తేనెటీగలు

జీన్‌ కొడుకు ఫ్రాంకీ అరుస్తూ లేచాడు. ఈ మధ్యన ఈ అరుపులు ఎక్కువయ్యాయి   వారానికి రెండు, మూడు సార్లు, రాత్రి మూడింటికీ, ఐదింటికీ కూడా. ఇదిగో మళ్ళీ గీపెడుతూ ఓ గట్టి కేక పదునైన పళ్ళతో జీన్‌కీ, నిద్రకీ సంబంధాన్ని తెగ్గొట్టింది. అది జీన్‌ ఊహకి కూడా అందని అసహ్యమైన కేక, పిల్లాడు చచ్చిపోతున్నట్లు పెద్ద ఎత్తు నుంచి  పడిపోతూనో, వికృతమైన యంత్రంలో పడి చెయ్యి చితికిపోతూనో, అడవిమృగం కోరల్లో పడ్డ శరీరం నలుగుతున్నట్టో. ఎన్ని సార్లు విన్నా  సరే, తనిలాంటి ఊహలతోనే ఠక్కున లేచి, పిల్లాడి బెడ్రూంలోకి గబాగబా పరిగెట్టుకుంటూ వెళ్తే ఫ్రాంకీ కళ్ళు మూసుకొని మంచం మీద కూర్చొని వుంటాడు, పాడుతున్న పాట సగంలో ఆపేసినట్టు సున్నా చుట్టిన మూతితో. ఫ్రాంకీ ఋషిలా ఉన్నాడు, ఇప్పుడెవరైనా ఫోటో తీస్తే ఆ భయంకరమైన కేక వేస్తున్న పిల్లాడిలా కాదు, చెంచా ఐస్క్రీం తినబోయేవాడిలా ఉన్నాడు.

“ఫ్రాంకీ”, అని రంకె పెట్టి జీన్‌ పిల్లాడి మొహం దగ్గర గట్టిగా తప్పట్లు కొట్టాడు. ఆ శబ్దానికి కేక సగంలో ఆపి, ఫ్రాంకీ కళ్ళు తెరిచి, నిద్రమత్తులోనే జీన్‌ వైపు ఓ అమాయకమైన చూపు చూసి మళ్ళీ చడీ చప్పుడూ లేకుండా దిండుమీద వాలిపోతాడు. వాడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అయినా జీన్‌కు నమ్మకం కుదరక వొంగి పిల్లాడి ఛాతీ మీద చెవి పెట్టి ఊపిరి పీలుస్తున్నాడా, గుండె ఇంకా కొట్టుకుంటోందా అని చూస్తాడు. ఊపిరి పీలుస్తూనే ఉంటాడు, గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది.

ఇలా ఎందుకౌతోందో వాళ్ళకి తెలియడం లేదు. రాత్రి గడిచి పొద్దున్నయ్యేసరికి పిల్లాడికి ఏమీ గుర్తుండదు. రాత్రి వేళ కేకలేస్తున్నప్పుడే లేపిన కొన్ని సార్లూ, వాడు మగతలో చిరాగ్గా వున్నాడంతే. ఒక సారయితే జీన్‌ భార్య కేరన్‌ వాణ్ణి కళ్ళు తెరిచే వరకూ కుదిపి కుదిపి లేపింది. “నాన్నా?” అంది.
“నాన్నా? ఏదైనా పీడకల వచ్చిందా?” కానీ ఫ్రాంకీ  కొంచెం మూలిగాడంతే. “లేదు,” అన్నాడు కలవరంతో, నిద్ర లేపారన్న కోపంతో. అంతకు మించి ఏమీ అనలేదు.

ఇప్పుడౌతుంది, అప్పుడవ్వదు అనేమీ లేదు. వారంలో ఏ రోజైనా, రాత్రి ఏ వేళైనా ఇలా అవ్వొచ్చు. వాడు తినే తిండితో గానీ, ఆడే ఆటలతో గానీ దీనికి సంబంధం కనిపించటంలేదు. వాళ్ళకి తెలిసినంతవరకూ ఎలాంటి మానసికమైన వేదనా వాణ్ణి వేధిస్తున్నట్లు తెలియడంలేదు. పగలంతా వాడు హాయిగా, వేరే పిల్లల్లానే వుంటాడు.

డాక్టరుకి ఇప్పటికే చాలా సార్లు చూపించారు. పిల్లాడికి ఏ రోగమూ లేదంటుంది డాక్టర్‌ బెనర్జీ. ఫ్రాంకీ వయసు పిల్లల్లో వాడికి ఐదేళ్ళు ఇలాంటి ప్రవర్తన మామూలే అంటుందావిడ. చాలా వరకూ పెద్దయ్యాక తగ్గిపోతాయి అని నచ్చచెపుతుంది. “వాడికేమైనా మానసికమైన బాధ కలిగిందా? ఇంట్లో ఏమైనా….?” అని అడిగింది. “లేదు, లేదు,” అని ఇద్దరూ తలలూపారు, అలా అయితే ఇంకేమీ చెప్పేదిలేదు అన్నట్టు డాక్టర్‌ బెనర్జీ భుజాలు చిన్నగా ఎగరేసింది.

“తల్లితండ్రులకిలాంటి బెంగలు మామూలే. పెద్దగా భయపడే విషయం ఏమీ లేకపోవచ్చులెండి,” అని చిరునవ్వు నవ్వింది. “కష్టమే కానీ, ప్రస్తుతానికి దీన్ని భరించటం తప్ప మీరు పెద్దగా చేసేదేమీ లేదు,” అంది.

కానీ డాక్టర్‌ ఆ భయంకరమైన కేకలు వినలేదు. కేరన్‌ ” పీడకలలు” అనే ఆ రాత్రుల మరుసటి రోజు జీన్‌ మనసులో ఏదో చెప్పలేని గుబులు బయలుదేరుతుంది.  అతను యునైటెడ్‌ పార్సెల్‌ సర్వీస్‌ లో డ్రైవర్‌గా పని చేస్తాడు. రోజంతా అటూ ఇటూ వెళుతూవుంటే తన చెవుల్లో ఓ సన్నటి చప్పుడు వుంటూనే వుంటుంది. తన వ్యానులో వీధులు తిరుగుతూవుంటే ఒక రొద తనను వెంటాడుతూ ఉంటుంది. తను రోడ్డు పక్కగా ఆగి విన్నాడు.  ఎండాకాలపు ఆకుల నీడలు వ్యాను అద్దాలతో గుసగుస మంటూ రాసుకుంటున్నాయి. దగ్గరగా ఇంకో రోడ్డు మీద కార్లు వేగం పుంజుకుంటున్న చప్పుడు. చెట్లపైన ఎక్కడో ఓ పురుగు ప్రెషర్‌ కుక్కర్‌ లాగ చిన్న చిన్న బుసలు కొడుతూంది.

ఏదో చెడు తన కోసం చాలా రోజులు వెతికి వెతికి, చివరికి తన దగ్గరకొస్తున్నట్టు అనిపిస్తోందతనికి.

తను రాత్రి ఇంటికొచ్చేటప్పటికి అంతా మామూలుగా వుంది. క్లీవ్లెండ్‌ ఊరి బయట ఓ పాత ఇంట్లో ఉంటారు వాళ్ళు. కొన్ని సార్లు వాళ్ళిద్దరూ కలిసి రాత్రి భోజనం తర్వాత పెరట్లో తోటపని చేసుకుంటారు. ఫ్రాంకీ బొమ్మలతో మట్టిలో ఆడుకుంటాడు. మరికొన్ని సార్లు వీధిలో సరదాగా నడుస్తూ ఉంటే ఫ్రాంకీ  వాళ్ళ ముందూ, వెనకా తన సైకిల్‌ తొక్కుకుంటాడు. అంతా కలిసి కూర్చొని కార్టూన్లు చూస్తారు, లేకపోతే ఏమైనా ఆడుకుంటారు. ఫ్రాంకీ పడుకున్నాక కేరన్‌ వంట గది టేబుల్‌ దగ్గర కూర్చొని చదువుకుంటుంది తను నర్సింగ్‌ స్కూల్లో చదువుతోంది జీన్‌ బయట వరండాలో కూర్చొని పత్రికో, నవలో తిరగేస్తూ, తను ముప్ఫై ఐదు నిండాక మానేస్తానని కేరన్‌కు ఒట్టేసిన సిగరెట్లు తాగుతాడు. అతనికిప్పుడు ముప్ఫై నాలుగు, కేరన్‌కు ఇరవై ఏడు. ఇంత మంచి జీవితం గడిపే అర్హత తనకు లేదని లోలోపల చాల సార్లు గుర్తుచేసుకుంటాడు. అతను చాలా అదృష్టవంతుడని అనిపిస్తుందతనికి. సూపర్మార్కెట్లో అమ్మాయి చిల్లరందిస్తూ, ” ఎథహప  థ దlపషషపన నథఱ ,” అన్నప్పుడు తనది నిజంగానే దివ్యమైన బ్రతుకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు ఆమె చల్లని దీవెనలు తనమీద జల్లినట్టు అనిపిస్తుందతనికి. చాలా కాలం కిందట ఒక ముసలి నర్సు అతని చెయ్యి పట్టుకుని తన కోసం ప్రార్థిస్తున్నానని చెప్పిన సంగతి గుర్తొస్తుంది.

వరండా కుర్చీలో కూర్చొని పొగ పీలుస్తూ అతను ఆ నర్సు గురించి  ఒద్దనుకుంటూనే ఆలోచిస్తున్నాడు. అతని ఒళ్ళంతా కట్లతో కట్టున్నప్పుడు ఆ ముసలావిడ అతని మించీ వంగి అతని తల దువ్వటం గుర్తొస్తుంది.

అప్పట్లో అతను చాల వేరేగా ఉండేవాడు. ఓ తాగుబోతు, ఒక రాక్షసుడు. పందొమ్మిదేళ్ళకి తనవల్ల గర్భవతి అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తూ పోయాడు. భార్యనీ, కొడుకునీ ఇరవై నాలుగేళ్ళకు నెబ్రాస్కాలో వదిలేసే వేళకి అతను తనకేకాదు, చుట్టూ వాళ్ళకి కూడా ప్రమాదకరమైన వ్యక్తి. వాళ్ళని వదిలెయ్యడం వల్ల వాళ్ళకి మంచే చేసానని అనుకున్నాడు, అయినా గుర్తొచ్చినప్పుడల్లా బాధ మాత్రం వేస్తుంది. చాలా ఏళ్ళ తర్వాత తాగుడు మానేసాక వాళ్ళని వెతికే ప్రయత్నం కూడా చేసాడు. తన ప్రవర్తనకు వాళ్ళ దగ్గర క్షమార్పణ కోరుకొని, పిల్లాడికి డబ్బిద్దామని అనుకున్నాడు. కానీ వాళ్ళెక్కడా దొరకలేదు. మేండీ నెబ్రాస్కా లో వాళ్ళున్న ఊళ్ళో లేదు. ఆమె తల్లితండ్రులు చనిపోయారు. ఆమెక్కడికెళ్ళిందీ ఎవ్వరికీ తెలిసినట్టు లేదు.

కేరన్‌కి తన కథ మొత్తం తెలీదు. ఏదో కొన్నాళ్ళు తాగుబోతనీ, కొన్ని బాధాకరమైన జ్ఞాపకాలు ఉన్నాయనీ తెలిసినప్పటికీ, అంతకు మించి తన పాత జీవితం గురించి కేరన్‌కి పెద్దగా ఆసక్తి లేకపోవటం అతనికి కొంత తెరిపి కలిగించింది. పూర్వం అతనికింకో పెళ్ళయ్యిందని ఆమెకు తెలుసు గాని, ఓ కొడుకు కూడా ఉన్నాడనీ, ఒకానొక చీకటి రాత్రి సామాన్లు కూడా సర్దుకోకుండా ఇంటినీ, వాళ్ళనీ వదిలేసి, మందు సీసా కాళ్ళ మధ్యన పెట్టుకుని కారులో ఎంత దూరం వీలయితే అంత దూరం వెళిపోదామని తూరుపు దిశగా బయలుదేరాడనీ ఆమెకు తెలీదు.  తను చచ్చిబతికిన ఆ ఏక్సిడెంట్‌ గురించి కూడా ఆమెకు తెలీదు. అతను ఎంత చెడ్డ వాడో ఆమెకు తెలీదు.

కేరన్‌ మంచిది. నిజానికి తన గతాన్ని గురించి తెలిస్తే ఆమె ఏమంటుందో తలుచుకుంటే అతనికి సిగ్గూ, ఇంకా చెప్పాలంటే భయం కూడా వేస్తాయి. కథంతా తెలిస్తే ఆమెకు తనపై ఇక నమ్మకం ఉంటుందా అని అతనికి భయం. ఏళ్ళు గడిచిన కొద్దీ, వాళ్ళిద్దరి సంబంధం  పెరిగిన కొద్దీ, తన పాతకథ బయటపెట్టడానికి మరింత సంకోచిస్తున్నాడు. తను ఆ పాత అవతారాన్ని వదిలేసానని గట్టిగా నమ్ముతున్నాడు. కేరన్‌తో పెళ్ళయ్యే కొంత కాలం ముందు, ఫ్రాంకీ కడుపులో ఉందగా, తనకు జీవితంలో మరో చక్కని అవకాశం దొరికిందని అనుకొని, ఈ సారైనా సరిగ్గా బతుకు చక్కదిద్దుకుందామని నిశ్చయించుకున్నాడు. తనూ కేరన్‌ కలిసి ఈ ఇల్లు కొనుక్కున్నారు, ఈ ఏడాది ఫ్రాంకీ కిండర్గార్టెన్‌ లో చేరతాడు. భూమి గుండ్రముగానుండును అన్నట్టు, జీవితం మళ్ళీ అతన్ని అదే చోటకి తెచ్చింది. మేండీ, వాళ్ళ అబ్బాయి డీ.జె.ల తో అచ్చం ఇలాంటి తరుణంలోనే వుండగా జీవితం పటాపంచలయ్యింది. కేరన్‌ పెరటి తలుపు దగ్గరకొచ్చి, “పడుకునే వేళయ్యింది,” అని మెత్తగా అంది. అతనీ ఆలోచనలూ, జ్ఞాపకాలూ దులిపేసుకుని లేచాడు. సన్నగా నవ్వాడు.

ఈ మధ్య అతని మనసు మనసులో లేదు. కొన్ని నెలలుగా ఫ్రాంకీ కేకల వల్ల రాత్రులు లేస్తూండడం, లేచాక మళ్ళీ నిద్ర పట్టకపోవటం. కేరన్‌ పొద్దున్న నిద్ర లేపే వేళకి అలసటగా, బడలికగా వుంటోంది, రాత్రి తాగి పడుకున్నట్టు. అలారం అసలు వినబడటమే లేదు. మంచం మీద నుంచి బద్ధకంగా లేస్తూనే తన చిరాకుని పట్టలేకపోతున్నాడు. తనలో ఏదో కోపం పడగ విప్పి బుసలు కొడుతున్నట్టుంది.

అతనిప్పుడు మారిపోయాడు, మునుపటి లా కాదు, మారిపోయి చాలా రోజులయ్యింది. అయినా బెంగ పడకుండా ఉండలేడు. తాగుడు మానేసిన కొన్నేళ్ళయ్యాక ఆ మహామారి చాప కింద నీరుల మళ్ళీ తిరిగొస్తుందంటారు. ఐదు, ఏడు ఏళ్ళు గడుస్తాయి, మళ్ళీ పూర్వంలాగా తాగాలనిపిస్తుంది. కేరన్ని కలిసాక ఏ.ఏ. మీటింగులకు వెళ్ళటం మానేసాడు. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాడు.

అయితే జీన్‌ సమస్యే వేరు. మందు సీసా చూసినప్పుడు అతని చేతులు వణకటం లేదు. తన స్నేహితులతో బయటకెళ్ళినప్పుడు తనొక్కడే సోడానో, రంగునీళ్ళో తగుతున్నప్పుడూ అతనికి మందు తాగాలని అనిపించటం లేదు. అతని సమస్య రాత్రి నిద్రలో మొదలౌతుంది.

ఈ మధ్య అతని మొదటి కొడుకు డీ.జే. కలల్లోకి వస్తున్నాడు. ఫ్రాంకీ కేకలకీ, దీనికీ సంబంధం ఏంటో తెలియదు కానీ, చాలా రాత్రులుగా ఐదేళ్ళ డీ.జే. మొహం క్రమం తప్పకుండా కనిపిస్తోంది. కలలో జీన్‌ తాగున్నాడు. క్లీవ్లెండ్‌ ఇంటి పెరట్లో అతనూ, డీ.జే. దాగుడుమూతలాడుతున్నారు. చెట్టు వెనక నుంచి వాడు అమాంతం ప్రత్యక్షమై గడ్డి మీద సరదాగా, నిర్భయంగా పరిగెడుతున్నాడు, అచ్చం ఫ్రాంకీ లాగా. జీన్‌ వాణ్ణి కనిపెడుతున్నాడు. డీ.జే. వెనక్కి తిరిగి నవ్వుతున్నాడు, జీన్‌ మైకంలో తడబడుతూ వాడి వెనకాలే నడుస్తున్నాడు. అల్లరిగా ఆడుకుంటూ, పిచ్చి చేష్టలు చేస్తూ తండ్రీ, కొడుకూ. ఆ కల ఎంత నిజంగా ఉందంటే, మెలకువొచ్చాక్కూడా అతనికి ఇంకా తాగిన మైకంలో ఉన్నట్టనిపిస్తుంది. మత్తు వదిలించుకోవటానికి కొద్ది సేప్పడుతుంది.

ఈ కల బాగా స్పష్టంగా కనిపించిన మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రాంకీ లేచి ఏదో గమ్మత్తుగా ఉందన్నాడు “ఇక్కడ,” అన్నాడు తన నుదుటి వైపు చూపిస్తూ.  తలనొప్పి కాదన్నాడు, “తేనెటీగలున్నట్టు అనిపిస్తోంది!” అన్నాడు. “ఝుమ్మంటున్నాయి తేనెటీగలు!” కనుబొమ్మ మీద నుంచి చెయ్యి పోనిచ్చాడు. “నా తల్లో.” ఒక్క క్షణం ఆలోచించాడు. “ఇంట్లో చిక్కుకున్న తేనెటీగలు బయటపడదామని కిటికీ గాజుకి కొట్టుకుంటాయి కదా! అలా!” ఈ వివరణ వాడికే నచ్చింది కాబోలు, తన నుదుటిని వేళ్ళతో తట్టుకుంటూ “ఝుం..ఝుం..” అంటున్నాడు.
“నొప్పెడుతోందా?” అడిగింది కేరన్‌.
“లేదు,” అన్నాడు ఫ్రాంకీ. “కితకితలు పెడుతోంది.”
కేరన్‌ జీన్‌ వైపు బెంగగా చూసింది. ఫ్రాంకీని సోఫా మీద బజ్జోపెట్టి కళ్ళు మూసుకోమని చెప్పింది. కొద్ది సేపయ్యాక వాడు నవ్వుతూ లేచి తేనెటీగలు పోయాయన్నాడు.

“నాన్నా, తండ్రీ…నిజంగానే పోయాయా?” అంది కేరన్‌. ఆమె ఫ్రాంకీ నుదుటిని ముట్టుకొని చూసింది. “వేడిగా లేదు,” అంది. ఈ లోగా ఫ్రాంకీ సోఫా కింద పడి దాక్కున్న బొమ్మ కారుతో ఆటలో పడ్డాడు.
కేరన్‌ తన  నర్సింగ్‌ పుస్తకమొకటి తీసి పేజీలు తిప్పుతూ మొహం బిగబెట్టింది. ” కపసషలlలఫబధథl షఱరవసలరష ” అన్న పాఠం ఇక్కడా, అక్కడా ఆగుతూ గబగబా చదివింది. “మళ్ళీ డాక్టర్‌ బెనర్జీ దగ్గరకు పట్టికెళ్ళాలేమో,” అంది. జీన్‌ సరే అన్నట్టు తలూపాడు. డాక్టర్‌ కిందటి సారి మానసిక ఆందోళన గురించి మాట్లాడ్డం అతనికి గుర్తొచ్చింది.
“నాన్నా, తేనెటీగలంటే నీకేమైనా భయమా?” ఫ్రాంకీని అడిగాడు.
“వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా?”
“లేదు,” అన్నాడు ఫ్రాంకీ.
ఫ్రాంకీకి మూడేళ్ళప్పుడు ఎడం కన్ను మీద ఓ తేనెటీగ కుట్టింది. ఫ్రాంకీకి తేనెటీగలంటే ఎలర్జీ ఉందని అప్పటికి వాళ్ళకి తెలీదు. కొద్ది నిముషాల్లోనే వాడి మొహం ఉబ్బిపోయి, ఓ కన్ను మూసుకుపోయి వికృతంగా తయ్యారయ్యాడు. అప్పుడు పరుగు పరుగున ఆ రోజు పిల్లాడి తలను గుండెకు హత్తుకుని కార్‌ దగ్గరకు పరిగెట్టడం, పరిగెడుతూ ఉంటే తనకేసిన భయం ఇప్పటి వరకూ జీన్‌కు గుర్తున్నాయి. ఫ్రాంకీ అప్పుడు కూడా ఋషి లాగే ఉన్నాడు.
జీన్‌ గొంతు సవరించుకున్నాడు. ఫ్రాంకీ చెప్తున్న ఆ గమ్మ్తౖతెన అనుభవం తనకు తెలుసు. నిజానికి ఇప్పుడతనికీ అలాగే అనిపిస్తోంది. వింతగా ఉంది, తల లోపల ఈక పెట్టి కితకితలు పెడుతున్నట్టుంది. మునివేళ్ళతో నుదురు నిమురుకుంటున్నాడు. తనిప్పుడు ఫ్రాంకీ గురించి కాదు, డీ.జే. గురించి ఆలోచిస్తున్నాడు.

“నిన్ను భయపెట్టేదేమైనా ఉందా?” అనొక్క నిముషం పోయాక ఫ్రాంకీని అడిగాడు. “ఏదైనా సరే నాకు చెప్పు, నేనున్నాగా.”
“అన్నిటికంటే భయం దేనికో చెప్పనా నాన్నా?” అని ఫ్రాంకీ కళ్ళు పెద్ద చేసి భయపడుతున్నట్టు నటించాడు. “ఒకావిడ మొండెం  తన తల వెతుక్కుంటూ అడవిలోంచి నడుచుకుంటూ వెళ్తోంది. నా…తల…నాకు…ఇవ్వండీ…”
“ఛీ..నీకిలాంటి కథలు ఎవరు చెప్పారు?” అడిగింది కేరన్‌.
“నాన్నే చెప్పారు, మేం కలిసి బైటకెళ్ళినప్పుడు.”
జీన్‌ పట్టుబడ్డ దొంగలా సిగ్గు మొహం పెట్టాడు. కేరన్‌ చురచురా చూసి, “బావుంది. చాలా బావుంది,” అంది.
ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక, మొహం వంచుకుని, “దెయ్యాల కథలు చెప్పుకున్నాం అంతే. వాడికి నవ్వొస్తుందేమోనని చెప్పాను,” అని మెల్లగా అన్నాడు.
“అదేంటి జీన్‌?” అందామె. “వాడికిలాంటి కలలొస్తున్నాయని తెలుసు కదా? అసలు నీ బుర్ర పని చేస్తొందా?”

అకస్మాత్తుగా ఓ ఫ్లాష్‌బాక్‌ పీడకలలా వచ్చింది. తన మొదటి భార్య మేండీ గుర్తొచ్చింది. కేరన్‌ కళ్ళలో మేండీ చూపు కనిపించింది. “అదేంటి జీన్‌? అసలు నీ బుర్ర పని చేస్తొందా?” అనేది ఆమె కూడా. ఆ రోజుల్లో జీన్‌ ఏ పని చేసినా, అది సవ్యంగా ఉండేదికాదు. మేండీ అరుపులకి అతనిలో సిగ్గూ, ఉక్రోషం నిండిపోయేవి. నిజంగానే ప్రయత్నం చేసానే బాబూ, అని లోలోపలే అనుకునేవాడు. ఐతే అతడేంచేసినా ఫలితం మాత్రం ఆమెకు కోపం తెప్పించి, ఆమెని అరిపించడమే. ఓ సారి మాటకి మాట వచ్చి, ఆమె మీద చెయ్యిచేసుకున్నాడు. “నన్నో పిచ్చివెధవలా చూస్తావెందుకూ?” అన్నాడు పళ్ళు కొరుకుతూ. “నేనేం పిచ్చి ముండాకొడుకునికాదు,” అనంటే, ఆమె కళ్ళెర్ర చేసింది. దానికింకా కోపం వచ్చి, ఆమె కుర్చీ లోనుంచి పడిపోయేలా దెబ్బల వర్షం కురిపించాడు.

ఆ రొజుల్లో ఓ సారి తను డీ.జే.ని ఎగ్జిబిషనుకి తీసుకెళ్ళాడు. శనివారం కదా అని కొంచెం మందు కొట్టాడు. అతనితో వాణ్ణి బైటకి పంపటం మేండీకి అస్సలు ఇష్టం లేదు, అయినా అతను పట్టికెళ్ళాడు. డీ.జే.తో కొంతసేపు గడిపే హక్కు అతనిక్కూడా ఉంది. మేండీ తనమీద అధికారం చలాయించడం ఎందుకూ? తనని తాను అసహ్యించుకునేలా చెయ్యడమే ఆమెకిష్టం కాబోలు.

అయితే మేండీకి తర్వాత కోపం వచ్చింది ఎందుకంటే వాణ్ణి “వెలోసిరేటర్‌” మీద పట్టికెళ్ళాడని. మందు దిగాక అది తప్పే అని అతనికీ అనిపించింది. కానీ డీ.జే. పట్టికెళ్ళమని బతిమాలాడు. అప్పటికి డీ.జే.కి నాలుగేళ్ళూ, తనకి ఇరవైమూడు. ఎందుకో చాలా పెద్దవాణ్ణైపోయినట్టు అనిపించిందతనికి. సరదాగా పట్టికెళ్ళాడు.

గేటు దగ్గర టికెట్లు తీసుకునే వాడు వాళ్ళిద్దరినీ చూసి నవ్వాడు. “కుర్రాడికి సరదాగా వుంటుందిలే,” అన్నట్టు. “వెలోసిరేటర్‌” యంత్రం తలుపు తెరుచుకుంది. లోపలకు వెళుతూ వుంటే డిస్కో మ్యూజిక్‌ మరింత గట్టిగా వినిపిస్తోంది. జీన్‌ నీ, డీ.జే.నీ గోడకేసి నిల్చోబెట్టి బెల్ట్‌లతో కట్టారు. జీన్‌కి లోపల వెచ్చగా వుంది. డీ.జే. చెయ్యి పట్టుకుని, “కాసుకోరా బాబూ, అదిరిపోతుంది,” అన్నాడు.

తలుపు మూసుకుంది. గోడలు చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. వేగం పుంజుకుంటున్న కొద్దీ, డీ.జే.ని జీన్‌ గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది సేపట్లో ఆ వేగానికి వాళ్ళిద్దరూ గోడకి అతుక్కున్నారు, అయిస్కాంతానికి ఇనప ముక్కల్లా. జీన్‌ బుగ్గలూ, పెదవులూ సాగినట్టవుతూ ఉంటే, ఆ నిస్సహాయ స్థితికి అతనికి నవ్వొచ్చింది.

అప్పుడే డీ.జే. గట్టిగా అరవటం మొదలెట్టాడు. “ఆపు. ఆపు.” ఆ అరుపులకి జీన్‌ వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని, “భయం లేదురా,” అన్నాడు నవ్వుతూ. “నేనిక్కడే వున్నానుగా.” కానీ వాడు ఇంకొంచెం గట్టిగా కేకలేసాడు. ఆ కేకలు జీన్‌ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నట్టనిపించింది. ఆ యంత్రం మొత్తానికి ఆగే సరికి, డీ.జే. వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. మిగితా వాళ్ళంతా జీన్‌ వైపు కోపంగా చూస్తున్నట్టు అనిపించిందతనికి.

జీన్‌కి అసహ్యమేసింది. తండ్రీ, కొడుకూ హాయిగా గడుపుతున్నామనుకుంటే మధ్యలో ఈ గోలేంటి? ఎగ్జిబిషను నుంచీ ఇంటి వరకూ దారి పొడుగునా డీ.జే. ఏడుస్తూనే వున్నాడు. జీన్‌ బిళ్ళలు కొంటాననీ, బొమ్మలు కొంటాననీ మరిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా, “అమ్మ కావాలి. ఇంటికెళిపోదాం. నాకమ్మే కావాలి,” అని వాడేడుస్తున్నాడు. అది విని జీన్‌కి కస్సున కోపం వచ్చింది. పళ్ళు పటపటా కొరికాడు.

“సరే, పద,” అని బుసకొట్టాడు. “మీ అమ్మ దగ్గరకే పద. ఏడుపుగొట్టు వెధవా. నిన్నింకెక్కడికైనా పట్టికెళ్తానేమో చూడు.” డీ.జే.ని పట్టుకుని గట్టిగా కుదిపాడు. “ఏమైందిరా నీకు? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారో! `అంత పెద్దబ్బాయి, అమ్మాయిలా ఏడుస్తున్నాడు,’ అంటున్నారు.”

అదే జ్ఞాపకం ఎందుకో పదే పదే మనసులోకి వస్తోంది. అప్పటి డీ.జే. అరుపులు ఇప్పటి ఫ్రాంకీ అరుపుల లాగే ఉన్నాయి. డీ.జే. అరుపులు తన ఆలోచనల తెరలు తెంచుకుని బుర్రలో తిరుగుతున్నాయి. మర్నాడు మళ్ళీ అవే అరుపులు ఎంత గట్టిగా వినిపించాయంటే తన వ్యాను దారి పక్కగా ఆపి చెవులు మూసుకున్నాడు. ఆ పిల్లాడికి తను రాక్షసుడిలా అనిపించుంటాడు కదా!

వ్యానులో ఒంటరిగా కూర్చొని, మేండీ, డీ.జే. తనకు కనిపిస్తే ఎంత బావుణ్ణు అనుకున్నాడు. తనెంత బాధ పడుతున్నాడో వాళ్ళకి చెప్పాలనీ, వాళ్ళకి డబ్బు సహాయం చెయ్యాలనీ అనిపించింది. తను వ్యాను ఆపిన ఇంటి కిటికీ తెరలు తొలగించి ఓ ముసలాయన తనకోసం ఏమన్నా పార్సెల్‌ వచ్చిందేమోనని ఆశగా చూస్తున్నాడు.

ఎక్కడున్నారో వాళ్ళు? ఏం చేస్తున్నారో? మేండీకి తన జాడ తెలిసుంటే తనను వెంటాడి, ఈపాటికి పిల్లాడి కోసం డబ్బులు కూడా వసూలు చేసుండేది. తనని ఇబ్బంది పెట్టి, తన జీతమంతా స్వాహా చెయ్యడానికి ఓ కంపెనీని తన వెనక పంపి ఉండేది.

ఇప్పుడీ దారి పక్కగా కూర్చొని ఆలోచిస్తే, వాళ్ళు చచ్చిపోయారేమో అనిపించిందతనికి. తన ఏక్సిడెంటు గుర్తొచ్చింది, తను చచ్చిపోయుంటే  కూడా వాళ్ళకి తెలిసుండేది కాదు. హాస్పిటల్లో స్పృహ వచ్చాక ముసలి నర్సు, “బాబూ నువ్వు బతకటమే గొప్ప అదృష్టం. ఈ ఏక్సిడెంటులో నువ్వు పోయివుండాల్సింది తెలుసా?” అని అనడం గుర్తొచ్చింది.

నిజంగా వాళ్ళు చచ్చిపోయారేమో! లేకపోతే ఎలగో ఓలాగ తనని పట్టుకొనుండరూ ఈపాటికి? నిజమే. వాళ్ళు చచ్చిపోయారు.

ఈ ఆలోచనలతో ఏం చెయ్యాలో తోచటం లేదు. ఇవి పిచ్చి పిచ్చి ఆలోచనలని అతనికి తెలుసు. కానీ ఈ ఫ్రాంకీ గాడి అరుపుల గొడవతో అతని మనసులో సంచలనం బయలుదేరింది. పనైపోయి ఇంటికెళ్ళాక కేరన్‌ తన్ని చూసి, “ఏమయ్యింది? అలా వున్నావేంటి?” అనడిగింది.
“ఏమీ లేదు,” అన్నాడు. నమ్మనట్లుగా అతని వైపు మళ్ళీ చూసింది. ఒక్క క్షణం ఆగి, “ఫ్రాంకీని మళ్ళీ డాక్టరు దగ్గరకి పట్టికెళ్ళాను,” అంది. జీన్‌ ఆమె దగ్గర కూర్చున్నాడు.
“నేను పిచ్చిదాన్నని అనుకుంటున్నావు కదూ?” అంది. “రోజంతా చుట్టూ జబ్బులు చూస్తూ వుంటానుగా. అందుకేనేమో.”
జీన్‌ తలూపాడు. “లేదు..అదేం కాదు,” అన్నాడు. గొంతెండిపోయినట్టుంది.
“నిజమే. వాడికేమయ్యిందో కనుక్కోవాలిగా మరి,” అన్నాడు.
“డాక్టర్‌ బెనర్జీకి నేనంటే అసహ్యం వేస్తోందేమో,” అంది.
“ఊహూ..నిన్నసలు ఎవరైనా అసహ్యించుకోగలరా,” అన్నాడు కష్టపడి నవ్వుతూ. మంచి భర్తలా ఆమె చేతిని ముద్దులు పెట్టుకున్నాడు. “ఊరికే బెంగపడకు,” అన్నాడు. అలా అన్నాడేకాని, అతని మనసంతా భయం నిండి, అతని నరాలు జువ్వుమంటున్నాయి. ఇంటి వెనకాల ఫ్రాంకీ గొంతు వినిపించింది.
“వాడెవరితో మాట్లాడుతున్నాడు?”
“ఎవరితోనూ కాదు. వాడిలో వాడే ఏదో మాట్లాడుకుంటున్నాడు.”
జీన్‌ కిటికీ దగ్గరకెళ్ళి చూసాడు. ఫ్రాంకీ ఎవరినో వెంటాడుతున్నట్టు బొమ్మ తుపాకీ పట్టుకుని పరిగెడుతూ, చెట్టు వెనకాల మాయమయ్యడు. ఫ్రాంకీకి, డీ.జే. కి అసలు పోలికల్లేకపోయినా, వీడు చెట్టు వెనకాల నుంచి అమాంతం ప్రత్యక్షం అవ్వగానే, జీన్‌ ఒళ్ళంతా జలదరించింది. పళ్ళు బిగపెట్టాడు.

“ఈ క్లాసులో పిచ్చెక్కుతోంది. ఏ దరిద్రమైన జబ్బు గురించి చదివినా, భయాలూ, బెంగలూ మొదలౌతాయి,” అంది కేరన్‌. “విచిత్రమేంటంటే ఎన్ని విషయాలు తెలుసుకుంటే అంతెక్కువౌతుంది భయం.”
“ఈ సారి డాక్టర్‌ ఏమందీ?” అడిగాడు జీన్‌. మాట్లాడుతున్నాడేకానీ అతనికేంటో గుబులుగా వుంది. “బాగానే వున్నాడని అందా?”

కేరన్‌ నిస్పృహతో భుజాలెగరేసింది. “ఇంకేమంటుందీ? వాళ్ళ ప్రకారం ఆరోగ్యంగానే ఉన్నాట్ట.” ఆమె వీపు మెత్తగా నిమిరాడు, ఆమె తలని తన చేతిలో ఉంచింది. వాళ్ళ పెళ్ళైన కొత్తలో, “మనకే బాధలూ రావు కదా?” అనడిగింది. “ఛీ..ఇప్పుడలాంటి మాటలెందుకూ? అనుకున్న కొద్దీ నిజంగా ఏమైనా అవుతుంది,” అని అతని చేత్తో ఆమె నోరు మూసాడు. ఆమె ఫక్కున నవ్వింది. “నీకిలాంటి నమ్మకాలు కూడా వున్నాయా?” అంది.

అతనికి నిద్రపట్టటం లేదు. మేండీ, డీ.జే. చచ్చిపోయారన్న ఆలోచన తన తలను దొలిచేస్తోంది. దుప్పటి కింద పాదాలు రాసుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. చివరకి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తూంటే కేరన్‌ కూడా మంచం మీద వాలింది. కానీ అతని మనసులో ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. మేండీ, డీ.జే. సినిమాలోలా కనిపిస్తున్నారు. “వాళ్ళు చచ్చిపోయారు,” అని ఓ గొంతు తనతో చెప్పింది. “అగ్నిప్రమాదంలో చచ్చిపోయారు.” మంటల్లో కాలిపోతున్న తన పాత ఇల్లు కనిపించింది. చిక్కటి, నల్లటి పొగలు ఇంటి చుట్టూ కనిపించాయి. కిటికీలు కరిగి ముద్దైపోయాయి. ఆ పొగలు కక్కుతున్న ఇంటిని చూస్తే, తనకి పాతకాలం నాటి బొగ్గు రైలు గుర్తొచ్చింది. ఎర్రటి నిప్పుల్లో ఇంటి లోపల ఏమీ కనిపించకపోయినా వాళ్ళిద్దరూ లోపల ఉన్నట్టు స్ఫురించింది అతనికి. ఒక్క క్షణం పాటు డీ.జే. మొహం కనిపించింది, కాలుతున్న ఇంటి కిటికీలో నుంచి వాడు బయటకు చూస్తున్నాడు, పాడుతున్న పాట సగంలో ఆపేసినట్టు సున్నా చుట్టిన మూతితో.

కళ్ళు తెరిచాడు. కేరన్‌ నిద్రలోకి జారుకున్నట్టుంది. మెల్లిగా మంచం దిగి, ఇల్లంతా తిరిగాడు. వాళ్ళు చావలేదేమో, తనలో తనే అనుకున్నాడు. ఫ్రిడ్జ్‌ లో పాల డబ్బ తీసుకుని, అదెత్తిపెట్టుకుని తాగుతున్నాడు. అదో పాత అలవాటు, పూర్వం మందు కొట్టాలని బలమైన కోరిక కలిగినప్పుడు, చల్లటి పాల రుచి ఆ మంటనార్పేది. ఇప్పుడు పాలు తాగినా, తనకేమీ మంట చల్లారినట్టనిపించలేదు. ఆ కాలుతున్న ఇంటి దృశ్యం, ఆ గొంతు, అతన్ని బాగా భయపెట్టాయి. ఓ దుప్పటి కప్పుకుని, టీ.వీ. లో ఏదో సైన్సు ప్రోగ్రాం వస్తుంటే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. అందులో ఓ ఆవిడ ఓ పిల్లాడి శవాన్ని పరిశీలిస్తోంది. శుష్కించిపోయిన ఆ శవం చూసాక, డీ.జే. గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఉలిక్కి పడి ఒక్క సారి వెనక్కు తిరిగి చూసుకున్నాడు.

మేండీ, డీ.జే.తో ఉన్న ఆఖరి రోజుల్లో కొన్ని సార్లు డీ.జే. మొహం చూస్తే అతనికి భయం వేసేది. డీ.జే. మొదటి నుంచీ సన్నగా ఉండేవాడు. పక్షిలా చిన్న తలా, సన్నటి, పొడుగాటి కాళ్ళూ వాడూను. వాడు ఇంట్లొ నిశ్శబ్దంగా ఒక గది నుంచి మరొ గదిలోకి తిరిగే పద్ధతి తలుచుకుంటే అతనికి భయం వేసింది. వాడెప్పుడూ తననే కనిపెడుతూ ఉన్నట్టే ఉండేది అతనికి.

ఏళ్ళను దాటుకుని మరో జ్ఞాపకం. ఆ రోజుల్లో అతను బాగా తాగుతూ ఉండేవాడు. ఆ తాగుడు అతను చూసే దృశ్యాలన్నిటినీ వికృతంగా మార్చేసేది. మేండీ డీ.జే.ని తనమీద ఉసిగొల్పిందని అనిపించేది. ఆమె వాణ్ణి మార్చేసింది. అతను కొన్ని సార్లు సోఫాలో కూర్చొని టీ.వీ. చూస్తూ ఉండగా ఎవరో తనను గమనిస్తున్నట్టు అనిపించేది. వెనక్కి తిరిగి చూస్తే డీ.జే. ఉండే వాడు తనని తీక్షణంగా చూస్తూ. ఎముకల గూడైన సన్నటి శరీరంతో గుడ్లగూబలాంటి పెద్ద కళ్ళతో అసహజమైన చూపులతో తననే గమనిస్తూ…మరికొన్ని సార్లు తనూ, మేండీ, దెబ్బలాడుకుంటూ ఉంటే, వాడు చడీ చప్పుడూ లేకుండా వచ్చి మేండీ ఒళ్ళో చేరి, “బొబ్బ,” అనే వాడు. అప్పటికి ఐదేళ్ళున్నా కావాలని చంటి పిల్లాడిలా గొంతు పెట్టి, “అమ్మా..బొబ్బ” అనేవాడు నీళ్ళడగటానికి. ఆ క్షణంలో వాడి కళ్ళళ్ళో జీన్‌ అంటే చెప్పలేనంత అసహ్యం, భయంకరమైన ద్వేషం కనిపించేవి.

ఇవన్నీ నిజం కాదని జీన్‌కి బాగా తెలుసు. అతనికి తెలుసు   తనొక తాగుబోతు, డీ.జే. భయంతో వణికిపోతున్న ఓ చిన్న పిల్లాడు. చాలా రోజుల తర్వాత తాగుడు మానే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఈ జ్ఞాపకాలు తలుచుకుని అతను సిగ్గుతో కృంగిపోయేవాడు. ఈ విషయాలన్నీ ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. ఐదేళ్ళ పిల్లవాణ్ణి చూసి దెయ్యాన్ని చూసినట్టు భయపడినట్టు ఎలా చెప్తాడు? కానీ, తన మనసులో డీ.జే. ఒక దెయ్యంలాగానే స్థిరపడిపోయాడు. అమ్మ ఒళ్ళో పడుకుని, చంటి పిల్లల భాషలో తనను నిందిస్తూ,  ఆ ద్వేషం నిండిన కళ్ళతో తనను చూస్తూ. ఒక సారైతే వాణ్ణి జీన్‌ పట్టుకుని దులిపేసాడు. తన చేతుల్లో పిల్లాడి పీక నులిమేస్తూ, “మాట్లాడితే సరిగ్గా మాట్లాడు, అర్థమయ్యిందా? పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు,” అని పళ్ళు బిగపెట్టాడు. “నువ్వేమీ చంటి పిల్లాడివి కాదు. ఇక్కడెవరికీ చెవిలో పువ్వులేదు. నీ నాటకం నాకు తెలుసు.” అప్పుడు డీ.జే. కాటెయ్యబోయే పాములా నోరు తెరిచాడు. వాడి పళ్ళమధ్యనుంచి బుసబుసమంటూ వచ్చిన సన్నని కేక అతనికి ఇంకా గుర్తుంది.

లేచాడు కానీ, ఊపిరాడ్డం లేదు. ఎవరో తన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఎవరో ఒకావిడ తన చెయ్యి పట్టుకుంది. ఒక్క క్షణం పాటు, “బాబూ నువ్వు బతకటమే గొప్ప అదృష్టం. ఈ ఏక్సిడెంటులో నువ్వు పోయివుండాల్సింది తెలుసా?” అని అంటుందనుకున్నాడు. కానీ అది కేరన్‌. “ఏంటిది? ఏం చేస్తున్నావు?” అని అడిగింది. పొద్దునైపోయింది. ఇంకా సరిగ్గా మెలకువ రాలేదు. తను కింద పడి ఉన్నాడు, టీ.వీ. ఇంకా మోగుతూనే ఉంది.

“దేవుడా,” అని దగ్గాడు. “దేవుడా.” చమటలు పట్టి ఉన్నాడు, మొహమంతా వేడిగా ఉంది, కానీ కేరన్‌ చూస్తోందని తను మామూలుగానే ఉన్నట్లు నటించాడు. “పీడకల,” అన్నాడు, బలంగా ఊపిరి పీల్చుకుంటూ. తలూపి, మళ్ళీ, “దేవుడా,” అన్నాడు కేరన్‌ వైపు నవ్వడానికి ప్రయత్నిస్తూ. “రాత్రి నిద్రపట్టక ఇక్కడికొచ్చా. టీ.వీ. చూస్తూ నిద్రపోయుంటాను.”
కానీ కేరన్‌ తన్నింకా భయంతో, అనుమానంతో చూస్తోంది, అతనిలో ఏదో వికృతమైన మార్పు వచ్చినట్టు. “జీన్‌,” అంది, “నిజంగానే బావున్నావా?”
“ఆ..నాకేం? బాగానే ఉన్నా,” అన్నాడు. ఒక్క సారి ఒళ్ళంతా వణికింది. అప్పుడు తెలిసిందతనికి, తన వంటి మీద ఒక్క బట్ట కూడా లేదు. ఒక్క సారిగా చేతులతో తన్ని తాను కప్పుకుని, లేచి కూర్చున్నాడు. తన డ్రాయరూ, పైజమా దగ్గరలో లేవు. తను రాత్రి కప్పుకున్న దుప్పటి కూడా ఎక్కడా కనిపించలేదు. లేచి నిల్చుంటూ ఉండగా అకస్మాత్తుగా అతని చూపు ఫ్రాంకీ మీద పడింది. వంటింటికీ, హాలుకీ మధ్య నిలబడి వాడు తన్నే గమనిస్తున్నాడు.
“అమ్మా..బొబ్బ,” అన్నాడు ఫ్రాంకీ.

ఆ రోజంతా మగతగా పని చేసాడు. తేనెటీగలు, అనుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫ్రాంకీ చెప్పిన తేనెటీగల మాట తనకి గుర్తొచ్చింది. లోపల చిక్కుకుని బయటపడదామని కిటికీ గాజుకి కొట్టుకుంటున్న తేనెటీగల మాట. తనకిప్పుడు తల్లో అచ్చం అలాగే ఉంది. గుర్తుకి వచ్చీరాని విషయాలన్నీ అటూఇటూ ఎగురుతూ తన బుర్రలోపల వాలుతున్నాయి. కుర్చీలో నుంచి పడిపోయేలా మేండీని తను కొట్టడం కనిపిస్తోంది; తన చేతుల్లో డీ.జే. పీక నులుముతూ ఉంటే వాడి ఏడుపు కనిపిస్తోంది; బాగా ఆలోచిస్తే ఇలాంటివీ, బహుశా ఇంకా దారుణమైనవీ, చాలా గుర్తొస్తాయని కూడా అతనికి తెలుసు. కేరన్‌ తన గురించి తెలుసుకోదని రహస్యంగా ఆశించిన విషయాలన్నీ గుర్తొస్తున్నాయి.

వాళ్ళని వదిలివెళ్ళిన రోజు తను బాగా తాగున్నాడు; ఎంతతాగున్నాడంటే అసలేమయిందో సరిగ్గా గుర్తేలేదు. చీకట్లో కారు తిరగబడిపోయే ముందు హైవే మీద అయోవా వరకూ తను చేరాడంటేనే తనకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ కారు తన చుట్టూ అట్టపెట్టెలా నలిగిపోయిందన్న విషయం తలుచుకుంటేనే ఒంట్లో గగ్గురుపాటు పుట్టింది. తలలో ఈ ఆలోచనల రొద భరించలేక వ్యాను రోడ్డు పక్కగా ఆపాడు. డీ.జే.ని ఒళ్ళోపెట్టుకుని  సోఫాలో కూర్చున్న మేండీ కనిపించింది. డీ.జే. కన్నొకటి ఎర్రగా, బాగా వాచి ఉంది. వంటింట్లో నిల్చొని తను సీసాలూ, గ్లాసులూ నేలకేసి విసిరికొట్టటం కనిపించింది.
చచ్చారో లేదో తెలీదు కానీ, తన్ని మాత్రం వాళ్ళు ప్రశాంతంగా బతకనివ్వరు. తను సంతోషంగా భార్యతో, కొడుకుతో జీవించటం వాళ్ళకి ఇష్టం లేదు. తనకీ సర్వసాధారణమైన జీవితం కూడా గడిపే అర్హత లేదు.

ఆ రాత్రి ఇల్లు చేరేసరికి బాగా అలిసిపోయాడు. ఏదీ ఆలోచించడానికీ, వాదించడానికీ అతనికి ఓపిక లేదు. కాసేప్పాటు ఆ ఆశ నెరవేరుతుందేమో అనిపించింది. ఫ్రాంకీ పెరట్లో హాయిగా ఆడుకుంటున్నాడు. కేరన్‌ వంటింట్లో ఉంది. కానీ అతను కూర్చొని చెప్పులిప్పుతూ ఉంటే ఆమె చుర చురా చూసింది.
“వంటింట్లో చెప్పులిప్పద్దని ఎన్ని సార్లు చెప్పాన్నీకు?” అంది.
తీసేసిన చెప్పు వైపు చూస్తూ, “సారీ,” అని లేచాడు.
కానీ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చునే సరికి ఆమె అతన్ని వెంబడించింది. తను మేజోళ్ళు తేసేసి పాదాలని రాసుకుంటూ ఉంటే, ఆమే తలుపువారగా జారబడి చేతులు మడతేసుకుని  అతన్నే చూస్తోంది.
“ఏంటి?” అనడిగాడు ఆమెని చూసి. కొంచెం ఇబ్బందిగా నవ్వాడు.
ఆమె నిట్టూర్చింది. “నిన్న రాత్రి గురించి మనం మాట్లాడుకోవాలి,” అంది.
“నిజంగా నీకేమౌతోందో నాకు చెప్పు.”
“ఏమీ లేదు. చెప్పానుగా, నిద్ర పట్టలేదు, హాల్లో టీ.వీ. చూస్తూ నిద్రపట్టేసింది అంతే.”
కళ్ళార్పకుండా అతని వైపు చూసింది. “జీన్‌… ఒంటిమీద నూలుపోగైనా లేకుండా పడుండడం..రాత్రేమయ్యిందో అసలు గుర్తే లేకపోవటం…ఇవన్నీ మామూలు విషయాలా చెప్పు? నీకిదంతా విచిత్రంగా అనిపించటమ్లేదూ?”
ఇప్పుడీ గొడవేంటిరా బాబూ అనుకున్నాడు. “నిజమే,” అన్నాడు. “నాకూ ఆశ్చర్యంగానే ఉంది. పీడకలలు వచ్చాయి. అసలేమయిందో గుర్తేలేదు.”
“అవునా..” అంది. ఆమే కళ్ళళ్ళో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
“జీన్‌…నేనడిగేది ఒక్కటే. నువ్వు మళ్ళీ తాగుతూ ఉంటేనో, తాగుదామని అనుకుంటూ ఉంటేనో నాకు చెప్పు. నీ మంచి కోసమే చెపుతున్నాను. అటువంటిదేమైనా ఉంటే ఇద్దరం కలిసి ఎదురుకుందాం. కానీ నువ్వు నాకు నిజం చెప్పాలి.”
“నేను తాగటంలేదు.” పెద్దగా అరుస్తున్నాడు. ” తాగాలన్న ఆలోచన కూడా లేదు. నేన్నిన్ను కలిసినప్పుడే చెప్పానుగా ఆ రోజులయిపోయాయని?” అలా చెప్పాక్కూడా అతన్ని ఒక నీడ వెంటాడుతున్నట్టు అనిపించింది. “అయినా నాకర్థంకాక అడుగుతున్నానూ…నేన్నీకు అబద్ధం చెప్తానని నీకెందుకనిపించింది?”

ఆమె ఇంకా తనని గుచ్చిగుచ్చి చూస్తోంది, ఆ చూపులోని అనుమానం అతనికి ప్రస్ఫుటంగా తెలుస్తోంది. “సరే విను,” అంది ఆఖరికి, కన్నీళ్ళు తుడుచుకుంటూ. “ఇందాక ఎవరో ఒకతను నీకోసం ఫోన్‌ చేసాడు. బాగా తాగున్నాడు.  నిన్న రాత్రి నీతో బలే సరదాగా గడిచిందని, మళ్ళీ త్వరలోనే నిన్ను కలుస్తే బావుంటుందనీ చెప్పమన్నాడు.” ఈ ఆఖరి ముక్క చెప్తూ అతని మొహంలోకి తీక్షణంగా చూసింది, ఏమైనా నిజం బైటపడుతుందా అన్నట్టు. ఓ కన్నీటి చుక్క ఆమె పొడవాటి ముక్కు మించీ మెల్లిగా కిందకు దొర్లింది. జీన్‌ గుండెలో ఒక దడ బయలుదేరింది.
“నాకేమీ అర్థం కావటంలేదు,” అన్నాడు. కోపం ప్రదర్శిద్దామనుకున్నాడు కానీ లోలోపల చాలా భయం వేసింది. “అతని పేరేమని చెప్పాడు?”
ఏడుస్తూనే బుర్రూపింది. “తెలీదు,” అంది. ” తాగిన మైకంలో అతని మాటలు చాలా ముద్దగా ఉన్నాయి…ఏదో బీ.బీ.నో, బీ.జే.నో…”
జీన్‌ మెడమీద వెంట్రుకలు లేచి నిల్చున్నాయి. “కొంపతీసి డీ.జే. నా?” అని మెల్లగా అడిగాడు.
కేరన్‌ తలెత్తింది. “ఏమో.. అయ్యుండొచ్చు,” అంది. జీన్‌ తన చేతుల్లో మొహం దాచుకున్నాడు. తన తలలోపల ఝుంఝుం అని కితకితలు ఎక్కువయ్యాయి.
“డీ.జే. ఎవరు? జీన్‌, నాకసలు ఎమౌతోందొ నిజంగా చెప్పు,” అంది కేరన్‌.

కానీ తను ఆమెకు చెప్పలేడు. ఇప్పుడు, ఇన్నాళ్ళ తర్వాత నిజం అసలు చెప్పలేడు. ఇప్పుడా కథంతా చెప్తే, మొదటి నుంచీ ఆమెకి అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నట్టే అవుతుంది, ఆమె మనసులో ఉన్న అనుమానం మరింత బలపడుతుంది.
“డీ.జే. నాకు చాలా కాలం క్రితం తెలిసినవాడు,” అన్నాడు. “అతను మంచివాడు కాదు. నీకిలాంటి మాటలు చెప్పి, నీ బాధని చూసి ఆనందించే రకం.”
వంటింట్లో ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు. నిశ్శబ్దంగా వాళ్ళిద్దరూ ఫ్రాంకీని చూస్తూ తింటున్నారు. జీన్‌కి అసలేమీ అర్థమవ్వలేదు. డీ.జే.నే అనుకున్నాడు. బతికుంటే వాడికి ఇప్పుడు పదిహేనేళ్ళుంటాయి.  వాడు తన్ని వెంటాడి వెంటాడి పట్టుకున్నాడా? వాడిప్పుడు ఇంటి బైట కాపుకాచి ఉన్నాడా? ఫ్రాంకీ  అరుపులకీ, డీ.జే. కీ సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నాడు. నిన్న రాత్రి జరిగిన దాంట్లో డీ.జే. పాత్ర ఏంటి? తను టీ.వీ. చూస్తూ ఉంటే వెనక నుంచి కనపడకుండా వచ్చి మత్తుమందు ఇచ్చాడా వాడు? నమ్మశక్యంగా లేదు.

“ఎవరో మనకు తెలియని తాగుబోతు వెధవ అయ్యిండొచ్చుగా?” అన్నాడు కేరన్‌ ను ఉద్దేశించి. “తప్పుగా మనింటి నంబరుకి ఫోన్‌ చేసాడేమో. వాడు నా పేరు అడిగాడా అసలు?”
“గుర్తు లేదు,” అంది కేరన్‌. “జీన్‌…”
ఆమె గొంతులోని అనుమానం, అపనమ్మకం ఇంక పడలేకపోయాడు. పిడికిలితో బలంగా టేబుల్‌ గుద్ది లేస్తూ అరిచాడు. “నిన్న రాత్రి నేనెవ్వరితోనూ ఎక్కడికీ వెళ్ళలేదు. నేను తాగలేదు, తాగలేదు, తాగలేదు. అదీ నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే…”
వాళ్ళిద్దరూ తన వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. “లేకపోతే?.. ఏం చెయ్యనూ?” అడిగింది కేరన్‌.
“ఏమీ లేదు,” అన్నాడు జీన్‌ బలంగా నిట్టూరుస్తూ.

పెద్ద దెబ్బలాట ఏమీ జరక్కపోయినా, ఇల్లంతా నిశ్శబ్దం కమ్ముకుంది. అతను నిజం చెప్పటంలేదని ఆమెకు తెలుసు. తనకి తెలియని కథ ఏదో దాస్తున్నాడని తెలుసు. కానీ ఏమని చెప్తాడూ? అతను వంటింట్లో నోరుమూసుకొని అంట్లు తోముతున్నాడు, ఆమె ఫ్రాంకీకి స్నానం చేయించి పడుకోపెడుతోంది. రాత్రి చప్పుళ్ళు వింటూ అతను బైటకి చూస్తున్నాడు. ఏ నిముషమైనా డీ.జే. మొహం చెట్టు వెనక నుంచి ప్రత్యక్షమవుతుందేమోనని చూస్తున్నాడు. ఎవరో అతన్ని కనిపెడుతున్నట్టు ఉంది, ఊపిరాడటం లేదు. కడుగుతున్న కంచం తన చేతుల్లో వణుకుతోంది.

పనంతా పూర్తి చేసి అతను మేడ మీదకెళ్ళేటప్పటికి కేరన్‌ పుస్తకం చదువుతూ మంచం మీద చారబడి ఉంది.
“కేరన్‌,” అని పిలిచాడు. ఆమె కావాలని ఉలుకూ పలుకూ లేకుండా పుస్తకం పేజీ తిరగేసింది.
“నిజం చెప్పే ఉద్దేశ్యముంటే గానీ నువ్వు నాతో మాట్లాడకు,” అతని వైపు చూడకుండానే అంది.
“ఈ ఒక్క విషయం చెప్పు,” అన్నాడు. “తిరిగి ఫోన్‌ చెయ్యడానికి నంబరేమైనా ఇచ్చాడా?”
“లేదు,” అంది కేరన్‌ ఇంకా తల పైకెత్తకుండానే. “త్వరలోనే నిన్ను కలుస్తానని అన్నాడంతే.”

అతను రాత్రంతా మేలుకొని ఉండదలుచుకున్నాడు. స్నానం చేసి బట్టలు కూడా మార్చుకోలేదు. సోఫా మీద కూర్చొని, టీ.వీ. చూస్తున్నాడు. అర్థరాత్రి. ఒంటిగంట.

పైకెళ్ళి ఫ్రాంకీ ఎలా వున్నాడో చూసొచ్చాడు. ఫ్రాంకీ బాగానే ఉన్నాడు, దుప్పటి తన్నేసి, నోరు తెరుచుకొని పడుకొనున్నాడు. జీన్‌ ఒక్క క్షణం తలుపు దగ్గర నిల్చొని, ఏమైనా కదలిక వినబడుతుందా అన్నట్టు ఆగి విన్నాడు. ఫ్రాంకీ బొమ్మలూ, పుస్తకాలూ, అన్నీ వేటి జాగాల్లో అవున్నాయి. ఫ్రాంకీ మొహం తను చూస్తున్న కలలకు స్పందిస్తున్నట్టు మధ్యమధ్యలో బిగుసుకుంటోంది.

రాత్రి రెండయ్యింది. సోఫాలో జీన్‌ తన సగం నిద్రలోంచి ఉలిక్కి పడ్డాడు. ఎక్కడో దూరంలో ఏంబులెన్స్‌ కూత. ఒక్క సారి వచ్చిన మెలకువకి లేచి కూర్చొని, టీ.వీ.లో ఛానెల్లు తిప్పుతున్నాడు. ఒక చోట నగలమ్ముతున్నారు. మరో చోట శవపరీక్ష జరుగుతోంది.

కల్లో డీ.జే. పెద్దవాడిగా కనిపించాడు. పందొమ్మిది, ఇరవై ఉంటాయి. జీన్‌ మందు కొడుతున్న బార్‌ లోపలికొచ్చాడు. జీన్‌ వాణ్ణి వెంటనే గుర్తుపట్టాడు. ఆ సన్నటి శరీరం, ఆ గుడ్లగూబ కళ్ళూ. ఎటొచ్చీ ఇప్పుడు డీ.జే.  పెద్దైపోయాడు. వాడి చేతులు బలంగా, పచ్చబోట్లతో నిండున్నాయి. జీన్‌ పక్కకొచ్చి కూర్చునేటప్పటికే వాడి కళ్ళల్లో కోపం, ద్వేషం కనిపిస్తున్నాయి.

“నేను చచ్చిపోయిన దగ్గరనుంచీ నీ గురించే ఆలోచిస్తున్నాను,” అన్నాడు. వాడు జీన్‌ వైపుకి తిరగలేదు కానీ, ఆ మాటలు తనతోనే అంటున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. “చాలా కాలంగా నీ కోసం వెతుకుతున్నాను,” మెత్తగా అన్నాడు డీ.జే.. చుట్టుపక్కల గాలంతా వేడిగా మారింది. జీన్‌ వణుకుతున్న చేతులతో నోట్లో సిగరెట్టు పెట్టుకున్నాడు. నన్ను క్షమించు, చాలా తప్పులు చేసాను, అనాలనిపించింది అతనికి.

కానీ అతనికి ఊపిరాడటం లేదు. డీ.జే. తన వంకర పళ్ళు చూపిస్తూ జీన్‌ వైపే చూస్తున్నాడు. “నీతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు,” అని బుసకొడుతున్నట్టు చెప్పాడు.

జీన్‌ కళ్ళు తెరిచేటప్పటికి గదినిండా పొగనిండి ఉంది. ఒక్క క్షణం ఏమీ అర్థమవ్వక లేచి కూర్చున్నాడు   ఇంకా డీ.జే. తోనే ఉన్నట్టుండి, అప్పుడు వెలిగింది తన ఇంట్లోనే ఉన్నాడని.

ఎక్కడో మంటలున్నాయి   అతనికి వినిపిస్తోంది. వేలకువేలు చిన్న చిన్న పురుగుల్లా మంటలు సామానంతటినీ నమిలి మింగేస్తున్న చప్పుడు వినిపిస్తూనే ఉంది. అతను పొగకమ్మిన గదిలో గుడ్డివాడిలా కొట్టుకుంటున్నాడు. పాక్కుంటూ హాల్లోనుంచి మెట్ల వైపుకొచ్చాడు. “కేరన్‌! ఫ్రాంకీ!” అని గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఆ మంటల హోరులో అతని గొంతు వినబడటంలెదు. ఊపిరాడక గొంతుకూడా పెగలటంలేదు.
కింది మెట్ల దగ్గరకొచ్చి పైకి చూస్తే, మంటలూ, ఆ పైన చీకటి తప్ప మరేమీ కనిపించటం లేదు. మెట్లెక్కుదామని ప్రయత్నం చేసినా, మంట అతన్ని వెనక్కి తోసింది. ఫ్రాంకీ బొమ్మొకటి కరిగి ముద్దౌతూ తన చేతికి తగిలింది. అది వదిలించుకుని పైకి చూస్తే, ఫ్రాంకీ గదిలో మంట మరింత బలం పుంజుకున్నట్టు భగ్గున మెరిసింది. మెట్లపైన, పొగలో నుంచి ఓ పిల్లాడి మొహం కనిపించిందతనికి. నిప్పంటుకుని కాలిపోతున్నా, ఆ మొహం తన వైపే తీక్షణంగా చూస్తోంది. కొన్ని మెట్లెక్కి, మరొక్క సారి వాళ్ళ పేర్లు పిలిచే ప్రయత్నం చేసాడు; గొంతు పెగల్లేదు కానీ, వాంతి వచ్చింది.
మంట మరో సారి భగ్గుమంది. మెట్ల మీద అతనికి కనిపించిన మొహం ఇంక కనబడటంలేదు. తన జుట్టూ, కనుబొమ్మలూ చర్మానికి వేడిగా అంటుకున్నట్టనిపించింది. చుట్టూ గాలిలో ఒక హోరుంది, ఏదో కోపం ఉంది. మెట్లమీద నుంచి కిందకు దొర్లిపడుతూ ఉంటే ఆ హోరు తన వెంటే వినబడుతోంది. తన గొంతూ, ఆ చప్పుడూ కలిసి చుట్లు తిరుగుతూ, పల్టీలు కొడుతూ ఉండగా ఇల్లంతా మసక మసగ్గా మారి చీకట్లో కలిసిపోయింది.

తను గడ్డి మీద పడిపోయి ఉన్నాడు. తన కళ్ళళ్ళో ఎర్రని టార్చి వెలుగు. ఓ పేరామెడిక్‌, తన పెదవుల మీద నుండీ ఆమె పెదవులు తీసింది. తను బలంగా ఊపిరి పీల్చుకున్నాడు.
“ష్‌.,” అని ఆమె మెత్తగా అతని కళ్ళు మూసింది. “అటు చూడకు.”
కానీ అతను చూసాడు. ఒక వైపు పొడవాటి నల్లని ప్లాస్టిక్‌ సంచీలోంచి కేరన్‌ జుట్టు బయటకు వేలాడుతోంది. పక్కనే, నల్లగా మసిబారిన ఓ పిల్లాడి శవం. ఇంకా ముడుచుకుని పడుకున్నట్టే ఉంది. ఆ శవాన్ని వాళ్ళు మరో సంచీలో పెడుతూ ఉంటే చూసాడు. పిల్లాడి మూతి గుండు సున్నా చుట్టినట్టు బిగిసిపోయి ఉంది. అతనికో భయంకరమైన కేక వినిపించింది.