“ఎల్లప్పుడూ ఇథకాను మనసులో ఉంచుకో.” – కవాఫీ
ఇథకా – మొదట ఒక యూనివర్సిటీ పట్టణం
ట్రోజన్ హార్స్, ఒడిస్సీ అన్న పేర్లు చిన్నప్పటినుంచే ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉన్నాను. కానీ ఇథకా అన్న పేరు మాత్రం నేను M.Tech.లో చేరేదాకా వినలేదు. అదీ గ్రీకు పురాణాల ద్వారా కాదు.
కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో, మాకు కార్నెల్ యూనివర్సిటీకి (Cornell University) చెందిన ప్రొఫెసర్లు రాసిన పాఠ్యపుస్తకం ఒకటి ఉండేది. అప్పుడే కార్నెల్ న్యూయార్క్ రాష్ట్రంలోని ఇథకా (Ithaca) అనే చిన్న పట్టణంలో ఉందని మొదటిసారి తెలిసింది. అప్పటికి నాకు ఇథకా అంటే అంతే — కార్నెల్ ఉన్న ఊరు. హోమర్ ఒడిస్సీలో ఒడిస్సియస్ ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి చేరిన స్వదేశం పేరు కూడా అదే అని అప్పుడు నాకు తెలియదు.
కవాఫీ ఇథకా – ప్రయాణానికి అర్థం ఇచ్చే గమ్యం
చాలా ఏళ్ళ తరువాత, నా నడి వయసులో, ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఇథకా నాకు మరో రూపంలో పరిచయమైంది. యువ ఇంజనీర్లు కెరీర్ గురించి సలహా అడిగితే, “గమ్యం కంటే గమనం ముఖ్యం,” అన్న అరిగిపోయిన మాట చెప్పడం కంటే, అప్పట్లో నాకు తెలిసిన కాన్స్టాంటైన్ కవాఫీ (Constantine P. Cavafy, 1863-1933) Ithaka కవిత చదవమని చెప్పేవాణ్ణి.
కవాఫీ చెప్పేది ఇథకా చేరుకోవడమే జీవిత పరమార్థం కాదు; కానీ ఇథకా ఉండాలి. అది మన ప్రయాణానికి దిశనిస్తుంది. అక్కడికి చేరాలనే కోరిక వల్లనే దారిలో కొత్త ప్రదేశాలు చూస్తాం, అనుభవాలు సంపాదిస్తాం, జ్ఞానం పెంచుకుంటాం. చివరకు ఇథకా మనం ఊహించినంత గొప్పగా లేకపోయినా, అది మనల్ని మోసం చేసినట్టు కాదు – ఆ ప్రయాణాన్ని మనకు ఇచ్చింది ఇథకాయే.
అయితే అప్పటికీ కవాఫీ కవిత వెనుక ఉన్న హోమర్ ఒడిస్సీ మాత్రం నేను చదవలేదు.
వేమూరి, చందమామల మీదుగా హోమర్‌కి
సాహసకథలూ, సైన్స్ ఫిక్షన్ కథలూ చదివే అలవాటు నాకు లేదు. సాహిత్యంతో పరిచయం అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల ఒడిస్సీ పేరు ఎన్నాళ్ళుగానో తెలిసినా, ఇటీవలిదాకా దాన్ని చదవలేదు. వేమూరి ఈమాటలో రాసిన సంక్షిప్త తెలుగు కథనం — ఓడిస్సీ (ఒడిస్సియస్ సాహస యాత్రలు) — చదివాక, ఇన్నాళ్ళూ పేరు మాత్రమే తెలిసిన హోమర్ కావ్యాన్ని పూర్తిగా చదవాలనిపించింది. అప్పుడే 1956–57లో చందమామలో వచ్చిన రూపధరుడి యాత్రలు కూడా చదివాను.
వేమూరి, చందమామ కథనాలు రెండూ ట్రోయ్ నుంచి ఒడిస్సియస్ తిరుగు ప్రయాణాన్ని కాలక్రమంలో చెబుతాయి. సైక్లోప్స్, సర్సీ, మృతుల లోకం, సైరన్లు, స్కిల్లా–కరిబ్డిస్ — ఒక సాహసం తర్వాత మరో సాహసం. అందువల్ల ఒడిస్సీ అంటే ప్రధానంగా ఒక మహావీరుడి సముద్ర సాహసయాత్ర అన్న అభిప్రాయం కలగడం సహజమే. నేనూ దాదాపు అదే ఊహతో హోమర్ ఒడిస్సీ చదవడం మొదలుపెట్టాను.

తాళ్ళతో కట్టించుకుని సైరన్ల పాట వింటున్న ఒడిస్సియస్
పూర్తి కావ్యం చదవడానికి నేను రెండు అనువాదాలను ఎంచుకున్నాను.
2017లో ఎమిలీ విల్సన్ (Emily Wilson) చేసిన Odyssey అనువాదం [1] స్పష్టంగా, చురుకుగా సాగే భాషతో గుర్తింపు పొందింది. బానిసత్వం, స్త్రీల సామాజిక స్థితి వంటి విషయాల్లో కొన్ని పాత అనువాదాలు విషయాన్ని కప్పిపుచ్చే పదాలు వాడిన చోట, విల్సన్ మరింత నేరుగా చెప్పే పదాలను ఎంచుకుంది. ఛందస్సులో ఐయాంబిక్ పెంటామీటర్ — ఐదు తాళాల పంక్తిని — వాడింది. ఈ కావ్యానికి పూర్తి ఇంగ్లీషు అనువాదం ప్రచురించిన మొదటి మహిళ ఆమే.
2025లో డేనియల్ మెండెల్సన్ (Daniel Mendelsohn) చేసిన అనువాదం [2] మరో దారిని ఎంచుకుంది. విల్సన్ వాడిన ఐదు తాళాల కట్టుదిట్టమైన పంక్తికి భిన్నంగా, మెండెల్సన్ హోమర్ గ్రీకు హెక్సామీటర్లోని పొడవునూ, ప్రవాహాన్నీ కొంతైనా పట్టుకోవడానికి ఆరు తాళాల పంక్తిని వాడాడు.
పూర్తి ఒడిస్సీ చదవడం మొదలుపెట్టాక నాకు కలిగిన మొదటి ఆశ్చర్యం — హోమర్ కావ్య నిర్మాణం, నేను ఊహించినట్టుగా, సముద్రసాహసాల చుట్టూ తిరగదు.
హోమర్ కథను ట్రోయ్ యుద్ధ ప్రారంభంతో మొదలుపెట్టడు. పారిస్ తీర్పు, హెలెన్ అపహరణ, పదేళ్ళ ట్రోయ్ యుద్ధం—ఇవేవీ ఒడిస్సీ ఆరంభం కావు. అంతేకాదు, యుద్ధం ముగిసి ఒడిస్సియస్ ఇథకాకు బయలుదేరినప్పటి నుంచి కూడా కథ మొదలవదు. అతని తిరుగు ప్రయాణం కూడా అప్పటికే దాదాపు పదేళ్ళుగా సాగుతోంది.
కథ మొదలయ్యే సమయానికి, పైకి చూస్తే పెద్దగా ఏమీ జరుగుతున్నట్టు కూడా కనిపించదు. ఒడిస్సియస్ కలిప్సో ద్వీపంలో చిక్కుకుపోయి ఉన్నాడు. ఇథకాలో పెనలొపీ తనను పెళ్ళి చేసుకోమని వెంటపడుతున్న వరులను (suitors) తప్పించుకోవడానికి నానా అవస్థలు పడుతోంది. టెలెమాకస్కు తండ్రి తిరిగి వస్తాడో లేదో తెలియదు; తన ఇంట్లోనే తన మాట నడవని పరిస్థితి. ఒడిస్సియస్ లేని ఆ లోటుతో ముగ్గురి జీవితాలూ ఏళ్ళ తరబడి ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఆ స్తబ్దత ఇక కొనసాగలేని మలుపులో హోమర్ కథను మొదలుపెడతాడు. ప్రసిద్ధమైన సముద్రసాహసాలు చాలా తరువాత, ఒడిస్సియస్ తన గతాన్ని తానే చెప్పే కథగా వస్తాయి.
రోమన్ కవి హోరేస్ (Horace) తన Ars Poetica లో హోమర్ కథన పద్ధతిని ప్రశంసిస్తూ, హోమర్ శ్రోతను in medias res — “జరుగుతున్న కథ మధ్యలోకి” — తీసుకెళతాడని అన్నాడు. హోమర్ కావ్య నిర్మాణంలో ఈ తేడా ఎంత ముఖ్యమో అరిస్టాటిల్ Poetics లో చెప్పిన మాటలు చదివాక మరింత స్పష్టమైంది. అతను Odyssey మూలకథను చాలా క్లుప్తంగా చెబుతాడు: ఎన్నో ఏళ్ళుగా ఇంటికి దూరంగా ఉన్న ఒక మనిషిని పొసైడన్ వెంటాడుతున్నాడు; అతని ఇంట్లో వరులు ఆస్తిని తినేస్తూ, కొడుకుపై కుట్ర పన్నారు; ఎన్నో కష్టాల తర్వాత అతను ఇంటికి చేరి, తనెవరో వెల్లడించి, శత్రువులను సంహరిస్తాడు. ఆ తర్వాత అరిస్టాటిల్ అంటాడు:
“That is the essence; the rest is episodes.”
అతని కథాసారంలో సైక్లోప్స్, సర్సీ, సైరన్లు, స్కిల్లా–కరిబ్డిస్ — ఏవీ లేవు. వాటికి ప్రాముఖ్యం లేదని అరిస్టాటిల్ అనలేదు; కావ్యాన్ని విస్తరించి, వైవిధ్యాన్ని ఇచ్చే ఘట్టాలు అవి. కానీ కావ్యాన్ని నడిపించే మూలకథ వేరేది — ఇంటికి దూరమైన మనిషి తిరిగి వచ్చి తన ఇంటినీ, తన స్థానాన్నీ తిరిగి పొందడం.
ఇథకా చేరడం అంటే ఇంటికి చేరడమేనా?
ఇరవై నాలుగు పుస్తకాల ఒడిస్సీలో మొదటి నాలుగు పుస్తకాలు ఇథకాలోని పరిస్థితికీ, టెలెమాకస్కీ కేటాయిస్తాడు హోమర్. ఒడిస్సియస్ ఐదవ పుస్తకంలో కథలోకి వస్తాడు; మనకు బాగా తెలిసిన అతని సముద్రసాహసాలు తొమ్మిదో పుస్తకం నుంచి పన్నెండో పుస్తకం వరకూ, అతడు తన గతాన్ని తానే చెప్పే కథగా వస్తాయి. పదమూడవ పుస్తకంలోనే అతడు ఇథకా చేరుకుంటాడు. అంటే, గమ్యం చేరేసరికి కావ్యం దాదాపు సగమే పూర్తయింది. సముద్రయాత్ర ముగిసింది; కానీ కథ మాత్రం ముగియలేదు.
అప్పుడు అర్థమైంది — ఇథకా చేరడం, ఇంటికి చేరడం రెండూ ఒకటి కావు. ఇరవై ఏళ్ళ తర్వాత తన నేలమీద అడుగుపెట్టిన ఒడిస్సియస్‌ను ఎవరూ రాజుగా స్వాగతించరు. అథీనా అతని రూపాన్ని ముసలి బిచ్చగాడిలా మారుస్తుంది. తన ఇంట్లోకే పరాయివాడిలా అడుగుపెడతాడు. ఒక్కొక్కరిని పరీక్షించాలి; ఎవరు తనవాళ్ళో, ఎవరు ద్రోహులో తెలుసుకోవాలి. కొడుకు టెలెమాకస్ ముందుగా అతణ్ణి గుర్తుపట్టడు; పెంపుడు కుక్క ఆర్గస్ మాత్రం గుర్తుపట్టి ప్రాణం విడుస్తుంది; తరువాత అతని చిన్ననాటి దాది యూరిక్లేయా పాదాలు కడుగుతుండగా, తొడమీద చిన్ననాటి వేటలో తగిలిన మచ్చను తాకి అతణ్ణి గుర్తిస్తుంది.

ఒడిస్సియస్‌ను గుర్తుపట్టిన యూరిక్లేయా
ఒడిస్సియస్ పెనలొపీ ఎదుటే కూర్చున్నాడు; కానీ తనెవరో చెప్పకుండా ఆమెతో మాట్లాడుతున్నాడు. తన భర్త ఎక్కడున్నాడో, తిరిగి వస్తాడో లేదో తెలియక పెనలొపీ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ దృశ్యాన్ని హోమర్ మంచు కరుగుతున్న దృశ్యంతో పోలుస్తాడు:
“His lies were like the truth,
and as she listened, she began to weep.
Her face was melting, like the snow that Zephyr
scatters across the mountain peaks; then Eurus
thaws it, and as it melts, the rivers swell
and flow again. So were her lovely cheeks
dissolved with tears. She wept for her own husband,
who was right next to her. Odysseus pitied
his grieving wife inside his heart,
but kept his eyes quite still, without a flicker,
like horn or iron, and he hid his tears
with artifice.”
— Book 19: “The Queen and the Beggar,” lines 204–215 [1]
“తన పక్కనే ఉన్న భర్త కోసం ఆమె ఏడుస్తోంది” — ఆ ఒక్క వాక్యంలోనే హోమర్ homecoming ఎంత సంక్లిష్టమైనదో కనిపిస్తుంది. ఒడిస్సియస్ ఇథకా చేరాడు. తన ఇంట్లో ఉన్నాడు. భార్య పక్కనే కూర్చున్నాడు. అయినా ఇంకా ఇంటికి చేరలేదు.

బిచ్చగాడి రూపంలోని ఒడిస్సియస్‌తో పెనలోపీ
ఆ ప్రయాణం పూర్తవ్వాలంటే తన పేరునీ, స్థానాన్నీ మాత్రమే కాదు, తాను నిజంగా ఒడిస్సియసేనని భార్యకూ నిరూపించాలి. అందుకే చివరికి పెనలొపీ చేసే మంచం పరీక్ష అంత ముఖ్యమైనది. అది కేవలం “ఇతనే నా భర్త” అని గుర్తుపట్టే గుర్తు కాదు. వారి ఇద్దరికే తెలిసిన, సజీవమైన ఆలివ్ చెట్టు కాండాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన ఆ మంచం — వారి వివాహానికీ, ఇంటికీ, ఇథకాకీ వేర్లు ఉన్నాయనే సంకేతంలా అనిపిస్తుంది.
అమరత్వం కాదు – మానవ జీవితం
కలిప్సో ద్వీపంలో ఒడిస్సియస్కు ఒక అసాధారణమైన అవకాశం ఎదురవుతుంది. కలిప్సో మాటల సారాంశం: ‘నా దగ్గరే ఉండిపో; అమరుడివి అవుతావు.’ ఒడిస్సియస్ సమాధానం అంతే స్పష్టం: పెనలొపీ మానవురాలు, కలిప్సో అమరురాలు; అయినా తనకు ఇంటికి తిరిగి వెళ్ళాలనే కోరిక ఉందంటాడు. కావ్యం మొదట్లోనే, అథీనా అతని ఇంటి తపనను మరింత గాఢంగా చెబుతుంది — తన స్వదేశం నుంచి పైకి లేచే పొగనైనా చూడగలిగితే చాలు అన్నంతగా అతడు ఇథకాను కోరుకుంటున్నాడని. కలిప్సో ఇచ్చే అమరత్వం కంటే, మరణం అనివార్యమైన తన మానవ జీవితాన్నే ఒడిస్సియస్ ఎంచుకుంటాడు.
మృతుల లోకంలో అకిల్లీస్తో జరిగిన సంభాషణ దీనిని మరో కోణంలో చూపిస్తుంది. జీవించి ఉన్నప్పుడు అకిల్లీస్ ముందున్న ఎంపిక ప్రసిద్ధమే — దీర్ఘమైన సాధారణ జీవితం గడపాలా, లేక చిన్న వయసులోనే చనిపోయినా చిరస్థాయి కీర్తి పొందాలా? చివరికి అతడు కీర్తి దారినే ఎంచుకున్నాడు. కానీ చనిపోయిన తరువాత ఒడిస్సియస్ అతణ్ణి కలిసినప్పుడు, మృతులందరికీ రాజుగా ఉండడం కంటే భూమిమీద ఒక పేదవాడి దగ్గర కూలివాడిగా బతకడమే మేలంటాడు.
అకిల్లీస్ మాటల్లో ఒక విచిత్రమైన తిరుగుబాటు ఉంది: బతికున్నప్పుడు దీర్ఘజీవితం కంటే కీర్తిని ఎంచుకున్న వీరుడికి, చనిపోయాక ప్రాణమే అన్నిటికంటే విలువైనదిగా కనిపిస్తుంది. ఒడిస్సియస్కు మాత్రం మరో రకమైన ఎంపిక ఎదురవుతుంది; అతడు అమరత్వం కంటే తన మానవ జీవితాన్నే కోరుకుంటాడు.
ఇక్కడ ఇథకాకి మరో అర్థం వస్తుంది. అది కేవలం ఒక ద్వీపం కాదు. భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్, తండ్రి, ఇల్లు, ముసలితనం, చివరికి మరణం — ఇవి అన్నీ కలిసిన మానవ జీవితం. ఒడిస్సియస్ ఎంచుకున్నది అదే.
కొడుకు–తండ్రి, గురు–శిష్యులుగా
ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన కవాఫీ Ithaka కవితను ఆంగ్లంలోకి అనువదించినవారిలో డేనియల్ మెండెల్సన్ (Daniel Mendelsohn) ఒకరు. క్లాసిక్స్‌లో పీహెచ్డీ చేసిన ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బార్డ్ కాలేజీలో ప్రొఫెసర్.
2011 జనవరిలో, హోమర్ Odyssey పై మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమినార్ మొదలుపెట్టబోతున్న సమయంలో, డేనియల్ తండ్రి జే ఒక అనూహ్యమైన కోరిక కోరాడు: “నీ తరగతిలో నేనూ కూర్చోవచ్చా?” అప్పటికి జే వయసు ఎనభై ఒక్క ఏళ్ళు. సాధారణ విద్యార్థిలా పరీక్షలు రాయడం, మార్కులు సంపాదించడం కోసం కాకుండా, పాఠాలు వినడానికి మాత్రమే తరగతికి హాజరవడాన్ని అమెరికా విశ్వవిద్యాలయాల్లో audit చేయడం అంటారు. జే అలా కొడుకు తరగతిని ఆడిట్ చేయాలనుకున్నాడు.
మొదట డేనియల్ కొంచెం వెనకాడాడు. పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ళ కొత్త విద్యార్థుల మధ్య తన ఎనభై ఒక్క ఏళ్ళ తండ్రి కూర్చుంటే తరగతి వాతావరణం చెడిపోతుందేమోనని భయపడ్డాడు. జే మాత్రం ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంటానని మాటిచ్చాడు. కానీ మొదటి రోజే ఆ మాట తప్పాడు. దాదాపుగా డేనియల్ చెప్పిన ప్రతి మాటకూ జే చేయెత్తి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టాడు. డేనియల్ తరువాత నవ్వుతూ చెప్పినట్టు, తాను భయపడినట్టుగానే తండ్రి తరగతిని “disrupt” చేశాడు — కానీ చివరికి అదే తరగతిని మరింత ఆసక్తికరంగా మార్చింది.
జేకి అన్నిటికన్నా నచ్చనిది ఒడిస్సియస్‌ను గొప్ప వీరుడిగా పొగడటం. జే గణితశాస్త్రవేత్త; కంప్యూటర్ సైన్స్ బోధించాడు. అన్ని విషయాలనూ అదే కచ్చితత్వంతో చూసేవాడు. “x is x” అన్నది అతని ధోరణి. అందుకే అతని ప్రశ్నలు చాలా సూటిగా ఉండేవి. “తన వెంట బయలుదేరిన మనుషులందరినీ పోగొట్టుకుని ఒంటరిగా ఇంటికి చేరిన నాయకుణ్ణి గొప్పవాడని ఎలా అంటాం? అబద్ధాలు చెబుతాడు, భార్యకు ద్రోహం చేస్తాడు, తన మనుషులందరినీ కోల్పోతాడు — అయినా అతడే మహావీరుడా?” అని వాదించేవాడు.
జేకి నచ్చని మరో విషయం, అడుగడుగునా ఒడిస్సియస్ దేవతల సాయం పొందడం. అథీనా అతని రూపాన్నే మార్చేస్తుంది — ఒకసారి అందమైన యువకుడిగా, మరోసారి ముసలి బిచ్చగాడిగా. “అతడు అంత గొప్ప వీరుడైతే దేవతల సహాయం ప్రతి దశలో ఎందుకు కావాలి?” అని జే కొడుకును నిలదీశాడు. ఈ తండ్రీకొడుకుల వాదనతో మొదటి రోజునే తరగతి ఊహించని మలుపు తిరిగింది.
ఈ అనుభవాన్నే డేనియల్ తరువాత 2017లో An Odyssey: A Father, a Son, and an Epic లో రాశాడు. ఆ పుస్తకంలో తాను చేసిన కొన్ని Odyssey అనువాదాలు నచ్చి, University of Chicago Press పూర్తి కావ్యాన్ని అనువదించమని కోరింది.
జే అభ్యంతరాలన్నీ సరైనవని అనలేం. హోమర్ కావ్యంలో వీరుడు అంటే మనం ఇప్పుడు ఊహించుకునే ఆదర్శ నాయకుడో, నీతిమంతుడో కాదు. దేవతల సహాయం పొందడం కూడా గ్రీకు ఇతిహాస ప్రపంచంలో వీరత్వానికి విరుద్ధం కాదు. అయినా జే ప్రశ్నల వల్ల, ఒడిస్సియస్‌పై సంప్రదాయం వేసిన “మహావీరుడు” అన్న ముద్రను కాసేపు పక్కన పెట్టి, అతని చర్యలను కొన్నిటిని చూడాలనిపించింది.
వీరత్వం – నీతి
జే మెండెల్సన్ అభ్యంతరాలు ఆసక్తికరంగా ఉన్నా, ఒడిస్సియస్‌ను వీరుడని పిలవడం సముచితమే. ఒడిస్సియస్ యుద్ధానికి వెళ్ళాడు, అందులో కీలక పాత్ర పోషించాడు, ప్రమాదాల్లో ధైర్యంగా నిలబడ్డాడు. తన తోటి నావికులను కాపాడేందుకు అనేక సందర్భాల్లో కష్టపడ్డాడు. ముఖ్యంగా అతని బలం కంటే యుక్తి, సమయస్ఫూర్తి, పరిస్థితికి తగినట్టు మారగలగడం అతన్ని పదేపదే కాపాడాయి.
సైక్లోప్స్ పాలీఫీమస్ గుహలో చిక్కుకున్నప్పుడు అతని తెలివితేటలు పరాకాష్ఠకు చేరుతాయి. బలంతో ఆ రాక్షసుణ్ణి జయించడం సాధ్యం కాదని గ్రహించి, మద్యం తాగించి, తన పేరు “ఎవరూ కాదు” అని చెప్పి, అతని కన్ను పొడిచి, గొర్రెల కింద వేలాడుతూ బయటపడే యుక్తి పన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఒడిస్సియస్ అసాధారణమైన యుక్తిశాలి, ప్రమాదంలో సమయస్ఫూర్తి చూపగల మనిషి అనిపిస్తుంది.
కానీ ప్రమాదాన్ని తప్పించుకోవడంలో ఎంత నేర్పును చూపిస్తాడో, అవసరం లేని ప్రమాదాన్ని తానే వెతుక్కోవడంలోనూ అంతే దుడుకుతనాన్ని కనబరుస్తాడు. సైక్లోప్స్ గుహలోకి వెళ్ళడం అతని ఆసక్తి, సాహసం, తెలుసుకోవాలనే తపన వల్లే. బయటపడి, సురక్షితమైన దూరం చేరుకున్నాక తన అసలు పేరు చెప్పకుండా ఉండలేడు. తన ఖ్యాతి తెలియాలనే గర్వం మళ్ళీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
అందుకే ఒడిస్సియస్ గురించి ఒకే మాటలో తీర్పు చెప్పడం కష్టం. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు, సహనశీలి. అదే సమయంలో గర్విష్ఠి, మాయచేసేవాడు, తప్పులు చేసే మనిషి కూడా. వీరత్వం అతనిలో ఉంది; కానీ వీరత్వమే అతని స్వభావం మొత్తాన్ని నిర్వచించదు.
“అమ్మా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ పని చూసుకో… మాట్లాడటం మగవాళ్ళ పని – ఈ ఇంట్లో ముఖ్యంగా ఆ పని నాది”
ఒడిస్సియస్ ప్రయాణంలో స్త్రీల పాత్ర అసాధారణంగా పెద్దది. అథీనా అతణ్ణి మొదటినుంచి చివరివరకూ కాపాడుతుంది. సర్సీ అతనికి మృతుల లోకానికి వెళ్ళే మార్గం చెబుతుంది. కలిప్సో ఎన్నేళ్ళో తన ద్వీపంలో ఉంచుతుంది; చివరకు దేవతల ఆజ్ఞతో పంపిస్తుంది. నౌసికయా అతణ్ణి రక్షించి ఫయేషియన్ల రాజభవనానికి చేరే దారి చూపుతుంది. ఇథకాలో కథకు కేంద్రబిందువు పెనలొపీ.
వీరిలో కొందరు దేవతలు; ఒడిస్సియస్ భవితవ్యాన్నే మార్చగలవారు. కానీ కథలో ఒక స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఉందన్నది, ఆ సమాజంలో ఆమెకు ఎంత అధికారం ఉందన్నదానితో సమానం కాదు. పెనలొపీ ఇందుకు మంచి ఉదాహరణ.
పెనలొపీని కేవలం ఇరవై ఏళ్ళు భర్త కోసం ఎదురుచూసిన పతివ్రతగా చూస్తే హోమర్ ఆమెకు ఇచ్చిన తెలివితేటలు కనిపించవు. వరులు తనను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసినప్పుడు, మామ లయర్టీస్ చనిపోతే కప్పేందుకు నేస్తున్న వస్త్రం పూర్తయ్యేవరకు నిర్ణయం తీసుకోనని చెబుతుంది. పగలు నేసినదాన్ని రాత్రి విప్పేస్తూ మూడు సంవత్సరాలు వాళ్ళను మోసం చేస్తుంది. ఒడిస్సియస్ మారువేషంలో ఎదురుగా కూర్చున్నప్పుడు కూడా అతడు చెప్పిన ప్రతి మాటను నమ్మేయదు; ప్రశ్నిస్తుంది, పరీక్షిస్తుంది. చివరికి అతను తన భర్తేనని అందరూ చెప్పినా ఆమె వెంటనే అతని కౌగిట్లో వాలదు.
ఈ సందర్భంలోనే, సుప్రసిద్ధమైన ‘మంచం పరీక్ష’ వస్తుంది. తమ పెళ్ళి మంచాన్ని బయటికి తీసుకెళ్ళి అతనికోసం సిద్ధం చేయమని పనిమనిషికి చెబుతుంది పెనలోపీ. అది అసాధ్యమని ఒడిస్సియస్కు మాత్రమే తెలిసిన విషయం: ఆ మంచాన్ని అతనే సజీవమైన ఆలివ్ చెట్టు కాండం చుట్టూ నిర్మించాడు. దాన్ని కదిలించమన్న మాట వినగానే అతను ఆ రహస్యాన్ని బయటపెడతాడు. అప్పుడు మాత్రమే పెనలొపీ నమ్ముతుంది. ఇరవై ఏళ్ళుగా ఎదురుచూసినా, ఆమె ప్రేమకంటే ముందుగా తన బుద్ధిని నమ్ముతుంది.

పడక పరీక్ష తర్వాత ఒడిస్సియస్—పెనలొపీ
అయితే ఇదే పెనలొపీని మొదటి పుస్తకంలో కొడుకు టెలెమాకస్ ప్రధాన మందిరం నుంచి తన గదికి వెనక్కి పంపిస్తాడు. గాయకుడు ట్రోయ్ నుంచి తిరిగివచ్చిన గ్రీకుల కష్టాలను పాడుతుంటే, అది వినలేక పెనలొపీ మరో పాట పాడమని అడుగుతుంది. అప్పుడు ఇంకా పాతికేళ్ళు కూడా నిండని టెలెమాకస్ ఆమెతో “నూలుమగ్గం దగ్గరకు వెళ్ళి నీ పని చూసుకో; మాట్లాడటం మగవారి పని, ముఖ్యంగా ఈ ఇంట్లో ఆ పని నాది” అని అర్థం వచ్చేలా మాట్లాడుతాడు:
“Go in and do your work.
Stick to the loom and distaff. Tell your slaves
to do their chores as well. It is for men
to talk, especially me. I am the master.”
— Book 1: The Boy and the Goddess, lines 356–359 [1]
మేరీ బియర్డ్ (Mary Beard) తన The Public Voice of Women ను ఈ ఘట్టంతోనే ప్రారంభిస్తుంది: పాశ్చాత్య సాహిత్య సంప్రదాయం ఆరంభంలోనే ఒక పురుషుడు స్త్రీకి బహిరంగంగా మాట్లాడటం తన పని కాదని చెబుతున్న దృశ్యం. బియర్డ్ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తుంది. స్త్రీలు మాట్లాడకూడదన్నది కాదు — కబుర్లు చెప్పుకోవచ్చు, గుసగుసలాడవచ్చు, రోజువారీ విషయాలు మాట్లాడవచ్చు. కానీ టెలెమాకస్ వాడిన muthos అన్న మాట సాధారణ సంభాషణ కాదు; అధికారంతో చేసే బహిరంగ ప్రసంగం. హోమర్ చూపించే సామాజిక ప్రపంచంలో, మాటకు ప్రాముఖ్యత ఉన్న చోట మాట్లాడే అధికారం ప్రధానంగా పురుషుడిదే.

మగ్గం వద్ద పెనలోపీ — పక్కన టెలెమాకస్
ఈ మాట మొదటి పుస్తకంతోనే ఆగిపోదు. 21వ పుస్తకంలో పెనలొపీ, బిచ్చగాడి వేషంలో ఉన్న ఒడిస్సియస్కు విల్లు ఇవ్వమని యూమేయస్ను ఆదేశించినప్పుడు, టెలెమాకస్ మళ్ళీ ఆమె అధికారానికి హద్దు పెడతాడు. విల్లు ఎవరికివ్వాలో నిర్ణయించే హక్కు తనదేననీ, ఇంట్లో అధికారం తనదేననీ చెప్పి, ఆమెను మళ్ళీ తన గదికి వెళ్ళమంటాడు. మొదటి పుస్తకంలో ఇంకా అనుభవం లేని యువకుడు అన్న మాటనే, ప్రయాణం చేసి కొంత పరిణతి చెందిన టెలెమాకస్ కూడా చివర్లో పునరావృతం చేస్తాడు. కాబట్టి ఇది అతని కుర్రతనపు దుడుకుమాట మాత్రమే కాదు; ఆ సమాజంలో స్త్రీకి, పురుషుడికి నిర్దేశించిన అధికారపు హద్దును కూడా సూచిస్తుంది.
ఈ అసమానత మాట్లాడే అధికారం దగ్గరే ఆగదు. కలిప్సో మరో రకమైన ద్వంద్వ ప్రమాణాన్ని స్వయంగా ఎత్తిచూపుతుంది. ఒడిస్సియస్‌ను విడిచిపెట్టమని దేవతలు ఆజ్ఞాపించినప్పుడు, ఒక దేవత మానవ పురుషుణ్ణి ప్రేమించి తనతో ఉంచుకుంటే మగ దేవుళ్ళు అసూయపడతారని ఆమె మండిపడుతుంది.
ఒకవైపు స్త్రీలు కథను ముందుకు నడిపించేంత శక్తివంతులు; మరోవైపు మాట, ప్రేమ, అధికారం విషయాల్లో మాత్రం పురుషులతో వారికి సమాన హక్కులు లేవు.
భారతీయ సంప్రదాయం – హద్దు మీరి మాట్లాడిన ద్రౌపది
కొన్నేళ్ళ క్రితం నేను అమర్త్య సేన్ (Amartya Sen) రాసిన The Argumentative Indian చదివాను. భారతీయుల సంవాదప్రియత్వానికి ఉదాహరణగా మన ఇతిహాసాలనే సేన్ ప్రస్తావిస్తాడు. గ్రీకు Iliad, Odyssey లతో తరచూ పోల్చే రామాయణం, మహాభారతం వాటికంటే ఎంతో పెద్దవి; మహాభారతం ఒక్కటే Iliad, Odyssey రెండూ కలిపినదానికంటే దాదాపు ఏడు రెట్లు పెద్దది. కథలో కథలు, వాటిల్లో సంభాషణలు, భిన్నమైన దృక్కోణాలు, వాదనలు, ప్రతివాదనలు వాటినిండా కనిపిస్తాయని సేన్ అంటాడు.
ఆ వాదసంప్రదాయంలో స్త్రీ స్వరానికి కూడా ఉదాహరణలున్నాయని చెబుతూ సేన్ భారవి (సా.శ. ఆరో శతాబ్ది) కిరాతార్జునీయంలోని ద్రౌపది మాటలను ప్రస్తావిస్తాడు.
అరణ్యంలో ఉన్న ధర్మరాజు దుర్యోధనుడిపై యుద్ధానికి పూనుకోకుండా సహనం వహించడం ద్రౌపదికి నచ్చదు. అతణ్ణి కార్యోన్ముఖుణ్ణి చెయ్యడానికి వాదన మొదలుపెడుతుంది. అయితే మొదటే తాను ఒక హద్దు మీరి మాట్లాడుతున్నానని ఒప్పుకుంటుంది:
“భవాదృశేషు ప్రమదాజనోదితం
భవత్యధిక్షేప ఇవానుశాసనమ్ ।
తథాపి వక్తుం వ్యవసాయయంతి మాం
నిరస్తనారీసమయా దురాధయః” ॥ 1.28 ॥
“మీలాంటి వారికి ఒక స్త్రీ సలహా చెప్పడం అధిక్షేపంలా తోచవచ్చు. అయినా నా తీవ్రమైన బాధలు స్త్రీలకు విధించిన ఆచారపు హద్దులను పక్కనపెట్టి మాట్లాడేలా చేస్తున్నాయి” — అని ఆ శ్లోకపు భావం.
కానీ ఆ వినయంతో ఆమె వాదన ఆగిపోదు. కొద్దిసేపటికే ధర్మరాజును ఎద్దేవా చేసే స్థాయికి వెళుతుంది:
అథ క్షమా మేవ నిరస్త విక్రమ
శ్చిరాయ పర్యేషి సుఖస్య సాధనమ్ ।
విహాయ లక్ష్మీపతి లక్ష్మ కార్ముకం
జటాధరః సన్ జుహుధీహ పావకమ్ ॥ 1.44 ॥
“యుద్ధసాధనాలన్నీ వదిలేసి, సహనమే చివరికి సుఖానికి మార్గమని అనుకుంటే, రాజలక్షణమైన ఆ విల్లును పారెయ్యి; జడలు కట్టుకొని, ఇక్కడే అగ్నిహోత్రం చేసుకుంటూ ఉండు.”
పెనలొపీ సందర్భంతో పోలిస్తే ఇది ఆసక్తికరం. “మాట్లాడటం మగవాళ్ళ పని” అని టెలెమాకస్ ఆమెకు హద్దు చూపించి ఇంట్లోకి పంపిస్తాడు. ద్రౌపదికి కూడా అటువంటి హద్దు ఉందని తెలుసు — ఆమె మొదటి మాటలే దానికి సాక్ష్యం. కానీ ఆ హద్దును గుర్తిస్తూనే దాన్ని దాటి మాట్లాడుతుంది; అంతేకాదు, రాజు ఎలా ప్రవర్తించాలో ధర్మరాజుకే చెప్పి, అతని నిష్క్రియాపరత్వాన్ని ఎద్దేవా చేస్తుంది.
దీనివల్ల భారతీయ స్త్రీలకు గ్రీకు స్త్రీలకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉండేదని తేల్చలేం. నిజానికి “స్త్రీలకు విధించిన ఆచారపు హద్దులను” తాను మీరుతున్నానని ద్రౌపదే చెబుతోంది. అయితే అటువంటి హద్దులు ఉన్న సమాజంలోనే ద్రౌపది వంటి బలమైన వాదనాస్వరం సాహిత్యంలో వినిపించడం విశేషం.
ఆడ బానిసల ‘నేరం’ – ‘తగిన’ శిక్ష
ఒడిస్సీలో హింసకూ రక్తపాతానికీ కొదవలేదు — సైక్లోప్స్ కన్ను పొడవడం నుంచి చివర్లో వరులను ఊచకోత కోయడం వరకు.
నిజానికి వరులను చంపే ఘట్టంలో రక్తపాతాన్ని నివారించే అవకాశం ఒడిస్సియస్కు స్పష్టంగా వస్తుంది. ఒడిస్సియస్ మొదటి నాయకుడైన యాంటినోవస్ను బాణంతో కూల్చాక, రెండో నాయకుడైన యురిమాకస్ ఒడిస్సియస్ కాళ్ళమీద పడి ప్రాధేయపడతాడు. “అసలు సూత్రధారి చనిపోయాడు; మిగిలిన మా ప్రాణాలు వదిలేయ్, నీ ఇంట్లో తిన్నదానికీ తాగినదానికీ నష్టపరిహారంగా ప్రతి ఒక్కరం బంగారం, ఇత్తడి తెచ్చి చెల్లిస్తాం,” అని వేడుకుంటాడు. అక్కడ రాజీపడి, ప్రాణనష్టం లేకుండా వ్యవహారాన్ని ముగించే వీలుంది. కానీ ఒడిస్సియస్‌లో ఏమాత్రం కనికరం కనిపించదు. “మీ ఆస్తిపాస్తులన్నీ నా ముందు పోసినా, మీ రక్తం చూడకుండా నా చేతులు ఆగవు; ఎదురుతిరిగి పోరాడండి లేదా చావండి,” అని ముఖం మీదే చెప్పేస్తాడు. అతనికి కావలసింది నష్టపరిహారం కాదు; సంపూర్ణమైన రక్తప్రతీకారం.
కానీ ఆ ఊచకోత కంటే కూడా నన్ను ఎక్కువగా కలవరపెట్టిన ఘట్టం ఆ ఇరవై రెండవ పుస్తకం చివర్లోనే వచ్చింది.
వరులందరినీ చంపిన తరువాత ఒడిస్సియస్ తన దాది యూరిక్లేయాను పిలిచి, ఇంట్లోని ఆడ బానిసలలో ఎవరు తనకు, పెనలొపీకి నమ్మకంగా ఉన్నారో, ఎవరు వరులతో కలిశారో చెప్పమంటాడు. ఇంట్లో యాభై మంది బానిస స్త్రీలు ఉన్నారనీ, వారిలో పన్నెండు మంది తననూ పెనలొపీని గౌరవించలేదని యూరిక్లేయా చెబుతుంది.
అప్పుడు ఒడిస్సియస్ ఇచ్చిన ఆజ్ఞ సారాంశం: “ముందుగా ఆ పన్నెండు మందితో వరుల శవాలను బయటికి మోయించండి; బల్లలనూ, కుర్చీలనూ, మందిరాన్నంతా శుభ్రం చేయించండి. ఆ పని పూర్తయ్యాక వాళ్ళను బయటికి తీసుకెళ్ళి, పొడవాటి కత్తులతో నరికి చంపండి. వరులు వాళ్ళతో రహస్యంగా చేయించిన శృంగారకార్యాలన్నీ అప్పుడు వాళ్ళు మరిచిపోతారు.”

దాసీలను ఆజ్ఞాపిస్తున్న ఒడిస్సియస్
ఆ ఆడ బానిసలు ఏడుస్తూ వరుల శవాలను మోసి బయట పెట్టారు. రక్తాన్ని కడిగారు. ఇంటిని మళ్ళీ శుభ్రం చేశారు. ఆ పని పూర్తయ్యాక టెలెమాకస్, అతని ఇద్దరు సహాయకులు ఆ పన్నెండు మందిని తప్పించుకోవడానికి వీల్లేని ఇరుకైన ప్రదేశంలోకి తీసుకెళ్ళారు.
కానీ టెలెమాకస్ తండ్రి చెప్పినట్టుగా వారిని కత్తితో చంపడు. కత్తితో చంపడం వాళ్ళకు దక్కకూడని గౌరవప్రదమైన చావని టెలెమాకస్ భావించాడు. తననూ, తన తల్లినీ అవమానించి వరులతో పడుకున్న ఆ ఆడ బానిసలకు అలాంటి చావు దక్కకూడదంటూ, వారి ప్రాణాలు మరింత విలవిలలాడుతూ పోయే విధానాన్ని ఎంచుకున్నాడు:
“At that, he wound a piece of sailor’s rope
round the rotunda and round the mighty pillar,
stretched up so high no foot could touch the ground.
As doves or thrushes spread their wings to fly
home to their nests, but someone sets a trap—
they crash into a net, a bitter bedtime;
just so the girls, their heads all in a row,
were strung up with the noose around their necks
to make their death an agony. They gasped,
feet twitching for a while, but not for long.”— Book 22: Bloodshed, lines 465–474 [1]
వేమూరి, చందమామల కథనాలలో ఈ ఉరిశిక్ష లేదు. పిల్లల కోసం రాసిన సంక్షిప్త కథల్లో ఇలాంటి ఘట్టాన్ని వదిలేయడం సముచితమే అనిపించవచ్చు. కానీ పూర్తి ఒడిస్సీ చదివిన తరువాత, ఈ దృశ్యాన్ని తీసేస్తే కావ్యంలోని ఒక ఘోరమైన సంఘటన కనుమరుగైపోతుందనిపించింది; ఒడిస్సియస్ విజయానికి అంటుకున్న ఆ క్రౌర్యం పాఠకుడి దృష్టికి రాకుండా పోతుంది.
ఈ ఘట్టం చదువుతుంటే మనకు మరో వికృతమైన వైరుద్ధ్యం తట్టకుండా ఉండదు. ఈ పన్నెండు మంది ఆడ బానిసల ‘నేరం’ ఏమిటి? యజమాని లేని ఇంట్లో పెత్తనం చలాయిస్తున్న వరులతో పడుకోవడం. మరి ఇరవై ఏళ్ళు ఇంటికి దూరంగా ఉన్న ఒడిస్సియస్ ఏం చేశాడు? సర్సీతో ఏడాది, కలిప్సోతో ఏడేళ్ళూ గడిపాడు. పెనలొపీ జ్ఞాపకాలను అపురూపంగా తలచుకుంటూనే, పరాయి ద్వీపాల్లో ఇతర స్త్రీలతో శయ్యను పంచుకున్నాడు — ఇష్టపడో, గత్యంతరం లేకనో. నాయకుడి పరస్త్రీ కలాపాలు కావ్యంలో సహజమైన విహారాలుగా చెల్లిపోతాయి; కానీ యజమానుల రక్షణ లేని స్థితిలో, వరుల ఒత్తిడికి తలొగ్గిన నిస్సహాయ ఆడ బానిసల ప్రవర్తన మాత్రం ప్రాణాలు తీయాల్సిన ‘ద్రోహం’ అవుతుంది.
ముగ్గురు అనువాదకులు – మూడు దృక్కోణాలు
ఆ ఘట్టం చదివిన తరువాత నాకు ఒక ప్రశ్న వచ్చింది: వాళ్ళకు విధించిన శిక్షను మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఆశ్చర్యంగా, నేను చదివిన ముగ్గురు అనువాదకులు — సామ్యూల్ బట్లర్, ఎమిలీ విల్సన్, డేనియల్ మెండెల్సన్ — దాదాపు ఒకే విధంగా ఉన్న గ్రీకు పాఠాంతరాలను ఆధారంగా చేసుకొని మూడు వేర్వేరు దృక్కోణాలు చూపించారు. (వేమూరి సంక్షిప్తకథనానికి ఆధారాలలో బట్లర్ అనువాదం ఒకటి.)
బట్లర్‌ది అన్నిటికన్నా విచిత్రమైన స్పందన. 1897లో రాసిన The Authoress of the Odyssey లో ఒడిస్సీ రచయిత మగవాడనే సాంప్రదాయికమైన అభిప్రాయాన్నే ప్రశ్నించాడు. కావ్యంలో స్త్రీల గౌరవానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూపిస్తూనే, ఆ పవిత్రతకు మచ్చ తెచ్చిన బానిస స్త్రీలను ఇంత కర్కశంగా ఉరితీయడం ఒక రచయిత్రి కక్షనే సూచిస్తుందని వాదించాడు.
బట్లర్ సిద్ధాంతాన్ని నేడు హోమర్ పండితులు అంగీకరించకపోయినా, నూట ముప్పై ఏళ్ళ కిందటే ఒక పాశ్చాత్య పాఠకుడికి ఈ శిక్ష హద్దుమీరిన క్రౌర్యంగా తోచిందంటే ఈ ఘట్టం కలిగించే నైతిక క్షోభ కేవలం నేటి ఆధునిక పఠనానికి మాత్రమే పరిమితమైనది కాదు అని స్పష్టం.
విల్సన్ అనువాదం వెలువడినప్పుడు, ఆమె స్త్రీ కావడం వల్ల కావ్యానికి స్త్రీవాద దృక్కోణాన్ని జోడించిందని కొందరు వ్యాఖ్యానించారు. విల్సన్ మాత్రం తన పని హోమర్ పాఠంలో లేని తీర్పులను చేర్చడం కాదు; స్త్రీలు, బానిసలు సహా పాత్రలందరినీ హోమర్ చూపించిన సంక్లిష్టతతోనే చూపించడమని ఆమె చెబుతుంది.
దానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఈ పన్నెండు మంది స్త్రీలే. వారిని మనం ఏ మాటలతో పిలుస్తున్నాం? పాత ఇంగ్లీషు అనువాదాల్లో కొందరు sluts, whores వంటి లైంగిక దూషణలను జోడించారు. హోమర్ గ్రీకులో అలాంటి మాటలు లేవని విల్సన్ ఎత్తిచూపుతుంది. మరోవైపు maids, servants వంటి పదాలు వీరు బానిసలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవని ఆమె అభ్యంతరం. తన అనువాదంలో వారి బానిస స్థితిని స్పష్టంగా చూపిస్తుంది. ఆ తరువాత ఆమె లేవనెత్తే ప్రశ్న మరింత మౌలికమైనది: వరులు ఆక్రమించుకున్న ఒడిస్సియస్ ఇంట్లో బానిసలుగా ఉన్న ఈ యువతులకు తమ లైంగిక సంబంధాల విషయంలో ఎంత స్వేచ్ఛ ఉండేది? హోమర్ ప్రతి సందర్భంలో బలవంతం జరిగిందని స్పష్టంగా చెప్పడు; కానీ వాళ్ళ బానిసత్వాన్ని మరిచి, స్వేచ్ఛగా ద్రోహం చేసిన స్త్రీలుగా అనువదించడం కూడా పాఠంలో లేని తీర్పునే జోడించడం అవుతుందని ఆమె వాదిస్తుంది.
మెండెల్సన్ అనువాదం నాకు ఇంకో విషయం గుర్తుచేసింది. అతనూ హోమర్‌లో లేని దూషణలను చేర్చలేదు; ఆ ఉరిశిక్షలోని జాలి స్వరాన్ని అలాగే ఉంచాడు. అయితే ఈ ఘట్టాన్ని అప్పటి సమాజం దృష్టితో చూడమంటాడు. అది సమాన హక్కులున్న ప్రపంచం కాదు; యజమాని, కొడుకు, బానిస — ఎవరి స్థానం వాళ్ళదే. యజమాని మాటకు ఎదురుతిరిగిన బానిసను శిక్షించడం అప్పటి రోజుల్లో పెద్ద విచిత్రమేమీ కాదు. దాన్ని మనం సమర్థించాల్సిన పనిలేదు; కాకపోతే మూడు వేల ఏళ్ళ కిందటి మనుషులు కూడా సరిగ్గా మనలాగే ఆలోచించి ఉంటారని అనుకోలేం కదా అన్నది అతని మాట.
బట్లర్‌కి ఈ శిక్ష అసాధారణమైన క్రౌర్యం. విల్సన్ ముఖ్యంగా బానిసత్వాన్ని కప్పిపుచ్చిన పదాలనూ, తరువాతి అనువాదాలు జోడించిన దూషణలనూ ప్రశ్నిస్తుంది. మెండెల్సన్ మన నేటి విలువలను ఆ ప్రాచీన సామాజిక ప్రపంచంపై నేరుగా రుద్దకూడదని గుర్తుచేస్తాడు.
నాకు ఈ మూడు దృక్కోణాలూ అవసరమనిపించాయి. చరిత్రను అర్థం చేసుకోవడం వేరు; ఆ చరిత్రలోని క్రౌర్యాన్ని చూసి నిర్లిప్తంగా ఉండిపోవడం వేరు. హోమర్ ఆ ఉరిశిక్షను నేరుగా ఖండిస్తున్నాడని చెప్పలేను. కానీ ఆ దృశ్యాన్ని వర్ణించడానికి అతను ఎంచుకున్న ఉపమానంలో తీవ్రమైన ఆర్ద్రత ఉంది. గూటికి తిరిగి వెళ్తుండగా ఎవరో వేసిన వలలో చిక్కుకున్న పక్షులతో ఆ పడుచులను పోలుస్తాడు. పాత్రలు వారిని ద్రోహులుగా చూస్తే, ఆ ఉపమానం మాత్రం వారిని వలలో చిక్కుకున్న నిస్సహాయ ప్రాణులంటుంది.
ఆ పన్నెండు మందికి ఊపిరాడక కాళ్ళు గాల్లో కొద్దిసేపు కొట్టుకుని ఆగిపోయాయని చదివినప్పుడు నా ఒళ్ళు జలదరించింది; ‘అది అప్పటి కాలం కదా’ అని మనసులో రగిలిన ఆ నైతిక క్షోభను పక్కన పెట్టడం నా వల్ల కాలేదు.
మళ్ళీ ఇథకా
యుక్తవయసులో నాకు ఇథకా ఒక ఊరి పేరు. నడివయసులో కవాఫీ కవిత ద్వారా అది ప్రయాణానికి అర్థం ఇచ్చే గమ్యంగా మారింది. డెబ్బై ఏళ్ళ దరిదాపుల్లో ఒడిస్సీ చదివిన తరువాత, అది నాకు ఎంతో సంక్లిష్టమైన రూపకంగా మారింది — ఇల్లు, జ్ఞాపకం, గుర్తింపు, ప్రేమ, అధికారం, ప్రతీకారం, మరణం… చివరకు తిరిగి చేరడం.
దాదాపు మూడు వేల ఏళ్ళ కిందటి కావ్యం అయినా, అది వేసే ప్రశ్నలు మాత్రం పాతబడలేదు. నాయకత్వాన్ని విజయంతోనే కొలవాలా? ఒక కాలం సహజమని భావించిన అన్యాయాన్ని తరువాతి తరాలు ఎలా చూడాలి? ఇలాంటి ప్రశ్నల వల్లే బహుశా ఒడిస్సీ ఇప్పటికీ కొత్త పాఠకుడిని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
అందుకే ఒడిస్సీని చదవాల్సింది అది పాశ్చాత్య సాహిత్యానికి మూలస్తంభం కాబట్టి మాత్రమే కాదు. వీరత్వం, నాయకత్వం, ఇల్లు, వివాహం, స్త్రీల అధికారం, బానిసత్వం — మనకు తెలిసినవే అనుకున్న విషయాలను కూడా అది మళ్ళీ ప్రశ్నించేలా చేస్తుంది. పాత కావ్యాలు చదవాల్సింది వాటి విలువలన్నిటినీ అంగీకరించడానికి కాదు; వాటితో వాదించడానికి కూడా.
కావ్యం అంతా చదివి ముగించాక, నాకు దాని మొదటి వాక్యం మళ్ళీ గుర్తొచ్చింది. ఎమిలీ విల్సన్ తన అనువాదాన్ని ప్రారంభించిన తీరు ఇది:
“Tell me about a complicated man.”
గ్రీకు మూలంలోని polytropos అన్న మాటకు నానా మార్గాలు తిరిగినవాడు, పలు యుక్తులు తెలిసినవాడు వంటి అర్థాలున్నాయి. విల్సన్ దాన్ని ‘complicated’ అని అనువదించింది. కావ్యం ముగిసేసరికి ఆ పదం ఎందుకు అంత సరిపోతుందో అర్థమైంది. నాకు ఒడిస్సియస్ ఆదర్శవీరుడిగా కనిపించడు; కేవలం క్రూరుడిగానూ కాదు. సాహసం, బలం, జ్ఞానం, గర్వం, క్రౌర్యం, కపటం, ప్రేమ — ఇవన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన మనిషి.
కవాఫీ ఇథకాను ప్రయాణానికి దిశనిచ్చే గమ్యంగా చూపించాడు. కానీ హోమర్ ఒడిస్సీ చదివాక నాకు తెలిసింది మరోటి: ఇథకా చేరడం ఒకటి; నిజంగా ఇంటికి తిరిగి చేరడం మరోటి.
ప్రధాన మూలాలు
- Homer. The Odyssey. Translated by Emily Wilson. New York: W. W. Norton & Company, 2017.
- Homer. The Odyssey. Translated, with an Introduction and Notes, by Daniel Mendelsohn. Chicago: University of Chicago Press, 2025.

