హిమాలయాలు!
ఈ పదమే నా మనసును ఊయలలూగేలా చేస్తుంది. చేస్తోన్న పనిని క్షణకాలం పక్కనపెట్టి నన్ను ఆ హిమశిఖరాల మధ్య తిరుగాడేలా చేస్తుంది.
హిమాలయం అన్న సంస్కృతపదానికి సరళమైన అర్థం చెప్పుకోవాలంటే ‘మంచునిండిన ప్రదేశాలు’ అనవచ్చు. కానీ ఆ మాట మన మనసుల్లో కలిగించే స్పందన… ప్రకంపన… ఎంతో గాఢమైనది. ఆ మాట కలిగించే ఉత్తేజం మాటలకందనిది. భారతదేశానికి మకుటంలాగా కాశ్మీరునుంచి మిజోరందాకా 2500 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఈ హిమవత్పర్వతాలు ఎన్నో యుగాలనుంచి కవులు, రచయితలు, కళాకారులు, సాహసికులు, అధ్యాత్మికవేత్తలు, ఋషులు – ఎంతోమందికి ప్రేరణ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళు కూడా వాటి ప్రభావానికి అతీతులు కారు; వారంతా హిమాలయాలను తమ నివాసంగా చేసుకున్నవారే!
మహాకవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో తన సంస్కృత కావ్యం కుమారసంభవంలోనూ, అలాగే మన అల్లసాని పెద్దన పదహారవ శతాబ్దంలో మనుచరిత్రలోనూ చూపించిన హిమాలయాల పదచిత్రాలు నా మనసులో నాటుకుపోయాయి. ఆ వర్ణనలలో అతిశయోక్తులు ఉండి ఉండవచ్చు – కానీ అవి అద్వితీయం. ఈ ఎలక్ట్రానిక్-ఇంటర్నెట్ యుగం మనకు చిటికెలో అందిస్తోన్న ఛాయాచిత్రాలు అందుబాటులోకి రావడానికి బాగా ముందే ఈ కావ్యాలు నా మనసులో హిమాలయాల దృశ్యాలను నింపి వదిలాయి. ఆ అక్షరాల ద్వారా మన ఊహాశక్తి హిమాలయాలలో విహరించడంతో పోలిస్తే ఈ వీడియోలూ ఫోటోలూ అందించే అనుభూతి ఏపాటి?
అలాంటి స్వర్ణభూమి హిమాలయాల్లోకి – అందులోనూ ప్రపంచంలోకెల్లా అత్యున్నత శిఖరం ఎవరెస్ట్‌కు చెందిన బేస్ క్యాంప్ (ఈబీసీ) దగ్గరకు, అక్టోబర్ 2022లో ట్రెకింగ్ చేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. చేశాను. చేసి అప్పుడే నెలలు గడిచిపోయినా ఆ అనుభవాలు నాకు నిజంగా లభించాయా; ఆ అనుభూతులు కలలు కాదుకదా అని ఇంకా అనిపిస్తూనే ఉంటోంది.
16 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకూ పదకొండు రోజులు సాగిన యాత్ర అది. ఆ అన్ని రోజుల వివరాలూ విశేషాలూ నేను ఏ రోజుకు ఆ రోజు డైరీ రాశాను. అలాగే మా నేపాలీ గైడ్ ‘బాబు గురంగ్’ సాయంతో ఆయా ప్రదేశాల భౌగోళిక విశేషాలు, స్థానిక చారిత్ర, కథలూ గాథలూ కూడా నమోదు చేసుకోగలిగాను. వందలాది ఫోటోలు తియ్యడం సరేసరి. వీటన్నిటి సాయంతో ఇపుడు ఈ యాత్రాకథనం రాశాను. రాద్దామని కూర్చున్నపుడు ఆ అనుభవాల గాఢత నన్ను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేసిందంటే అసలు నా రచన ఎక్కడనుంచి మొదలెట్టాలో కూడా అర్థం కాలేదు. ఏదేమైనా రోజువారీ వివరాల్లోకి వెళ్ళేముందు మొత్తం యాత్రలోని ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తే బావుంటుందనిపిస్తోంది.
మా ట్రెకింగ్ బృందంలో ఏడు దేశాలనుంచి వచ్చిన ఇరవై ముగ్గురు సభ్యులున్నారు. అక్టోబర్ 16న నేపాల్ దేశపు సోలు ఖుంబు (Solu Khumbu) ప్రాంతంలోని లుక్లా (Lukla) అన్న పట్నంనుంచి మా ఈబీసీ ప్రయాణం ఆరంభించాం. గమ్యం చేరడానికి పదిరోజులు పట్టింది.
మా ట్రెక్‌లో చాలా భాగం దూధ్‌కోసి నది వెంబడే సాగింది. ఆ నదిమీద అనేక ఉయ్యాల వంతెనలు తటస్థపడ్డాయి. ఉయ్యాల వంతెన అంటే హిమాలయాలలో తరచూ కనిపించే – రిషికేశ్ దగ్గరి లక్ష్మణ్ ఝూలా లాంటి – వంతెనలన్నమాట. వాటిల్ని చాలావరకూ నడవడానికే వాడతారు. వాహనాలు నిషిద్ధం. ఆ నడిచే ప్రక్రియలో మేమంతా ఎన్నెన్నో జడలబర్రెలూ కంచరగాడిదల చిరువ్యాపార బృందాలను ఒరుసుకుంటూ సాగాం. నామ్చె బాజార్ (3440 మీటర్లు) దెబు చె (3820 మీటర్లు), టెంగ్బో చె (3860 మీటర్లు), దింగ్బో చె (4410 మీటర్లు) థుక్లా (4600 మీటర్లు), లొబూ చె (4960 మీటర్లు), గోరక్షెప్ (5165 మీటర్లు) లాంటి ఉన్నత పర్వత ప్రాంతాలలోని సుందరమైన షెర్పా గ్రామాలను దాటుకుంటూ వెళ్ళాం…
ఈ ఈసీబీ ట్రెక్ అన్నది ఒట్టి సాహసయాత్ర మాత్రమే కాదు. మనిషిని ప్రకృతితో అనుసంధించే ప్రక్రియ అది. అంతేకాదు, తనకు తెలియని సంస్కృతినీ జీవన విధానాన్నీ – ఆ జీవితమూ సంస్కృతులలో భాగమైపోయి ఆకళింపు చేసుకొనే అపురూప అవకాశం. అక్కడి షెర్పాల సహాయ సహకారాలు అందుకున్నాం. వారు తినే భోజనం మేమూ రుచి చూసి ముచ్చటపడ్డాం. వారు నడిపే ‘టీ హౌసెస్’ అన్న, ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఉండే హోటళ్ళలో కొన్ని రోజులు గడిపాం. వారి దైనందిన జీవితాన్ని అతి దగ్గరనుంచి చూడగలిగాం.
దారిలో నాలుగువేపులా హిమశిఖరాలే కనిపించే అనేక చోట్ల ఆగి, నిలబడి ఆ అపురూప సౌందర్యాన్ని మనసులో ఇంకించుకొన్నాం – బహుశా ప్రపంచంలో మరింకెక్కడా ఇంత చక్కని పర్వతసీమ మనకు కనిపించదనుకుంటాను. 8000 మీటర్ల ఎత్తును దాటి ఉన్న ఎవరెస్టు, లోత్సె, మకాలు శిఖరాలతోపాటు ఆరేడువేల మీటర్లు దాటి ఉన్న అమదబ్లమ్, థమ్ షెర్కు, కుసుమ్ కగరు, కాంగ్ డె, నప్ట్సె, పుమోరి, ఖుంబుచె, ఖంగ్టేగ, తుబుచె, చొలాట్సె, లొబుచె లాంటి మంచు నిండిన శిఖరాలను అతి దగ్గరనుంచి చూసే అవకాశం ఈ ఈబీసీ ట్రెక్ మాకు అందించింది. ఊహాతీతమైన ధీరగంభీర సౌందర్యమా హిమశిఖరాలది. హిమాలయాలను దేవతల విహారభూమి అని ఎందుకు అంటారో మాకు అనుభవమయింది.
లుక్లా, నామ్చె బాజార్ లాంటి గ్రామాలకు రోడ్లు లేవు. వాహనాలు వెళ్ళవు. రోడ్డు ముగిశాక నాలుగు రోజులు కాలినడకన వెళితే తప్ప లుక్లా చేరుకోలేం… నామ్చె బాజార్ ఆ పైన మరో రెండు రోజుల నడక. అక్కడ ఉండే సన్నపాటి కాలిబాటలనే గ్రామస్థులు, ట్రెకర్లు, కంచరగాడిదలు, జడల బర్రెలు పంచుకోవాలి. సరుకుల రవాణాకూ అవే మార్గాలు. ఏమన్నా అత్యవసర పరిస్థితులు వస్తే హెలికాప్టర్‌లో కానీ విమానంలో కానీ ఖాట్మండూ చేరుకోవాలి.
నిజానికి ఈ ట్రెక్ ఏమంత సులభమయింది కాదు. సర్వశక్తులనీ హరించే కఠినత కలది. కానీ చుట్టూ పరచుకొన్న అతి సుందర ప్రకృతి, మా బృందపు సభ్యుల స్నేహ సౌహార్ద్రతలు, పరస్పర సహకారాలు అంత కఠినమైన పనిని కూడా ఎంతో సంతోషంగా చేసే శక్తిని మాకందించాయి. శ్రమ అన్నది తెలియకుండానే యాత్ర ముగించగలిగాం. అందుకు తగ్గట్టు వాతావరణం కూడా మాకు ఎంతో చక్కగా సహకరించింది. నులివెచ్చని చిరు ఎండ, అతి చక్కని నీలాకాశాలు – ఏ అవరోధమూ లేకుండా దిగంతాలదాకా పరుచుకున్న ప్రకృతి… అన్ని అంశాలూ అనుకూలంగా చివరిదాకా అమరిన ట్రెక్ అది.
ప్రకృతి సంస్కృతి జీవన విధానం – వీటితోపాటు ఈ యాత్రలో మరొక అంశాన్ని సన్నిహితంగా గమనించగలిగాం. టెంగ్బోచె అన్న గ్రామంలో సుందరమైన బౌద్ధారామం చూశాం. అది సోలు ఖుంబు ప్రాంతంలోని అతి పెద్ద టిబెటియన్ బౌద్ధారామమట. ఆ ప్రాంతపు షెర్పాలంతా టిబెట్ ప్రాంతంనుంచి వచ్చినవాళ్ళు. టిబెటియన్ బౌద్ధాన్ని అనుసరించే వ్యక్తులు. ఆ ఆరామమంతా ‘ఓం మణిపద్మే ఓం’ అన్న వారి పవిత్ర మంత్రోచ్చారణతో ప్రతిధ్వనించింది. ఈ ఆరామమే కాకుండా దారి పొడవునా అనేకానేక చిన్నా పెద్దా బౌద్ధ స్తూపాలు తటస్థపడ్డాయి.
మా యాత్ర చివరి మూడు రోజులూ మా చుట్టూ మంచు నిండిన గిరి శిఖరాలు కనిపించి మురిపించాయి. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ఎన్నెన్ని విశేషణాలు వాడినా ఆ దృశ్యాలు మాలో కలిగించిన అనుభూతిని వర్ణించడం సాధ్యం కాదు. అద్వితీయ పర్వత పంక్తులు, హిమనదాలు; ఆ ప్రాంతాలలో ఎంతో విరివిగా కనిపించే రోడోడెండ్రన్ పూలతో నిండిపోయిన అడవులు, సువిశాలమైన ఆకుపచ్చని లోయలు, దిగువన అగడ్తలలో మార్మిక మర్మర ధ్వనులతో పారే చిరునదులు; పచ్చిక బయళ్ళలో మేస్తోన్న జడలబర్రెలు, దారిలో తటస్థపడే షెర్పా గ్రామాలు, బౌద్ధ స్తూపాలు, ప్రార్థనా మంత్రాలు చెక్కిన, ఇరుసు మీద తిరిగే వర్తులస్తంభాలు – ప్రేయింగ్ వీల్స్; అడవిలో దొరికే, వైద్యానికి ఉపకరించే, తుప్పలను వెలిగించడం ద్వారా వచ్చే సువాసనలు; అనుక్షణం సహాయం అందించడానికి ముందుకు వచ్చే స్థానిక షెర్పాలు – ఇవన్నీ కలసి మా ప్రయాణాన్ని మరిచిపోలేని విలక్షణయాత్రగా తీర్చిదిద్దాయి. ఒకే ఒక్క రోజులో 8000 మీటర్లను దాటిన మూడు ఉన్నత శిఖరాలను చూసే అవకాశం ఎన్నిసార్లు వస్తుందీ?! బహుశా జీవితంలో ఒకే ఒక్కసారి!
అలాగే యాత్రామార్గంలో మేమంతా దూధ్‌కోసి నది పుట్టిన చోటును చూశాం. థుక్లా దగ్గర ఉన్న ఝోంగ్ల పొ కోరీ అనే, నీలమణులు రాసిపోసినట్లున్న సరోవరం చూశాం. ఇదిగదా మన ప్రబంధాల్లో వర్ణించే దేవతలు విహరించే సరోవరమంటే – అనిపించింది.
మాలో కొంతమందిమి దారిలో వచ్చే 5550 మీటర్ల (18208 అడుగులు) కాలా పత్థర్ పర్వతం ఎక్కాం. మా ట్రెక్ అంతటికీ అత్యున్నత శిఖరం అది. అక్కణ్ణించి సూర్యాస్తమయ సమయంలో కనిపించిన ఎవరెస్ట్ శిఖర దృశ్యం మరువలేనిది. చుట్టూ చేరి ఉన్న హిమగిరుల నడుమ నిటారుగా నిలచి సాయంత్రపు బంగారువర్ణంలో మెరిసిపోయిన ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోని శిఖరాలన్నిటికీ మకుటాయమానంలా శోభించింది. అలాగే ఎవరెస్ట్ బేస్ కాంపుకు చేరువలో మేము పుమోరి పర్వత సానువుల్లో చూసిన హిమపాతదృశ్యం బహుశా నాలాంటి వారికి జీవితంలో ఒక్కసారే కలిగే అనుభవమనుకొంటాను. వేలాది టన్నుల మంచుపెళ్ళలు ఆ సానువులలోంచి జారి పడిపోవడం తలచుకొంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉంటుంది. ఈబీసీ చేరుకొనే చివరి అంకంలో అందరం ఖుంబు గ్లేషియర్ మీదుగా నడవవలసి వచ్చింది. అక్కడికి చేరుకోవడం, ఆ గ్లేషియర్ మీద నడవడం అన్నది మనసునూ శరీరాన్నీ శూన్యతకు గురిచేసే ఒక అతిలోక అనుభవం – మాలో ఎంతోమందికి ఇది కలా నిజమా అన్న భావన కలిగించిన క్షణాలవి.
ఆ అనుభవాలన్నీటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనసంతా ఏదో ఉక్కిరిబిక్కిరి చేసే మధుర భావనతో నిండిపోతున్నట్లు అనిపిస్తోంది. అదంతా జరిగి అప్పుడే ఎన్నో నెలలు గడిచిపోయినా మేమంతా ఇంకా ఆ అనుభవాల దొంతరల నడుమనే తిరుగాడుతున్నామనాలి. అవన్నీ పూర్తిగా మనసులో ఇంకి జ్ఞాపకాల్లో విడదీయలేని భాగమవడానికి బహుశా మరికొంత సమయం పడుతుందనుకుంటాను. వాటి గురించి ఇలా రాయడం ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుందనుకొంటాను.
నిజమే. ఆ ట్రెక్ కఠినమైనదే. భౌతికంగానూ మానసికంగానూ మా శక్తులకు పరీక్ష పెట్టినదే. కానీ ఆ పరీక్షలో అందరం నెగ్గాం. నెగ్గినంత మాత్రాన మేమేదో ప్రపంచాన్ని జయించామనిగాదు – అసలు ఆ పర్వతసీమకు శిరసు వంచి నమ్రతతో నమస్కరిస్తూ వెళ్ళాం కాబట్టే ఆయా శారీరక మానసిక పరీక్షలకు నిలబడి ఫలితం సాధించగలిగామన్న ఎరుక మాకు ఉంది.
ఈబీసీ ట్రెక్‌లో మా చిట్టచివరి మజిలీ 5164 మీటర్ల ఎత్తున ఉన్న గోరక్షెప్ అన్న గ్రామం… రెండు రాత్రుళ్ళు గడిపామక్కడ. ఎవరెస్టుకు దక్షిణాన నేపాల్ దేశపు భూభాగంలో ఉన్న చిట్టచివరి గ్రామమది. ఎవరెస్టుకు ఉత్తర భాగమంతా టిబెట్‌కు చెందుతుంది – చైనావారి అధీనంలో ఉంటుంది.
ఐదేళ్ళ క్రితం ఎవరన్నా ‘పద. హిమాలయాల్లో ట్రెకింగ్ చేసి వద్దాం’ అన్నట్టయితే – ఈబీసీ సంగతి దేవుడెరుగు – నేనో నవ్వు నవ్వేసి, ‘సర్లే వేళాకోళానికి కూడా హద్దుండాలి’ అని ఉండేవాడిని. కానీ అనుకోకుండా 2018లో పరిస్థితి అనూహ్యంగా మారింది. ఆ ఏడాది నాకు 50 నిండాయి.
‘ఈ సందర్భంగా మనకు మనమే సవాలు విసురుకుని ఊహాతీతమైన పని ఏదన్నా చేద్దాం’ అన్నాడు మిత్రుడు విజయ్. ఆ ఆలోచన మమ్మల్ని ఆఫ్రికా ఖండమంతటిలోనూ ఎత్తయిన, 5895 మీటర్ల కిలిమంజారో శిఖరం వేపు నడిపింది. వెళదామని నిర్ణయమయితే తీసుకున్నాంగాని, అది ఎంత పెద్ద సవాలో మాకు అవగాహన లేదు. ఒక రకమైన అమాయకత్వంతో కూడిన నిర్ణయమది. కానీ పరిస్థితులు అనుకూలించాయి. మొక్కవోని దృఢనిశ్చయంగల పదముగ్గురు స్నేహితులని కలుపుకొని ఒక ట్రెకింగ్ బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అనుభవజ్ఞులైన గైడ్‌ల సహకారం లభించింది. 2019 జనవరిలో కిలిమంజారో శిఖరం ఎక్కనే ఎక్కాం. వెళ్ళి వచ్చిన సంగతి ఎలా ఉన్నా ఆ శిఖరారోహణ అనుభవం మాకు ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్పింది. అలాంటి గమ్యాలు పెట్టుకున్నప్పుడు శారీరకదారుఢ్యం ఎంత అవసరమో చెప్పింది. ఏ సూక్ష్మవివరాన్నీ వదలకుండా అన్ని విధాలుగానూ అన్ని పరిణామాలకూ తట్టుకునేలా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమసరళిని రచించుకోవడం ఎంత అవసరమో చెప్పింది.
కిలిమంజారో ఎక్కుతున్నప్పుడు – ముఖ్యంగా శిఖరం చేరిన రోజున – ఇక జీవితంలో ఇలాంటి సవాళ్ళు పెట్టుకోగూడదనుకున్నాను. నా శారీరక శక్తినీ వయసునూ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి దుస్సాహసాలు ఇక చేయగూడదనుకున్నాను. అన్నన్ని రోజులు అంతంత ఎత్తులు ఎక్కడం నాలాంటి వాడికి కూడని పని అనుకున్నాను. కానీ ఇలాంటి అనుభవాలు మనను అంత సులభంగా వదిలిపెట్టవని త్వరలోనే బోధపడింది. పైగా ఆ అనుభవం నా శారీరక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రేరణ కలిగించింది. శారీరక శిక్షణ మీద దృష్టి పెట్టడం నేర్పింది. ఈ పరిణామాలు, హిమాలయాల్లో ట్రెక్ చేయాలన్న బలమైన కోరికా కలగలసి నన్ను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గురించి ఆలోచించేలా చేశాయి.
జనవరి 2019లో కిలిమంజారో ముగించాక మా మిత్రబృందమంతా 2020 ఏప్రిల్-మే నెలల్లో ఈబీసీ ట్రెక్ పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. రెండింటి మధ్యా పదిహేను నెలల వ్యవధి ఉంది కాబట్టి మేము అన్ని రకాల సన్నాహాలు ముగించుకొని మరీ ఈబీసీ వేపు వెళదాం అనుకొన్నాం. 2019 సెప్టెంబర్‌లో పై ప్రణాళిక ప్రకారం వెళ్ళిరావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. శారీరక శిక్షణలో భాగంగా లండన్ దగ్గరలోని మా ఊరు న్యూబెరీ నుంచి బ్రిస్టల్ నగరం దగ్గరి రీడింగ్ వరకూ నూటనలభై కిలోమీటర్ల పాటు కెన్నెత్ అండ్ ఎవాన్ కాలువ వెంబడే స్థానిక మిత్రులం కొందరం కలసి ట్రెక్ కూడా చేశాం.
2020 జనవరిలో చైనాలో కోవిడ్ ప్రభంజనం గురించి వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలు అడపాదడపా వింటూనే ఉంటాం గదా – పెద్దగా పట్టించుకోలేదు. ఫిబ్రవరి వచ్చేసరికి సమస్య చైనాకే పరిమితం కాదనీ ఆ వైరస్ సరిహద్దులు దాటి వ్యాపిస్తోందనీ అర్థమయింది. అయినా అది మా ఈబీసీ ఆలోచనకు అడ్డు రాదనే భావించాం. మార్చికల్లా వైరస్ ఇటలీని తాకింది. మహామహమ్మారి ప్రపంచం మీద విరుచుకు పడుతోందని స్పష్టమయింది. మా ఈబీసీ ప్రణాళికలు వాయిదాపడ్డాయి. అలా ప్రపంచం కోవిడ్ గుప్పెట్లో రెండేళ్ళపాటు విలవిలలాడింది. ప్రతి దేశాన్ని, ప్రతి ఒక్కరినీ వేధించి పీడించింది కోవిడ్.
అలా మా ఈబీసీ ట్రెక్ నిరవధికంగా వాయిదాపడినా మేము నిరాశకు గురవలేదు. నిర్వ్యాపారతను దగ్గరకు చేరనివ్వలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే ఈబీసీ యాత్ర చేపట్టాలి అన్న మా సంకల్పం ఏ మాత్రం సడలలేదు. అలా చేపట్టేందుకు అనువుగా మమ్మల్ని మేము శారీరకంగా సర్వసిద్ధంగా ఉంచుకోవడం మీద దృష్టిని కేంద్రీకరించాం. కోవిడ్ లాక్‌డౌన్ సమయాల్లో స్థానికంగా సుదీర్ఘమైన ట్రెక్‌లు చేశాం. ఠేమ్స్ పాత్ (320 కిలోమీటర్లు) సౌత్ డౌన్స్ వే (160 కిలోమీటర్లు) క్లీవ్‌లాండ్ వే (175 కిలోమీటర్లు) కాట్స్‌వోల్డ్స్‌వే (160 కిలోమీటర్లు), రిట్జ్‌వే (140 కిలోమీటర్లు) – ఇలా యు.కె.లోని విభిన్న ప్రదేశాలలో ట్రెక్‌లు చేశాం.
అలాగే అక్టోబరు 2021లో మొరాకోలోని హై ఆట్లస్ పర్వతశ్రేణిలో మూడు రోజులపాటు పధ్నాలుగుమందిమి ట్రెక్ చేశాం. ఉత్తర ఆఫ్రికా అంతటికీ ఎత్తయిన 4167 మీటర్ల మౌంట్ తుబ్‌కల్ పర్వతం ఎక్కాం. దానంతట అదే ఒక చిరు విజయం అన్నమాట అటుంచి ఉన్నత పర్వతశ్రేణిలో చేయాలనుకుంటున్న ఈబీసీ ట్రెక్‌కు ఈ మౌంట్ తుబ్‌కల్ శిఖరారోహణ చక్కని పూర్వసాధనగా పరిణమించింది. అలాగే 2022 మే నెలలో స్కాట్లండ్ పర్వతసీమలో వారం రోజులపాటు ట్రెక్ చేశాం. గ్లాస్గో నుంచి ఫోర్ట్ విలియమ్ దాకా వెస్ట్ హైలాండ్ వే అన్న 154 కిలోమీటర్ల ట్రెక్ బాటలలో కొండలూ గుట్టల దొంతరలను అధిగమిస్తూ నడిచాం. దారిలో మౌంట్ బెన్ నెవిస్ అన్న యు.కె.లోని అత్యున్నత శిఖరమూ ఎక్కాం. ఈ శిఖరానికి ఎత్తు పరంగా ఈబీసీతో ఏ మాత్రం పోలిక లేకపోయినా ఆ వారం రోజులూ మేము నడచిన ఎత్తు పల్లాల బాట, చేయబోయే హిమాలయాల ట్రెక్‌కు నాంది పలకడంలో కొంతవరకూ తన వంతు పాత్ర పోషించింది.
నేపాల్ హిమాలయాల్లో ట్రెకింగ్ చెయ్యడానికి స్థూలంగా రెండు సీజన్లు ఉన్నాయి: వసంతకాలంలో మార్చి నెల నడుమనుంచి మే నెలాఖరువరకూ మొదటి సీజనయితే, ఆకురాలు కాలంలో అక్టోబరు నవంబరు నెలలు రెండవ సీజను. ఎవరెస్ట్ శిఖరారోహణకు ఉపక్రమించేవారికి వసంతకాలం అన్నివిధాలా అనుకూలమయినది. బృందాలు బృందాలుగా శిఖరారోహకులు ఏప్రిల్ నెల చివరిరోజులలో వచ్చి, స్థానిక సహాయకులతో సహా బేస్ కాంప్ చేరుకుని, మే నెల మొదటి భాగంలో శిఖరారోహణకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చలికాలం ముగిసిపోయి వసంతకాలపు నులివెచ్చని ఎండ కమ్ముకునే కాలమిది. ఇది దాటాక జూన్, జులై, ఆగస్టు నెలలలో వర్షాలు పడతాయి. మళ్ళా సెప్టెంబరు నడుమదాకా ట్రెకింగ్ సాధ్యపడదు. అక్టోబర్ నెల వసంతకాలంతో పోలిస్తే చల్లగా ఉంటుందన్న మాట నిజమే అయినా ఈబీసీ ట్రెక్‌కు అక్టోబర్ నెలే సరైనది. ఆ నెలల్లో ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది. హిమాలయాల దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దానికి తోడు ఆ నెలలో బేస్ కాంపుకు ఎవరెస్ట్ శిఖరారోహకుల తాకిడి ఉండదు. ఈబీసీ ట్రెకర్లు మాత్రమే ఉంటారు కాబట్టి రద్దీ తక్కువ.
జనవరి 2022 కల్లా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ అదుపులోకి వచ్చింది. దైనందిన జీవితం మళ్ళా గాడిలో పడింది. నిజానికి మా ఈబీసీ ట్రెక్‌ను ఏప్రిల్ 2022 లో పెట్టుకునే అవకాశం ఉంది. అయినా మరి కాస్త వ్యవధి ఉంటుంది గదా అని అక్టోబర్ నెలను ఎంచుకున్నాం. పైన చెప్పిన కారణాలు ఉండనే ఉన్నాయి.
ఈబీసీ ట్రెక్ అన్న ఆలోచన వచ్చినపుడు మా బృందపు సభ్యుల సంఖ్య పది. నాతోపాటు యు.కె.నుంచి కిలిమంజారో వచ్చిన సింహం, గోపి; యు.అ.ఎ.కి చెందిన విజయ్, మోహన్; ఒమాన్ నుంచి రాఘవ, మనోజ్… వీరితోబాటు కెనడానుంచి వంశీ, ఇండియానుంచి దీపు బృందంలో చేరారు. ట్రెక్ సంగతి విన్నాక బృందంలో చేరేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఇంగ్లండ్ నుంచి కిషోర్, వేణు, అకలంక, వివేక్ వచ్చి కలిశారు. వేల్స్ నుంచి తిరు వచ్చి చేరాడు. అలాగే టెక్సస్ నుంచి మా మెడికల్ కాలేజీ క్లాస్‌మేట్ అనితారాణి, ఆమె కజిన్ ఉమాదేవి, ఇలినాయ్ నుంచి అరుణ్, టెక్సస్ నుంచి మధు, ఆరిజోనా నుంచి శ్రీని, వాషింగ్టన్ డిసి నుంచి సతీష్ – అంతా కలసి అమెరికానుంచి మొత్తం ఆరుగురు. అలాగే ఇండియానుంచి మరో ముగ్గురు – అనిల్, దిలీప్, మురళి – వచ్చి చేరారు. మొత్తం ఇరవై మూడుమందిమి అయ్యాం. ఏడు దేశాలకు చెందిన పెద్ద బృందం మాది. అందులో పన్నెండుమంది డాక్టర్లు. మిగిలినవాళ్ళు ఐటీ రంగానికీ, బిజినెస్ రంగానికీ చెందినవారు. ప్రకృతి మీద ప్రేమ, గాఢమైన యాత్రాపిపాస మా అందరినీ దగ్గరికి చేర్చి ఒకే మాట ఒకే బాట అంటూ సాగిపోయే పటిష్టమైన బృందంగా చేసింది. ఆ బృందానికి నాయకత్వం వహించే బాధ్యత, గౌరవం నాది.
వేరువేరు దేశాలకు చెందిన మా ఇరవై ముగ్గురమూ 2022 అక్టోబర్ 15 కల్లా ఖాట్మండూ చేరుకోవాలని అనుకొన్నాం. అక్టోబరు పదహారున ఖాట్మండూ నుంచి హెలికాప్టర్‌లో లుక్లా అన్న గ్రామం చేరుకొన్న తర్వాత మా కాలినడక మొదలవుతుంది. అంటే ట్రెక్‌లో అది మొదటి రోజన్నమాట. అలా నడచి నడచి పదో రోజున మా గమ్యం – ఎవరెస్ట్ బేస్ కాంప్ – చేరుకుంటాం. పదకొండవ రోజున, హెలికాప్టర్ సదుపాయం విరివిగా వాడి సాయంత్రానికల్లా ఖాట్మండూ తిరిగి వస్తాం. స్థూలంగా ఇదీ మా ప్రణాళిక.
లండన్ నుంచి ఖతార్ రాజధాని దోహా మీదుగా అక్టోబర్ 15న నేను ఖాట్మండూ చేరుకున్నాను. అక్కడి త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని ఫామ్స్ నింపి, ఏభై డాలర్లు కట్టి, మూడు నెలలపాటు చెల్లే వీసా తీసుకున్నాను. నవ్వొచ్చింది. 2004లో నేనూ నా సహచరి హేమ నేపాల్ వచ్చినపుడు మా ఇండియన్ పాస్‌పోర్ట్‌ల పుణ్యమా అని ఏ ఫీజూ ఫారమూ లేకుండా నేపాల్ పౌరుల్లానే చకచకా నడుచుకొంటూ ఎయిర్‌పోర్ట్ దాటి బయటకు వెళ్ళాం. ఇపుడు మాది యు.కె. పాస్‌పోర్టు. పశ్చిమ దేశాల పాస్‌పోర్ట్ కన్నా ఇండియా పాస్‌పోర్ట్‌కు విలువ ఎక్కువ ఉన్న అరుదైన ప్రదేశాలలో ఖాట్మండూ ఒకటన్నమాట! ముందు అనుకున్న ప్రకారం బృందపు సభ్యులు అందరూ ఒకరొకరుగా అదే రోజున ఖాట్మండూ చేరారు.
విమానాశ్రయంలో మాకు హిమాలయన్ ట్రెకింగ్ ఏజెన్సీకి చెందిన సూర్య శ్రేష్ఠ స్వాగతం పలికాడు. ‘నమస్తే’ అంటూ అందరికీ మెడలో సంప్రదాయబద్ధంగా కండువాల్లాంటివి వేసి మరీ ఆహ్వానించాడు. పూలమాలలతో సత్కరించాడు. 2019లో మొట్టమొదటిసారిగా అతనితో మా ఈబీసీ ట్రెక్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఎన్నెన్నోసార్లు మా టెలిఫోన్ సంభాషణలు నడిచాయి. ఈనాటికి ప్రత్యక్షంగా కలవగలిగాను. మనిషి సౌమ్యుడు. మా మధ్య అప్పటికే చక్కని స్నేహం ఏర్పడి ఉంది.
మాంచెస్టర్‌నుంచి వచ్చిన మా బృందంలోని అకలంక అన్న సభ్యుని చెకిన్ లగేజి ఎక్కడో చిక్కడిపోయి గమ్యం చేరలేదు. ఆ చేరని లగేజిలో మిగతా వస్తువుల సంగతి ఎలా ఉన్నా అతని బ్రోకెన్ ఇన్ షూస్ కూడా ఉన్నాయి. బ్రోకెన్ ఇన్ షూస్ అంటే కుట్లు విడిపోయి అడుగులు విరిగిన బూట్లు అనుకోకండి. ట్రెకింగ్ పరిభాషలో అప్పటికే బాగా వాడి, మృదువుగా మారి, మన పాదాలకు అనువుగా అమరిపోయినవి అని అర్థం. ఇంకే వస్తువు పోయినా కొత్తది కొనుక్కోవచ్చు; బ్రోకెన్ ఇన్ షూస్ విషయంలో అది సాధ్యం కాదుగదా! నాదో సలహా… పెద్ద పెద్ద ట్రెక్‌లు పెట్టుకున్నప్పుడు సరికొత్త బూట్లతో ఎప్పుడూ వెళ్ళకండి. కాళ్ళకీ చీలమండలకీ అది సమస్య కావచ్చు. హీనపక్షం కాళ్ళు బొబ్బలెక్కడం ఖాయం. అంచేత బాగా వాడి కాళ్ళకు మాలిమి అయిన బ్రోకెన్ ఇన్ షూస్ మాత్రమే తీసుకెళ్లండి. అలాగే ఆ షూస్‌ను చెకిన్ లగేజీలో ఉంచకండి – మీ కాబిన్ లగేజిలో పెట్టుకోండి. అసలు కాళ్ళకు అవే వేసుకుని విమానం ఎక్కడం ఇంకా ఉత్తమం.
మేమంతా మా మొబైళ్ళకు లోకల్ సిమ్‌కార్డులు తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో ఏ కొత్త దేశం వెళ్ళినా అలా తీసుకోవడం నాకు అలవాటయిపోయింది. అసలీ మొబైల్ ఫోన్లు లేని కాలంలో మనం ఎలా బ్రతికామా అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాటి ప్రయోజనం, అవసరం నిస్సందేహం. కానీ వాటిమీద ఒక యాత్రికుడిగా నాకో పెద్ద ఫిర్యాదు ఉంది: యాత్రాసౌరభానికి మొబైళ్ళు కలిగించినంత హాని మరే ఉపకరణమూ కలిగించదనుకొంటాను. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మన ఇల్లూ మన ఆఫీసూ మన వెంట వెంటే ఉంటాయి! మన రోజువారీ కార్యసరళి నీడలాగా మనల్ని వదలదు. రొటీన్ నుంచి విడివడి యాత్రల్లో విభిన్నంగా రోజులు గడపాలన్న కాంక్ష కాంక్షగానే మిగిలిపోతుంది. మరిక ప్రయాణాలూ యాత్రలూ చేసి ఏం ప్రయోజనం?!
విమానాశ్రయంనుంచి ఖాట్మండూలోని మా హోటలు చేరుకోడానికి అరగంట పట్టింది. గజిబిజి వాహనాలు, అడుగడుగునా గందరగోళం, శబ్దాలు, దృశ్యాలు, వాసనలు – మనమిప్పుడు భారత ఉపఖండంలో ఉన్నాం అని నొక్కి చెప్పాయి. ఖాట్మండూలో మేముండేది హోటల్ మల్బరీ అన్న చోట. అది థమెల్ అన్న ప్రాంతంలో ఉంది. అసలు ఖాట్మండూనే ప్రపంచపు ట్రెకింగ్ రాజధాని అనుకుంటే ఈ థమెల్ ప్రాంతం ఆ ఖాట్మండూకు గుండెకాయలాంటిది. ఎటు చూసినా టూరిస్టులు, ట్రెకర్లు… అక్కడి షాపుల్లో ట్రెకింగుకు అవసరమైన పిన్నీసునుంచి పిక్ఏక్స్ దాకా ఏ వస్తువైనా దొరుకుతుంది.
తీరిగ్గా హోటల్లో విశ్రాంతి తీసుకున్నాక అందరం సాయంత్రం వేళ ఊళ్ళోని పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళాం. ఆ వేళపుడు దీపాలూ మంత్రాలతో జరిగే ఆరతి ఉత్సవం చూడాలన్నది మా కోరిక. ఆ శివాలయంలో పశుపతినాథుడు మూలవిరాట్టు. ఖాట్మండులోని భాగమతి నది ఒడ్డున ఉందా ఆలయ ప్రాంగణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ముఖ్యమైన యాత్రాస్థలాల్లో పశుపతినాథ మందిరం ఒకటి.
పశుపతినాథ మందిరం దగ్గర నది ఒడ్డున కాలుతోన్న కాష్ఠాలు కనిపించాయి. 2001లో ఈ శ్మశానభూమి అంతర్జాతీయంగా వార్తలలోకి ఎక్కడం గుర్తొచ్చింది. అప్పటి రాచకుటుంబానికి అంత్యక్రియలు జరిగిన ప్రదేశమది. ఏదో విషయంలో తీవ్రంగా అసంతృప్తి చెందిన యువరాజు దీపేంద్ర మొత్తం రాజకుటుంబీకులందరినీ కాల్చి చంపిన సమయమది. రాజు బీరేంద్ర, మహారాణి ఐశ్వర్య రాజ్యలక్ష్మి, ఇతర రాజకుటుంబీకులందరినీ కాల్చి చంపాక దీపేంద్ర చివరికి తనను తాను కాల్చుకున్నాడు. తాను ప్రేమించిన యువతితో వివాహానికి తలిదండ్రులు ఒప్పుకోకపోవడంవల్ల అతనలా చేశాడు అన్నది రాజ్యాధికారులు చెప్పే మాట. ‘అదేం కాదు, రాజుగారి తమ్ముడు జ్ఞానేంద్ర సింహాసనంకోసం పన్నిన కుట్ర ఫలితమా హత్యాకాండ’ అన్నది నేపాలు ప్రజానీకం నమ్మే మాట. మా ట్రెక్ సమయంలో స్థానికులు – మా గైడ్‌లు కూడా – ఆమాటే చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆ హత్యాకాండ తర్వాత జ్ఞానేంద్ర సింహాసనం ఎక్కనే ఎక్కాడు. కానీ 2008లో ఆయన్ని గద్దె దింపేశారు. అప్పటిదాకా హిందూరాజ్యంగా ఉన్న నేపాల్ తనను తాను గణతంత్ర రాజ్యం – రిపబ్లిక్‌గా ప్రకటించుకొంది.
ఆ పశుపతినాథ ఆలయాన్ని నేపాలీ పగోడా శైలిలో నిర్మించారు. ఆలయంలో ప్రతి అణువూ అపూర్వ శిల్పసంపదతో నిండి ఉంది. ఆరతి ఉత్సవాన్ని భాగమతి నదీ తీరాన జరిపారు. ఎన్నెన్నో ప్రమిదలు గలిగిన దీపపు సెమ్మెలను ఎంతో నేర్పుగా లయబద్ధంగా కదుపుతూ అర్చకులు నదికి హారతి పట్టారు. పవిత్ర మంత్రోచ్ఛారణ ఆ తీరప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చూసి తీరవలసిన మరపురాని ఉత్సవమది.
మేమిలా ఊళ్ళోని విశేషాలు చూస్తోన్న సమయంలో మా సూర్య శ్రేష్ఠ, విడతలు విడతలుగా వస్తోన్న మా బృందపు సభ్యులకు స్వాగతం పలకడంలో నిమగ్నమై పోయాడు. అలా ఖతార్‌నుంచి వచ్చిన ఒక విమానంలో మా అకలంక లగేజి వచ్చేసింది. అందరికీ గొప్ప సంతోషం కలిగింది.
బాగా పొద్దుపోయాక బృందపు సభ్యులం పరిచయ సమావేశం పెట్టుకున్నాం. అందరం ముఖాముఖిన కలుసుకోవడం అదే మొదటిసారి. సుమారు రెండు వారాలపాటు మేమంతా ఒకే జట్టుగా, ఒకే కుటుంబపు సభ్యుల్లా, విలక్షణమైన హిమపర్వతసీమల్లో ట్రెకింగ్ చేయబోతున్నాం!
అక్టోబర్ 16, 2022. మా ట్రెకింగ్‌లో మొదటిరోజు.
బాగా ఉదయమే మేమంతా ఖాట్మండూ విమానాశ్రయం చేరుకున్నాం. అక్కణ్ణించి సముద్రతలానికి 2846 మీటర్ల ఎత్తున ఉన్న లుక్లా పట్టణానికి ఆకాశమార్గాన హెలికాప్టర్లలో వెళ్ళాలన్నది మా ప్రణాళిక.
లుక్లాలోని విమానాశ్రయానికి 1953లో మొట్టమొదటిసారి ఎవరెస్టును అధిరోహించిన వీరుల గౌరవార్థం హిలరీ-టెన్సింగ్ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టారు. ఆ విమానాశ్రయానికి ప్రపంచంలోని ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒకటి అన్న ‘ఖ్యాతి’ ఉంది. అక్కడ విమానం దింపాలంటే పైలట్లకు ఎంతో నైపుణ్యం ఉండాలి. మేము హెలికాప్టర్లో వెళ్ళాం కాబట్టి మాకా కష్టం అంతగా అనుభవంలోకి రాలేదుగానీ మా పక్కనే రన్‌వే మీద దిగుతోన్న విమానాలను చూసినప్పుడు అది స్పష్టంగా తెలిసింది.
లుక్లా విమానాశ్రయం పర్వతసీమలో ఉంది. అక్కడి రన్‌వే బాగా చిన్నది: 527 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు. ఆ రన్‌వే ఒక కొస పర్వతముఖం దగ్గర ఉంటే, రెండో కొస 700 మీటర్లు లోతున్న లోయ దగ్గర అంతమవుతుంది. కావాలనే రన్‌వేను పర్వతముఖం కేసి 12 డిగ్రీల ఎగువ వాలు ఉండేలా నిర్మించారు. దానివల్ల విమానం దిగేటపుడు దాని వేగం మామూలుకన్నా త్వరగా అదుపులోకి వస్తుంది. అలాగే టేకాఫ్ సమయంలో మామూలుకన్నా త్వరగా వేగం అందుకోగలుగుతుంది. అంటే పైలెట్లు విమానాన్ని 12 డిగ్రీల దిగువ వాలులో వేగంగా టేకాఫ్ చేయించి రన్‌వే ముగిసిన వెంటనే దాన్ని గాలిలో స్థిరపరచాలన్నమాట. ఇదే ప్రక్రియ లాండింగ్ చేసేటప్పుడు విలోమక్రమంలో సాగుతుంది. అదనపు నైపుణ్యమూ అనుభవమూ లేని పైలెట్లు ఈ విన్యాసాలు చేయలేరు. సహజంగానే అక్కడకి 20 పాసింజర్లను మాత్రమే తీసుకువెళ్ళే అతి చిన్న విమానాలే వెళ్ళి రాగలవు. కాని, హెలికాప్టర్ల విషయం వేరు. అవి రన్‌వే ప్రమేయం లేకుండా పైనుంచి తిన్నగా దిగిపోగలవు. నిర్మాణరీత్యా వాటికి ఇలాంటి విషయాల్లో విమానాలకన్నా వెసులుబాటు ఎక్కువ. అంచేత టేకాఫ్-లాండింగుల విషయంలో ఇలాంటి చోట్ల అంతగా ఇబ్బంది పడవు.
మా బృందసభ్యులమంతా ఈ ఖాట్మండూ-లుక్లా ప్రయాణం విమానంలో చేద్దామా హెలికాప్టర్‌లోనా అన్న విషయం బాగా చర్చించుకున్నాం. పైన చెప్పిన కారణాలే కాకుండా పరిసరాల్లోని వాతావరణపు ఒడిదుడుకులను ఎదుర్కోవడం విషయంలోనూ హెలికాప్టర్లదే కాస్తంత పై చెయ్యి. వాతావరణ కారణాలవల్ల ఖాట్మండూ-లుక్లా విమానాలు రద్దవడం అతి సాధారణం అని విని ఉన్నాం. ఒకసారి మా విమానం కాన్సిలవడమంటూ జరిగితే మా మొత్తం ప్లాను మీద ఆ ఒత్తిడి బాగా పడుతుంది. హెలికాప్టర్లయితే వాతావరణం కాస్తంత అనుకూలంగా లేకపోయినా నడుస్తాయి, గమ్యం చేరుస్తాయి.
ఈ అంశాలన్నీ బేరీజు వేశాక భారీ అదనపు ఖర్చు ఉన్నా అందరం హెలికాప్టర్ ప్రయాణానికే మొగ్గు చూపాం.
నేపాల్లో ప్రయాణీకుల్ని తీసుకువెళ్ళే హెలికాప్టర్లలో పైలెట్‌తో కలసి ఆరుగురు ఎక్కవచ్చు. హెలికాప్టర్లలోకూడా విమానాల్లో ఉన్నట్లే చెకిన్ ప్రక్రియ ఉంటుంది. అది ముగించాక మా అందరినీ హెలిపాడ్ దగ్గరి వెయిటింగ్ పాయింటుకు తీసుకు వెళ్లారు. అక్కణ్ణించి సుదూర దిగంతంలో హిమశిఖరాలు వరుసతీరి కనిపించాయి. ‘మీరంతా హిమాలయసీమలో ఉన్నారు సుమా’ అని ఆ శిఖరాలు మాకు చెపుతున్నట్లు అనిపించింది. ఆ దృశ్యం పుణ్యమా అని అందరిలోనూ చిన్నపాటి ఉత్తేజం చోటు చేసుకుంది.
మేము వెళుతోన్న హెలికాప్టర్ కంపెనీ పేరు సిమ్రిక్ ఎయిర్. ఒక్కో హెలికాప్టర్లో ఐదుగురు ఐదుగురు చొప్పున ఎక్కాం. నేనెక్కిన కాప్టర్ పేరు నిమ్స్ దాయ్. దానికి ఆ పేరు నిమ్స్ దాయ్ పుర్జ అన్న నేపాలీ మూలాల బ్రిటిష్ పర్వతారోహకునినుంచి వచ్చింది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చెయ్యడానికి కాస్తంత ముందు ఈ నిమ్స్ పుర్జ, ప్రపంచంలో 8000 మీటర్ల ఎత్తును దాటి ఉన్న పధ్నాలుగు శిఖరాలనూ ఆరు నెలల ఆరు రోజుల్లో అధిరోహించాడు. ఓ తిరుగులేని రికార్డు స్థాపించాడు. ఆ రికార్డు స్థాపనాక్రమంలో ఆ మహాపర్వతారోహకుడు మా పైలట్ నడిపిన హెలికాప్టర్లో ప్రయాణించాడట. ఆ విషయం మా పైలటే సగర్వంగా చెప్పుకొచ్చాడు. ఆ ప్రయాణం పుణ్యమా అని ఈ హెలికాప్టరుకు నిమ్స్ దాయ్ అన్న పేరు పెట్టారు.
ఫోటోలు తీయాలి అన్న మిషతో నేను పైలట్ పక్క సీట్లో కూర్చున్నాను. మిగిలిన నలుగురు మిత్రులూ పాపం వెనక సీట్లలో సర్దుకున్నారు. ఖాట్మండూ లోయను చుట్టుముట్టి ఉన్న పర్వతాల మీదుగా ఈశాన్యదిశలో ఉన్న లుక్లా పట్టణం కేసి సాగిపోయాం. వాతావరణం బాగా వేడిగా ఉంది. దిగువన లోయలు, నదులు, దూరాన క్షితిజంలో హిమగిరి శిఖరాలూ స్పష్టంగా కనిపించాయి. ప్రయాణసమయంలో మా పైలట్ దారిలో కనిపించే హిమ శిఖరాలను పరిచయం చేస్తూ వెళ్ళాడు. అందులో ఒకటి స్వయానా ఎవరెస్టే! పరిసరాల్లోంచి స్ఫుటమైన పిరమిడ్‌లా ఆకాశంలోకి ఎగసి కనిపిస్తోన్న ఆ పెనుపర్వతాన్ని ఈ ట్రెక్‌లో చూడటం మా అందరికీ అదే మొదటిసారి. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం 2004లో నేను నేపాల్ నుంచి భూటాన్‌కు విమానంలో వెళుతున్నప్పుడు ఆ శిఖరం లీలగా కనిపించిన గుర్తు.
లుక్లా పట్నానికి కాలిబాటలూ విమానమార్గమూ తప్ప బయట ప్రపంచంతో సంపర్కానికి మరో మార్గం లేదు. మోటారుబండ్లు వెళ్ళే రోడ్లు అన్న ప్రసక్తే లేదు. అయితే ఆకాశమార్గాన చేరాలి. లేదూ భూతలం మీదే చేరతాం అంటే జిరి అన్న పట్టణం దాకా వాహనాల్లో వచ్చి ఆ పైన మూడు-నాలుగు రోజులపాటు లుక్లాకు ట్రెక్ చేయాలి. లుక్లా చేరేవాళ్ళలో చాలామంది ఆకాశమార్గమే ఇష్టపడే మాట నిజమే కాని, తక్కువ బడ్జెట్లో ప్రయాణం చేసే కొద్దిమంది బ్యాక్‌ప్యాకర్లు, సంప్రదాయసిద్ధంగా ట్రెక్ చేయాలని ఇష్టపడేవాళ్ళూ కాలినడకనే జిరి నుంచి లుక్లా చేరుకుంటారట. ఇపుడు నేపాల్ ప్రభుత్వం జిరి-లుక్లాల మధ్య రోడ్డు వేయాలని చూస్తోందట. ఇది ఒక రకంగా స్వాగతించవలసిన విషయమే అయినా సుదూరపు పర్వతాల మధ్యన ఉండి, తన కేసి ప్రతి సంవత్సరం వేలాది యాత్రికులను రప్పించుకొంటున్న లుక్లా మార్మికతకు ఈ రోడ్డు నిర్మాణం గండి కొడుతుందనడంలో సందేహం లేదు. రోడ్డు పడితే ఆ మార్మిక ఆకర్షణ అన్నది గత కాలపు విశేషంగా మిగిలిపోతుంది.
నలభై నిముషాల హెలికాప్టర్ ప్రయాణం తర్వాత లుక్లా చేరాం. చేరగానే అక్కడి మా సహాయక బృందాన్ని కలుసుకున్నాం. ఆ బృందంలోని గైడ్‌లు, పోర్టర్‌లని మా ఛీఫ్ గైడ్ – బాబు గురంగ్ – మాకు పరిచయం చేశాడు. రేషమ్, సూర్య, భీమ్, ప్రకాశ్, గోర్కా అన్నవాళ్ళు మాతోబాటు ట్రెక్‌లో ఉండే అసిస్టెంట్ గైడ్‌లు. వాళ్ళంతా నిన్నటి రోజున ఖాట్మండూనుంచి విమానంలో లుక్లా చేరారట.
పోర్టర్లందరూ స్థానిక గ్రామాలకు చెందినవాళ్ళు. వాళ్ళలో కొంతమంది రెండు మూడు రోజులు – రోజుకు పన్నెండు గంటలు – నడిచి మా యాత్ర కోసం లుక్లా వచ్చారట. వారికి రెండు-మూడు రోజులు పట్టిన నడక బయటినుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకయితే రెట్టింపు సమయం పట్టడం తథ్యం. వాళ్ళందరితోనూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కలసి టీ తాగుతూ మేమంతా తీరికైన సమయం గడిపాం. చూస్తోంటే వాళ్ళందరూ మాలాంటి బృందాలతో ఎన్నెన్నోసార్లు ఈబీసీ లాంటి ట్రెక్‌లు చేసి ఉంటారనిపించింది. అది వారి వృత్తి కదా… అక్కడి భూమిపుత్రులు వాళ్ళు… కొండలన్నీ వారికి కొట్టిన పిండి… అక్కడి ప్రకృతిలో వాళ్ళు విడదీయలేని భాగం. మాకెవరికీ నేపాలీ భాష రాకపోయినా మాకులాగానే వాళ్ళందరికీ ఎంతో కొంత హిందీ వచ్చు. ఇక గైడ్‌లయితే చక్కని ఇంగ్లీషు మాట్లాడారు.
మా సామానంతా ఒకే పరిమాణంలో ఉండి, మోసుకు వెళ్ళడానికి అనువుగా ఉండే డఫెల్ బ్యాగ్‌లలో సర్ది పెట్టాం. ఏ బ్యాగూ 12.5 కిలోలు మించకూడదన్నది అక్కడి నియమం. ఒక్కో పోర్టరూ అలాంటి రెండు బ్యాగులు మోస్తాడు – అంటే 25 కిలోలన్నమాట. దానికి తోడు వాళ్ళ వ్యక్తిగత వస్తువులు ఉండనే ఉంటాయి. మా లగేజి మోస్తూ వాళ్ళంతా దాదాపు రెండు వారాలు మాతో ఉంటారు. మావరకూ మేము మా నిత్యావసర వస్తువుల్ని తలా ఒక బ్యాక్‌ప్యాక్‌లో సర్దుకున్నాం: రెండు లీటర్ల మంచినీళ్ళు, కాసినన్ని తినుబండారాలు, వేసుకున్న దుస్తులు కాకుండా అదనంగా మరికొన్ని – గ్లవ్స్, హెడ్ లైట్స్, ఇతర వస్తువులు – అంతా కలసి ఐదారు కిలోలు.
లుక్లా చాలా అందమైన పట్టణం. ఊరి మెయిన్ రోడ్ అంతా ట్రెకర్లకు అవసరమయిన సామాన్లు దొరికే దుకాణాలతో నిండి ఉంది. అసలు ఊరు ఊరంతా ట్రెకింగ్‌నే ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తోందనిపించింది. బలిసిన శునకాలు రోడ్డు నడిమధ్యన ఏ చీకూ చింతా లేకుండా తిరుగుతున్నాయి. ట్రెకర్లూ పోర్టర్లూ వాటి స్వేచ్ఛను గౌరవిస్తూ, వాటి జోలికి పోకుండా రోడ్డు మీద తప్పుకుని మరీ వెళుతున్నారు. నేను కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేశాను. పొరపాటున కూడా వాటి మీద కాలు పడకుండా చూసుకున్నాను. ట్రెక్ మొదటిరోజే కుక్క కాటుకు గురి అవడం, యాంటీ రేబీస్ ఇంజక్షన్లు తీసుకోవడం ఎవరికి ఇష్టముంటుందీ?!
కాసేపట్లో మేమంతా పసాంగ్ లామో మెమోరియల్ గేట్ దగ్గర మొదలయ్యే కొండబాట దగ్గరికి చేరుకున్నాం. ఈ పసాంగ్ లామో అన్న వ్యక్తి ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి నేపాలీ మహిళ అట. ఎవరెస్ట్ చుట్టూ ఉన్న విశాలప్రాంతమంతటినీ నేపాల్ ప్రభుత్వం 1976లో సగర్మాత నేషనల్ పార్కుగా ప్రకటించింది. 1979లో యునెస్కో వాళ్ళు దానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చారు. మా గైడ్ బాబు గురంగ్ ఆ పార్కు ఆఫీసు దగ్గర మా ఎంట్రీ పాసులు తీసుకునే పనిలో పడ్డాడు. ఆ పక్కనే ఒక పటిష్టమైన తెల్లని కట్టడం కనిపించింది. చూడటానికి ఏదో ధార్మిక చిహ్నంలా అనిపించింది. నలుచదరపు పీఠం, ఆ పీఠం మీద మెట్లు మెట్లుగా క్రమక్రమంగా చిన్నవవుతోన్న ఘనాకారపు నిర్మాణాలు, వాటి అన్నిటికీ పైన ఓ గోపురం, ఆ గోపురానికి పైన నిలిచిన బంగారు రంగు స్తంభం – అర్థమయింది. అది ఒక బౌద్ధ చోర్టన్ (Chorton) – స్తూపం. సర్వవ్యాప్తమైన బుద్ధుని ఉనికికి ప్రతీకలు ఈ నేపాలీ చోర్టన్లు.
మేమున్న చోట పైన్ వృక్షాల తలల మీదుగా నుప్లా హిమ శిఖరం కనిపించింది. 6000 మీటర్ల ఎత్తును దాటిన శిఖరమది. ఆ శిఖరాన్ని నేపథ్యంగా చేసుకుని మేమంతా అక్కడ గ్రూప్ ఫోటోలు దిగాం.
ఈలోగా బాబు గురంగ్ ఎంట్రీ పాసులు తీసుకుని వచ్చాడు. మా ఎవరెస్ట్ బేస్ కాంప్ ట్రెక్‌ను ఆరంభించాం. నేపాల్‌లోని ఖుంబు ప్రాంతంలో లుక్లా పట్నం శివార్లలో అక్టోబర్ పదహారో తారీఖు ఉదయం పదకొండు గంటలకు మా చారిత్రాత్మక పాదయాత్ర ఆరంభమయింది. అందరి మనసులూ ఉద్వేగంతో నిండిపోయాయి. నా వరకూ నాకు ‘ఇది కల కాదు సుమా! వాస్తవం! నిజంగా మేమంతా ఈబీసీ ట్రెక్ ఆరంభించాం’ అని పదే పదే చెప్పుకోవలసి వచ్చింది. ఆ మధ్యవరకూ ఏ హిమాలయాలయితే నాకు అందని చందమామలని భావించానో, ఏ నడక అయితే నా స్థాయికి మించిందని భావించానో అదిగో ఆ ఎవరెస్ట్ నడక నిజంగా ఆరంభించానన్న మాట నన్ను ఆనందవిహ్వలుణ్ణి చేసింది.
ఈ నడక ఆరంభించామూ అంటే దిగువ హిమాలయాల్లో బయలుదేరిన మేము, క్రమక్రమంగా ఎగువ హిమాలయాల్లోని హిమశిఖరాలకేసి వెళుతున్నామన్నమాట. ఈ ఎరుక నాలో ఒకేసారి రెండు బలమైన భావనలకు కారణమయింది: నమ్రత, వినమ్రత; ఎనలేని ఉత్సాహం, ఉద్వేగం. టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిలరీ, రీన్ హర్డ్ మెసినర్, బచేంద్రి పాల్, కామి రీటా షెర్పా, నిమ్స్ దాయ్ పుర్జ – ఇలాంటి గిరివీరుల అడుగులలో అడుగు వేస్తున్నానన్నమాట. వాళ్ళందరిలాగా నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కకపోవచ్చు, కానీ బేస్ కాంప్ దాకా వారు పరచిన, వారు నడిచిన త్రోవలోనే నా అడుగులు పడుతున్నాయి కదా…
హిమాలయాల్లో ట్రెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడి షెర్పా పోర్టర్లు నిర్వహించే పాత్ర, అందించే సహాయం ఎనలేనిది. ఏ ట్రెక్‌కైనా వారే జవజీవాలు. వారే లేకపోతే అసలు ఏ ట్రెక్ కూడా సాధ్యం కాదు. మేమంతా ఒక చిన్న గ్రామం మూటా ముల్లే సర్దుకొని ముందుకు సాగిపోతున్న రీతిలో మా నడక సాగించాం. 23 మంది ట్రెకర్లు, ఆరుగురు గైడ్‌లు, 20 మంది పోర్టర్లు – అంతా కలసి నలభై తొమ్మిది. మా ట్రెకర్లమంతా అక్కడి సుందర దృశ్యాలను మనసులోకి ఇంకించుకొంటూ, నచ్చిన చోట ఫోటోలు తీసుకొంటూ, ఏ హడావుడీ లేకుండా నింపాదిగా నడక సాగించాం. మా పోర్టర్లు మాత్రం తమదైన వేగంతో మా అందర్నీ దాటుకొని ముందుకు సాగిపోయారు.
ఆ దారిలో మొదటిసారి జడలబర్రెలనూ కంచరగాడిదలనూ చూశాం. సరుకుల రవాణాకు ఆ ప్రాంతాలలో అవే ఏకైక మార్గం. జడలబర్రెలు అంటున్నానేగాని, నిజానికి అవి జడలబర్రెలకూ ఆవులకూ కలసి పుట్టిన జో (Dzo) అన్న మిశ్రమ జీవులు. చూడడానికి చాలావరకూ జడలబర్రెల్లానే ఉంటాయి – బొచ్చు తక్కువ. తక్కువ ఎత్తులలో పని చేయడానికి ఈ మిశ్రమజీవులే అనుకూలమట. 4000 మీటర్లకన్నా తక్కువ ఎత్తు ప్రదేశాలలో జడలబర్రెలు బ్రతకలేవు.
ట్రెక్ దారుల్లో జంతుజాలం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో గైడ్ గురంగ్ అందరికీ చక్కగా వివరించి చెప్పాడు. కంచరగాడిదలూ జడలబర్రెలూ తటస్థపడినప్పుడు మాలాంటి పాదచారులు కొండ చరియను బాగా ఆనుకుని నిలబడటం మేలట. అలా నిలబడి ఆ జంతువులన్నీ దాటిపోయే దాకా వేచి ఉండాలట. అలాకాకుండా మాలాంటివాళ్ళు లోయవేపు నిలబడినట్టయితే ఆ జంతువుల తాకిడికి దారి అంచునుంచి జారి పడే ప్రమాదముంటుందట. ఆ పడటం నాలుగడుగులా నాలుగు వందల అడుగులా అన్నది మనం ఎక్కడ ఆగామో ఆ ప్రదేశం బట్టి ఉంటుంది. ఏది ఏమైనా ప్రమాదం ప్రమాదమే. కాలిబాటలు బాగా చిన్నవి కాబట్టి ఈ ప్రాథమిక నియమం పాటించకపోతే కోరి ప్రమాదం తెచ్చి పెట్టుకున్నట్టే!
లుక్లా ఊరు దాటేక మెట్లసాగు భూములు కనిపించాయి. కొండచరియల్లో గట్ల సాయంతో కాస్తంత చదునైన ప్రాంతాలను చిన్న చిన్న కమతాలుగా సాగులోకి తెచ్చి పంటలు పండించే ప్రక్రియ అక్కడ అనాదినుంచీ సాగుతోంది. ఆ కొండ చరియలనంతనూ ఒక్కసారిగా చూస్తే మెట్లుమెట్లుగా ఆ చిట్టి కమతాలు కనిపిస్తాయి. ఆహ్లాదపరుస్తాయి.
అలా గంటసేపు నడిచాక చెప్లంగ్ అన్న గ్రామం చేరాం. మా నడకదారిలో మొట్టమొదటి గ్రామమది. అక్కడ కనిపించిన స్థానిక స్తూపం దగ్గర అందరం కాసేపు ఆగాం. అక్కడికి దిగువన ఉన్న లోయ దృశ్యం కట్టిపడేసేలా ఉంది. రంగురంగుల ప్రార్థనా పతాకాలు, టిబెటియన్ లిపిలో ధార్మిక విషయాలు రాసిన రాతి పలకలు, ఇరుసు మీద తిరిగే ప్రేయింగ్ వీల్స్, ఇవన్నీ మాకు ఆ ఊళ్ళోనే కాదు; దారి పొడవునా కనిపించాయి. పేరుకు నేపాల్ భూభాగమే అయినా అక్కడ టిబెట్ పరిమళం, బౌద్ధ మతపు ఆనవాళ్ళు ప్రస్ఫుటం… నాలుగడుగులు అటు వేస్తే టిబెట్టేగదా!
మా నడకబాట ముందుగా దూధ్‌కోసీ లోయలోకి దిగుతుంది. దిగాక, మళ్ళా ఎగువకు సాగి మాంజొ అన్న గ్రామం చేరుతుంది. ఆ రోజు రాత్రి మేము విడిది చేసే గ్రామమా మాంజొ. దూధ్‌కోసీ నది అయితే ఎన్నో రోజులపాటు మాకు తోడుగా వస్తూనే ఉంటుందట. మరో గంట గడిచాక దూధ్‌కోసీ నది మీద మా మొట్టమొదటి ఉయ్యాల వంతెనను చూశాం. ముందుకు సాగే కొద్దీ ఈ వంతెనలు కనబడుతూనే ఉంటాయి. వాటి మీద చిన్నపాటి ఊపుకు అనుగుణంగా అడుగులు వేయడం అన్నది మొదట మనతో కేరింతలు కొట్టిస్తుంది. కొంతమందికేమో ఆ అనుభవం మొదట్లో భయం కలిగిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఆ వంతెనలు అలవాటయిపోయి కేరింతలూ భయాలూ సద్దుమణుగుతాయి! మన పాతకాలపు ఆక్షన్ సినిమాల్లో ఈ వంతెనలు తరచూ తమదైన పాత్రను పోషిస్తూ ఉండేవి. కనీసం ఒకటైనా ఫైట్ సీన్ ఈ వంతెనల మీద చిత్రీకరించేవాళ్ళు. నాయికను రక్షించడానికి వెళ్ళిన హీరో నాయికతోపాటు బ్రిడ్జి మీదుగా తిరిగి వస్తున్నప్పుడు ప్రతి నాయకుడు వంతెన తాళ్ళు కోసేయడం, హీరోయిన్‌ను చంకన పెట్టుకొని హీరో ఒంటి చేత్తో వేలాడటం, అలా వేలాడి నిలదొక్కుకుని, పట్టు సాధించి విలన్‌ని ఓడించడం, అవి చూస్తూ కేరింతలు కొట్టడం – ఇంకా మనసులో మెదలాడే జ్ఞాపకాలు.
సినిమా జీవితం వేరు – నిజ జీవితం వేరు. ఈ హాంగింగ్ బ్రిడ్జ్‌లకు ఉండే తాళ్ళు ఉక్కుతో చేసినవి. విలనే కాదు ఆయన పూర్వీకులంతా దిగి వచ్చినా ఆ తాళ్ళను కోయడమన్నది అసాధ్యం. ఒకటి మాత్రం నిజం – నడిచేటపుడు ఈ బ్రిడ్జులు ఉయ్యాలల్లాగా ఊగుతాయి. భయం కలిగిస్తాయి. అయినా, అటూ ఇటూ ఉండే ఆధారాలు పట్టుకుని బాలెన్స్ చేసుకొంటూ నడవడం బ్రహ్మ విద్యేం కాదు.
జడలబర్రెల విషయంలో ఉన్నట్టే ఉయ్యాల వంతెనల విషయంలోనూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ వంతెనలు బాగా సన్నపాటివి – ఒక్కసారి ఒక్కరే దాటి వెళ్ళగలరు. ఎదురుబొదురుగా ఇద్దరు వచ్చి దాటేంత విశాలమైనవి కావు. అంచేత ఒక సమయంలో ఒక వేపునుంచే మనుషులు వెళ్ళాలి. వన్ వే ట్రాఫిక్ అన్నమాట. ముందు ఎవరు వంతెన మీద కాలు పెడితే వాళ్ళు దాన్ని దాటేదాకా అవతలివాళ్ళు ఆగిపోవాలి. అలాగే ఈ వంతెనల మీద పరుగులు పెట్టడం నిషిద్ధం. మన పరుగు వంతెన కుదుపులకు కారణమై మిగిలినవాళ్ళందరూ బాలెన్స్ కోల్పోయేలా చేసే అవకాశం ఉంది. అలాగే బరువులు మోస్తూ వెళ్ళేవాళ్ళకి మొదటి ప్రాధాన్యం. కంచరగాడిదలకూ జడలబర్రెలకూ సరే సరి – వాటిదే అగ్రతాంబూలం. మనషులంటే సరే, జడలబర్రెలతో స్థలం కోసం పోటీ పడితే అసలు వంతెనమీదే మనకు స్థానం నిలవకపోవచ్చు.
దూరాన 6367 మీటర్ల ఎత్తున్న మౌంట్ కుసుమ్ కన్‌గరు తళతళా మెరుస్తూ దర్శనమిచ్చింది. ఆ రాజస దృశ్యం మా అందర్నీ బాగా ఆకట్టుకొంది. రాబోయే పది రోజుల్లో మాకు ఎలాంటి దృశ్యాలు కనిపించబోతున్నాయో రుచి చూపించింది.
ఫక్‌డింగ్ అన్న గ్రామంలో భోజనానికి ఆగాం. అప్పటికే బాగా పొద్దెక్కింది. ఆ గ్రామంలో ఉన్న షెర్పా రెస్టరెంట్లో ఒకే ఒక్క వంటకం దొరుకుతోంది: పప్పూ అన్నం. నేపాలీ బాణీలో చేసిన పప్పన్నమది. సరళంగా చెప్పుకోవాలంటే పెద్ద ముద్ద అన్నం – పల్చటి పప్పు; అంతే! స్థానికంగా దాన్ని దాల్ బాఠ్ అంటారు. ఏమాటకామాట – దాల్ బాఠ్ ఎంతో రుచిగా ఉంది. తాజాతాజాగా వండి వేడివేడిగా వడ్డించారు. ఆవురావురుమంటూ తినేశాం. అన్నట్టు నోరు చవి చెడకుండా పచ్చడి పెట్టారు. నిప్పుల మీద కాల్చిన అప్పడమూ అందించారు. సరదాగా చెప్పుకోవాలంటే ఫోర్ కోర్స్ మీల్ అన్నమాట. ఏదేమైనా మా మనసూ కడుపూ రెండూ నిండాయి – అది చాలు.
సందర్భోచితంగా మా గైడ్ బాబు గురంగ్ ఒక ప్రతిపాదన చేశాడు: ‘ఈ ట్రెకింగ్ చేసినంత కాలం మధ్యాన్నం పూట ఈ దాల్ బాఠ్ భోజనమే చేద్దాం. ఒకటే వంటకం అయితే ముందే పోర్టర్ల ద్వారా ఆర్డరు పంపడం, మనం రెస్టరెంటు చేరీ చేరగానే వాళ్ళు వేడి వేడిగా వడ్డించడం సాధ్యమవుతుంది. మనకు బాగా సమయం కలిసి వస్తుంది. రాత్రి డిన్నర్లకు మనం ఎక్కువ వంటకాలు ఆర్డర్ చేసుకోవచ్చు.’ అనుభవం నిండిన ఆ సూచన మాకూ నచ్చింది. సరే అంటే సరే అన్నాం.
భోజనం ముగించాక మేము నడవడానికి ఇంకా మూడు గంటల పొద్దు మిగిలింది. అదే కొండ బాట, అదే పైన్ వృక్షాలతో నిండిన అడవి – మరో ఉయ్యాల వంతెన. దారిలో అడపాడదపా జలపాతాలు కనిపించాయి. కొన్ని చిన్నవి – అందమైనవి. మరికొన్ని పెద్దవి – రాజసం ఉట్టిపడేవి. ముచ్చట అనిపించి అనువైన ఓ జలపాతం దగ్గర ఆ నీళ్ళు తాగాను. స్వర్గలోకపు అమృతమనిపించింది. అంత స్వచ్ఛమైన మధురమైన నీరు ఆ దేవలోకపు హిమాలయాల్లోనే లభిస్తుందనుకొంటాను.
ఉన్నట్టుండి పైన్ వృక్షాల నడుమనుంచి చెప్పుకోదగ్గ పరిమాణం ఉన్న హిమశిఖరం కనిపించి మా అందర్నీ కాసేపు నిలువరించింది. అది మౌంట్ ధమ్‌సెర్కు శిఖరపు దక్షిణ పార్శ్వం అని తర్వాత గురంగ్ చెప్పాడు. బయల్దేరిన ప్రాంతంతో పోలిస్తే బాగా ఎత్తు ఎక్కామని అనిపించింది. దూధ్‌కోసీ నది మాతోపాటు ఉన్నమాట నిజమే కానీ అది ఎక్కడో దిగువన వినిపించీ వినిపించని శబ్దం చేసుకొంటూ సాగిపోతోంది. ముందంతా ధమ్‌సెర్కు పర్వతదృశ్యం పరచుకొని కనిపిస్తోంది. సూర్యాస్తమయ సమయం సమీపించేసరికి దృశ్యం మరింత రంగులీనింది. ధమ్‌సెర్కు శిఖరం క్షణాల్లో రంగు మార్చుకోసాగింది. తళతళలాడే తెలుపు రంగు మెల్లగా పసుపుబారింది. మరి కాసేపట్లో బంగారంలా మెరిసింది. ఇంకాసేపటికి కుంకుమ రంగు. చీకట్లు కమ్ముకునే వేళ పాలిపోయిన పాలరాతి రంగు – హిమాలయాల బహుముఖ సౌందర్యం మాకు మొదటి రోజునే దర్శనమిచ్చిందన్నమాట!
కాసేపటికల్లా మాంజొ గ్రామం చేరుకున్నాం. ఆ రాత్రి మా మకాం ఆ గ్రామంలోనే. అది 2835 మీటర్ల ఎత్తున ఉందట. మొత్తం పన్నెండు కిలోమీటర్లు నడిచాం. ఎత్తు ఎక్కామని అనిపించినా నిజానికి లుక్లాతో పోలిస్తే మాంజొ పాతిక మీటర్ల దిగువన ఉంది!
అక్కడి ఎవరెస్ట్ సమిట్ లాడ్జ్‌లో మా నివాసం. వేడివేడి భోజనం వడ్డించారు. పప్పుతోబాటు బంగాళాదుంపల కూరా పెట్టారు. రోజంతా నడిచి నడిచి డస్సిపోయి ఉన్నాం గదా – గబగబా డిన్నరు ముగించి పక్కలను ఆశ్రయించాం. ఆ లాడ్జిలో ఎలెక్ట్రిక్ బ్లాంకెట్‌లున్నాయి. వాటిల్ని చూసి ప్రాణం లేచొచ్చింది. అక్కడి చలికి అవే సరైన సమాధానం. ముందు ముందు రాత్రుళ్ళు ఎంత చలిగా ఉండబోతున్నాయో మాకా రాత్రి బాగా బోధపడింది.
(సశేషం)