సుందరికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. చుట్టూ పరిచారికలు లేరు. అటూ ఇటూ చూసింది. పైకప్పు రంధ్రం నుండి సూర్యకాంతి తనపై పడుతోంది. పైన తాటాకులు కనిపించాయి. దగ్గరలో మురికి వాసన గుప్పుమని వచ్చింది. లేద్దామని ప్రయత్నించింది. శరీరం సహకరించ లేదు. తన కదలికల్ని గమనించి ఓ నలుగురు స్త్రీలు వచ్చి చుట్టుముట్టారు. వాళ్ళు నల్లగా ఉన్నారు. శిరోజాలు అస్తవ్యస్తంగా ముడి వేసుకున్నారు. మాసిన వారి వస్త్రాలు చూసింది.
అప్పుడర్థమయ్యింది తానొక శ్రామిక వాడలో ఉన్నానని. వాళ్ళు లేవద్దన్నట్లుగా సైగ చేసారు. తన పరిచారికలు లేరు. తనిక్కడకెలా వచ్చింది?
ఒక్క సారి కళ్ళు మూసుకుంది. ఒక్కటొక్కటే లీలగా గుర్తుకొస్తోంది.
తథాగతుని కుటీరంలో నందుణ్ణి చూసి స్పృహ తప్పి పడిపోయిన తరువాత తథాగతుని కమండల జలంతో మెలకువ రావడం గుర్తొకొచ్చింది. తథాగతుని పరిపూర్ణమైన తేజో వంతమైన వదనం గుర్తొకొచ్చింది. మెల్ల మెల్లాగా తథాగతుని మాటలు మరలా మనసులో మారుమోగుతున్నాయి.
“ఓ సుందరీ! నువ్వు నందుడి కోసం వచ్చావని తెలుసు. ప్రస్తుతం నందుడు కఠోర తపోదీక్షలో ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని గుర్తించే స్థితిలో లేడు. మెల్ల మెల్లగా అతను బవభంధాలకి దూరం అవుతున్నాడు.”
సుందరి ధుఖం ఆపుకోలేక పోతోంది. తథాగతుడు ప్రవచనాలు మొదలు పెట్టాడు.
“నందుడు కారణజన్ముడు. ఒక ప్రత్యేకమైన దీక్షలో ఉండగా మరలా సంసార బంధంలోకి రావడం కష్టమే! నా మాటలు ఆలకించి నీవు కూడా సత్యాన్వేషణ వైపుగా జీవితాన్ని సాగించు. ప్రపంచానికి దూరంగా కష్టం అంటే తెలియకుండా, సుఖజీవనానికి అలవాటు పడిన నేను ఇలా మునిలా అవుతానని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇది సత్యం! నేను నా సత్యాన్వేషణలో దుఖాలకి మూల హేతువు కనుక్కునే ప్రయత్నం చేసాను. నాకు అనిపించింది వివరిస్తాను. విను. ఇదే ఆ నందుడికీ బోధించాను.
ఈ సృష్టి ధర్మంలో నాకు తెలిసి నాలుగు హేతువులున్నాయి. ఈ నాలుగు హేతువులవల్లే ఈ శరీరం క్షీణిస్తుంది. తద్వారా మృత్యువు సమీపిస్తుంది.
అందులో మొదటిది దుఖం. ఈ దుఖం వలనే అసంతౄప్తి, బాధలు, కోరికలు మరియు పీడనం వస్తుంది. రెండోది ఈ ధుఖ కారణం. మొదట చెప్పిన వాటికి మూల హేతువు. ఈ చేతనా, అచేతనావాస్థలకి మూలం. మూడోది ధుఖపీడనం వల్ల వచ్చే మానసిక పరిణామం. నిరర్థకత ఆవరించుకున్న వ్యాకులమైన స్థితి. ఇహ ఆఖరిది, నాలుగవది – దుఖ విమోచనం – దుఖ నివారణా మార్గం – అవే సత్యాన్వేషణం,ధర్మ పాలన, స్వచ్చమైన నడవడి, నిర్మలమైన మనస్సు – కోరికలు లేకపోవడం!
ఈ నాలుగు పాటిస్తే మనిషి ధుఖం అనేది ఉండదు. ఇదే మానవాళికి యదార్థ ధర్మ చక్రం. ప్రతీ మనిషిలోనూ ఈ నాలుగు ధర్మాలూ ఉంటాయి. కోరికలు ఆ ధర్మ చక్రాన్ని ఆవరించుకుంటాయి. పుట్టిన ప్రతీ మనిషిలోనూ ఈ యదార్థ చక్రం ఉంటుంది. అది ప్రతిక్షణమూ తిప్పగలిగినాడు ఈ దుఖం అనేది కనిపించదు.
ఒక్క ఏకాగ్రత తో మాత్రమే ఆ యదార్థ చక్రాన్ని తిప్పడం సాధ్యం అవుతుంది.
అందువల్ల ముందుగా ఏకాగ్రత అనే యోగ సాధన కోసం ప్రయత్నిస్తే మిగిలినవి అవే సులభం అవుతాయి. సూక్ష్మంగా ఇదే నేను నందుడికీబోధించాను.
నీకూ చెబుతున్నాను. దీనికి స్త్రీ పురుష బేధం లేదు. కావాలంటే నువ్వు బౌద్ధం స్వీకరించవచ్చు. బౌద్ధ భిక్షుణి కావడానికి ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. కానీ నీ రాకతో నందుడు చలించినా చలించవచ్చు. కాబట్టి నువ్వు నేను చెప్పిన ధర్మ సూత్రాలు ప్రజలకు తెలియ చెప్పు. వారిని ఈ సంసార బంధాల నుండి మెల్ల మెల్లగా విముక్తుల్ని చేయి. వారిని నిర్వాణ పథం వైపుగా పయనించేలా ప్రయత్నం చేయి !”
తధాగతుని ప్రవచానాలలో శక్తి నందుణ్ణి ఎలా ప్రభావితం చేయ గలిగాయో సుందరినీ అంతకంటే ఎక్కువగా ప్రజ్వలింప చేసాయి.
ఎన్నో ప్రశ్నిద్దామనుకున్న ఆమె మౌనంగా బుద్ధుని కుటీరం నుండి బయటకు వచ్చింది.
అంతపురానికి వెళ్ళాలనిపించలేదు.
అలా ఆలోచిస్తూ నడుస్తూనే ఉంది. ఎంత దూరం నడిచిందో గుర్తులేదు.
ఆ క్షణంలో ఆమెకు తథాగతుని ప్రవచనాలు తప్ప ఏమీ గుర్తు రావడంలేదు.
అంతవరకే తనకి గుర్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమాత్రం తెలియదు.
దాహం అన్నట్లుగా సంజ్ఞ చేసింది. ఒక రాగి పాత్రలో ఒకామె నీళ్ళు ఇచ్చి మెల్లగా చెప్పింది.
“అమ్మా చూడడానికి మీరు రాణి వాసపు స్త్రీలా ఉన్నారు. మీరు ఈ శ్రామిక వాడ దగ్గరలో స్పృహ తప్పి పడిపోతే మేం తీసుకొచ్చాం. ఎవరమ్మా మీరు?”
సుందరి నీళ్ళు త్రాగింది. తనెవరో చెప్పలేదు. ఆ స్త్రీలూ రెట్టించలేదు. అనారోగ్యంగా ఉంది కదా మరలా ఎందుకు ప్రశ్నించడం అన్నట్లుగా మౌనంగా ఉండిపోయారు.
ఆమెకు బుద్ధుని మాటలే గుర్తుకొస్తున్నాయి. “ఈ ధర్మ సూత్రాలు ప్రజలకు వివరించు. వారిలోని యదార్థ చక్రాన్ని తిప్పే ప్రయత్నం చెయ్యి” – అవును – తన తక్షణ కర్తవ్యం అదే! మెల్లగా లేచి పరిసరాలు చూసింది.
చుట్టూ పరిసరాలు మురికికూపం లా దుర్గంధం ఓడుతూ ఉన్నాయి. అప్పుడామే ఒక నిర్ణయానికివచ్చింది. “ముందు వీరికి శరీ పారిశుభ్రత తెలియ చెప్పాలి.ఆ తరువాతే మానసిక శుభ్రత అలవరుతుంది!” అనుకుంటూ సుందరి అక్కడే ఉండి వారితో జీవితం గడపడానికి ధృఢమైన నిర్ణయానికొచ్చింది.
మనసులో తధాగతుని దివ్యశక్తి రూపమే కనిపిస్తోంది.
కాల చక్రం గిర్రున తిరిగింది. ఆ చక్రం క్రింద దాదాపు ఎనిమిది సంవత్సరాలు నలిగి పోయాయి.
నందుడు పరిపూర్ణమైన బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఏ కోరిక సాధించడంకోసం తన యోగ దీక్ష ప్రారంభించాడో, ఆ దీక్ష అతని కోరికన మరిచేలా చేసింది.
సుందరి జీవితమూ మారింది.
ఆమె నివసించే ఆ శ్రామికవాడ ఇప్పుడు ఎంతో పరిశుభ్రంగా ఉంది.
తధాగతుని బోధనలు వారికి మెల్ల మెల్లగా వివరిస్తోంది.
తన జీవనసరళిలోనే కాదు వారి జీవిత చక్రాలు ధర్మపథం వైపు పయనిస్తున్నాయి.
ఓ సుదినాన ఒక బౌద్ధ భిక్షువు ఆ శ్రామికవాడ వైపుగా వచ్చినట్లు తన కుటీరానికి కబురొచ్చింది. సుందరి ఆ బౌద్ధ భిక్షువుని స్వాగతించడానికి వెళ్ళింది.
ఒక్కసారి ఆ బౌద్ధ భిక్షువుని చూసి అవాక్కయ్యింది. ఆ బౌద్ధ భిక్షువెవరో కాదు. ఒకప్పటి తన ప్రియుడు నందుడు.
అతనికేసి కన్నార్ప కుండా చూసింది. నందుడూ సుందరిని గమనించాడు. ఒక్కసారి ఇద్దరి మనసులూ తొట్రుపడ్డాయి. వెంటనే వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు.
నందుణ్ణి చూసి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతోంది. సుందరికి ప్రస్తుతం అతని ధ్యాస లేదు.
నందుడికి ఆమె ఒక గతం!
ఒకప్పుడు ఇద్దరూ కామ పూరితమైన ఆరాధనా ప్రేమికులు. ప్రస్తుతం ఒకరినొకరు గౌరవించుకునే బౌద్ధ భిక్షువులు.
ఇద్దరి మనసులూ ఒక్కసారి అవ్యాజమైన ప్రేమ పూరితాలయ్యాయి. ఇంతకుముందూ అదే ప్రేమ ఉంది. ఇప్పటి ప్రేమకంటే వెయ్యి రెట్లు ఉండేది. కానీ ఆ ప్రేమలో కోరిక ఉంది. ఈ క్షణం ఈ ప్రేమలో ఏ కోరికా లేదు.
నిర్వాణం పొందిన మనస్సు లో జీవన రహస్యాన్ని తెలిపే యదార్థమైన ప్రేమ ఉంది.
” అమ్మా! నీ గురించి బుద్ధ భగవానులు విన్నారు. ఈ శ్రామిక వాడ ప్రజల జీవన సరళిలో మార్పు తెచ్చిన మిమ్ములను కలసి రమ్మన మని తధాగతుని అదేశం! మీరు చేసే ఈ శ్రామిక సేవే నిజమైన బౌద్ధమని తధాగతుని మనో ప్రవచనం. ఈ సేవతో మీ జన్మ ధన్యమయ్యింది. మిమ్ములను తధాగతుడు చూడ గోరుతున్నారు…”
సుందరి నంద భిక్షువు పాదాలకి నమస్కరించింది. ఇప్పుడామె మనస్సు స్వచ్చంగా నిర్మలంగా ఉంది. * అయిపోయింది
[యథార్థ చక్రం గురించి రెండు మాటలు చెప్పడం అవసరం అనిపించింది నాకు. అశ్వఘోషుడు రాసిన సంస్కృత కావ్యం, సౌందర నందం యథార్థ చక్రానికి ఆథారం. సౌందర నందం కావ్యం గురించి విన్నాను. ఎప్పుడూ చదవలేదు. దాదాపు రెండేళ్ళ క్రితం గాంధీ గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే గాంధీ రాసిన ఒక ఉత్తరంలో ఈ సౌందరనందం ప్రస్తావన వచ్చింది.హరిజనోద్ధరణ, హరిజనవాడలు శుభ్రపరచడం గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో మొదట లేవు. సౌందరనందం చదివిన తరువాతే గాంధీకి ప్రేరణ కలిగిందని చదివాను. ఇది చదివేక నాలో ఉత్సుకత బయల్దేరింది. సుందరి పాత్రని చూసి గాంధీ ప్రేరణ పొంది, ఏదైనా సిద్ధాంతం ప్రజలలో అమలు పరచాలంటే మూలలనుండీ మొదలు పెట్టాలి అన్న విషయం గాంధీ ఆచరించి చూపించారు.
గాంధీకి ప్రేరణ కలిగించిన ఈ కథ ఏమిటి, ఎక్కడ దొరుకుతుందని అన్వేషణ మొదలు పెట్టాను. ఆ తరువాత ఇండియా వెళ్ళినప్పుదు సౌందర నందం సంస్కృత కావ్యం అతి కష్టం మీద సంపాదించ గలిగాను. ఈ సౌందర నందాన్ని కాటూరి పింగళి పద్య కావ్యంగా రాసారని తెలుసుకున్నాక అది సంపాదించడానికి ఎంతో ప్రయాసపడ వలసి వచ్చింది. మొత్తానికి అదీ దొరికింది. అది చదివిన తరువాతే ఇది కథా రూపంలో రాయాలనిపించింది. కాటూరి వారి సౌందరనందానికి, అశ్వఘోషుడి సౌందర నందానికి దాదాపు తొంభై శాతం పోలికలు ఉన్నాయి. కానీ కాటురి – పింగళి వారు సంస్కృత మూలానికి అనువాదం అని ఎక్కడా ప్రచురించలేదు. అక్కడక్కడ పోలికలు ఉండ వచ్చునన్నట్లుగా మాత్రమే రాసారు. సౌందరనందం మొత్తం 19 సర్గలు. మొదటి 5 సర్గలు బుద్ధిని జీవితం గురించి అశ్వఘోషుడు రాసాడు. బుద్ధుని కథ అందరికీ తెలుసున్నదే కదా అని, సుందరీ నందుల కథ దగ్గర నుండి మొదలు పెట్టాను. చివరి 5 సర్గలు బౌద్ధం గురించే ఎక్కువగా ఉంది. మొత్తం అంతా రాయలేదు కానీ వాటి సారాంశం మాత్రం చెప్పడానికి ప్రయత్నించాను. నేను ఈ సౌందర నందం కథ గురించి చదివేక బౌద్ధం గురించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బౌద్ధాన్ని మహాయాన బౌద్ధంగా పరిగణిస్తారు. ఈ మహాయాన బౌద్ధం బుద్ధుని తరువాత కాలక్రమేణా రూపాంతరం చెందిన బౌద్ధం. అసలు బుద్ధుడు ప్రవక్తించిన బౌద్ధాన్ని తెరవాదం అంటారు. ఆ తెరవాదమే కొంతగా కథలో రాయడం జరిగింది. మధ్యలో హీనయాన బుద్ధిజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలువ లేదు. ఈ మహాయాన బౌద్ధమే ఇప్పుడు శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉంది. జపనీయులు కొంతమంది తెరవాదాన్ని, కొంతమంది మహాయానాన్ని పాటిస్తారు. బౌద్ధం గురించి చదువుతుంటే అనేక వాస్తవాలు తెలిసాయి. హిందూ ధర్మంలోంచి పుట్టినదైనా, తన ఉనికిని తను చాటుకుంటూ ఒక ప్రత్యేక మతంగా అవతరించిన బౌద్ధం నేటికీ అవే ధర్మ సూత్రాలతో ఉంది. మరీ ఎక్కువగా రాస్తే పాఠకులకి విసుగు కలుగుతుందని కేవలం సారాంశం మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అలాగే మూల కథని భంగ ప్రరచకుండా అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేయడం కూడా జరిగింది. ఒక మంచి కావ్యాన్ని కథారూపంలో అందించడమే నా ఈ చిన్ని ప్రయత్నం. ఈ ప్రయత్నానికి అంగీకరించిన ఈ మాట సంపాదక వర్గానికి, ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ఈమాట సంపాదకులకి నా ధన్యవాదాలు! ఎక్కడైనా తప్పులు దొర్లితే మన్నించండి. శలవు!- రచయిత ]