రణరంగంలో ద్రోహం
మెనలెయస్కి దాదాపుగా హస్తగతం ఆయిన విజయాన్ని మోసం చేసి ఏఫ్రొడైటీ ఎలా అపహరించిందో కళ్ళారా చూసినప్పటికీ, నమ్మలేకపోయింది అథీనా. గ్రీకు సేనలను నిరాశ ఆవహించకుండా ఉత్తేజపరచాలి. ఎలా? ఆమెకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ట్రోయ్ సైన్యంలో పేరెన్నికగన్న విలుకాడు పాండరస్ని (Pandarus) వెతుక్కుంటూ ఒలింపస్ పర్వతం నుండి కిందికి దిగి వచ్చింది.
పాండరస్ చెవిలో, “పాండరస్! మెనలెయస్ మీదికి బాణం గురిపెట్టి కొట్టగలిగే ధైర్యం నీకు ఉందా? ఒక్కసారి ఆలోచించుకో! నువ్వు మెనలెయస్ని పడగొడితే ట్రోయ్ దేశం నీకు ఋణపడి ఉంటుంది. పేరిస్ నిన్ను ఆప్తుడిగా హృదయానికి హత్తుకుంటాడు!”
పర్యవసానం ఎలాగుంటుందో ఆలోచించకుండా పాండరస్ ఉలిక్కిపడి లేచి, భుజాన్ని ఉన్న విల్లుని చేతబట్టి, అమ్ములపొదినుండి ఒక బాణాన్ని తీసి, వింటిపై సంధించి, నారిని ఆకర్ణాంతం లాగి పట్టుకుని, జాగ్రత్తగా గురి చూసి బాణాన్ని వదిలేడు. కత్తిలా వాడిగా ఉన్న ఆ బాణపు కంచు మొన వాయువేగంతో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తోంది.
ఆ వేగాన్ని మించిన వేగంతో అథీనా మెనలెయస్ని చేరుకుని ఆ బాణాన్ని కొద్దిగా పక్కకి నెట్టడంతో ఆ బాణం మెనలెయస్ ప్రాణం తీయడానికి బదులు అతని ఛాతీని కప్పిన కవచాన్ని గీరుకుని లోపల శరీరాన్ని కొద్దిగా గాయపరిచింది. గాయం నుండి రక్తం స్రవించసాగింది.
అథీనా కుయుక్తి ఫలించింది. తమ్ముడి వక్షస్థలం నుండి కారుతూన్న రక్తాన్ని చూసిన అగమేమ్నాన్, “నేను రక్తసిక్తమైన చేతులతో చేసిన యుద్ధవిరమణ ప్రమాణం ఇంతటితో సరి! ఇప్పుడు ఆ ప్రమాణమే ట్రోయ్ సైనికులని మట్టుపెట్టడానికి నా అధికార పత్రం!” అని ఉద్ఘాటించేడు.
నొప్పితో బాధ పడుతున్నా, అన్న కోపాన్ని చల్లార్చడానికి “అన్నా! ఇదేమీ ప్రాణాంతమైన దెబ్బ కాదు. నా కవచం బాగానే అడ్డుకుంది. కంగారు పడకు!” అన్నాడు మెనలెయస్.
“నువ్వు బాగుండడమే నాకు కావలసింది. రాజవైద్యుడు మాకాన్ (Machaon) లేపనాలు పట్టుకు వస్తున్నాడు. నీ క్షేమం అతను చూస్తాడు.”
మాకాన్ గాయానికి లేపనం రాసి, కట్టు కడుతూ ఉంటే అగమేమ్నాన్ అక్కడ చేరిన రాచ ప్రతినిధులని ఉద్దేశించి, “చూసేరు కదా! మనం చేసుకున్న ఒప్పందాన్ని వమ్ము చేసి ఈ ట్రోయ్ సైన్యం ఎలా మాట తప్పిందో? ప్రయాం రాజు, అతని పిల్లలు, అతని సైన్యం ఈ రణభూమిలోనే చచ్చి తీరాలి. వాళ్ళ ప్రాణాలు పూర్తిగా పోకుండానే, వాళ్ళ రక్తం ఇంకా వెచ్చగా ఉండగానే రాబందులు వాళ్ళను పీక్కు తినాలి!”
ఇంకా అస్త్రసన్యాసపు దశలోనే ఉండి, దూరంనుండి గ్రీకు సేనలో చెలరేగుతూన్న అలజడిని చూసి, ట్రోయ్ సేనలు తమ ప్రాణరక్షణకు సాయుధులు కాక తప్పలేదు.
అగమేమ్నాన్ సైనికుల మధ్యకు వెళ్ళి వాళ్ళను ఉత్తేజపరచడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. “ఇరవై నాలుగు గంటలూ అప్రమత్తంగా ఉండాలి. పౌరుషాన్ని సన్నగిల్లనివ్వకూడదు!” అని కొందరితోటీ, “అలా కళ్ళప్పగించి, నిశ్చేష్టులై నిలబడడానికి సిగ్గెయ్యడం లేదూ? ట్రోయ్ సైనికులు వెంటపడి తరిమితే మీరందరూ ఎక్కడికెళతారో తెలుసా? సముద్రంలోకి! సముద్రంలో పడి చచ్చేకంటే యుద్ధంలో చస్తే వీరస్వర్గం వస్తుంది!”
క్రీట్ ద్వీపానికి అధిపతి అయిన రాజా ఐడామినస్ ఎదురుపడితే ఆయనకు నమస్కరించి, “మీరు మా సేనానాయకులందరిలో అగ్రగణ్యులు!” అని పొగడ్తలతో ఉక్కిరిబిక్కిరి చేసేడు.
“నేనున్నాను. మీకేమీ భయం వలదు!”, రాజా ఐడామినస్ ధైర్యం చెప్పేడు.
సేనల ముందు వరసలో ఉన్న రథికులను పైలోస్ రాజు నెస్టర్ తన ఉపన్యాసంతో తన చెప్పుచేతలలో పెట్టుకున్నాడు. “ప్రజ్ఞలు పలికే వేళ దాటిపోయింది. గొలుసులో ఏ ఒక్క లంకె తెగిపోయినా గొలుసంతా నష్టపోతుంది. మీలో ప్రతి ఒక్కరూ గొలుసులో ఒక లంకె! మీరంతా ముఖ్యమే. గడ్డిపరకలు వెంటిగా ఏర్పడినప్పుడే మదపుటేనుగును బంధించగలవని అంటారు. రథికులారా! మీరు ట్రోయ్ జనాలని సమీపించిన తరువాత ఈటెలను విసరకండి; ఈటెలను చేతిలోనే ఉంచుకుని పొడిచి చంపండి. అప్పుడు అదే ఈటెతో మరొకరిని హతమార్చవచ్చు!”
సముద్రపు కెరటాలు ఒకదాని వెంట మరొకటి వచ్చి ఒడ్డును ఢీకొట్టినట్లు గ్రీకు సేనావాహిని తెరలు తెరలుగా ముందుకు కదిలింది.
అటునుండి ట్రోయ్ సైన్యం ముందుకు ఉరికింది.
పోటెత్తిన సముద్రాల్లా ఉన్న సేనావాహినులు రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈటెలతో ఈటెల టకటకలు. ఖంగు ఖంగుమని ఖడ్గాల మోతలు. క్షతగాత్రులైన సైనికుల హాహాకారాలు. విజయోత్సాహంతో హర్షధ్వానాలు. శిరశ్ఛేదాలతో, చిమ్మనగ్రోవిలోంచి ఎగజిమ్మినట్లు ధారాపాత రుధిరప్రవాహాలు. రణరంగమంతటా బీభత్సం తాండవించింది.
అందరికంటే ముందు నెస్టర్ కొడుకు ఏంటిలోకస్ (Antilochus) ఒక ట్రోయ్ దళాధిపతిని, శిరస్త్రాణానికి దిగువ రక్షణలేకుండా ఉన్న మెడను తన బల్లెంతో పొడిచి, నేలగూల్చేడు. నేల కూలిన వ్యక్తికి సహాయం చెయ్యడానికి పరిగెత్తుకు వచ్చిన ట్రోయ్ సైనికుడికి కూడా అదే గతి పట్టింది.
పెద్ద ఏజాక్స్ (Ajax) పెద్ద పరుగున వచ్చి మరొక ట్రోయ్ దళాధిపతి భుజం లోపలికి తన ఈటెను గుచ్చి గాయపరచేడు.
రాజా ప్రయాం కొడుకు ఏంటిఫస్ (Antiphus), తన సహదేశీయుడిపై పెద్ద ఏజాక్స్ చేసిన దాడిని చూసి, చేతిలోనున్న బల్లేన్ని ఏజాక్స్ మీదకి గురి పెట్టి విసిరేడు; కానీ అది గురి తప్పి ఒడిస్సియస్ సైనికాధికారికి ఒకడికి తగిలింది.
తన సైనికాధికారి ఇలాంటి పిల్లకాయ చేతులలో మరణించడం చూసి ఒడిస్సియస్ ఉగ్రుడయ్యాడు. కంచు మొనతో తళతళ మెరుస్తూన్న తన ఈటెను ఏంటిఫస్ మీదకి విసిరేడు. అది నేరుగా ఏంటిఫస్ శిరస్సును ఛేదిస్తూ వెళ్ళడంతో ఏంటిఫస్ దబ్బున నేలమీద పడ్డాడు.
ఒడిస్సియస్ అంతటితో ఆగలేదు. ట్రోయ్ సైన్యబలగాన్ని చీల్చి చెండాడడానికి ఉగ్రరూపంతో ముందుకు కదిలేడు. అరివీరభయంకరాకారంతో ముందుకు కదులుతున్న ఒడిస్సియస్ ఉగ్రరూపాన్ని చూసి ట్రోయ్ సైనికులు భయంతో కొంచెం వెనక్కి తగ్గేరు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని గ్రీకు సైనికులు నేలకొరిగిన తమ తోటి సైనికుల మృతదేహాలను, గాయపడ్డవారిని రథాలమీదకి ఎక్కించి సురక్షితమైన స్థావరాలకు తరలించడం మొదలుపెట్టేరు.
యుద్ధపు పురోగతి ఇలా పరిణమించడం అపోలోకు నచ్చలేదు. భయభ్రాంతులై వెనక్కి తగ్గుతూన్న ట్రోయ్ సైనికుల్ని ఉద్దేశించి, “అలా భయపడి లొంగిపోవద్దు! గ్రీకు సైనికులు రాళ్ళతోటీ, ఇనుము తోటీ తయారయిన శాల్తీలు కారు. వారి శరీరంలో ఉన్నవి కూడా రక్తమాంసాలే! వారిలో వీరాధివీరుడు అనదగ్గ అకిల్లీస్ యుద్ధం చెయ్యడమే లేదు. ఎక్కడో అలిగి కూర్చున్నాడు. మీకు భయమేల? యుద్ధరంగంలోకి దూకి గ్రీకులను ఈటెలతో పొడవండి. కత్తులతో వారి కుత్తుకలను కత్తిరించండి. పదండి, ముందుకి!”
అథీనా గ్రీకు వీరులనీ ఇదే ధోరణిలో ఉత్తేజ పరచింది. “ప్రస్తుతానికి మీది పై చేయిగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!”
అథీనా ప్రేరేపణలతో ఉత్తేజితుడైన డయొమీడీస్ తన రథాన్ని యుద్ధరంగం మధ్యకు తోలుకు వచ్చేడు. కళ్ళేలను లాగి గుర్రాలను అదుపులో పెట్టి, ఈటెను చేతబట్టి నేల మీదకి దూకేడో లేదో, వెనువెంటనే ట్రోయ్ సైనికుడు ఫేగస్ (Phegus) విసరిన ఈటె మెరుపులా డయొమీడీస్ భుజాన్ని చుంబిస్తూ దూసుకుపోయింది. అసంకల్పిత ప్రతీకారచర్యగా డయొమీడీస్ తన ఈటెను విసరగా అది నేరుగా ఫేగస్ వక్షఃస్థలాన్ని ఆచ్ఛాదించిన తోలు కవచాన్ని చీల్చుకుని అతని గుండెల్లో గుచ్చుకుంది. ఫేగస్ నేల కూలడం చూసి అతని అతని తమ్ముడు ఇడియస్ (Idaios) అన్న మృతదేహాన్ని రథంలో వేసుకుని ట్రోయ్ నగరం వైపు పరుగులు తీసాడు.
అన్న మృతదేహాన్ని రథంలో వేసుకుని పలాయనమంత్రం పఠిస్తూన్న తమ్ముడిని చూడగానే ట్రోయ్ సైనికులలో భయాందోళనలు మొలకెత్తి వెనుతిరగడం మొదలెట్టేరు. అలా పారిపోతూన్న వారిలో ఓడియస్ని (Odius) గుర్తించి, అగమేమ్నాన్ వెంబడించి తన శూలాన్ని విసరడంతో అది ఓడియస్ వీపులో గుచ్చుకుని, ఛాతీనుండి బయటకి వచ్చింది. ఆ దెబ్బకు అతను మారుమాట లేకుండా నేల కూలేడు.
మరికొంత దూరంలో ఐడామినస్ (Idomeneus) విసిరిన ఈటె పోటుకు అప్పుడే రథం ఎక్కుతూన్న ఫెస్టస్ (Phaestus) జబ్బకి తగలగా అతని శరీరం సగం భాగం రథంలోనూ, సగం నేలమీదికి ఒరిగి ఉండగా, బెదిరిన గుర్రాలు పరుగు లంకించుకోగా అతను ఆ రథచక్రాల కింద పడి మరణించేడు.
(సశేషం)
