ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) సంస్మరణ

మొన్న సెప్టెంబరు 25న సాహిత్యోపాధ్యాయుడు, సాంస్కృతిక సిద్ధాంతకారుడు, రాజకీయ ఉద్యమకారుడు అయిన ఎడ్వర్డ్‌ సయీద్‌ (Edward Said) న్యూయార్కు నగరంలో కన్నుమూసాడు. ఈ అసామాన్యమైన విద్యావేత్త సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు చేసిన సేవను ఈ వ్యాసంలో గుర్తు తెచ్చుకుందాం. సయీద్‌ జీవితంలో చేసిన కృషి, పంచిపెట్టిన జ్ఞాన సంపద, చిన్న వ్యాసంలో ఇమిడేవి కావు. అయినప్పటికీ, ప్రపంచ సంస్కృతి యొక్క విశ్లేషణకు ఆయన చేసిన కృషి గురించి, ఆజన్మాంతం పాలెస్తీన ప్రజలకి ఆయన అందించిన ప్రోద్బలం గురించీ ఈ వ్యాసంలో చర్చించుకుందాం.

సయీద్‌ పాలెస్తీన లో క్రైస్తవ తల్లిదండ్రులకు 1935లో పుట్టాడు. ఆయన బాల్యం చాలా వరకు కైరోలో గడిచింది. ఆ తర్వాత అమెరికా వచ్చి ప్రిన్‌స్టన్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో పై చదువులు పూర్తి చేసాడు. అప్పటి నుంచీ మొన్న మొన్నటి వరకూ న్యూయార్కు నగరం లోని కొలంబియా యూనివర్సిటీలో Comparative literature అధ్యాపకుడిగా ఉన్నాడు.

సయీద్‌ రచనలు మనమెందుకు చదివి అర్థం చేసుకొవాలి? ఓ రెండు ఉదాహరణలు చెప్పుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం స్ఫురించవచ్చు. 19వ శతాబ్దంలో మరుగున పడిపోతున్న తెలుగు భాషను రక్షించి, వెలుగు లోకి తేవడానికి సి. పి. బ్రౌన్‌ మహాశయుడు ఎంతో దోహదం చేసాడని మనకి చెప్తారు. ఆయన ఇంగ్లీషుతెలుగు నిఘంటువుకు ముందుమాటలో ఇలా రాసారు “… English contains many expressions which are hard to convey in any languages known to the Hindus…Some years must elapse before the clearest explanation of some words (for instance, instinct, liberty) will become easy to the Telugus, Tamils or the Kannadis.” ఈ మాటలు కేవలం ఒక విద్యావేత్త మన భాషల మీద జారీ చేసిన హితవైన వ్యాఖ్యానాలు మాత్రమే కావని సయీద్‌ రచనలు చదివాక మనకర్థమవుతుంది. అసలు liberty అనే ఆంగ్ల పదానికి సరిసమానమైన మాటే తెలియని నల్లవాడికి ఆ పదంలోని భావం అర్థమయ్యి, వాడు దాస్య విముక్తి కోరుకునే ప్రమాదం లేదుకదా! ఈ “విద్వత్తు” నల్లవాడి మీద అధికారం చలాయించేందుకు కారణం కల్పిస్తుందని సయీద్‌ దృక్పథం. మరో ఉదాహరణకొస్తే, చిన్నప్పుడు మనం Jane Austen, Charles Dickens, Rudyard Kipling ఇంగ్లీషులో రాసిన పుస్తకాలు చదువుకున్నాం. వీళ్ళంతా గొప్ప సాహిత్యవేత్తలుగా మనకి పరిచయం అయ్యారు. అయితే ఈ పుస్తకాల్లో ఐరోపేతర సాంప్రదాయాలను గురించి హీనమైన చిత్రీకరణలు దాగి ఉన్నాయని మనకు తెలియలేదు. పాశ్చాత్య సాహితీ సంస్కృతులలో ఐరోపేతర సాంప్రదాయల గురించి నిగూఢమైన నిర్మాణాలున్నాయనీ, వాటికి పరస్పర విరుద్ధంగా నిర్మితమైనదే “పాశ్చాత్యం” అనే రూపమనీ, అరుదైన స్పష్టతతో సయీద్‌ వెలికితీసాడు. సయీద్‌ రచనలు చదివి, అతని దృక్పథం నుంచి ఆలోచిస్తే, ప్రపంచ సాహిత్యాలని మనం సరికొత్త కోణాల నుంచి చూసి అర్థంచేసుకోగలం.

సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సయీద్‌ ప్రతిపాదించిన ముఖ్యవిషయాలు “ Orientalism”, ”Culture and Imperialism” పుస్తకాల్లో ఉన్నాయి. Orientalism అంటే ప్రాచ్యదేశాలను “తెలుసుకునే” ప్రయత్నంలో, వివిధ సంస్థల ద్వారా, అనేక శాస్త్రాల్లో యూరోప్‌ వాసులు చేసిన పరిశోధనల ఫలితంగా చిక్కబడిన దృక్పథం అని చెప్పవచ్చు. ఈ పరిశీలనా పద్ధతి ఎన్నో శతాబ్దాలుగా వస్తూనేవున్నా, 19వ శతాబ్దపు సామ్రాజ్యవాదపు యుగానికి పతాక స్థాయిని చేరుకుంది. యూరోప్‌ వాసులు ప్రాచ్యదేశాలను పరిశోధించడానికి కనిపెట్టిన పద్ధతులే ఆయా దేశాలపై సామ్రాజ్య వాద పాలన సాగించడానికి సాధనాలుగా కూడా పనిచేసాయన్నది సయీద్‌ ఇక్కడ చెప్పిన ముఖ్య విషయం. జ్ఞానానికీ, అధికారానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే, ఫ్రెంచి తత్వవేత్త మిషెల్‌ ఫూకో ( Michel Foucault, 192684) వాదన అర్థం చేసుకోవాలి. ఫూకో దృష్టిలో ఏ సమాజం లోనైనా జ్ఞానం అన్నది నిష్పక్షపాతమైన సత్యశోధన వల్ల మాత్రమే జన్మించదు. జ్ఞానానికీ, అధికారానికీ విడదీయరాని సంబంధం ఉంది. అంటే ఫూకో దృష్టి లో అధికారమనేది కేవలం (పోలీసుల అధికారంలాగా) బలప్రయోగానికి మాత్రమే కాక, జ్ఞానసృష్టికి కూడా దోహదపడుతుంది. ఆ సృష్ట్ఘించిన జ్ఞానం అధికారానికి పనికొస్తుంది. సయీద్‌ ఈ భావాన్ని అన్వయించి, పాశ్చాత్యులు ప్రాచ్యదేశాలను గురించి చేసిన పరిశోధనను గురించి వ్యాఖ్యానించాడు. పాశ్చాత్యులు ప్రాచ్యదేశాలను గురించి “తెలుసుకుంటూ,” “ప్రాచ్యము” ( the orient) అన్న ఒక ఊహా చిత్రాన్ని సృష్టించారు. ఆ “తెలుసుకోవటం” లోనుంచే వాళ్ళ అధికారం పుట్టిందని అన్నాడు సయీద్‌ . ఈ ప్రాచ్యాన్వేషణ సాగించిన పాశ్చాత్య విద్యావేత్తలూ, సంస్థలూ, ప్రభుత్వాలూ అన్నిటికీ అధికారం ఉండడం చేత, వాళ్ళకు తెలిసిందే నిజమని అందరినీ నమ్మించగలిచారు. వాళ్ళే “ప్రాచ్యదేశీయులు,” “పాశ్చాత్యులు”, అన్న కాల్పనిక భావ నిర్మాణాలు చేసారు. ప్రాచ్యదేశీయులతో భిన్నత్వమే పాశ్చాత్యులకొక స్పష్టమైన అస్తిత్వం కలగజేసింది. ప్రాచ్యదేశీయులకు చారిత్రిక జ్ఞానం ఉండదు, తమ ఉనికిని గురించి స్ఫురణ అసలే ఉండదు. అందుచేత వారిని వస్తువుల లాగా పాశ్చాత్యులు పరిశీలించవచ్చు, వారి మీద గ్రంథాలు వ్రాయవచ్చు. అలాగే వాళ్ళు ఆదిమ దశలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి, “వాళ్ళ”ని నాగరికులుగా తీర్చిదిద్దే బాధ్యతా, వాళ్ళని అదుపులో పెట్టే బాధ్యతా, “మన”మీద, అంటే పాశ్చాత్యుల మీద ఉన్నాయి. ఈ విధంగా ప్రాచ్యదేశీయులను గురించిన జ్ఞానమూ, వాళ్ళ మీద అధికారమూ, రెండూ సామ్రాజ్యవాదానికే సహాయపడ్డాయి.

“Culture and Imperialism” అనే పుస్తకంలో సయీద్‌ పాశ్చాత్య సంస్కృతికీ (ముఖ్యంగా యూరొప్‌ సాహిత్యానికీ,) సామ్రాజ్యవాదానికీ ఉన్న అన్యోన్యతను సూక్ష్మంగా పరిశీలించాడు. ఇక్కడ సయీద్‌ అనేదేమిటంటే యూరొపియన్ల సామ్రాజ్య వాదం కేవలం ఆర్థిక కారణాల వల్ల మాత్రమే కొనసాగలేదు. అందులో ప్రాచ్యదేశాల ప్రజలను “నాగరీకులు”గా తయారుచెయ్యాలన్న ఒక దురహంకారం కూడా ఉంది. ఈ విషయంలో సయీద్‌ మనకి 19వ శతాబ్దపు బ్రిటీష్‌ తత్వవేత్త John Stuart Mill మాటలు గుర్తుచేసాడు. బ్రిటీషు వాళ్ళు భారతదేశంలో ఎందుకు వున్నారు అన్న ప్రశ్నకు జవాబుగా Mill ఇలా అన్నాడు, ” because India requires us, that these are territories and peoples who beseech domination from us and that… without the English India would fall into ruin.” ఇలాంటి దురహంకార భావం యూరొప్‌ సంస్కృతి నిండా ఉందన్నది సయీద్‌ వాదన. ప్రాచ్యదేశాలలో “నాగరికత” పంచి పెట్టే కార్యక్రమాన్ని ఈ భావమే ప్రోత్సహించింది.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సయీద్‌ వాదనలు ఎలా ఉపయోగపడతాయి? నాటికీ, నేటికీ ప్రాచ్యదేశీయులను గురించి పాశ్చాత్యుల అభిప్రాయాలు పెద్దగా మారలేదు. ఇస్లాం, తీవ్రవాదం, అనాగరికత, వెనకబడినతనం, ఇవన్నీ పర్యాయపదాలుగా వాడటం మనం చూస్తునే వున్నాం. ఇటువంటి నిర్మాణాలను తీవ్రంగా ఖండించాలి అంటాడు సయీద్‌ పాశ్చాత్యులు ప్రాచ్యదేశాల మీద ఉన్న ఊహాజనిత భావాలను తమ సొంత లాభం కోసం ఎలా వాడుకుంటున్నారో బయటపెట్టాలి. అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ ఈ పాశ్చాత్య దురహంకార ధాటిని గట్టిగా ఎదుర్కోవాలి. ఇక్కడ ఎదుర్కోవడం అంటే కేవలం ప్రతిఘటించడమూ కాదు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నామమాత్రంగా నినాదాలు చేయడమూ కాదు. మరుగున పడి, పక్కకు తోయబడిన చరిత్రలను పునర్నిర్మించి, ఒక సార్వత్రికమైన అస్తిత్వాన్ని నెలకొల్పాలన్నదే మనకు సయీద్‌ చెప్పిన పాఠం. మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే, “ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు “. అయితే, జాతీయవాదం సామ్రాజ్యవాదాన్ని ఎదురుకోవటానికి పనికొచ్చినా, అది పరాయి దేశాలంటే ద్వేషంగా మారి, అమలినమైన జాతీయ చైతన్యం కొరకు నిరంతర శోధనగా పక్కదారుల పట్టే ప్రమాదం ఉందని కూడా సయీద్‌ హెచ్చరించాడు.

ప్రపంచాన్ని పునఃపరిశీలించడమే కాక, మార్చుదామని కూడా సయీద్‌ నడుం కట్టాడు. (“ Philosophers have hitherto only interpreted the world in various ways; the point is to change it.”) చివరి రోజు వరకూ పాలెస్తీన ప్రజల హక్కుల కోసం వాదించాడు. “ The question of Palestine” అన్న పుస్తకం లోనూ, అనేకానేక వ్యాసాల్లోనూ, ప్రసంగాల్లోనూ, పాలెస్తీన విషయంపై ఆయన అభిప్రాయాలని వ్యక్తం చేశాడు. నిజానికి సయీద్‌ రచనలన్నింటి లోకీ ఎక్కువ శాతం పాలెస్తీన విషయంపై రాసినవే. పాలెస్తీన లో పుట్టడం, యాభై ఏళ్ళు అమెరికా పౌరుడిగా జీవించడం, విద్యారంగంలో హేమాహేమీల లాంటి మేధావుల మధ్య పని చెయ్యడం, ఇవన్నీ సయీద్‌ కి ఒక విశిష్టమైన దృక్కోణాన్నిచ్చి, ఆయనకి ఈ రచనలన్నీ చేసే అవకాశాన్ని కల్పించాయి. ఇస్రాయిల్‌ పాలెస్తీన మధ్య పోరాటాన్ని గురించి అమెరికాలో వాగ్వివాదాలు విని సయీద్‌ ఒక ఆశ్చర్యకరమైన విషయం గ్రహించాడు. అదేమిటంటే, 1948 ముందు పాలెస్తీనలో పాలెస్తీన ప్రజలంటూ ఎవ్వరూ లేరని అంతా ఎవరికి వారే అనేసుకుని, అదే నిజమని నమ్ముతూ ఉన్నారు. పాలెస్తీన ప్రజల వాస్తవమైన ఉనికినీ, వారి సంస్కృతినీ అమెరికా ప్రజలకు తెలియజేద్దామని సయీద్‌ నిర్ణయించుకున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఆయన తలబెట్టిన కార్యం, “[ to] try and change the public consciousness in which Palestine had no presence at all.” పాలెస్తీన విషయంలో సయీద్‌ కి ఒక విశిష్టమైన దృక్పథం ఉంది. ఇస్రాయిల్‌ రోజూ పాలెస్తీన ప్రజలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మారణ కాండను ఎలా దుమ్మెత్తిపోసాడో, పి. ఎల్‌ ఓ., తదితర సంస్థల హింసనూ అలాగే ఖండించాడు. ఒక స్వతంత్ర మేధావిగా తన ఉనికిని ఆయన చివరి వరకూ కాపాడుకున్నాడు. ఆయన ఎంత స్వతంత్రుడంటే పి. ఎల్‌ ఓ. నాయకత్వాన్నీ, యాసిర్‌ అరాఫత్‌ ని ఎన్నో సందర్భాల్లో అవినీతిపరులని విమర్శించాడు. విచారకరమైన విషయమేమిటంటే ఏ పాలెస్తీన ప్రజల బాధనైతే సయీద్‌ ప్రపంచానికి తెలియజేద్దామని పూనుకున్నాడో, అదే పాలెస్తీన లో ఆయన పుస్తకాలు కొనడం, చదవడం నిషిద్దం.

1993కు పూర్వం చాలా కాలం పాటు సయీద్‌ Palestine National Council సభ్యుడిగా ఉన్నాడు. అయితే క్రిందటి పదేళ్ళలో, అమెరికా ఆధ్వర్యంలో జరుగుతూన్న ఇస్రాయిల్‌పాలెస్తీన శాంతి చర్చల పట్ల ఆయన విసుగును వ్యక్తం చేసాడు. చర్చల, ప్రణాళికల, లావాదేవీల మధ్యలో అన్ని పక్షాల వారూ (పాలెస్తీన ప్రతినిధులతో సహా) పాలెస్తీన ప్రజల శ్రేయస్సును, వారి కనీస హక్కులనూ మరిచిపోయారని ఆయన అభిప్రాయపడ్డాడు. అతి అమానుషమైన దైనందిన పరిస్థితులలో కూడా పాలెస్తీన ప్రజలు కవిత్వం రాసుకొని, సంగీతం పాడుకొని, కలలు కని, వారి మానవత్వన్ని సగర్వంగా కాపాడుకుంటున్నారని ప్రపంచానికి ఆయన గొంతెత్తి చాటాడు. పాలెస్తీన ప్రజలపై రోజూ జరిగే అవమానాల, అత్యాచారాల జాబితా దినపత్రికలలో ప్రచురితమవ్వని విషాదగాథ అని అవకాశం దొరికినప్పుడల్లా ఆయన గుర్తు చేసాడు. న్యాయానికీ, మానవ హక్కులకీ జీవితమంతా ఎడతెగని నిబద్ధత చూపిన ఎడ్వర్డ్‌ సయీద్‌ ప్రపంచ పీడిత ప్రజలకు ఒక ఆశా కిరణంలా మెరుస్తూనే వుంటాడు.