సీతాంజనేయ సంభాషణం – V

శ్లో॥ తస్యాస్తద్ వచనం శ్రుత్వా హనూమాన్ హరిపుంగవః।
దుఃఖాద్ దుఃఖాభిభూతాయాః సాన్త్వముత్తరమబ్రవీత్ ॥ 1 ॥


పదచ్ఛేదము:- తస్యాః – తత్ – వచనం – శ్రుత్వా – హనుమాన్ – హరిపుంగవః దుఃఖాత్ – దుఃఖాభిభూతాయాః – సాంత్వమ్ – ఉత్తరమ్ – అబ్రవీత్

అన్వయక్రమము:- హరిపుంగవః హనుమాన్ దుఃఖాభిభూతాయాః తస్యాః తత్ వచనం దుఃఖాత్ శ్రుత్వా, సాంత్వమ్ ఉత్తరమ్ అబ్రవీత్.

ప్రతిపదార్థము:- హరిపుంగవః = వానరశ్రేష్ఠుడైన, హనుమాన్ = హనుమ, దుఃఖాభిభూతాయాః = దుఃఖముచే పీడింపబడినట్టి, తస్యాః = ఆ సీతాదేవియొక్క, తత్ వచనం = ఆ మాటను, దుఃఖాత్ = దుఃఖమున, శ్రుత్వా = విని, సాంత్వమ్ ఉత్తరం = ఓదార్పు గల్గించునట్టి ప్రతివచనమును, అబ్రవీత్ = పలికెను.


తే.గీ.
దుఃఖపీడితయగు సీత దుస్థితి విని
దొంతి దుఃఖము వెంబడి దుఃఖ మొదవ
సాంత్వనోక్తుల రాముని స్వస్తి వార్త
పలికి యూరడించగ బూనె పవనసుతుడు

శ్లో॥ అహం రామస్య సందేశాద్ దేవి దూతస్తవాగతః।
వైదేహి కుశలీ రామః స త్వాం కౌశలమబ్రవీత్ ॥ 2 ॥


పదచ్ఛేదము:- అహం – రామస్య – సందేశాత్ – దేవి – దూతః – తవ – ఆగతః – వైదేహి – కుశలీ – రామః – సః – త్వాం – కౌశలమ్ – అబ్రవీత్

అన్వయక్రమము:- దేవి! అహం రామస్య సందేశాత్ తవ (సమీపం) ఆగతః (అస్మి). వైదేహి, రామః, కుశలీ; సః త్వాం కౌశలమ్ అబ్రవీత్.

ప్రతిపదార్థము:- దేవి = ఓ జానకీదేవీ!, అహం = నేను, రామస్య = శ్రీరాముని యొక్క, సందేశాత్ = సందేశమువలన, తవ (సమీపం) = నీదగ్గరకు, ఆగతః = వచ్చినట్టి, దూతః (అస్మి) = దూతనై యున్నాను, వైదేహి = ఓ జానకీ, రామః = శ్రీరాముడు, కుశలీ = క్షేమముగనున్నవాడు, సః = అతడు, త్వాం = నిన్ను, కౌశలం = కుశలవార్తను, అబ్రవీత్ = అడిగినాడు.


శ్లో॥ యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేదవిదాం వరః।
స త్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్ ॥ 3 ॥


పదచ్ఛేదము:- యః – బ్రాహ్మమ్ – అస్త్రం – వేదాన్ – చ – వేద – వేదవిదాం – వరః – సః – త్వాం – దాశరథిః – రామః – దేవి – కౌశలమ్ – అబ్రవీత్ – ॥

అన్వయక్రమము:- దేవి! యః బ్రాహ్మమ్ అస్త్రం, వేదాన్ చ వేద, వేదవిదాం వరః, సః దాశరథిః రామః త్వాం కౌశలమ్ అబ్రవీత్.

ప్రతిపదార్థము:- దేవి! = ఓ పూజ్యురాలా!, యః = ఏ మహనీయుడు, బ్రాహ్మమ్ + అస్త్రం = బ్రహ్మాస్త్రమును, వేదాంశ్చ = చతుర్వేదములను, వేద = ఎఱిగియుండెనో, వేదవిదాం వరః = వేదవేత్తలలో అగ్రగణ్యుడగు, సః దాశరథిః రామః = ఆ దశరథ నందనుడైన రాముడు, త్వాం = నిన్ను, కౌశలమ్ అబ్రవీత్ = కుశలవార్త నడిగెను.


శ్లో॥ లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తేఽనుచరః ప్రియః।
కృతవాన్ శోకసంతప్తః శిరసా తేఽభివాదనమ్ ॥ 4 ॥


పదచ్ఛేదము:- లక్ష్మణః : లక్ష్మణః – చ – మహాతేజాః – భర్తుః – తే – అనుచరః – ప్రియః – కృతవాన్ – శోకసంతప్తః – శిరసా – తే – అభివాదనమ్ ॥

అన్వయక్రమము:- తే భర్తుః ప్రియః అనుచరః, మహాతేజాః లక్ష్మణః చ శోకసంతప్తః సన్ శిరసా తే అభివాదనం కృతవాన్.

ప్రతిపదార్థము:- తే భర్తుః = నీభర్తకు, ప్రియః అనుచరః = ప్రీతిపాత్రుడై తోడుగానుండు, మహాతేజాః = తేజశ్శాలియైన, లక్ష్మణశ్చ = లక్ష్మణుడును, శోకసంతప్తః సన్ = దుఃఖసంతప్తుడగుచు, శిరసా = శిరస్సుతో, తే = నీకు, అభివాదనం కృతవాన్ = అభివాదనము గావించి యున్నాడు.


సీ.
రాముడు పంపగా రయమున వచ్చిన
రామ దూతను నేను రమణి వినుమ
భద్రవిమలమూర్తి భవ్యగాత్రుడు రామ
భద్రుండచట కడు భద్రమమ్మ
బ్రహ్మాస్త్ర విద్యల పారంగతుడతడు
కుశలుడు నీయొక్క కుశలమడిగె
తేజస్వి సౌమిత్రి దేవర తమ్ముడు
శోకార్తితో నీకు సోలి మ్రొక్కె
తే.గీ.
దిగులు చెందకు మోయమ్మ, వగవ కింక,
రామ లక్ష్మణు లిద్దరు లంక జొచ్చి
దుష్ట దనుజుల దర్పమ్ము ద్రుంచి వేసి
వేగ నిన్నిట గాతురు వెతలు దీర.

శ్లో॥ సా తయోః కుశలం దేవీ నిశమ్య నరసింహయోః।
ప్రతిసంహృష్టసర్వాంగీ హనూమన్తమథాబ్రవీత్ ॥ 5 ॥


పదచ్ఛేదము:- సా – తయోః – కుశలం – దేవీ – నిశమ్య – నరసింహయోః – ప్రీతిసంహృష్టసర్వాంగీ – హనూమంతమ్ – అథ – అబ్రవీత్ ॥

అన్వయక్రమము:- అథ సా దేవీ తయోః నరసింహయోః కుశలం నిశమ్య, ప్రీతిసంహృష్టసర్వాంగీ (సతీ), హనూమంతమ్ అబ్రవీత్.

ప్రతిపదార్థము:- అథ = పిమ్మట, సా దేవీ = ఆ సీతాదేవి, తయోః నరసింహయోః= ఆ నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులయొక్క, కుశలం = క్షేమమును, నిశమ్య = ఆకర్ణించి, ప్రీతిసంహృష్టసర్వాంగీ (సతీ) = ఆనందముచే గగుర్పాటు నొందిన సమస్తశరీరము గలదై, హనూమంతం – హనుమంతుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.


తే.గీ.
యుగళ సింహములను బోలు యోధులైన
రామలక్ష్మణుల విపుల క్షేమవార్త
విన్న వైదేహి పులకించి వేడ్క తోడ
పావనిని గాంచి తియ్యగ పలికె నిట్లు.

శ్లో॥ కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా।
ఏతి జీవన్తమానన్దో నరం వర్షశతాదపి ॥ 6 ॥


పదచ్ఛేదము:- కళ్యాణీ – బత – గాథా – ఇయం – లౌకికీ – ప్రతిభాతి – మా – ఏతి – జీవంతమ్ – ఆనందః – నరం – వర్షశతాత్ – అపి ॥

అన్వయక్రమము:- బత! జీవంతం నరం వర్షశతాత్ అపి ఆనందః ఏతి, ఇతి ఇయం లౌకికీ గాథా మా కళ్యాణీ ప్రతిభాతి.

ప్రతిపదార్థము:- బత = ఆహా, జీవంతం నరం = జీవించియున్న మానవుని, వర్షశతాత్ అపి = నూఱు సంవత్సరములకు పిమ్మటనైనను, ఆనందః ఏతి = ఆనందము ప్రాప్తించును, ఇతి = అనునట్టి, ఇయం = ఈ, లౌకికీ గాథా = లౌకికమైన సూక్తి, మా = నాకు, కళ్యాణీ ప్రతిభాతి = మంగళకరమైన సత్యవాక్కుగా తోచుచున్నది.


తే.గీ.
“బ్రతికి యున్నచో నరుడు దా బడయ వచ్చు
నెపుడొ నూరేండ్ల వరకైన నెలమి సుఖము”
అనెడి సామెత నాపట్ల నయ్యె నిజము
భావి శుభఫల సూచక భావమొప్ప.

శ్లో॥ తయోః సమాగమే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుతా।
పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతుః ॥ 7 ॥

పదచ్ఛేదము:- తయోః – సమాగమే – తస్మిన్ – ప్రీతిః – ఉత్పాదితా – అద్భుతా – పరస్పరేణ – చ – ఆలాపం – విశ్వస్తౌ – తౌ – ప్రచక్రతుః ॥

అన్వయక్రమము:- తస్మిన్ సమాగమే తయోః అద్భుతా ప్రీతిః ఉత్పాదితా; తౌ విశ్వస్తౌ పరస్పరేణ ఆలాపం ప్రచక్రతుః.

ప్రతిపదార్థము:- తస్మిన్ సమాగమే = ఆ సమాగమమునందు, తయోః = వారిరువురికిని; అద్భుతా ప్రీతిః = మిక్కిలి గొప్పనైన ప్రీతి; ఉత్పాదితా = కలిగింపబడినది; తౌ = వారిరువురును, విశ్వస్తౌ = నమ్మకము కలిగినవారై, పరస్పరేణ = ఒండొరులతో, ఆలాపం ప్రచక్రతుః = సంభాషణమును గావించిరి.


తే.గీ.
ఒకరి మాటలకును నిట్టు లొకరు మాఱు
పలికి, సౌహార్దభావంబు తలిరుకొనగ
వలసి సీతాహనుమలు సంభాషణమును
నెమ్మి మీరగ సలిపిరి నమ్మకమున.

శ్లో॥ తస్యాస్తద్ వచనం శ్రుత్వా హనూమాన్ మారుతాత్మజః।
సీతాయాః శోకతప్తాయాః సమీపముపచక్రమే ॥ 8 ॥


పదచ్ఛేదము:- తస్యాః – తత్ – వచనం – శ్రుత్వా – హనుమాన్ – మారుతాత్మజః – సీతాయాః – శోకతప్తాయాః – సమీపమ్ – ఉపచక్రమే ॥

అన్వయక్రమము:- మారుతాత్మజః హనుమాన్ తస్యాః తద్వచనం శ్రుత్వా శోకతప్తాయాః సీతాయాః సమీపమ్ ఉపచక్రమే.

ప్రతిపదార్థము:- మారుతాత్మజః హనుమాన్ = వాయునందనుడైన హనుమ, తస్యాః సీతాదేవియొక్క త ద్వచనం శ్రుత్వా : = ఆ మాట విని, శోకతప్తాయాః = శోకముచే సంతాపము నొందియున్నట్టి, సీతాయాః = సీతయొక్క, సమీపం = సన్నిధికి, ఉపచక్రమే = చేర దొడగెను.


తే.గీ.
మారు బల్కిన సీతమ్మ మాట వినుచు
శోక భరమున కుమిలేటి సుదతి గాంచి
హనుమ హృదిలోన కారుణ్య మామతిల్ల
యెంచి సీత సన్నిధి సమీపించ దొడగె

శ్లో॥ యథా యథా సమీపం స హనూమానుపసర్పతి।
తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే ॥ 9 ॥


పదచ్ఛేదము:- యథా – యథా సమీపం – సః – హనుమాన్ – ఉపసర్పతి – తథా – తథా – రావణం – సా – తం – సీతా – పరిశంకతే ॥

అన్వయక్రమము:- సః హనుమాన్ యథా యథా (తస్యాః) సమీపమ్ ఉపసర్పతి, తథా తథా సా సీతా తం రావణం పరిశంకతే.

ప్రతిపదార్థము:- సః హనుమాన్ = ఆ హనుమ, యథా యథా = ఏ విధముగానైతే (తస్యాః), సమీపం = (ఆ సీతాదేవి) సమీపమునకు, ఉపసర్పతి = చేరుచున్నాడో, తథా తథా = ఆ విధముగనే, సా సీతా = ఆ జానకీదేవి, తం = ఆ హనుమను, రావణం = రావణునిగా, పరిశంకతే = శంకించుచుండెను.


శ్లో॥ అహో ధిగ్ ధిక్కృతమిదం కథితం హి యదస్య మే।
రూపాన్తరముపాగమ్య స ఏవాయం హి రావణః ॥ 10 ॥


పదచ్ఛేదము:- అహో – ధిక్ – ధిక్ – కృతమ్ – ఇదం – (యత్) కథితం – హి – అస్య – మే – రూపాంతరమ్ – ఉపాగమ్య – సః – ఏవ – అయం – హి – రావణః

అన్వయక్రమము:- అహో, మే అస్య యత్ కథితం, ఇదం ధిక్ ధిక్ (యతః) అయం రూపాంతరమ్ ఉపాగమ్య (ఆగతః) సః రావణః ఏవ హి.

ప్రతిపదార్థము:- అహో = = అక్కటా, మే = నాకు, అస్య = ఈతనియొక్క (చేత), యత్ కథితం = చెప్పబడిన దేది యున్నదో, ఇదం = ఇది, ధిక్-కృతం = మిక్కిలి నింద్యమైనది, యతః = ఎందుచేతననగా, అయం = ఈతడు, రూపాంతరమ్ = మాఱువేషమును, ఉపాగమ్య = పొంది (ఆగతః = వచ్చినట్టి) సః రావణః ఏవ హి = ఆ రావణాసురుడే యగునుగదా.


సీ.
ఎంత యెంతగ కపి యంతికమాయెనో
అంత కంతకు సీత అడలు నొందె
దరికి వచ్చు హనుమ దర్పమ్ము జూడగా
రావణుడను శంక రౌలుకొనియె
“మాఱువేషము వేయు మాయావి దైత్యుడే
కోతి రూపును దాల్చె కొల్లకాడు
కపిని దూతగ నెంచి కథ వినిపించితి
కటకటా! నేనెట్లు కాననైతి?”

శ్లో॥ తామశోకస్య శాఖాం తు విముక్త్వా శోకకర్శితా।
తస్యామేవానవద్యాంగీ ధరణ్యాం సముపావిశత్ ॥ 11 ॥


పదచ్ఛేదము:- తామ్ – అశోకస్య – శాఖాం – తు – విముక్త్వా – శోకకర్శితా – తస్యామ్ – ఏవ – అనవద్యాంగీ – ధరణ్యాం – సముపావిశత్ ॥

అన్వయక్రమము:- శోకకర్శితా, అనవద్యాంగీ సా అశోకస్య తాం శాఖాం విముక్త్వా, తస్యామ్ ఏవ ధరణ్యాం సముపావిశత్.

ప్రతిపదార్థము:- శోకకర్శితా = శోకపీడితురాలును, అనవద్యాంగీ = ఉత్తమమైన దేహముగలదియునగు, సా = ఆ సీతాదేవి, అశోకస్య = అశోకవృక్షముయొక్క, తాం శాఖాం = ఆ కొమ్మను, విముక్త్వా = విడిచిపెట్టి, తస్యాం ధరణ్యామ్ ఏవ = నేలమీదనే, సముపావిశత్ = కూర్చుండెను.


ఆ.వె.
“అకట, మోసపోతి!” ననుకొన్న సీతమ్మ
కొమ్మ విడిచి నేల కూలబడియె
నింద లేని తన్వి నిందించుకొని తాను
అవని పైన వ్రాలి యలమటించె!

శ్లో॥ హనుమా నతిదుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితామ్ ।
అవన్దత మహాబాహుస్తతస్తాం జనకాత్మజామ్।
సా చైనం భయసంత్రస్తా భూయో నైనముదైక్షత ॥ 12 ॥


పదచ్ఛేదము:- హనుమాన్ – అతిదుఃఖార్తాం – తాం – దృష్ట్వా – భయమోహితామ్, అవందత – మహాబాహుః – తతః – తాం – జనకాత్మజామ్, సా – చ – ఏనం – భయసంత్రస్తా – భూయః – న – ఏనమ్ – ఉదైక్షత ॥

అన్వయక్రమము:- మహాబాహుః హనుమాన్ అతిదుఃఖార్తాం, భయమోహితాం తాం దృష్ట్వా, తాం జనకాత్మజామ్ అవందత. ఏనం దృష్ట్వా భయసంత్రస్తా (సతీ) సా భూయః ఏనం న ఉదైక్షత.

ప్రతిపదార్థము:- మహాబాహుః హనుమాన్ = మహావీరుడైన హనుమ, అతిదుఃఖార్తాం = మిక్కిలిగ దుఃఖపీడితురాలును, భయమోహితాం = భయవివశురాలును అగు, తాం = ఆమెను, దృష్ట్వా = చూచి, తతః = పిమ్మట, తాం జనకాత్మజాం సీతాదేవిని గూర్చి, అవందత = నమస్కరించెను. ఏనం = ఈతనిని, దృష్ట్వా చూచి, భయసంత్రస్తా = భయవిహ్వలురాలైన, సా = ఆమె, భూయః = తిరిగి, ఏనం = ఈ హనుమను, న ఉదైక్షత = కన్నెత్తి చూడకుండెను.


శ్లో॥ తం దృష్ట్వా వన్దమానం చ సీతా శశినిభాననా।
అబ్రవీద్ దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వరా ॥ 13 ॥


పదచ్ఛేదము:- తం – దృష్ట్వా – వందమానం – చ – సీతా – శశినిభాననా – అబ్రవీత్ – దీర్ఘమ్ – ఉచ్ఛ్వస్య – వానరం – మధురస్వరా

అన్వయక్రమము:- శశినిభాననా సీతా వందమానం తం వానరం దృష్ట్వా, దీర్ఘం ఉచ్ఛ్వస్య మధురస్వరా అబ్రవీత్.

ప్రతిపదార్థము:- శశినిభాననా సీతా = చంద్రునివంటి ముఖము కలిగిన ఆ సీతాదేవి, వందమానం = మ్రొక్కుచున్నట్టి, తం వానరం = ఆ వానరపుంగవుని, దృష్ట్వా చూచి, దీర్ఘమ్ ఉచ్ఛ్వస్య = దీర్ఘమైన నిట్టూర్పును వెడలించి, మధురస్వరా = తీయని కంఠముగలదై (ఇక్కడ మధుర బదులు కఠిన/పరుష ఒప్పుతుందేమో), అబ్రవీత్ = పలికెను.


తే.గీ.
మించు దుఃఖార్తి నిండిన మెలత గాంచి
ఆంజనేయుడు కరముల నంజలించె;
వణకి పోవుచు జానకి భయము తోడ,
వేడి నిట్టూర్పు వదలుచు వేదనమున
కనుల నెత్తి చూడక పల్కె కఠినముగను:

శ్లో॥ మాయాం ప్రవిష్టో మాయావీ యది త్వం రావణః స్వయమ్।
ఉత్పాదయసి మే భూయః సంతాపం తన్న శోభనమ్ ॥ 14 ॥


పదచ్ఛేదము:- మాయాం – ప్రవిష్టః – మాయావీ – యది – త్వం – రావణః- స్వయమ్ – ఉత్పాదయసి – మే – భూయః – సంతాపం – తత్ – న – శోభనమ్ ॥

అన్వయక్రమము:- మాయావీ రావణః త్వం భూయః స్వయం మాయాం ప్రవిష్టః (సన్) మే సంతాపం ఉత్పాదయసి యది, తత్ శోభనం న.

ప్రతిపదార్థము:- మాయావీ రావణః = మాయావియైన రావణుడవగు, త్వం నీవు, భూయః = తిరిగి, స్వయం = స్వయముగనే, మాయాం ప్రవిష్టః, (సన్) = మాయను స్వీకరించినవాడవై, మే = నాకు, సంతాపం = పరితాపమును, ఉత్పాదయసి యది = కల్గించుచున్న యెడల, తత్ = ఆ మాయాకృత్యము, శోభనం న = మేలుగాదు.


శ్లో॥ స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజకరూపవాన్।
జనస్థానే మయా దృష్టస్త్వం స ఏవ హి రావణః ॥ 15 ॥


పదచ్ఛేదము:- స్వం – పరిత్యజ్య – రూపం – యః – పరివ్రాజకరూపవాన్ – జనస్థానే – – మయా – దృష్టః – త్వం – సః – ఏవ – హి – రావణః ॥

అన్వయక్రమము:- యః స్వం రూపం పరిత్యజ్య, పరివ్రాజకరూపవాన్ (సన్) జనస్థానే మయా దృష్టః, త్వం సః రావణః ఏవ హి.

ప్రతిపదార్థము:- యః = ఏ నీవు, స్వం రూపం = నిజరూపమును, పరిత్యజ్య విడిచి, పరివ్రాజకరూపవాన్ (సన్) = యతివేషమును ధరించినవాడవై, జనస్థానే జనస్థానమునందు, మయా = నాచేత, దృష్టః = చూడబడితివో, త్వం = నీవు, సః రావణః ఏవ హి = ఆ రావణుడవేగదా!


శ్లో॥ ఉపవాసకృశాం దీనాం కామరూప నిశాచర।
సంతాపయసి మాం భూయః సంతాపం తన్న శోభనమ్ ॥ 16 ॥


పదచ్ఛేదము:- ఉపవాసకృశాం – దీనాం – కామరూప – నిశాచర – సంతాపయసి – మాం – భూయః – సంతాపం – తత్ – న – శోభనమ్ ।

అన్వయక్రమము:- కామరూప, నిశాచర, ఉపవాసకృశాం, దీనాం మాం భూయః సంతాపం సంతాపయసి, తత్ శోభనం న.

ప్రతిపదార్థము ::- కామరూప! నిశాచర! = కామరూపుడవైన ఓ రక్కసుడా! ఉపవాసకృశాం = ఉపవాసముచే కృశించియున్నట్టి, దీనాం మాం = దీనురాలనైన నన్ను! భూయః = తిరిగి, సంతాపం = సంతాపము గల్గునట్లుగా, సంతాపయసి = పరితపింప జేయుచున్నావు, తత్ = ఆ కృత్యము, శోభనం న = క్షేమముగాదు.


సీ.
మాయవేషము వేయు మాయావి దైత్యుండు
రాక్షసరాజైన రావణుడవొ?
కామరూపము బూను కపట నిశాచర
దళముల తనరించు దనుజపతివొ?
నీచ బుద్ధులతోడ నిజరూపమును వీడి
వంచనల్ చేసెడి పాతకుడవొ?
మున్ను జనస్థానమున యతిరూపము
దాల్చి నన్నొడగొన్న తస్కరుడివొ?
తే.గీ.
దీన నుపవాస దీక్షలో డీలుపడగ
వెతలు పెట్టగ జూచుట వీరమగునె?
పొమ్ము మాయావి! నీకిక పొసగ దిచట,
మాయ చాలించి రావణ! మరలి పొమ్ము!

శ్లో॥ ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా।
న ప్రతివ్యాజహారాథ వానరం జనకాత్మజా ॥ 26 ॥


పదచ్ఛేదము:- ఏతాం – బుద్ధిం -తదా – కృత్వా – సీతా – సా – తనుమధ్యమా — న – ప్రతివ్యాజహార – అథ – వానరం – జనకాత్మజా

అన్వయక్రమము:- అథ తనుమధ్యమా, జనకాత్మజా సా సీతా తదా ఏతాం బుద్ధిం కృత్వా తం వానరం న ప్రతివ్యాజహార.

ప్రతిపదార్థము:- అథ = పిమ్మట, తనుమధ్యమా = సన్నని నడుము గల్గినదియును, జనకాత్మజా = జనకుని పుత్రికయైనదియు నగు, సా సీతా = ఆ సీతాదేవి, తదా = ఆ సమయమున, ఏతాం బుద్ధిం కృత్వా = ఈ నిశ్చయమును చేసికొని, తం వానరం = ఆ వానరునిగూర్చి, న ప్రతివ్యాజహార = జవాబు చెప్పకుండెను.


కం.
తలచి మదిని తరచి మహిజ
ఉలుకక కపినిగని చెయివు లుడుగగ నిలిచెన్
చలనము మరచి ముడుచుకొని
తొలగక బదులును పలకక తొడరెడి వెరపున్!