ఆధారం: అశ్వఘోష విరచిత సౌందర నందం (సంస్కృత మూలం)
కపిలవస్తు నగరం.
మహారాజ భవనానికి దూరంగా అతి శ్రద్ధాభక్తులతో వినమ్రులై తధాగతుని ప్రవచనాలు వింటున్నారు కపిలవస్తు ప్రజలు.
ఆ రాజ ప్రాసాదాన్ని ఆనుకొని ఉన్న ఉద్యాన వనం సప్తవర్ణ మిళితమైన పుష్పాలతో కడు శోభాయమానంగా ఉంది. అతి సుందరమైన ఆ ప్రదేశంలో కుందేళ్ళూ, జింకలు, మయూరాలు స్వేచ్చా విహరణ చేస్తున్నాయి.
అతి రమ్యమైన ఆ ప్రదేశాన్ని విడనాడడం మానవమాత్రులకే కాదు, పశుపక్ష్యాదులకీ అసంభవమే !
ఆమె వయ్యారంగా నడుస్తోంది. మహారాజు ఆమెను అనుసరిస్తున్నాడు.
పసిడి వన్నెల శరీర ఛాయ ముందు ఆమె ధరించిన ఆభరణాలు వెలవెల పోతున్నాయి. ఆమె శరీరంపై పూసిన చందన చర్చిత పరిమళాన్ని ఆ ఉద్యాన వనంలో పుష్పాలు ఆఘ్రాణిస్తున్నాయి. అతని శరీరం నుండి మత్తెక్కించే కస్తూరి పరిమళం ఆ ప్రదేశాన్ని శృంగార భరితంగా మలిచింది.
ఆ ముగ్ధమోహన వయ్యారి నామధేయం సుందరి. అతను కపిలవస్తు నగర మహారాజు నందుడు.
భూలోక సుందరమైన ముఖ వర్చస్సు చూసి కొందరు ఆమెను సుందరీ అని, రాణి వాస స్త్రీ దర్పం, కించిత్ గర్వం చూపే ఆమెను మరికొందరు భామినీ అనీ, మాననీ అనే పర్యాయ నామాలతో పిలుస్తారు.
చందమామ నుండి వెన్నెల దూరమవ్వచ్చునేమో కానీ, క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని చక్రవాక పక్షుల్లాంటి జంట అది.
ఆ రాజ్యానికే కాదు, వారి ప్రేమ సామ్రాజ్యానికి కూడా వారే ఆది దంపతులు.
ఒకరి కళ్ళలో ఒకరు సూటిగా ఎంతో ఆర్తితో చూసుకుంటున్నారు. పరస్పర ప్రేమానురాగాలతో ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకుంటున్నారు.
వారి హృదయాల పెదవుల నుండి పొంగే రస ధార అయిన మధువు ఆస్వాదిస్తూ వారిద్దరూ తమని తామే కాదు, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి రమిస్తున్నారు. అవ్యాజమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు.
నందుడికి సుందరే సర్వస్వం. సుందరికి నందుడే సమస్తం.
యవ్వనపు వేడిలో పుట్టిన కోరిక క్షణాలు వారిద్దర్నీ అగ్నికణాల్లా దహించివేస్తున్నాయి. అది కామమో ప్రేమో వారికే తెలియదు. తొలిపరిచయాననంతరం ఎక్కువ కాలం సుందరి సమక్షంలోనే గడిచింది నందుడికి. రాజ్యాధికారంకన్నా సుందరి సౌందర్య సామ్రాజ్యంలో బానిసత్వమే అతనికి అతి మక్కువ.
కోరికల వేడి చల్లారేక ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరించి ఆమెకు ప్రేమతో సేవ చేద్దామని ఉపక్రమించాడు నందుడు. అతనికి తెలుసు, సుందరి అందమ్ముందు రత్నమణిమకుటమైన ఆ ఆభరణాలు సూర్యుని ముందు దివిటీ అని. అలా అలంకరించడం సుందరికే కాదు, అతనికీ ఇష్టమే ! అతను అలంకరించక మానడు, ఆమె దానికి అడ్డు చెప్పదు !
కపిలవస్తు మహారాజు తన ప్రేమాక్రాంతుడయ్యాడన్న భావనే సుందరికి అత్యంత ప్రియమైనది. సుందరి పాదాలకు మువ్వలు అలంకరించాడు నందుడు. సుందరి లేచి అతని చేతిలో దర్పణం ఉంచిది.
మేలు ముంగురులు సవరించుకుంటూ ఆ అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతున్నట్లుగా ప్రవర్తిస్తోంది సుందరి. నిజానికి తన అందం చూసి కాదు, నందుడి ప్రేమాభిమానాలు చూసి. అలంకరణ చేసుకున్నట్లుగా నటిస్తోంది సుందరి. కావాలనే అలంకరణ నెపంతో జాప్యం చేస్తోంది. ఆమెకు తన వద్ద నందుడు ఏ కాంతంలో దాసుడవ్వడమే ఇష్టం. కాలమంతా ఆగిపోయి వారిద్దరి మధ్య యుగాలు క్షణాల్లా మారితే ఎంత మధురంగా ఉంటుందో కదా అని ఆలోచిస్తోంది సుందరి. ఆమె కేసి తమేకంతో చూస్తూ నందుడి నయనాలు రెప్ప వేయడం మర్చిపోయాయి. అతి మెత్తని శరీరంపై ఆమె చందనం పూసుకుంటోంది. ఆ చందన పరిమళాలకి నందుడి ఉద్వేగం పౌర్ణమి కెరటాల్లా ఉవ్వెత్తున లేస్తోంది. అతనిలో సహనం నశిస్తోంది.
సుందరికీ అదే కావాలి. పాదాలకు చందనం పూయమన్నట్లుగా చూపులతో ఆదేశించింది. ఆ ఆజ్ఞ ని ధిక్కరించే శక్తిలేదు నందుడికి.
అతనికి సుందరే కాలం. ఆ కాలమే శాశ్వతం.
తమేకమైన శృంగార కేళిలో కాల చక్రాన్ని తమ మధ్య బంధించామన్న భ్రమ. కానీ ఆ కాలచక్రం నిరంతరంగా సాగే యధార్థ చక్రం. భ్రమలకు అందని అదృశ్య గమనం అది.
వారి శరీరాలేకాదు, మనస్సులుకూడా ఉనికిని కోల్పోయి, ఈ ప్రపంచాన్ని వారిద్దరి మధ్యనుండి నెట్టి వేసాయి.
సరిగ్గా అదే సమయానికి తన తమ్ముడి ఇంట భిక్షార్థియై రాజ భవనంలోకి ప్రవేశించాడు బుద్ధుడు.
అతని రాకను ఎవ్వరూ గమనించలేదు. తధాగతుడు మెల్లగా అడుగులువేసుకుంటూ నందుడికోసం చూసాడు.
దూరంగా ఉద్యానవనంలో సుందరీ నందులను చూసాడు. వారిద్దరూ కామకేళిలో మునిగి ఉన్నారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్నేకాదు బుద్ధుడి రాకనూ గమనించలేదు. పరిచారికలు ఎవ్వరూ తన రాకని గుర్తించలేదని బుద్ధుడికీ తెలుసు.
మనిషి వచ్చిన అలికిడి వారిని కదిలించలేకపోయింది. బుద్ధుడూ అదే కోరుకున్నాడు. వడి వడిగా అడుగులు వేసుకుంటూ వెను తిరిగాడు తధాగతుడు.
కారుమబ్బులను చీల్చుకున్న సూర్య కిరణంలా తేజోవంతమైన ఓ ముఖం రాజ భవనం కిటికీలోంచి కనిపించింది ఒక పరిచారికకు.
తిరిగి వెళిపోతున్న వ్యక్తి బుద్ధుడన్నది తెలుసుకోవడానికెంతో సమయం పట్టలేదు. జరిగిందేమిటో అర్థమయ్యింది పరిచారికకి. జరగకూడని అపచారం జరిగిందన్న భావనతో ఆమె ఉద్యాన వనంవైపు వేగంగా వెళ్ళింది.
సుందరీ నందుడూ బుద్ధుడి రాకను గమనించలేదన్న విషయం తెలిసింది.
ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఉద్యానవన ద్వారం వద్ద నిలబడి, తను వచ్చినట్లుగా శబ్దం చేసింది. సుందరీ నందుడు ఒక్కసారి ఈ ప్రపంచంలోకి వచ్చారు. పరిచారికవైపు ఏమిటన్నట్లుగా చూసారిద్దరూ.
మౌనంగా తలదించుకున్న ఆ పరిచారికని వచ్చిన వైనం విన్నవించమని ఆదేశించాడు నందుడు.
అతి మెల్లని స్వరంతో ఆ యువతి భిక్షార్థియై విచ్చేసిన బుద్ధుడి రాకను తెలియ జేసింది.
” తమ కరుణా కటాక్షాలను ప్రసాదించడానికి స్వయాన తమ సోదరులైన బుద్ధ భగవానులు విచ్చేసారు. జన శూన్యమైన అరణ్యంలో ప్రవేసించిన రీతిగా ఈ రాజ భవనంలో భిక్ష దొరకక రిక్త హస్తాలతో వెను తిరిగి వెళ్ళారు. మీ అంతరంగానికి భంగం కలిగించినందుకు క్షమించండి. ఈ వార్త మీ చెవిన వేద్దామనే వచ్చాను. ”
పరిచారిక మాటలు విని ఆశ్చర్యపోయారిద్దరూ ! బుద్ధుడు రాజ భవనానికి విచ్చేస్తే తను గుర్తించకుండా నిర్లక్ష్యం చేసినట్లుగా భావించాడు.
తన తప్పిదం తెలిసింది నందుడికి. పొరపాటు జరిగింది. తక్షణం దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. క్షమించరాని అపచారం జరిగిపోయింది. తన స్వహస్తాలతో తధాగతుడు తీసుకొచ్చిన దీవెనలు తన నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. తక్షణమే బుద్దుడ్ని సందర్శించి క్షమాపణ వేడుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. తను ప్రత్యేకంగా వెళ్ళి బుద్ధుని తన ఇంట ఆతిధ్యానికి పిలవాలని నిర్ణయించుకుని సుందరికి తన మనోగతం చెప్పాడు.
అతని మాటలు విని ఒక్కసారి ఆలింగనం చేసుకుండి సుందరి. అతడు తనని విడిచి వెళ్ళాలన్నది ఆమెకు అవగతమయ్యింది.
“ఓ రాజనందనా ! మీరు గురువర్యుల్ని కలవవద్దని నేను చెప్పడం లేదు. మీరు వెళ్ళడం తక్షణ కర్తవ్యం. కానీ – మీకు తెలుసు మీ సాన్నిహిత్యం వీడి ఉండడం ఈ సుందరి వల్ల కాదు. మీరు వెళ్ళి క్షణంలో తిరిగి రండి. ఎంత త్వరగా అంటే ఈ చందన లేపనం తడి ఆరకముందే మీరు రావాలి “.
నందుడు తన శృంగారకేళీ వస్త్రాలను విసర్జించి, రాజ వస్త్రాలను ధరించి వచ్చాడు. బయల్దేరుతుండగా సుందరి అతని దగ్గరకు వచ్చింది. త్వరగా రమ్మనమని మరోసారి గుర్తు చేసింది.
ఈ చందన చర్చితాలు ఆరేలోగా రాకపోతే శృంగారానికి దూరంగా ఉంచే కఠినమైన శిక్ష విధిస్తానని హెచ్చరించింది. నందుడు సరేనన్నట్లుగా తలూపాడు. వెళ్ళడానికి ఆయత్తమవుతుండగా సుందరి మరొక్కసారి అతన్ని కౌగిలించుకుంది. వెళ్ళాలి అన్నట్లుగా నందుడు ముందుకు కదిలాడు.
భూకంపానికి కూలిన మహా వృక్షంలా ఉందతని మనస్సు. బుద్ధుని రాకని గమనించని తన నిర్లక్ష్యానికి సిగ్గు పడుతూ రాజ భవనం నుండి బయటకు వచ్చాడు. అతను వెళ్ళిన వైపే ఆర్తిగా చూస్తూ ఉంది సుందరి.
వడివడిగా అడుగులువేసుకుంటూ కదులుతున్నాడు నందుడు.
అతను రాజభవన సింహద్వారాన్ని దాటి అడుగు ముందుకు వేసి రథం వైపుగా వెళ్ళాడు. అదే రాజభవనం నుండి వేసే ఆఖరి అడుగని అతనికి అప్పుడు తెలియదు, సుందరికి కూడా !
( మిగతా వచ్చే సంచికలో…)