‘వ్యయ’ ప్రయాస

బాలారిష్టాలు దాటి బతికి బట్ట కడతానా లేదా అనే భయంతో
గడ్డమ్మ పెంటమ్మ అన్నట్టు మా అమ్మా నాన్నా నాకు నాసిరకం పేరు పెట్టారు –
వ్యయ
చచ్చిన వాడే కాదు చచ్చేవాడి కళ్ళూ చేరడేసి అన్నట్టుగా
మా అక్కలు ప్రభవ ప్రమోదూతల కంటే రెండాకులు ఎక్కువే చదివాను
పదిమంది వెక్కిరింతల్నీ దాటి పబ్బం గడుపుకొంటూ వస్తున్నాను –
కొందరి ముఖాలకు ‘రాశి’ వుండదు
కొందరి ముఖాలకు ఆనందం గర్వం ‘రాసి’ వుండదు
నేను వస్తున్నానంటే “మామిడి పూచినట్లు మధుమాసము హాసము చేసినట్టు”
అని పాడిన ఆనాటి కవిత్వం కవిసమయంగా మారింది-
మధుమాసం హాసం మరచిపోయి చాలా ఏళ్ళయింది
“ఊల్లెకు గాదొచ్చింది ఉర్కిరాండ్రి ఉర్కిరాండ్రి
ఊపిర్లు బిగబట్కొని, లేకుంటే అరువడ్కొని
ఉర్కిరాండ్రి ఉర్కిరాండ్రి” అన్న తెలంగాణా కవి గోడు కూడా
యాదన్నలకీ ఆశయ్యలకీ అందుతున్నట్టు కనిపించదు
చిక్కని నెత్తావిని పుక్కిలించే పూలబాలలు
చిలుక తత్తడి రౌతు పుష్పబాణ విన్యాసాలు
రుచిపక్వంగా ఆవిష్కరించే ఉగాది పచ్చళ్ళు
చాట్‌లూ, చలవగదులూ మరిగిన పసితరానికి అందడంలేదు
దినపత్రికలు పరిణామ శీలానికి విడాకులిచ్చి
మరో అవ్యవస్థకు దిక్సూచిగా నిలుస్తున్నాయి
కాంగోలో, కాశ్మీర్‌లో, ఇరాక్‌లో, సోమాలియాలో
మనశ్శాంతికి అర్థం మరో జన్మ కనే కల
మారణకాండకి రాజకీయ ముస్తాబు చేసి
మనిషి స్వార్థానికి మన్నికయిన అంగీలు తొడిగి
నిర్వీర్యత నగ్నరూపం నిన్నటి పేర్లతో చలామణి అవుతోంది
“అయ్యో కొత్త పేరు పెట్టుకొని
మళ్ళీ పాత ముఖంతోనే వచ్చావా వ్యయా!”
అంటూ ఎక్స్‌రే కళ్ళతో సెక్స్‌ వర్కర్లని
నిరసించినట్టుగా నిస్త్రాణగా గొణుగుతున్నాయి పంచాంగాలు –

*** *** ***

1946
క్రితంసారి వచ్చినపుడు నాకు జరిగిన రాచమర్యాదలు ఏం చెప్పను?
దేశభక్తి చిప్పలే జాతి వైభవానికి అభిజ్ఞ ఆనాటి నా పేరు
త్యాగనిరతి, కర్తవ్య దీక్ష ఊపిరులుగా
మానవాళి ఏక గళమై ఎలుగెత్తిన మధురక్షణం
అవినీతి, అవకాశవాదం, స్వార్థం, ప్రాంతీయ దురభిమానం, కులం, మతం –
ఈనాటి బ్రతుకు బాటకు పర్యాయపదాలు
కాని ఆ నాటి ఉద్యమ స్ఫూర్తికి విపర్యాయాలు
‘అహింసా’  అనే అపూర్వమైన ఆయుధంతో
రవి అస్తమించని తెల్లజాతి అహంకారాన్ని ఉత్తరించిన ఉత్తమ క్షణం
రుజ, క్షుధల నుంచి, ఆకలి నుంచి, ఆర్తినుంచి
జాతి ఆత్మగౌరవాన్ని వడ్డించిన విస్తరి చేయాలన్న ఆశంస పుట్టిన రోజు
ప్రతి భారతీయుడి హృదయంలో వెయ్యి ఆనంద తారకలు
నీరవ నిశీధినీ, నిరాశా నిస్పృహలనూ చీల్చి
సరికొత్త ఆశా శాద్వలాలను వెలిగించిన అఖండ దీపికలు
ఎటు చూసిన గర్వించే ఎద
ఏ గొంతు తెరిచినా జాతి పరవశించే పచ్చటి కల
చైతన్య పుంజాలు ఎల్లెడలా నింపే గళాలు
స్వాతంత్ర్య దీప్తిని గుండెల్లో ఎగదోసే కవుల కలాలు
దేశమంతా ఒకే దారి
మానవుడన్నవాడికి ఒకే ఆదర్శం
ఆనాటి ‘వ్యయ’ స్వర్ణ భారత మార్గమధ్యంలో
జాతి అమృత క్షణాల్ని దర్శించిన బాటసారి
నా చరిత్రకది మైలురాయి
జాతి చరిత్ర పుటల్లో కలికి తురాయి-

*** *** ***

1886
పోనీ మరో అడుగు వెనక్కి వెళ్ళేదా
అహో, దేశ సంస్కృతీ వైభవానికది పరాకాష్ట
రాబోయే తరాలకి ఆతరం గర్వంగా రాసిచ్చిన వీలునామా
సారస్వత శోభకి సంగీత సౌరభానికీ అది అందమైన చిరునామా
అప్పుడే- గురజాడ నూరేళ్ళ జనజీవన కల్పతరువు – కన్యాశుల్కానికి పురిటి
నొప్పులు ప్రారంభమయ్యాయి.
తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారి మాణిక్య వీణ మధురస్వరాలు
పలుకుతోంది
సంస్కృత నాటకానికి సభామర్యాదని కల్పించి
పామర జనం గుండెల్లో సైతం పది దశాబ్దాల పైన పీట వేసుకొని
ఈనాటి ఆధునికతకి ఆనాడే పునాదులు వేసిన
తిరుపతి వేంకట కవుల ఉద్యోగ విజయాలు విజయంచేస్తున్న చారిత్రక
సంధ్య
మతానికి అర్థం మరిచి, బానిసత్వానికి అంతిమ తీర్పుని పరిచి
ప్రపంచంలోకల్లా నా తల్లి గొప్పదని
రొమ్ము విరుచుకొన్న ముస్లీం కవి – ఇక్బాల్‌ గొంతు ఖంగుమన్న క్షణం
సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్‌ హమారా
సారం తెలిసే మనసుంటే నేటికీ అదే చహారా
దీనికి ఎవరికి వారు పెట్టుకున్న దొంగ పేర్లు ‘ఇజా’లు
నిజాన్ని ఒప్పుకోవడం తెలీని కుహనా సిద్ధాంతులు తడువుకొన్న భుజాలు
తెల్లారి లేస్తే తెల్గీ కథలూ, అబూ సలీం ప్రణయాలూ
దావూద్‌ ఇబ్రహీంలూ, టైగర్‌ మెమూన్ల సాహస గాథలు
ఈనాటి దిన పత్రికల పతాకాలు
తాంతియా తోపే, భగత్‌సింగ్‌, అల్లూరి, కట్టబ్రహ్మన్నల స్ఫూర్తి
ఆనాడు ఆకాశానికెత్తిన విజయ పతాకలు
సమాజ సంస్కరణకు వీరేశలింగం చెప్పిన కొత్త భాష్యం
వివేకవర్ధని అనే లౌడ్‌స్పీకర్‌ ప్రజ్వలించే వార్తాప్రసారం
తెలుగు బ్రౌణ్యాన్ని చరాస్తిగా పంచి యిచ్చి
తెలుగు వ్యాకరణానికి తొలి పాఠాలు నేర్పిన
బ్రౌను శాస్త్రి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగా, పచ్చగా పరిమళిస్తున్న
దినాలు
(రెండేళ్ళ ముందే ఆయన కాలధర్మం చెందారు)
కడప జిల్లా కల్నల్‌ మెకంజీ కైఫీయత్తులు
ఆనాటి జన జీవనానికి అద్దం పట్టే ఉపనిషత్తులు
అప్పటి నా రాక
జాతీయాభ్యుదయానికి కీర్తిపతాక

*** *** ***

నేటిని నిరసించి రేపుని స్వాగతించడం మానవుడి బలహీనత
ఇంటికొచ్చిన అతిథిని కంటగింపుగా చూసి
రేపు ఒరగదీస్తుందనుకోడం ప్రలోభం
ఇవాళ ముఖం చెల్లడం లేదని పెట్టిన ఇంటిని వీథిని పెట్టడం యిష్టం
లేదు
మళ్ళీ నేను వచ్చేనాటికి ఈ ఇంటిని తలచుకొంటే కష్టంగా వుంది-
2066
ఆ నాటికి పంచాగాలుంటాయని నమ్మకం లేదు
నా పేరు చెప్తే ఐడెంటిటీ సర్టిఫికేట్‌ అడిగే రోజులొస్తాయి-
ధృవాల్లో మంచు కరిగి సముద్రాలు ఆగ్రహిస్తాయి
దేశాలకి దేశాలను తమలోకి అతి క్రూరంగా కబళిస్తాయి
రేపటి ఉపద్రవాలకి నిన్నటి త్సునామి కేవలం మచ్చుతునక
కొన్ని క్షణాల భూమి కదలిక కొన్ని దేశాల భౌగోళిక పరిధుల్ని
చెరిపేసింది
దాని పేరు కట్రీనా అన్నా కంఠాభరణం అన్నా
నగరాలకి నగరాలు పునాదుల్తో కదులుతాయి
పీల్చే ప్రాణవాయువు మీద రేషన్‌
ఎవరి ఊపిరి డబ్బాల్ని వాళ్ళు మోసుకు తిరగడం ఆనాటి ఫేషన్‌
తాగే నీటిని కొనుక్కొనే సరదాని ఈ మధ్యనే ప్రారంభించాం
కొనుక్కోవాలన్నా దొరకని కొరతని అచిరకాలంలోనే ఆహ్వానిస్తున్నాం
నీటిని మిగుల్చుకోడానికి శతఘ్నులు పేలుతాయి
అన్నవస్త్రాలకోసం అణ్వస్త్రాలు చెలరేగుతాయి
ఇరవయ్యో పడిలోనే శరీరం అరవయ్యేళ్ళ అలసటని చూస్తుంది
అడవులు మాయమయి సిమెంటు జనారణ్యాల మధ్య
ఖరీదైన గోరీలకి మానవుడు ఇప్పట్నుంచే ఇటుకలు పేర్చుకుంటున్నాడు
పుష్పానికి ప్రతిఫలానికి చక్కని రాయబారుల్లాగ నిలిచిన
సీతాకోకచిలుక రసాయనపు జాడీల్లో నిన్నటి గుర్తుగా ఘనీభవిస్తుంది
పర్యావరణం పవిత్రంగా పలకరించదు
పూచిన మామిడులూ, శరత్కాలపు వెన్నెలలూ
నిన్నటికవుల కలల్లాగా, అభూత కల్పనల్లాగా దర్శనమిస్తాయి
చర్మం కుసుమ కోమలత్వాన్ని మరిచిపోతుంది
ఆకలికి ఆకులు నమిలే పశుప్రవృత్తి
సింథటిక్‌ పదార్థాలతో పొట్ట నింపుకొనే మానవుడిని
పరిహసిస్తున్నట్టనిపిస్తుంది
శ్రీనాథుడు ఉటంకించిన ద్రాక్షాపానక కండ శర్కరలు
రంభాఫలశ్రేణులు కట్టుకథల్లాగా కనిపిస్తాయి
అద్దంలో ముఖం చూసుకోడం ఇప్పట్నుంచే ప్రారంభించండి
ముఖం చెల్లని విషయం చెప్పడానికి ముందు ముందు ‘రేపు’ వుంటుందికాని
అద్దం వుండదు
కావలిసిన దానికన్నా ఎక్కువగా ప్రకృతిని దోచుకుంటూ
అక్కర్లేని బరువుని గ్రహానికి పంచుతున్నాం
పర్యావరణం ప్రకృతి బహుకరించిన వరం
కొల్లగొట్టడం మానవుడు అలవరుచుకొన్న వ్యాపారం
విజ్ఞానం విచక్షణకి విత్తులు నాటాలి
సంజాయిషీ అడగలేని రేపుని రేప్‌ చెయ్యకూడదు

*** *** ***

మీరెంత నన్ను ఈసడించుకున్నా
‘రేపు’ రక్షించడానికి ‘నేడు’ కు ప్రాణం పోయండని అంటూంటాను
కారు చీకట్లు ముసురుకొనే సుదూరపు భవిష్యత్తు లో
కాంతి కాంత వెతికినా పలకరించదని హెచ్చరిస్తూంటాను
తప్పులు ఎత్తి చూపే అవకాశాన్ని వార్షికంగా మోసుకువచ్చే సంప్రదాయాన్ని
గడిచే కాలానికి నా పేరు కేవలం గుర్తు
నడిచే మానవుడి గమనానికి నా రాక సైన్‌ పోస్ట్‌
దిక్చూచి తట్టుకున్నా ప్రయాణం ఆగదు
దిక్కులు చూస్తే చేరాల్సిన దిశగా ప్రయాణం సాగదు
హెచ్చరించడానికే కాదు, భుజం తట్టడానికీ వచ్చాను
పుష్ప బాణ శరుడినీ, ఎలకోయిల కూజితాల్నీ వెంటబెట్టుకు వస్తే
పగటి వేషగాడని వెక్కిరిస్తారని
మఫ్టీలోనే బిక్కుబిక్కుమంటూ వచ్చాను
మీ హితుడిని, స్నేహితుడిని
ఆత్మీయుడిని, భవిష్యత్తుని చదివే క్రాంతదర్శిని
మీరు చేస్తున్న దుబారాని పేరుతోనే హెచ్చరించే వ్యయాన్ని
అర్థం చేసుకుంటే అవ్యయాన్ని
రేపుకి ఆశీర్వాదాన్ని
అడుగులో అడుగులేస్తూ నడిచే ఆత్మబంధువుని
పేరు చూసి ముఖం తిప్పుకోకండి
అవసరమైతే చిరునవ్వుల్ని ఎరువు తెచ్చుకొని
ఆశల్ని ఆశాంతాలవరకూ అలంకరించుకొని
చేదు పచ్చడితో తీపి ఆలోచనల్ని రంగరించి
మంగళహారతులిచ్చి – ముంగిట్లో ఆహ్వానించండి
మంచు కొండలాగ పరవశించి
మీ జీవితాల్ని రస సింధువుల్ని చేస్తాను