం కాదు; అక్షయం.
ఇంకా సందేహముంటే జయప్రభ పుస్తకం చదవండి. మరింత స్పష్టంగా తెలుస్తుంది.
(“వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” -అన్నమయ్య పదపరిచయం, జయప్రభ. 2006. ప్రతులకు: చైతన్య – తేజ పబ్లికేషన్స్, లోహిత 4-220/33, సైనిక్ ఎన్‌క్లేవ్, సైనిక్‌పురి, సికింద్రాబాదు – 500094.)