నీతో నువు

నీతో నువు ఉన్నపుడైనా
నీకు స్వేచ్ఛ ఇస్తున్నావా
లేక, బానిసలా చూస్తున్నావా

సమాజాన్ని దాటి,
సమాజం భయాన్నీ, హింసనీ దాటి,
కట్టుబాట్ల గానుగెద్దు బతుకు దాటి,
మర్యాదల బానిసత్వం దాటి,
ఆదర్శాల, నాయకత్వాల భ్రమలు దాటి,
ఎవరేమనుకుంటే ఏమనే చిత్తభ్రమలు దాటి

ఉత్త నేనుగా
ఖాళీ ఆకాశం లాంటి, గాలి లాంటి
ఖాళీ జ్వాల లాంటి, జలం లాంటి
ఉత్త పేరు లేని, వ్యక్తి లేని
గత, భవితల మరకలు లేని
స్వచ్ఛమైన నేనుగా
నిన్ను నువు చూడగలుగుతున్నావా

నీతో నువు ఉన్నప్పుడైనా
ఆకాశం ఆకాశంతో నిండినట్లు
గాలి గాలితో, జ్వాల జ్వాలతో,
నీరు నీటితో నిండినట్లు
నీతో మాత్రమే నువు నిండగలుగుతున్నావా

నిండుగా పొరలి పొంగి
నువు లేకపోవటంలోకి
నీకు స్వేచ్ఛ ఇవ్వగలుగుతున్నావా,
ఏమీ కాకుండా మిగలగలుగుతున్నావా?

 


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి:

హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; ఆరు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు, ఊరికే జీవితమై, సృష్టి ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును.

 ...