నా గురించి నేను

సాహిత్యం-భాషాశాస్త్రం

సాహిత్యంలో ఇంట్రెస్టే, కానీ ఒక్కటే ఇబ్బంది. సాహిత్యంలో నేను చేసే పని ఎవరైనా చేయవచ్చు అనిపిస్తుంది నాకు. నేను మాత్రమే చేయవలసినవి చాలా ఉన్నాయి. నాకు సమయం కూడా తక్కువ ఉన్నది. సాహిత్యంలో నేను చేస్తున్నది పరిశీలనా విమర్శ మాత్రమే. భాషాశాస్త్రంలో నేను అనేక ఆవిష్కరణలు చేశాను. ఆ రంగంలో నేను చేసినవాటికి తగినంత గుర్తింపు రాలేదు. నేను కూడా చేయగలిగినంత చేయలేక పోయాను. ఇప్పుడు నేను ఆ శేష బాధ్యతల పరిపూర్తి కోసం పనిచెయ్యాలనుకుంటున్నాను. భాషాశాస్త్రమే నా ‘ఫస్ట్ లవ్’!

కవిత్వం-విమర్శ

విమర్శను నేను తేలికపరచలేదు. సరళంగానూ రాయలేదు. నిజానికి నేను రెండు స్థాయిలలో సాహిత్య విమర్శను నిర్వహించాను. సదస్సులలో విద్యావిషయిక సభలలో పేపర్లు సమర్పించినప్పుడు పూర్తి శాస్త్ర పరిభాషను ఉపయోగించి విశ్లేషణలు చేశాను. సాధారణ సాహిత్యపాఠకులకోసం రాసినప్పుడు, పత్రికలలో కాలమ్స్ రాసినప్పుడు అటువంటి పరిభాష ఏదీ లేకుండా నా విశ్లేషణను సరళంగా అందించే ప్రయత్నం చేశాను.

మొదటి రకం విమర్శ భాషాశాస్త్రం తెలిసిన వారికి సంపూర్ణంగా దాని ఇంపాక్ట్‌తో సహా అర్థం అవుతుంది. రెండో రకం విమర్శ సాహిత్యపాఠకులకు నా విశ్లేషణలోని సారాంశాన్ని అర్థం చేయిస్తుంది.

చేరాతల విజయరహస్యం

నా భాషా శాస్త్రీయ రచనల కంటే నా సాహిత్య రచనలు ఎక్కువ పేరు తెచ్చాయి. సాహిత్య రచనలలోనూ చేరాతల వల్ల ఎక్కువ పేరు వచ్చింది. పేరు రావడం అంటే ఎక్కువ మంది వాటిని ఇష్టపడ్డారు. అట్లా ఇష్టపడడానికి కారణాలలో అవి ప్రధానంగా కవిత్వం మీద ఉండడం ఒకటైతే, నేను పాటించిన మెథడాలజీ మరొకటి. నేను కొన్ని కవితలలోని నిర్మాణ పద్ధతులను విశ్లేషించి అందించేసరికి అది కొత్తగా అనిపించింది. నిజానికి కవులు, పాఠకులు కూడా కవిత్వ నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు.

వస్తువు-రూపం

సాహిత్యంలో విమర్శ వస్తు చర్చతో ముగిసిపోదని నా అభిప్రాయం. అభ్యుదయవాదులు కవిత్వంలో వస్తువే ప్రధానమనీ, వస్తువే రూపాన్ని నిర్ణయిస్తుందనీ కొన్ని అర్థరహితమైన అభిప్రాయాలను ప్రచారంలో పెట్టారు. అవన్నీ పడికట్టు మాటలు. వస్తువే రూపాన్ని నిర్ణయించే మాటయితే వేరువేరు రూపాలలో కనిపించే ఒక వస్తువు సంగతేమిటి? బసవ పురాణాన్ని పాల్కురికి సోమన ద్విపదలో రాస్తే, పదపర్తి సోమన పద్యాలలో రాశాడు. రామాయణం ప్రజల పాటలలో దగ్గరినుంచి మహాకావ్యాలలో దాకా కనిపిస్తుంది. వస్తువును రూపాన్ని ఆ పద్ధతిలో యాంత్రికంగా అర్థం చేసుకోగూడదు. ఫలానా కావ్యంలో ఫలానా వస్తువు ఉంది అని చెబితే సాహిత్య విమర్శ అయిపోతుందా? నిజానికి అక్కడే సాహిత్య విమర్శ ప్రారంభమవుతుంది.

వస్తువు, రూపం అని మనం మాట్లాడుతున్నామంటే అవి రెండూ వేర్వేరు అని కాదు. మనం అధ్యయన సౌలభ్యం కోసం వాటిని రెండుగా తీసుకొని పరిశీలిస్తున్నాం. ప్రత్యేక నిర్మాణపద్ధతి లేనిది కవిత్వమే కాదు. విమర్శకుడు ఆ పద్ధతిని కనిపెట్టగలగాలి. నిర్మాణ పద్ధతి అంటే ఫలానా వస్తువును ఎటువంటి పద్ధతిలో చెప్పామనే తప్ప, కేవలం పద్ధతి ఉనికిలో ఉండదు కదా! అసలీ రూపవాదమనే మాటను ఒక తిట్టుగా ఉపయోగించి తరువాత కాలంలో బ్రిటిష్, యూరోపియన్ మార్క్సిస్టులు సవరించుకున్నారు. మన భారతీయ మార్క్సిస్టులు మాత్రం ఇంకా అదే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. రూపమే సర్వస్వామనే దృష్టి నాకు లేదు. అయితే, వస్తు సర్వస్వ దృష్టితో రూపాన్ని అశ్రద్ధ చేసినందువల్ల ఆ ఖాళీని పూరించడానికి ప్రయత్నించాను. నేను చేసింది కాంప్లిమెంటరీ కృషే.

పద్యం

రూపం విషయంలో నాది వాస్తవిక దృష్టి కాబట్టే, పద్యం గురించిన ‘ఆధునిక మూఢ విశ్వాసాల’తో నేను ఏకీభవించలేక పోతున్నాను. పద్యంలో ఉన్నదంతా ఫ్యూడల్ అనీ, కవిత్వంలో ఛందస్సు ఉండడం మహాపాపం అనీ ఇటువంటి కొన్ని నమ్మకాలను ప్రచారంలో పెట్టారు. ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు. ఆయన మాత్రం ప్రాచీన సాహిత్యం చదివి పాండిత్యాన్ని, భాషాపాటవాన్ని పెంచుకున్నాడు.

విరసంకు దగ్గరగా, దూరంగా

1958లో నేను బి.ఎ. పరీక్ష తరువాత భద్రిరాజు కృష్ణమూర్తి ప్రారంభించిన వ్యవసాయ వృత్తి పదకోశంలో పదసేకరణకు పర్యాటకుడుగా ఉద్యోగం చేశాను. ఆ సందర్భంగా శిక్షణ కోసం విశాఖ వెళ్ళాను. అప్పటికీ నాకు విశాఖ కొత్తే. నాయుని కృష్ణకుమారి నన్ను భద్రిరాజుకు సిఫారసు చేశారు. అప్పటికి నాకింకా పాతికేళ్ళ వయస్సు లేదు. అయితే, అప్పటికే కవిగా కాస్తా పేరు సంపాయించుకున్నాను. ముఖ్యంగా తెలుగు స్వతంత్ర పత్రికలో విషయసూచిక పక్క పేజీలో నా కవితా అచ్చు అయ్యేది (ఆ రోజుల్లో ఆ పేజీ చాలా ప్రధానమైనది). అంతకు ముందు సంచికలో స్వతంత్రలో “ధర్మ సంస్థాపనార్థాయ” అనే కవిత అచ్చు అయ్యింది. అది శ్రీశ్రీ మీద రాసిన కవిత. అప్పటికి శ్రీశ్రీ కవిత్వం మానేసి సినిమాల్లోకి వెళ్ళాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశ్రీని ఉద్భోదిస్తూ — మళ్ళీ కవిత్వం రాయమని అభ్యర్థిస్తూ — ఆ కవితా రాశాను. ఆ కవితా ద్వారా నాకు చాలా మందితో, ముఖ్యంగా శ్రీశ్రీ అభిమానులతో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అయిన వాళ్ళలో తుమ్మల కృష్ణబాయి, విరసం (చలసాని) ప్రసాద్, హరి పురుషోత్తమరావు ముఖ్యులు.

ఆ రోజుల్లో మా ఈడు వాళ్ళందరికీ శ్రీశ్రీ అంటే చాలా అభిమానం. దాదాపు శ్రీశ్రీ భక్తులం. పుస్తకరూపంలో రాని శ్రీశ్రీ రచనలు పత్రికల్లో నుంచి తీసి రాసుకుని చదువుకొనే వాళ్ళం. హరి, నేను, ప్రసాదు అల్లా ఉండేవాళ్ళం.

నాంపల్లి స్టేషన్ దగ్గర ఒక హోటల్లో జులై 3 తెల్లవారు ఝామున (1970 జులై 4న) విరసం ఏర్పడింది. అప్పుడు ఆ మీటింగులో రాత్రంతా చర్చలు జరిగాయి. అప్పుడు అక్కడ కె. వి. రమణారెడ్డి, వరవరరావు, ప్రసాద్, హరి, నేను ఉన్నాం. శ్రీశ్రీ కూడా ఉన్నాడు. ప్రణాళిక తయారయ్యింది. సంతకాలు చేశాం. అరసం మీటింగ్ కోసం వచ్చిన శ్రీశ్రీ విరసం తొలి అధ్యక్షుడయ్యారు. అరసం వారు జులై 3 రాత్రి శ్రీశ్రీ నాటిక ఒకటి వేశారు. రహస్యంగా ఆ నాటిక చూసి వస్తాననే వారు శ్రీశ్రీ. మేం వేస్తాంలే అని చెప్పి కె.వి. ఆర్. సముదాయించారు.

అప్పుడా సభలో శ్రీశ్రీని తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన వాడు హరి. ఆ రాత్రి, తెల్లారి శ్రీశ్రీతోనే ఉన్నాడు. అయితే, కొన్ని కారణాల వల్ల హరి, నేను విరసం సభ్యులుగా చేరలేదు. ఆ తరువాత విరసం కోసం చందాలు స్వీకరించాం, మీటింగులకు హాజరయ్యాం. విరసం సభ్యులు చేసే పనులన్నీ చేశాం. కానీ, సభ్యులుగా మాత్రం చేరలేదు.

స్మృతికిణాంకం

వ్యక్తిగత స్పర్శ కలిగిన, కొన్ని సొంత జ్ఞాపకాలు, కొంత చరిత్ర కలిసిన ఈ వ్యాసాలు చాలా మందికి నచ్చాయి. నాకు అనేక రకాల వచనం ఇష్టం. స్మృతికిణాంకంలో ఉన్నది ఎమోషనల్ వచనం. తెలుగు వచనం మీద నాకు ప్రత్యేకంగా కృషి చేయాలని ఉన్నది. సాహిత్య అకాడమీ వారు ఈ పుస్తకానికి బహుమతి ఇస్తున్నారంటే, రచయిత చేసిన మొత్తం సాహిత్య కృషిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చారని అర్థం చేసుకోవాలి.

తెలుగు వచనం

తెలుగువచనంలో శైలీ భేదాల గురించి ఒక పరిచయ పుస్తకాన్నయినా రాయాలని ఉన్నది. దానికోసం ఇప్పటికే విస్తారంగా సమాచారం, నోట్స్ సేకరించాను. వచనం గురించి చాలా తప్పుడు అభిప్రాయాలూ ఉన్నాయి. ‘అంటరాని వసంతం’ నవలను దానిలోని కవితాత్మక వచనం కోసం మెచ్చుకున్న వాళ్ళను చూశాను. ఆ నవల గొప్పదనం అది చిత్రించిన మూడుతరాల దళిత జీవిత కేన్వాసులో ఉన్నది తప్ప, కళ్యాణరావు కాలంలో పలికిన కవిత్వ వచనంలో కాదు. సూటిగా పచ్చి వచనం రాయడం మీద ఎవరికీ గౌరవం లేదు. పత్రికలనిండా కవిత్వపు శీర్షికలే. మంచి వచనం అంటూ ఆబ్సల్యూట్గా ఏదీ ఉండదు. సందర్భానికి తగినట్టుగా ఉండే వచనమే మంచి వచనం. సందర్భం, శైలి ఎంత బాగా పరస్పరం ఒదిగిపోతాయో అప్పుడు వచనం అంతా బాగా ఉంటుంది. మన భాషలో సాంస్కృతిక ఛాయలు దట్టంగా అలుముకుని ఉంటాయి. అటువంటి భాషను బౌద్ధిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయత్నం అవసరం. ఇంగ్లీషు భాషలో ఇటువంటి సమస్యలన్నిటినీ చరిత్రే పరిష్కరించింది.

భవిష్యత్ కార్యక్రమం

బాలప్రౌఢ వ్యాకరణ సూత్ర పద్ధతిమీద అధ్యయనం చేయాలని నాకున్నది. చేస్తే, నేనే చెయ్యాలి. వ్యాకరణాలను సంప్రదాయ పద్ధతిలో చదువుకుని ఉండి, భాషాశాస్త్రంలో అత్యాధునిక మార్గాలను అధ్యయనం చేయడం అన్న సదుపాయం నాకే ఉన్నది. ఇప్పటి లింగ్విస్టులు బాలవ్యాకరణం చదవరు. బాలవ్యాకరణం చదివే వారు లింగ్విస్టిక్స్ చదవరు. అలాగే, ఛందస్సు గురించి కూడా. నజభజజజర అంటే ఛందస్సు అయిపోదు. దానిలోని లయ ఏమిటో చెప్పగలగాలి. ఇప్పటి తరానికి ఛందస్సు, వ్యాకరణం చదవకపోవడం అభివృద్ధి. మరి నేను కాకపోతే, ఈ విషయాల గురించి మరెవరూ చెబుతారు చెప్పండి. మళ్ళీ సాహిత్యంలో పడితే ఇవన్నీ మూలన పడతాయి. ఇప్పుడు నేను సాహిత్యం నుండి బయటికి పోలేదు. కాకపోతే, మునుపటివలే రాయడం లేదు. నా కృషి వేరే రంగంలో వేరే పద్ధతిలో సాగుతున్నది.

[2002 కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం తరువాత అనేక సందర్భాలలో, వ్యాసాలలో వెలిబుచ్చిన అభిప్రాయాల సంకలనం ఇది. ఈ వ్యాసాలను అందజేసిన సంధ్య చేకూరి గారికి మా కృతజ్ఞతలు. – సం.]