శిఖరారోహణ

(పర్వతారోహణ క్లిష్టమైన క్రీడ. పదివేల అడుగుల ఎత్తు వరకూ సగటు మనుషులు సులభంగా ఎక్కగలరు గానీ ఆ తర్వాత ప్రతి వెయ్యి అడుగులూ అనూహ్యమైన సవాళ్ళు విసురుతూ ఉంటాయి. భారతదేశానికి పదిరెట్లు ఎక్కువ పరిమాణమున్న ఏభై నాలుగు దేశాల ఆఫ్రికా ఖండంలో వాయువ్యపు కొసన ఉన్న దేశం మొరాకో. ఎగువన సముద్రం, దిగువన సహారా ఎడారి నడుమ పర్వతశ్రేణులు – స్థూలంగా ఇదీ మొరాకో నైసర్గిక స్వరూపం. అక్కడి ఆట్లస్ పర్వత శ్రేణిలోని అత్యున్నత శిఖరం మౌంట్‌ తుబ్‌కల్‌ను ఇటీవల అధిరోహించిన యాత్రాపిపాసి నిమ్మగడ్డ శేషగిరి అనుభవమాలిక ఈ వ్యాసం – అనువాదకుడు.)

ఆట్లస్ పర్వతశ్రేణిలోని మౌంట్ తుబ్‌కల్ ఉత్తర ఆఫ్రికా అంతటికీ ఎత్తయిన, 13,671 అడుగుల శిఖరం. వాయువ్యపు మొరాకో నుంచి ఉత్తరదిశ లోని ట్యునీషియా దాకా 2500 కిలోమీటర్ల మేర విస్తరించి వున్న ఆట్లస్ పర్వతశ్రేణి ఆ ప్రాంతాల అతిముఖ్యమైన భౌగోళిక చిహ్నం. ఉత్తరాన ఉన్న మధ్యధరా సముద్రానికి, దక్షిణాన నాలుగయిదు వందల కిలోమీటర్లు దిగువన ఉన్న సహారా ఎడారికీ నడుమన పరచుకొని ఉన్న పర్వతశ్రేణి ఇది. మొరాకో దేశంలో ఆ దేశపు వెన్నెముకలాగా ఆ చివరి నుండి ఈ చివరి వరకూ వెయ్యి కిలోమీటర్ల మేర నిలచి ఉన్నాయి ఈ ఆట్లస్ పర్వతాలు.

ఆఫ్రికా ఖండంలో ట్రెకర్లను బాగా ఆకర్షించే శిఖరాలలో మౌంట్ తుబ్‌కల్ ఒకటి. కోవిడ్ మహామహమ్మారి జూలు విదిలించడానికి కాస్తంత ముందుగా డిసెంబరు 2019లో కుటుంబసమేతంగా మొరాకో దేశం వెళ్ళాను. అక్కడికి వెళ్ళడం నాకది రెండోసారి. ఆ సమయంలో మేమున్న మరకేష్ నగరం నుంచి ఒకరోజుపాటు ఆట్లస్ పర్వతాల్లో తిరగడానికి వెళ్ళినపుడు ఇమ్లిల్ అన్న రమ్యమైన గ్రామం తటస్థపడింది. ఆ గ్రామం ఆట్లస్ పర్వతాలలో ట్రెకింగ్ చేసేవారికి ముఖ్యమైన ఆరంభ బిందువు అని తెలిసింది. మౌంట్ తుబ్‌కల్ ఎక్కేవాళ్ళు తమ అధిరోహణ ఈ గ్రామం నుంచే మొదలెడతారని తెలిసింది. ఊరంతా ట్రెకింగ్ ఔత్సాహికులతోను, ఆ ట్రెకింగుకు అవసరమయ్యే ఉపకరణాల దుకాణాలతోనూ మహాకోలాహలంగా కనిపించింది. అదిగో అప్పుడు ‘ఈ కొండ ఎక్కాలి’ అన్న కోరికకు అంకురార్పణ జరిగింది. కోరిక కలిగిందే గానీ అది నేను అతి త్వరలో చేయబోయే ముఖ్యమైన అంతర్జాతీయ ట్రెక్‍కు నాంది పలుకుతుంది అని అనుకోలేదు. 

నిజానికి మా ట్రెకింగ్ బృందమంతా ఏప్రిల్ 2020లో ఎవరెస్ట్ బేస్‍క్యాంప్‌కు ట్రెకింగ్‍ చెయ్యాలని ఉరకలు వేస్తోన్న సమయమది. అలాంటి సమయంలో అనుకోకుండా కోవిడ్ మహమ్మారి విరుచుకుపడింది. మా ప్రణాళికను ఆర్నెల్లపాటు వాయిదా వెయ్యాల్సి వచ్చింది. అది అలా నిరవధికంగా వాయిదాలు పడుతూ వెళ్ళింది. 2021 ఆగస్టు తర్వాత కోవిడ్ కాస్త ఉపశమించింది. మళ్ళీ మా ట్రెకింగ్ ఆలోచనలు మొదలయ్యాయి. అయినా ఎవరెస్టు గురించి ఆలోచించే సమయం కాదది. అంచేత నా ఆలోచన మౌంట్ తుబ్‌కల్ వేపు మళ్ళింది. మొరాకో అంటే మాకు ఇంగ్లండ్ నుంచి వెళ్ళి రావడం సులభం. అక్కడ కోవిడ్ నిబంధనలు కూడా పరిమితంగానే ఉన్నాయి. అంచేత అక్టోబర్ 2021లో ఆ ట్రెకింగ్ పెట్టుకొన్నాం. నా వరకూ నాకు అది ఏ బిందువు దగ్గర డిసెంబరు 2019లో మొరాకోను విడిచిపెట్టానో, మళ్ళీ అక్కడ్నించే రెండేళ్ళ తర్వాత ప్రయాణం ఆరంభించడమన్నమాట.

ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాను. 2019 తొలి దినాలలో నాతోపాటు టాంజానియాలోని కిలిమంజారో శిఖరారోహణ చేసిన మా బృందపు కీలక సభ్యులు సింహం, గోపి, రాజశేఖర్, రమేశ్ ఈ తుబ్‌కల్ యాత్రలో చేరడానికి వెంటనే ముందుకొచ్చారు. బృందపు పరిధి మెల్లగా విస్తరించడం మొదలయింది. గ్లాస్గోలో ఉండే నా మెడికల్ కాలేజ్‍ క్లాస్‌మేటు రవి, అతని కజిన్ విజయ్ బృందంలో చేరారు. సటన్ కోల్‍ఫీల్డ్ ప్రాంతంలో ఉండే రవి ట్రెకింగ్ మిత్రులు రాజు, రిచీ కూడా వచ్చి చేరారు. సౌత్ వేల్స్‌లో ఉండే రాజు స్నేహితుడు తిరు, మా స్థానిక ట్రెక్కింగ్ మిత్రులు అన్బు, శ్రీని, వాళ్ళతోపాటు నా కాలేజ్ క్లాస్‌మేట్ జీకే, అతని ఫ్రెండు కిషోర్ – అంతా కలసి పధ్నాలుగు మందిమి! మా జనవరి 2019 కిలిమంజారో బృందపు సంఖ్య కూడా యాదృచ్ఛికంగా పధ్నాలుగే…

కాస్తంత పరిశోధన చేసి మరకేష్ నగరపు ఆట్లస్ ట్రావెల్స్ అన్న సంస్థను మా ట్రావెల్ ఏజెంట్‌గా ఎన్నుకొన్నాం. ఇంగ్లండుకు చెందిన ఏదైనా సంస్థను ఏజెంట్‌గా పెట్టుకోవచ్చు గానీ అది నాకు ఇష్టంలేని పని. ఈ ఖర్చుదారి ఏజన్సీలు ఉన్నతస్థాయి సేవలు అందించే మాట నిజమే. కానీ అవి ఉన్నత స్థాయి అనుభవాలు అందిస్తాయా అన్నది అనుమానమే. క్రమశిక్షణ విషయంలో అంతగా పట్టింపులు లేని దేశాల్లో తిరగడానికి వెళ్ళినపుడు ఈ సంస్థల బ్రిటీషు తరహా కార్యసరళి ఒకరకంగా ప్రతిబంధకం అవుతుంది. స్థానిక సంస్థల సహకారం తీసుకొంటే ఆయా ప్రాంతాలతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని అక్కడి గాలిలోని సాంస్కృతిక పరిమళాలు ఆస్వాదించడానికి అవకాశం ఎక్కువ అన్నది నాకు అనుభవం చెప్పిన విషయం.


మరకేష్‌లో బయల్దేరి ఇమ్లిల్ గ్రామం చేరుకోవడం, అక్కడ ట్రెక్‍ ఆరంభించి తుబ్‌కల్ మౌంటెన్ రెఫ్యూజ్ అన్న యాత్రికుల వసతి కూడలి చేరుకోవడం మా మొదటిరోజు లక్ష్యాలుగా పెట్టుకొన్నాం. 

ముందస్తుగా భిన్నప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులమందరం మరకేష్ నగరంలోని రియాద్ ఆఫ్రికా అన్న వసతి గృహంలో కలుసుకున్నాం. జెమ్మా అల్‌ఫినా అన్న మరకేష్ నగరపు మదీనాలోని సెంట్రల్ స్క్వేర్‌కు దగ్గరలో ఉన్న చక్కని భవనమీ రియాద్ ఆఫ్రికా.ఈ రియాద్‌లన్నవి సంప్రదాయరీతిలో కట్టిన మండువా ఇళ్ళు. అక్కడ మా ఏజెంటు కమల్ అందరికీ స్వాగతం పలికాడు. మేమందరం మామా గదుల్లో సెటిలవడానికి సాయపడ్డాడు. మర్నాడు మమ్మల్ని తన సహచరుడు అబ్దుల్‌కి అప్పగించాడు. ఈ అబ్దుల్ మా యాత్ర సమన్వయకర్త. తుబ్‍కల్ యాత్ర పొడవునా మాతోపాటు ఉంటాడన్నమాట. మర్నాటి ఉదయం అందరం మా రియాద్ మేడమీద ఆరుబయట బ్రేక్‌ఫాస్ట్ చేశాం. చుట్టూ ఎర్రెర్రని భవనాల మరకేష్ మదీనా, సుదూరాన తళతళ మెరిసే వెండి శిఖరాల ఆట్లస్ పర్వత శ్రేణి. ఆ వెండి శిఖరాల అత్యున్నత బిందువును చేరుకోబోతున్నామన్న ఊహ మా అందర్నీ ఉత్తేజపరచింది. బ్రేక్‌ఫాస్ట్ ముగిశాక అబ్దుల్ మా అందర్నీ ఒక మినీవ్యాన్ ఎక్కించి ఆ మదీనా సందుగొందుల్లోంచి బయటపడి నగరపు పొలిమేరలు దాటేలా చేశాడు. 

మరకేష్ నుంచి ఇమ్లిల్ రెండు గంటల ప్రయాణం. మధ్యలో అస్ని అన్న ఊరు వచ్చింది. అది అబ్దుల్ వాళ్ళ స్వగ్రామమట. ఆ ప్రాంతాలకు అదే ‘సంత’ ఊరు. ఆ ఊరు చూసుకుంటూ మరో ముప్పావుగంటలో ఇమ్లిల్ చేరుకొన్నాం. అక్కడ మాకు మా సహాయక బృందమంతా పరిచయమయ్యింది. హుస్సేన్ అన్న వ్యక్తి మా ఛీఫ్ గైడు. రషీద్, ఒకటో మహమ్మద్, రెండో మహమ్మద్, అహమ్మద్ అన్నవాళ్ళు ఇతర గైడ్లు. జౌహిర్ మా పాకశాస్త్ర ప్రవీణుడు. వీళ్ళతోపాటు కంచరగాడిదలు తోలే మరో అయిదుగురు తోలుదార్లు. వీళ్ళు అమిత సిగ్గరులు. కానీ తమతమ పనిలో అతి చక్కని నైపుణ్యం ఉన్న మనుషులు. ఇహ మా సమన్వయకర్త అబ్దుల్ ఉండనే ఉన్నాడు- మిత్రుడు, బంధువు, సచివుడు, అన్నీ అతగాడే. అంతాకలసి పాతికమందిమి! సముద్రతలానికి 5800 అడుగులు ఎత్తున ఉన్న ఇమ్లిల్ గ్రామం నుంచి మా శిఖరారోహణా యాత్ర మొదలెట్టాం. రాబోయే రెండు రోజుల్లో మరో ఎనిమిదివేల అడుగలు ఎక్కి మౌంట్ తుబ్‌కల్ చేరతామన్నమాట. 

అనాది నుంచీ ఆట్లస్ పర్వత ప్రాంతాలు స్థానిక బెర్చర్ తెగలవారి నివాస స్థలాలు. శతాబ్దాలుగా వాళ్ళు నడచిన బాటలే ఇపుడు అక్కడి మా ట్రెకింగ్ రహదారులు. ఇప్పటికీ ఆ కొండల మధ్య ఎన్నెన్నో బెర్బర్ గ్రామాలు ఉన్నాయి. వాళ్ళంతా తమతమ సంప్రదాయ జీవన సరళిని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ట్రెకింగూ టూరిజమూ ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టాక ఇవి రెండూ వారికి ముఖ్యమైన ఆదాయపు వనరులయ్యాయి. 

నడక ఆరంభించిన గంటకల్లా అర్మౌడ్ అన్న గ్రామపు పొలిమేరలు చేరుకొన్నాం. ఆ ఐత్ మిజానే లోయ ప్రాంతాన ఉన్న ఏడు బెర్బర్ గ్రామాల్లోకెల్లా ఎత్తైన ప్రదేశాన ఉన్న గ్రామమది. నాతోపాటు నడుస్తోన్న రషీద్- ఇది మా స్వగ్రామం అని చెప్పాడు. గలగలా మాట్లాడే మూడ్‌లోకి వచ్చిన రషీద్ ఎన్నో విషయాలు పంచుకోవడం మొదలెట్టాడు. టూరిజం మీద ఆధారపడిన అక్కడి వారి బతుకులు కోవిడ్ పుణ్యమా అని ఛిన్నాభిన్నమయ్యాయన్నాడు. ఇలా మౌంట్ తుబ్‌కల్ ట్రెక్‍ కోసం దేశదేశాల నుంచీ మాలాంటివాళ్ళు రావడం వాళ్ళకి గొప్ప సంతోషం కలిగిస్తోందన్నాడు. ప్రభుత్వం అరకొర సహాయం అందించినమాట నిజమే అయినా కోవిడ్ సమయంలో వాళ్ళంతా ఊహాతీతమైన ఇబ్బందులకు గురి అయ్యారన్నాడు. పూట గడవడం కష్టమయిందన్నాడు. టూరిజం మీద బాగా ఆధారపడ్డ అక్కడి గ్రామాలకు కోవిడ్ తాకిడి ప్రాణాంతకమయిందన్నమాట వాస్తవం. 

ఆ లోయ దిగువున మీజానె నది ఏర్పరచిన ఇమ్లిల్ జలపాతం అక్కణ్నించి కనిపిస్తోంది. రెండేళ్ళ క్రితం స్నేహితులూ కుటుంబంతో కలసి ఆ జలపాతం దగ్గరకు వచ్చాను. మూడు బెర్బర్ గ్రామాలగుండా నడిచాను. పిల్లలందరూ ఆరోజంతా గొప్ప ఉల్లాసంతో గడిపారు. అందరం జలపాతం దగ్గర తాజా నారింజ రసం తాగాం. నడచి నడచి అలసిపోయిన మాకందరికీ ఆ పళ్ళరసం గొప్ప ఉత్తేజం కలిగించింది. ఆ రుచీ, ఆ జ్ఞాపకం- పిల్లలు ఇప్పటికీ గుర్తు చేసుకొంటూ ఉంటారు. జలపాతం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేటపుడే వెండి తొడుగు తొడుక్కున తుబ్‌కల్ శిఖరాన్ని చూసి అందరం కేరింతలు కొట్టాం. 

ఆ జ్ఞాపకాలను నెమరువేసుకొంటూ అందరితో కలసి అడుగులో అడుగు వేశాను. ఆ రోజు బాగా ఎండ కాస్తోంది. వేడిగానూ ఉంది. ఛెర్రీ, వాల్‌నట్, ఆపిల్ చెట్లగుండా నడుస్తూ ఆ ఉన్నత పర్వతశ్రేణిలోని లోయలను దాటుకొంటూ సాగాం. అపుడే కోసిన ఆకుపచ్చని ఆపిల్ పండ్లగంపలను మోస్తూ వెళుతోన్న స్థానికులు మాకు తటస్థపడ్డారు. ఒకచోట వాళ్ళు చెట్లనీడన ఆయాసం తీర్చుకొంటూ కనిపించారు. మాకు కాసిని ఆపిల్ పళ్ళను ఇచ్చారు. రసాలూరే పచ్చని చల్లని ఆపిల్ పళ్ళవి. 

మరో అరగంట గడిచాక మేమంతా తుబ్‌కల్ నేషనల్ పార్క్‌లోకి ప్రవేశిస్తున్నామని సూచించే బోర్డు కనిపించింది. అక్కడి పర్వత సానువుల నిండా తళతళమెరిసే చిట్టి పొట్టి పొదలు, వృక్షాలూ! అవన్నీ స్పానిష్ జూనిపర్ వృక్షాలట. భూమి కోతను నివారించి లాండ్‌స్లైడ్స్ జరగకుండా కాపాడటంలో ప్రముఖపాత్ర వహించే ఈ వృక్షాలను అక్కడి వాళ్ళంతా ప్రాణప్రదంగా కాపాడుకొంటారట. వాటిని నరకడమన్నది నిషేధమట. ఎండుకట్టెల మోపులు మోసుకు వెళుతోన్న స్థానికులు కనిపించారు. వంట చెరుకు కోసం అయి ఉండాలి. ఈ జూనిపర్ వృక్షాల పుణ్యమా అని అక్కడి మోడువారిన కొండలకు వింత సొగసు అబ్బింది.

దారి పొడవునా సాటి ట్రెకర్లు మాకు తటస్థపడుతూనే ఉన్నారు. కొంతమంది వేగంగా మమ్మల్ని దాటుకొంటూ వెళ్ళేవాళ్ళు… కొంతమంది మేవు దాటుకొని వెళ్ళేవాళ్ళు… ఈ ప్రక్రియలో కొంతమంది పదేపదే దారిలో కనిపించేవారు. కనబడినపుడు కనీసం చిరునవ్వులు అరవిరిసేవి. ఒకోసారి అవి మాటల మూటల మందారాలయ్యేవి. నాకు కొంతమంది ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ ట్రెకర్లతో అలా మాట కలిసింది. ఈ మౌంట్ తుబ్‌కల్ శిఖరారోహణ శీతాకాలంలో చేసినట్లయితే అదో విభిన్న అనుభవం అవుతుంది అన్నారో ఫ్రెంచ్ జంట. వచ్చే శీతాకాలంలో మరోసారి ఈ శిఖరారోహణ చేస్తాం అన్నది ఆ జంట. వాళ్ళు తలపండిన ట్రెకర్లు అని బోధపడింది. ప్రపంచంలోని అన్ని ప్రముఖ పర్వతాలనూ వేసవిలోనూ శీతాకాలంలోనూ రెండుసార్లు ఎక్కాలన్నది వారి సంకల్పం. శిఖరారోహణకు శీతాకాలం విసిరే సవాళ్ళు వేరు- దానికి అవసరమయిన ఉపకరణాలు, నైపుణ్యాలు వేరు వేరు.

దారిలో ట్రెకర్లతోపాటు చాలామంది యాత్రికులూ తటస్థపడ్డారు. అందులో అన్ని వయసులవాళ్ళూ ఉన్నారు. మౌంట్ తుబ్‌కల్ వెళ్ళేదారిలో ఉన్న సిది షమారోష్ అన్న పుణ్యక్షేత్రం వారి గమ్యం. అంతా నడకనే వెళుతున్నారు. కొద్దిమంది పెద్దవాళ్ళు కంచరగాడిదల మీద. వాళ్ళతో నడుస్తోంటే మేము కూడా తీర్థయాత్రికులమే గదా అనిపించింది. ఈ హైకింగులూ ట్రెకింగులూ ప్రకృతి ఆరాధనలే కదా అనిపించింది. మన భారతీయ పాదయాత్రికుడు ఆదినారాయణ ఇదే మాట అంటారు- మనం చేస్తోన్నది ప్రకృతికి అర్పించే పాదయాత్రాంజలి అంటాడాయన. ఈ బృహత్ పర్వతాలు ప్రకృతి మాత దేవాలయాలు, ఈ శిఖరారోహణలు ఆమెకు మనం అర్పించే పూజా నైవేద్యాలు. అసలు మన ప్రముఖ దేవాలయాలను కొండ శిఖరాల మీద నెలకొల్పడం వెనుక కూడా ఈ భావనే ఉందేమో అనిపిస్తుంది. పర్వతాలు ఎక్కడం, పాదయాత్రాంజలులు అర్పించడం, ఆ ప్రక్రియలో మనలోకి మనం తొంగి చూసుకోవడం… అది కదా కొండల మీద నెలకొన్న కోనేటిరాయళ్ళ దర్శనాల అంతరార్థం!

ముందు మేమంతా ఒకే బృందంగా నడక ఆరంభించినా క్రమక్రమంగా విడివిడి బృందాలుగా విడివడటం జరిగిపోయింది. కొన్ని కొన్ని ఉపబృందాలు ఏర్పడ్డాయి. కొంతమంది గైడ్లతోపాటు నడవసాగారు, మరికొంతమంది ఒంటరి బాటసారులయారు. అలాంటి విడివిడి బృందాలతో తలా కాస్త సమయం గడుపుతూ, ఒకటీ అరా ముచ్చట్లు చెపుతూ, పేరుకుపోయిన పాత కబుర్ల బాకీలు తీర్చుకుంటూ, కొత్తగా మా బృందంలో చేరినవారితో పరిచయం పెంచుకొంటూ, దాన్ని స్నేహంగా మలచుకొంటూ సాగింది నా నడక.

అలా రెండు గంటలు నడిచాక షమారోష్ మందిరం చేరుకొన్నాం.

ఈ షమారోష్ అన్న సిద్ధపురుషుడు సౌదీ అరేబియాకు చెందిన దివ్యాంగుడు. తన అవకరాన్ని సరిదిద్దించుకోవడం కోసం ఆయన అనేకానేక మందిరాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఇపుడు ఈ సిది షమారోష్ ఉన్న ప్రదేశంలో ఆయన కోరిక నెరవేరిందట. అప్పట్నించీ ఈ ప్రదేశం దివ్యాంగుల ఆలయంగా పరిణమించింది. తుబ్‌కల్ వెళ్ళే ట్రెకర్లూ, షమారోష్ వచ్చే యాత్రికులూ కలగలసి తిరుగాడే ప్రదేశమది. ట్రెకర్లకు భోజన విరామ స్థలమయితే అది యాత్రికులకు అంతిమ గమ్యం. 

సిది షమారోష్ క్షేత్రం అక్కడ ఉన్న ఒక పెద్ద రాతిబండ మీద ఏర్పడి ఉంది. ఆ రాతిబండకు చేరి ఉన్న సున్నం వేసిన పచ్చజెండాల గుండురాయి ఇదే ఈ క్షేత్రపు కేంద్ర బిందువు అని చెపుతోంది. కొండల్లోంచి వచ్చే వాగు ఒకటి దిగువున ఉన్న లోయలోకి ప్రవహిస్తోంది. ఆ లోయ దిగువున అంతా పచ్చదనం! జీవమన్నది లేని ఆ నిడుపాటి కొండల మధ్య ఆ మాత్రం పచ్చదనం ఉండేసరికి అదంతా ఒక ఎడారిలోని ఒయాసిస్సులాగా అనిపించింది. 

ఆ వాగులోని నీళ్ళు మమ్మల్ని చల్లగా పరామర్శించాయి. వాటిల్లో కాళ్ళు పెట్టి చేతులూ మొహమూ తడుపుకోవడం ఎంతో ఆహ్లాదం కలిగించింది. మండే ఎండకు శీతల ఉపశమనమన్నమాట. మా బృందమంతా అక్కడికి చేరుకొనేలోగానే మా వంటాయన చక్కని భోజనం వండి రడీగా ఉంచాడు. టొమేటోలు, ఉల్లిపాయ చక్రాలు, బీట్రూట్ ముక్కలు, దోసకాయ చెక్కలు, ట్యూనా చేప తునకలు- రంగు రంగుల ఆ సలాడ్ పళ్ళెం మా ఆకలి కడుపుల్ని ఆకట్టుకొంది. ఆ తర్వాత వడ్డించిన ఎగ్ టజీన్, చివర్లో వచ్చిన తాజా తాజా పళ్ళ ముక్కలూ మా అందరి ఆకలి తీర్చడమే గాకుండా మనసుల్ని కూడా ఉల్లాసపరచాయి. భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. అలసట అంతా తొలగిపోయి శరీరాలు మళ్ళీ నడవడానికి సంసిద్ధమయ్యాయి. ఎండ కాస్తంత మండుతోన్నమాట నిజమే గానీ నడక సాగిపోవాలి కదా! 

ముందుకు సాగినకొద్దీ ఆ కొండచరియల్లో తుప్పలూ పొదలూ కనిపించసాగాయి. ఆ పచ్చటాకులు అక్కడి మేకలకూ గొర్రెలకూ ఎంతో ప్రీతిపాత్రం అని వివరించాడు హుస్సేన్. అతను చెప్పినట్టుగానే పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న గొర్రెమందలు కడుపారా మేస్తూ కనిపించాయి. గొర్రెలు కనిపించాయే గానీ వాటి కాపరుల జాడే లేదు! 

మెలమెల్లగా ఆ ఆట్లస్ పర్వతశ్రేణి లోలోపలికి వెళ్ళసాగాం. అటూ ఇటూ నిడుపాటి గరుకుదేలిన కొండచరియలు. ఎత్తు ఎక్కుతున్న కొద్దీ క్రమపరిణామం చెందుతోన్న వృక్షజాలం. చెట్లు కాదు గదా, తుప్పలూ పొదలూ కూడా అరుదయ్యే ఉన్నత ప్రదేశమది. పచ్చదనం క్షీణించిపోయి ఎటు చూసినా రాళ్ళూరప్పలే కనిపించసాగాయి. అయినా అక్కడక్కడా వాగులలో పచ్చదనపు జాడలు. 

దారిలో ఒకటి రెండు చిట్టిగ్రామాలు కనిపించాయి. ఆ గ్రామాల వీధుల్లోని చిరుదుకాణాలు ట్రెకర్ల చిన్న చిన్న అవసరాలు తీరుస్తున్నాయి. తాజా పళ్ళరసం అమ్ముతోన్న దుకాణమయితే ట్రెకర్లందరికీ స్వర్గధామమనే అనిపించింది. చుట్టూ మూగి పళ్ళరసం తాగి తగ్గిపోయిన సత్తువను తిరిగి పొందేపనిలో పడిపోయారంతా. ఒక్క గ్లాసు పళ్ళరసం తాగితే ట్రెక్ దారిలో కోల్పోయిన ఒంట్లోని నీరు, గ్లూకోజు, లవణాలు, అన్నీ తిరిగి సమకూరుతాయి గదా! పైగా ఆ పళ్ళ రసాలు బాగా రుచికరంగానూ ఉన్నాయి. మేమంతా ఒకటికి రెండు గ్లాసులు తాగాం. 

మా సామాన్లన్నీ ట్రెక్‍ ఆరంభ బిందువు ఇమ్లిల్ గ్రామం దగ్గరే కంచరగాడిదలకెక్కించేశాం. వాటిల్ని తోలేవాళ్ళు మమ్మల్ని దాటుకొని మరుసటి మజిలీకేసి ఎప్పుడో సాగిపోయారు. ఈ కంచరగాడిదలు మాలాంటి ట్రెకర్ల సామాన్లు మోయటమే గాకుండా అక్కడి గ్రామాల్లో ఏకైక రవాణా సాధనంగా కూడా వ్యవహరించడం మేము గమనించాం. వాళ్ళ నిత్యావసర వస్తువులూ, ఇతర సామాన్లూ మోసుకొంటూ ఆ కంచరగాడిదలు ఆట్లస్ పర్వత ప్రాంతాల్లో తిరుగాడటం మాకు పదేపదే కనిపించింది. 

మరో రెండు గంటలు నడిచాక మాకు మా మొదటి రోజు మజిలీ సుదూరాన కనిపించింది. తుబ్‌కల్ మౌంటైన్ రెఫ్యూజ్ అన్న వసతి కూడలి అది. ఆ పచ్చదనమెరుగని రాతికొండల మధ్య ట్రెకర్ల సౌకర్యం కోసం కట్టిన ప్రాథమిక సౌకర్యాల వసతిగృహ సముదాయమది. ఆ పరిసరాలలో అతి చక్కగా ఇమిడిపోయినా దూరం నుంచి కూడా తనదైన విలక్షణశోభతో కొట్టొచ్చినట్టు కనిపించే భవనమది. ఎవరైనా కాంపింగ్ ఉపకరణాలు తెచ్చుకొంటే తప్ప ఆ రాత్రి గడపడానికి అక్కడ ఉన్న ఒకే ఒక సదుపాయం ఆ తుబ్‌కల్ మౌంటెన్ రెఫ్యూజ్.

మరో గంట నడిచాక ఆ రెఫ్యూజ్ ప్రాంగణం చేరుకొన్నాం. 10,552 అడుగుల ఎత్తున ఉందా ప్రాంగణం. అంటే ఇమ్లిల్ గ్రామంతో పోలిస్తే 4,600 అడుగులు పైకి చేరామన్నమాట. ఆ ప్రాంగణాన్ని అంతా తుబ్‌కల్ మౌంటెన్ రెఫ్యూజ్ అని పిలుస్తారు గానీ దానికి అధికారికంగా వే మఫ్లాజ్ అన్నది పేరు. ఆ మఫ్లాజ్ అన్నది అక్కడి ఆట్లస్ పర్వతశ్రేణిలో తిరుగాడే ఓ జింకల జాతి పేరట. ఈ రెఫ్యూజ్‌కు రూపకల్పన చేసినది ఇమ్లిల్‌కు చెందిన ఓ పర్వతారోహకుడట. ట్రెకర్ల అవసరాలకు తన వ్యాపార దూరదృష్టిని జోడించి ఈ వంద పడకల వసతిని నిర్మించాడట ఆ ఇమ్లిల్‌ వ్యాపారవేత్త. ‘ఈ రెఫ్యూజ్‌లో వసతి దొరకడం చాలా కష్టం. ఇక్కడికి ట్రెకింగ్‌కు వచ్చే బృందాలకు ఈ వసతి దొరకడం దొరక్కపోవడం అన్నదే కీలకమయిన విషయం. కోవిడ్ పుణ్యమా అని మన బృందానికి పెద్దగా ఇబ్బంది లేకుండా గదులు బుక్ చెయ్యగలిగాం’ అని వివరించాడు మా గైడు అబ్దుల్. 

మేమున్న రెఫ్యూజ్ ప్రాంతం పదివేల పైచిలుకు అడుగుల ఆల్టిట్యూడ్‌లో ఉంది గదా, చలి బాగా పెరిగింది. అక్కడి వసతులు ఎంతో పరిమితం. గదులు హీటర్లతో వేడిగా ఉండటం అన్నది అక్కడ ఆశించరాని సదుపాయం. అక్షరాలా అది ఒక ప్రాథమిక రక్షణ శిబిరం… అంతే. అందులోనే రెండు రాత్రుళ్ళు గడపాలి. అసలలాంటి సౌకర్యం ఉన్నందుకే సంతోషపడాలి. ఉన్నంతలో ఆ శిబిరం ఎంతో శుచిగా శుభ్రంగా ఉంది. అక్కడి బాత్రూమ్‌లు కూడా అతి ప్రాథమికం. స్నానానికి చన్నీళ్ళతోనే సరిపెట్టుకోవాలి. నిజానికి అతిచల్లటి నీళ్ళను కాస్త గోరువెచ్చగా చేసి అందిస్తున్నారు. అక్కడికదే మహా సంతోషం. కరెంటు సదుపాయం ఉంది గానీ అది సాయంత్రం పూట కొద్దిగంటలకే పరిమితం. 

పడక గదులు కూడా డార్మిటరీ బాణీవి. ఒక గదిలో ఆరు మంచాలు, పక్కగదిలో ఎనిమిది. నేను గానీ నా సహచరులు గానీ ఇలా డార్మిటరీల్లో పడుకొని యుగాలు గడిచాయి. ఇరవై ఆరేళ్ళ క్రితం ఎడిన్‍బర్గ్‌లో ఒక యూత్ హాస్టల్లో ఇలా డార్మిటరీలో గడిపిన గుర్తు. మళ్ళా ఈ రోజు ఇలా. ఆ ఎడిన్‍బర్గ్‌ డార్మిటరీ నివాసం అప్పట్లో యు.కె. నేషనల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ ఎసెస్మెంట్ బోర్డ్ టెస్టు రాయడానికి వెళ్ళినప్పటి సంగతి. ఆ టెస్టు పాసయితే బయట దేశాల వైద్యుల్ని యు.కె.లో ఉన్నత వైద్య శిక్షణ పొందడానికి అనుమతిస్తారు. అది గతం. ఇపుడా దశలన్నీ దాటుకొని యు.కె.లో సీనియర్ డాక్టర్‌గా స్థిరపడ్డాను. నాతోపాటు ఈ ట్రెక్కుకు వచ్చినవాళ్ళలో చాలామంది అలా స్థిరపడినవాళ్ళే. స్థిరపడి ముచ్చటైన హోటళ్ళలో విలాసవంతమైన గదుల్లో దిగడానికి అలవాటుపడినవాళ్ళే. ఇపుడు ఈ ట్రెకింగు పుణ్యమా అని అప్పట్లో వృత్తిపరంగా, సంపాదనపరంగా స్థిరపడటానికి తడబడుటడుగులు వేసిన రోజులను, అనుభవాలను తిరగదోడుకోగలుగుతున్నామన్నమాట. అదో సంతోషం.

అందరితో కలసి ఆ డార్మిటరీ బంక్ బెడ్ల మీద కబుర్లు చెప్పుకోవడం, ఏవేవో ఎన్నెన్నో అంతూపొంతూ లేని విషయాలమీద మాట్లాడుకోవడం, అందరి మాటలు వినడం ఒక చక్కని అనుభవం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అందరం నిద్రలోకి జారుకొన్నాం. నే భయపడ్డట్టుగా ఆ బంకర్ బెడ్ల అనుభవం ఒక్కపిసరైనా అసౌకర్యం కలిగించలేదు. అందుకు విరుద్ధంగా అలా ఆ క్షణాలను నిశ్చింతగా స్నేహితులతో గడపడమన్నది ఒక చిరకాలపు జ్ఞాపకానికి నాంది అయింది. మర్నాటి శిఖరారోహణ ఉదయం అయిదుకల్లా మొదలవుతుందని ఛీఫ్ గైడ్ హుస్సేన్ ప్రకటించాడు. మరీ అంత తొందరగా ఎందుకూ? ఏ ఏడున్నరకో మొదలెడితే సరిపోదా అని మాలో కొంతమంది ఆలోచన. అంత చలిలో ఆ చీకటిలో బయల్దేరడం నిజంగా అవసరమా అన్నది వారి వాదన. ఈ విషయం మీద మా బృందం సరిసమానంగా చీలిపోయింది. మా అయిదూ ఏడున్నర వర్గాల వాదనలు విన్నాక హుస్సేన్ ‘సరే, అయిదున్నరకు బయల్దేరదాం’ అని సర్దిచెప్పాడు. అంతా ఒప్పుకున్నాం. ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలకన్నా అనుభవానికి పెద్దపీట వెయ్యాలని నా అభిమతం. మాలో అనుభవం విషయంతో హుస్సేన్‌ను మించిన మనిషే లేడు.


పదివేల అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న మౌంటెన్ రెఫ్యూజ్‌లో బయల్దేరి సుమారు పదమూడువేల ఏడు వందల అడుగుల ఎత్తున ఉన్న తుబ్‌కల్ శిఖరాగ్రం చేరాలన్నది మా ట్రెక్కులో రెండవ రోజున మేము నిర్దేశించుకొన్న లక్ష్యం. అనుకొన్న ప్రకారం ఉదయం అయిదున్నరకల్లా నడక ఆరంభించాం. పెరిగే ఎత్తును దృష్టిలో పెట్టుకొని దట్టంగా దుస్తులు ధరించాం. చీకటి ప్రయాణం కాబట్టి హెడ్‌లైట్స్ తగిలించుకొన్నాం. చుట్టూ చిమ్మచీకటి. ముందు మూడడుగుల నేలను మించి కనిపించనంత చీకటి. ముందు నడిచే మనిషి అడుగుల్లో అడుగులు వేసుకొంటూ నడక సాగించాం. చీకటికి తోడు దారంతా రాళ్ళమయం. బండరాళ్ళూ, గుండురాళ్ళమీదుగా మా నడక. అడుగు తీసి అడుగు ఎంతో జాగ్రత్తగా వెయ్యవలసిన సందర్భమది. వెనక్కితిరిగి చూస్తే దూరాన మిణుకు మిణుకుమంటూ మా మౌంటెన్ రెఫ్యూజ్ దీపాలు కనిపించాయి.

అలా ఓ గంట నడిచాక గుడ్డి వెలుగు పరిసరాల్లో పరచుకొని మమ్మల్ని పలకరించింది. దూరాన మౌంటెన్ రెఫ్యూజ్ భవనాలు రేఖామాత్రంగా కనిపించసాగాయి. మరికాసేపటికి ఆ రేఖలు ప్రస్ఫుటమయ్యాయి. శిఖరంకేసి సగం దూరం వెళ్ళాక వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. మంచు కురవడం మొదలయింది. క్షణాల్లో అది వడగళ్ళవానగా మారింది. అరగంటసేపు ఆ వడగళ్ళు ఎడాపెడా కురిసేశాయి. ఆకాశంలో నుంచి ఎవరో మెషిన్ గన్ పట్టుకుని మా మీద మంచు బుల్లెట్లు కురిపించినట్టు అనిపించింది. మా ఒంటిమీద ఉన్న దిట్టమైన బట్టల పుణ్యమా అని వడగళ్ళ దెబ్బల నుంచి సరిపడా రక్షణ లభించింది. కానీ దారంతా జారుడు జారుడుగా మారింది. ఎంతో ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగవలసివచ్చింది.

వడగళ్ళ వాన కాసేపట్లో ముగిసినా హోరుగాలి ఉధృతం ఏ మాత్రం కట్టుబడలేదు. మమ్ముల్ని సమూలంగా లేపి విసిరి కొడుతుందా అన్నంత దుష్టమైన గాలి. తరచూ మేము మా చేతికర్రలను బలంగా నేలమీద ఆనించి కదలకుండా మెదలకుండా నిలబడిపోవాల్సి వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కానంతగా మనసులు మొద్దుబారిపోయాయి. బృందాన్ని జాగ్రత్తగా నడిపిస్తోన్న హుస్సేన్ వెనుక వెనుక నడవసాగాను. నా వెనక నడుస్తోన్న కిషోర్ ‘ముందుకు సాగడం మంచిదేనా’ అని అడిగాడు. ఆ మాటను నేను హుస్సేన్‌కు చేరవేశాను. ‘మరేం పర్లేదు. ఈ తుఫాను తగ్గిపోతుంది. మెల్లిగా ముందుకు సాగిపోదాం’ అని భరోసా ఇచ్చాడు హుస్సేన్.

వడగళ్ళ వానా తుఫానూ తగ్గుమొహం పట్టినా చల్లటిగాలుల ఉధృతం ఎడతెరిపి లేకుండా కొనసాగింది. పడదోసేంత బలమైన గాలులు, దానికితోడు ఉగ్రభీకర శబ్దాలు… ఇవి సహారా ఎడారి మీంచి వీస్తోన్న గాలులని వివరించాడు హుస్సేన్. ఆ ఎడారిలో బయలుదేరిన వాయుప్రవాహాలు ఆట్లస్ పర్వతాల సంపర్కం తర్వాత చల్లబడి చెమ్మగిల్లుతాయట. ఒకచోట మేము కొండ మూపురం మీద నిలబడినపుడు ఆ కొండ అంచులో ఏర్పడిన ఒక ‘ఖాళీ’ ప్రదేశం చూపించాడు హుస్సేన్. ఆ ఖాళీగుండా గాలులు మరింత ఉధృతంగా, భయం కలిగించే శబ్దవిన్యాసాలతో వీస్తున్నాయి. ఉన్నతశిఖరాలు చేరేకోద్దీ ప్రకృతిలోని విభిన్న అంశాలు కట్లు సడలించుకొని సంపూర్ణ రాజస విలాసాలతో మనకు దర్శనమిస్తాయన్నమాట!

మా శిఖరారోహణలోని చిట్టచివరి అంకం మా ముందు అసలు సిసలు సవాలుగా నిలచింది. నిడుపాటి దారి. ప్రతి అడుగూ ప్రయాసభరితం. అదృష్టవశాత్తూ మేము ఆ చివరి భాగంలో నడచిన దారిలో ఒక పక్కన ఉన్న కొండ చరియ మాకు ఆసరాగా నిలబడి అక్కడ వీస్తోన్న పెనుగాలుల నుంచి మమ్మల్ని కాపాడింది. ఆ ప్రయాస, ఆ సవాళ్ళు నాకు కొన్నాళ్ళ క్రితం కిలిమంజారో శిఖరం ఎక్కడాన్ని గుర్తు చేశాయి. ఏ శిఖరారోహణతో అయినా చిట్ట చివరి అంకం అన్నిటికన్నా కష్టమయిన భాగమన్నది నిజం. 

చివరికి అందరం మౌంట్ తుబ్‌కల్ శిఖరాగ్రం చేరనే చేరాం. పదమూడు వేల ఆరువందల డెబ్బై ఒక్క అడుగుల ఎత్తు. ఉత్తర ఆఫ్రికా అంతటికీ అత్యున్నత శిఖరం, మౌంట్ తుబ్‌కల్ చేరనే చేరాం. ‘ఇదీ ఈ శిఖరం’ అంటూ అక్కడ ఒక బృహత్తర త్రిభుజాకారం నిలబెట్టి ఉంది. ఫొటోలు తీసుకొనే బిందువన్నమాట. అప్పటిదాకా మా అందరిలోనూ అలముకొని ఉన్న అలసట భావం శిఖరాగ్రం చేరగానే మంత్రం వేసినట్టు మాయమయింది. లక్ష్యం చేరుకొన్నామన్న భావన కొత్త సత్తువను నింపింది. పరస్పర అభినందనలు, డజన్లకొద్దీ ఫొటోలు, కేరింతలు, కబుర్లు… ఆ శిఖరం మీదే మా గైడ్లు పిక్నిక్ లంచ్ ఏర్పాటు చేశారు. ఖూబ్జ్ రొట్టెలలో చీజ్‌నూ, టూనా చేపముక్కల్నీ పొందుపరచి ఇచ్చారు. 

అందరం ఆ శిఖరం మీద తగినంత సమయం గడిపాం. నాలుగువైపులా ఏ అడ్డంకీ లేకుండా కనిపిస్తోన్న సుందర విశాల విస్తృత దృశ్యాలను ఆస్వాదించాం. మాకు దిగువన ఉత్తుంగ తరంగాల్లా కనిపిస్తోన్న ఆట్లస్ పర్వత అతిసుందర దృశ్యాలను అబ్బురంగా చూశాం. దక్షిణ దిశలో మృగతృష్ణలా లీలగా కనిపిస్తోన్న అనంత శూన్యంకేసి చూపించాడు హుస్సేన్- అదే సహారా ఎడారి అని వివరించాడు. 

నిజానికి మౌంట్ తుబ్‌కల్ శిఖరారోహణలోని క్లిష్టతను మేమంతా తక్కువగా అంచనా వేశాం. కొద్దికాలం క్రితమే అందరం కిలిమంజారో ఎక్కి ఉన్నాం గాబట్టి దానికన్నా బాగా తక్కువ ఎత్తున ఉన్న తుబ్‌కల్ శిఖరారోహణ సులభసాధ్యం అని నమ్మేసుకున్నాం. అది తప్పని శిఖరమెక్కాక స్పష్టమయింది. రెండురోజుల పరిశ్రమ, అనుకోని వాతావరణ క్లిష్టతలు, వడగళ్ళ జడివాన, పెనుగాలులు, మంచు, ఊహించినంత చలి, జారిపోయే నేల- అంతటి ప్రతికూల వాతావరణం ఎదురవుతుందనుకోలేదు. ఏ శిఖరారోహణనయినా తక్కువగా చూడగూడదు అన్న ప్రాథమిక పాఠాన్ని మౌంట్ తుబ్‌కల్ మాకు నేర్పింది. మనకు ఎంతెంత సాధన, పూర్వానుభవం ఉన్నా ప్రతి శిఖరారోహణా ఒక సరికొత్త అనుభవం, ఒక సవాలు, అని మొట్టి చెప్పింది. 

ఎక్కడమే అనుకొంటే ఆ శిఖరం మీంచి దిగడం మరింత కష్టభరితం అని అర్థమయింది. ఎక్కడమన్నది అరికాళ్ళు, పిక్క కండరాలకూ పరీక్ష అయితే దిగటమన్నది మోకాళ్ళకు కఠిన పరీక్ష. పైగా ఎక్కేటపుడు కొంత భాగం చిమ్మచీకట్లో సాగింది; దారిలోని కష్టాలు, నిడుపులూ పెద్దగా తెలియకుండానే ముందుకు సాగాం. దిగేటపుడు అదే దారి అపరిచితంగానూ, దుస్సాధ్యంగానూ అనిపించింది. కొండ ఎక్కడం దిగడం ఒకే బాణీకి చెందిన విభిన్నమైన సవాళ్ళు. రెండింటిలోనూ ఉండే కష్టాలూ సవాళ్ళూ, వాటిని దాటుకొని వెళ్ళడానికి అవసరమయ్యే నైపుణ్యాలూ వేరు వేరు.


కొండ ఎక్కి దిగడంతో ఒళ్ళు అలసిపోయి పులిసిపోయిన మాట నిజమే అయినా మా శిబిరం మౌంట్ తుబ్‌కల్ రెఫ్యూజ్‌లో అలుపుసొలుపులు లేని ప్రశాంత మనోహర వాతావరణమే చోటు చేసుకొంది. శిఖరారోహణ వల్ల మా మనసులు తుబ్‌కల్ శిఖరమంత ఎత్తున ఎగసి ఎగసి పడిన సమయమది.

మా బేస్ క్యాంప్‘రెఫ్యూజ్’ చేరాక మా అందరికీ అందుబాటులోకి వచ్చిన అందమైన మరువలేని అనుభవం వేడినీళ్ళ స్నానం! కరెంటు ఉన్న సమయంలో, వేడినీళ్ళు అందుబాటులో ఉన్న సమయంలో మేమంతా శిబిరం చేరిన ఫలితమది. నిన్నటి రాత్రి నీళ్ళు మహా అయితే గోరువెచ్చగా ఉన్నాయి. ఇవాళ ఈ వేడినీళ్ళ విలాసం మేము ఊహించనిది, ఆశించనిది. ఆనాటి స్నానానుభవాన్ని నా జీవితంలోకెల్లా అతి ఉత్తమ షవరానుభవం అని నేనుచెప్పగలను.

డిన్నరు సమయం బహు జాలీగా గడిచింది. శరీరాల అలసట గుర్తురానంతగా మనసుల్లో సంతోషం. దుబాయ్ నుంచి రమేశ్ రెండు సీసాల పచ్చళ్ళు తెచ్చాడు- ఒక దాంట్లో మటన్ పికిల్, రెండో దాంట్లో గోంగూర పచ్చడి. రెండూ ఎంతో రుచిగా ఉండటంతో క్షణాల్లో మేమా సీసాలు ఖాళీ చేసేశాం. మటన్ పచ్చడి మాత్రం మా గైడ్లకు భారతీయ పచ్చళ్ళ రుచి చూపించడానికి కాస్తంత అట్టేపెట్టాం. అట్టిపెట్టామే గానీ ఆ పచ్చడిలో వాడింది హలాల్ చేసిన మాంసం కాదని గుర్తొచ్చింది. అంచేత గైడ్లు కూడా ఆ మాంసపు పికిల్ తీసుకోడానికి సున్నితంగా నిరాకరించారు. సరేలెమ్మని ఆ మిగిలిన కాస్తా మేమే స్వాహా చేశాం. మొరాకో ఖూబ్జ్ – భారతీయ పచ్చడి, చక్కని కలయిక! ఆ ఖూబ్జ్ అన్నది ఏ ఇతర వంటకంలోనైనా అతిచక్కగా జతకట్టగలిగే రొట్టె. పైన కరకరలాడుతూ, లోపల సుతిమెత్తంగా ఉండే బ్రెడ్డులాంటి ఖాద్య విశేషమది.


మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్ ముగించాక మెల్లగా క్రిందకు దిగడం ఆరంభించాం. గడచిన రెండు రోజులతో పోలిస్తే ఇదెంతో విరామభరిత దినం. దిగినకొద్దీ గాలి చిక్కనవసాగింది. ఆక్సిజన్ పుష్కలంగా అందసాగింది. దానికి తోడు శిఖరారోహణ వల్ల కలిగిన మహా సంతృప్తి ఎలాగూ ఉండనే ఉంది. వెరసి ఉత్సాహం, ఉత్తేజం, శక్తి. శారీరక శ్రమ అన్న విషయం మనసులోకి చొరబడే అవకాశమేలేని సమయమది. 

కాసేపు మా గైడు రషీద్ పక్కనే నడుస్తూ గడిపాను. ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు రషీద్. కొండల్లో తన అనుభవాలను కథలు కథలుగా చెప్పాడు. అతనో ఫ్రీలాన్సర్. సమయ సందర్భాలను బట్టి వివిధ ఏజెన్సీలకు అతను పనిచేస్తూ ఉంటాడు. కోరుకుంటే మనం వ్యక్తిగత స్థాయిలోనూ అతని సేవాసహకారాలు పొందవచ్చు. ఆట్లస్ పర్వతాలు అతనికి కొట్టిన పిండి. ‘ఈ కొండల్లో చీకటికోణాలూ ఉన్నాయి. వీటిల్ని మనం ఏ మాత్రం ఉపేక్షాభావంతో అమర్యాదగా చూసినా దాని ఫలితం విపరీతంగా ఉంటుంది’ అన్నాడు రషీద్. తన సేవలు పొందిన ఓ బ్రిటీషు యువజంట ఈ విషయం పట్టించుకోకపోవడం వల్ల ఎలాంటి విషాదానికి గురి అయిందో చెప్పుకొచ్చాడు. ఒక శీతాకాలంలో తుబ్‌కల్ శిఖరారోహణకు ఉపక్రమించిన ఆ బ్రిటీషు మనిషి మామూలు దారిలో గాకుండా మరిన్ని సవాళ్ళు విసిరే మరో రిట్జ్ మార్గాన వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడట. పైగా కాళ్ళకు మంచులో పట్టు ఇచ్చే ముళ్ళబూట్లూ, చేతికి బలమైన ఆధారంగా పనికొచ్చే ఐస్ గొడ్డలీ- ఇవేమీ లేకుండా కొండ ఎక్కుతానని పట్టుబట్టాడట. 

‘ఇదేముంది,ఇంతకన్నా కష్టమైన శిఖరాలు ఎక్కాను’ అన్నాడట.కనీసపు జాగ్రత్తలు తీసుకోమని రషీద్ ఎంత చెప్పినా వినలేదట. దురదృష్టవశాత్తూ వాళ్ళకు ప్రతికూల వాతావరణం ఎదురయింది. ఆ మగమనిషి కాలుజారి లోయలో పడిపోయాడు. ఆ బ్రిటీషు యువతికి అది ఒక గొప్ప విషాదం. రషీద్ సహాయం కోసం కబురుపెట్టి వెదుకులాట నిర్వహించినా ఫలితం లేకపోయింది. చివరికి ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత అతని భౌతికకాయం దొరికిందట. ‘వాతావరణం విషయంలో మనం చెయ్యగలిగింది పెద్దగా లేదు గానీ సరి అయిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే అతని ప్రాణాలు అలా పోయి ఉండేవి కాదు’ అన్నాడు రషీద్. నిజమే, ఒక్క పిక్‍ఏక్స్ అతని ప్రాణాలు కాపాడగలిగి ఉండేది. మా అనుభవాలనే పరిగణనలోకి తీసుకొంటే వడగళ్ళ వాన, మంచు, భీకరమైన ఈదురు గాలులు- ఇవన్నీ మేము ఊహించనివి. క్షణాల్లో మారిపోయిన వాతావరణం మా ఎదుట నిలిపిన సవాళ్ళవి. అయినా గైడ్‍ల మార్గదర్శకత్వంతో, మా సంయమనంతో వాటిల్ని అధిగమించగలిగాం. అనుభవజ్ఞులైన ట్రెకర్లెవరైనా ఇలాంటి విపరీత పరిణామాలకు సిద్ధపడే ఉంటారు. అవి సంభవించినపుడు బెంబేలుపడరు. ఫిర్యాదు చెయ్యరు. ముందుగానే వాటికి అవసరమైన జాగ్రత్తలు తీసుకొంటారు. పరికరాలు చేపడతారు. సాధన చేస్తారు.


స్కాట్లండ్ నుంచివచ్చిన రవి, విజయ్ అన్న మా బృందపు చురుకైన సభ్యులు శిఖరం మీంచి దిగేటపుడు వేరే మార్గంలో వచ్చారు. రషీద్ వాళ్ళకు గైడ్‌గా వ్యవహరించాడు. వాళ్ళు ఎన్నుకొన్న రూటు మామూలు మార్గంకన్నా కష్టమైనది, క్లిష్టమైనది. కానీ ఆ మార్గంలో ఒక అదనపు ఆకర్షణ ఉంది- అది తిభెరైన్ మీదుగా సాగుతుంది. ఈ తిభెరైన్ అన్నది తుబ్‌కల్‌కు సోదరి శిఖరం అని చెప్పవచ్చు. ఈ పర్వతశిఖరం మీద ఏభై ఏళ్ళ క్రితం కూలిపోయిన ఒక విమానపు ఇంజను ఇప్పటికీ స్థిరపడి ఉంది. దాని శకలాలు కూడా కనిపిస్తాయా పరిసరాల్లో… 

లాక్‌హీడ్ కంపెనీ తయారుచేసిన ఒక ఎనిమిది మంది క్రూతో కూడిన 747ఎ విమానం పోర్చుగల్ నుంచి అప్పట్లో ఉనికిలో ఉన్న ఆఫ్రికా దేశం బియాఫ్రాకు ఆయుధాలు, మందుగుండూ పట్టుకొని వెళుతూ దారితప్పి గల్లంతయిందట. ఏడాది తర్వాత 1970లో దాని శకల సమూహం మౌంట్ తిభెరైన్ మీద దొరికిందట. అన్నట్టు ఆ బియాఫ్రా దేశం తదనంతరం నైజీరియాలో అంతర్భాగమయింది. విజయ్, రవిలను ఆ కూలిన లోహ విహంగం దగ్గరకు తీసుకువెళ్ళింది మా గైడు రషీద్. కొంతమంది ట్రెక్కర్లు అలా కూలి ఒక శిఖరం మీద నిలచిపోయిన విమానం చూడాలన్న ఉత్సుకత ప్రదర్శిస్తూ ఉంటారు. వారికి అది స్టార్ వార్స్‌లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీల్లోని దృశ్యాన్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది అని వ్యాఖ్యానించాడు రషీద్. 

మూడో రోజున మేమంతా మౌంటెన్ రెఫ్యూజ్ శిబిరం నుంచి ఇమ్లిల్ గ్రామపు చేరువలోకి దిగి వచ్చాక మా గైడ్లంతా కలసి మాకు పిక్నిక్ లంచ్ ఏర్పాటు చేశారు. ఒక వాల్‌నట్ వృక్షాలున్న ప్రాంగణంలో, ఆ చెట్లనీడన తివాచీలు పరచి భోజన పదార్థాలన్నీ అక్కడ అమర్చారు. అలా ఆ చెట్ల నీడన చేరి, ఆ బెర్బర్ గ్రామాన్ని అవలోకిస్తూ, స్నేహితులందరితో కలసి భోజనం చెయ్యడం మాకు గొప్ప సంతోషాన్నిచ్చింది. అందరం ఏ హడావుడీ లేకుండా గడిపిన ఆ సమయం మేమంతా మా గైడ్లకూ, బరువులు మోసిన కంచరగాడిదలవారికీ, భోజనం తయారు చేసినవారికీ కృతజ్ఞతలూ ధన్యవాదాలూ చెప్పుకోడానికి చక్కని తరుణమయింది. మా శిఖరయాత్ర సజావుగా సాగడానికీ, విజయవంతంగా ముగియడానికీ వారి సహాయ సహకారాలు ఎంతగా ఉపయోగపడ్డాయో మేమంతా వివరించాం. 

భోజనాలూ, తదుపరి ధన్యవాద కార్యక్రమమూ ముగిశాక మిగిలిన వాళ్ళంతా వడివడిగా ఇమ్లిల్ గ్రామంలోని మా వసతికేసి సాగిపోయారు. నేనూ, అబ్దుల్ మాత్రం ఏ తొందరా లేకుండా కబుర్లు చెప్పుకుంటూ నడిచాం. దారిలో ఒకచోట ఆపి అక్కడి కొండచరియల్లోనూ దిగువన ఉన్న లోయల్లోనూ ఉన్న ఏడు గ్రామాలనూ ఒక్కటొక్కటిగా చూపించాడు అబ్దుల్. అవన్నీ ఆ చరియల మీద వివిధ స్థాయిల్లో నిలబడి ఉన్నాయి. అబ్దుల్‌కు ఆ ప్రాంతమంతా కరతలామలకం. ఎన్నో ట్రెకింగ్ బృందాలకు గైడ్‌గా వ్యవహరించి, తుబ్‌కల్ శిఖరాన్ని ఎన్నోసార్లు అధిరోహించిన మనిషి అబ్దుల్.

ఆ కొండ చరియల్లోని ఊళ్ళనే కాకుండా ఆయా శిఖరాలలో ఇమిడి ఉన్న విభిన్నమైన పొరలనూ చూపించాడు అబ్దుల్. ఆ ప్రాంతం భూగర్భ శాస్త్రజ్ఞుల స్వర్గసీమ అని వివరించాడు. అబ్దుల్‌కు భూగర్భ శాస్త్రమంటే మక్కువ. అందులో పై చదువుల కోసం జర్మనీ వెళ్ళాలన్నది అతని ఆకాంక్ష. శాస్త్రజ్ఞుల కథనం ప్రకారం ఆట్లస్ పర్వతశ్రేణి ఆఫ్రికా ఖండం ఐబీరియా ద్వీపకల్పంతో ఢీకొన్నప్పుడు ఏర్పడిందన్న వివరం అందించాడు అబ్దుల్. 

శిబిరం చేరి సర్దుకున్నాక అందరం మా శిబిరపు మేడ మీదకు చేరుకున్నాం. ఆ సాయంత్రపు వెలుగుల్లో మౌంట్ తుబ్‌కల్ అందాలను మరోసారి చూశాం. దూరపు ఇమ్లిల్ నుంచి చూసినా ఆ శిఖరం ఎంతో ఘనాకృతితో గంభీరంగా కనిపించింది. అలాంటి శిఖరాన్ని ఒక మిద్దె మీద టీ తాగుతూ తీరుబడిగా కూర్చుని చూడటమన్నది జీవితంలో దొరికే అతి గొప్ప విలాసం. అక్కడ చేరి, ఆకాశంలోకి చొచ్చుకుపోతూ ఆ శిఖరం చేస్తోన్న విన్యాసాలు చూసినపుడు ‘ఈ మహత్తర శిఖరాన్నేనా మనమంతా క్రిందటిరోజు అధిరోహించిందీ’ అని అందరం అబ్బురపడ్డాం. 

రాత్రి భోజనాలు, పానీయాలూ ఒకరకంగా మా బృందంలోని కొందరు సభ్యులకు మేము పలికిన వీడ్కోలు వచనాలు, సంబరాలు. అన్బు, శ్రీని మర్నాడు మరకేష్ మీదుగా లండన్ వెళ్ళిపోతున్నారు. రమేశ్ అమ్‌స్టర్‌డామ్ మీదగా దుబాయ్ వెళుతున్నాడు. మిగిలిన పదకొండుమందిమీ అబ్దుల్, రషీద్‌లను వెంటబెట్టుకొని ఆట్లస్ పర్వతాల గుండా సుదీర్ఘ ప్రయాణం చేసి సహారా ఎడారి ట్రెక్‍ కోసం వెళ్ళబోతున్నాం. మాలో కొంతమందిమి పార్టీలు చాలించి తొందరగా పడక ఎక్కాం. కొంతమంది బాగా పొద్దుపోయేదాకా ఉత్సవాలు కొనసాగించారు.


ఇలాంటి ట్రెక్‍లకు వెళ్ళడంలో లభించే ముఖ్యమైన ప్రయోజనం మానసిక శారీరక స్వస్థత, ఫిట్‌నెస్. ఇవి చేయక ముందూ, చేశాక జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది. బాగా నడవాలనిపిస్తుంది. దగ్గర్లోని కొండలు ఎక్కాలనిపిస్తుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ తుబ్‌కల్ శిఖరారోహణకు నాందీ ప్రస్తావనగా నేను సింహం, గోపి, రాజు, తిరులతో కలసి ఇంగ్లండ్‌లోకెల్లా ఉన్నత శిఖరమైన స్కఫెల్ పైక్‌నూ, వేల్స్‌లోని ఉన్నత శిఖరం స్నోడొనియానూ వరసాగ్గా రెండురోజుల్లో ఎక్కి దిగాను. 

ఇలాంటి కొన్నిరోజులపాటు సాగిపోయే ట్రక్‍లలో తీరిగ్గా, నింపాదిగా సహచరులతో మాట్లాడుకోడానికి, స్నేహం పెపొందించుకోడానికీ అవకాశం పుష్కలంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నేను ఆయా గైడ్లతోనూ, సహాయక బృందంతోనూ, ఇతర ట్రెకర్లతోనూ కబుర్లు పెట్టుకొంటాను. అలాంటి ‘విరామ’ సమయాలలో ఏ భేషజాలూ, శషభిషలూ లేకుండా నింగికింద ఉండే ఎన్నెన్నో విషయాలను అడ్డూ ఆపూ వరసావావీ లేకుండా మాట్లాడుకోగలుగుతాం. 

ఈ ప్రక్రియలో ఏర్పడే స్నేహాలకు విలువగట్టడం దాదాపు అసాధ్యం. అవి అపురూపమయినవి. మనకు చిన్నప్పుడే ఏర్పడే స్నేహాల్లోలాగా ఈ స్నేహాలూ నిష్కల్మషం, అమాయకత్వం నిండినవి. వీటి వెనుక మన నిత్యజీవితంలో ఏర్పడే వృత్తి సంబంధిత స్నేహాల్లోలాగా ఏ రకమైన ఎజెండాలూ, ఆశింపులూ ఉండవు.

అంతేగాకుండా ఈ సుదీర్ఘపు నడకల్లో మనతో మనం ఏ ఇతర అవరోధాలూ లేకుడా చక్కగా సమయం గడుపుకొనే అవకాశం వస్తుంది. పరిసర ప్రకృతితో మమేకం అయ్యే అవకాశం వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ, అందులో మన ఉనికి గురించీ లోతుగా ఆలోచించే అవకాశం వస్తుంది. ప్రకృతిలో ఒదిగిపోయినపుడూ, ఉన్నత గంభీర శిఖరాల ముందు నలుసులా నిలబడిపోయినపుడూ మునుపెన్నడూ అనుభవంలోకి రాని స్వేచ్ఛాభావన మనకు కలుగుతుంది.

తుబ్‌కల్ ట్రెక్ మా అందరికీ ఒక విశిష్ట అనుభవం మిగిల్చింది. ఒక ప్రఖ్యాత పర్వతశ్రేణి ఒడిలో, అక్కడి అత్యున్నత శిఖర పరిసరాల్లో మూడురోజులు గడపడం ఒక మరపురాని అనుభవం. మనుషుల్లో నమ్రత నింపే అనుభవం. ఎన్నెన్నో అడ్డంకులు సృష్టించి తుబ్‌కల్ మా అంకిత భావానికీ, పట్టుదలకూ పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షలకు మేము తూగి నిలిచాం!