ఆ ఉదయం ఓ గంట అక్కడ గడిపాక ఆ కపంగ వట్టి ఇసుక, కెరటాలు, అగాధాలు నిండిన సాగరతీరమే కాదనీ, అది ఒక మినీ ప్రపంచమనీ బోధపడింది.
వెళ్ళీ వెళ్ళగానే తూరుపు దిక్కున వెలుగు రేకలు పలకరించాయి. అందీ అందని వెలుగు బిందువులను అందుకుని తమ ఉనికిని ప్రకటించుకొనే ప్రయత్నం చేస్తూ కెరటాలు కనిపించాయి. తగుమాత్రమే అయినా ఆకాశానికి అందం అద్దటానికి ‘మేమూ వచ్చాం’ అంటూ మేఘాలు తొంగి చూసాయి. వెనకనున్న చిక్కని అడవిలోంచి దారి తప్పి వచ్చి, బిక్కుబిక్కుమంటూ సముద్రంలో కలుస్తోన్న చిట్టి సెలయేళ్లు రెండు మమ్మల్ని ఆసక్తితో పరిశీలించాయి. ‘మాకేసీ కాస్త చూడండి’ అంటూ కాస్తంత దూరాన ఉన్న ఏటవాలు కొండచరియ మీది కొబ్బరిచెట్లు ఒక వరసలో నిలబడి ఆ చక్కని ఉదయానికి తమ వంతు శోభను అద్దుతున్నాయి. వాటి వెనక కనిపించీ కనిపించకుండా ఏదో టీవీ టవర్… ఉన్నట్టుండి అదనపు వర్ణాలు సంతరించుకుని సూర్యాగమన సూచన చేస్తున్న ఒక ఒంటరి తూరుపు మేఘం.
‘వస్తున్నా మిత్రులారా,’ అంటూ కడలి అంచున సూర్యుడు తొంగి చూసాడు. రెండు నిముషాల్లో పూర్ణబింబం… మాతోపాటు సమస్త ప్రకృతీ అతనికేసి ఆనందాశ్చర్యాలతో చూస్తున్న భావన… నిముషాల్లో తమ తమ సౌందర్యశోభలన్నీ సూర్యునికి అంకితం చేసిన వృక్షాలు, ఆకాశం, మేఘాలు… లేత వెలుగులో క్షణికసౌందర్యం సంతరించుకుని వెలిగిపోతోన్న సరుగుడు చెట్లు – వాటి ఆకుల నడుమనుంచి మబ్బులతో కలసి దృశ్య కళాఖండాలు పుట్టిస్తున్న సాగరజలాలు.‘జగమే మారినది మధురముగా ఈ వేళ’ అన్న ఆరుద్ర వాక్యం అప్రయత్నంగా గుర్తొచ్చింది.
తెప్పరిల్లి ఆ సాగరతీరపు అంచులు చూద్దామని బయల్దేరాం. బాగా విస్తరించి ఉన్న తీరమది. కూర్చోడానికి రాతి దిమ్మలు, పదిమంది కూర్చోడానికి అనువుగా ఉండే సోఫాలాంటి అర్ధచంద్రాకారపు వెదురు ఆసనం, సునామీ కెరటాల మీద ఎక్కి ఒడ్డుకు చేరుకుని అక్కడే చిక్కడి పోయిన బ్రహ్మాండమైన బల్ల పరుపు ఇనుప ఫంటు, పక్కనే ‘ఫిష్ లాండింగ్ ఏరియా’ అంటూ వెలిసిపోయిన బోర్డూ, తుప్పు పట్టిన గేటూ ఉన్న ప్రాంగణం, ఆ పక్కనే ‘2021లో కేంద్ర గృహమంత్రి ఆవిష్కరించారు’ అంటూ అవే వివరాలు అందిస్తోన్న మెరిసిపోయే కొత్త బోర్డు, దూరాన శిథిల భవనాలు – మళ్ళా వచ్చి మరింత పరిశీలనగా చూడవలసిన ప్రదేశమనిపించింది.తిరిగి గెస్ట్‌హౌస్‌కు చేర్చే రోడ్డు ఎంతో పచ్చగా, ముచ్చటగా, చిన్నగా, అందంగా పలకరించింది. నిన్న జెట్టీనుంచి గెస్ట్‌హౌస్‌కు చేరే హడావుడిలో ఈ అందాలు గమనించలేకపోయాంగానీ ఆ ఉదయాన చూసిన ముగ్ధసౌందర్యం రాబోయే రెండు మూడు రోజులూ ఎంత హాయిగా ఉండబోతున్నాయో సూచించింది.
ద్వీపపు రూపురేఖలు ఏమిటీ అన్న విషయం పరిశీలించాను. కార్ నికోబార్ అంత పొందికగా లేకపోయినా భౌగోళికంగా ఆ ద్వీపంతో ఎంతో సారూప్యం ఉన్న దీవి కచ్ఛల్. మా గెస్ట్‌హౌస్ ఉన్నది ద్వీపానికి ఈశాన్య దిశలో. ముఖ్యమైన రోడ్డు జెట్టీనుంచి ఝూలా బీచ్ వరకూ తూర్పు పడమరలుగా పన్నెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దారిలో మా గెస్ట్‌హౌస్‌నుంచి కొంచెం ముందుకు వెళితే ‘హోటల్ అలగి’ అన్న చిన్న రెస్టారెంట్ కనిపించి ఆశ్చర్యపరచింది. ఏ టూరిస్టులూ రాని ఈ మారుమూల దీవిలో హోటలేమిటీ? ఎవరు నడుపుతున్నారూ? అసలు కస్టమర్లెవరూ అన్న ప్రశ్నలు… ఆ ముఖ్యమార్గంలోకి అటు ఉత్తరంనుంచీ ఇటు దక్షిణంనుంచీ వచ్చి చేరుతోన్న చిన్న చిన్న దారులు… అంతా కలసి 2700 జనాభా అన్నారు, 35 గ్రామాలు అన్నారు. అంటే పదీ ఇరవై ఇళ్ళు ఉన్న గ్రామాలు ఎక్కువన్న మాట… వాటికి దారి ఉందా? ఉన్నా లేక పోయినా మాకున్న ఏక్టివా స్కూటరు కాలిబాటల్లో కూడా సాగిపోగల ఒదుగుదల ఉన్న వాహనం కదా… ఆ పచ్చని ద్వీపంలో వీలయినన్ని రోడ్లు, వీలయినన్ని ఊళ్ళు, వీలయినంతమంది మనుషులు – అదే నా గమ్యం అని నిర్ధారించుకున్నాను. ప్రకృతి, సాగరతీరాల సంగతేమిటీ అంటారా – అవి మనకు నిత్యం తోడుగానే ఉంటాయి కదా… తిరిగి గెస్ట్‌హౌస్ చేరేసరికి ఆరయింది. జగన్ తోటలో పచార్లు ఆరంభించాడు. కపంగ బీచ్ గురించీ, ద్వీపపు రూపురేఖల గురించీ మహా ఉత్సాహంగా మాటలు సాగించాను. పొంగి పొర్లుతోన్న నా ఉత్సాహం గమనించి, “హేవిటీ, ద్వీపానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్టున్నారే,” అంటూ వేళాకోళం పట్టించాడు.వేళాకోళమయితే పట్టించాడుగానీ మళ్ళా రోడ్లూ ఊళ్ళూ చూడటానికి నాకన్నా ముందే తయారైపోయాడు. తిన్నగా ఝూలా గ్రామం వేపు సాగిపోయాం. గ్రామం దాకా అనుకున్నామేగానీ మా ఏక్టివా మాకన్నా హుషారైనది. గ్రామం దాటుకు వెళ్ళి సముద్రం అడ్డు వచ్చేదాకా దాని నడక ఆగలేదు! ఝూలా బీచ్ చేరిపోయామన్నమాట.
అదే వరస. అందమైన బీచ్. చుట్టు గుడిసె. బెంచీలు. మనుషులే లేరు. దీన్ని అడవి గాచిన వెన్నెల అనాలేమో! మళ్ళా, ‘అదేం మాటా, అది మనుషులు పుట్టించిన ఆలోచన… ప్రపంచంలోని అన్ని అందాలు, అన్ని సంపదలు మానవజాతి కోసమే అనుకోవడమే అహంభావం కాదూ. శతకోటి జీవరాసుల్లో ఒకరైన మనిషి ప్రకృతి మీద ఇలా అడవిగాచిన వెన్నెలలాంటి లేబుళ్లు అతికించడం ఎంతవరకూ సమంజసం? మిగతా ప్రాణులూ వృక్షాలూ కూడా ఈ అందాలకు పులకరించి తీరతాయి గదా…’ అన్న భావన. ఈ మీమాంసలో ఆ ఝూలా బీచ్ మనిషి పక్షాన ఉందో సమస్త ప్రకృతి పక్షాన ఉందో తెలియదు. ప్రకృతిలో భాగం కదా – అటే ఉండి ఉండాలి. ఝూలా బీచ్‌కు ఎడమవేపున సముద్రానికి చేరువలో చెట్ల మధ్యనుంచి సాగిపోతోన్న సన్నటి రోడ్డు కనిపించింది. అది ఝూలా గ్రామానికి దారి తీస్తుందా? తెలియదు. వెళ్ళి చూద్దాం అని ఆ దారి పట్టుకున్నాం. మెల్లగా ఆగుతూ ఆగుతూ పది నిముషాలు ఆ దారిలో వెళ్ళాం – గ్రామాలేవీ కనబడలేదు. రోడ్డు ముగిసి బళ్ళు వెళ్ళే దారి వచ్చింది. మెల్లగా ఆ దారిలో ఏక్టివా నడిపాం. అటూ ఇటూ ముందూ వెనకా ఏ మాత్రమూ మిగులు లేకుండా అంతా పచ్చదనం… ఎక్కువగా కొబ్బరిచెట్లు… అడపాదడపా పేరు తెలియని పెద్ద చెట్లు – నేల నిండుగా పరచుకుని ఉన్న అండర్ గ్రోత్… అరుదుగా కనిపిస్తోన్న కొబ్బరి పనివాళ్ళు… పలకరింపులు… ఉన్న ఆ కాస్త దారీ మూసుకుని పోగా ఇక నేను ముందుకు నడవను అని ప్రకటించిన ఏక్టివా… అది నడుస్తానన్నా నడవనీయలేని చిన్న చిన్న పంటకాలువలు… ముందుకు వెళ్ళి చూద్దాం అన్న పసి కుతూహలంతో ఇద్దరు పెద్దవాళ్ళం… మరో పది నిముషాలు… హఠాత్తుగా సాగరతీరం. అవును మరి – సముద్రం నడుమన ఉన్న చిన్న దీవిలో ఎటు వెళ్ళినా చివరికి సాగరతీరమే చేరతాం గదా…గెస్ట్‌హౌస్ వేపు తిరుగుదారి పట్టాం. త్వరలోనే ద్వీపపు మెయిన్ రోడ్ అందింది. తెలిసిన దారి… అంతకు ముందు గమనించలేదుగానీ మెయిన్ రోడ్‌కు రెండు వేపులా, అలగి హోటల్ ప్రాంతంలో దక్షిణ భారతీయుల రూపురేఖలు ఉన్న మనుషుల ఉనికి అడుగడుగునా కనిపించింది. గెస్ట్‌హౌస్‌లో తమిళం, తెలుగు వినిపిస్తే అది గవర్నమెంట్ ఆఫీసుల్లో పని కోసం వచ్చిన ‘సెటిలర్ల’వల్ల అనుకున్నాను. ఇక్కడ చూస్తే డజన్ల కొద్దీ సౌతిండియా సెటిలర్లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమిటి కథ? ఈ విసిరేసినట్టున్న ద్వీపానికి వీళ్ళంతా ఎక్కడనుంచి వచ్చారూ? ఎలా వచ్చారూ? ఎందుకు వచ్చారూ? అన్నట్టు ఈ ద్వీపంలో సగంమంది సెటిలర్లే కదూ…
ఏక్టివా జవాబుల కోసం అలగి హోటల్ దగ్గర ఆగింది. దాన్ని నడుపుతున్నది ఓ తమిళ వ్యక్తి.
“ఎప్పుడు – ఎక్కణ్ణించి – ఎలా అంటే చెప్పలేనుగానీ మా తండ్రీ తాతలు ఇక్కడే పుట్టి పెరిగారని తెలుసు. నేను పుట్టి పెరిగింది ఈ కచ్ఛల్ ద్వీపంలోనే. ఈ హోటల్ పెట్టి పదిహేనేళ్ళయింది. బాగా నడుస్తోంది,” కాస్తంత సమాచారం అందించింది ఆ మధ్య వయసు తమిళ మహిళ. “మీరున్న గెస్ట్‌హౌస్‌నుంచి ఓ మైలు దూరం ఉత్తరంగా వెళితే అక్కడ మీనాక్షీ రామ్‌నగర్ అన్న మరో తమిళ కాలనీ ఉంది. గుడి కూడా ఉంది,” అన్న కబురూ చెప్పిందామె.
గెస్ట్‌హౌస్ చేరగానే జగన్‌ను దింపేసి మీనాక్షీ రామ్‌నగర్ వేపు స్కూటర్ మళ్లించాను. దారిలో పెట్రోల్ బంక్. ఏక్టివా కడుపు నింపాను. మరో కిలోమీటర్ దూరంలో ఆ మీనాక్షీ రామ్‌నగర్… మరో వంద మీటర్ల దూరాన చర్చ్.
ఊరి మొగలోని చెట్టు కింద నలుగురయిదుగురు కుర్రాళ్ళు కనిపించారు. వెళ్ళి, వీలైనంత క్లుప్తంగా నా నేపథ్యం చెప్పి, కబుర్లలో పడ్డాను. గుడి దాకా రమ్మన్నాను. వచ్చారు. ఇళ్ళు బావున్నాయి. ఊరు శుభ్రంగా ఉంది. కోళ్ళు, కోడిపిల్లలు, ఇళ్ళ ముందు పూలమొక్కలు, కూరగాయల పాదులు – చిన్నపుడు పెరిగిన కృష్ణా జిల్లా బంటుమిల్లి గుర్తొచ్చింది. కానీ ఈ మీనాక్షీ కాలనీ బాగా చిన్నది. అంతా కలసి నాలుగు చిన్న వీధులు. కబుర్లయితే నడిచాయిగానీ అలగి హోటలావిడ ఇచ్చిన దానికన్నా అదనంగా సెటిలర్ల పూర్వాపరాలు తెలియలేదు.మూడు గంటల వేళ ఎటు వెళదాం అన్న ప్రస్తావన వచ్చింది. నాలుగూ ఆ ప్రాంతంలో మళ్ళా కపంగ బీచ్ మరింత క్షుణ్ణంగా చూసి సూర్యుడికి గుడ్ బై కూడా చెప్పి వద్దామా అన్నాను. ‘నాలుగు దాకా ఎందుకూ – టీవీ టవర్ అన్నారుగదా. పై దాకా దారి ఉండే ఉంటుంది. ఇప్పుడే బయల్దేరదాం,’ అన్నాడు జగన్.
బీచ్‌కు చేరీ చేరగానే ఆ పక్కనే ఉన్న శిథిల భవనాల వేపు దారితీసాం. తగుపాటి ప్రాంగణంలో ఒకే కూటమిగా గోడలు మాత్రమే మిగిలిన భవనాలు రెండు… కాంక్రీటు పై కప్పు కూడా నిలచి ఉన్నా, కిటికీలూ తలుపులూ లేకుండా గదులు గదులుగా మిగిలిపోయిన పొడవాటి బిల్డింగ్ ఒకటి – తరచి చూస్తే అది ఒక పాడుబడిన స్కూలు భవనం అని బోధపడింది. పాడుబడడం కాదు – సునామీ తుడిచి పెట్టిన భవనమది.
ఇలాంటి భవనాలే ధనుష్కోడిలో చూసాను. ఇక్కడ ఒక భవనం, ఒక ప్రాంగణం. అక్కడయితే ఊరు ఊరంతా పాతిక అడుగుల 1964 ఉప్పెన వెల్లువలో కొట్టుకుపోవడం, గట్టి భవనాల అస్థిపంజరాలు ఇంకా మిగిలి ఉండటం, అపార జననష్టం, ఇపుడా ఊరు మృతనగరంగా మిగిలిపోవడం గుర్తొచ్చింది. జ్ఞాపకాలు వదలవు. విషాద జ్ఞాపకాలయితే వదలనే వదలవు…
“పదండి, టీవీ టవర్ దాకా వెళ్ళి చీకటి పడేలోగా తిరిగొద్దాం,” అని లేవదీసాడు జగన్. ఈలోగా మాకు సాయం చెయ్యడానికి గెస్ట్‌హౌస్ కేర్ టేకర్ పంపిన వ్యక్తి వచ్చి మాతో చేరాడు. అక్కడి కొబ్బరితోటలో పనిచేస్తోన్న నికోబారీ యువకుడు కూడా కలిసాడు. నలుగురం కలసి ముందుకు సాగాం.
చక్కని దారి. చిక్కని అడవి. పైదాకా కాలిబాట. చుట్టూ చెట్ల పసరి వాసన. సువాసన. గాలిలో తేమ. ఆ మధ్యనే వర్షం పడ్డ సూచనలు. అక్కడక్కడ చిన్న చిన్న నీటి చెలమలు… కాస్తంత దూరాన సముద్రపు బ్యాక్ వాటర్స్‌తో ఏర్పడిన తటాకం… విసిగించని బురద… చూడ్డానికే దగ్గరే అనిపించినా ఎక్కడానికి అరగంట పట్టేసింది. ఒక్క ఆపరేటరయినా ఉంటాడనుకున్నాం – లేదు. ఎదురుగా సముద్రం… అవతలి ‘ఒడ్డున’ ఏదో దీవి – కమోర్తానా, నన్ కోవ్రీనా? అవే అయి ఉండాలి… అంతా కలసి దూరం పది కిలోమీటర్లలోపే కదా… సముద్రమూ కొండ చరియలూ సహవాసం చేసే చోట అందం రెట్టింపు కాదు – నాలుగు రెట్లవుతుంది…
ఆరోజు పౌర్ణమి.
సూర్యుడు విశ్రమిస్తున్న సమయానికే చంద్రుడు అందిపుచ్చుకున్నాడు. మెలమెల్లగా వెలుగు పుంజుకొన్నాడు. నిన్న సాయంత్రం గెస్ట్‌హౌస్‌లో పలకరించిన చతుర్దశి చంద్రుడే కదా – మామూలు కంటికి ఆ ఒక్క రోజు తేడా బింబపు పరిమాణంలోగానీ వెలుగులోగానీ ఆనదు…
చందమామ అంటే ఇష్టపడే నాకు, వెన్నెల రోజుల్లో పది రోజులపాటు అతణ్ణి క్రమం తప్పకుండా పలకరించే నాకు, ఆ అక్టోబర్ నెల పూర్ణచంద్రుణ్ణి మిగిలిన ప్రపంచానికి దూరంగా, పోర్ట్ బ్లెయిర్‌కు కూడా దూరంగా, తన ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండా బ్రతికేస్తోన్న కచ్ఛల్ ద్వీపంలో, ఆ ద్వీపపు కపంగ సాగరతీరంలో, స్నేహంగా అలలు చాస్తోన్న సముద్రం ఒడ్డున చూడగలగడం – సంబరమే సంబరం కదా…
అసలు వెన్నెల ‘తీవ్రత’ మనసులో ఇంకించుకోవడానికి కచ్ఛల్‌లాంటి ‘ప్రపంచానికి దూరంగా’ ఉండే చిన్న చిన్న ద్వీపాలే అనువైన ప్రదేశాలు కాదూ!? పట్నాలూ నగరాలూ అయితే పట్టి పట్టి చూస్తే తప్ప భవనాల మధ్య ఇరుక్కుపోయిన చంద్రుడు కంటికి కనిపించడు. వెన్నెల ఎంతగా కాసినా నగరపు దీపాల ముందు దానికి ఉనికి అంటూ ఉండదు. ఢిల్లీలాంటి నగరాల్లో అయితే కాలుష్యం పుణ్యమా అని మన కంటి దాకా చేరే వెన్నెల పరిమితం. పల్లెటూళ్ళలో భవనాలూ కాలుష్యాలూ లేకపోయినా దైనందిన జీవనసమరంలో మునిగి తేలే ఆయా గ్రామాల వాళ్ళు వెన్నెలను పనిగట్టుకుని చూడవలసి వస్తుంది. ఇక్కడ, మనిషి జాడ లేని చిన్న ద్వీపపు సాగరతీరంలో, రోడ్ల మీద, చెట్ల మీద – ఎక్కడ చూసినా మనోహరంగా పరుచుకున్న వెన్నెలే. అన్ని వేపులనుంచీ కమ్ముకుని ముంచెత్తే వెన్నెలే…
ఎప్పుడూ పది లోపల పడుకునే నాకు ఆ రోజు చంద్రుని సాహచర్యం పుణ్యమా అని నిద్రలో పడేసరికి తేదీ మారింది.
అక్టోబర్ 29. ఆదివారం. కచ్ఛల్ చేరుకుని అప్పుడే రెండు రాత్రులు గడిచాయి.
‘వెళదామా’ అని నాలుగున్నరకు జగన్‌ను నిద్రలేపి అడిగాను. ‘మీరు వెళ్ళి రండి, నేను కొన్ని ఫోన్లు చేసుకోవాలి’ అన్నాడు. కాకినాడకు ఎంతో దూరాన ఉన్నా తాను సూత్రధారిగా నడిపే ‘క్రియ’ సంస్థ పనులు అనునిత్యం అతణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ‘ఏదేమైనా నాకు అచ్చమైన సోలో అవకాశం రానే వచ్చింది – సద్వినియోగం చేసుకుందాం’ అనుకుంటూ స్కూటర్ని కపంగ వేపు నడిపాను. నడి రోడ్డు మీద ముద్దులు గొలిపే పిల్లి అడ్డం వచ్చి శుభం పలికింది.
నేను కొత్త ప్రదేశాలు చూడటానికి ఎంత ఇష్టపడతానో అంతకన్నా ఎక్కువగా నాకు బాగా నచ్చిన ప్రదేశాలకు పదేపదే వెళ్ళడానికి ఇష్టపడతాను. మనం చూసే ప్రదేశాలు చాలావరకూ ‘పరిచిత’ ప్రదేశాలుగానే మిగిలిపోతాయి. కొన్ని కొన్ని ప్రదేశాలు ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అన్నట్టు చూడగానే బలంగా ఆకర్షించి ‘స్నేహహస్తం’ చాస్తాయి. మనతో సంభాషిస్తాయి. ఇదిగో, ఈ కపంగ సాగరతీరం ఆ కోవకు చెందినది.
ఆ తీరం, ఆ నీటి చెలమలు, సముద్రంలో కలిసే సెలయేళ్లు, సరుగుడు చెట్లు, పాత స్కూలు భవనం, కొబ్బరి చెట్లు కొలువుదీరిన కొండ చరియలు, ఉదయపు వెలుగులో క్షణానికో రంగు మార్చుకుంటున్న లేలేత కెరటాలు – అవన్నీ మేమంటే మేము ముందని నాతో కబుర్లు మొదలెట్టాయి. ఉక్కిరిబిక్కిరి అవడం నా వంతు. అయినా అదేదో సినిమాలో ‘వైరస్’ అన్నట్లు, ‘ఐ డోంట్ హావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్.’ ఆ మాటే వాటికి చెప్పి, మళ్ళా రాకపోవచ్చు అని కూడా సూచించి, బండి ముందుకు నడిపాను. తెల్లగా తెల్లారిపోయింది. అయిదున్నర దాటింది. ఊళ్ళు మేలుకుంటున్నాయి. మెయిన్ రోడ్డు నుంచి కాస్తంత దూరాన ఉన్న ఊళ్ళకు వెళ్ళే రోడ్లూ, వాటి మొగలో ఆ రోడ్డు ఏ ఊరు తీసుకు వెళుతుందో సూచించే సైన్‌బోర్డ్‌లూ కనిపించి పిలవసాగాయి. ‘ఇప్పుడు కాదు తర్వాత’ అని చెపుతూ ముందుకు సాగాను. సైన్‌బోర్డులనంటే తోసి రాజని వెళ్ళగలిగాను కానీ అందమైన లతలు, ఆకృతులు, పచ్చని ఆకులు, చక్కని పూలు నిండిన రహదారి పదేపదే ఆగి, చూసి, సాగేలా చేసింది. తెలిసీ తెలియకుండానే బండి ద్వీపపు తూర్పు కొస చేరింది. ఝూలా సాగరతీరం పలకరించి నిలువరించింది. మళ్ళా రానేమో అన్న సెంటిమెంటు ఒకటి ఉంది కదా – అక్కడో పావుగంట. తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీద మనుషులు తిరుగాడటం కనిపించింది. కాస్తంత పరీక్షగా చూస్తే వాళ్ళంతా దక్షిణ భారత రూపురేఖల వాళ్ళు. మూల వాసుల ఉనికి ఎక్కడా కనిపించలేదు.తిరుగుతూ తిరుగుతూ ఉండగా మిల్డేరా గ్రామం దగ్గర దిగువన పారుతోన్న చిన్న సెలయేరు, దాని మీద వంతెన, అక్కడి పచ్చదనం నన్ను ఆకర్షించాయి. ఆగుదామా అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగా పక్కనే రోడ్డుకు పాతిక గజాల దూరాన చిన్న గుడి. ఇంకాస్త ముందుకు వెళితే రోడ్డు మార్జిన్లో తమ ఇంటిముందు చక్కని ముగ్గు పెడుతోన్న మహిళ. ఇహ ఆగక తప్పలేదు. ఏక్టివాను వంతెన వాలులో పార్క్ చేసి పచ్చదనాన్ని ఫోటోలు తీసి గుడి వేపుకు వెళ్ళాను. తాళం వేసి ఉంది. తిరిగి రోడ్డు మీదకు రాగానే ముగ్గుల మహిళ ‘గుడి చూస్తావా’ అని అడిగింది. తానే తాళం చెవి తీసుకు వచ్చి గుడి తెరిచి చూపించింది. వెళుతున్నపుడు, “ఏ ఊరూ? ఇపుడు ఇంత పొద్దున్నే ఎలా వచ్చావూ” అని కుశలమడిగింది. అదిగో ఆ స్కూటీ మీద అంటూ ఏక్టివా చూపించాను.
భళ్ళున నవ్వింది.
“మీరా! గెస్ట్‌హౌస్‌లో ఉన్నవాళ్ళా… సరిపోయింది. మా ఆయన మొన్నట్నించీ బెంగ పెట్టేసుకున్నాడు. ఆ స్కూటీ ఆయనదే. రెండ్రోజులు బండి లేక పోయేసరికి చెయ్యి విరిగినట్టుందని మహా ఇదవుతున్నాడు,” అని చెపుతూ నవ్వింది.
నాకూ నవ్వు రాకుండా ఉంటుందా! “జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పు. రేపు పొద్దున్నే తిరిగిచ్చేస్తాం – బెంగ పడవద్దని చెప్పు,” అన్నాను.
కబుర్లలో పడ్డాం. చదువుకున్న మనిషి. కాస్తంత ‘చరిత్ర’ తెలిసిన మనిషి. వాళ్ళల్లో సగంమంది భారతీయ మూలాల శ్రీలంక తమిళులట. ఎప్పుడో ఏభై అరవై ఏళ్ల క్రితం ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరి ఓ ఏభై కుటుంబాలకు ఇక్కడ పునరావాసం కల్పించారట. తలా కాస్త భూమి, ఇల్లు, రబ్బరు తోటల్లో పని… “అపుడు అంతా కలసి రెండొందలమందిమి. ఇపుడు దాదాపు వెయ్యిమంది అయ్యాం. కుటుంబాలు పెరిగాయి. రబ్బరు తోటలు లేవు. బతుకు కష్టమవుతోంది,” కష్టసుఖాలు చెప్పుకొచ్చిందావిడ. చెప్పడం యథాలాపంగా చెప్పినా, సమస్య గంభీరమయినదే! ఏది ఏమయినా ఈ కచ్ఛల్ ద్వీపం ఒక ఊహాతీతమైన మానవ అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటోంది అన్న మాట నిజం.
“పదండి, మనకు కచ్ఛల్‌లో ఇది చివరి రోజు. ఆ మాటకొస్తే నికోబార్ దీవుల్లోనే చివరి రోజు. ఊరంతా చెడ తిరుగుదాం. జాతుల పరంగా, మతాల పరంగా, మిగిలిన రెండు దీవులకన్నా భిన్నంగా ఉందిగదా – ఆ వివరాలు వీలయినంత గ్రహిద్దాం. కార్ నికోబార్‌లో చేసినట్లు ఇక్కడ కూడా ఎవరితోనన్నా మాట్లాడి చూద్దాం – ఈసారి స్కూళ్లయితే బెటర్,” సూచించాడు జగన్.
జగన్‌కు స్కూళ్లతో ఇరవై పాతికేళ్ళ అనుబంధం. అవి కాకినాడ స్కూళ్ళా కచ్ఛల్ స్కూళ్ళా అన్న విషయం అతని ఆసక్తిని ఏమాత్రం తగ్గించదు.
గెస్ట్‌హౌస్‌నుంచి వంద మీటర్లు వెళ్ళగానే మెయిన్ రోడ్డు. ట్రై జంక్షన్. ఎడమకు మళ్ళితే కపంగ. కుడి వేపుకు తిరిగితే ఆరేడు కిలోమీటర్ల దూరాన ఝూలా బీచ్. బండిని కుడి వేపుకు తిప్పాం. మెల్లగా పరిసరాలు చూసుకుంటూ ముందుకు సాగాం. ఎలక్ట్రిసిటీ ఆఫీసు, పోలీస్ స్టేషన్, స్కూల్, మసీదు, చర్చి, పాండియన్ దుకాణం. శివసుబ్రమణ్యం వర్క్‌షాప్, అలగి హోటల్, అటూ ఇటూ ఊరు, మిల్డేరా లైబ్రరీ, విశాలమైన ఆరుబయలు ప్రదేశం, దానికి అటూ ఇటూ ఆ ప్రదేశపు నైసర్గిక వాతావరణానికి ఏమాత్రం చెందని, కొట్టొచ్చేట్టు కనిపిస్తున్న అత్యాధునిక భవనాలు – కాసేపు ఆగాం. కచ్ఛల్‌లాంటి చోట గ్రంథాలయం ఉండటమే అపురూపం. ఇంకా తెరవలేదు. అయినా ఆ లైబ్రరీ భవనాన్ని అబ్బురంగా చూసాం. పక్కనే ఉన్న ‘మిల్డేరా గ్రౌండ్’లో ఇటు చివర, గుట్టమీద ఆకర్షణీయమైన రెండంతస్తుల భవనం – పక్కనే మరో ఆఫీసుల భవనం, ఆ రెండంతస్తుల భవనం కొత్త గెస్ట్‌హౌసట. ముందుకు సాగాం. మిల్డేరా గ్రామం దాటాక కాస్త దూరంలో ఎడమకు మళ్లుతోన్న చక్కని దారి కనిపించింది. ఎందుకో వెళ్లాలనిపించి ఆ దారి పట్టుకున్నాం. ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్ పలకరించింది. ఆపైన పశువుల ఆసుపత్రి. ఇంకా పైన సివిల్ సప్లై గిడ్డంగులు. దారికి అటూ ఇటూ పచ్చదనాల మధ్య పక్కా ఇళ్ళు. మరీ పురాతనం కాని ఇళ్ళు… మూలవాసుల ఉనికి తెలిసింది. ఒకరిద్దరు ఆసక్తితో మమ్మల్ని చూశారు.. చిరునవ్వులు ఇచ్చి పుచ్చుకున్నాం. దారి చివరన చక్కని సెయింట్ మార్క్స్ చర్చి. లోపలికి వెళ్ళాం. ఆదివారం కదా – ప్రార్థనా కార్యక్రమం మొదలయింది. ఎక్కువమంది మూలవాసులు.మరి కాస్త దూరాన పశ్చిమదిశలో సునామీ స్మారక స్తూపం కనిపించింది. ఇక్కడి మరణాలు నలభై ఏడట.
తిరిగి మిల్డేరా దారి పట్టాం.
సీనియర్ సెకండరీ స్కూల్ కనిపించి ఆపింది. కాసేపు ఊగిసలాడి లోపలికి అడుగుపెట్టాం. ఎంతో పద్ధతిగా అనిపించింది. ప్రిన్సిపాల్‌ని కలిసాం. పరిచయం చేసుకున్నాం. “మీరు ఇలా వచ్చారన్న సంగతి తెలిసింది. మా స్కూల్‌కు రావడం సంతోషంగా ఉంది,” అంటూ మరి కొంతమంది టీచర్లను పిలిచారాయన. అన్ని సదుపాయాల గురించీ వివరిస్తూ మమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. కచ్ఛల్‌లాంటి చోట, పాఠశాల చదువుల కోసం, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించడం సంతోషం కలిగించింది.
మేమలా మిల్డేరా గ్రామం అందించే వివరాలూ ఆశ్చర్యాలూ సంబరాలను ఆకళింపు చేసుకుంటూ అక్కడి స్కూళ్ళూ దుకాణాలతో కబుర్లలో ఉన్న సమయంలో ఎవరిదో ఫోన్ వచ్చింది… తెలియని నెంబరు. ఎత్తాను. “అమరేంద్రగారేనా? నా పేరు కమాండర్ నాదెళ్ళ అండీ,” అంటూ తెలుగులో పలకరింపు. ఆశ్చర్యం అనడం అండర్ స్టేట్మెంట్ అవుతుంది.
“మీరు కమోర్తా వచ్చి వెళ్ళారని ఇక్కడి ఏసీ గారి ద్వారా తెలిసింది. మీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను కమోర్తా లోని ఐఎన్ఎస్ కర్‌దీప్ అన్న నేవల్ బేస్‌కు కమాండింగ్ ఆఫీసర్ని. మీ ఇద్దరి గురించీ విన్నాక మిమ్మల్ని కలవాలనిపిస్తోంది. ఇవాళ మా ఇంటికి లంచ్‌కు రాగలరా?”
ఒక క్షణం ఆయన ఏం చెపుతున్నారో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఎలా స్పందించాలో తెలియరాలేదు.
“చాలా థాంక్స్ ఆండీ. థాంక్స్ ఫర్ యువర్ ఆహ్వానం. కానీ మేమిపుడు కమోర్తాలో లేమండీ. కచ్ఛల్‌లో ఉన్నాం.. అక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళం.”
“తెలుసండి. అజయ్ చెప్పారు. నేను బోటు పంపిస్తాను…”
రెండింటికి ఆయన బోటు పంపించేట్టు అంగీకారమయింది.
చెప్పిన సమయానికి అరగంట ముందే కచ్ఛల్ జెట్టీ చేరుకున్నాం.
చేరిన పావుగంట తర్వాత దూరాన పడవ కనిపించింది.
తీరా తీరం చేరాక అది పడవ కాదు, పదిమంది పట్టే స్పీడ్ బోట్ అని అర్థమయింది. నలుగురు సిబ్బంది. ఎంతో మర్యాదగా మమ్మల్ని బోటులోకి దింపుకున్నారు.
రెండున్నరకల్లా కమాండర్ నాదెళ్ళ ఫణికుమార్ వాళ్ళింట్లో కబుర్లు.
గుంటూరు ప్రాంతపు నేపథ్యం. నేవీకి అంకితమయిన సాగరవీరుడే అయినా సాహిత్యం ఇష్టపడే మనిషి. వెళ్ళగానే కాఫీ టేబుల్ మీద ‘అండమాన్’ కనిపించింది.
“ఏసీ అజయ్ ఇచ్చారు. చదువుతున్నాను. మా ఊళ్ళ గురించీ మనుషుల గురించీ భలే రాశారు,” అన్నాడాయన. ఆయన ఆసక్తి ఎక్కువగా సాంప్రదాయ సాహిత్యం మీద అని గుర్తు. అయినా సంభాషణ సజావుగా సాగింది. తన కర్‌దీప్ జీవితం గురించీ చెప్పుకొచ్చారు. నా స్నేహితుల్లోని నేవీ అధికారుల గురించీ ప్రస్తావించాను. సంబంధాలు బయట పడ్డాయి. ‘నాదెళ్ళ భాస్కరరావు గారు మీకు బంధువులా?’ అని ఆడగకుండా ఉండలేకపోయాను. నవ్వేసి ‘లేదండీ’ అన్నాడు. వచ్చిన అతిథులను చూసి ఆయన ఉత్తేజపడుతున్నాడో, ఆహ్వానించిన హోస్ట్ గురించి నేను పొంగిపోతున్నానో తెలియని స్థితిలో ఇద్దరమూ చిక్కడి పోయాం. ఆ చిక్కుముడి విడదీయడానికా అన్నట్టు ఏసీ అజయ్ వచ్చి చేరాడు. నలుగురం కబుర్లే కబుర్లు. భోజనం ముగిశాక తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న విజయస్థూపం దగ్గరకు తీసుకు వెళ్ళాడు. అక్టోబర్ 14, 1944 నాడు జపాన్ సేనలు, రాజ్‌పుట్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఠాకూర్ నాథూసింగ్‌కు లొంగిపోయిన సందర్భంగా నెలకొల్పిన స్థూపమది. అందరం గౌరవసూచకంగా సెల్యూట్ చేసాం.తిరిగి మమ్మల్ని కచ్ఛల్ జెట్టీ దగ్గర దింపుతున్నప్పుడు స్పీడ్ బోట్ సిబ్బందిలోని సీనియర్ సభ్యుడు ఉండబట్టలేక అడిగాడు: “మా కమాండర్‌గారికి మీరేమవుతారు?”
“తెలియదయ్యా. ఆయన్ని కలుసుకోవడం మాకూ ఇదే మొదటిసారి,” అన్నాను.
నా సమాధానం అతణ్ణి మరింత తికమక పరచిందని – అది నా ఉద్దేశ్యం కాకపోయినా, స్పష్టంగా తెలిసిపోయింది.
ఊరంతా తిరుగుతున్నాం కానీ జెట్టీ దగ్గర అసలు సరైన సమయమే గడపలేదని స్ఫురించింది. ఆ లోటు పూరించుకోవడానికి ఆ పూట మేము కమోర్తా స్పీడ్ బోట్ దిగిన సమయమే సరైనది అనిపించింది. అప్పటికే పడమటి ఆకాశం ఆనాటి వర్ణోత్సవంకోసం రంగులు సంతరించుకొనే ప్రయత్నాల్లో ఉండటం గమనించాం, ఊ అంటే ఊ అనుకొని చీకట్లు కమ్ముకొనే దాకా ఆనాటి వర్ణచిత్రాలను చూసి కేరింతలు కొడుతూ, కెమెరాల్లో బంధిస్తూ గడిపాం. చీకట్లో బండి నడపడమా అన్న సంకోచం తొలగిపోయింది. ఏ ఇబ్బందీ లేకుండా గెస్ట్‌హౌస్ దారి పట్టుకోగలిగాం. నిన్నటి పున్నమి హడావుడి వల్ల అలసిపోయాడేమో, చందమామ ఆలస్యంగా మొహం చూపించాడు. అప్పటికే మేము గూటికి చేరుకున్నాం.అక్టోబర్ 30. నికోబార్ యాత్రలో ఎనిమిదవ రోజు – కచ్ఛల్ దీవిలో చిట్టచివరి రోజు.
హెలికాప్టర్ పదిన్నరకు. అంటే కనీసం నాలుగు గంటలు ఊళ్ళో తిరుగాడి వీడ్కోలు గీతాలు పదేపదే పాడి రావచ్చన్న మాట.
ఈసారి జగన్ కూడా కచ్ఛల్‌కు వీడ్కోలు పలకడానికి నాతోపాటు వచ్చాడు. పరేంగిత జ్ఞాని అయిన మా ఏక్టివా ఐదో గంట కొట్టేలోగానే మమ్మల్ని కపంగ సాగరతీరం చేర్చింది. అప్పటికే రెండు మూడుసార్లు వచ్చినా ఆ ఉదయాన కపంగ మాకు మరో దృశ్యసంపద అందించింది.
అదే సముద్ర తీరం. అవే వృక్షాలు. అవే మేఘాలు. అదే సూర్యుడు. కానీ ఏ ఉదయమూ మరో ఉదయాన్ని పోలి ఉండదనీ, ఆ మాటకొస్తే ఆ కాన్వాస్ మీద ప్రకృతి అనునిత్యం చిత్రకళ సాధన చేస్తూనే ఉంటుందనీ ఎంతో స్పష్టంగా తెలిసిన క్షణాలవి. కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే ఒక్క కమాండ్‌తో వందల వేల చిత్రాలు సృష్టించగలం కదా – కానీ ప్రకృతి ఎవరి ఆజ్ఞలూ స్వీకరించదు – పాటించదు. దాని సృజనాత్మకత ముందు కంప్యూటర్లు వీగిపోతాయని వేరే చెప్పనవసరం లేదు కదా… అసలు సూర్యుని ప్రత్యక్ష ఉనికి లేకుండానే ఉదయాలు ఎంత అందంగా ఉండగలవో తెలిసిన సమయమది.
వెళ్ళిన క్షణాల్లో క్రోమియం రంగులో పలకరించిన సాగరతలం క్షణాల్లో లేత గులాబీ రంగు మేఘాలను తనలో ప్రతిబింబించసాగింది. కాసేపటికల్లా ఏది గగనమో ఏది సముద్రమో తెలియనంత వర్ణసంయోగం. మరి కాసేపట్లో ముంచుకు వచ్చిన నీలిమేఘాలు… మరో ఐదు నిముషాలకు ఆ మేఘాల ముసుగులోంచి బయటపడి కొద్దిగానైనా తన ఉనికి ప్రకటించుకున్న సూర్యుడు.అరగంటసేపు ఆ ప్రకృతి సయ్యాటలలో భాగమై నిలిచాక మెల్లిగా ఊళ్ళోకి ఏక్టివాను నడిపించాం. ఊళ్ళోకి అనుకున్నామేగానీ, తెలిసిన దారి కదా, ఏక్టివా పశ్చిమతీరంలోని ఝూలా బీచ్ దాకా పరుగులు పెట్టి సముద్రాన్ని చూసి ఆగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిన సందర్భం ఎదురయింది. అప్పటికి అరగంట క్రితమే కపంగ బీచ్‌లో ఉదయపు వెలుగుల సౌభాగ్యం అందుకున్న మాకు ఝూలా దగ్గర సముద్రం ఇంకా నిద్రలోంచి లేస్తూ లేస్తూ క్రోమియం రంగులో కనిపించింది. దూరం తక్కువైనా దిక్కులు వేరుగదా – పడమటి సముద్రం చీకట్లు వదిలించుకోవడానికి శాస్త్రాలు చెప్పేదానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటోందన్నమాట!
ఓ పావుగంట ఆ బీచ్‌లో గడిపి, వీడ్కోలు పలికి, ముందుకు సాగాం. లేత ఎండ చెట్లను, ముఖ్యంగా కొబ్బరి చెట్లను, వెలుగు దివ్వెలుగా మలుస్తోన్న విధానాన్ని చూసుకుంటూ సాగిపోయాం. మెయిన్ రోడ్డుకు అటూ ఇటూ కాస్తంత అవతల ఏవో భవనాలు కనిపించాయి. వెళ్ళి చూస్తే అది 2000 సంవత్సరంలో నెలకొల్పిన బీచ్ డేరా గ్రామంలోని ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్. జరిగిన అభివృద్ధి అంతా సునామీ తర్వాతే అని నా అంతట నేనే నిర్ధారించుకొంటోన్న సమయంలో సునామీకి ముందే ఇలాంటి స్కూళ్ళు వచ్చాయి అన్న వివరం నన్ను పునరాలోచనలోకి నెట్టింది.
స్కూలు సంగతి ఎలా ఉన్నా ఆ పక్కనే ఉన్న ఊరు ఎంతో పొందికగా, పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంది. డబ్బులు బాగా ఉన్నా ప్రకృతి పట్లా, సరళజీవితం పట్లా అభిరుచి ఉన్న వ్యక్తులు కట్టించుకున్న ఆధునిక గ్రామంలా అనిపించింది. ఆశ్చర్యం. ఆనందం. ఒకరిద్దరిని మాటల్లో పెట్టే ప్రయత్నం చేసాక ఓ పెద్దాయన నిలచి మాట్లాడాడు. ఆ ఊరి శోభ వెనుక మామూలుకన్నా ఎక్కువగా చదువుకుని, పోర్ట్ బ్లెయిర్‌లాంటి నగరాలతో పరిచయం ఉన్న ఒక ఆదివాసీ పెద్దమనిషి ప్రమేయం ఉందని నిర్ధారించాడు. ఊళ్ళో అందరూ అతని మాటా బాటా అనుసరిస్తారని చెప్పాడు. ఆ అభిరుచి, క్రమశిక్షణల ప్రభావం ఊళ్ళోని సిమెటరీలోనూ ప్రతిఫలించడం గమనించి అబ్బురపడ్డాం. ఇలాంటి మనిషి ఊరికొక్కరుంటే కపంగ బీచ్ గాంధీ విగ్రహం దగ్గరి ఫలకంలోని ‘ఆదర్శాలు’ ఆచరణలో నిలబడడం ఎంతసేపూ?!
మరో పది నిముషాల్లో మేము చేరుకున్న మిల్డేరా గ్రామం అంతకు కొద్ది నిముషాల ముందే మేము చూసిన మూలవాసుల గ్రామంతో పోలిస్తే ఒక రకంగా ఏంటీ క్లైమాక్స్.
ముందే చెప్పుకున్నట్టు ఈ గ్రామమంతా సెటిలర్లది.
మూడు నాలుగు తరాల క్రితం కచ్ఛల్‌లోని రబ్బరుతోటల్లో పనిచెయ్యడానికని తమిళనాడునుంచి కుటుంబాలు తరలి వచ్చాయి.. వారితోబాటు దాదాపు అదే సమయంలో శ్రీలంక తమిళులకు కూడా మిల్డేరాలో పునరావాసం కల్పించారు. అప్పట్లో సెటిలర్లు అంతా కలసి రెండు మూడు వందలు.
ఏభై యేళ్ళు గడిచేసరికి సెటిలర్ల సంఖ్య వెయ్యి దాటింది. మూలవాసుల సంఖ్యకు సమానమయింది. ప్రపంచమంతా ఆనవాయితీగా జరిగినట్టు మూలవాసుల మీద సెటిలర్లు ఆధిపత్యం సాధించడం ఇక్కడ జరగలేదు. కచ్ఛల్‌లోని పరిస్థితులు పూర్తిగా వేరు కావడం వల్లనే ఆ ఆధిపత్యం జరగలేదని చెప్పాలి.
అనేక చారిత్రక కారణాలవల్ల అండమాన్ దీవుల్లో ఆదిమవాసుల సంఖ్య వేలల్లోంచి వందలూ పదుల్లోకి పడిపోయింది. రోజులు మారాక, మూలవాసుల మనుగడ గురించీ, వారి హక్కుల గురించీ సర్వత్రా అవగాహన పెరిగాక, ఆ మిగిలిన కొద్దిమందినీ పదిలంగా కాపాడుకునే కార్యక్రమాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టింది.
అదే చిత్తశుద్ధి నికోబార్ ద్వీపాల్లోనూ మనకు కనిపిస్తుంది. కచ్ఛల్‌లో 35 ఆదర్శ గ్రామాలున్నాయంటే గాంధీ ఆలోచనలను ఆచరణలో నిలబెట్టిన ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతైనా కారణం.
అనూహ్యమైన నిష్పత్తిలో ఉన్న కచ్ఛల్ సెటిలర్లది ప్రత్యేక సమస్య. గ్రామం పెరిగింది. జనాభా పెరిగింది. ఊరు పెరగలేదు. పెరిగే అవకాశం లేనే లేదు. అప్పటి సౌకర్యాలూ వనరులూ మూడింతలు పెరిగిన జనాభా పంచుకోవాలి. పనులు తగ్గాయి. జీవనోపాధి కష్టమవుతోంది. ప్రభుత్వపరంగా ఇది క్లిష్టసమస్య. కానీ పరిష్కారం దిశలో నిర్మాణాత్మకంగా ముందడుగు వేస్తోన్న సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఉదయం పదిన్నరకు పోర్ట్ బ్లెయిర్ హెలికాప్టర్. కమోర్తానుంచి రావాలి. పది గంటలకల్లా సామాన్లు సర్దుకుని తయారయ్యాం. ఈలోగా ఫోను: “ఇవాళ హెలికాప్టర్ రావడంలేదు. ఇంకేదో అవసరం పడిందట.”
ఉసూరుమనిపించింది. ఇవాళ రాలేదు అంటే మళ్ళా ఎప్పుడో చెప్పడం కష్టం. రేపు అవవచ్చు – ఎల్లుండి అవవచ్చు. మరో రెండ్రోజులు కచ్ఛల్‌లో గడపడం ఇష్టమేగానీ పోర్ట్ బ్లెయిర్‌లోనూ, హావ్‌లాక్‌లోనూ పెట్టుకున్న కార్యక్రమాలు రద్దవుతాయి. అయినా చేసేదేముందీ? అసలు నికోబార్ కోసమే వచ్చాం గదా – అండమాన్‌లో అనుకున్న రెండు రోజులు కోల్పోవడం, వాటిని నికోబార్‌లోనే గడపటం – పొయటిక్ జస్టిస్ కాదూ?!
పదకొండింటికల్లా మళ్ళా మా కచ్ఛల్ కో-ఆర్డినేటర్ నుంచి ఫోను: “రెడీగా ఉండండి. పదకొండున్నరకు హెలికాప్టర్ వస్తోంది.”
వెళ్ళాం. ఎక్కాం. దారిలో మళ్ళా కమోర్తాలో కాసేపు ఆగింది.
అందరూ దిగారు. మేమూ దిగి కాస్తంత కాళ్ళు జాపుకుంటున్నపుడు ఉరుములేని పిడుగులా మాటలు. “మీరెవరో మాకు తెలియదు. కానీ ఇది తగని పని. దీని పరిణామాలు తెలుసా?” హెలికాప్టర్ క్రూ నుంచి ఆ మాటలు.
నిన్న స్పీడ్ బోట్ క్రూ చూపించిన మర్యాదకూ, ఇవాళ ఈ గగన చోదకులు ప్రశ్నించిన తీవ్రతకూ ఎంత తేడా! నింగికీ నీటికీ ఉన్నంత తేడా మరి… రెండూ మేము ఆశించినవి కాదు. అయినా కాస్త ఆలోచిస్తే వాళ్ళ ఉద్రేకానికి కారణం అర్థమయింది.
షార్ప్ గా స్పందించేవాడినే – జగన్ కళ్ళతో వారించాడు.
“మీరు ఏమంటున్నారో మాకు తెలియదు. ఇందులో మా ప్రమేయం లేదు. హెలికాప్టర్ రావడం లేదన్నారు – సరే అనుకున్నాం. వస్తోందన్నారు – వచ్చి ఎక్కాం. అంతే మాకు తెలిసినది. ఏదేమైనా ఇది మీకు అసౌకర్యం కలిగించిందని అర్థమవుతోంది. అందుకు మా విచారాలు,” బుద్ధుడు కూడా విస్తుపోయేంత అమితశాంతంగా స్పందించాను.
మొత్తానికి పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాం. షాదీపూర్‌లోని గెస్ట్‌హౌస్ చేరుకునేసరికి మూడు దాటేసింది.. గెస్ట్‌హౌస్‌కేసి వెళుతోంటే కోనసీమనుంచి కూకట్‌పల్లి – పోనీ ద్వారకా సెంటర్, చేరుకున్న భావన. మా ఏక్టివానే తప్ప మరింకే వాహనమూ కనిపించని ద్వీపంలోంచి, మేము తప్ప ఇతర మనుషులెవరూ రోడ్డు మీద తిరుగాడని ప్రదేశంనుంచి వచ్చి, పోర్ట్ బ్లెయిర్ నగరంలో వెళ్ళడమంటే – అదో రియాలిటీ చెక్.
వారం క్రితం మేము ఉన్న గదీ, ఆ బాల్కనీ మళ్ళా మాకు స్వాగతం పలికాయి. ఆ సాయంత్రం రికామీగా గడపాలన్న మూడ్ మా ఇద్దర్నీ ఆవహించింది. ఇక ఆ రోజుకు సెలవ తీసుకోమని డ్రైవర్ని పంపించేసాం. మెల్లగా ఆలోచనల్లో పడ్డాను.
నికోబార్ ద్వీపాల్లో వారం రోజులు గడిపాం.
తనివితీరా గడిపాం.
నిజంగానే తనివి తీరిందా?
ఆ ద్వీపాలు వదిలి పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నా మనసు కచ్ఛల్‌లోనే ఎందుకు చిక్కడిపోయి ఉందీ? కమోర్తా, పిల్ పిల్లో, కార్ నికోబార్, కకనా జ్ఞాపకాలతో ఎందుకు పొంగి పొర్లుతోందీ?
ఆ సాగరతీరాల అందాలా? అక్కడి ఏకాంతాలా? సూర్యోదయ సూర్యాస్తమయాలా? పచ్చని అడవులా?
సాగర తీరాలూ అంటే హేవలాక్ ద్వీపంలోని రాధా నగర్ బీచ్‌కు సరితూగేవి ఎంతో అరుదు – నాలుగు ఖండాలలో నూట పధ్నాలుగు సాగరతీరాలు చూసిన మనిషిగా నేనా మాట చెప్పగలను.
ఏకాంతం అంటారా – లిటిల్ అండమాన్ ద్వీపంలో 2022 లో ఇలాంటి ఏకాంతం నాకు అనుభవమే. ఒక ఉదయమంతా కాలా పత్థర్ లగూన్‌లోనూ, మరో ఉదయం హట్ బే బీచ్‌లోనూ ఒక్కణ్నే గడిపిన అనుభవం నాది.
సూర్యోదయ సూర్యాస్తమయాలు బావున్న మాట నిజమేగానీ 2012 లో నార్త్ అండమాన్ ద్వీపంలోని మాయా బందర్‌లో చూసిన సూర్యోదయం నా వరకు న భూతో న భవిష్యతి.
పచ్చదనం – ప్రకృతి అంటే వర్షాకాలంలో పూణే పరిసరాలలోని పడమటి కనుమలకు సాటి వచ్చేవి తక్కువ.
మరి నికోబార్ ఎందుకు నాలో పొంగిపొర్లుతోందీ?
మనుషులు. ముఖ్యంగా కచ్ఛల్‌లో కలసిమెలసిన నికోబరీ మూలవాసులు.
ఐదూ పదివేల సంవత్సరాల క్రితం వలసను జీవన విధానంగా ఎంచుకుని ఇప్పటి థాయ్‌లాండ్ ప్రాంతాలనుంచి ఐదు వందల కిలోమీటర్ల అండమాన్ సముద్రాన్ని దాటుకుని నికోబార్ చేరుకున్న మంగోలాయిడ్ జాతి మనుషులు వీరు. తమతోపాటు వ్యవసాయం తెచ్చుకున్నారు. కొబ్బరి సాగు తెచ్చుకున్నారు. పందుల పెంపకం తెచ్చుకున్నారు. వేట – ఆహార సేకరణ దశను దాటి వ్యవసాయదారులుగా పరిణమించారు. అలా శతాబ్దాలుగా నికోబార్ ద్వీపాల్లో జీవిస్తున్నారు. సామాజిక నియంత్రణ కోసం సాముదాయక పితృస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నారేగానీ రాజ్యాలూ ఆధిపత్యాల మార్గం పట్టలేదు. సమీప గతంలో చోళులు డెన్మార్క్ వాళ్ళు బ్రిటిషర్లు వీళ్ళను ‘పాలించినా’, ఘర్షణలూ యుద్ధాల ఛాయలు కనిపించవు.
అలా అని అణిగిమణిగి ఉంటారా అంటే అదీ లేదు – కనీసం, ఈ రోజున ఆ ధోరణి కనిపించలేదు. ఆదిమవాసులకూ అతి నాగరికులకూ నడుమన నిలిచిన మూలవాసులు వారు. సౌమ్యులు. స్నేహశీలులు. స్నేహసంతోషాలేగానీ దైన్యం, అభద్రతా వారిలో కనిపించదు. ఆధునిక సమాజాలతో సంపర్కం వారికి ఇష్టమున్నా లేకపోయినా – ఆ సంపర్కం సత్ఫలితాలు అందుకోగలిగారు. చదువు నేర్చారు. టీచర్లయారు. ప్రిన్సిపాళ్ళయారు. విలేజ్ కౌన్సిళ్ళు నడుపుతున్నారు. కొంతమంది మెడిసిన్ వరకూ చదివి డాక్టర్లయారని విన్నాను.
వీరినుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మేమున్న వారంరోజుల్లో మాకు అర్థమయింది సముద్రంలో నీటి బిందువు. హైమన్ డార్ఫ్ గోండులతో గడిపినట్టు వీళ్ళతో ఒక జీవితకాలం గడిపితేగానీ ఎవరికైనా, ఏ కొంచెమైనా అర్థం కాదు.
ఆలోచనల్లోంచి తెప్పరిల్లి చూస్తే గంట గడిచినట్లు తెలిసింది. ఇంత దూరం వచ్చింది చక్కని సాయంత్రం వేళ పక్కనే ఉన్న సముద్రాన్ని పెట్టుకుని గెస్ట్‌హౌస్ గదిలో బందీగా ఉండటానికేనా? అనిపించింది. ఠక్కున లేచాను. అది చూసి చిరునవ్వు నవ్వుతూ జగన్ కూడా రడీ అయ్యాడు.
“పదండి వెళదాం” అన్నాను.
“ఎక్కడికీ?”
“ముందు అబర్డీన్ బౙార్. ఆ తర్వాత సంగతి తర్వాతే చూద్దాం.”
బయటపడ్డాం.
అర కిలోమీటర్ నడిచాక ఆటో దొరికింది. అబర్డీన్ బౙార్ నడి బొడ్డున దింపమన్నాం. అంతా కలసి ఐదు నిముషాలు. దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ప్రాంతమీ అబర్డీన్ బౙార్.
ఆ కాలపు ‘ప్రజాస్వామిక’ సాంప్రదాయాల ప్రకారం తమ అధికార పరిధిని ప్రపంచమంతా విస్తరించిన బ్రిటిష్ వారికి పద్ధెనిమిదో శతాబ్దం ముగిసేసరికి భారతదేశం వశమవడం, వందేళ్ల కంపెనీ పాలన తర్వాత 1857లో గణనీయమైన తిరుగుబాటు ఎదుర్కోవడం, సంవత్సరంపాటు జరిగిన ఆ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు పై చెయ్యి సాధించడం, ఆ తిరుగుబాటుకు ‘సింబాలిక్’ నాయకుడిగా వ్యవహరించిన చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా ౙఫర్‌ను అండమాన్ ద్వీపాలకు తరలించడం – ఇదంతా మనకు బాగా పరిచయమయిన చరిత్ర.
దాదాపు అలాంటి పోరాటమే 1859లో అబర్డీన్ బౙార్లో జరిగింది.
రాజ్య విస్తరణ అన్న తర్వాత యుద్ధాలూ పోరాటాలూ తప్పవు. ఖైదీలూ జైలు శిక్షలూ తప్పవు. అందులో బాలగంగాధర తిలక్‌లాంటి ‘ప్రమాదకరమైన’ నేరస్తులకు ద్వీపాంతరవాస శిక్ష విధించడమూ తప్పదు. అలాంటి మారుమూల నిర్బంధ కేంద్రాల వేటలో బ్రిటిష్ వారికి 1788 లోనే, ఆస్ట్రేలియా ఖండం లభించింది. ఎనభై ఏళ్లపాటు లక్షన్నరమంది ఖైదీలను ఆస్ట్రేలియాకు తరలించిన చరిత్ర బ్రిటిష్ వారిది.
భారతదేశానికి సంబంధించినంతవరకూ అంతంత దూరాలు వెళ్ళనవసరం లేకుండా అండమాన్ ద్వీపాలు అలాంటి పీనల్ కాలనీకి అనువైన ప్రదేశం అని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం, మొదటి విడతగా 1858 లో 200 మంది ప్రధమ స్వాతంత్ర్య సమర యోధులని, ఇప్పటి అబర్డీన్ బౙార్ ప్రాంతంలో నెలకొల్పిన పీనల్ కాలనీకి తరలించింది. దాన్ని నిర్మించడం కోసం అక్కడున్న అడవిని చదును చేసింది.
కానీ బ్రిటిష్ వారికి చిన్న సమస్య ఎదురైంది.
చరిత్రకందని కాలాలనుంచీ ఆ అండమాన్ ద్వీపాలలో ఆదిమవాసులు నివసిస్తూ ఉన్నారు. అందులో గ్రేట్ అండమానీస్ అన్నది అతి పెద్ద తెగ. బ్రిటిష్ వారు అడుగుపెట్టే సమయానికి వారి సంఖ్య 5000 అని ఒక అంచనా. వ్యవసాయం తెలియని, వేట మీద ఆధారపడి జీవించే తెగ అది.
పీనల్ కాలనీ నిర్మాణంలో వారి అరణ్యాలు ధ్వంసమయాయి. స్వేచ్ఛ సరేసరి. తమ భూములూ అరణ్యాల రక్షణ కోసం వాళ్ళంతా బ్రిటిష్ వారి మీద దాడులు చెయ్యక తప్పని పరిస్థితి.
ఆ దాడులకు పరాకాష్ట 1859 మే నెలలో జరిగిన అబర్డీన్ యుద్ధం. అందులో 1500 మంది ఆదిమవాసులు పాల్గొన్నారట. తుపాకీల ముందు బాణాలు నిలబడలేవు గదా – ఓడిపోయారు. క్రమక్రమంగా తమ అరణ్యాలనే కాదు, జీవితాలనూ నష్టపోయారు. వేలల్లో ఉన్న జనాభా ఇప్పుడు పదుల్లోకి దిగింది. ఉన్న కొద్దిమందినీ భారత ప్రభుత్వం పోర్ట్ బ్లెయిర్‌కు వందా నూటపాతిక కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న స్ట్రైట్ ఐలాండ్ అన్న చిన్న ద్వీపానికి తరలించి కాపాడుతోంది. ఆ అబర్డీన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం అబర్డీన్ జెట్టీకి చేరువలో 1995 లో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించింది. అన్నట్టు మనకు బాగా తెలిసిన సెల్యులర్ జైలు నిర్మాణం 1906లో ముగిసిందట. 1939లో రెండో ప్రపంచయుద్ధం వచ్చి ఖైదీల రవాణా స్తంభించేవరకూ మొత్తం 80 వేలమంది ఇండియా, బర్మాలనుంచి అండమాన్లకు తరలించబడ్డారట.“ఇదంతా మా కాకినాడ వీధుల్లో తిరుగుతున్నట్టే ఉంది. అబర్డీన్ స్మారక చిహ్నం అంటున్నారు గదా, పదండి అక్కడికి వెళదాం,” ఓ అరగంట ఆ బౙార్లో తిరిగాక, మరో పావుగంట క్లాక్ టవర్ సెంటర్లో గడిపాక అన్నాడు జగన్.
వెళ్ళాం. సముద్రం ఒడ్డున ఉందా స్మారక చిహ్నం. తగుమాత్రం గాంభీర్యం. ఎంతెంతో చారిత్రక విషాదం. ఆపైన మరో రెండు మూడు వందల మీటర్లలో మెరీనా వ్యూ పాయింటు ఉందని తెలిసి అటూ ఓ అడుగు వేసాం. చక్కని సాగరదృశ్యం. ఆకాశంలో అపుడే ఉదయించిన చందమామ. దూరాన రాస్ ద్వీపం.“ఓ పని చేద్దామా – ఇక్కడనించి సముద్రం ఒడ్డునే నడిస్తే మన గెస్ట్‌హౌస్ 40-45 నిముషాల దూరం – ఆగుతూ ఆగుతూ వెళితే గంటా గంటన్నర – నడిచేద్దామా?” నా ప్రతిపాదన.
ఇలాంటి వాటిని జగన్ ఏనాడూ వద్దనడు.
కుడిచేతి వేపున నగరం, ఎడమన సాగరతీరం. నడకకు సొగసులు అద్దే పార్కులు, జెట్టీ, ఉన్నట్టుండి సునామీ మెమోరియల్. దండ విసురుతోన్న రాజీవ్ గాంధీ. షాదీపూర్ వేపు కుడివేపుకు మళ్ళే చోట తిరంగా పాయింట్. కొత్తగా వచ్చిన నిర్మాణమది. మళ్ళా వచ్చి దాన్ని తీరిగ్గా చూద్దాం అనుకుంటూ గెస్ట్‌హౌస్ చేరుకున్నాం.
(సశేషం)


















