నిష్క్రమణ

అక్కడ
ఒక కుర్చీలో
పూడ్చలేనంత ఖాళీ.
అంతకు మునుపు
ఆ స్ధానంలో
ఎవరో ఉండి ఉంటారనే ఆలోచన
గిరికీలు కొట్టి
కాసేపటికి
వాకిట్లోని ముగ్గులా చెరిగిపోతుంది.

జ్ఞాపకాలని మరమరాలలా
ఒకరి మీద మరొకరు
కాసేపు ఊదుకుంటారు
వచ్చీరాని దుఃఖాన్ని
బలవంతాన
బావిలోంచి చేదుకుంటారు
కాలం తక్కెడ మీద నిష్క్రమణ నీడ
ఊగిసలాటలో సమయం
పక్షిలా ఎగురుతుంది
గాలి కొన్ని పొదలను
చిన్నగా కదిలిస్తుంది
కాసేపటికి అంతా సద్దుమణుగుతుంది.

తలెత్తి పైకి ఎగసి
తనను తాను మర్చిపోతూ
నిలబడ్డ కెరటం
తన పనిలో మళ్ళీ నిమగ్నమవుతూ
తీరం వైపు పరుగులు తీస్తుంది
అంతా గమనిస్తున్న కాలం
ఫక్కుమని నవ్వాక
మణికట్టు పట్టాలపై
మూడు ముళ్ళతో
నడిచే రైలు
గాడిలో పడుతుంది.