అలల దారి

సూర్యుడు క్రమంగా తన పసుపు కాంతిని తుడిచేస్తూ, ఆకాశానికి నారింజ రంగు పులుముతూ వెనుదిరుగుతున్నాడు.

ఆ గోధూళి వేళ, మైలవరం డ్యామ్ గోడ మీద అతను కూర్చుని వున్నాడు. వయసు అరవై, అరవై అయిదు సంవత్సరాలు వుండవచ్చు. తైల సంస్కారం లేక జుట్టు పొడిబారి వుంది. మాసిపోయిన గడ్డం, నీలి గళ్ళ లుంగీ, నిలువు గీతల చొక్కా వేసుకొని ఉన్నాడు. తలకి పసుపు పచ్చ రంగు ఉన్న టవల్ తలపాగాలాగా కట్టుకొని ఉన్నాడు. అతని చూపు ఏటవాలుగా వున్న డ్యామ్ గోడ మీద గడ్డి మేస్తున్న తన మేకల మంద మీద వుంది.

అతని చూపులో ఏ భావమూ లేదు. నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను దేని గురించీ ఆలోచించడం లేదు.

కొద్దిసేపటి క్రితం పడిన జల్లు ఆగిపోయింది. డ్యామ్‌లో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. చుట్టూ ఉన్న కొండల నుండి వచ్చే గాలి హోరు, అలల చప్పుడు, మధ్యమధ్యలో మేకల అరుపులు ఇక్కడ ఏదో జరుగబోతోంది అన్నట్టుగా సంగీతంలా వినిపిస్తున్నాయి.

అతను కూర్చున్న ప్రదేశానికి ఎడమ వైపుగా, ఒక మధ్య వయస్కురాలు నడుస్తూ వస్తోంది. ఆమె వస్త్రధారణనుబట్టి చూస్తే కలిగిన కుటుంబానికి చెంది వుంటుందని ఎవరైనా చెప్పొచ్చు. ఆమె అతన్ని చూడలేదు. డ్యామ్‌ గేటు పైన ఉన్న గోడపైకి ఎక్కింది. కళ్ళ నుంచి నీళ్ళు ధారగా కారుతూ ఉన్నాయి. గాలికి ఆమె జుట్టు, చీర కొంగు రెపపలాడుతోంది.

ఎవరో తనను గమనిస్తున్నారని ఆమెకు అనిపించింది. ఒక్కసారిగా తల తిప్పి అతని వైపు చూసింది. అతను అలా, నిశ్చలంగా చూస్తూనే ఉన్నాడు. కానీ అతని చూపులో ఎలాంటి భావమూ లేదు.

ఆమె వెంటనే తలను తిప్పి, డ్యామ్ నీళ్ళ వైపు చూసింది. బాధ ఆమెను కమ్మేసింది. కాళ్ళు వణుకుతున్నాయి. గట్టిగా గాలి పీల్చుకుంది, ఒక్కసారిగా లోపలనుండి శక్తిని కూడతీసుకోవడానికి అన్నట్టు మోచేతుల్ని, మోకాళ్ళనీ వంచి సిద్ధమైంది. ఒక క్షణ కాలం పాటు ఆగి వెనక్కి తిరిగి గోడపై నుండి కిందకు దిగింది. కళ్ళను తుడుచుకుంటూ, అతని దగ్గరికి వెళ్ళి అతను కూర్చున్న దిశకు వ్యతిరేకంగా కూర్చుంది.

కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా అడిగింది,“నన్ను ఎందుకు ఆపలేదు?”

అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు.

అతని చూపు మళ్ళీ తన మేకల మందవైపు తిరిగిపోయింది. తలచుట్టూ కట్టుకున్న తలపాగా నుంచి బీడీ కట్టను బయటకి తీశాడు. అందులోంచి ఒక బీడీ తీసుకుని వెలిగించబోయాడు. కానీ కాసేపటి క్రితం కురిసిన జల్లుల వల్ల తడిసినట్టుంది, అది వెలగలేదు. ఆరబెట్టుదాం అనే ఉద్దేశంతో దానిని కింద పెట్టాడు. మరో బీడీ తీసుకున్నాడు. ఈసారి మంట అంటుకుంది. రెండు మూడు సార్లు బలంగా పీల్చి, పొగను ఆకాశం వైపుగా గాల్లోకి వదిలాడు.

పక్కనే ఉన్న రెండు గులకరాళ్ళను చేతుల్లోకి తీసుకొని, వాటిని ఆడిస్తూ ఆమె వైపుకి చూడకుండా, ఎలాంటి భావాన్ని చూపించకుండా, తేలిగ్గా “సచ్చిపోనీకి బతకాలన్నంత దైర్నం వుండాల” అన్నాడు.

ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఇలాంటి సమాధానం వస్తుందని ఆమె ఊహించలేదు. అతను క్రూరంగా ప్రవర్తించడం లేదని ఆమె గ్రహించింది. ఆ మాటలు ఆమె మనసులో ఏదో విచిత్రమైన భావాన్ని రేపాయి.

కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, ఆమె చెప్పడం మొదలెట్టింది “నేను ఎటువంటి కష్టంలో…”

కానీ ఆమె మాట పూర్తి కాక ముందే ఆపమన్నట్టు అతను తన చెయ్యిని చూపించాడు. ఆ తర్వాత బీడీని మళ్ళీ పీల్చి, పొగను గాల్లోకి వదిలాడు.

రెండు క్షణాల తర్వాత మళ్ళీ మాట్లాడటం మొదలెట్టాడు “ఈ భూమ్మీద ఉండే పతి జీవికి, జీవానికి, కట్టం వుంది. నెలల కాడ బిడ్డ ఆకలి అని సెప్పల్యాక ఏడుచ్చాడే అదొక కట్టం, యండకి నీడనిచ్యే ఈ చెట్లకి ఆకులన్నీ రాల్తాయనే కట్టం, భూమి లోపల బడ్డ ఇత్తనం బూమిని సీలుసుకు రాడం కట్టం, సీకట్లో ఎలుతురు లేకపోతే కట్టం, కడుపు నింపుకోనికి యన్నన్నో కస్టపడి పోతల్లే ఈ జీవాలు.

అందరికి అయ్యే కట్టాలు. ఒకరికి పెద్దగా గనపడ్తాయి, ఇంగోరికి చిన్నగా. ఇది కట్టం అని ఆలోసిస్తే అది కట్టం, మానెచ్యే కట్టంల్యా. అబద్దం కానీ సత్తెం ఇది.”

ఆమె అతను చెప్పే మాటలను శ్రద్ధగా వింటోంది. కానీ అతను మాత్రం ఒక్కసారి కూడా ఆమెను చూడలేదు.

కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు.

“డ్యాంలో ఉన్న నీళ్ళని సూడు, యాడికాడికో పోవాలని యాన్నుంచో ఈడికి వచ్చి పన్నై. ఇన్నుంచి యాకాటికి పోవని దాన్లకి కూడా తెలుసు. అయినా సూసినావా గోడలకి ఎట్ట ఢీకొడతాండాయో? ఎపుడో ఒకసారి దేవుడు వాటి పక్కన నిలబడతాడు, వాన ఎక్కువ పడ్తది, గేట్లు ఇడుచ్చారు. అపుడు మల్ల కొత్త దారి ఎతుక్కుంటాయి.

ఈ పక్కకి సూడు, ఆ జీవాలకు రేపు అనేటిది వుంటాదో లేదో తెలీదు. ఏమన్నా ఆలోచిస్తాండాయా అయ్యి? మాటలే రాని అయ్యే బతుకుతాండాయి, మనకేం ఖర్మ?

సదువొచ్చినోడు ఒకడు శ్మశానం కాడ నిలబడి ఇలా అన్నాడంట ‘ఎపుడు సచ్చినా లాస్టుకి ఈడకే రావాలా, తొందరపడి అడ్డదారి తీస్కొని రాకు’ అని.”

ఇంతలో ఒక మేక ఏటవాలు గోడ మీద నుండి జారి కిందకి పడింది. అది చూసి ఆమె భయంతో గట్టిగా అరిచి, అతని వైపు చూసింది.

అతను నిశ్చలంగా ఎటూ కదలకుండా అలానే వున్నాడు.

జారిపడిన మేక మళ్ళీ గోడ ఎక్కడం మొదలుపెట్టింది.

అతను ఇంకొక బీడిని ముట్టించి పొగను గాల్లోకి వదిలాడు. మాటలు ఆగిపోయాయి.

అప్పుడే డ్యామ్ నీళ్ళలో ఒక్కసారిగా పెద్ద అల ఉవ్వెత్తున ఎగసి గోడకు ఢీకొని, చిన్న చిన్న అలలుగా చెల్లాచెదురై మళ్ళీ నీళ్ళలో కలిసిపోయింది.

ఆమె ఆ దృశ్యాన్ని గమనించింది.

గోడకు ఢీకొన్న నీరు ఆగిపోలేదు. కొత్త కొత్త అలలుగా మారి ముందుకు పరిగెత్తింది.

అతను మాత్రం ఆమె వైపు చూడలేదు.

కానీ ఆ అలల శబ్దం, ఆ కదలిక… ఆమెలో ఏదో మెల్లగా కదిలించింది.

ఆమె ముఖంపై ఆ కన్నీటి రేఖలు ఇంకా వున్నా, కళ్ళలో ఎక్కడో ఒక మూలలో ఒక ప్రశ్న కన్నా, ఒక ఆలోచన మొదలై ఆమె లేచి నిలబడింది. దూరంగా ఒక మేక పురిటినొప్పులతో బాధపడి, బుజ్జిమేకని ప్రసవించింది.

అతని ముఖంలో చిన్నపాటి నవ్వు. ఆమె వైపు చూసి బుజ్జిమేక దగ్గరకి నడుచుకుంటూ వెళ్ళాడు.