కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు

నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు

సూరీడు మంచునీ
మంచు చెట్లనీ కప్పుకునుంటే
ఇంకా తెల్లారనట్టు మోసపోయాను.

పడవపువ్వుల్ని కుట్టుకుని
నది
ఇసకంచు చీర చుట్టేసుకుంది.

యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని నగిషీలుగా అద్దుకుంటూ
లోపలి ఆర్తిని అణచడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి సాంద్రంగా ఒక పాట మొదలవుతుంది.

కన్నీరు జారి చార కట్టడం
రెప్పల వెనుక మెలకువని
తట్టి నిద్ర లేపడం
లబ్‌డబ్‌లతో పెనవేసి చాచిన
చేతిని విదుల్చుకోవడం
శ్వాసల మధ్య నీరవాన్ని
గుర్తించి గౌరవించడం

తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.

గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవడానికి చూస్తూ

రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను

పెరిగిన గడ్డం, పెదాలకి అడ్డొచ్చే మీసం
పెద్దగా ఇబ్బంది పెట్టవు.
అంటుకున్న ఎంగిలి అద్దంలో చూసుకున్నాకయితే
ఒకప్పుడు చేత్తో తుడిచిన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి మరి?

అందమైన జ్ఞాపకాల పేజీలన్నీ
చెదలు పట్టి
పొడిపొడిగా రాలిపోతుంటే
మరపు మలుపులలో
అనుభూతుల స్మృతులన్నీ వెలసి
దిగులు పెంకులను విసిరేస్తోంటే
మనసు కొలను అల్లకల్లోలమవుతుంది

కల్తీ కొంగలు వాలి
ఏ ఏడుకాయేడు పంటను మేసేసినప్పుడూ
నగరం చుట్టూ ప్రాకిన నల్ల కొండచిలువ
సగం పొలాన్ని మింగేసినప్పుడూ
ఆలి కాటిఖర్చుల కోసం
జోడెద్దుల్ని అమ్ముకోవాల్సొచ్చినప్పుడూ

ఇపుడు జీవించాలన్న తలపు
తొలిచేస్తోంది
ఓపినన్ని కలలున్న ఎడారిని నేను
ఒయాసిస్సులను మొలిపించుకోగలను
ఏమో, పాడుకుంటూ పరవళ్ళు తొక్కే
ఒక సెలయేరూ దారిలో ఎదురవ్వచ్చు.

ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.

పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.

దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం

వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.

నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.

పుస్తకం తెరిచివున్నట్టే ఉంటుంది
రాసుకోవడానికే ఏమీ మిగలదు
గాలి పాడుతున్నట్టే ఉంటుంది
స్వరాలేవీ సరిగా ధ్వనించవు

అంకం తర్వాత అంకంగా సాగిన
ప్రయాణమంతా
కళ్ళముందు కదలాడుతుంటుంది