కావ్యదహనోత్సవం (ఈ-పుస్తకం)

అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేకపోయేది. గ్రంథంలో గుణం లేకపోతే లేఖకులు తిరిగి రాసుకొనే వారు కారు. మనిషి పుట్టక మునుపు గర్భాదానంనుంచి మొదలుపెట్టి, మరణానంతర అంతిమసంస్కారంవరకూ, పదహారు సంస్కారాలు (షోడశ కర్మలు) చేయడం సాంప్రదాయం పాటించేవారి ఆనవాయితీ. కావ్యం పుట్టక ముందే కృత్యభ్యర్థనోత్సవంతో ప్రారంభిస్తున్న ఈ కావ్యజాతికి షోడశ కర్మలు ఎందుకు జరపకూడదు? అన్న ఆలోచనతో శంకరమంచి సత్యంగారు కృతికర్తగా, వేలూరిగారు కృతిభర్తగా, వడ్లపట్ల దయానందంగారు సభాధ్యక్షుడిగాను, మొదటిసారి 1957లో ఏలూరులో కావ్యదహనోత్సవ ప్రహసనాన్ని ప్రదర్శించారు.

1960 ఆరంభంలో, వేలూరిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఉన్నత విద్యార్థిగా ఉన్న రోజుల్లో, తమ తొలి ప్రయత్న విశేషాలను, ప్రేక్షకుల స్పందనను బొమ్మకంటి శ్రీనివాసాచార్యగారితోనూ, తన మిత్రులతోనూ పంచుకోవడంతో, మరొకమారు ఈ ప్రహసనాన్ని ప్రదర్శిస్తే బావుంటుందేమోనన్న ఆలోచన వారందరిలో బలపడింది. ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికపై ప్రదర్శించాలన్న తలంపుతో స్క్రిప్ట్‌ను తిరగ రాసి డిసెంబరు 14, 1960 నాడు సుమారు వెయ్యిమంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన ఉత్సవం ఈ కావ్యదహనోత్సవం.

Skip to PDF content