వానా పూలు ఇంద్రాణి కవిత్వం

వానచినుకు పడగానే
కవితలన్నీ తడిసిపోతాయి
నా మనస్సులోనే కరిగిపోతాయి
(వానచినుకు పడగానే)

అంటుంది తన మొదటి కవితలోనే ఇంద్రాణి.తడిసిపోయి మనసులోనే కరిగిపోయిన కవితల్ని కొట్టుకుపోకుండా ఎలా కాపాడుకుందోనని ఆత్రంగా చదివాను కవితలన్నింటినీ.

అంతా ఒక పూలవాన, పూల బాట, పూల స్పర్శ ఈ అమ్మాయి-

పూలలోనే పుట్టి పెరిగినట్టుంది
పున్నాగచెట్టు కిందే నిద్రపోయినట్టుంది
పిట్టలతోనే ఎప్పుడూ పాడినట్టుంది
పచ్చికమీదే ఎప్పుడూ నడిచినట్టుంది
పడవలోనే ఎప్పుడూ తిరిగినట్టుంది
పారే ఏరునే తన కళ్ళలో దాచినట్టుంది
(ఈ అమ్మాయి ఎంత బాగుంది)

ఎంత సున్నితమో అనిపిస్తుంది ఏ కవిత చదివినా.

పిల్లల గెంతులు
కాలువ నవ్వులు
పడవలని పడిపోనీకుండా
పట్టుకు నడుపుతున్నాయి… అంటుంది
(పిల్లలు-కాలువ లో)

పొద్దున్నయ్యింది అని చెప్పడానికి
మంచుతెరల పొరలు
ఊరుని విడిచి నడుస్తాయి… అంటుంది

అలాగే గ్రీష్మము గురించి చెప్పటానికి,
ఎండలో ఏమిచేయటం
తడిసిన వట్టివేళ్ళ వెనుక
తాటి ముంజెలు తినడం తప్ప… అంటుంది

శూన్యంలోంచి రాలిన పువ్వులా -వానకు తడిసిన పువ్వొకటి బావిలో రాలిపోయినా –

పాత కొమ్మని
కొత్త నీళ్ళని
చూస్తూ ఉందది
మార్చి మార్చి.. అంటుంది

పూల కొమ్మలా వంగి నడుస్తాను
పుప్పొడి అన్నివైపులా ఎగురుతుంది
పసి మొగ్గలా ముడుచుకు పోతాను
సుగంధం లోలోపలే బందీ అవుతుంది
పూలజడలా కదలక నిలబడతాను
తుమ్మెద ఒకటి వచ్చి వాలుతుంది
మల్లెదండలా ఒరిగి నిద్రపోతాను
దిండంతా సువాసన అద్దుకుంటుంది
(పూబాల లో అద్భుతంగా చెబుతుంది)

ఈ కవిత్వంలో అర్ధం కాని దేమీలేదు. పూలతోబాటు మనంకూడా తడుస్తున్న హాయి తప్ప. కవులకు ఒంటరితనం ఎంత ఇష్టమో. ఏదైనా కవిత పట్టుకు కుదుపుతున్నప్పుడు మరీనూ. అటువంటి సమయాల్లో –

ఎవరైనా ఎదురుతగలడం నాకిష్టం ఉండదు
ఎవరైనా వచ్చి పలకరించడం నాకిష్టం ఉండదు
ఎవరైనా దాక్కుని గమనించడం నాకిష్టం ఉండదు … అంటుంది నిక్కచ్చిగా (రాత్రి వీధిలో ఒంటరి).

కరెంటు పోయింది అని బాధెందుకు, ఎంచక్కా –

కళ్ళు మూసుకిని కాసేపు
సమాధిలోకి వెళ్ళిపోవచ్చు
కరిగిపోయిన జ్నాపకాల
సరిగమలలో సాంత్వన పొందొచ్చు… అంటుంది

పిల్లలు నిద్దరోతున్నారు కవితలో, పిల్లల నిద్రని చెడగొట్టొద్దని ప్రకృతిసైతం జాగ్రత్తపడుతుందని చాలా అందంగా చెబుతుంది. పూర్వీకులు కవితలో.

గాలిలోని గంధాలని
గతించిన స్వప్నాలని
గోడలమిద తగిలించి వెళ్ళారు .. అని చాలా అద్భుతంగా చెబుతుంది.

పూర్తికాని కవిత లో
కదిలే ఆకుల్లో గలగల
కిటికీ దగ్గరే ఆగిపోయింది…అని వాపోతుంది

అటువేపు ఏ పువ్వూ రాలదు
ఆమె ఎన్నడూ లోనికి రాదు…అని నిరాశ చెందుతుంది

గమనించారోలేదో నేను చెప్పిందంతా ఇంద్రాణి కవిత్వ భాషలోనే.. ఇంత చక్కని కవిత్వాన్ని అందించిన ఇంద్రాణి ఏ నిరాశకీ గురికాకుండా, ఏ గొడవల గొడుగుల్లోనూ చేరిపోకుండా ఉండాలనే ఆశ, ఆకాంక్ష. తనే చెప్పినట్టు –

ఆ గొడవలో, దుమ్ము కింద కప్పడి
ఆత్మ కనిపించకుండా పోతుంది
(ఏదో ఒక ఇసుక రేణువు)

ఇది మొదటి పుస్తకం అంటే నమ్మబుద్ది కాదు ఎవరికైనా. బయటపడకుండా ఇన్నాళ్ళూ దాగిఉన్న గుప్త నిధి ఇంద్రాణి కవిత్వం.మిత్రుడు భూషణ్ ముందుమాటతోను, ఇస్మాయిల్ పేర బహుమతితోనూ ఈమెని ప్రోత్సహించటం అన్ని విధాలా సముచితంగా ఉంది. కవిత్వాభిమానులే కాకుండా అందరూ కొని హాయిగా చదువుకుని ఆనందించ గలిగే కవిత్వం ఇది.
(దొరికే చోటు: విశాలాంద్ర, నవోదయ లో)