అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి, ఏడుచేపలు తెచ్చి ఎండబెడితే, అందులో ఒక చేప ఎండలేదు. అదుగోండి, ఆ ఎండని చేపే కదా హాయిగా, సాఫీగా సాగిపోతున్న కథని అడ్డంతిప్పింది. అలా, “కథని మలుపు తిప్పేవోడేరా మైరావుడు అంటే!”

ఈ మైరావుడు గైరమ్మ ఏడుగురు బిడ్డల్లో ఒకడు. ఐతిహాసిక ప్రతినాయకుడు మైరావణుడు లాంటి మాయావి. టక్కరి. చిక్కడు దొరకడు. మైరావణుని లాగానే ఇతనికీ, ఒక అన్న ఉన్నాడు. బలరాముడు. బలరాముడి తమ్ముడు జగన్నాథుడు కదా? అవును. మైరావుడు మైరావుడే కాదు. అన్నల మధ్య ఉన్నపుడు, ఉన్నవ కథానాయకుడి లాంటి తక్కెళ్ళ జగన్నాథరావు. అయినా తనని తాను, ఛెంఘిజ్ ఖాన్ అని భావించుకొనే మైలపిల్లి జగన్నాథం.
ఈ కథ ఒక మైరావుడిది కాదు. ఇద్దరిది. ఆ ఇద్దరు మైరావుళ్ళ మధ్యన ఏడుతరాలు. ఇద్దరు మైరావుళ్ళు ఒక్కో తరపు బెస్తవాళ్ళ వాళ్ళ నాయకులు. వాళ్ళిద్దరు తెచ్చిన మార్పులు తిప్పిన మలుపులు, వారి తరాలకే పరిమితం కాలేదు. తరతరాల వాడబలిజల జీవనస్రవంతిలో అంతర్భాగాలయ్యాయి. ఆ విశేషాలన్నీ ప్రతిఫలించే నవలలో వారిద్దరూ ప్రధాన పాత్రలు.
దెయ్యం తెలివినీ మనిషి తెగువనీ కలుపుకొని పుట్టిన ఆ తొలితరపు మైరావుడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. వలను తయారుచేసి, ఓడలు తయారు చేసుకొనే వాడబలిజలను చేపలుపట్టే వారిగా మళ్ళించేసాడు. ఏడోతరపు మైరావుడు వారిని బద్దపుట్టు నుంచి ఫైబర్ పుట్టులోకి మళ్ళించాడు. ఓడల నిర్మాణ కౌశల్యాన్ని, మర్మాన్ని పుణికిపుచ్చుకొన్న వారిద్దరూ, కొత్తగా వ్యక్తపరిచిన కాలానికి తగ్గ ఆవిష్కర్తలే. అందుకే కాబోలు, వారిద్దరినీ ‘తెలివికి పేరెల్లిన మైరావుడని’ పిలుచుకొన్నారు.
రాముడినే ఎత్తుకెళ్ళిన ఆ రామాయణంలోని మైరావణుడితో పాటు, ఈ ఇద్దరి మైరావుల చుట్టూ అల్లుకొన్న అనేక కథలను, కాలాలకు స్థలాలకు అతీతంగా చలించే కథనాలనూ గుదిగుచ్చి, ఒక అపురూపనవలగా తీర్చిదిద్దారు. నవలాకథన బహుముఖీయతను, సూత్రాలన్నీ సూక్ష్మాలన్నీ గ్రహించిన ఈ నవలాకారుడు, వాటన్నిటినీ వలతాళ్ళలా మలుచుకొని, ఎంతో ఒద్దికగా, ఓర్పుగా నేర్పుతో అందమైన అక్షరాలవల అల్లి నవలాసముద్రంలోకి ఒడుపుగా విసిరేసి, ఒక బంగారుచేపను పట్టేసాడు. అదే, ‘మైరావణ’ నవల. ఆ ప్రతిభావంతుడైన నవలాకారుడు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడెమీ యువ సాహితీ పురస్కారగ్రహీత, పాతికేళ్ళ విద్యార్థి, ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్).
ఈ నవలాకథనం గతానికి వర్తమానానికి మధ్య ఎంత సులువుగా ప్రయాణిస్తుందో, చరిత్రకీ పురాణాలకీ, జానపదాలకీ మధ్య అంత సునాయాసంగా తిరుగాడుతుంది. బృహత్కథ చెప్పినంత గంభీరంగా, జముకుల పాటను చెబుతోంది.
విశాఖపట్టణపు బెస్తవాడలనుంచి, అటు రంగం వెళుతుంది. ఇటు నందివాగు కొండల్లోని గుమ్మడం చేరుకొంటుంది. అది బంగాళాఖాతమైనా, నాగార్జునసాగరపు రిజర్వాయరు అయినా, బుగ్గవాగు చెరువైనా, వారు విసిరిన వలలు అంతే మహజరుగా వచ్చిపడతాయి.
విశాఖ ఘోరకలి గావచ్చు, ప్రపంచయుద్ధాలు కావచ్చు. రంప పితూరి కావచ్చు, దండి నడక కావచ్చు, అన్నలఉద్యమం కావచ్చు, ప్రజాస్వామ్యపు ఓట్ల రాజకీయాలు … ఏవైనా కావచ్చు. నీటి మీదున్నా, కొండమీదున్నా, నేలమీదున్నా, ఖండితప్రాంతాల్లోని జనావాసాల్లో ఉంటున్నా ఏనాటికానాడు దేశస్థితిగతుల్లో తాము పోషించిన పాత్రేమిటో, చెప్పకనే చెబుతాయి. చాలా ‘ఒలుం గా. బలం పూటుగా!’
అవును మరి, పడమరతీరపు‘దండి’లో గుప్పెడంత ఉప్పును పిడికిట బట్టి, దేశాన్నంతా ఉర్రూతలూపిన జాతీయోద్యమ విశేషాలన్నీమనకు తెలుసు. సరిగ్గా అదే కాలాన, తూర్పుతీరాన పూడిమడకలో పిడికెడు ఉప్పుతీసుకొన్న ఆకలినేరానికి ముసలి మసేనుదేవరను చర్మం చిట్లేలా కొరడాలతో కొడుతూ శిక్షిస్తుంటే, నూకన్న ఒక కత్తావబద్ద (తెడ్డు) తీసుకొని ఆ బ్రిటిష్ సోల్జర్ తలబద్దలు కొట్టాడని మనకు తెలియదు. న్యాయంకోసం తెగబడినా, ఆ ఘనకార్యం చేసిన భాగ్యానికి, కన్నవారిని కన్నఊరిని వదిలి, ‘రంగం’ పారిపోవాల్సివచ్చిన, పరాయిపాలనలో లిఖించబడని దుర్భర జీవనపరిస్థితులను, ఈ నవల వివరంగా విప్పిచెప్పింది.
వాస్తవానికి ఈ నవలంతా, ‘వొంగుంటే వీపు ఆకాశాన్నంటే, ఆ పేదరాశి పెద్దమ్మ’ లాంటి గైరమ్మ కథ. మైరావుడి తల్లి గైరమ్మ ప్రభావం అంతాఇంతా కాదు. ఆమే ఈ కథకంతా సూత్రధారి. చలనసూత్రం. అసలు కథలోకి గైరమ్మ ఎలా అడుగుపెడుతుందో, ఆ చమత్కారం చూడండి. ఆవులమంద మధ్యలో తాడిపెద్దుమీద కూర్చుని సంబరంగా నవ్వే ఎనిమిదేళ్ళ పచ్చిపసుపు ముద్ద లాంటి గైరమ్మ, గుళ్ళోని అమ్మోరిని గుర్తుకు తెస్తూ.
కథాక్రమంలో, ఆమె కడుపుశోకం గుమ్మడంలోని మూడొంతుల మందిని, తరతరాలుగా నమ్మిన ‘అమ్మోర్లను ఇళ్ళల్లోంచి విసిరేసి, దేవుళ్ళోకి దిగిపోయేలా ‘చేసింది. ఆమె విశ్వాసప్రభావం ఎలాంటిదంటే, సుత్తీకొడవలిని నక్షత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకొన్న మైరావుడు సైతం మెడలో శిలువేసుకొని తిరిగేంత.
వ్యక్తిగత అనుభవాలతో ముడిపడ్డ ధార్మిక విశ్వాసాల్లోని అనేకతను, పొరలుపొరలుగా విప్పి చూపింది ఈ నవల. గ్యాపాట దెయ్యం నుంచి, బుద్ధుడి గుడుల నుంచి, తాంజెన్ జ్యోస్యం నుంచి, అమ్మోరి పూనకాలు, జగన్నాథ రథయాత్రలు, అప్పన్న నాము నుంచి, రెండవ రాకడ వరకు, ఆ భిన్నత్వపు మూలాలను ఒడిసిపట్టుకొన్నది ఈ నవల. వివిధ విశ్వాసాల మధ్యన కలిసికట్టుగా, ఒక్కమాట మీద సంఘటితంగా జీవించగల రహస్యమేదో వారికే తెలిసినట్టుగా.
బైరాగుల్లో కలిసిపోయి తీర్థయాత్రల్లో అలసిసొలసిన ముసలివొగ్గుగా తన కన్నతండ్రి, నూకయ్య, తిరిగి వస్తే, ఆప్యాయంగా తన అక్కున, తమ పంచన చేర్చుకొంది. ఆ నూకయ్య తాతే, ఏడోతరపు మైరావుడికి తమ తరతరాల కథను నూరిపోసాడు. అంతే కాదు, మైరావుడికి ఎన్నో సిద్దుల విద్యలతో పాటు, పరకాయప్రవేశం కూడా నేర్పాడంటారు. ఊళ్ళోజనం మాత్రం చేతబడి చేయడం నేర్చాడంటారు. రంగం(రంగూన్) నుంచి నూకయ్య తెచ్చి, పోగొట్టుకొన్న నగిషీలు చెక్కిన రాగిభరిణె కూ, మైరావుడికి దొరికిన లంకెబిందెలకు లంకె అక్కడే కుదిరింది. నూకయ్య కోరినట్లుగానే అతని దహనసంస్కారాలు జరిపించడం, ఒకరి నమ్మకాల పట్ల మరొకరికి ఉన్న గౌరవం.
నవలాకథనం పాత్రల స్వాభిమానపు గట్టితనాన్ని చిత్రీకరించింత నేర్పుగా, గుండెల్లో తడిని స్పృశించింది.
అకాలంగా కన్నుమూసిన కన్నబిడ్డని గొయ్యిలో కప్పెడుతున్నప్పుడు, మైరావుడికి చిన్నప్పుడు అలాగే కప్పెట్టిన తన పెంపుడు చిలక గుర్తొస్తుంది. అంతటితోఆగక, కథకుడు బృహత్కథలోని తన రచనకి తానే నిప్పెట్టిన గుణాధ్యుడి అనుభవాన్ని గుర్తుచేస్తూ వ్యాఖ్యానిస్తాడు, ‘తన సృష్టిని తానే నాశనం చేయాల్సిరావడం అనే దుఃఖం ఇద్దరిదీ’ అని.
కథాగమనంలో వ్యంగ్యానికి, వెటకారానికి కొదవేమీ లేదు. మాహిని ఉద్దేశించి, అధికారి అంటాడు, ఆమెలాంటి ‘లెఫ్ట్, లిబరల్, సెక్యులర్, డెమొక్రాటిక్’ భావాలున్నవారు ఉన్నతస్థాయి కుటుంబాల్లో పుడతారు అని. నిజానికి, ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొన్న, పాత్రికేయురాలు, మాహి, ఆరో ఆడపిల్లగా పుట్టిన భాగ్యానికి, కన్నతండ్రే పురిటిబిడ్డ పీకమీద తొక్కి చంపబోతే, మైరావుడు తప్పించగా, అనాథగా పెరిగి, వదాన్యుల ఇంటికి దత్తు వెళ్ళిన అడవిబిడ్డ.
బ్రాకెట్లలోని వ్యాఖ్యానాలు వ్యంగ్యచిత్రణకు బాగా అందివచ్చాయి. ఇలాంటి చమత్కారాలతో చెణుకులతో, కథనం హాస్యపురంగు అద్దుకుంటుంది.
బాలికావివాహాలు, మర్యాదాహత్యలు, ఆడపిల్లల విక్రయం, వేధింపులు, ఆత్మహత్యలు నుంచి అనేక అంశాలు ఈ నవలలోనిస్త్రీ పాత్రల చుట్టూ అల్లుకొని ఉన్నాయి. ఒక బద్దపుట్టు, కొన్నినూలు వలలతో కొత్తచోటకి చేరిన వలసజీవితాల్లోని పోరాటాలు, ఆరాటాలలో నిలదొక్కుకోవడంలో స్త్రీల పాత్ర కళ్ళకు కడుతుంది.
భావుకత నవలంతా. ముఖ్యంగా ‘భార్యలు అచ్చిరాని’ మైరావుడు, సినిమాలలో లాగా తన వలలో సినీనటి సౌందర్యలాంటి మత్స్యకన్య పడాలని అనుకొంటాడు. నిజంగానే సౌందర్య ఎదురయినపుడు, “మైరావుడు తన్మయత్వంతో పాడితే, ఆ పిల్ల (సౌందర్య) మైమరిచి వింది. తనువు అన్నా, మై అన్నా శరీరమే.”
ఇక, వర్ణనలు ఎంత అందంగా ఉన్నాయో. వానని ఎలా వర్ణించారో చూడండి: ‘ఏనుగులు దిగడి పోయేంత వర్షం’. ‘ధూళి మేఘాన్ని అణిచివేసే వర్షం’.
రచయిత చిత్రకారులు. అట్టలమీది చిత్రాలకు తోడుగా, పుస్తకంలో చేర్చిన చిత్రాలు ఈ నవలాకథనంలో అంతర్భాగం.
అలాగే, పచ్చబొట్టు ఓ కథనమాధ్యమం అవుతుంది. అది గైరమ్మ శ్రీవత్స పచ్చబొట్టు పాత్ర పోషించింది కావచ్చు, మైరావుడి చేతి మీది సుత్తీకొడవలి, అశోక్ చేతి మీది ఓం త్రిశూలం — వాటి కథలు అవి చెప్పాయి.
కథలో పగలకు ప్రతీకారాలకు లోటు లేదు. అలాచూస్తే, ఇది నిజాయితీ గల ఉద్యోగి అయిన తన తండ్రి అర్థాంతరపు చావుకు ప్రతీకారం తీసుకొంటున్న ప్రభుత్వాధికారి అశోక్ కథ. కాకపోతే, మైరావుడి గురించి “తెలుసుకోవడానికి ఇతిహాసపు చీకటి కోణాల్లో వెతికాడు కానీ, రోజువారీ న్యూస్ చూడ్డం మానేసాడు.” దాని పర్యవసానలేమిటో నవల చెబుతుంది.
ఉన్నవాటికి తోడు కొత్త విశ్వాసాలను సృష్టిస్తారు. ఉదాహరణకు పులిగోరు పతకం. దానిని ‘ఎవరు వేసుకొన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తూ, దొరికిపోయి చంపబడతారు.’
మరి అదేనా, ఈ నవల ముగింపు? దాదాపుగా అంతే. కానీ, మైరావుడుకి అతీంద్రీయ శక్తులు ఉన్నాయి కదా. ఎలా చనిపోతాడు? తాతనేర్పిన పరకాయ ప్రవేశ విద్యతో ‘నీళ్ళల్లో తేలుతున్న చచ్చిపోయిన ఓ కొంగ శరీరంలో దూరేసి తప్పించుకొని ఎగిరిపోయాడంట!’

ఉన్నట్టుండి కనబడకుండా పోయిన మైరావుడి కన్నబిడ్డ మన్నా ఎక్కడో బతికే ఉంది. మైరావుడు బతికే ఉన్నాడు. ఆ బతకడం ఎలాంటిదో పల్నాటి ఎలమందకి చెప్పినట్టుగా, కథకుడు ముందే చెప్పించాడు. భౌతికంగా ఉన్నా లేకున్నా ప్రజల నాలుకలపై బతకడం.
“సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలుగా అయ్యాయంటే, రెండు సమస్యలు. ఒకటి కాదన లేవు. రెండు నిరూపించ లేవు. ఈ నవలాకథనానికి మూలసూత్రం అదే.
మైరావుడి కథని కాదన లేము. నిరూపించలేనూలేము. అది, పదిబారల రవ్వచేప ఇచ్చిన సాక్ష్యంవంటి, పుస్తకంలో దాచిన రివాల్వర్ అంత నిజం.
ఏదైనా చేయలేని పని చేయాల్సి వచ్చినపుడు, ‘అలివి గాని పని’ అని ఉస్సూరంటాం గానీ, అలివి అంటే విల్లులా విసిరే విశాలమైన వల అని మీకు తెలుసా? కేగొల, మేగొల, ఏడేళ్ళ అచ్చు అల, కొంగొల, ఈ వలల పేర్లని ఎప్పుడైనా మీరు విన్నారా? నెత్తికొల్లమొట్ట చేపలపులుసు గుట్టేమిటో మీకు తెలుసా? పమికి దీపం గురించి, బాంబ్ ఫిషింగ్ గురించి, పండాట గురించి విన్నారా?
దేవుడిచెట్టు, అమ్మోరు మొండు, ఆవులమొండు, టొపీమెట్ట ఇవన్నీ, మన పక్కనే ఉన్న జనావాసాలని మీకు తెలుసా? లంకెబిందెలు కావవి మామిడి పిందె లాంటి పాత్రకి లంకె వేస్తారే అవి. ఇలా చెప్పుకొంటూ పోతే, ఎన్నెన్ని కొత్తవిశేషాలు, పదాలు, పలుకుబళ్ళు, అలవాట్లు, ఆచారాలు ఉన్నాయో ఈ నవల నిండా.
ఇకపోతే, ఇంతరాసిన వారు అక్కడక్కడ ఎదురయ్యే అరకొర ఇంగ్లీషు సంభాషణలను, తెలుగునవలలో ఎలా వ్యక్తపరచాలో అలాంటి ఒక సృజనాత్మక పరిష్కారం ఇవ్వలేరా? అలాగే, గైరమ్మ తమది కాని ఒక ధార్మిక విశ్వాసంవైపు మళ్ళడానికి పూర్వం, ఆ పరమత ప్రచారకులకు గైరమ్మతో, వారి ఊరివారితో ఉన్న పరిచయం ఏమిటో, ఔననడానికి ముందు అన్నాళ్ళు ఎందుకు కాదన్నారో, ఎలాంటి ప్రోద్బలానికి, ప్రభావానికి, ప్రలోభానికి దూరంగా ఎలా మెసలి ఉంటారో, వాటి ప్రస్తావన మాత్రమైనా లేదు.
తేలికపాటి కథనాలతో గాలిలో తేలే జనరంజక తెలుగు నవలలు ఎగిసిపడుతూ చప్పుడుచేస్తున్న తరుణంలో, ఆ ఒరవడిలో పడకుండా, తనదైన బాణీని, శైలిని సృష్టించుకొని, సంక్లిష్ట( కాంప్లెక్స్) కథనంలోని, గాఢతను, నిగూఢతను, మార్మికతను ఒడిసిపట్టుకొన్న గంభీరరచన చేసిన ప్రసాద్ సూరి గారికి అభినందనలు. ఈ నవలాకథనం తెలుగునవలను తప్పక మలుపు తిప్పుతుందనే ఆశ. మలుపు తిప్పి, మార్పు తెచ్చేవాడే కదా మైరావుడు!
ఈ యువరచయిత నిరంతర శోధకుడు, విస్తృతపాఠకుడు, అధ్యనయశీలి, సహజ కథకుడు అని అర్థమవుతుంది. అవి గొప్పకథకుడి లక్షణాలు. ఇప్పటికే మైరావణ ఒక దృష్టాంతం చూపింది. వారి కలం నుంచి మరెన్నో నవలలు రావాలి.
మైరావణ కాలం వాలున నిలబడే నవల. తెలుగు నవలాకథనాలను నిలబెట్టే నవల.
*
మైరావణ, తెలుగు నవల,
రచన: ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్)
ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్, 2022