పర్వ అనువాదకుని నివేదన

ఆధునిక భారతీయ సాహిత్యంలోని ఒక అపూర్వ రచన భైరప్పగారి ఈ ‘పర్వ’.

ప్రాచీన వ్యాస మహాభారతానికి ఇదొక ఆధునిక నవలా రూపం, ఒక సృజనాత్మక వ్యాఖ్య, ఒక పరిశోధనాత్మక పునఃసృష్టి.

ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.

ఆధునిక హేతువాద దృక్పథంతో మహాభారతాన్ని చదువుతూంటే, ఈ కథను ఎలా నమ్మాలి? ఎంతవరకు నమ్మాలి? అనే ప్రధాన ప్రశ్నలతోపాటు, మరెన్నో సందేహాలు తలెత్తుతాయి. ఈ శాపాల, వరాల యథార్థ స్వరూపం ఏమిటి? పాండవుల పుట్టుకలోని మర్మమేమిటి? ప్రాచీన భారతానికే గర్వకారణమైన అంతటి కురుసభలోకి, ఇంటి కోడలిని ఈడ్చి, వలువలు ఊడదీయించడానికి ఎలా ప్రయత్నించారు? ఈ వికృత కల్పనలోని వాస్తవం ఏమిటి? ఒక కుటుంబంలోని దాయాదుల హక్కుల పోరాటానికి, నాటి యావత్తు ఆర్యావర్తం కదలి రావడమేమిటి? ఆర్య సంస్కృతికంతటికీ ఈ ఇంటి కలహం ఎందుకంత తీవ్ర సమస్య అయింది? అసలు మహాభారతంలో చర్చించిన ‘ధర్మ’ స్వరూపమేమిటి? అది చిత్రించే చారిత్రక సామాజిక తత్త్వమేమిటి? వంటి అనేకానేక ప్రశ్నలు ఎప్పటికీ సంతృప్తికరమైన సమాధానాలు లభించని ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ఇరావతీ కర్వేగారి ‘యుగాంత’ వంటి రచనలు ఒకటీ అరా వెలువడ్డా, అవి అందించే సమాధానాల కంటె, రేకెత్తించే సందేహాలే ఎక్కువవుతుంటాయి. ఇరావతిగారు పాండవుల పుట్టుక గురించి చేసిన వివేచన కొత్తగా అగుపించినా, మహాభారత మూల తత్త్వానికే అది విరుద్ధంగా, అసంబద్ధంగా అగుపిస్తుంది.

భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసేవారందరికీ మహాభారతం అనేకమైన సవాళ్ళను విసురుతుంది. ఎన్నో యుగాల సంస్కృతి పరిణామాలను అది తనలో ఇముడ్చుకొని, ప్రతి వర్తమాన తరానికి అన్వయించేలా, ఇలియట్ చెప్పిన “presentness of the past” and “pastness of the present” భావనలకు భాష్యం చెప్పేలాగా, భారతజాతి మహోత్తమ వారసత్వంలో భాగంగా నిలిచి ఉంది.

”మౌఖిక రూపంలో కొనసాగుతూ వచ్చి లిఖిత రూపం పొందిన వీరగాథా సంచయం – ఇతిహాసం” అని నిర్వచించుకుంటే, భారతీయ సాహిత్యంలో ప్రౌఢంగా నిలిచిన ఇతిహాసం మహాభారతమొక్కటే. సహస్రాబ్దాల క్రితం ఏక లిఖిత రూపాన్ని పొందినా, ఇంకా లిఖిత రూపంలోకి ఎక్కని అనేక భారత సంబంధ కథలు, గాథలు, ఐతిహ్యాలు భారత దేశమంతటా, ముఖ్యంగా భారతకథ జరిగిన ఉత్తర దేశమంతటా వ్యాపించి ఉన్నాయి. వాటన్నిటినీ సేకరించి, విశ్లేషించే ప్రయత్నాలు ఎన్ని జరిగినా ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి. దానికి ‘పర్వ’యే ఒక సాక్ష్యం. మహాభారతాన్ని సాహిత్య వేత్తలు, చరిత్రవేత్తలు, వ్యాఖ్యానించి అనేకమైన ప్రామాణిక పరిశోధనలు రచనలు చేశారు. చేస్తున్నారు. ‘మిథ్’ నుంచి ‘చరిత్ర’ను విడదీసి పునర్నిర్మించడానికి పరిశ్రమిస్తూనే ఉన్నారు.

వారందరి వాద, వివాదాల సారాంశం తీసికోవడమే కాదు, వారందరికంటే మించిన తార్కికతతో, శాస్త్రీయ పురా ఆధారాలతో, మిథ్‌ను వాస్తవాలను విడదీసి, మహాభారత గాథను ఈ ‘పర్వ’ రూపంలో పునర్నిర్మించారు సుప్రసిద్ధ కన్నడ సాహిత్యకారులు, నవలా రచయిత, తత్వశాస్త్రవేత్త, ఆచార్య ఎస్.ఎల్. భైరప్పగారు. మరోసారి చరిత్ర భూమిక పొరల్లో చిక్కుకుపోయిన నాటి సమాజ స్వరూపంలోకి తన పురాకథన త్రవ్వకంతో పాఠకుల్ని తీసుకువెళ్ళారు భైరప్పగారు.

ఇరవై ఏళ్ళ పాటు మహాభారత పరిశోధనలకు సంబంధించిన ప్రతి గ్రంథాన్ని, వ్యాసాన్ని, పుటనీ చదివి, మహాభారత గాథకు సంబంధించిన ప్రతి ప్రాంతాన్ని పర్యటించి, అక్కడి కథల్ని విని, స్థల చరిత్రలను సేకరించి, స్థలాధ్యయనం చేసి, మహాభారత అవతరణకు మునుపటి వైదిక సంస్కృతి యుగం ఆఖరు భాగంతో దాన్ని సమన్వయింపచేసికొని ఈ సమగ్ర సంశోధనాత్మక వ్యాఖ్యా రూపకమైన గ్రంథాన్ని, మహాభారత పునఃసృష్టిని చేశారు భైరప్పగారు.

(మున్నుడిలో రచయిత సంక్షిప్తంగా తమ శ్రమను పరిచయం చేశారు)

అయితే ఆయన గొప్పదనమెక్కడుందంటే, దీన్ని ఏ కొద్దిమంది పండితులకు మాత్రమే పరిమితమయ్యే పరిశోధనా గ్రంథరూపంలో రాయకుండా, చదువుకొనే అభిలాష ఉన్న ప్రతి చదువరికి అందుబాటులో ఉండే విధంగా నవల రూపంలో రాశారు.

ఈ ‘పర్వ’ ఒక నవల. సామాన్య పాఠకులకు మహాభారతాన్ని కొత్తరూపంలో చెప్పిన నవల. మహాభారతంలో పరిశ్రమించే పరిశోధకుడికి సమగ్ర సృజనాత్మక వ్యాఖ్య.

నాటి ‘భారతా’నికి నేటి ‘పర్వ’ ఒక సమగ్ర పూరణ.

దీన్ని చదివితే కాని మహాభారత అధ్యయనం పూర్తి కానట్లే లెక్క.

దీన్ని చదువుతూంటే ఎన్నో సందేహాలు, వివాదాలు ఏర్పడవచ్చు. చాలా చోట్ల భైరప్పగారితో ఏకీభవించకపోవచ్చు. అయినా ఆయన తార్కికతను, శాస్త్రీయ దృక్పథాన్ని హర్షించి, అభినందించి కొత్త ఆలోచనలకు ప్రేరణ పొందకుండా ఉండలేము.

సగటున ప్రతి తెలుగు సాహిత్య విద్యార్థికి ఉన్నట్లే, నాకూ కవిత్రయం భారతమంటే అమితమైన ఇష్టం, అపేక్ష. వచన కథా రచనలకు అలవాటుపడ్డ నేటితరం పాఠకులకు, పద్య మాధ్యమంలోని కవిత్రయ భారతం సాగసులు అందుబాటులోకి రాకపోతున్నాయేనన్న బాధ. నవల రూపంలో దీన్ని తిప్పి చెబితే చాలా బాగుంటుందని, మా మునుపటి సంస్థ- అంతర్జాతీయ తెలుగు సంస్థకు డెబ్బయిల చివర్లో ప్రతిపాదించాను. 83లో అనుమతి లభించింది. మహాభారతంలోని ఉపాఖ్యానాలన్నిటిని రెండు, మూడు చిన్న సంపుటాలుగా ముందు వెలువరించి, తర్వాత ప్రధాన కథ ప్రారంభించాలని సంకల్పం. నన్నయ భాగంలోని ఉపాఖ్యానాలు ‘భారత కథాలహరి’ పేరిట 84లోనూ, తిక్కన శాంతి పర్వ ఉపాఖ్యానాలు ‘భీష్ముడు చెప్పిన రాజనీతి కథలు’ పేరిట 85లోనూ వెలువడ్డాయి. భీష్ముడు చెప్పిన రాజనీతి కథలను వివిధ రంగాలకు చెందిన పెద్దలు చదివి, నేనెప్పటికీ మరిచిపోలేని మంచి మాటల్లో మెచ్చుకోవడం నా అదృష్టం. ఆలోగా సంస్థ తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం కావడం, నా ప్రణాళిక కొండెక్కి కూచోవడం జరిగింది. ఎలాగైనా ఈ ప్రణాళికను మళ్ళీ కార్యరూపంలోకి తేవాలని ప్రయత్నిస్తుండగానే 86లో ‘పర్వ’ గురించి విని, చదవడం తటస్థించింది. ఆ తర్వాత రాస్తే, గీస్తే ముందు దీన్ని తెలుగులోకి అనువదించాలి అనే ఆశ నాటుకొంది. ప్రచురించడమెలా? ఆ ఆశ ఓ కలలా మిగిలి పోయింది.

దాదాపు దశాబ్దంపాటు నన్నంటుకొని ఉన్న ఈ కలను, వాస్తవ రూపంలోకి తెచ్చే అవకాశాన్ని కలిగించి యిచ్చింది నా మిత్రులు, కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి, కవి శ్రీ అగ్రహార కృష్ణమూర్తి, ‘మోడర్న్ క్లాసిక్స్’ ప్రణాళిక కింద కన్నడం నుండి ఎంపికైన కొద్ది రచనల్లో ‘పర్వ’ ఒకటని, దీన్ని తెలుగులోకి అనువదించవచ్చని దారి చూపి ప్రోత్సహించారు కృష్ణమూర్తి. ఆయనకు నా ప్రప్రథమ కృతజ్ఞతలు. ఈ సందర్భంలో అకాడెమీ కార్యక్రమాధికారి శ్రీ ఇళంగోవన్ సహకారాన్ని కూడా కృతజ్ఞతతో స్మరిస్తున్నాను.

ఈ అనువాదానికంతటికీ అసాంత ప్రేరణ అటు భైరప్పగారయితే, ఇటు మా ‘పెద్ద గురువుగారు’ కేంద్రసాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సలహా సంఘ అధ్యక్షులు, నాకు పితృతుల్యులు పూజ్యశ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు – వారికి కృతజ్ఞతలు అని చెప్పడం సాహసం. భక్తితో కైమోడ్పులు. అనువాదాన్ని ఆ మూలాగ్రం చదివి తన అభిప్రాయం తెలిపిన డా. పి.ఎస్. గోపాలకృష్ణకు స్నేహపూర్వకమైన అభివాదాలు,

అనువాదం గురించి ఒక మాట: ఆధునిక ప్రామాణిక భాష పేరుతో, చదువుకొనే భాగ్యమున్న నగర జన భాష మాత్రమే పీఠమెక్కడంతో ఎన్నో పలుకుబళ్ళు, ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతానివి, అంతరించిపోయాయి, పోతున్నాయి. పక్కనున్న కన్నడంతో సమసించే ఎన్నో అందమైన మాటలు. కన్నడంలో భైరప్పగారు, చాలాచోట్ల, సాభిప్రాయంగా పదాలను ప్రయోగించారు. వారికి దగ్గరగా ఉండడానికై ఒకటీ అరా మా రాయలసీమ మాటల్ని, ప్రామాణిక పర్యాయాలతోపాటు కలిపేసి ప్రయోగించాను. మైకట్టు (శరీర నిర్మాణం) లాంటి మాటల్ని ఒకటీ, అరా అలాగే తీసుకొన్నాను. ‘బాసింపట్టు వేసికొని, అనడానికి మావైపు ‘చెక్కా మక్కా లేసుకొని’ అనడం రివాజు. పర్యాయంగా అలాటి రూపాల్ని ఒకటీ, అరా చేర్చాను. అలాగే ‘చైతన్య స్రవంతి’ శిల్పంతో ఆయన వాక్యాలను అసంపూర్ణంగా ఒకదాన్లో నుండి ఒకటి వచ్చినట్లుగా అదో విలక్షణమైన పద్ధతిలో నడిపిస్తారు. చాలా కొద్దిపాటి మార్పుతో దాన్ని తెలుగులోకి తేవడానికి ప్రయత్నించాను. యథాతథంగా కథనంతా భూతకాల క్రియారూపాలతో చెప్పి, చివరి అధ్యాయాన్ని మాత్రం భవిష్య, తధర్మ రూపాలలో చెబుతారు. దాని వెనుక ఒక శిల్ప వివక్ష ఉంది. అంచేత దాన్ని అలాగే తీసుకొన్నాను. ప్రాచీన కాలపు ఇతివృత్తాన్ని చెప్పడానికి, పాతబడ్డ కొన్ని వ్యవహార రూపాలను కావాలని వాడారు. దాన్ని వీలైనంత వరకు, ఎబ్బెట్టుకాని రీతిలో, తెలుగులో పట్టుకురావడానికి ప్రయత్నించాను. నా ఈ చిరుప్రయత్నాలను, పాఠకులు మన్నిస్తారని ఆశ.