యానాం… తూర్పున సముద్రం, పక్కనే గోదావరి పాయ. ఉదయం ఇంకా పూర్తిగా నిద్ర లేవకముందే ఆ ఊరు మాత్రం శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. ఆ శ్వాస గాలిది కాదు, మగ్గాలది. గోదావరినుంచి వచ్చే చల్లటి గాలి, వీధుల్లో అప్పుడే ఆసు పోసి ఆరబెట్టిన నూలు దారాలను తడిమి వెళ్లేది. రాత్రంతా నానబెట్టిన దారాలకు గంజి పెడుతున్న వాసన ఆ వీధికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చేది.
దూరంగా రేవు నుంచి పడవల లంగరు చప్పుడు, ఎద్దుబండ్ల చక్రాల గరగరలు వినిపిస్తున్నా… యానాం నడిబొడ్డున ప్రతిధ్వనించేది మాత్రం ఒకే ఒక్క శబ్దం.
టక్… టక్… టక్…
అది మగ్గంనుంచి వచ్చే నాడె చప్పుడు. అచ్చు కర్రల మధ్యనుంచి, పడుగు, పేకల మధ్య నాడె ఒక కొసనుంచి మరో కొసకు పరుగులు పెడుతుంటే వచ్చే ఆ లయబద్ధమైన శబ్దం ఒక ఇంట్లో మొదలైతే, దానికి ఎదురింటి అచ్చు కర్రలు వెంటనే సమాధానం చెప్పేవి. ఒక మగ్గం మొదలైతే మరో మగ్గం, దాని వెంట ఇంకో మగ్గం. ఆ శబ్దం కలిసిపోయి యానాం వీధులకు ఒక ప్రత్యేకమైన లయను ఇచ్చేది.
వెంకటప్పయ్యకు ఊహ తెలిసినప్పటినుంచీ ఆ శబ్దమే అతని జోలపాట. ఆ పడుగు పేకల కలయికే అతని లోకం. అతని తండ్రి సుబ్బయ్య యానాంలోనే పేరుగాంచిన నేతకాడు. ఆ రోజు ఉదయాన్నే మగ్గం గుంటలో రెండు కాళ్లు తొక్కుడు పలకలపై ఆనించి కూర్చున్న సుబ్బయ్య, పడుగు దారాలను సరిచేస్తూ ఎంతో ఏకాగ్రతతో పని చేస్తున్నాడు. పక్కనే చిన్న పీట మీద కూర్చున్న పదేళ్ల వెంకటప్పయ్య, తండ్రి చేతిలోని కండెలను ఆసక్తిగా చూస్తున్నాడు.
“నాన్నా… ఈ దారాలు అంత తెల్లగా ఎందుకున్నాయి? నిన్నటి దాకా పసుపు రంగులో ఉండేవి కదా?” అడిగాడు వెంకటప్పయ్య.
సుబ్బయ్య తన చేతిలోని నాడెను క్షణం పాటు ఆపి, కొడుకు వైపు చూసి నవ్వాడు. “నిన్న రాత్రంతా గంజిలో ఉడకబెట్టి, తెల్లవారుజామున రేవులో ఉతికి ఆరేశాం కదరా. దారానికి పట్టిన మురికి పోతేనే, మనం నేసే బట్టకు నిండుదనం వస్తుంది. ఇది మామూలు నూలు కాదురా కన్నా… మన బతుకు.”
మగ్గం చెక్కను ఆప్యాయంగా తడిమాడు సుబ్బయ్య. అది కేవలం ఒక చెక్క కాదు, ఒక తరంనుంచి మరో తరానికి అందించబడిన వారసత్వ సంపద. “మన తాత ఈ మగ్గం గుంటలోనే కూర్చున్నాడు. నేను కూర్చున్నాను. రేపు నువ్వు కూర్చోవాలి. మనం నేసేది బట్ట కాదురా.. మన ధర్మం! మన కష్టం, చెమట ఈ దారాల్లోనే కలిసిపోతాయి.
ఇదుగో… ఈ తెల్లని నూలు దారాల్లో కొన్నింటిని తీసుకుని, మన ఊరిలోని అద్దకం పనివాళ్ల దగ్గరకు పంపుతాం. వాళ్లు ఈ దారాలను పెద్ద నీలిమందు తొట్లలో ముంచి, ముదురు నీలం రంగు అద్దుతారు. ఎందుకో తెలుసా? ఏ రంగుకైనా వయసుంటుందేమో కానీ, ఈ నీలిమందుకు మాత్రం ఉండదు. గాలి తగిలేకొద్దీ రంగు ముదురుతుందే తప్ప చెదరదు…”
అలా చెబుతూనే నాడెను వేగంగా కదుపుతూ, సగం పూర్తయిన వస్త్రాన్ని పైకి లేపాడు. తెలుపు, ముదురు నీలం దారాలు అడ్డునిలువుగా కలిసి చదరంగపు గడుల్లా అల్లుకున్న వస్త్రమది. చేతికి కాస్త గరుకుగా తగిలినా, ఆ పడుగు పేకల కలయికలో తరాలనాటి గట్టిదనం ఉట్టిపడుతోంది.
“దీని పేరే ‘గిన్నీ’ (Guinée). మన యానాం నేతకారుల చేతుల్లో తయారయ్యే ఈ నీలిరంగు గడుల కాటన్ బట్టంటే దొరలకు ప్రాణం. ఈ అల్లికలోనే మన ఆత్మ కలిసి ఉంటుందిరా,” అన్నాడు సుబ్బయ్య కళ్లలో గర్వం తొణికిసలాడుతుండగా.
అదొక అందమైన వలయం. తెల్లవారకముందే ఇంటి ముందు పత్తి మూటలు దిగేవి. సాలె ఇళ్ల ఆడవాళ్లు రాట్నాల మీద దారాన్ని వడికేవారు. ఆ దారాల్లో కొన్నింటిని నీలిమందు అద్దకానికి పంపేవారు. రంగు పులుముకున్న ఆ దారాలు సుబ్బయ్య మగ్గంలో గిన్నీ బట్టగా మారేవి. సాయంత్రానికి నరసయ్య మనుషులు వచ్చి ఆరోజు నేసిన బట్టల కట్టలు తీసుకెళ్లేవారు.
ఈ చక్రం సజావుగా తిరిగినన్ని రోజులూ సాలెల జీవితాల్లో వెలుగులు నిండేవి. సుబ్బయ్యకు మగ్గం ఒక వస్తువు కాదు — ఆ వెలుగుల్ని నేసిపెట్టే జీవనాధారం.
ఒకసారి వెంకటప్పయ్య అడిగాడు, “ఇవన్నీ ఎక్కడికి పోతాయి నాన్నా?”
“నరసయ్య కొట్టుకు, అక్కడనుంచి కోరంగి ఓడల మీదికి. వాటిపై సముద్రం దాటి దూరదేశాలకు,” అన్నాడు సుబ్బయ్య. “అక్కడ పెద్దపెద్దవాళ్లు మన బట్టలు వేసుకుని మురిసిపోతారట.”
ఒకరోజు నరసయ్య స్వయంగా పత్తి మూటల లెక్క చూసుకుంటూ వచ్చాడు. సుబ్బయ్య అతని చేతిలోని లెక్క పుస్తకం చూసి, “ఏమయ్యా నరసయ్యా, పత్తి ధర ఇంత పెరిగిందేమిటి? గత వారం ఇంతకంటే తక్కువకే తీసుకొచ్చావు కదా?” అని అడిగాడు.
నరసయ్య మూట మీద చేయి వేసి, “పత్తి ధర కాదు సుబ్బయ్యా… దాని మీద పడిన సుంకం. బ్రిటిష్ వాళ్ల ప్రాంతంనుంచి తెచ్చుకుంటున్నాం కదా. అక్కడి పన్ను పెరిగింది,” అన్నాడు. సుబ్బయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు.
కొన్నేళ్లు గడిచాయి. వెంకటప్పయ్య యవ్వనంలోకి అడుగుపెట్టాడు. తండ్రికి తగ్గ కొడుకుగా మగ్గం పనిలో ఆరితేరాడు. పడుగు దారాలు తెగకుండా అచ్చు వేయడంలో, నాడెను కంటికి కనిపించనంత వేగంగా పరుగెత్తించడంలో అతనికతనే సాటి అనిపించుకొన్నాడు. ఆ మగ్గం చప్పుడికి తోడుగా అతని ఇంటికి ఒక ఇల్లాలు వచ్చింది. ఇంటికి వేసిన సున్నాలు వెలిసిపోయేలోపు పండంటి కొడుకు, ఓ కూతురు పుట్టారు. ఇంటి దూలానికి చిన్న ఊయల వేలాడింది. మగ్గం శబ్దాల మధ్య పిల్లల ఏడుపులు, నవ్వులు కలిసిపోయాయి. అతని సంసారం మగ్గం చుట్టూ మరింత అల్లుకుంది.
ఒక రోజు సాయంత్రం, సాలిపేట వీధి అరుగు మీద అందరూ కూర్చుని చుట్టలు కాలుస్తుండగా, వ్యాపారి నరసయ్య ఆదుర్దాగా అక్కడికి వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు లేదు. చేతిలో సరుకు తాలూకు కాగితాలు లేవు.
“ఏమైంది నరసయ్యా, అలా ఉన్నావు?” అడిగాడు సుబ్బయ్య చుట్ట ఆర్పేస్తూ.
నరసయ్య గొంతు సవరించుకుని, “పట్నంనుంచి కబురు వచ్చింది సుబ్బయ్యా… మన బట్టలు పోయే బోర్బన్ దేశం ఉందే… అక్కడ మన వస్త్రాల మీద కొత్త పన్ను వేశారట దొరలు. ఇరవై శాతం పన్ను అట!” అన్నాడు.
అక్కడ ఉన్న సాలెలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్లకు పడుగు, పేకల లెక్కలు తెలుసు కానీ, ఈ శాతాలు, పన్నుల లెక్కలు తెలియవు.
“ఇరవై శాతం అంటే ఎంతన్నా?” వెంకటప్పయ్యకు ఆ సంఖ్య అర్థం కాక అడిగాడు.
నరసయ్య నిట్టూరుస్తూ, “అంటే… వంద రూపాయల బట్ట అమ్మితే, అందులో ఇరవై రూపాయలు ఆ దొరలకే కట్టేయాలి. మీ బట్టకు దొరికే ధరలో ఐదో వంతు అక్కడికే పోతుంది,” అన్నాడు.
“అంత పన్నా? మన దగ్గర పన్నులు వసూలు చేయడం లేదా? మళ్ళీ అక్కడ ఎందుకు?” సుబ్బయ్య గొంతులో కోపం.
“అది వాళ్ల రాజ్యం సుబ్బయ్యా. మన బట్టలు అక్కడికి వెళ్లాలంటే ఆ పన్ను కట్టాల్సిందే. కాబట్టి… మనం బట్టను ఇంకా చౌకగా అమ్మితే తప్ప వాళ్లు కొనరు.”
వెంకటప్పయ్యకు ఆ మాట తీవ్రంగా కోపం తెప్పించింది. “ఎందుకు చౌకగా అమ్మాలి? రాత్రనకా పగలనకా కళ్లు కాయలు కాచేలా, నడుములు వంగిపోయేలా మనం మగ్గం గుంటలో కుస్తీ పడితేగానీ ఆ గిన్నీ బట్ట తయారవ్వదు. వాళ్ల పన్నుల కోసం మన కష్టాన్ని ఎందుకు చౌకగా ఇవ్వాలి?”
నరసయ్య చేతులు నలుపుకొంటూ, “దొరల పన్ను తగ్గించమని మనం అడగగలమా బాబూ? వాళ్ల శాసనం వాళ్లది.”
అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ముడిసరుకు కొందామంటే ధర ఎక్కువ. తీరా నెత్తురు ధారపోసి బట్ట నేసి అమ్ముదామంటే గిట్టుబాటు కాని పరిస్థితి.
సుబ్బయ్య లేచి నిలబడ్డాడు. తన చేతులలో ఉన్న నూలు దారపు పోగులను దులిపి, “ఏదేమైనా మన పని మనం చేసుకుందాం. మన చేతికి ఉన్న నైపుణ్యం ఏ పన్నుతోనూ పోదు. మన గిన్నీ బట్టకు విలువ ఎప్పటికీ ఉంటుంది,” అని ధీమాగా చెప్పి ఇంట్లోకి నడిచాడు.తండ్రి మాటల్లో ఉన్న నమ్మకం వెంకటప్పయ్యకు కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చింది.
కానీ ఈ మార్పు మొదట మగ్గం వద్ద కాదు, ఇంటి పొయ్యి దగ్గర కనిపించింది. వారానికి ఒకసారి కొనే పచారీ సామాన్లు పదిహేను రోజులకు, నెల్లాళ్ళకు ఒకసారి కొనుక్కోసాగారు. “నీకిష్టమైన కూర రేపు వండుతానులే. ఈ రోజుకు చారు బువ్వ తినమ్మా,” అంటూ వెంకటప్పయ్య భార్య పిల్లలను బుజ్జగించేది.
సుబ్బయ్యకు తెలియదు… యూరప్ నుంచి ఓ తుఫాను అప్పటికే యానాం సాలెల ఉనికిని తుడిచిపెట్టడానికి దూసుకొస్తోందని. దాని పేరు ఆవిరి యంత్రం. అది సముద్రాలు దాటి యానాం రేవును తాకటానికి ఎంతో కాలం పట్టలేదు.
యానాం బజారు ఆ రోజు ఎప్పటిలా లేదు. వస్త్రపు దుకాణాల ముందు జనం గుమిగూడి ఉన్నారు. వెంకటప్పయ్య ఏదో పని మీద అటుగా వెళ్తూ, ఆ గుంపును చూసి ఆగాడు. వాళ్ల మధ్యలో వ్యాపారి నరసయ్య ఒక కొత్త రకం బట్టను విప్పి చూపిస్తున్నాడు. అది ముదురు నీలం రంగులో ఉండే తమ ‘గిన్నీ’ వస్త్రం కాదు, యానాం నేతకారులు సంప్రదాయంగా నేసే సన్నని మస్లిన్ (uslin) బట్ట కూడా కాదు.
ఆ బట్ట ఎంతో పలుచగా, ఒకే తీరున గట్టిగా అల్లినట్లుంది. కానీ అందులో తమ చేనేత బట్టలకు ఉండే మృదుత్వం లేదు, ప్రాణం అసలే లేదు.
“ఏమిటీ బట్ట?” గుంపులో నుంచి ఒకరు అడిగారు.
“దీని పేరు మాదెపొలం (Madépolams). ఇంగ్లీషు వాళ్ల సరుకు. యూరప్నుంచి ఓడల్లో మన రేవుకు వస్తోంది,” నరసయ్య గొంతులో వ్యాపారపు లెక్కలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
వెంకటప్పయ్య ఆ బట్టను చేతిలోకి తీసుకున్నాడు. అతని వేళ్లకు అది చాలా కర్కశంగా తగిలింది. మగ్గం మీద ఒక మనిషి చెమట చిందిస్తూ, పడుగు పేకలను కలుపుతూ నేసిన బట్టలా అనిపించలేదు అది.
“దీన్ని మనుషులు నేయలేదు బాబూ… యంత్రాలు నేసిన బట్ట ఇది. మనం నెల రోజుల్లో నేసే వస్త్రాన్ని, ఆ ఇనుప యంత్రాలు ఒక్క రోజులో నేసి పడేస్తాయట,” అన్నాడు నరసయ్య.
వెంకటప్పయ్యకు ఆ మాట నచ్చలేదు. “బట్టకి ప్రాణం ఉండాలి కదా నరసయ్యన్నా? మన నీలి రంగు గిన్నీ బట్ట ముందు ఇది నిలబడుతుందా?”
నరసయ్య వ్యంగ్యంగా నవ్వాడు. “బట్ట ప్రాణంతో ఉందా లేదా అని కొనేవాడు చూడడు వెంకటప్పయ్యా… బట్ట ఎంత చౌకగా వస్తోందని మాత్రమే చూస్తాడు. మన బట్ట ధర కన్నా ఇది సగం ధరకే వస్తోంది. జనం ఎగబడి కొంటున్నారు.” క్షణం ఆగి “నా గోదాములోనే మీ బట్టల కట్టలు పేరుకుపోతున్నాయి వెంకటప్పయ్యా. నాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు. కొనేవాళ్లు తగ్గిపోతున్నారు,” అన్నాడు.
ఆ క్షణంలో వెంకటప్పయ్యకు మొదటిసారి గుండెల్లో భయం మొదలైంది. ‘మనిషితో పోటీ అయితే తన నైపుణ్యంతో గెలవడానికి ప్రయత్నించవచ్చు; వాళ్లు మనుషులతో పోటీ పడటం లేదు. వేగంతో, ధరతో, పెద్ద యంత్రాల శక్తితో పోరాడుతున్నారు.’
యానాంలో పత్తి పండదు, బ్రిటిష్ ప్రాంతంనుంచి తెచ్చుకోవాలి. దానిపై ఇప్పటికే పదహారు శాతం సుంకం, నేసిన బట్టను ఎగుమతి చేస్తే ఇరవై శాతం పన్ను. స్థానికంగా అమ్మాలంటే ‘మాదెపొలం’ బట్టల పోటీ. ఇవన్నీ కలిసి మూడువైపులనుంచీ యానాం నేతకారుల ఉసురు తీయడం మొదలుపెట్టాయి.
ఫ్రెంచ్ ప్రభుత్వం నేతకారుల మీద ‘మొంట్రఫాట్’ (Montrafat) అనే వృత్తి పన్ను వేసేది. యానాం పాలకులు ఇక్కడి నేతకారుల దుస్థితి చూసి, వారి మగ్గాలపై ఆ పన్నును మినహాయించారు. అప్పటికే ప్రాణం విడుస్తున్న యానాం చేనేత వృత్తికి అది ఏమాత్రం ఊపిరి పోయలేకపోయింది.
ఇదే సమయంలో సుబ్బయ్య మంచం పట్టాడు. వయసు మీద పడటం కంటే, కళ్లెదుటే తన వృత్తి నాశనమైపోతుండటం ఆ వృద్ధుడిని కుంగదీసింది.
“వెంకటప్పయ్యా…” వణుకుతున్న స్వరంతో కొడుకును పిలిచాడు సుబ్బయ్య.
వెంకటప్పయ్య వెళ్లి తండ్రి చేతులు పట్టుకున్నాడు. ఆ చేతులు ముతకగా, దారాలు కోసుకుపోయిన మచ్చలతో నిండి ఉన్నాయి. ఎన్నేళ్లుగా మగ్గం మీద పని చేసిన చేతులవి! వాటిని చూస్తూ వెంకటప్పయ్య కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.
“మగ్గాన్ని వదిలిపెట్టకురా. మగ్గం పచ్చగా ఉంటే, మన బతుకు పచ్చగా ఉంటుంది. నాకు అంతే తెలుసు,” ఆ చివరి మాట తర్వాత అతని వేళ్లు వెంకటప్పయ్య చేతిలో నెమ్మదిగా సడలిపోయాయి.
తండ్రి పోయిన వారం రోజులకు, వెంకటప్పయ్య మొదటిసారి ఒంటరిగా మగ్గం ముందు కూర్చున్నాడు. అచ్చు కర్రను లాగాడు.
‘టక్’… నాడెను విసిరాడు.
ఆ శబ్దంలో మునుపటి గంభీరత లేదు. ఒక నిట్టూర్పులా వినిపించింది.
వీధిలో నెమ్మదిగా మార్పు మొదలైంది.
ముందుగా మల్లయ్య మగ్గం శబ్దం ఆగిపోయింది. రెండు రోజులైనా ఆ ఇంటినుంచి నాడె చప్పుడు రాకపోవడంతో, వెంకటప్పయ్య వెళ్లి చూశాడు. అక్కడ మగ్గం లేదు, గుంట మాత్రమే మిగిలి ఉంది.
“ఏమైంది మల్లన్నా? మగ్గం ఏదీ?”
“అమ్మేశాను వెంకటప్పయ్యా. వారం రోజులు కష్టపడి బట్ట నేస్తే, కొనే నాథుడు లేడు. ఇంట్లో పిల్లలు పస్తులున్నారు. మగ్గం విప్పి ఆ కలపను అమ్ముకున్నాను,” మల్లయ్య కళ్లలో కన్నీళ్లు లేవు, ఒక రకమైన శూన్యం ఉంది.
“మరి బతుకెలా?”
మల్లయ్య గాల్లోకి చూస్తూ, “ఇక్కడుంటే పస్తులుండాల్సిందే వెంకటప్పయ్యా… అద్దరి రేవులో పెద్ద ఓడలు వచ్చాయట. ఎవరో దొరలు మనవాళ్లను ఎక్కడికో ‘రీయూనియన్’ అట, ఆ దీవులకు తీసుకెళ్తున్నారట. అక్కడ చెరకు తోటల్లో పనట. ఏడు సముద్రాలు దాటే బట్ట నేసిన ఈ చేతులతో… ఇప్పుడు చెరకు గడలు నరకడానికి పోతున్నాను…” అన్నాడు.
ఖాళీగా ఉన్న మగ్గం గొయ్యి దృశ్యం వెంకటప్పయ్యను కలచివేసింది.
అది కేవలం ఒక మల్లయ్య కథ కాదు. యానాం అంతటా అదే పరిస్థితి.
పక్కింటి తిమ్మయ్య కుటుంబంలో మరో విషాదం. వాళ్ళ పదహారేళ్ల అమ్మాయి లక్ష్మికి నిశ్చయమైన పెళ్లి, డబ్బు పుట్టక వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పొద్దున్న కట్టిన కొబ్బరాకుల పందిరి రాత్రికే తీసేశారు. మామిడి ఆకులు నేలపై పడి ఉన్నాయి.
ఒకప్పుడు రంగులద్దే కేంద్రాలతో కళకళలాడిన భూములు నెమ్మదిగా కళావిహీనమయ్యాయి. నిన్నమొన్నటివరకూ వేల ఫ్రాంకుల పన్నులు కట్టిన నీలిమందు కేంద్రాలు ఆదాయం లేక, పన్నులు కట్టలేక మూతపడసాగాయి. ఒకప్పుడు పనివాళ్ళతో, బండ్లతో, తెల్లటి వస్త్రాలతో, నీలిమందు మరకలతో జీవం ఉట్టిపడిన ఆ నేలలు… ఇప్పుడు కలుపు మొక్కలతో, ఎండిన గడ్డితో బీడువారుతున్నాయి.
మగ్గాలు ఆగిపోతున్నాయి. నీలిమందు అద్దే కేంద్రాలు మూతబడ్డాయి. వ్యాపారులు, ప్రజలు చౌకబారు యంత్రపు బట్టల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఒక ఉదయం వెంకటప్పయ్య తన మగ్గం దగ్గర కూర్చుని గిన్నీ వస్త్రం నేస్తుంటే, అతని కొడుకు అక్కడికి వచ్చాడు. కుర్రాడికి పదేళ్లుంటాయి.
“నాన్నా… నేను కూడా మగ్గం నేర్చుకుంటాను,” అన్నాడు.
నిజానికి ఆ మాట వింటే ఏ చేనేత తండ్రికైనా గుండె ఉప్పొంగుతుంది. తన వంశధర్మం నిలబడుతుందన్న ఆనందం కలుగుతుంది. కానీ వెంకటప్పయ్య ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాడు. తన చేతిలో ఉన్న నాడెను ఆపేశాడు. తండ్రి సుబ్బయ్య తనను కొత్తబట్టలు తొడిగి మగ్గం గుంటలో కూర్చోబెట్టి, అక్షింతలు వేసి ఆశీర్వదించిన దృశ్యం గుర్తొచ్చింది.
‘మనం నేసేది బట్ట కాదురా, మన వృత్తిధర్మం, వంశాచారం,’ అన్న మాటలు చెవుల్లో మోగాయి. ఇప్పుడు ఆ మగ్గం తన కొడుక్కి ఆకలిని తప్ప మరేమీ ఇవ్వలేదని అతనికి స్పష్టంగా తెలుసు.
“వద్దురా… నువ్వు ఈ గోతిలో దిగొద్దు,” అన్నాడు వెంకటప్పయ్య గొంతు వణుకుతుండగా.
కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. ఒక సాలెవాడు తన బిడ్డను మగ్గానికి దూరం చేయడం అంటే, తన చేతుల్ని తానే నరుక్కోవడంలాంటిదే. అయినా, ఆ నిర్ణయం తీసుకోక తప్పని స్థితికి వెంకటప్పయ్యను కాలమే నెట్టింది.
యానాం గాలిలో ఇప్పుడు మగ్గాల శబ్దం తగ్గిపోయింది. నిశ్శబ్దం పెరుగుతోంది. వీధుల్లో మగ్గాల సవ్వడి సగానికి సగం తగ్గిపోయిన ఆ రోజుల్లో, ఒకనాడు బజారులో వ్యాపారి నరసయ్య దుకాణం ముందు వెంకటప్పయ్య నిలబడి ఉన్నాడు. దుకాణం నిండా ఆంగ్లేయులు దిగుమతి చేసిన కొత్త బట్టల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.
“ఏమిటన్నా ఇది? ఎటు చూసినా ఈ ‘మాదెపొలం’ బట్టలే కనిపిస్తున్నాయి. అసలు ఈ మాదెపొలం పేరు మనదే కదా? మన నరసాపురం పక్కన ఉన్న మాధవాయపాలెం పేరే కదా ఆ ఆంగ్లేయులు పలుకలేక మాదెపొలం అన్నారు! మన బట్ట పేరు వాళ్ల సరుక్కు ఎందుకు పెట్టుకున్నారు?” వెంకటప్పయ్య గొంతులో ఆగ్రహం, అయోమయం కలగలిసి ఉన్నాయి.
నరసయ్య నిట్టూరుస్తూ ఒక బట్టల కట్టను చేత్తో తడిమాడు. “అదే వాళ్ళ తెలివైన వ్యాపారం వెంకటప్పయ్యా… మన పత్తి అక్కడికి పోతుంది. వాళ్ల యంత్రాలు ఒక్క రోజులో వేల గజాలు నేస్తాయి. వాటికే ‘మాదెపొలం’ అని పేరు పెట్టి, మళ్లీ పడవల్లో మన దగ్గరకే తెచ్చి మన బజార్లలోనే కుప్పలు పోస్తున్నారు. దాని తయారీ ఖర్చు చాలా తక్కువ. అందుకే మన గిన్నీ బట్టకంటే సగం ధరకే ఆ బట్టను అమ్ముతున్నారు.”
“మన చేతుల్లోంచి మన బతుకును తీసుకెళ్లి… మళ్ళీ మనకే అమ్ముతున్నట్టుంది.”
నరసయ్య ఏమీ అనలేక తల ఊపాడు.
భారంగా ఇంటికి చేరుకున్న ఆ రోజు సాయంత్రం చేతులు కడుక్కుని అరుగు మీద కూర్చోగానే, భార్య గుమ్మంలోకి వచ్చి నిలబడింది.
“ఏమయ్యా… ఎల్లుండి మన పిల్ల పుట్టినరోజు. గుర్తుందా?” అంది.
అతను తల ఊపి ఆమె ముఖంలోకి చూశాడు.
“అమ్మాయి పెద్దదవుతోంది. ఈ పుట్టినరోజుకైనా తొలిసారి చీర కట్టాలని ముచ్చట పడుతోంది. ‘నాన్న తన చేతులతో నేసిన చీరే కట్టుకుంటానమ్మా’ అని ఎప్పటినుంచో ఒకటే అడుగుతోంది. పండగొచ్చినా, పబ్బమొచ్చినా పాతబట్టలతోనే సరిపెడుతున్నాం. కనీసం ఈ పుట్టినరోజుకైనా పిల్ల ముచ్చట తీర్చాలనిపిస్తుంది…” అంది నెమ్మదిగా.
ఆమె కాసేపు ఆగి, అతని ముఖాన్ని చూసింది.
“నువ్వు ఇంతగా కుంగిపోకు. రోజులు అన్నీ ఒకేలా ఉండవు. ఇవాళ బజారులో మన బట్ట అమ్ముడుపోలేదని మన చేతులు ఒట్టిపోయినట్టేమీ కాదు. మన పని మనకు తెలుసు. ఈ కష్టం కూడా ఏదోలా దాటిపోతుందిలే.”
వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు.
ఆమె భుజంపై చేయివేసి మళ్ళీ మెల్లగా అంది. “అప్పు తీసుకోవాల్సి వస్తే తీసుకుందాం. ఈ ఒక్కసారి పిల్ల ముచ్చట తీర్చుదాం. మన చేతులతో నేసిన చీర కాకపోయినా పర్లేదు. మన కష్టం తెలియకుండా అది నవ్వితే చాలు. నువ్వు మాత్రం ఇలా దిగులుగా కూర్చోకు. నువ్వు దిగులుపడితే ఇంట్లో వాళ్లందరికీ భయం వేస్తుంది.”
వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు.
తన కూతురు మొదటిసారి కట్టబోయే చీరకు సరిపడా రంగు నూలు, పట్టు పోగులు కొనాలంటే తన దగ్గర చిల్లిగవ్వ లేదు. అప్పు చేసి నేసినా, అది పూర్తయ్యేసరికి అయ్యే ఖర్చుకి, బజారులో దొరికే బట్టల ధరకు పొంతనే ఉండదు. రాత్రంతా అచ్చు కర్రలకు ఆనుకుని కూర్చున్నాడు. నాడెను చేతిలోకి తీసుకున్నాడు. చేతులు కదల్లేదు.
తన వంశధర్మం, తన రక్తం అయిన ఆ మగ్గం మీద తన కూతురికే చీర నేయలేని దుస్థితి.
మరుసటి రోజు బజారుకు వెళ్లి, అప్పు చేసి, చౌకగా దొరికే యంత్రం నేసిన చీరను కొని తెచ్చి కూతురి చేతిలో పెట్టాడు.
ఆమె ఆ చీరను చూసి, తండ్రి కళ్లలోకి చూసింది. ఏమీ అడగలేదు. అందులో పడుగు పేకల కలయిక లేదు, తన తండ్రి చేతి స్పర్శ లేదు. మగ్గం గుంటలో పుట్టిన వాసన లేదు.
ఆమె ఏమీ అనకుండా చీరను మడిచి లోపలికి తీసుకెళ్లిపోయింది.
వెంకటప్పయ్య గుండెలో ముల్లు దిగినట్లయింది.
వెంకటప్పయ్య ఆరుబయట నులకమంచంపై పడుకొని శూన్యంలోకి చూశాడు. అతని మనసు పాతికేళ్ల వెనక్కి వెళ్లింది. అప్పట్లో యానాం వీధుల్లో మగ్గాల చప్పుడే వినిపించేది. సుమారు మూడువేలమంది నేతకారులతో ఊరంతా ఒక పెద్ద మగ్గంలా కదిలేది. రాత్రి వేళ కూడా ఇళ్లల్లో ఎవరో ఒకరు మగ్గాన్ని ఆడిస్తూ ఉండేవారు.
అంతా మారిపోయింది. ఊరు మొత్తానికి ఇపుడు మహా అయితే ఓ వంద మగ్గాలుంటాయేమో.
ఒకప్పుడు వేల చేతులతో సాగిన ఆ వృత్తి కుంచించుకుపోయింది.
ఆ వందమందిలో తాను కూడా ఒకడినని వెంకటప్పయ్యకు తెలుసు. ఎదురింటి మల్లయ్య, పక్కింటి తిమ్మయ్య, వీధి చివర చెన్నయ్య… అందరూ ఆ లాంకషైర్ యంత్రాల దెబ్బకు రాలిపోయిన ఆకుల్లా ఆంగ్లేయుల ప్రాంతాలకు కూలీలుగా వెళ్లిపోయారు. ఒకప్పుడు ప్రపంచాన్ని మురిపించిన అద్భుత వస్త్రాలను నేసిన చేతులు, ఇప్పుడు రేవుల్లో మూటలు మోస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకొనే వయసుకు వచ్చిన కొడుకు “నాన్నా… మనం కూడా ఎక్కడికైనా వెళ్లిపోదాం. ఈ మగ్గం మీద బతుకు లేదు,” అన్నాడు ఒక ఉదయాన్నే.
వెంకటప్పయ్య ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఒంటరిగా చీకటిలో మగ్గం గుంటలో కూర్చున్నాడు. తన పూర్వీకులందరూ కూర్చున్న గుంట. చెక్క చల్లబడిపోయి ఉంది. ఒకప్పుడు దారాలతో నిండిన కండెలు ఖాళీగా చూస్తున్నాయి. ఒకసారి అచ్చు కర్రను బలంగా లాగాడు. ‘టక్’… . ఒకప్పుడు యానాం వీధులన్నీ కలిసి పాడిన ఆ సమూహగానం, ఇప్పుడు ఒకే ఇంట్లో ఒంటరి ఆర్తనాదంగా మిగిలిపోయింది.
ఉదయం ఇంటి ముందు ఒక చిన్న మూటతో నిలబడ్డాడు వెంకటప్పయ్య కొడుకు.
“మగ్గాన్ని కూడా తీసుకెళ్దామా నాన్నా?” అడిగాడు.
“వద్దు… అది ఇక్కడి మట్టికే సొంతం,” అన్నాడు తల అడ్డంగా ఊపుతూ.
మగ్గానికి ఉన్న బట్టను చుట్టే తానుకర్రపై కొద్దిగా మిగిలి ఉన్న గిన్నీ వస్త్రపు ముక్కను నెమ్మదిగా చింపి జేబులో వేసుకొన్నాడు వెంకటప్పయ్య.
అందులో తన తండ్రి గర్వం ఉంది, యానాం చేనేత చరిత్ర ఉంది, లాంకషైర్ మిల్లులు మింగేసిన నెత్తురు ఉంది.
భుజాన మూట వేసుకుని అడుగు ముందుకు వేశాడు. తండ్రీకొడుకులిద్దరూ వెనక్కి తిరిగి చూడలేదు.
ఆ రాత్రి గోదావరి గాలి మాత్రం ఖాళీగా ఉన్న మగ్గం మీదుగా దిగులుగా వీచింది.
చరిత్ర: ఫ్రెంచి యానాంలో చేనేత పరిశ్రమ గొప్ప వెలుగు వెలిగింది. 1786-1787 మధ్య కాలంలో భారతదేశంనుండి సుమారు ఎనిమిది నౌకల్లో యూరోపియన్ మార్కెట్కు ఎగుమతి చేయబడిన, సుమారు 30 లక్షల రూపాయిల విలువైన చేనేత దుస్తులలో 12% యానాం ఉత్పత్తులే. (The Textile Sector of Coromandel and The French Trade, 1750-1800- Arvind Sinha, Delhi University).
1841 లో సుమారు పదహారు లక్షల ఫ్రాంకుల విలువైన చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేసిన యానాం, 1865 నాటికి పూర్తిగా కుప్పకూలింది. ఎగుమతులే లేవు. చవకైన మాదెపొలం బట్టలవల్ల స్థానిక చేనేతకారులు వలసలు పోవటం. ఇవి చారిత్రక ఆధారాలు.
కథాకాలం 1840-1865 మధ్య. పాత్రలు, సంభాషణలు, సంఘటనలు, అనుభవాలు రచయిత కల్పన

