అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం

ప్రాచీన తెలుగు సాహిత్యములో కవయిత్రుల సంఖ్య చాల తక్కువ. మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క, ముద్దు పళని మొదలైన కవయిత్రులను వ్రేళ్ళపైన లెక్కించవచ్చును. ఇరవైయవ శతాబ్దములో కూడ ఈ పరిస్థితిలో మార్పేమీ రాలేదు. బంగారమ్మ, సౌదామిని, విశ్వసుందరమ్మ వంటి కవయిత్రులు ఉన్నా కూడ, కవులే ఎక్కువ. భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్ధించిన పిదప, ముఖ్యముగా గడచిన 50 సంవత్సరాలలో తెలుగు సాహిత్యములో నవలాకారులు, కథారచయితలు, కవయిత్రులు ఎందరో తమ శక్తికి తోచినట్లు మల్లెల మాలలను గ్రుచ్చి తెలుగు తల్లికి కానుకగా నిచ్చారు, యిస్తున్నారు కూడ. దీనికి మరొక కారణము కూడ ఉన్నది. ఛందోబద్ధమైన పద్యాలపైన పాఠకులకు, రచయితలకు మోజు తగ్గింది. మొట్టమొదట గేయములు, తరువాత వచనకవితలు ప్రజల మెప్పుగోలుకు పాత్రములయ్యాయి. ఈ పరిణామము రచయితలకు ఒక గొప్ప ప్రోత్సాహమును ఇచ్చింది. ఈ శతాబ్దారంభమునుండి తెలుగులో ఈమాట లాంటి అంతర్జాల పత్రికలు ఉద్భవించాయి. వాటిలో ఎందరో స్త్రీరచయితలు తమ కవితలను ప్రచురిస్తున్నారు. ఈమాట పత్రిక రచయితలలో దమయంతి, రాధిక, వైదేహి, ఇంద్రాణి వంటి కవయిత్రులు చక్కని కవితలను అందజేశారు.


అడవిదారిలో గాలిపాట (2012)
పాలపర్తి ఇంద్రాణి కవితా సంకలనం

పాలపర్తి ఇంద్రాణి ఈ మధ్య ‘అడవిదారిలో గాలిపాట‘ కవితా సంకలనమును ప్రచురించారు. అందులోని 29 కవితలలో 13 ఈమాట పాఠకులకు సుపరిచితమే. ఇంద్రాణి సేకరించిన కవితావస్తువులు, వాటిని చెప్పిన తీరు, ఎంచుకొన్న పదనిర్మాణము పాఠకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అది నిశీథిని నీరవతలో మిలమిలలాడే ఒంటరి నక్షత్రాలను చూచినప్పుడు కలిగే అనుభూతి, తేనీరు సేవిస్తూ కవితలను నెమరువేస్తూ అరుణసంధ్యను తిలకించినప్పుడు కలిగే అనుభూతి, పుష్పవనిలో విహరిస్తూ పూవు నుండి పూవుకు ఎగురుతూ వెళ్ళే తుమ్మెదలను పరిశీలిస్తున్నప్పుడు కలిగే అనుభూతి. న్యూటన్ మహాశయుడి తలపైన సేబు పండు పడినప్పుడు, అదెందుకు, ఎలా పడినది అని ఆలోచించి భూమ్యాకర్షణ మున్నగువాటి వెనుక ఉండే సిద్ధాంతాలను కనుగొన్నాడని ఒక కథ ఉన్నది. పండ్లు ప్రతి దినము పడుతూనే ఉంటాయి, కాని దానిని గురించి ఎవరూ ఆలోచించరు. అదే విధముగా ప్రతి రోజు అందరూ స్నానము చేయడాని కోసం స్నానాలగదికి వెళ్ళుతుంటారు, కాని వారెవరికి స్నానాలగదిలో కవితను వ్రాయాలనే ఊహ కలుగదు. అదే విధముగా ప్రతిరోజు ఎంత బాగా కిటికీలు మూసినా ఒక తూనీగ ఏలాగో ఇంటిలోపలికి వచ్చి జుయ్యిమని మన తలచుట్టు ప్రదక్షిణము చేస్తూ ఉంటుంది, కాని ఇంట్లో తూనీగ కవితను వ్రాయలని అందరికీ తోచదు. విషయము సామాన్యమే, దైనందికమే కాని దాని చుట్టు ఒక పదాల వల అల్లి అందులో పాఠకులనే చేపలను పట్టుకోవడములో కడు నేర్పరి ఇంద్రాణి!

పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు చూచిన కాస్మోస్ (Cosmos) అనే టి.వి. సీరియల్‌లో కార్ల్ సేగన్ (Carl Sagan) మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు, అందులో మనము అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది. చదవండి –

మాటలెప్పుడో ఆగిపోయాయి
నక్షత్రాలు తళతళలాడాయి
ఒక్కసారి తాకగానే –
వెయ్యి పువ్వులు విచ్చుకున్నాయి
ఎన్ని ధవళరాత్రులు వచ్చివెళ్ళినా
నా చేతివేళ్ళకింకా అదే పుప్పొడి

రాత్రి నృత్యం చదివిన తరువాత సూఫీలు ఆ దేవదేవుని తలచుకొంటూ ఉద్రేకముతో ఊగిసలాడిపోతూ ఎలా నాట్యమాడి ఉంటారో అనే భావన కలిగినది –

నిశిరాత్రి వర్షంలా
కరగనీ సంగీతాన్ని –
నాలుగు భుజాలు కలవనీ
ఊగనీ ఈ చెట్లన్నీ –
మన దేహాలు హత్తుకోనీ
పాడనీ జంట పిట్టలని
గొంతులు వెర్రిగా అరవనీ
రేగనీ వెన్నెల ధూళిని
కాళ్ళని ఎగరనీ ఎగరనీ
ఎండూటాకుల్లో మంచుపొగల్లో
పాము బుసల్లో కీచురాళ్ళ కేకల్లో
రాత్రంతా రాత్రంతా రాత్రంతా
వెర్రి వెర్రి వెర్రిగా
అబ్బా, అదిగో
నృత్యం నృత్యం నృత్యం


అడవిదారిలో గాలిపాట (2012)
పాలపర్తి ఇంద్రాణి కవితా సంకలనం

సామాన్యముగా నేడు వచ్చే కవితలలో అందరూ కాకున్నా చాలమంది కవులు ఒక వాదముపైనో లేక ఒక సిద్ధాంతముపైనో వ్రాస్తూ ఉంటారు. అట్టి కవిత్వమే ప్రయోజనకారియని, లోకోపకారియని, మిగిలినవి వ్రాయడము, చదవడము వ్యర్థము, దండుగ అని కూడ కొందరు అంటారు. అందులో కవిత్వము లేదని కాదు, కానీ ఒక్కొక్కప్పుడు అలాటి కవితలు ఒక విధమైన నైరాశ్యాన్ని నాలో కల్పిస్తాయి. ఇంద్రాణికి నిమ్నవర్గాలను చూస్తే జాలి లేదని కాదు, కాని ఆ జాలిని తన కవితలో ఒక భాగముగా చేసికొన్నారు, అట్టి కవితను చదివిన తరువాత వారికి సహాయము చేయాలనే తపన, తహతహ కూడ కలుగుతుంది. ఇది స్పష్టముగా నీళ్ళుకాచే కాచే పనిపిల్ల అనే కవితలో గోచరమవుతుంది.

గలగల్లాడుతాయి రావి ఆకులు
కదలదు కాకి

అనే పంక్తులతో ప్రారంభమయిన కవిత

ఇంకా నీళ్ళదగ్గరే చచ్చావూ?
పరిగెత్తి పోతాయి
పసిపిల్ల పాదాలు
కదలవు రావి ఆకులు
ఎగిరిపోతుంది కాకి

అనే పంక్తులతో అంతమవుతుంది. చూచారా, ఇంద్రాణి ఎలా మన కంటికి తడి తెచ్చారో?

మొత్తముగా కొన్నే కవితలైనా అందరికి పదేపదే చదువాలనే కోరికను పుట్టిస్తుంది ఈ సంకలనము. ఉదాహరణకు యాపిల్లోంచి యాపిల్ మిమ్ములను మరో ఊహాలోకానికి తీసికొని వెళ్ళుతుంది, అంతే కాక ఒక సై-ఫై చిత్రము చూచినప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది.


(పుస్తకము వివరాలు: అడవిదారిలో గాలిపాట, పాలపర్తి ఇంద్రాణి. ప్రచురణ – శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ, అక్టోబరు 2012. ప్రతులు – ప్రసిద్ధ పుస్తక విక్రేతలు, కినిగె.కామ్, ధర – 60 రూపాయలు లేక 5 డాలరులు.)

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...