ఎంగేజ్మెంట్ అయి రెండు నెలల పది రోజులు. ఎవరో తెలిసిన వాళ్ళ పిన్ని చికాగోనుండి న్యూయార్కు వచ్చినప్పుడు చెప్పిన సంబంధం, ఆవిడకు బాగా తెలిసిన వాళ్ళది. పైగా ఒకే కులం కూడా. తల్లిదండ్రులిద్దరికీ నచ్చింది. అతను చికాగోలోనే లాయరు. ఆమె న్యూయార్కులో ఒక కౌంటీకి పబ్లికు ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తుంది. ఓపిగ్గా ఎవరు అడిగినా సరే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పే అలవాటు ఆమెకుంటే అతనికి క్లయింట్లు మాట్లాడినంత సేపూ విని తను మాట్లాడిన వాటికి మాత్రం డబ్బు చార్జీ చెయ్యటం తెలుసు.
‘నువ్వు మాట్లాడినంత మా వాడు మాట్లాడితే క్లయింట్లు ఇచ్చుకోలేరు ‘, ఆ పిన్ని గారు చెప్పింది కూడా. సరే ఇదేదో బాగానే ఉంది అనుకుంది ఆమె. ఇద్దరూ మొదటి సారి ఫోనులో మాట్లాడుకున్నారు. ఒక సారి వీలయితే న్యూయార్కు రమ్మన్నది, అతడూ చికాగో రమ్మని అడిగాడు. మళ్ళీ వారం రోజులదాకా ఏ ఫోనూ లేకపోతే ఇంట్లో తల్లి ఏమైందని అడిగినా, ఇప్పుడేం మునిగిపోయిందని నీ గొడవ, అన్నట్లు చూసి తల తిప్పేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయిందే తప్ప మరి మాట్లాడలేదు.
అయినా ఆమెకేం, ఆర్నెల్ల క్రితందాకా తనకున్న ఒక ఇండియన్ బాయ్ ఫ్రెండును కాదని ఇట్లా ఎవరో ముక్కూ మొహం తెలియని వాణ్ణి ఎందుకు చేసుకోవాలి అనుకుంది మొదట. ఆ బాయ్ ఫ్రెండ్ వెధవ పెద్ద కంట్రోలింగ్ పర్సనాలిటీ అని తెలుసుకోవటానికి సంవత్సరం పట్టింది. తను ఒక వీకెండు సినిమాకు వెళ్ళటానికి ఆలస్యమయితే, ఎక్కడికి వెళ్ళిందీ, ఎందుకు లేట్ అయిందీ, ఎవరితో కలిసి షాపింగ్ వెళ్ళిందీ అని అడుగుతూ చంపుకు తినే వాడు. ఒకసారి వాడికి నచ్చిన డ్రెస్ వేసుకోలేదని రోడ్డు మధ్యలో దింపేసి ట్యాక్సీ తీసుకుని వెళ్ళమన్నాడు. ఎప్పుడూ అతనకి నచ్చే పనులే చెయ్యాలట. ముందు ముందు బాగానే ఉండేది, ఇవన్నీ తనమీద ప్రేమతో అడుగుతున్నవే కదా అని. వాడూ అట్లాగే చెప్పేవాడు. వాడిక ఆఫీసు టైం మధ్యలో ఫోను చేసి అక్కడే ఉన్నావా లేక ఇంకెక్కడికైనా వెళ్ళావా అంటూ తగులుతుంటే ఇక భరించలేకపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు టీనేజీలో అయితే ఇట్లాంటి వాటికి అనవసర రాద్ధాంతమని కొంత జడిసీ, మరింత అభద్రతా భావంతోటో లేక మిగతా వాళ్ళకేం చెప్పుకోవాలి అని మరికొంత, తెంచుకోవటానికి కష్టపడాల్సొచ్చేదేమో. ఏళ్ళొచ్చాక తనకేం కావాలో ఖచ్చితంగా తెలిసాక కూడా ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదని తేల్చుకుంది.
మార్గాలన్నీ ఆలోచించి, ‘నాన్న ఇంట్లోంచి వెళ్ళమన్నాడు ఒక్క పైసా ఇవ్వనంటున్నాడు, కారు కూడా లేదు రేపట్నించీ అంతా తన చాలీ చాలని జీతంతోటే బ్రతికెయ్యాలి ‘ అంటూ అతడినే పూర్తిగా సపోర్టు చేయమంది. ఆ నాటినుండి మళ్ళీ వాడు ఒక్కసారి ఫోను కూడా చెయ్యలేదు.
తను అతనితో తెగతెంపులు చేసుకుంటుందని చెప్పినప్పుడు అమ్మయితే, ‘పీడా విరగడైంది ‘ అంది. ఆవిడకు మొదటినుండీ ఆ పద్ధతి నచ్చలేదు. ఏదో ఇండియన్ అబ్బాయే కదా అని సరిపెట్టుకున్నారు కాని వాళ్ళకు కావల్సినట్టు తాము కుదిర్చిన వాడే ఉన్నట్లు ఉండేది కాదు అని ఆవిడ అభిప్రాయం. ఇప్పుడేమో ఈ సంబంధం గురించి, ఇంట్లో వాళ్ళ తొందర వాళ్ళది, ఇరవై ఎనిమిదేళ్ళొచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఇంట్లోనే ఉందని కొంత, లేకపోతే ఎప్పుడైనా తెలిసిన వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు మరికొంత.
సరే వాళ్ళ తృప్తి కోసం అనో, ఈ పిన్నిగారు చెప్పారనో, అమ్మా నాన్నలకు నచ్చిందనో కాకుండా, ఇదేదో బ్లయిండ్ డేట్ టైపులో అనుకుని ట్రై చేస్తే పోతుంది కదా అదీ కాక చికాగో అంటున్నారు కనుక న్యూయార్కు రొటీన్ నుండి కొద్ది రోజులైనా పారిపోవచ్చనుకుంది. ఒకవేళ సరైన వాడే అయితే అంతకన్నా ఏం కావాలి అనుకుంది కూడా.
అతనితో మొదటిసారి మాట్లాడిన తర్వాత శనివారం పొద్దున్నే వచ్చింది ఫోను. అతను ఇంకెవరో ఫ్రెండును కలవడానికి అదే సాయంత్రం న్యూయార్క్ వస్తున్నాడట. ‘వీలయితే సాయంత్రం ఎక్కడైనా డిన్నర్ చేద్దామా ‘, అడిగాడు. మరీ ఇంత ఇంప్రాంప్చ్యు అంటే ఎట్లా! అనుకుంది కానీ, ‘సరే తప్పకుండా ‘, అని మాటిచ్చింది. దిగుతూనే ఫోను చెయ్యమని, తనే సజెస్ట్ చేసింది మన్‌హాటన్ మధ్యలో ఉన్న రెస్టారెంటొకటి.
ఇంట్లో అమ్మానాన్నలకు చెబితే అదే ఆదివారం లంచికి పిలవమన్నారు. అతడు చూడటానికి చక్కగా ఉన్నాడు. ముప్ఫై ఏళ్ళ దాకా పెళ్ళి చేసుకోకుండా ఏం చేస్తున్నాడో లేక తన లాగే లవ్ ఫెయిల్ టైపో అనుకుంది. ఏదైతేనేం, చాలా మంది అమ్మాయిలే ఇతని చుట్టూ తిరిగి ఉంటారని అంచనా వేసుకుంది. గ్రేస్ ఫుల్ గా రిసీవ్ చేసుకున్నాడు లేచి కుర్చీ తనకోసం జరుపుతూ.
అతనే మాటలు కలిపాడు. మొదటి సారి కనుక కొద్దిగా పొడిగా సాగాయి మాటలు.
“మీ ఊరు కాబట్టి మీరే ఆర్డరు ఇవ్వండి”
“ఇక్కడ స్కాల్లప్స్ బాగుంటాయి, ఎపెటైజర్” చెప్పింది.
“సీ ఫుడ్ మీ ఫేవరైటా” అడిగాడు.
“అట్లా అని ఏం లేదు, మీకు అంతగా ఇష్టం లేదా?”
“లేదు లేదు నాకు కదిలే వస్తువేదైనా తినటం ఇష్టమే” చెప్పాడతను.
“మరీ మంచిది, కానీ మనుషులను తినరు కదా కొంపతీసి” నవ్వింది.
“మీరు నవ్వితే బాగుంటారు” అన్నాడతను.
“అది మీ పికప్ లైనా, ఎన్ని సార్లు వాడారేమిటి” మళ్ళీ నవ్వింది.
“నేను చెప్పింది నిజం, ఇదివరకు వాడిన సంగతి అబద్ధం” అతనూ శ్రుతి కలిపాడు.
అపెటైజర్ తో పాటు ఇద్దరూ చెరొక మార్టినీ సిప్ చేస్తూ ఉంటే, డిన్నర్ వచ్చింది.
“మీకు రాజకీయాలు ఇష్టమా? మా ఇంట్లో అంతా డెమోక్రాట్స్ మరి” అతను కట్టుకున్న టై చూస్తూ అడిగింది.
“అవును నేను డెమొక్రాట్, ఉత్తుత్తి డెమోక్రాట్ కాదు, యెల్లో డాగ్ డెమోక్రాట్” చెప్పాడతను.
“నేను కూడా, న్యూ యార్కులో మీకు మరొక రకం కనిపించరు, అంతా రిచ్ డెమోక్రాట్స్, అంతే” తనకూ పాలిటిక్స్ అంటే ఇష్టమే అని చెబుతూ.
“మరి మీ మేయర్ మాత్రం రిచ్, ఉత్తుత్తి రిచ్ కాదు బిలియనీర్ రిపబ్లికన్ కదా” చల్లటి మార్టినీకి సిప్ చేస్తూ అన్నాడు.
“అంతే, డబ్బున్న దోపిడీ దారులైతే ఇంకా ఎక్కువ దోచుకోలేరు కదా అని వాళ్ళనే ఎన్నుకుంటూ ఉంటాం, మేం డెమోక్రాట్స్ కదా, మాలో మేం రాసుకుంటే ఏం మిగుల్తుంది బూడిద తప్ప” అంటించింది.
“డెమొక్రాట్స్ సేవ్ దిస్ కంట్రీ, ఎవ్రీ టైం” ఒప్పుకున్నాడు.
అవును అన్నట్లుగా తలూపి, ఆదివారం అమ్మా నాన్నా అతణ్ణి చూడాలన్నారని చెప్పింది.
తప్పకుండా వస్తానని, ఇద్దరూ ఒక చిన్న హగ్ తో విడిపోయారు ఆనాటికి.
రెండో రోజు అతడు ఇంటికి వస్తే నాన్న తనకు చికాగోలో తెలిసిన వాళ్ళందరి పేర్లతోటి ఊదర కొట్టేసాడు.
అమ్మయితే చికాగోలో తను అటెండయిన తెలుగు ఫంక్షన్స్, వాటిలో తను కలిసిన ఆంటీలు, కొన్న చెత్త చెదారం అన్నీ ఏకరువు పెట్టింది. అతని అమ్మా నాన్నా వాళ్ళను కూడ కలిస్తే తప్పకుండా ఎక్కడో చోట చుట్టరికాలు కూడా కలిసే అవకాశం ఉంది అని తేల్చారు అంతా కలిసి.
అతణ్ణి తనే తప్పించింది ఆ ఇద్దరి బాధ నుండి. వాళ్ళకు అతడు వెళుతూ వెళుతూ అతని తల్లి దండ్రులు ఫోను నెంబర్లిచ్చాడు. డాడ్ వెంటనే చికాగోలో తనకు తెలిసిన, ఈ సంబంధం చెప్పిన పిన్ని, వాళ్ళకు కాల్ చేయటం, వాళ్ళు వచ్చే వీకెండుకి అమ్మాయిని పంపితే వెళ్ళి విషయాలన్నీ మాట్లాడతామని చెప్పటం జరిగిపోయింది.
ఆ తరువాత వారాంతమే చికాగో వచ్చింది పిన్ని వాళ్ళింటికి వచ్చినట్లుగా.
అతడు తనకు నచ్చిన రెస్టారెంటుకు తీసుకెళ్ళాడు ఆ శనివారం.
“మీకు ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమా” చుట్టూ చూస్తూ అడిగింది.
“ఏం మీకిష్టం లేదా, ఇక్కడ నాకు తెలిసిన సీ ఫుడ్ ప్లేసులు తక్కువ, మీరు మళ్ళీ సారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళతాను”
“చికాగో వదిలి వెళ్ళే ఉద్దేశ్యం ఉందా ఎప్పటికైనా” అడిగింది.
“చికాగో ఎవరైనా ఎందుకు వదిలి వెళతారు” ఆశ్చర్యపోతూ చూసాడు.
“ఏమో, ఒక వేళ మీకు ఇక్కడ చలికాలాలు నచ్చకపోతే, ఇప్పుడు కాకపోతే తరువాతెప్పుడైనా.”
“లేదు, చికాగో నాలో ఒక భాగం, ఇక్కడే స్కూలు, ఫ్రెండ్స్, ఉద్యోగం అన్నీ”
“నిజమే అన్నీ వదిలి వెళ్ళాలంటే కష్ఠమే. కానీ ఒక వేళ మీ భార్యకు చికాగో నచ్చకపోతే”
“అప్పుడు తప్పక ఆలోచిస్తాను.”
‘ఈ పొడి మాటలు తప్ప తామిద్దరూ పెద్దగా మాట్లాడుకునేదేం ఉండదా ఇప్పట్లో ‘, అనుకుంది. ఇక తమకు పిల్లలు పుడితే సైగలు తప్ప మాటలు రావేమో వాళ్ళకు అనే ఆలోచన వచ్చి నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియకపోయినా.
ఆ రోజు తనుండే అపార్ట్‌మెంటుకు తీసుకెళ్ళాడు. చక్కగా ఉంది రెండు బెడ్రూముల హై రైజ్ అపార్ట్‌మెంటు. కిచెన్ ఖాళీగా నీట్ గా ఉంది.
“ఇంట్లో వంట ఉండదా” అడిగింది.
“వంటా, అదేంటి, ఏదైనా వస్తువా” అడిగాడతను నవ్వుతూ. అతనకి నవ్వటమంటే ఇష్టం లా ఉంది.
“అయితే మీరు చేసుకునే వాళ్ళకు రోజూ బయటినుండి తెచ్చిన తిండే తినిపిస్తారన్నమాట”
“అప్పడు ఏదో ఒకటి చేస్తాం, ఇప్పటివరకూ ఇదే నా లైఫ్ స్టైల్, మార్చుకోవటం పెద్ద కష్ఠం కాదు, పార్ట్నర్‌షిప్‌లో కాంప్రొమైజెస్ తప్పవు కదా”
“పెళ్ళే ఒక కాంప్రొమైజ్ అంటారా”
“కాదా?” అడిగాడు.
తలూపి నవ్వింది.
నయమే, ఈ పాటికే మీద పడి పోయే మిగతా మగ వాళ్ళలా ఏమాత్రం చొరవ చూపటం లేదు అనుకుంది ఆమె.
రెండో రోజు ఆదివారం కూడా ఇద్దరూ కలిసి దీవాన్ స్ట్రీట్ లాంటి ఇండియా షాపులు చక్కర్లు కొట్టి, ఆంటీ ఇంటినుండే తల్లికి ఫోను చేసింది. ఆవిడ వెంటనే వచ్చెయ్యమా పెళ్ళీగురించి మాట్లాడ్డానికి అడిగింది.
“ముందతన్ని ప్రపోజ్ చెయ్యనీ మమ్మీ”
తరువాత వారం అతను న్యూయార్క్ ఈ సారి ఆమెను కలవటం కోసమే వచ్చాడు. మొదట కలుసుకున్నప్పుడు వెళ్ళిన మన్‌హాటన్ రెస్టారెంట్లో కూర్చున్నారు.
“మమ్మీ పెళ్ళి గురించి అడుగుతోంది”
“నువ్వు చెప్పు” అన్నాడు.
“మీరు ప్రపోజ్ చేస్తే చెప్తానన్నాను” అనింది నవ్వుతూ.
“చెయ్యనా అయితే” అడిగాడు నవ్వు కలుపుతూ.
“ఎంగేజ్మెంట్ ఒకటి అనుకుంటే పెళ్ళి తరువాత చేసుకోవచ్చు” తనే అనింది.
“అదే మంచిదని నీకు తోస్తే అట్లాగే చేద్దాం” అన్నాడు. “పెళ్ళి చేసుకుందాం కాని అంతకు ముందు ఎంగేజ్‌మెంట్ అంటూ ఒకటి అనుకుందాం, ఆర్నెల్లయాక ఒకరి గురించి మరొకరం ఇంకొంత తెలుసుకున్నాక పెళ్ళి చేసుకోవచ్చు.”
“అదీ నీకిష్ఠమైతేనే” చెప్పాడతను.
వెంటనే ఒప్పుకుంది. ఆ రాత్రి అమ్మతో చెబితే, ‘ఇదెన్నడూ వినలేదు, ప్రపోజ్ చేయటం పెళ్ళికైతే సరే, ఒక వేళ పెళ్ళికి రెడీ కాకపోతే ఎంగేజ్మెంటు మాత్రం దేనికి? అసలు పిల్లలు హద్దుల్లో లేకుండా పోయారు, చూడ్డానికి బాగానే బుద్ధిమంతుడిగానే అనిపించాడు. గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని అడిగే బదులు ఈ వెధవ్వేషాలు వేస్తున్నాడేమో, ఒకసారి పిన్నిని కనుక్కొని చెబుతాను ‘, అని విసురుగా నోటికొచ్చినవన్నీ అనేసింది.
“మమ్మీ వాట్ ఈజ్ ద ఆల్టర్నేటివ్” అడిగింది. “ఇష్టం లేక పోతే వద్దని చెప్పాలి అంతే కానీ అతడు చెప్పిన ప్రపోజల్ అది.”
“పెళ్ళి చేసుకోకపోవడానికి ఇదొక ఎక్స్‌క్యూజ్” ఈసడించింది తల్లి.
“నేను కాదు కూడదు అంటే పెళ్ళికి ఒప్పుకుంటాడు, అతనికి స్వంత అభిప్రాయాలు తక్కువ” అనింది.
డాడ్ మాత్రం కంపెనీల మెర్జర్స్ విడిపోవడాలు గురించి తెలుసు కాబట్టి, ‘ఇదే సరైంది ‘ అన్నాడు. ‘అతని గురించి మరికొద్దిగా తెలుస్తుంది, అమెరికాలో సగానికి పైగా జంటలు పెళ్ళైన పదేళ్ళలో విడిపోయేవే కదా, ఇట్లాగైనా ఇద్దరికీ ఒక అవగాహన వస్తుంది ‘ సమర్ధించాడు. ‘ఎంగేజ్మెంట్ అంటే ఏమిటి, మనం ఒక టాక్సీని లేక ఒక స్టాక్ ఆప్షన్ ఎంగేజీ చేసామనుకో, మనకు నచ్చకపోతే వదిలించుకుంటాం కదా, ఇది ఒక ఆప్షన్ లాగే చూడాలి ‘, డాడ్ వాల్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ ఉపయోగిస్తూ చెప్పాడు.
“పెళ్ళికి ముందే డైవర్స్ గురించి, తండ్రీ కూతుళ్ళిద్దరూ బాగున్నారు, దీన్ని ‘ఓన్లీ ఇన్ అమెరికా ‘ పుస్తకంలో చేర్చవచ్చు” తల్లి.
ప్లాను ప్రకారమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయింతర్వాత గత రెండునెలల్లో ఆమె రెండు సార్లు చికాగోకి వెళితే, అతను న్యూయార్కుకి ఒకసారి వచ్చాడు. చికాగోలో అయితే అతని అపార్టుమెంట్లో ఉండొచ్చు, అతను న్యూయార్కు వస్తే ఇంట్లో ఉన్నా తల్లీ తండ్రీ ఉంటారు గనక ఒంటరిగా గడిపే అవకాశం తక్కువ.
నెల క్రితం అతని అపార్టుమెంట్లోనే ఆదివారం తిరిగి న్యూయార్కు వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే అతనే అన్నాడు ‘పెళ్ళిగురించి మీ వాళ్ళేం అనడం లేదా ‘ అని.
“ఏం, పెళ్ళికి ఇప్పుడేం తొందర” అడిగింది.
“లేదు, నాకేం తొందర లేదు, నువ్వు ఎప్పుడు సరే అంటే అప్పుడే.”
“ఇదివరకంటే పెళ్ళి సెక్సుకు లైసెన్స్ లా పనికొచ్చేది, ఇప్పుడు ఎంగేజ్ మెంట్ జరిగితే చాలు కదా” ఆమె నవ్వింది.
“కరెక్టే, ఈ విషయాల్లో ఆడవాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి అనే వాళ్ళలో నేనూ ఒకడిని”
“మీలా ప్రతి అలవాటూ ఆలోచనా ఆడవాళ్ళకు నచ్చేలా ఉండే మగవాణ్ణి ప్రేమించడం కష్ఠం”
“అంటే అన్నీ మంచి ఉద్దేశ్యాలూ, అలవాట్లూ ఉండటం అనేది చెడు విషయమే అంటావా”
“పెళ్ళి చేసుకున్నాక ప్రేమ గురించిన ఆలోచన అక్కర లేనట్టే సెక్సు కోసం ఎంగేజ్ మెంటు చేసుకునే వాళ్ళకు ఎదుటివారి అలవాట్లు ఉద్దేశ్యాలతో పనేముంది” లోతుగా చూస్తూ అడిగింది.
అతను నవ్వేసాడు. “మనిద్దరి ఒప్పందం సెక్సు కోసమే అంటావా”.
“అనను, కానీ పెళ్ళికి సెక్సుకు ఉన్న సంబంధాన్ని తెంచేసేందుకు మన ఒప్పందం పనికొస్తుంది అంటాను”.
“మంచిదేగా, నీకు నన్ను పెళ్ళి చేసుకోవాలనిపించినప్పుడే చెప్పు, అప్పుడే చేసుకుందాం” అతనే చెప్పాడు.
ఈ సారీ మళ్ళీ ఆదివారం రోజే, మామూలుగానే అతను ఓ హేర్ ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడానికి వచ్చాడు. కాఫీ షాపులో చోటు వెతుక్కుని మూలగా కూర్చున్నారిద్దరు.
మాట్లాడేందుకేం లేదు అన్నట్లు వచ్చే పోయే జనాన్ని చూస్తున్నారిద్దరూ.
“మళ్ళీ సారి చికాగో వచ్చినప్పుడు ఇక్కడ కొత్తగా కట్టిన గుడికి వెళదాం” చెప్పాడతను.
“ఎందుకో నాకు గుళ్ళమీద గోపురాల మీద నమ్మకం తక్కువ” అనింది.
“సరే నీ ఇష్ఠం, లేక్ మీద విహారం చేద్దాం” అన్నాడు.
“నీళ్ళ జోలికి వెళ్ళక చాలానాళ్ళయింది” అనింది.
అతను కాఫీ కలుపుకుంటూ అన్నాడు “చూడు చికాగో కాఫీ ఎంత బాగుందో”.
“పెళ్ళి గురించి ఏమనుకున్నావు” అడిగింది.
“నువ్వు చెప్పు” అతను.
“నాకీ చికాగో వెదర్ పడేలా లేదు, న్యూయార్కు వచ్చెయ్యకూడదూ” ఆమె అంది.
“చికాగోలో నువ్వు ఒక సంవత్సరం ఉంటే మళ్ళీ ఎక్కడికీ కదలవు” అతను చెప్పాడు.
“న్యూయార్కు వదిలి నేనుండలేను”
“నన్ను న్యూయార్క్ లో జాబ్ వెతుక్కోమంటావా, అక్కడ వాల్‌స్ట్రీట్లో ఖచ్చితంగా పని దొరుకుతుంది”
“లేదు, నాకోసం వద్దు, న్యూయార్క్ నీకు పడకపోవచ్చు”
“అంతేనా” ఎటూ చూస్తున్నాడు అతను.
“అవును” చెప్పింది ఆమె.
“గుడ్ లక్” వెళుతూ చెప్పాడతను తనకలవాటైన మామూలు నవ్వుతో.
“థాంక్యూ, విష్ యూ ద సేం ” ఎందుకో కొత్త హుషారు పుట్టుకొచ్చింది ఆమెకి.